11.20.2012

అహో! ఒక మనసుకి నేడే పుట్టినరోజు..


 చదువుతున్న, చూస్తున్న, వింటున్న అందరికీ .. మీ అందరికీ....


 ఎందుకూ అంటే నా ఈ పుట్టినరోజు.. ఎంతో ఆనందంగా జరిగినందుకు.. జరిపించినందుకు.
నన్ను ఆత్మీయురాలిగా భావించి ఎంతో వేడుకగా నా పుట్టినరోజు జరిపించిన నా బ్లాగు + ప్లస్ మిత్రులకి.. ఫోన్ ద్వారా శుభాకాంక్షలు అందజేసిన ప్రియ మిత్రులకి, ఊహించనంత ఆర్భాటంగా మా మేడం పుట్టిన రోజు అంటూ హంగామా చేసిన మా "పెన్సిల్ ట్యుటోరియల్"  పిల్లలికి అందరికీ,  ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

ముఖ్యంగా బ్లాగరు, మరియు ప్లసరు శ్రీమతి మాలా కుమార్ గారికి, 

అత్మీయురాలు అంటు అభిమానం చూపించిన శ్రీధర్ గారికి, 

అక్కయ్యా.. అంటూ ఆప్యాయంగా పిలిచి శుభాకాంక్షలందించిన  తమ్ముడు రాజేష్ కి,


విషెస్ ద్వారా నాకు పుట్టినరోజు శుభాకాంక్షలందించిన లక్ష్మీ నరేష్ గారికి ,  
 వీరి పోస్ట్ల ద్వార నాకు శుభాకాంక్షలందించిన ప్రతి ఒక్క ప్రియ మిత్రునికి/మిత్రురాలికి అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. 


పెన్సిల్ ట్యుటోరియల్ చిన్న హంగామ చేసి నన్ను ఆనందింపజేసి సారధ్య బాధ్యత వహించిన మౌనిక, భరద్వాజ్, వరుణ్, ఐయెషా, హుస్సేన్, సుబ్రహ్మణ్యం, గణపతి, రాణి, తదితురలకి...  ప్రత్యేక కృతజ్ఞతలు.


ఇంకా నా FB  ఫ్రండ్స్ కి కూడా.. :) 

మళ్ళా ఇంకోసారి    ...............................................శుభాకాంక్షలందించిన మిత్రులు . శ్రేయోభిలాషులు.
******


11.19.2012

మనసా తుళ్ళి పడకే.....


ఏయ్ ఏమయింది నీకు అలా ఉన్నావు?

ఎలా ఉన్నాను బానే ఉన్నాను కదా ఎందుకు మౌనంగా ఉన్న నన్ను అనవసరంగా కెలుకుతావు..

ఎప్పుడూ వాగుతూ ఉండే నువ్వు మౌనంగా ఉన్నావనే పలకరించింది ఏమయింది చెప్పు..

చెప్పడానికేముంది? ప్రతీసారి చెప్తున్నదే ప్రత్యేకంగా చెప్పేదేముంది? చిన్నప్పటినుండి అడుగుతున్నా నాకో తోడు చూడు అని.. విన్నావా? అసలు వింటావా?నీకు తోడా నేను ఉన్నాను గా ఇంకేమి తోడు కావాలి?

నువ్వు నాకు తోడా.. హహహహహహహహ.. నువ్వు నేను ఒకటే అయినప్పుడు నువ్వు నాకు తోడు ఎలా అవుతావు.. పోని నువ్వు నేను వేరు వేరు అనుకున్న్నా కూడా మనిషిగా నువ్వు నీకు ఇంకో మనిషిని తోడుగా చేసుకున్నావు కాని నాకేరి నాకు ఇంకో మనసు తోడు కావాలి

ఇంకో మనసా ఎక్కడినుండి తీసుకురాను? తీసుకొచ్చిన ఎవరు అర్థం చేసుకునేవాళ్ళు? అయినా అంత అత్యాశ కూడా పనికిరాదు

ఆపు నాది అత్యాశా? నువ్వు హాయిగా నీకు మనిషిని తోడు చూసేసుకుని నాది అత్యాశ అంటావా? ఎప్పటిఎప్పటినుండి ఈ ఒంటరితనం ఎదన్నా మంచి ఊహ కలిగితే చెప్పుకోడానికి ఒక స్నేహం లేక.. సరే నీకు చెప్తే నువ్వలా గుండెల్లోనే కప్ప్ట్టెస్తావు.. నాకు అసలు నీతో విడాకులు కావాలి.. నీతో ఉండలేకపోతున్నాను.

నాతో విడాకులా.. నన్ను వదిలేసి ఎక్కడికెళ్తావు? నిన్ను అక్కున చేర్చుకునేవాళ్ళే లేరు నేను తప్ప.. పిచ్చి వేషాలు మాని అసలు నీ బాధేంటో చెప్పు..

బాధ.. ఏమని చెప్పను? చిన్నప్పుడెప్పుడో చెప్పావు.. నాకే కాదు నీకు కూడా, నిన్ను కూడా ఇష్టపడే మనిషినే ఎంచుకుంటాను అని ఏది? నా ఇష్టాలు నీకు తెలియవా? ఎన్ని సార్లు చెప్పాను.. అసలు నువ్వేమాత్రం చెప్పకుండా నీకోసం నేనున్నాను  అనే మనసు కావాలి అని.. విన్నావా నువ్వు తోడు తెచ్చుకున్న నీ మనిషి కూడా అందరిలాగే బాధ్యతలు, బంధాలు అంటున్నాడు.. పోని కనీసం ఎప్పుడన్నా ఒక్కసారన్నా తనంత తానుగా నీ మీద ప్రేమని కురిపించాడా లేదే.. నీ మీదే ప్రేమ లేనివాడు ఇక నీ లోపల ఉన్న మనసు సున్నితత్వాన్ని ఎలా తెలుసుకుంటాడు? అతను నాకు తోడెలా అవుతాడు?

ష్హ్! తప్పు అలా మాట్లాడకూడదు.. బంధాలు అంటున్నాడంటే ఇక పిల్లలు పెద్దవాళ్ళయ్యారు.. ఇంకా నాకోసం, నాకోసం మాత్రమే అని అనకూడదు.. బాధ్యతల మధ్య బందీ అంతను..

ఎహె ఆపు సోది గోల.. చిన్నప్పటినుండి ఇలాగే సర్ధిచెప్తున్నావు.. వాళ్ళెవరో ప్రేమించుకుంటున్నారని వాళ్ళిద్దరు ఎక్కడెక్కడికో వెళ్ళాలంటే నువ్వేదో తగుదునమ్మా అంటు మధ్యవర్తిగా వెళ్ళావు... నువ్వెళ్ళింది చాలాక నన్ను కూడా తీసుకెళ్ళి మరీ "చూడు వాళ్ళిద్దరూ ఒకళ్ళకోసం , ఒకళ్ళలా ఎలా ఉన్నారో, భలే అన్యొన్యంగా ఉన్నారు కదా మనకి (నీకు+నాకూ) అలాగే మంచి వ్యక్తి రావాలి అని నన్ను ఊరించలేదా? ఆరోజునుండి ఆ అందమయిన ఊహని అలాగే పదిలపరుచుకుని ఉన్నానే ఇంతవరకు నెరవేరిందా?  ఎంతసేపు నీ గోల నీదే కాని...


నీకు గుర్తుందా? అప్పుడెప్పుడో ఆ పిల్లాడెవరో తన ప్రేయసి పుట్టినరోజని ఆరోజు మీరు వెళ్తున్న వ్యాన్ అంతా చక్కటి పూలతో అలకరించి, వాన్ నిండా పూలతో నింపేసి పాదాలు కందకుండా నడిపించడం.... భలే ఉంది కదా ఇదిగో నీకోసం అంటూ అతను ఆ అమ్మాయికి ఇచ్చిన గిఫ్ట్ ఏడు వారాలు పేర్లు కల కర్చీఫ్ ఏరికోరి ఎంబ్రాయిడిరీ చేయించి ఇచ్చిన ఆ విధానం.. అప్పుడు నువ్వనుకొలేదు ప్రేమంటే అలాగే ఉండాలి అని.. ఏది అలా ఉందా నీకు.. నువ్వు గుర్తు చేస్తే కాని నీ పుట్టినరోజు తెలీదు ఈ మహానుభావుడికి ఇక  బహుమతులు కూడానా?”
ష్హ్.. అతన్నేమి అనకు పాపం.. ఎదో సంసారం కోసం తాపత్రయపడే వాడు..భవసాగరం ఈద లేక ఈదుతున్నవాడు..  నా ఆలోచనలన్నీ  అతనికి చాలా వింత గా ఉంటాయి.. వదిలేయ్..

ఆ ఆ! వదిలేస్తూనే ఉన్నా కొత్తగా పంతం పట్టుకుని కూర్చుంటే మటుకు మారే మనిషా ఏంటి? అయినా ..భవసాగరం, సంసారం అంటూ అంత పెద్ద మాటలెందుకు? నువ్వు లేకుండానే ఈదేస్తున్నడా ఒంటి చేత్తో నీ పుషోత్తముడు?మరీ చెప్పేస్తున్నావు...

పాపం నేనున్నాను కాబట్టే ఆ మాత్రమయినా లేకపోతే :(

కదా!  లేకపోతే అంతే కదా అదయినా ఆలోచించి.. నా గురించి తెలుసుకోవాలి కదా కనీసం నీ గురించి కాకపోయినా నీ లోపల ఉన్న నీ మనసుని గుర్తించాలి కదా .. మనసులోని మాటని మన్నించాలి కదా ఇంకా ఎన్నాళ్ళిలా మూగనోము పట్టను. ఇక నా వల్ల కాదు అటో ఇటో తేలిపోవాలి..

ఏంటి అటో ఇటో తేలిపోయేది ఏమి చేస్తావు నువ్వు ఏమి చేయగలవు? ఒక్కసారి కమిట్ అయిపోయాము ఈ జీవితానికి ఇంక దీనిని తిరగ రాయలేము.. మరీ అంత మిడిసిపడకు..

మిడిసిపడి మటుకు నేనేమి చేయగలను కాని.. ముందు నీనుండి మార్పు రావాలి.. నీకా భర్తని ఏవిధంగా మాట వినేలా చేసుకోవాలో తెలీదు.. ఎంతసేపు నీ పిల్లలు, నీ ఎదుగుదల అందరు కలిసి నన్ను ఇలా అదిమిపెట్టేసారు.. పుట్టినప్పటినుండి నీతో ఉంటూ నీ చితిలో కూడా నిన్ను వెన్నంటి వచ్చే నాకోసం మటుకు ఒక్క క్షణం కూడా ఆలోచించవు.. ఎలాగు నేను కమిట్ అయి నీతోనే ఉంటాననే/ఉంటున్నాననే  కదా ఈ అలుసు..

ఏయ్ అంత మాట అనకు.. ప్లీజ్. నువ్వు కాకపోతే నాకింకెవరు తోడు చెప్పు.. చిన్నప్పటినుండి నా ప్రతి ఆశ నా ప్రతి ఊహ, నా ప్రతి ఊసులు నీకే కదా నేను చెప్పుకున్నది.. ఎందుకలా నా స్నేహాన్ని కాదంటావు.. ఎంత నువ్వు నేను ఒకటి అయినా.. ఇప్పుడు నువ్వు నాకు చెప్పినట్లు నేను కూడా నీకన్ని చెప్పేస్తూనే ఉన్నా కదా.. ఏదన్నా దాచానా చెప్పు.. ప్రతివాళ్ళు మనకోసమే అన్న పిచ్చి భ్రమలో ఉండి, అది కాదు స్వలాభం కోసమనుకున్నప్పుడు ఇద్దరం ఒకరికొకరం ఓదార్చుకోలేదు.... గాలి, నీరు , అన్ని చితిలో కూడా తోడు వస్తాయి అంటారు కాని అదంతా ఉత్తదే అవి ఇక్కడే ఉంటాయి.. కాని నువ్వు నేను చితిలో కూడా కలిసే ఉంటాము..

ఎప్పటికీ నాకు నువ్వు , నీకు నేనే తోడు.. నీడ కూడా తోడురాదు.. కాబట్టి ఎక్కువగా ఆలోచించకు.. చూడు నువ్వలా బాధపడ్తుంటే నాకు కన్నీళ్ళు ఆగడం లేదు..

అయ్యో! వద్దూ.. నువ్వలా కన్నీరవకు.. నేనేమన్నానని.. బాధ అంతే.. నాగురించి పట్టించుకునేవాళ్ళు లేరు అందరూ నన్నిలా ఒంటరిగా వదిలేశారు, నువ్వేమో నీ వ్యాపకంలో బిజీగా ఉంటావు.. ఎప్పుడయినా కబుర్లు చెప్పుకుందమంటే ఇప్పుడు కాదని నిద్రపుచ్చేస్తావు.. అన్న బెంగ అంతే.. అయినా సరే నీకు నేను తోడు ఉంటాను సరేనా!..నువ్వలా కన్నీరవకు.. లేనిది కోరను, ఉన్నది మరవను.. ఒక పొరపాటుకు  యుగములు వగచను... మౌనం మటుకు నా భాష కాదు.. నేనిలా వాగుతూ నిన్ను విసిగిస్తూనే ఉంటాను.. నువ్వు బయటికి చెప్పలేకపోయినా సరే..:)

తప్పదు.. జీవనం సాగాలి కదా.. బతుకు బండి నడవాలంటే నీతో కబుర్లు చెప్తూ ఉంటే సాగదు కదా అందుకే బిజీ బిజీ.. అయినా నేను కూడా నిన్ను వదలను.. మనిద్దరం ఒక్కటే.. నీ ఆలోచనలను నేను పంచుకుంటూనే ఉంటాను.. నీతో మాట్లాడుతూనే ఉంటాను.. కాని నీ ఆలోచనలను నేనుగా వ్యక్తం చేయలేను.. తనుగా కనుక్కునే మనిషి తోడు నాకు లేదు.. అందుకే ఈ మౌనం..

అంతేలే.. అంతకన్నా మనం చేసేదేముంది కనక.. తోడు లేనని మటుకు అనుకోకు.. ఎదో కొంచం ఆవేశంలో తిట్టేశాను నిన్ను.. బుజ్జి పాపాయివి కదా నాకు.. రేపు నీ పుట్టినరోజు కదా మరి ఏమి చేస్తున్నావు?

హెయ్" అవును నాదే కాదు.. నాతో పాటు నువ్వు కూడా పుట్టావు కదా.. ఏమి చేద్దాము.. ?

ఆనందంగా ఉందాము.. సరదాగా మంచి మంచి రుచికరమయిన వంటలు చేసిపెడ్తాను నీకు.. సరెనా!... "పుట్టినరోజు శుభాకాంక్షలు" ఓ నా మంచి మనసా"

నేను రేపటికోసం ఎదురు చూస్తున్నా.. నీకు కూడా.. అంటే  నన్నింతకాలం, నా ఊహలని, నా ఆలోచనలని భరిస్తూ , నన్ను నవ్విస్తూ అప్పుడప్పుడు కోపానికి గురి చేస్తూ నన్ను నీలో దాచుకున్న చక్కటి నా ప్రియ నేస్తానికిరమణీయమైన నీ స్నేహానికి .......


"పుట్టినరోజు శుభాకాంక్షలు"
*******

11.14.2012

ఇంతలో ఎంత మార్పు

అందరూ బాగున్నారా? చాలా రోజులు/నెలలు అయింది కదా బ్లాగు వైపు చూసి.. ఎందుకో మరి బ్లాగు రాయాలి అన్న భావన కలగడం లేదు. గూగుల్ + లో తరచు "నేనున్నాను " అని అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా ఎదో వెలితి.. అదే ఈ బ్లాగు , రాయడం లేదన్న భాద,  రాయలన్న తపన , సమయం లేదా అంటే హాస్యాస్పదం. 24 గంటలు ఖాళీగా ఉన్నా,  ఆలోచనలు బ్లాగు దాకా రానీయడం లేదు. సరే ఇక ఈరోజు ఒకసారి బ్లాగు మిత్రులను ఒకసారి పలకరిద్దామని వచ్చాను. మరి ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తానా?  ఏమో మాటిచ్చాననుకొండి మాటకి కట్టుబడి ఉండలేనేమో , ఇలా మూడ్ వచ్చినప్పుడు రాయలనిపించినప్పుడు కీ బోర్డ్ టక టకలాడించేయడమే :-)

ఏమి రాయడంలేదు అని నేనేమి రాయనప్పుడు .. రాస్తున్నప్పుడు సలహాలిస్తూ,  సహకరిస్తున్న / భరిస్తున్న మిత్రులందరికి ముందస్తూ ధన్యవాదాలతో.. :-)

****

దీపావళి పిల్లలికి భలే సరదా సరదా పండగ. నరకచతుర్థశి కి ముందే ఆఫీసు నుండి వచ్చేప్పుడో వెళ్ళేప్పుడో టపాసులు కొనేసేవాళ్ళం .. వాటిని ఎండబెట్టడం తుపాకులతో కాల్చుకోడం అవి మొదలెట్టేవాళ్ళు.. చిచ్చుబుడ్లు. చిన్న చిన్న సీమ టపాకాయలు కాలుస్తున్నప్పుడు.. నేను , శ్రీవారు పక్కనే ఉండి ఎన్నో జాగ్రత్తల మధ్య ప్రతీ దీపావళిని ఆహ్లాదంగా చేసుకుంటూ ఉండేవాళ్ళము.  ఒక బకేట్ నిండా నీళ్ళు, ఎందుకన్నా మంచిదని బర్నాల్, కాటన్, ప్రతీసారి అన్ని రేడీ గా ఉంచుకుని మరీ పిల్లలచేత  కాల్పించడమనే  కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసేవాళ్ళము. 

"చింటూ జాగ్రత్త,"
"అమ్మలూ జాగ్రత్త.."

 అంటూ ఇద్దరం వాళ్ళేమాత్రం ఆలశ్యం చేసినట్లనిపించినా ఎత్తుకుని దూరంగా వచ్చేవాళ్ళము అవి పేల్తున్నప్పుడు.. దీపావళి ఎంత ఆనందంగా చేసుకునేవాళ్ళమో , అంతా పూర్తయింత తరువాత "హమ్మయ్య " అని అంతే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునేదానిని. 

మరి ఈరోజు.. 

నిజమే వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు. "లైట్ అమ్మా.. అవసరమా?  పండగ కాబట్టి ఎదో నాలుగు అలా అలా కాలుద్దాము అంతే!"  అని మూడు రోజులనుండి అంటున్నారు.. కాని చివరికి మావాడు బానే తెచ్చాడు అన్ని రాకెట్స్, బాంబులు , నాకిష్టమని చిచ్చుబుడ్లు.. ఇక నా గురించి చెప్పేదేముంది.. 

భయం .. 

ఇద్దరు దూకుడుగానే ఉంటారు వెనకా ముందు చూసుకోరు వాళ్ళిద్దరిని జాగ్రత్తగా చూడాలి ఇవే ఆలోచనలు ఉదయం నుండి  .. అనుకున్న సమయం వచ్చింది...  ఎప్పట్లానే అన్ని రేడీ చేశాను. 

కాకపోతే ఇదివరకటిలా వాళ్ళు కాలుస్తున్నప్పుడు అక్కడ ఉండగానే పేలిపోతాయేమో  అనే ఆదుర్ధా .. ఎత్తుకువచ్చేంత చిన్న పిల్లలు కాదు వాళ్ళు అన్న ఆలోచన, కాని వాళ్ళకి వెనకాల ఉండి , జాగ్రత్తలు చెప్పడమే అనుకున్నాము ఇద్దరం.. కాని మేము అనుకున్నట్లు జరగలేదు .. మా ఆలోచనలకి , అంచనాలకి అందనంతగా... ఇంకా చెప్పాలంటే మా కళ్ళు చెమ్మగిలేంతగా....

"అమ్మా రా, డాడీ రండీ.. "
"దా అక్కా... ఆ కాకరపువ్వొత్తులు తీసుకో... కాలుద్దాము మావాడి హడావిడి.. "
నా ఆలోచన అంతా వాడు అల్లంత దూరాన ఒక రాకెట్ పెట్టాడు... ఇక్కడ నేను కాకరపువ్వొత్తు(sparkles) రేడీ చేసి ఉంచితే అవి  కాలుస్తాడు అని..
కాని అలా జరగలేదు...
 " రా అమ్మా! నీకిష్టమయిన చిచ్చుబుడ్లు (flower pots) కాల్చు....


 అమ్మా జాగ్రత్త.. ,
"అదిగో అమ్మా బాంబ్ అక్కడ పెట్టాను దా!  అగరబత్తి  జస్ట్ అలా అంటించి వచ్చేద్దాము, "

"అమ్మా జాగ్రత్త అంటుకుంది దా వచ్చేయ్!.. అమ్మా!  నన్ను పట్టుకో!"
"డాడీ అమ్మకివ్వండి,  అమ్మ కాలుస్తుంది"
ఇలా ఇద్దరూ దాదాపుగా మా చేతే అన్నీ కాల్పించారు.. ఎంతలో ఎంత మార్పు....
ఒక విధంగా చెప్పాలంటే ఇది నాకు అసలయిన దీపావళి.. ఇది ఒక తల్లి ఆనందం.

ఈ ఆనందంతోనే మిత్రులందరికీ ..

*****
అసలు కొసమెరుపు చెప్పడం మరిచాను: నిన్న ఈ కాల్చడం హడావిడిలో  lakshmi bomb  నా చేతిలోనే పేలింది..... ఒక్క క్షణం ఏమి జరిగిందో అర్థం కాలేదు.. వెలిగించిన తరువాత వదిలేశాను అనుకున్నాను, కాని వదలలేదు వింత ఏమిటంటే ఏమి జరగలేదు.. కనీసం కాలింది అని చెప్పడానికి కూడా అవకాశం లేదు అన్నంత యాధాతధంగా ఉంది నా చేయి.. అదృష్టం .. ఏదో అదృశ్య శక్తి నన్ను కాపాడింది అని మనసులోనే థాంక్స్ చెప్పుకున్నాను. ఆ Time  లో  నేను కట్టుకున చీర కూడా మాములు సిల్క్ చీరే.. ఒక్క నిప్పు రవ్వ పడినా అంతే ఇక....  అయినా ఏమి కాలేదు చేతిలోనే పేలింది  అని చెప్పడానికి చేతిలో మిగిలిన బాంబ్  తాలుకూ పేపర్లే సాక్ష్యం. చేయి కాసేపు మొద్దు బారినట్లుగా అయిపోయింది అంతే.  భగవంతుడో లేక ఎదో అదృశ్య శక్తో మరింకేదో దీపావళిని నిరాశ పరచకుండా నన్ను అక్కున చేర్చుకుని   నా ఆనందంలో పాలు పంచుకుంది.
*******


Loading...