4.18.2016

అ(స)క్రమ సంబంధం - సామాన్యగారు రాసిన కథ "కమిలిని" కథకి చిన్న ముక్తాయింపు

మనం లేకపోతే కోడి కుయ్యదు లేదా అవతల మనిషి బతకలేడు మనగురించి తపిస్తారు అన్నది ఎంత హాస్యాస్పదమో.. మనల్ని ఎవరో అమితంగా ప్రేమించేస్తున్నారు అన్నది కూడా అంతే హాస్యాస్పదం.  సంబంధం లేని ఇద్దరి వ్యక్తులు ప్రేమించుకోవడం కాదు కామించుకోవడమే.. స్నేహం , ప్రేమ అన్నీ ట్రాష్.... 

*****

సామాన్యగారు రాసిన కథ "కమిలిని"  భర్తకి తాను పతివ్రతని కాదు అని ఉత్తరం రాయడం... తానేవిధంగా ఇంకో మనిషికి ఆకర్షితురాలిని అయింది అన్నది తెలియజేయడం క్షమించమని తనకి మునుపటి ప్రేమని అందించమని కథా సారాంశం. కథగా ఉన్నతమయిన కథ అందరికీ ఇది. కాని వాస్తవంగా మన మహిళలే సవాలక్ష మాటలు తూటాల్ల పొడిచే కథ. పైగా కథలో భర్తకి ఉత్తరం కథా పరంగా తరువాత జరిగేది కూడా భర్త  క్షమించేస్తాడు... ఇక్కడ కథలో బార్య కాబట్టి ఆడవాళ్ళు అంటే అణగదొక్కడం అణగారిపోవడం అనే ఒక భావన అందరిలో ఉంది కాబట్టి క్షమించడం లేదా క్షమిస్తావా అని అడగడం లాంటి పదాలు వచ్చాయి మరి అదే మగవాడు చేస్తే... బార్యకి చెప్పక్కరేలేదా అదే అడగక్కర్లేదా? అది వాళ్ళ మగతనానికి ఒక గొప్ప ప్రశంసగా అనుకోవాలా.... సరే కథలో ఈ వైపు వాదం లేదు కాబట్టి ఇది వదిలేద్దాము. 

అసలు స్త్రీ ఇంకో పురుషుడికి ఆకర్షితురాలు ఎందుకవుతుంది? 

తన బార్య తనని నిర్లక్ష్యం చేస్తోంది లేదా తన మీద ఆధిపత్యం చూపిస్తోంది అన్నప్పుడు పురుషుడు ఇంకో స్త్రీ వైపు చూస్తాడు లేదా తన ఇగోని తృప్తి పరుచుకోడానికో ఇంకో స్త్రీ పట్ల అకర్షితుడు అవుతాడు అంతేకాని ప్రేమిస్తాడు అన్నది .1% వరకే నిజం నా దృష్టిలో. 

అదే స్త్రీ విషయంలో కూడా జరిగుతుంది తన భర్త ఉద్యోగ పరంగానో లేద పనివత్తిడి పరంగానో లేదా మరోవిధమయిన కారణాలో బార్యకి దూరం అయినప్పుడు అదే మానవశరీరం అదే జీవన విధానం కాబట్టి,ఆమె ప్రత్యేకంగా ఎక్కడినుండో ఊడిపడలేదు ఆమె మనసుకి కోరికలు, ఆలోచనలు, అభిప్రాయలు ఉంటాయి కాబట్టి  తనకి ఉపశమనం ఒక తోడు కావాలన్న భావన కలుగుతుంది, అలాంటప్పుడు దూరపు కొండల ఆవల ఉన్న భర్త కన్న దగ్గర్లో తలుపు వాకిట ఉన్న మనిషి పై ఆకర్షణ  కలగడం.   స్త్రీకి అయినా పురుషుడికయినా  ఉరికే వయసుకి గిరి గీస్తే ఆగదు. ఎలాంటప్పుడు ఆగుతుంది అంటే ఈ క్షణం నువ్వు లేకపోతే నేను లేను అన్న భావన ఒకరిపై ఒకరికి కలగజేయాలి, మరణం కూడ మనల్ని వేరు చేయదు అన్నంత ప్రేమ ఇద్దరిలో ఉండేట్టయితే తలుపువాకిట కాదు కదా వచ్చి మంచం మీద కూర్చున్న వాడిని చూసి కూడా చలించదు స్త్రీ.   స్త్రీ పరంగా స్త్రీలందరి వైపునుండి వకాల్త తీసుకుని మరీ చెప్తున్నా... స్త్రీ కి కేవలం శృంగారం అవసరం లేదు... ప్రేమ కావాలి తనతో పాటే నడిచేవాళ్ళు ఉండాలి.. ఇక్కడ తనతో పాటే నడవడం అంటే అడుగులకి మడుగులు వత్తడం కాదు..నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డు లేదా నీకోసమే నేను అని చెప్పగలిగే ప్రేమ కావాలి. 

ఇద్దరూ సంతోషంగా ఉండాలి, ఇద్దరు ప్రపంచాన్ని మరిచిపోవాలి బాధ్యతలని ఆనందంగా పంచుకోగలగాలి. బాధల్ని ఒకరికొకరం ఉన్నామని ఉపశమనం కలగజేసుకోవాలి. నీవు లేకపోతే నేను లేను అన్నంత దృఢంగా ఉంటే ఆ భర్తకి కాని ఈ బార్యకి కాని క్షమించమని ఉత్తరాలు రాసే అవకాశం రాదు. ముఖ్యంగా ఇలాంటి కథలు ఉత్తమమయినవి ఉన్నతమయినవి అనే కన్నా ఈ కథలు రాసే అవకాశం కూడా ఉండకుండా బార్య భర్తలిరువురు ఉండాలన్నది నా ఆలోచన. 

ఒకవేళ ఇరువురు ఎవరి వృత్తిపనుల్లో వారుండి కనీస దాంపత్య జీవితాన్ని కూడా  ఆనందించలేకపోతున్నారు అంటే పైన సామాన్య గారు రాసిన కథ క్షమించమని అడిగేదాకా రావాల్సినదేమి కాదు ఇరువురు   వారికి తోచిన విధంగా వారు సంతోష పడుతున్నారు అంతే... బార్య భర్తలిరువురి మధ్య ఏ అరమరికలు లేకుండా సంతోషంగా సంసారిక జీవనం కొనసాగిస్తూ బార్య కాని భర్త కాని తప్పుటడుగు వేస్తే అది అక్రమమే.... కాదు, అనివార్య కారణాల వల్ల సరి అయిన దాంపత్య జీవనం కొనసాగించలేకపోతున్నారు అంటే బంధాలన్ని అ(స)క్రమ సంబంధాలవైపు దారితీస్తాయి. అలాకాక  ఒకవేళ వారిరువురి మధ్య ప్రేమ కనక ప్రాణం ఇచ్చేంతగా ఉంటే ఎలా ఉన్నా అసలేమి లేకపోయినా మండుటెండలో కూడా ఇరువురు నడిరోడ్ మీదయినా సరే సంతోషంగా గడపచ్చు. 

సామాన్య గారు  రాసిన కమిలిని కథ మీ కోసం
4.17.2016

అప్పటి బ్లాగర్లు.. బ్లాగులు

వనజా!

బ్లాగుల్లో లేఖా సాహిత్యం వినడానికి ఎంత బాగుందో.. బాధ్యతల్లోనో బంధాల సందడిలో మనసు అలసినప్పుడు నేస్తానికి చెప్పుకోడానికంటూ ఒక చిన్న సదుపాయం,  మన చిన్నతనంలో అయితే ఉత్తరాలు రాసుకునేవాళ్ళం ఆరోజులు ఎంత మధురమయినవి ఎఱ్ఱటి ఎండలో పోస్ట్‌మెన్ కోసం ఎదురుచూడడం ఒక గొప్ప అనుభూతి. మన దగ్గరే ఉన్న స్నేహితులతో కబుర్లు ఒక ఎత్తయితే, మన ఎదురుగా లేని బంధువుల ఉత్తరాల సమాచారం మరొక అనుభూతి . ఇప్పుడేది ఆ ఆతృత, ఆ మాటల సందడి.. మాటలంటే గుర్తొచ్చింది వనజా అసలు మాట్లాడుకోడానికి మనుషులేరి? మనసేది? ఏ బంధమయినా ఏ అనుబంధమయినా సెల్్ఫోన్ల బిజీ తో, సెల్ఫీల సంబరాలతోనో గడిపేస్తున్నాము. టెక్నాలజీకి బానిసలమయిపోయాము. ఎదురుగుండా మనిషి మనతో మాట్లాడకపోయినా సహిస్తాము కాని ఎక్కడో ఉన్న మనిషి మనకి ఈరోజు ఫోన్ చేయలేదని సెల్ ఫోన్ వంక చూస్తూ ఆరాటపడిపోతూ ఉంటాము. మాటలకి విలువ అలాగే ఉంటుంది.. మనసు కి మటుకు ఒక మనసుని తోడు ఇవ్వలేకపోతున్నాము కదా వనజా. అసలు మనమంతా ఒంటరిగా ఉన్నమెమో అని కదా అప్పట్లో ఈ బ్లాగులన్నవి వచ్చి మనకి కాస్త ఊరటని ఇచ్చాయి. బ్లాగులంటే గుర్తొచ్చింది.. నెనేలాగు మీ అందరికన్న సీనియర్ కాబట్టి నా బ్లాగ్ అనుభవాలు మీతో పంచుకుంటాను. 

బ్లాగుల మొదటి రోజుల్లో ఈనాడు ఆదివారం పేపర్లో బ్లాగుల గురించి చెప్పినప్పుడు ఒకసారి అలా ప్రయత్నించాను. ఒక నాలుగు లైన్ల  ఒక టపా.. ఆతరువాత ఇంకోటి అలా ఒక్కొక్కటి రాస్తూ రాస్తూ ఒక బ్లాగర్ అనిపించుకున్నాను. 

నేను  బ్లాగర్ లక్ష్మి గారు
ఈ టి వి సఖీ షూటింగ్ సమయంలో బ్లాగర్లతో 


ఇక బ్లాగ్ స్నేహితుల గురించిచెప్పాలంటే అప్పట్లో అందరూ మంచి రచయిత్రులు, రచయితలు కేవలం నాలుగు లైన్స్ రాసి మేము గొప్పవాళ్ళం అని ఎవరు అనుకోలేదు. తెలుగు అన్నా తెలుగు సాహిత్యమన్నా  మక్కువ చూపే వారిలో ఆద్యులు కొత్తపాళీ గారు, రానారే గారు, నువ్వుశెట్టి బ్రదర్స్,  సుజాత బెడదకోట, సుజాత మణిపాత్రుని, శశికళ, విరించి, రెండు రెళ్ళు ఆరు తోట రాముడు, భరద్వాజ్ వెలమకన్ని, పప్పు శ్రీనివాస్ , కార్తిక్ ఇంద్రకంటి, కల్పనా రెంటాల, మహేష్ కత్తి, అరుణ పప్పు, వీవెన్, నాగార్జున చారి, సౌమ్య అలమూరు, సౌమ్య, పూర్ణిమ తమ్మిరెడ్డి, మంచు.. ప్రసాద్ చరశాల, చదువరి, వరూధిని కాట్రగడ్డ, మలాకుమార్, జ్యోతివలభోజు, ప్రవీణ్ (మార్తాండ), శ్రీనివస్ ధాట్ల , కిరణ్ కుమార్ చావా, నిడదవోలు మాలతి, కస్తూరి మురళి కృష్ణ, రవి రవి, లక్ష్మి, శ్రీధర్ నల్లమోతు, బులుసు సుబ్రహ్మణ్యం (అందరికి చివర గారు ఉంది చదువుకోవాలి) ఇలా ఎంతమందో నిజానికి మేమంతా ఒక కుటుంబంలా ప్రతీ డిసెంబర్ 2 వ తేదిన బ్లాగర్ల రోజుగా జరుపుకుంటూ డిసెంబర్లో జరిగే పుస్తక ప్రదర్శనశాల లో కలుస్తూ సందడిగా గడిపేవాళ్ళం.


భరద్వాజ్ వెలమకన్ని గారు, తోట రాముడు, బులుసు సుబ్రహ్మణ్యం గారు నేను

మళ్ళీ ఆరోజులు  రావాలని వనజా మీరు చేపట్టిన ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నట్లు మీకో విషయం తెలుసా బ్లాగు బంధాలు కొనసాగుతున్నాయి అని తెలియచెప్పడానికి బ్లాగు ద్వారా  పరిచయమయిన తమ్ముడు భరధ్వాజని రెండు రోజుల క్రితమే కలిసాను. తమ్ముడితో పాటుగా బులుసు సుబ్రహ్మణ్యం గారిని, రెండు రెళ్ళు ఆరు బ్లాగర్ తోట రాముడి గారిని కలిసి ఆ పాత మధురాలని తలుచుకుంటూ చాలా సందడిగా గడిపాము..  మీకు తెలుసు కదా భరద్వాజ్ వెలమకన్ని ఎన్నారై ... తమ్ముడి మరో పేరు మలక్‌పేట రౌడి, మలకానంద స్వామి.. వీటి గురించి మరో సారి ప్రస్తావిస్తాను.

వనజా మనం మళ్ళీ ఆరోజులని తీసుకురావాలి అంత సందడిగా గడపాలి.. రండి అందరం కలుద్దాము వారానికి ఒక టపా రాద్దాము మన ఊసులు మన కబుర్లు మన అభిప్రాయాలు.. మనం మనంగా మనసున్న నేస్తాలుగా మనసులకి ఊరటనిద్దాము.  
అప్పటి బ్లాగర్లందరు సుజాత గారింట్లో నిడదవోలు మాలతి గారిని కలిసిన శుభ సందర్భం

నన్ను మీ అందరికీ పరిచయం చేసే నేపధ్యంలో బ్లాగర్లందరిని ఒకసారి అలా గుర్తు చేసుకున్నాను అందుకు మీకే కృతజ్ఞతలు వనజా.. మంచి ఆలోచన మంచి స్నేహితులు.. ఉంటే బ్లాగులు బ్లాగర్లు ఏ సోషల్ మీడియా అయినా తులసి వనం .. అని నా అభిప్రాయం.

****** 
Loading...