"ఆపరేషన్ ఎలాగోలా అయిపోతుందే! అసలా విషయం గురించి మాకు బెంగే లేదు కాని ఆ తరువాత రెండు నెలలు నువ్వు పూర్తి విశ్రాంతి తీసుకోవాలి కదా! అప్పుడు నిన్ను చూసేవారెవరు? మేము అదే ఆలోచిస్తున్నాము .. "
నాకు జరిగిన ప్రమాద నిమిత్తం హాస్పిటల్ లో ఉన్నప్పుడు అక్క అన్న మాటలు అవి.
నిజానికి అసలు నేను ఎవరు చూస్తారు ఏంటి .. అన్న ఆలోచన నాకు రాలేదు. (అప్పటికింకా నాకు జరిగిన ప్రమాదం ఏ స్థాయో కూడా తెలీదు శస్త్ర చికిత్స అవసరం అని మాత్రమే చెప్పారు) ఎందుకు రాలేదు అంటే ఏమో మరి, నేను ఇంటికెళ్ళగానే మళ్ళీ రొటీన్ గా నా పని నేను చేసేసుకుంటాను అనుకున్నానో లేక ఎవరి అవసరం నాకు రాదన్న ధీమానో తెలీదు కాని నన్ను చూసుకునేది ఎవరు అన్న ఆలోచన నాకు రాలేదు.
******
అమ్మ.....
ఎంతని చెప్పను? ఎలా చెప్పను తన గొప్పతనం? అందరూ చాలా గొప్పగా ఆర్థ్రంగా చెప్తున్నారు మా అమ్మ ఇలా కష్టపడింది, అలా కష్టపడింది అని నేనే అక్షరాల్లో చెప్పలేకపోతున్నాను మా అమ్మ అమాయకత్వాన్ని, ఆవిడ అలసిన మనసుని.
ఏకాదశి ఉపవాస దీక్షలో ఉన్నా, (నాకు ప్రమాదం జరిగిన రెండోరోజు అంటే అమ్మ నన్ను చూడడానికి వచ్చిన రోజు ఏకాదశి ) చిన్న కూతురికి ఇలా జరిగింది అని తెలిసి, ముందురోజు నన్ను చూడాలనిపించినా అంత రాత్రి కొడుకుకి చెప్పి బాధపెట్టలేక, వింటే కొడుకు బాధపడతాడని, బాధని దిగమింగుకుని రాత్రంతా కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ , ఉదయం నా దగ్గరికి రాగానే కళ్ళనీళ్ళపర్యంతం అవుతూ, "నీకు ఇలా జరగడమేమిటే , నాకు జరిగినా బాగుండేది" అని వల వలా ఏడ్చేసిన అమ్మగురించి నేనెంత చెప్పగలను?
కాస్త ఆవిడ కుదుటపడి మనసు నిమ్మళం చేసుకున్నాక, "అమ్మా! అక్క ఇలా అంది మరి.. " అన్నా నసుగుతూ..నిజానికి అమ్మ నాదగ్గరికి రావాలని కాదు, నాకు తెలుసు ఆవిడకి ఇప్పుడు 80 ఏళ్ళు చేయలేదు. అసలు ఆవిడ అభిప్రాయం ఏంటి అన్నది తెలుస్తుందని, ఇంకా నా వాక్యం పూర్తి కానేలేదు " ఎవరుండమేమిటే పిచ్చిదానా! నేను లేనా, ఆమాత్రం చేయలేనా? ఇప్పుడు నేను చేయలేకపోతే బతికి అనవసరం నువ్వలాంటి దిగుళ్ళేమి పెట్టుకోకు, నేను ఉన్నాను భగవంతుడి దయవల్ల నువ్వు క్షేమంగా ఉన్నావు అంతే చాలు, నేను చేస్తాను ..రెండు నెలలు కాదు ఎన్ని నెలలయినా" అని కాస్త గట్టిగా, కొంచం నిక్కచ్చిగా చెప్పింది. ఇక నా పరిస్థితి చెప్పేదేముంది కళ్ళల్లో ఆనందభాష్పాలు. ఎంత అదృష్టవంతురాలినో కదా నేను... ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను అమ్మకి?
*****
నేను రెండునెలల విశ్రాంతి నిమిత్తం ఇంటికొచ్చిన తరువాత తన కంటిపాపలా చూసుకుంది. అర్థరాత్రి అపరాత్రి అని లేదు, "అమ్మా" అని పిలవడం ఆలశ్యం, "పిలిచావా అమ్మా! ఇదిగో వస్తున్నా!" అంటూ రావడం నా అవసరాలు తీర్చడం.. ఈ రెండు నెలల్లో, నాకు కొన్ని విషయాల్లో ఆవిడపై కోపం వచ్చింది, (అరిపిస్తోంది అని) బాధ కలిగింది(పెద్దావిడ చేయలేకపోతోంది అని) ఆనందం వేసింది (ఇది కావాలి , అని అడిగిన వెంటనే చేసిపెట్టడం) అన్ని వచ్చాయి ఒక్కోసారి రెండు,మూడు రోజులు మాట్లాడని సందర్భాలు ఉన్నాయి , టి వి తదేకంగా చూస్తోంది, బలవంతంగా నేను చూడలేక, తలనెప్పి తెచ్చుకున్నా...(టి వి హాల్‌లోనే ఉంది) ఇన్ని రసాల మధ్య ఆవిడ కి నాకు మధ్య సేవానుబంధం.. ఎలా వర్ణించను ఆవిడ గురించి. చెప్పడానికి ఇదంతా చాలా మాములుగా ఉంటుంది , కాని మనసు అనుభవించిన ఆ ఆనందం మటుకు మాటల్లో చెప్పలేను. ఒక్క మాట.. " మా అమ్మ " అంతే.
ఇప్పుడు చేసింది అని నేను ఆవిడని "మా అమ్మ " అని అనడం లేదు.. ఎప్పుడు నిర్విరామంగా చేస్తూనే ఉంటుంది. కోడళ్ళు వచ్చినా సరే. ఆవిడ 30 లో ఉండగానే నాన్నగారు నలుగురు పిల్లల బాధ్యత ఆవిడకి అప్పగించేసి, దేవుడి దగ్గర పని ఉందని వెళ్ళారు. ఇక అప్పటినుండి ఆవిడ మమ్మల్నందరినీ కంటికి రెప్పలా చూసుకుంది. అన్నయ్య ఢిల్లీలో చదువు, తమ్ముడు పసి పిల్లాడు అవడం వల్ల ఒంటి చేత్తో, ఏమి తెలియని అమాయకత్వంతో (అమాకత్వం ఎలా అంటే రాస్తే పెద్ద గ్రంధం అయిపోతుంది ) సంసారాన్ని అన్ని కష్టాలమధ్య నడిపించింది అని చెప్పొచ్చు. నలుగురిని ఒక తాటిమీదకి తీసుకొచ్చింది.
నాకు ఇంత మంచి కుటుంబం ఇచ్చినందుకు, నాకింతమంది బంధువుల్ని ఇచ్చినందుకు, వీళ్ళందరి మధ్య, నాకు "కాంతమ్మగారి చిన్న కూతురు" అనే గుర్తింపు ఇచ్చినందుకు, ఇప్పటికీ.. ఎప్పటికీ .. ఆవిడకి కృతజ్ఞురాలిగా ఉంటాను.
ఈరోజు మథర్స్ డే..
ఈరోజు మథర్స్ డే..
పొద్దున్నే అమ్మే నాకు ఫోన్ చేసింది "ఎప్పుడూ నువ్వే చెప్పేదానివి మథర్స్ డే శుభాకాంక్షలు ఈరోజు ఇంకా చెప్పలేదు అంటూ... " నిజమే ఎప్పుడూ పొద్దున్నే చేసేసి శుభాకాంక్షలు చెప్పేదాన్ని, నిన్నంతా పాప EAMCET హడావిడిలో మర్చేపోయాను ఇది మే రెండో ఆదివారమని.. అదే చెప్పాను అమ్మతో.. అలా అని శుభాకాంక్షలు చెప్పానా అంటే అప్పుడు కూడా లేదు ఎప్పుడు నీతోనే అమ్మా... నేను నీకెప్పుడు నా శుభాకాంక్షలు వుంటాయి ఈరోజే కాదు అన్నాను.
ఈసారి నేను ఈరోజు ప్రత్యేకంగా ఈ మథర్స్ డే కనుగొన్నవారికి కృతజ్ఞతలు, ఈ మథర్స్ డే కి శుభాకాంక్షలు తెలియజేయాలి .. ఎందుకంటే నాకు ఇదంతా అందరికీ చెప్పగలిగే అవకాశం ఇచ్చినందుకు. అమ్మని అపురూపంగా తలుచుకునేలా చేసినందుకు.
అందరికీ మథర్స్ డే శుభాకాంక్షలు.
మా అమ్మకి వందనం-అక్షరాభివందనం.
*********
పైన అంతా నన్ను కన్నతల్లి గురించి చెప్పి , మీకందరికీ శుభాకాంక్షలు చెప్పాను. కాని నాకు ఇంకో తల్లి ఉంది. మొన్నటిదాకా నాకే తెలియని నేనే గుర్తించలేని నేను కన్న నా తల్లి, మా పాప.
మా పాపలో ఇంకో కోణం ఇది. "ఏనాడయినా అనుకున్నానా కల్లోనయినా.. ఈనాడయినా కలగంటున్నానా" అనుకునేంతగా నాకు తనలోని ఇంకో కోణాన్ని చూపించింది మా పాప. కాఫీ ఎంత ఇష్టంగా పెట్టి ఇస్తుందో, తాగిన గ్లాసులు "లోపలికి తీసుకెళ్ళమ్మా !" అంటే అంత చికాకు పడిపోతుంది, "నాకు చెప్పకమ్మా అలాంటి పనులు " అంటుంది. ఎప్పుడయినా పనమ్మాయి రాకపోతే , "ఒక రెండు ప్లేట్స్ కడిగివ్వమ్మా!" అంటే, కాళ్ళు చిందులు తొక్కేసి ఇల్లంతా ఏకం చేసేసి కాని ఆ పని చేసింది అని అనిపించుకోదు, ఆలాంటి మా పాపలోని మరొ కోణం, అదే ప్రమాద సమయంలో నాకు అన్నం తినిపిచడం, "చేతులు బానే ఉన్నాయి కదా! నేను తింటాను" అంటే "వద్దు నేనే తినిపిస్తాను" అంటూ... ఆపరేషన్ అయి, ఇంటికొచ్చాక.. నా అంత భారికాయానికి "ఎన్నిరోజులయిందో స్నానం చేసి" అంటూ నలుగు పెట్టి స్నానం చేయించడం జుట్టుకి సాంబ్రాణి పొగ.. ఇంకా ఎన్నో చేప్పలేని పనులు, నాకు తల్లి అయిన వైనం.. ఎలా చెప్పగలను , చేస్తున్నందుకు ఆనందపడాలో, చేయించుకుంటున్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితి నాది. నన్ను కళ్ళల్లో పెట్టి చూసుకున్న నా చిట్టి తల్లికి అభినందనలు తెలియజేసే అవకాశం ఇచ్చిన ఈ మథర్స్ డే కి మరోమారు శుభాకాంక్షలు.
*******