4.30.2011

చిన్నారి పెళ్ళి కూతుళ్ళు.... :-)

మా టి. వి లో ఈ మధ్య హింది డబ్బింగ్ సీరియల్ ఒకటి వస్తోంది. నేను సాధారణంగా టి .వి జోలికి వెళ్ళను కాబట్టి ఈ సీరియల్ ఒరిజినల్ .. అంటే హిందిలో చూడలేదు.. డబ్బింగ్ అయినా నాకెందుకో ఈ సీరియల్ చాలా నచ్చింది. ముఖ్యంగా  ఎపిసోడ్ చివరిలో ఇచ్చే కోట్స్ భలె ఉంటాయి. అందుకే క్రమం తప్పకుండా చూస్తున్నా.. మొదట్లో మిస్ అయ్యాను కాని ఆ ఎపిసోడ్స్ అన్ని నైట్ 11 కి మళ్ళీ ఇవ్వడంతో స్టోరీ ఫాలో అవుతున్నా.. ఒరిజినల్ హింది అవడంతో,..నాంచడాలు, సాగదీయడాలు లేకుండా సాగుతోంది ఈ సీరియల్.   బాల్య వివాహాలు జరిగితే ఎదుర్కునే సమస్యలని , వాటి పరిష్కారాల ఆధారంగా తీస్తున్న సీరియల్ ఇది.

సీరియల్ సరే ... నాకు సడన్ గా మా అమ్మా, పిన్ని గుర్తొచ్చారు.వీళ్ళిద్దరివి ఒకేసారి ఒకరికి 9 ఏళ్ళకి ఒకరికి 7 ఏళ్ళకి వివాహాలు జరిగాయి. 

అందుకనే  అమ్మని అడిగాను అత్తారింట్లో మీరెలా ఉండేవారు అని?  దానికి అమ్మ.. "ఎలా ఉండడమేమిటే పిచ్చి మొహమా? అసలు కాపురానికి వెళ్తేగా..మీ నాన్న మంచి ఉద్యోగం వచ్చేదాకా నన్ను తీసుకెళ్ళను అన్నారు, దానికి  మీ మామ్మ వత్తాసు..నాకు  15 ఏళ్ళు రాగానే కాపురానికి పంపారు. మా మొదటి కాపురం మద్రాసులో (ఇప్పటి చెన్నై) అందరు తమిళం మాట్లాడేవారు.. నాకేమో రాదు. ఒక్కదాన్ని మీ నాన్నగారు వచ్చేదాకా బిక్కు బిక్కు  మంటూ ఉండేదాన్ని,, మామ్మ కూడా మాతో రాలేదు. "  అని చెప్తుంటే ఈవిడేనా ? నాన్నగారు చిన్నతనంలోనే కాలం చేసిన తరువాత ఒంటరిగా నలుగురు పిల్లలిని పెంచి పెద్ద చేసింది అనిపించింది. పరిస్థితులు మనకి అన్ని అలవాటు చేసి,  ఆత్మస్థైర్యాన్ని ఇస్తాయి అంటే ఇదేనేమొ. చిన్నతనంలోనే పెళ్ళి, ప్రతి మూడేళ్ళకి ఒకరు తరువాత ఒకరు, తమ్ముడు పసివాడుగా... అంటే .. 2 ఏళ్ళు కూడా పూర్తి కాకుండానే నాన్నగారు కాలం చేయడం.. సుఖం అంటే తెలుసా ఈవిడకి అని అనిపించింది. ఇప్పటికీ అదే చురుకుతనం.. "ఒంట్లో కాస్త నలతగా ఉందమ్మా!"  అంటే చక చకా తను వంట చేసేయడం.. ఒకవిధంగా ఈ "చిన్నారి పెళ్ళి కూతురు"  జీవితంలో సాధించిన విజయాలు ఏమిటి? నలుగురు పిల్లలు ఆ పిల్లల ఎదుగుదల అంతే. కదిలిస్తే.. "ఇంట్లో ఎప్పుడు 30 ఆకులు తక్కువ వేయలేదు.. పెద్ద పెద్ద గుండిగలు వార్చేదాన్ని మీరేంటర్రా  ఒక పూట వంటకే వెళ్ళాడిపోతారు"  అంటూ హడావిడిగా తిరిగేస్తూ ఉంటుంది. అదే జీవితం అనుకునే "చిన్నారి పెళ్ళి కూతురీవిడ." (పిన్ని జీవిత విధానం నాకు తెలిసింది తక్కువ అందుకే ప్రస్తావించలేదు).
******

4.29.2011

డైరీలో ఈరోజు 29/04/2011...మనసులో చిన్న తృప్తి

ఈ నెల 5 వ తారీఖున ఆఫీసుకి సంబంధించిన పనికోసం రాజ్ భవన్ రోడ్ కి వెళ్ళాను. మిట్టమధ్యాహ్నం ఎండ నడి నెత్తిమీద ఉంది. ఇంకా బేగంపేట బ్యాంక్ పనిమీద వెళ్ళాలి.. అనుకుంటూ .. అక్కడ పని ముగించుకుని బయటకి వచ్చాను. రాజ్ భవన్ రోడ్ దగ్గర ఆటోలు దొరకడం తక్కువ .. అనుకుంటూ ఉండగా "ఆటో కావాలా మేడం" అని ఆగాడు ఆటో అతను. బేగంపేట వెళ్ళాలి.. అని ఆటో ఎక్కి కూర్చున్నా.. అతనిని నేనసలు గమనించలేదు ఎక్కెప్పుడు.. ఆటో ఎక్కి కూర్చున్న తరువాత "మిమ్మల్ని నేను చాలా సార్లు చూసాను నేను మీది ఫలనా కాలనీ కదా " అని అడిగాడు.. అప్పుడు గమనించా అతనిని నిజమే మా కాలని బస్టాండ్ దగ్గర చూశాను. అదే చెప్పాను, తెలిసిన మనిషిని అవడం చేతో మరి చెప్పాలనిపించిందో కాని.. ఈ నెల 25 న నాకు operation  ఉందమ్మా.. 10 యేళ్ళ క్రితం జ్వరం వచ్చింది, ప్రభుత్వాసుపత్రికి వెళ్తే పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చారు.. Date అయిపోయిందో ఏమో అది కాస్తా వికటించింది.. కాళ్ళు రెండు చచ్చుబడిపోయాయి.. రోజుకి 14 గంటలు కష్టపడ్తాను ,  ఆటో అద్దె పోగా నెలకి 1000/- రూపాయల చొప్పున పొదుపు చేస్తున్నా.. ఇప్పటికి 25,000/- అయింది. నాకోసం ప్రార్థించండి 

అని..అప్పుడు చూశాను అతని కాళ్ళు రెండు కాళ్ళు సీట్ పైన చేతి వేళ్ళంత సన్నగా పద్మాసనం వేసి ఉండడం. "మరి ఆటో ఎలా నడుపుతున్నావు " అని అడిగాను. ఒక సంవత్సరం ఇంట్లోనే ఉన్నాడుట. స్నేహితుడు వచ్చి ఇలా కాదు ఎంతో మంది వికాలంగులు ఎన్నో రకాలుగా పని చేసుకుంటున్నారు.. నువ్వు కూడా చెయోచ్చు అని మనోధైర్యం ఇచ్చాడుట.. అలా ఆటో నేర్చుకుని,కుటుంబానికి ఆసరా అయ్యాడుట.  తండ్రి రెండేళ్ళక్రితమే కాలం చేసారు. అప్పటినుండే తనే కుటుంబానికి ఆధారమట. చెల్లెలి పెళ్ళి చేసి,  ఇదిగో ఇప్పుడు తను శస్త్ర చికిత్స చేసుకుంటున్నాడు.. "నాకు ప్రత్యేకంగా మా దేవుడే..  దేవుడు ఇంకెవరు కాదు అన్న ఆలోచన లేదు మేడం.. మీరు ఎవరిని ప్రార్థిస్తారో వారినే నాకోసం ప్రార్థించండి"  అని తన కథ ముగించాడు. ఇంటికొచ్చాక ఉడతా సాయంగా నా దగ్గర ఉన్న నేను ఇవ్వగలిగినంత అమౌంట్ అతనికి  ఇచ్చి,  నా ఫోన్ నంబర్ ఇచ్చి విషయం తెలియజేమన్నాను. ఇందాకే వాళ్ళ తరపువాళ్ళు నాకు ఫోన్ చేసి.. "అంతా బాగానే ఉంది, కాళ్ళు వస్తాయో లేదో ఇంకా చెప్పలేము అన్నారుట డాక్టర్స్ .."  అని చెప్పారు. 

ఒక మంచి పని చేయగలిగాము అని .. మనసులో చిన్న తృప్తి.
*******

అందం చూడవయా... ఆనందించవయా..

నిన్నటి పోస్ట్లో అందం గురించి మాట్లాడాను కదా ఆ నేపధ్యం ఈ అందానికి సంబందించి నాలుగు మాటలు:

అందం.. చిన్నప్పటినుండి వింటున్నమాట.. ఒక్కోసారి అందం అన్న పదం అంటేనే కోపం వచ్చేస్తుంది. ఒక్కోసారి ఆస్వాదించగలిగినప్పుడు ఇష్టంగా ఉంటుంది. నా దృష్టిలో అందం  అంటే మనం ఆస్వాదించగలగాలి, ఆనందించగలగాలి. పోల్చుకోడం వచ్చిందంటే కృంగిపోవడం ఖాయం.. మా అమ్మ నలుగురు అక్కచెల్లెళ్ళ అందం అయితే ఏంటి, మాట తీరు అయితే ఏంటి ఎవరికి వారే సాటి. నలుగురూ బాగుంటారు పాత సినిమా హీరోయిన్లలాగా నిండుగా.. ఇలా.
 ఒక్క మా మూడో పిన్నికి తప్ప మిగతా ముగ్గురికి చిన్నప్పుడే అంటే బాల్య వివాహాలే. ఈ ముగ్గురక్కచెల్లెళ్ళ పిల్లలకి ఒకటి లేద రెండు సంవత్సరాల  తేడా ఉంటుంది. ఈ అక్కచెల్లెళ్ళ మధ్య ఎవరు ఎవరికన్నా అందంగా ఉంటారు అనే ప్రశ్న తలెత్తిందో లేదో కాని మా రెండో పిన్ని కూతురునుండి మేము ఎదుర్కున్నాము .. మా అమ్మే అందరికన్నా "అందంగా" ఉంటుంది అంటూ.. ఎమో అప్పుడెలా స్పందిచానో గుర్తులేదు.. వాదించానేమో కూడా నలుగురూ నలుగురే అని..

ఈ అమ్మాయి తరువాత మా అన్నయ్య నుండి ఎదుర్కున్నామీ సమస్య  వాడు తిన్నగా ఉండక "మా అమ్మే బాగుంటుంది " అని చెప్పిన పిన్ని కూతురినే మా మిస్ కుటుంబం గా చేసేసాడు.. అప్పటినుండి అది ప్రపంచంలోనే తనంత అందం ఎవరికీ లేదనే తరహాలో ఉండేది. మా ఇద్దరి మధ్య కేవలం 6 నెలలే తేడా ఉండడంతోనూ.. అలా డిక్లేర్ చేసింది స్వయానా మా అన్నయ్య అవడంతోను నాకు సహజంగా ఉండే అసూయ మరిన్ని పాళ్ళు హెచ్చి,  అసలు ఈ "అందం" అనే పదం కనిపెట్టినవాళ్ళని కాల్చేయాలి అన్నంత కసి కలిగేది అప్పట్లో. 

అక్కడితో ముగిసిపోకుండా ఈ అందచందాల పోటీలు మా అక్క చెల్లెళ్ళ మధ్య జరిగేది.. ప్రత్యక్షంగా తక్కువే చెప్పాలంటే.. కాని పరోక్షంగా నీకన్నా మీ అక్కే బాగుంటుంది, లేదా మీ ఇద్దరిలోను మీ అక్క బాగుంటుంది .. ఈ తరహా మెచ్చుకోళ్ళూ.. అయితే మా అక్క చెల్లెళ్ళ పోల్చుకోడాలు వచ్చేసరికి నాలో కాస్త జ్ఞానం వచ్చింది అని చెప్పొచ్చు అందం అంటే కేవలం మన బాహ్య సౌందర్యం మాత్రమే కాదు అన్న చిన్న ఊహ.. కాబట్టి పెద్దగా ఆలోచించేదాన్ని కాదు కాని,  ఒక్కోసారి మటుకు (చాలా సార్లు) అయినవాళ్ళే అంటే అక్క తరపు  వాళ్ళు అంటున్నప్పుడు కొంచం చివుక్కుమనేది.. ఇదో తరహా ఆనందం అంతే అనుకునేదాన్ని..  "బాలేదు"  అని చెప్పినంత మాత్రానా నేనేమి చేయగలను అని ప్రశ్నించుకునే దానిని చాలా సార్లు...అలా అన్న సంధర్భాలు కూడా ఉన్నాయి. దేవుడిచ్చిన రూపం కదా ఇది ఇంకేమి చేయలేను అని.  
******

మొన్నామధ్య ఎదో ఎవరు పొడుగు?  ఎవరు పొట్టి?  అనే విషయంలో చిన్న చర్చ జరిగినప్పుడు.. అమ్మ వాళ్ళ తరంలో ఆడవాళ్ళల్లో మా మొదటి పిన్ని, ఆతరువాత తరం అంటే మా తరంలో ఆడవాళ్ళల్లో నేను, ఇదిగో ఇప్పుడు అక్క పిల్లలు మా పిల్లలు.. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అక్క వాళ్ళ బాబు "నువ్వెన్నన్నా చెప్పు పిన్ని నీకన్నా అమ్మే బాగుంటుంది.. అన్నాడు." (పొడుగు విషయంలో నేను నాకన్నా మా/వాళ్ళ పిల్లలు పొడుగు అనే విషయాన్ని అంగీకరించను అనే ఒక వివాదం ఉంది మా మధ్య...  నిజమే మా తరంలో లేడీస్ లో నేను పొడుగు ... ఇప్పుడు వాళ్ళు పొడుగే కాదన్నదెవరు అన్నది నా వాదన) అందుకని అలా అనడం.. మా అమ్మే అని.. కరక్టే  అక్క బాగుంటుంది అలా అని ఇప్పుడు నా మొహం చెక్కేసుకోలేను కదా అని అంటే సమాధానం చెప్తే నేను సీరియస్ గా తీసుకున్నానంటారు..ఈ మధ్య బ్లాగులో కూడా ఈ తరహా పోస్ట్ ఒకటి చదివాను.. బ్లాగర్ని ఎవర్నో మీరేమంత అందంగా ఉండరు మిమ్మల్ని మీ వాళ్ళు భరించడం కష్టం అని..  కేవలం అందం లేకపోతేనే భరించడం, భరించలేకపోవడం లాంటివి వచ్చేస్తాయా? అలా ఎలా రాస్తారు అనిపించింది అప్పుడు.... మనసుతో పోల్చగలిగితే పోల్చాలి లేకపోతే వదిలేయాలి అన్నది నా ఆలోచన.  నిజానికి కళ్ళు చెదిరేంత అందం ఎదురుగా ఉన్నప్పుడు  అసూయని దరి చేరనివ్వకుండా ముందుగా ఇంకెవ్వరితోనో  పోల్చకుండా ఆనందించి ఆస్వాదించగలగాలి..
*****
ఈ అంతరాలు ఎప్పటికి సమసిపోతాయో అనిపిస్తుంది ఒక్కోసారి.. కొన్నాళ్ళు ఎవరి వత్తిడులలో, ఎవరి పనులలో వాళ్ళు ఉండి కలుసుకోలేని పరిస్థితులలో  ఉన్నప్పుడు బంధువులు మన గురించి ఏర్పర్చుకునే అభిప్రాయాలు ఒక్కోసారి మనసుని కలచివేస్తాయి..  దీని గురించి తరువాత పోస్ట్లో .. 
*****

4.28.2011

డైరీలో ఈరోజు 28/04/2011.. ఎవరు అయితే ఏంటటా? .. (పెళ్ళి అయిన తరువాత)

పిల్లలిద్దరికి సెలవలేమో సరదాగా నలుగురం కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాము. మాటల మధ్యలో మా పాపకి మా ( అక్క, తమ్ముడు, అన్నయ్య ల)  పెళ్ళిళ్ళు ఎలా జరిగాయి అన్న అంశం తీసుకొచ్చింది. అన్ని చెప్తూ ఉన్నా.. పెద్దమ్మ ఇలా, పెద్దమావయ్య అలా అని.. ఇహ మా విషయం వచ్చేసరికి అక్కడ నేనొక్కదాన్నే అయితే మా పరిచయం ఇలా జరిగింది.. పెళ్ళి ఇలా అయింది అని చెప్పేసేదాన్ని కాని, మా శ్రీవారు కూడా ఉండడంతో తన త్యాగ గాధ కూడా పిల్లలికి చెప్పుకోవాలనిపించిందో ఏంటో మరి... నాకయితె విని విని విసుగొచ్చింది కొన్ని సంధర్భాల్లో  చిఱ్ఱెత్తుకొచ్చి ఇప్పుడెందుకు ఆ గొడవ మనకి పెళ్ళి అయింది అని కూడా కసురుకున్న  సందర్భాలు ఉన్నాయి,  అహ.. వినరు కదా ... మళ్ళీ  మొదటికి ... ఈసారి పిల్లలు బలి.. :-) బలి అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే..... వినబోతు/చదవబోతు సందేహమెందుకు. చదవండి మీరే.

ఈ విషయంలో మా శ్రీవారనే కాదు ఇలా చాలామందిని చూశాను.. ఎంతమంది నన్ను చేసుకుంటామని వచ్చారో కాని ఏమి చేస్తాము మీ అమ్మకి మాటిచ్చేశాను అని అదేదో ఘోరమైన తప్పిదం చేసినట్లుగా వాపోతూ ఉంటారు.. అదిగో అలాగే మా నవమన్మదుడు  కూడా మా పిల్లలికి తన వెనకో ముందో ఎంతమంది క్యూ కట్టి ఉన్నారో చెప్పుకొస్తున్నారు. 

"మీ తాతయ్య వాళ్ళ స్నేహితుడికి మాటిచ్చరమ్మా.. వాళ్ళ అమ్మాయిని కోడలిగా చేసుకుంటానని..వాళ్ళు ఎన్నో వేలో లక్షలో ఇస్తామన్నారు అంటూ ... (ఎదో సినిమా కథ గుర్తు రావడంలేదు మీకు.. నాకయితే మావారు చెప్పేది ప్రతీది ఒక సినిమా కథే.. వాళ్ళ పిల్లలు అమాయకులు అనుకుంటారో, బార్య అమాయకురాలనుకుంటారో కథలు వినిపించేస్తూ ఉంటారు :-) ) ఇలాంటివి వింటుంటే నాకయితే ఒళ్ళు మండిపోతుంది "పోని ఇప్పుడుమటుకు మించిపోయిందేముంది.. హ్యాపీగా చేసేసుకు రండి కాస్త నాకు పని భారం తగ్గుతుంది అని అంటూ ఉంటాను" మొన్నెప్పుడో ఆ అమ్మాయికి ఇంకా పెళ్ళి కాలేదు అని వాపోతుంటే.. మా మన్మధుడులాంటి భర్త దొరకలేదుట మరి..

ఆ పెళ్ళి కాలేదని చెప్పిన ఆవిడని నేను చూడలేదు కాని, ఇంతకు ముందు అంటే మా పెళ్ళయిన కొత్తలో.. ఒకటి రెండు సార్లు బయటకి వెళ్ళినప్పుడు.. ఎదురయి  నవ్వో, పలకరించో వెళ్ళే ఇద్దరు ముగ్గురు అమ్మాయిల్ని, చూపించి నా పతిదేవుడు.. "నీకు తెలుసా ఇప్పుడు నవ్వింది చూడూ ఆ  అమ్మాయిని నాకిచ్చి చేద్దామనుకున్నారు".. "ఇదిగో ఇప్పుడు మాట్లాడింది చూడు ఆ  అమ్మాయి నాకు లైన్ వేశేది..కాని ఏమి చేయను అప్పటికే మీ పెద్దవాళ్ళకి మాటిచ్చేశాను"  అంటూ ఉండేవారు..

రోడ్ మీద కాబట్టి నిభాయించుకుని మౌనంగా ఉండేదాన్ని.. ఎందుకంటే ఆ చూపించే అమ్మాయిల్ని ముందు అర్జంట్గా నాతో పోల్చేసేవారు.. అక్కడ మండేది. నేనెలా ఉంటానో నాకు బాగా తెలుసు.. మరి వెనక్కి తిరిగి చూడాలి అనేలా కాకపొయినా హోమిలీ గా ఉంటానని తెలుసు.. మా వారు చూపించేవాళ్ళు నాకన్నా  వయసులో పెద్దవళ్ళో, మరి ఏమో మరీ ముదురు ముఖాలతో.. వంటి మీద కండ లేనట్లుగా సన్నగా పీలగా.. అసలే జన్మలోను వీళ్ళు తినలేదేమో అన్నట్లుగా.. ఉండేవారు.. (వాళ్ళను కించపరచడం నా ఉద్దేశ్యం కాదని గమనించగలరు.. అందం ఆకారం దేవుడు ఇచ్చినవే వాటిని మనము మార్చుకోలేము..)  మనం ఎంచుకునే అందమో మనసో ఆకారమో మన హుందాతనాన్ని ప్రస్ఫుటింపజేయాలి కాని.. వాళ్ళవరినో నాతో పోల్చేసి .. "చూడు నీకు మాటిచ్చాను కాబట్టి లేకపోతే వాళ్ళనే చేసుకునేవాడిని " అనే లెవెల్ లో మాట్లాడుతుంటే మండిపోతుంది.

ఇలా ఎవరినో చూడలేని వాళ్ళని చూపించి, జీవితంలో ఎదో పోగొట్టుకున్నవాళ్ళల్లా   మాట్లాడుతుంటే అనిపిస్తుంది.. నాదే రాంగ్ ఛాయిసా? లేక తన ఆలోచనలా అని.. పెళ్ళి అయిన తరువాత ప్రతి మగవాడికి పక్కింటి వాళ్ళే అందంగా కనపడతారు  రంభలాంటి తన బార్య కన్నా , పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లు మావారి విషయంలో మటుకు ఈ నానుడి నిజమే.. ప్చ్.. వీళ్ళని ఎలా మార్చాలి ఎన్నిసార్లు చెప్పినా వినరు అనిపిస్తుంది.. :(
 ******

నోట్: ఫోటోలన్నీ  మావారిమీద... అలా మాట్లాడేవాళ్ళమీద కోపంగా, కసి గా పెట్టినవే.. మా మన్మధుడు చేసుకోబోయి మిస్ అయిన మిస్సులు మటుకు అచ్చు ఇలాను ఉండరు... ఇంతకన్నా అందంగా కూడా ఉండరు ... 

క్రికెట్ .. బార్య - ఏది ముఖ్యం?

ఈరోజు నాకొచ్చిన ఈ మెయిల్ ఇది.. 

THE LOVING HUSBAND


A man had two of the best tickets
for the Cricket World  Cup Final. As he sits down, another man comes along and asks if anyone is sitting in the seat next to him..

"No", he says, "the seat is empty."

"This is incredible!" said the man, "who in their right mind
would have a seat like this for the Cricket Cup Final, the biggest sporting event of the 
whole world and not use it?"


He says, "Well, actually, the seat belongs to me. My wife was supposed to
come with me, but she passed away. This is the first Cup Final we haven't been to together since we got married."


"Oh... I'm sorry to hear that. That's terrible. I guess you couldn't find
someone else, a friend or relative or even a neighbour to take the seat?"
 The man shakes his head...


......"No. They're all at the funeral."

 *****

ఎంత ప్రపంచ కప్పు అయినా ప్రపంచమంతా చేసుకునే గొప్ప సంబరమయినా...  తోడు నీడగా మనకోసమంటూ జీవించే బార్యకన్నా ఎక్కువా?  "THE LOVING HUSBAND " అనే టైటిల్ అంగీకరించలేకపోతున్నాను. :( 

డైరీలో ఈరోజు 27/04/2011

 ఈరోజు ప్రసాదం గారి బ్లాగు పోస్ట్  "సినిమా థియేటర్‌లో    జాతీయ గీతం " ద్వారా శంకర్ గారి బ్లాగుకి వెళ్ళి ఈ జాతీయగీతం విన్నాను/చూశాను   చాలా బాగుంది.. హృదయం చెమ్మగిలింది..

శంకర్ గారి బ్లాగు ద్వారా నేను మళ్ళీ బుడుగు చూసే/చదివే అవకాశం కలిగింది. పి.డి.ఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నా థాంక్స్ శంకర్ గారు.
*********

శరత్ గారు రాసిన పోస్ట్ కి వచ్చిన కామెంట్‌కి సంబంధించి నేనో కామెంట్ రాయడం జరిగింది. దానికి శరత్ గారి రిప్లై కూడా నాకు చాలా నచ్చింది. అందుకే ఆ విషయంపై జరిగిన చిన్న చర్చ ఇక్కడ నా బ్లాగులో.... మా పిల్లలు చదవడానికి అనుకూలంగా ఉంటుందని నేను రాసిన నాకు నచ్చిన సంధర్భానుసార  కామెంట్స్ ఇలా.. తరువాత ఎప్పుడో ఫలనా చోట రాసాను చదవండమ్మా అంటే కష్టం కదా అందుకని.. వాళ్ళ సౌకర్యార్థం.

బ్లాగర్ రమణి అన్నారు...
"మా అన్నయ్యకి నాకులాగానే కులం వుండేది కాదు. పెళ్ళయ్యాక మా వదిన గారి ప్రభావం ఎక్కువై మీలాగే సమర్ధించుకొని కులం పేరు చెప్పుకోవడం మొదలెట్టారు."

శరత్ గారు మీరు అక్కడెక్కడో ఉన్నారు కాబట్టి మీరు కులం లేదు అన్న ఒక్క మాటపై నిలబడగలిగారు. కాని అదే ఇక్కడ ఉంటే కష్టమే... హెచ్చు తగ్గుల గోల.. లేకపొతే పిల్లల చదువులకోసం, ఎదో ఒక కారణానికంటూ మన కులం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నాకులం చెప్పను అని మడి కట్టుకుని కూర్చుంటే కుదిరేది కాదు.. పోని నాకంటూ ఈ విషయంలో కొన్ని నిర్ధిష్ట అభిప్రాయాలు ఉన్నాయి అని గిరి గీసుకుని ఉన్నామనుకొండి మన ఇగో ని ప్రశ్నించేదాకా వెళ్తారు, అవహేళనతోటో... అతితెలివితోటో.. నిన్న మొన్నటిదాకా ఇవన్ని అనుభవించినదానినే నేను. అందుకే అవతలి వాళ్ళు అంత కుల వివక్షతో మాట్లాడుతున్నప్పుడు.. మనకంటూ ఒక కులాన్ని ఇచ్చిన మన పెద్దవాళ్ళ పెద్దరికాన్నో లేదా ఆ కులాన్నో నిలబెట్టడానికి తప్పదనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనిషిని కులాన్ని బట్టే అంచనా వేస్తారు లెండి.. రాతలో చదువులో పనికిరావు.. :-)
27 ఏప్రిల్ 2011 10:58 ఉ

బ్లాగర్ శరత్ 'కాలమ్' అన్నారు...
@ రమణి

మీ బ్రాహ్మిణ్ టపా చదివాను :)

మీరు ఒక్క కులం చెప్పుకోనందుకే అన్ని కష్టాలు వచ్చిపడుతున్నయ్యంటే నా 'స్వ' కులం చెప్పుకుంటూ నేను ఎన్ని కష్టాలు పడవచ్చో ఊహించగలరా?! అవేవీ నేను ఇబ్బందులు అనుకోను. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడల్లా నా నిబద్దత, ఆత్మ విశ్వాసం పెరుగుతుందే కానీ నేను పలాయనం చిత్తగించను. కొన్ని సిద్ధాంతాలకు, భావాలకు కట్టుబడి వుండాలనుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురువుతాయి. వాటిని చిరునవ్వుతో ఎదుర్కోవాలి. అప్పుడే మనం మిగతావారికీ, మనకీ తేడా చూపించగలిగేది. నేనయితే పనికిమాలిన విమర్శలు, ఇబ్బందులు పట్టించుకోనే పట్టించుకోను. వాటికి విలువ ఇస్తూ పోతే అవి మనల్ని మార్చేస్తూ పోతాయి. మనం మరో రకంగా సమర్ధించుకుంటూ మన ఉన్నత ఉద్దేశ్యాలని చులకన చేసుకుంటున్నామూ అనుకుంటే మనలో ఆత్మ విశ్వాసం తగ్గుతున్నట్టే అర్ధం. మన జీవితం ఇతరుల కోసమా లేక మన కోసమా అన్నది చూసుకోవాలి. నలుగురితో కలిసి నారాయణా అనడానికీ, పది మందితో కలిసి గోవిందా అనడానికీ మనలో పెద్ద పెద్ద వ్యక్తిత్వాలు అవసరం లేదు. సగటు మనస్థత్వాలు చాలు.

నేను ఇండియాలో ముప్పయి మూడేళ్ళకు పైగానే వున్నాను. తరచుగా భారత్ వస్తుంటాను. నాకెప్పుడూ కులం విషయమై ఇబ్బందులు ఎదురుకాలేదు. నా పిల్లలకూ కాలేదు. బహుశా నేనూ సమర్ధించుకోవడం మొదలుపెడితే అప్పుడు ఇబ్బందులు ఎదురయ్యేవేమో. బహుశా నాకో కులం వుండేదని నేను మరచిపోయినందువల్ల కావచ్చు - ఆ కోణాలు నేను పట్టించుకోలేదనుకుంటా. రాజీపడటం మొదలెడితే ప్రతి విషయంలో రాజీ పడుతూ ఎంచక్కా సగటు మనుషులం అయిపోవచ్చు. అందులో సందేహం లేదు. అప్పుడు మనకంటూ స్వంత వ్యక్తిత్వం అవసరంలేదు.

ఎప్పుడన్నా సరదాగా, లైటర్ వెయినులో నా మాజీ కులం కులం గురించి చెప్పివుండవచ్చు, ఇతర కులాల గురించి వ్రాసివుండవచ్చు కానీ సీరియస్సుగా నాకెప్పుడూ అది ఒక సమస్య కాలేదు. ఈ విషయంలో నేను మీతో ఏకీభవించలేను. ఎవరి అభిప్రాయాలు వారికి వుంటాయి కాబట్టి మీ అభిప్రాయన్నీ గౌరవిస్తున్నాను.
27 ఏప్రిల్ 2011 11:45 ఉ

బ్లాగర్ రమణి అన్నారు...
:-) శరత్ గారు : నేను రాసిన టపాలోనే చూడండి నేను వెళ్ళినచోట్ల చాలా మందికి అసలు నేనెవరో కూడా తెలీదు.. "మీరు మనవాళ్ళా?" అని అడిగారని.. :-) నేను పుట్టినప్పటినుండి ఉన్నది ఇక్కడే.. ఈ ఊర్లోనే.. బాల్యం, చదువు, పెళ్ళి అన్ని ఇక్కడే.. అలాంటిది నాతోపాటు ముఖపరిచయమయినా సరే.. ఇన్నేళ్ళు ఉన్నవాళ్ళు ఇలా అడిగారంటేనే అర్థం చేసుకొండి నెనెంత కఛ్చితంగా ఉండేదాన్నో.. ఇప్పటికి నా తోటివారికి చాలామందికి తెలీదు నేను ఫలనా అని.. (ఇప్పుడు లోకమంతటికి తెలిసింది లెండి నా బ్లాగు ద్వారా)

సమర్థించుకోడం కాదండి.. పరిస్థితులు మన వ్యక్తిత్వానికి కులం అడ్డుగోడలా కట్టేస్తున్నప్పుడు తప్పని పరిస్థితుల్లో కులం ఉనికిని చాటడం.. మీరు ఇండియాలో 33 యేళ్ళు ఉన్నా మీకా పరిస్థితి రాలేదు అంటున్నారు.. నాణేనికి ఇంకోవైపునుండి రండి.. బహుశా మీ శ్రీమతిగారి ద్వారా తెలుసుకుని మీ దగ్గర మౌనంగా ఉండొచ్చు కదా మీ అభిప్రాయాలకి కట్టుబడి.. (ఇది నా ఊహ మాత్రమే).. నలుగుర్లో నారయణ పదిమందిలో గోవిందా.. :-) సర్దుకుపోవాల్సి వచ్చినప్పుడు సగటు మనిషి మసస్థత్వం అలవర్చుకోడం తప్పదు శరత్గారు. ఎప్పుడో ఒకసారి సర్దుకుపోడానికో , రాజి పడడానికో స్వంత వ్యక్తివాలు కుదవ పెట్టాల్సిన అవరం లేదు లెండి.. నేను సర్దుకుపోతున్నాను అన్న విషయం ఎవరివల్ల జరిగిందో వాళ్ళు అర్థం చేసుకుంటే నా వ్యక్తిత్వం ఇంకొంచం పరిపక్వత చెందుతుంది కాదంటారా?

నాతో ఏకీభవించకపోయినా.. నా అభిప్రాయాన్ని గౌరవిస్తున్నందుకు థాంక్స్.. నా ఈ అభిప్రాయం ఎవరిని ఇబ్బంది పెట్టనంతవరకే .. ఈ కులం ఉనికి అనేది ఇబ్బంది పెడ్తుంది అంటే మారిపోతుంది కూడా.. సప్తపది సినిమాకి సంబంధించి నేను రాసిన పోస్ట్ చదివారా? అది కులానికి సంబంధించే.. మార్పు అనేది కూకటి వేళ్ళనుండి రావాలి కాని కొమ్మలనుండో, ఆకులనుండో వస్తే వేర్లనుండి మళ్ళీ మళ్ళీ వచ్చేవే ఈ కులాలు, అచారాలు.. :-)

http://sumamala.blogspot.com/2008/07/blog-post_21.html

ప్రేమ వివాహం, కులం విషయంలో నా అభిప్రాయాలు ఇందులో కొంతవరకే చెప్పాను.
27 ఏప్రిల్ 2011 12:17 సా
*****
తొలగించు

4.27.2011

డైరీలో ఈరోజు 26/04/2011- నాకు నచ్చిన కమెంట్.. 

 (సత్య సాయి బాబా గారి విష్యంలో  నాకు నచ్చిన కామెంట్ ఇది. )  లాహిరి గారి బ్లాగులో

మీ రాసే విధానం బాగానే ఉంది. ఆలోచనలలో స్పష్టత ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే...రాయడానికి సరిపడా సరుకుంది మీ దగ్గర. కాకుంటే ఒక అంశాన్ని లేదా విషయాన్ని చెప్పదలుచుకున్నప్పుడు దాని గురించి పరిపూర్ణమయిన సమాచారం ఉన్నప్పుడే చెబితేనో..రాస్తేనో అందంగా ఉంటుందని నా అభిప్రాయం. విమర్శలు చేసే ముందర స్థాయీ బేధాలు చూడటం కనీస ధర్మం కదా..మీకు తెలియని విషయమేమీ కాదనుకోండి. కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు ఏమి రాసినా ఆది సబబుగా ఉండదు. మన ఆలోచన మరో పదిమందిని ఆలోచింపచేసే విధంగా ఉండాలి కానీ...బాధించే విధంగా ఉండకూడదు అన్నది నా అభిప్రాయం. మండలం గడిచాక నడిచొస్తాను...పదేళ్ళు ఇంకా ఉంటాను అనడం ఇంకోటి...మరోటి....అవి ఎప్పుడు...ఎలాంటి సందర్భాల్లో చెప్పిన విషయాలో...దాని వెనుక ఉన్న అసలు అర్ధం ఏమిటో...అసలు ఆ సందర్భంలో ఎవరిని ఉద్దేశించి అలా ఆయన అన్నారో...తదితర విషాయల మీద మీకు స్పష్టమయిన సమాచారం..కనీస అవగాహన ఉంటే నిరభ్యంతరంగా రాయొచ్చు. పోనీ...లేదు అనుకుంటే...కనీసం తెలుసుకునే ప్రయత్నమయినా చేసి పటిష్టమయిన సమాచారం ఉంది అనుకున్నప్పుడయినా రాయాలి కదా.. ఒకరు రామా అని పిలిస్తే...అది పదో మనిషి చెవిలో పడేటప్పటికి "రామా" కాస్తా, "రమా" అయిపోవడం సహజం. ఇలాంటి చిన్న విషయాలపై కూడా తమరు దృష్టిపెట్టి ,నాణేనికి ఒకేవైపు కాకుండా మరో వైపు కూడా ఉంటుందని గ్రహించి సమాంతరంగా ఆలోచించి రాస్తే బాగుంటుందని నా మనవి. ఆ మాటకొస్తే షిరిడీ సాయి బాబా గురించి కూడా అందరం చరిత్రలో చదువుకోవడమే కానీ....నిజంగా కళ్ళతో చూసినది అయితే కాదు కదా. మరి ఇంతమంది కళ్ళకి ఇన్ని ఋజువులు చూపిన మనిషిని పట్టుకుని అలా నిష్టూరాలాడటం ఎంత వరకు న్యాయమో ఆలోచించండి. ఎవరయినా ఒక్క ఒక్కరినీ...లేదా పది మందిని...లేదా వందమందిని...మేరీయీ చేతనయితే వెయ్యిమందిని మోసం చేయొచ్చు.. ఇలా లక్షల మంది...ఆ మాటకొస్తే కోట్ల మంది ఇలా ఆయన పాదాక్రాంతం అవుతూంటే..మోసం...మాయ అని కాకుండా...మరో కోణం ఏదయినా ఉంది ఉండొచ్చు అని నిష్కాల్మశంగా ఒక్కసారి ఆలోచించొచ్చు కదా అని నా సలహా. ఇన్ని చెప్పాను కదా అని నేను భక్తుడినేమో...కాబట్టే ఇలా రాసుంటాడు అని ఆలోచించకండి. నేను మానవతావాదిని.."

ఎవరో కూడా తెలీదు కాని చక్కగా తమ అభిప్రాయాన్ని చెప్పారు కుడోస్- రమణి
--

డైరీలో ఈరోజు 23/04/2011...బ్రాహ్మల వేట :-)

Brahmin chief justices between 1950 to 2000: 47%
ఏంటి ఈ వేట అని కోపం వస్తున్నట్లుంది చాలా మంది పెద్దలకి.. నిజమేనండి ఈరోజు మే(నేను)ము బ్రాహ్మల వేటకే వెళ్ళాము. ఆదివారం అంటే రేపు పొద్దున్నేమో సత్యనారయణ వ్రతమని బంధువులు పిలిచారు.. పొద్దున్నంతా ఆ హడావిడి రేపు వ్రతానికి వెళ్ళాలి అని , సాయంత్రం 5 అవుతుండగా స్నేహితురాలి ఫోన్.. "రాగలరా కొంచం నాలుగు సందులూ తిరిగి వెతికి పట్టుకుందాము"  అని.. అదేమంత పెద్ద పనా కాస్త నాకు వాకింగ్ చేసినట్లుంటుందని సరే అనేశా.. అనుకున్నట్లుగానే సాయంత్రం 6.30  కల్లా స్నేహితురాలు వచ్చింది. రాత్రి 9 దాకా ఈ చివరనుండి ఆ చివరదాకా జల్లెడ పట్టి వెతికితే ఒక 30 కుటుబాలు కనపడ్డాయి.. మా స్నేహితురాలి అత్తగారు నందికేశ్వర స్వామి నోము నోచుకుంటున్నారుట ఆ నోముకి సంబంధించిన కార్యక్రమానికి ఈ పిలుపుల వేట. మొత్తానికి తెలిసిన తెలియని 30 బ్రాహ్మణ కుటుంబాలని పిలిచాము. వేట ముగిసాకా ఈ బ్రాహ్మలకి సంబంధించి  తర తరాల ప్రశ్నలు మదిలో కదలాడాయి. అవే ఇవి.

ఇక్కడో ముఖ్య గమనిక: బళ్ళో చదువుకునే రోజుల్లో అయితే వరమణి టీచర్  మాటల ప్రభావం వల్ల అసలు మీ కులం ఏదంటే... ఛ!  కులం అలా బహిరంగంగా అడగకూడదు/చెప్పకూడదు  అన్న ఒక నియమావళి పాటించేదాన్ని. కాబట్టి అప్పుడు కుల పట్టింపు లేదు.

స్కూల్ చదువుకునే రోజుల్లో :

మేరి టీచర్ : ఏంటి నువ్వు గుడ్డు తినవా?
నేను : లేదు టీచర్ నేను పప్పు మాత్రమే తింటాను..
మేరి టీచర్ : అందుకే అలా రివటలా ఉన్నావు. ఇంతకీ మీరు కోమట్లా బాపనోళ్ళా?
నేను : ఎమో టీచర్ వరమణి టీచర్ చెప్పొద్దన్నారు.. (సదరు వరమణి టీచర్ మా చేత క్రమం తప్పకుండా ఏసు క్రీస్తు పాటలు పాడించేవారు మా అందరి దైవం అని... ఎందుకలా అన్నది కాస్త జ్ఞానం వచ్చాక తెలిసింది :-) )
*****

కాలేజ్ రోజుల్లో :

రావోయ్  కాంటిన్లో టిఫిన్ చేద్దాము స్నేహితురాలు పద్మ  పిలుపు
నేను : బయట ఎక్కువగా తినొద్దని అమ్మ చెప్పింది.. వద్దు పద్మా! ప్లీజ్...
పద్మ : మన బ్రాహ్మిన్స్ అంతా ఇంతే అన్నిటికి హద్దులు పెట్టేస్తారు.. మాలో ఇంత లేదు.. అవును ఇంతకీ మీరు వైదీకులా? నియోగులా? ద్రావిళ్ళా?
నేను: బ్రాహ్మిన్స్ లో ఇన్ని రకాలు ఉంటాయా? ఇంటికెళ్ళిన తరువాత అమ్మని అడగడం.. అమ్మ ఏ బ్రాహ్మిన్స్మి?
అమ్మ: అవి శాఖలమ్మా...

సో బ్రాహ్మిన్స్లో మళ్ళీ ఇంకొటేదో...
*********
ఉద్యోగ పర్వంలో: కాస్త లోకజ్ఞానం అలవడి.. కొన్ని సినిమాల ప్రభావంతో,  బంధువుల  కుటుంబంలో జరిగిన ప్రేమ వివాహలా అవగహనతో వాళ్ళేవరో నాకు ముక్కు మొహం తెలియనివారు కుల వివక్షతో మాట్లాడుతున్నప్పుడు.. కించిత్  బాధ.. సినిమాల్లో ప్రత్యేకంగా చులకన చేయబడ్డ కులంగా మరింత మనసు చివుక్కుమనిపించే రోజులవి.
సహొద్యోగి: భలె ఉన్నారు మీరు కమ్మాసా?  కమ్మాస్ ఇంత height  ఉంటారు..
నేను : లేదండి మేము శాకాహారులం (అప్పటికి కొంచం ఫీలింగ్ ప్చ్ !  ఏంటి ఇదో పెద్ద క్వాలిఫికేషన్ లా చెప్పడం అని)
సహొద్యోగి: ఓహ్ మీరు బాపనోళ్ళా (అదే చులకన) అయితే మాతో ఎక్కువ మాట్లడరేమో.. అవును తమిళ్ బ్రాహ్మిన్సా , కన్నడ బ్రాహ్మిన్సా? తెలుగు......
నేను : తెలుగు...
ఇలా బ్రాహ్మిన్స్, మళ్ళీ అందులో శాఖలు, అదికాస్త మళ్ళీ ప్రాంతీయాలు..భాషలు  :-)
*****

ఇవన్నీ చాలవన్నట్లు ఇహ ఇప్పుడు ఈరోజు జరిగిన మా వేటలో ప్రతి ఒక్కరూ అడిగిన ప్రశ్న..
మీరా!!  చిన్నప్పటినుండి చూస్తున్నాను మనవాళ్ళేనా ముఖపరిచయం అంతే.. మిమ్మల్ని చూసి మనవాళ్ళనుకోలేదు.. అవునింతకి మీరు ఆంధ్రా బ్రాహ్మిన్సా.. తెలంగాణ  బ్రాహ్మిన్సా? 

హైదరబాదులో ఉన్నందుకు కొత్తగా ఇంకో ప్రశ్న ఆంధ్రానా? తెలంగాణనా అని?
సమాధానం ఏమి చెప్తాములెండి.. చిన్నగా నవ్వేసి "ఏముందండి నాలో ఆర్భాటం కనిపిస్తే ఆంధ్ర, లేకపోతే తెలంగాణ అనేసుకొండి.. ఏదయినా పర్వాలేదు అని.."  ఇలా వెళ్ళినప్పుడు నా పేరు, నా ఉనికి మర్చిపోవాలేమో.. ప్చ్.. !
********

4.23.2011

డైరీలో ఈరోజు 22/04/2011-2nd part


...... పాప ఉంది కదా.. ఆ అమ్మాయి మొన్న అగస్ట్ రక్షాబంధన్ రోజు ఒక అబ్బాయికి రాఖీ కట్టి, "నేను నీకు రాఖీ కట్టినంత  మాత్రాన నువ్వు నాకు సోదరుడివి కాదు ఫ్రండ్‌వి అని అందిట.. " నా జోక్యం ఉండకూడదు అని అనుకున్నా..  అయినా కాని ఒక relation కి నువ్వు వాల్యూ ఇవ్వడం లేదు అని చెప్పా" నేను చాలా సెన్సిటివ్ నువ్వలా మాట్లాడకు అని రిప్లై వచ్చిందిట.. మా పాప తనకి సంబంధించిన విషయం కాదని కాం అయింది. ఇది పరీక్షల మునుపు జరిగింది.

పరీక్షలు అయ్యాక,...  వీళ్ళ షెటిల్ విషయంలో పొద్దున్నే పాప లేచి వెళ్ళేసరికి ఆ పాప పైన ఉన్న అంకుల్‌తో ఆడుతోందిట. అందుకని "ఒకటి రెండు సార్లు నేను వచ్చినా,  నువ్వు ఆ అంకుల్తోనే ఆడుతున్నావు కదా.. ఇక నన్ను పిలవకు.. అని ముందురోజు అందిట. " ఆ అమ్మాయి ఈ మాత్రానికే నన్ను అంత మాట అంటావా? మా పేరెంట్‌స్ వింటే ఎంత బాధపడ్తారు, నేను చాలా సెన్సిటివ్.. ఎప్పుడు అంకుల్‌తో ఆడతాను అని అంటావా?" (ఎదిగి ఎదగని వయసు , ఆ వయసు చూపే ప్రభావం, తెలిసితెలియని తనం, సినిమాల ప్రభావం.. ఆ పాప చేత మాట్లాడించిన లేత మాటలివి) అని అందిట.. పోని  ఆడుతున్న  ఆ ఇంటి మీద పెంకుల్ అయినా పోనిలే   చిన్నపిల్లలు అని సరదాగా తీసుకున్నాడా అంటే.. హక్కుల గురించి ప్రస్తావించాడుట.. "నీకసలు మేమిద్దరం ఆడుతున్నామనే హక్కే లేదు" (ప్చ్! అర్థం ఉందా అసలు ఈ మాటకి) అని అప్రస్థుత మాటలు.. "నేను మాట్లాడినది నువ్వు క్యాచ్ చేయడంలో ఉంటుంది మీనింగ్.. నీవన్నీ  తప్పుడు ఆలోచనలయితే అలాగే ఇది కూడా తప్పు అవుతుంది.. నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తే కరెక్ట్ అవుతుంది.. మనకొక కోచ్ ఉన్నారనుకో అతను అంకులే కదా అలాగే ఆలోచిస్తావా.. అతను మనకి  నేర్పే గురువులా తీసుకోవాలి కాని"  అని చెప్పేసి వచ్చేసిందిట.

అదండి సంగతి.. నాకు పూర్తిగా చెప్పినతరువాత తెలిసితెలియని వీళ్ళ మాటలకి నాకు బాగా నవ్వు వచ్చింది.. నవ్వితే చిన్నబుచ్చుకుంటుందని నవ్వలేదు కాని, చివరిలో చెప్పిన ముక్తాయింపు భలే నచ్చేసింది నాకు..

"అసలిదంతా కాదమ్మా నేను బురదలో డాన్స్ చేస్తాను కాని నాకు అస్సలు బురద అంటకూడదు అని అనేవాళ్ళకి మనమేమి చెప్తామమ్మా?   "

బాగుంది కదా ఇలా చెప్పడం..
****

4.22.2011

డైరీలో ఈరోజు 22/04/2011-1st part

ఈరోజు పాపకి ఫలితాలు .. "బయాలజీ బాగా రాయలేదమ్మా భయమేస్తోంది.." అని దాదాపుగా రోజు చెప్తోంది. పాపని మరీ బాధపెట్టకూడదని నేనే రోజు "పర్లేదమ్మా! కంగారు పడకు అంతగా అయితే బెటర్మెంట్ రాసుకోవచ్చు." అని ఎప్పటికప్పుడు ధైర్యం చెప్తున్నా. ఫ్రండ్స్ హేళన చేస్తారు అన్న భావం .. మొత్తానికి రిజల్ట్స్ వచ్చాయి మార్క్స్ కూడా బాగానే స్కోర్ చేసింది. అనుకున్నంత తక్కువ రాలేదని తృప్తి పడింది.

******


సరే.. ఈ రిజల్ట్స్ కి పరీక్షలకి మధ్యలో పాపకి నాకు మధ్య జరిగిన ఒక చిన్న సంభాషణ మా పాప ఆలోచించగలుగుతోంది అని తెలిసింది. అదే ఇక్కడ.. ముఖ్యంగా మా పాప వయసు వాళ్ళకి ఉపయోగం.

పరీక్షలు అయిపోయాయని రోజు పొద్దున్నే ఇక్కడ మా పాప పక్కవాళ్ళ పాప కలిసి షెటిల్ ఆడుతూ ఉండేవారు. గత రెండు మూడు రోజులనుండి మా పాప వెళ్ళడంలేదు అని గమనించాను. సర్లే నిన్నటిదాక పరీక్షల హడావిడి ఆ బడలిక నుండి ఉపశమనానికి నిద్రపోతోందిలే అని నేను లేపేదాన్ని కాదు.

కాని ఈరోజు పొద్దున్న పక్కవాళ్ళ పాప తాలుకూ ఇంకో పాప వచ్చి, "ఆంటీ మౌని ని లేపండి షెటిల్ ఆడాలి" అని చెప్పింది. నేను యధాలాపంగా లేపుదామని వెళ్ళెంతలో పాపే లేచి "నాకు హేల్త్ బాలేదు రాలేను అని చెప్పేయ్" అని చెప్పేసి డోర్ వేశేసింది. ఆ చెప్పడం మాములుగా చెప్పి ఉంటే నిజంగా ఆరోగ్యం బాలేదేమో అని "ఎమయింది" అని అడిగేదాన్ని కాని సీరియస్‌గా అంటే ఇంక మీరు నన్ను అడగకపోతే మంచిది అనేంతగా చెప్పింది. సర్లే పొద్దున్నే దాన్నేమి అడుగుతామని.. నేను సైలెంట్గా నా పని చేసుకున్నా..

టిఫిన్ చేసేప్పుడు నెమ్మదిగా కదిపాను పాపని, ఏమయింది అంత సీరియస్? వాళ్ళతో మాట్లాడడం లేదా అని.. అబ్బా వదిలేయ్ అమ్మా.. ఎవరి జీవిత శైలి (life style) వాళ్ళది. నేను వాళ్ళలా ఆలోచించలేను వాళ్ళు నాలా ఆలోచించరు.. " నేను మంచే చెప్పాను కాని అది వాళ్ళు వేరేలా అర్థం చేసుకున్నారు...  నా తప్పు కానప్పుడు నేనెందుకు డవున్ అవ్వాలి.. హాయిగా నా మానాన నేను ఉండొచ్చు కదా!" అని అంది.

ఎదో కొంచం ఆలోచింపజేసే  విషయమే అందుకనే మరికొంత ఆసక్తిగా "ఏమి జరిగింది" అని అడిగాను..

అదే అసలు మన పక్కింటమ్మాయి ఉంది కదా.. కొంచం దగ్గరగా రా .. నేను నెమ్మదిగా చెప్తాను అంటూ..

సశేషం ....(రేపు రాస్తాను నిద్ర వస్తోంది) :-)

******

4.21.2011

డైరీలో ఈరోజు... 21/04/2011

పిల్లలికి పరీక్షలు అయ్యాయి.. కాస్త ఇప్పటికి నేను తెరిపిన పడ్డాను. మార్చ్ 7 నుండి ఈ పరీక్షల సందడే.. పాపకి అయ్యాయి..  హమ్మయ్య అనుకోగానే బాబుకి, నేను వాళ్ళకి దగ్గర ఉండి చెప్పేదంటూ ఉండదు వాళ్ళంత వాళ్ళే చదువుకుంటారు. కాని, పక్కన నేను ఉండాలి. :-)


వాళ్ళు అలా పరీక్షలకి వెళ్ళగానే అప్పుడప్పుడొక బ్లాగు అలా చూస్తూ ఉంటాను. ఈమధ్య చాలా కొత్త బ్లాగులు వచ్చాయి.. కొన్ని కొన్ని చదువుతుంటే కూడా ఎంతో ఆహ్లాదంగా అనిపించాయి.. అలాంటి బ్లాగులు చదువుతున్నప్పుడు.. అనిపిస్తుంది , బ్లాగుల వారధికి నేనేమాత్రం ఉడత సహాయమన్నా చేయలేను అని.   అలా అనుకునేంత బాగుంటున్నాయి పదాల పొందికయినా వాక్య నిర్మాణమయినా దేనికదే సాటి. 

లిప్తపాటు న్యూనతా భావం కూడా కలుగుతుంది.. మనం రాయలేము కదా అంత బాగా అని. అయినా సరే రాయాలి అనే తపన చాలు , అక్షరాలు , పదాలు వాక్యాలు వాటంతట అవే వస్తాయి అన్న నమ్మకంతో ఇదిగో మళ్ళీ ఈరోజు నుండి రాద్దామని.. 

భావాలన్ని పొదిగి సుమమాలలో పొందు పరచాలని మళ్ళీ మొదలు పెడ్తున్నా.. :-) 
*****

4.14.2011

శైలిని బట్టి ఫొటో ఉంటుందా? ఫోటోని బట్టి శైలి ఉంటుందా??

ఒక్కోసారి చికాకుగా ఉంటుంది. బోర్ కొడుతుంది.. ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాము. ఏమి తోచదు, ఎవరు ఉండరు ఇంట్లో.. ఉంటేమటుకు ప్రశాంతంగా ఉంటామేంటి ఇలా చికాకు తలకెక్కినప్పుడు.. అక్కడికి ఎందుకలా చికాకు పడ్తావు.. కయ్.. కయ్ అని అరుస్తావు పిల్లలు, శ్రీవారు కూడా అంటునే ఉన్నారు.. ఏమిటో పొద్దుటునుండి ఇలాగే ఉంది.. ఎక్కడికన్నా వెళ్దామా అంటే ఈ ఎండల్లో ఏమి వెళ్తాము వద్దనేశారు.. ఎప్పుడో అడక్క అడక్క అడుగుతాము.. వద్దంటే మండిపోతుంది. అదే జరుగుతోంది నాకు,

ఇలా కాదని ఇదిగో ఇక్కడ ఒకసారి అలా బ్లాగులవైపు తొంగి చూశానా.. ఆన్లైన్ స్నేహితురాలొకరు.. "చూశార అక్కడ మీ ఫేస్ బుక్ లింకెవరో ఇచ్చారు " అంటూ మెసేజ్, ఎక్కడబ్బా.. నా ఫేస్ బుక్ ఏమి అన్యాయం చేసింది?  వ్యవహారం లింక్  పెట్టేదాకా వెళ్ళింది అని చూస్తే.... ప్చ్..


ఆ పోస్ట్‌కి, నా శైలికి లింకేంటో.. ఉందిపో.. నా శైలికి, నా ఫేస్ బుక్ ఫొటోకి సంబంధమేమిటో.. శైలిని బట్టి ఫొటో ఉంటుందా? ఫోటోని బట్టి   శైలి ఉంటుందా??  ఇలాంటి ప్రశ్నలు మదిలో ఉదయించి చికాకుని మరికాస్త పెంచేస్తున్నాయి.దేవుడా!!  నాకాస్త ఇలాంటివి కొంచం అర్థం చేసుకునే బుద్ధిని ప్రసాదించు అని దేవుడిని దండం పెట్టుకోడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి నాది. :(

(అవునూ ..మనలో మన మాట నా ఫేస్ బుక్ లో ఫొటో అందరికీ కనిపిస్తోందా? నా లెక్క ప్రకారం కనపడకూడదు మరి.. తెలిసినవారేవరయినా కొంచం తెలియజేస్తారా ...కనిపిస్తుందా లేదా అన్నది)

4.13.2011

శ్రీరామనవమి శుభాకాంక్షలు


బ్లాగు మిత్రులకు .. పాఠకులకు.. 
శ్రీరామనవమి శుభాకాంక్షలు


మా ఊర్లో మేము కళ్యాణం చేయించిన సీతారాములు
4.07.2011

కాసేపు సరదాగా

కాసేపు సరదాగా క్లిక్ చేసి కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకుని నవ్వేసుకొండి -:))))
******

4.06.2011

సుజాత స్మృతిలో..


సుజాత శరత్ బాబు గార్లు నటించిన గుప్పెడు మనసులోని ఈ పాట నాకు చాలా ఇష్టమని చిత్రమాలికలో చెప్పాను ఈరోజు సుజాత గారు కన్ను మూశారని తెలిసి చాలా బాధ పడ్డాను. మనకున్న నటుల్లో చెప్పుకోతగ్గవారంటే సుజాతే. చక్కటి అభినయం ఆవిడది. ఆవిడ గురించి నాకు పెద్దగా ఏమి తెలీదు కాని, ఆవిడ నటన అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి పాత్రలోను ఒదిగిపోతారావిడ.

నాకు నచ్చిన పాటలు కొన్ని .. ఆవిడ స్మృతిలో..


నడకా హంసధ్వని రాగమా అది ...

ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం

A Good Puzzle for the Brain.

Go to the site, then click on the start button. A group of numerals from 1 to 33 will appear in red boxes. You don't need to click on the numbers, just move your cursor over them in order from 1 to 33 and as you correctly do so that numeral will disappear. See how fast you can get the task completed. This is a good practice to keep your brain sharp and your eye hand co-ordination crisp,   or .......................................................  it could drive you MAD!!!  

 
Enjoy!!  HA!    
 http://www.chezmaya.com/jeux/game33.htm

ఒంటరి పోరాటం...అంతర్మధనం

సంవత్సరం క్రితమనుకుంట ఎవరో దూరపు బంధువు చనిపోయారని అప్పుడు వెళ్ళడం కుదరక.. ఆ తరువాత 3 నెలలకి పరామర్శించడానికి వెళ్ళాము నేను, అక్క, అమ్మ, మరదలు. వెళ్తూ కూడా అనుకున్నాము సదరు చనిపోయిన బంధువు బార్యని ఓదార్చడం కష్టమేమో అని.. జాగ్రత్తగా మాట్లాడాలి.. ఆవిడని ఎక్కువ బాధపెట్టకూడదు అని నిర్ణయించుకుని వెళ్ళాము. మధ్యాహ్నం బోజనాలు చేసి వెళ్ళాము. వాళ్ళింట్లో కూడా అంతా నిశ్శబ్ధంగా ఉంది. ముందే ఫోన్ చేసి వెళ్ళాము కాబాట్టి.. ఆవిడ కలత నిద్దర్లో   ఉన్నట్లున్నారు..  చిన్న శబ్ధానికే ఉలిక్కిపడి"రండి రండి" అని ఆహ్వానించారు. కాసిన్ని మంచినీళ్ళు తాగిన తరువాత.. మాటా మంచి అయ్యాక..  అందరం మౌనంగా ఉన్నాము మాటలు రాని వాళ్ళలాగా.. నాకయితే తుఫాను ముందు ప్రశాంతత లా అనిపించింది. ఎలా పలకరించాలో తెలియడం లేదు. ముందే చెప్పడంతో అమ్మ కూడా సైలెంట్ గా ఉంది లేకపోతే ఈ పాటికి అమ్మ కళ్ళనీళ్ళూ వత్తేసుకుంటూ "ఎలా జరిగింది వదినగారు" అంటూ పలకరించేసేది. (అదే సులువేమో..) "ఆవిడే చెప్తారమ్మా నువ్వు కళ్ళనీళ్ళు పెట్టేసుకోకు" అని చెప్పాము అమ్మకి.. 

ఇలా ఎంతసేపు ఎవరూ మాట్లడలేదు అనుకుంటూ.. "కోడలు లేదా"  అని పలకరించాను నేను. "లేదమ్మా ఆఫీసుకు వెళ్ళింది. 20 రోజులు వెళ్ళలేదు కదా అందుకే ఈరోజు కూడా వెళ్ళింది (మేము వెళ్ళింది ఆదివారం) ఎంటో అలా జరిగిపోయింది... నాకు తెలుస్తూనే ఉంది.. జీవుడికి అన్న సహితం లేదు.. అన్నం సహించకపోతే జీవుడు ఇక ఇలలో లేనట్లే.. 6 నెలల ముందే అనుకున్నా  ఇంక ఉండరని.. ఎదో అలా ఈడ్చుకొస్తున్నాడు బతుకు బండిని.. వెంటిలేటర్ అన్నారు డాక్టర్లు ..  నేనే వద్దన్నాను ఎందుకు మాకేమన్నా అమెరికానుండి, ఆఫ్రికా నుండి రావాల్సిన  బంధువులున్నారా ఏమన్నానా.. అదేదో మల్టీ స్పెషల్ హాస్పిటల్ అన్నారు కాని నేనే.... "ఎందుకు బాబు ఉస్మానియాకి తీసుకెళ్దామన్నాను. పోయే ప్రాణాన్ని ఎన్ని డబ్బులేసి ఆపుతాము చెప్పండి........"   ఆ ప్రవాహం సాగిపోతూనే ఉంది. తెలియని వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఆవిడేదే మాతో  గొడవ పెట్టుకుంటున్నారు అనుకుంటారు.. దూరం నుండి చూస్తే చేతులు తిప్పేస్తూ అలా గట్టిగా మాట్లాడుతుంటే మేము ఒకరి ముఖాలు ఒకరు చుసుకున్నాము. పైకి తేలలేదు కాని ఆవిడ ధైర్యం మెచ్చుకోతగ్గదే..  ఒక మనిషి అందులోను తన ప్రత్యక్ష దైవం.. తన భర్త చనిపోయారని తెలుసు అని ఎలా ఓదార్చాలి అని అనుకున్న మేము నిశ్చేష్టులయ్యేలా  చెప్తుంటే.. నోట మాట రాలేదు. 

సదరు వ్యక్తి బయట ప్రపంచానికి ఏమి కాడు, తన ఇంట్లో తన బార్య, పిల్లలు పెళ్ళిళ్ళు పేరంటాలు, ఆ భాద్యతలు ముగించుకుని అంతో ఇంతో ఆస్థి తన తరువాత తరాలవారికి ఇచ్చి తనవాళ్ళు ముందు ముందు కష్టపడకుండా చేసి వెళ్ళిన వ్యక్తి.. లేని లోటు ఉండదు అనను కాని, ఇంక ఆ మనిషి అలా రోగంతో బాధపడకూడదు అని, ఆవిడ ధైర్యంగా తీసుకున్న నిర్ణయం మెచ్చుకోతగ్గదని చెప్పొచ్చు. బార్య "అబ్బబ్బ ఏంటీ సేవలు చేయలేకపోతున్నాను" అనుకుంటేనే ఆ మనిషి సగం చనిపోయినట్లేట. తిరిగి వస్తూ ఉంటే మేము అనుకున్న మాటలు అలాంటిది ఆవిడ గుండే రాయి చేసుకున్నారు అన్నిటికి  రెడీ గా ఉన్నారు అందుకే అలా .....ఆయన..  వెంటిలేటరు.. ఇంకోటి అంటూ .... బతుకు మీద ఆశ.. పోతానేమొ ఇంకెన్ని రోజులో ?? అన్న బాధ లేకుండా..తన బార్య, కొడుకులు, కూతుళ్ళు.. మనవలు మనవరాళ్ళు అందరు చుట్టూ  తనకోసం ఉన్నారన్న తృప్తితో సునాయసంగా ప్రాణాలను వదిలారు అనుకున్నాము.

*******    

ఇప్పుడు భగవాన్ సత్యసాయిబాబ గారి పరిస్థితి ఇది. ఆయన సృహలో ఉండి ఉంటే... బయట కూర్చుని "మాకేమి తెలియడంలేదు మమ్మల్ని లోపలికి రానివ్వడంలేదు.." అని భాదపడేవాళ్ళకన్నా ఆయన ఎన్నో రెట్లు మౌనంగా బాధ పడ్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన మాములు మనిషి.. పోని మానవావతారం. మనిషన్నాక చీము , నెత్తురు, సంతోషాలు, దుఃఖాలు ,కష్టం కలిగితే బాధలు, రోగాలకి అసహయత.. అన్నీ ఉంటాయి. కాని ఏ భక్తుడు లోపలికి వచ్చినా గుర్తు పట్టగలిగితే.. ఈ బాధలకి ఈ కష్టాలకి అతీతంగా ఉన్నట్లుగా ఉండగలగాలి. తనకేమి కాలేదు అనే నిర్లిప్తత ఉండాలి.. ఇంత ముదిమి వయసులో అలా ఉండగలరా? ఎంతటి గొప్ప వ్యక్తి అయినా అవసాన దశలో ప్రాణ  బాధ అనుభవించక  తప్పదు ఎంతటి అంతర్మధనం జరుగుతుందో కదా అతనికి..   సెంట్రల్ ట్రస్ట్, 120 దేశాల్లో 1200 సేవా సమితులు, ఆయన వేల కోట్ల ఆస్థి పాస్తులు  దీని తరువాత వారసులు.. వీలునామా, లాయర్లు ఇవేమి  ఆయన  అంతర్మధనం కాదు...  చివర్లో ఇవేమి ఆయనతో పాటుగా ఐ సి యు లో తోడుగా రాలేదు. ఆయనొక్కరే, ఆయనకొచ్చిన ఇంఫెక్షన్ తోడుగా వేరెవరిని లోపలికి రానీయక,  బయట మీకోసం ఇన్ని వేలమంది ఉన్నారు అని తెలుసో లేదో కూడా తెలియనంతగా... ఉన్నారంటే.. ఆ మానవవతారంలోని మంచి సేవా మనసు ఎంత మధన పడుతోంది.. ఇందులో ఆయనకి "నా" అని చెప్పుకోతగ్గ మనిషి ఎవరు? ఆ మనసు చెప్పే మాటలు వినేవాళ్ళేవరు? 

ఏది ఎలా ఉన్నా ఆయనో గొప్ప వ్యక్తి.. అతనిలోని మంచితనం తన ఊరి ప్రజలకు నీటి సౌకర్యం, వైద్య సౌకర్యం అందించిన మానవత్వం పరిమళించిన మహా మనీషి. వేల కోట్లు ఏమి చేసుకోవాలో తెలియక ..... అన్న మాట పక్కన పెడితే ఎంతోమంది కన్నా ఉన్నతుడు. అలాంటి వ్యక్తి ఈరోజు అసహాయ స్థితిలో ఉన్నప్పుడు.. ఆయన అసలు దేవుడే కాదు, ఇవి చేశాడు,  అవి చేశాడు అని చర్చించుకోడం అంత సమంజసం కాదు. 

మన పక్కనే ఎదో శవం వెళ్తోంది అంటే ఒకసారి దండం పెట్టుకుని అప్రయత్నంగా "అయ్యో" అనుకునే సదాచారం మనది. అలాంటి మంచి మనిషి... ఈరోజు వైద్యులు తప్ప వేరెవరు లోపలికి రాలేక/రానీయక ఆ ఐ సి యులో ..  ఒంటరిగా మృత్యువుతో పోరాడుతున్నారు.. అతని బాధని అర్థం చేసుకుని అతని ప్రశాంతతకై ప్రార్థిద్దాము. 
******

చివరిగా : పైన చెప్పిన ఒక మాములు మధ్యతరగతి వ్యక్తికి, ఒక మహిమాన్వితమైన వ్యక్తి కి తేడా చూశారా? ఆయన తనవాళ్ళ మధ్య తృప్తిగా సంతోషంగా కన్ను మూశారు.. ఈయన "నా" అన్నవాళ్ళు దగ్గర్లో లేక...... ప్చ్ !!  పోతే అందరూ వస్తారు లెండి.. ఉన్నప్పుడు ఆ తృప్తి ఉండాలి కదా.. :(
******

4.03.2011

విజయ ఉగాది..

 నిండుగ వెలిగే తెలుగుజాతి .....
విజయోత్సవాల.... శ్రీ ఖర నామ సంవత్సర  ఉగాది శుభాకాంక్షలు
నిండుగ వెలిగే తెలుగుజాతి ..... 
వికృతి నామ సంవత్సర "యుగాదికి" ధన్యవాదాల వీడ్కోలు.
*******

4.01.2011

బొమ్మను చేసి ప్రాణము పోసి...

బ్రతుకంత భాదగా
కలలోని గాధగా
కన్నీటి ధారగా
కరగిపోయే…
తలచేది జరుగదు
జరిగేది తెలియదు..
*****

ఎందుకో ఈరోజు అన్నీ ఈ పాటలే గుర్తొస్తున్నాయి. 
తలచినదే జరిగినచో దైవం ఎందులకు.. 
జరిగినదే తలచినచో శాంతి లేదు నీకూ.. అంటూ..

ఎలా చెప్పను నా బాధని.. చెప్తే మీరు మటుకు తీర్చగలరా? ఏమి చేయగలరు.. మహా అయితే ఒకసారి చదివేసి అయ్యో రమణి.. మీకింత కష్టమా.. కల్లో కూడా అనుకోలేదే అని కాసేపు నాతో పాటు బాధ పడతారు అంతే కదా.. వారం నుండి జరుగుతోంది ఇలా.. విసిగి వేసారి పోతున్నాను. ఒక్కళ్ళు ఒక్కళ్ళు నన్ను అర్థం చేసుకోరు..  

మొన్న బయటకి వెళ్తుంటే..ఒకావిడ.. " అయ్యో రమణిగారు ఏంటి అలా అయిపోయారు.. అంతెత్తున నిటారుగా ఠీవిగా కనపడేవారు, ఇప్పుడేంటి అలా అయిపోయారు? కుటుంబ సమస్యలా? "అంటూ .. పరామర్శించింది.  నన్ను చూడగానే తెలిసిపోతోంది కాబోసు నేను పడ్తున్న కష్టాలు.. నిన్నటికి నిన్న నా స్నేహితురాలు కూడా "ఎలా ఉండేవారు ఎలా అయిపోయారు అంటోంది.. " ప్చ్! 

అసలు దీనికంతటికి కారణం ఎవరు అంటే ఏమి చెప్పను? ఎందుకంత దిగులు అంటే ఎలా చెప్పను? కాని తెలియని మనోవేదన.. మరణయాతన.. ఆకాశ దేశానా.. ఆషాడ మాసానా మెరిసేటి ఓ మెఘమా అని నా గోడు విన్నవించుకుందామంటే ఒక్కరు ఒక్కరంటే ఒక్కరు ఒకే ఒక్కరు గడ్డం కింద చెయ్యేసుకుని వినడానికి ఉద్యుక్తులవుతారేమో అని ఎదురుచూస్తున్నా.. ఎవరు లేరు.. ఎవరు రారు.. అయినా నా పిచ్చి కాని ఎవరో వస్తారని ఎదో చేస్తారని ఎదురు చూసి మోసపోవడమేగా నాకు అలవాటయ్యింది.. ప్చ్.. ఎదురుచూసి.. ఎదురుచూసి .. 

"ఎహే గోలాపి బాధెంటో చెప్పండి!" అని విసుక్కుంటారని తెలుసు.. అందుకే  ఇంక పొడిగించకుండా  చెప్పేస్తున్నా.. విన్న తరువాత మీరు "అయ్యో రమణి" అని కుమిలిపోకండి.. కష్టాలు రమణికి కాకపోతే ఇంకెవరికి వస్తాయి చెప్పండి.. అలా అనేసుకుని సర్దుకుపొండి.. నా ఆలోచనంతా...నా బాధంతా.. 
********
*********
********
********
********
********
********
********
********
********
********
********
********
********

ఇలా మీరు నా చేతిలో ............ అయిపోతున్నారనే.. హహ్హ్హహ
Loading...