8.12.2013

మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు.....

 బార్య భర్త ల మధ్య ఉండే అనురాగమో ఆత్మీయతో మరి.. వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది..(జగమొండి.. మొరటువాడు మొ! )  వాళ్ళ మధ్య జరిగే సంఘటనల వల్లో మరి చిలిపి అల్లర్ల వల్లో.. ఆ అభిప్రాయం ఒక్కోసారి తప్పేమో అని అనిపిస్తూ ఉంటుంది  ఏది ఏమయినా అలాంటి సంఘటనలు  జరిగినప్పుడు వారిలో ఏర్పరుచుకొన్న ఆ అభిప్రాయాన్నే పాటలకి పదాలుగా మారి పల్లవులయి  వినడానికి మధురంగా , కవ్వింపుగా ఉంటాయి..  అలాంటి పాటే  ఈ పాట.  భలే అర్థవంతంగాను, హాయిగాను  ఉంది చూడండి.. అనుకోకుండా ఈరోజు పొద్దున్నవనిత ఛానేల్ లో విన్నాను.. చాలాసార్లు విన్నాను , ఎదో మాములుగా వినేసి వదిలేసేదాన్ని,  కాని ఈరోజు కొంచం ఆసక్తిగా వింటే భలే అనిపించింది...  ఆ కవ్వించే పాట..మీకోసం ;-)   


మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు
మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు
జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి
ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు
డరడరడ డరడరడ డరడరడా

ఆమె ఎమో మొరటోడు నా మొగుడు చీర తెచ్చాడు.. అంటే.. నేను మాత్రం తక్కువా అని జగమొండి నా పెళ్ళాం ముద్దొస్తూ ఉన్నదీ ... అని..

తెచ్చానే మల్లెదండా తురిమానే జడ నిండా
చూసుకోవె నా వలపు వాడకుండా
నా మనసే నిండుకుండ అది ఉంటుంది తొణక్కుండా
నీ వలపే దానికి అండదండ
డరడరడ డరడరడ డరడరడా

ఇక్కడ ఇంకా కవ్వింపు, ఇదిగో నేను తెచ్చిన మల్లెపూదండ అంతే  మురిపెంగా నా వలపు వాడకుండా చూసుకో అంటే...నా మనసు నిండుకుండ అది తొణక్కుండా  నీ వలపు అండ దండగా  ఉంది కదా!  అని ఆమె,    ఎంత చక్కటి సమాధానమో చూడండి.. 

మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు
జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు

నిగనిగలా నీకళ్ళు నిలువెత్తు అద్దాలు నిలబడి చూసుకుంటానందాలూ
నిగనిగలా నీకళ్ళు నిలువెత్తు అద్దాలు నిలబడి చూసుకుంటానందాలూ
విల్లంటి కనుబొమలు విసిరేను బాణాలు విరిగిపోవునేమొ నీ అద్దాలు
డరడరడ డరడరడ డరడరడా

అతని కళ్ళనే అద్దాలుగా చేసుకుని అందం  చూసుకుంటాను అని ఆమె మురిపిస్తుంటే,  నీ కనుబొమల బాణాలకి ఆ అద్దాలు ఉండవేమో అని అతని చిలిపిసమాధానం.. భలే ఉంది కదా! :)

మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు
జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు

తమలపాకు పాదాలూ తాళలేవె కడియాలూ దిద్దుతానె ముద్దులతో పారాణులూ
నీ ముద్దులే మువ్వలు ఆ మోతలె నా నవ్వులూ ఆ పారాణికి వస్తాయి ప్రాణాలూ
డడడడ డడడడ డడడడడా

పారాణికి ప్రాణాలు రావడం... అతని ముద్దులే పారాణికి ప్రాణమట... తమలపాకు లాంటి ఆమె పాదాలు కడియాలు మోయలేవు అందుకే ముద్దులతో పారాణి అద్దుతాను అని  అతను  అంటే,  ముద్దుల మువ్వలకి పారాణికి ప్రాణం వస్తుందని ఆమే జవాబు..


మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు
జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు
డడడడ డడడడ డడడడడా
 *********
పాట భలే సున్నితంగా, సరదాగా ఉంది అనిపించింది.  పూర్తిగా ఇక్కడ వినండి.చిత్రం: సెక్రెటరి 1973
సంగీతం : కె వి మహదేవన్ గారు
రచన :    ఆచార్య ఆత్రేయ గారు
గానం: ఘంటసాల. సుశీల గార్లు
Loading...