2.12.2012

ఇదో(నరక కూపం) ప్రహసనం

ఇది “నేను రాను తల్లో” కొనసాగింపు (కొన ని అలా సాగదీయడమన్న మాట).

అరోజు అంటే 07.11.2011 రోజు పలువురు మిత్రులు, తెలిసిన డాక్టర్లు... హితులు సన్నిహితుల  సూచన ప్రకారం  అక్కడి డాక్టర్లకి  డిస్చార్జ్ అవుతామని మా  నిర్ణయం తెలియపరిచి,  ఒక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి కి వెళ్ళాము (అక్కడ కొత్త టెక్నాలజీ..   కొత్తగా కట్టిన బిల్డింగ్ అని చెప్పడం వల్ల).


వెళ్ళగానే అందరిలాగే ఇక్కడ కూడా నర్స్ వచ్చి.. బి పి టెస్ట్.. ఆతరువాత ఎదో painkiller tablet  అనుకుంట ఇచ్చారు. డాక్టర్ వచ్చి అసలు ఫ్రాక్చర్ ఎలా జరిగింది ఏంటి ?  అన్న వివరాలు కనుక్కుని వెళ్ళారు.. (ఇంకా అడ్మిట్ అవలేదు..అప్పటికి ప్రాసెస్ రన్ అవుతోంది). ఇక ఇక్కడినుండి మొదలయ్యాయి నేను ఊహించని కష్టాలు..  

షాక్ నంబర్ 1:  

నర్స్ వచ్చింది ఎదో ఇంజెక్షన్ ఇవ్వాలంటూ.. రూం కి తలుపువైపు మా ఆంబులెన్స్  తీసుకొచ్చిన డ్రైవర్, అతని పక్కన కాంపౌండరో మరి వాచ్మెన్నో తెలీదు కాని ఉన్నారు .. రూం లోపల నాతో పాటు మరో పేషంట్ వాళ్ళ తాలుకు ఒకతను ఉన్నారు అంటే వాళ్ళందరి ముందు ఇంజెక్షన్ .... చాలా సున్నితంగా .... "వీళ్ళని బయటికి పంపించి  కొంచం డోర్ close  చేయండి" అని...అన్నాను ,  అంతే!!!  అసలు నేనేదో అనకూడని మాట అన్నట్లుగా ... 

"వాళ్ళు వినరండి.. ఇక్కడినుండి ఎవరు వెళ్ళరు.. మీరు ఒక నిముషం  కళ్ళు మూసుకొండి ఇంజెక్షన్ చేసేస్తాను" అని.. (ఇదేమి నరకకూపం ... దేవుడా!!  అనుకున్నా మనసులో )

"నాకిప్పుడు ఇంజెక్షన్ వద్దు ... అడ్మిట్ అయ్యాక నాకు కేటాయించిన రూంలో ఇవ్వండి అని కచ్చితంగా చెప్పేసాను."

అప్పుడా నర్స్ కోపంగా ఆ ఇంజెక్షన్ మా పాప చేతిలో పెట్టేసి "పైన నర్స్ ఉంటుంది అప్పుడు  చేయించుకొండి"  అని అరిచేసి వెళ్ళింది.. 

బయట ఉన్న మా తమ్ముడు...  ఇక్కడి వాతావరణం అదీ చూసి, ఈ ఒక్క రాత్రికి  అక్క సర్దుకుపోతే రేపు వేరేచోటికి తీసుకెళ్దాము.. ఇక్కడొద్దు అని మా మేనల్లుడితో,  మా అక్క వాళ్ళ బాబుతో అన్నాడుట.. అదే సమయంలో మా పాప కళ్ళ నీళ్ళతో "డాడీ!!... మావయ్యా!! ... అమ్మ ఇక్కడొద్దు  ... ఇక్కడ సరిగ్గా చూసుకోరు"  అని చెప్పేసింది.  

నాతో పాటు  శ్రీవారు, పాప, బాబు, మావారి మేనల్లుడు (మా ఆడపడుచు కొడుకు)  తమ్ముడు, మరదలు , మరదలి తమ్ముడు మా అక్క వాళ్ళ బాబు, ఆ బాబు ఫ్రండ్ ఉన్నారు....


ఇక్కడి అడ్మిట్ ప్రాసెస్ అంతా ముగించేసి... నన్ను పైకి తీసుకెళ్ళమని చెప్పారు .. పైకి ఒక పావుగంట తరువాత తీసుకువెళ్ళారు... 

షాక్ నంబర్ 2:: 

అదో లేడీస్ వార్డ్.. మగవాళ్ళు రావడం నిషేధం కాసేపు పరామర్శించో, పలకరించో వెళ్ళచ్చు అంతే.. దాదాపుగా ఒక 100 పడకలు ఉన్నాయనుకుంట ఎక్కడ మూలకి తీసుకెళ్ళి నా పడకని కేటాయించారు. ఇందాక చెప్పినవాళ్ళంతా నా చుట్టూ ఉన్నారు వాళ్ళతో జోక్స్,  కబుర్లు నాకు పెద్దగా బాధ అనిపించలేదు ఎందుకంటే .. బయటికి వస్తూనే తమ్ముడు   "అక్కా ! ఈ ఒక్క రాత్రే .. రేపు వేరే చోటుకు వెళ్దాము"  అన్నాడు కాబట్టి...  సరే,  అడ్జెస్ట్ అయిపోదాము అని అనుకోడవల్ల.. నా మంచం చుట్టూ వీళ్ళంతా ఉండి కబుర్లు చెప్పడంవల్ల  అయితే ఏంటి.. సంతోషంగా ఉంది.. ముందు జరిగిన విషయం (ఇంజెక్షన్ ప్రహసనం) మరిచిపోయెంతగా ... 

రాత్రి 11 అయ్యింది ..మా కుటుంబ సభ్యులు  ఒక్కొక్కరు ఇక ఇంటికి వెళ్దాము అని అనుకుంటున్నారు .. ఈలోపులోనే మా మేనల్లుడు కళ్ళ నిండా నీళ్ళతో "అత్తా మీరిక్కడ వద్దు మనం వెళ్ళిపోదాము.. మిమ్మల్ని ఇక్కడ ఉండనివ్వను" అని ... మేనల్లుడి పక్కనే మా బాబు, పాప కూడా " అమ్మా! నిన్నిలా ఇక్కడ చూడలేకపోతున్నాము వద్దమ్మా..  మావయ్యా ప్లీజ్ ఇప్పుడే అమ్మని మార్చేద్దాము ఇక్కడినుండి"  అని.. నేను వాళ్ళని ఓదార్చి "ఈ ఒక్క రాత్రే కదా!"  అని బుజ్జగించి ఇంటికి పంపాను..  అందరూ వెళ్ళారు...  నేను,  మా పాప.. పాప పడుకోడానికంటూ వేరే ఏ సదుపాయము లేదు.. పక్కన స్టూల్ మీద కూర్చుంది.. పరిస్థితి చూసి "నా పక్కన పడుకో "  అని జరిగాను.. ఉహు! పాప ససేమిరా అంది "జాగారం చేస్తాను అందుకే బుక్స్ తెచ్చుకున్నా" అంది.. నవ్వుకున్నా, నిద్ర వస్తే అప్పుడు చూడొచ్చులే అనుకుని సైలెంట్ అయ్యాను. ఈలోపులో వాచ్మెన్లు అనుకుంటా కఱ్ఱలు పట్టుకుని వచ్చారు పేషంట్ తాలుకు మనుషులు పక్కన పడుకున్నారా..  లేదా  వేరే పేషంట్ తాలుకూ ఖాళీగా ఉన్న మంచాలు వాడుతున్నారా చూడడానికి.. చెప్పడం కాదు అలా ఉన్నవాళ్ళని కఱ్ఱలతో కొడుతున్నారు..(జైల్లో ఖైదిలని కొట్టినట్లు)  మై గాడ్!!  అనుకున్నా.. అమ్మో!!  పాప పరిస్థితి ఏంటి.. నాకు మగతగా నిద్ర పట్టినా దానికి సేఫ్టీ లేదు ఇక్కడ  భయం వేసింది....తెల్లారేదాక నేను మెలుకువగానే ఉందామని నిర్ణయించేసుకున్నా.. పాప ఏమాత్రం ఆ వాతావరణానికి అడ్జెస్ట్ అవలేకపోతోంది.. ఎదో ఒకటి మాట్లాడాలి కాబట్టి , ఇద్దరం పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఒక అరగంట గడిపాము.. 

ఇంతలో నాకు  కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన అవసరం  వచ్చింది.. నెమ్మదిగా పాపతో "బెడ్‌పాన్ అడిగి తీసుకు రా నాన్నా!! "  అని చెప్పాను (అక్కడ ఇంతకుముందు  కార్పోరేట్  హస్పిటల్లో లా ఇక్కడ ఈ సేవలు  చేసేవాళ్ళు అందుబాటులో  లేరని ముందే చెప్పడం వల్ల పాపకే చెప్పాను). పాప వెళ్ళి అక్కడ ఉన్న నర్స్ ని అడిగింది.. " అలాంటివి ఇక్కడ ఉండవు మీరే తెచ్చుకోవాలి.. లేకపోతే నువ్వె ఎత్తుకు తీసుకెళ్ళు మీ అమ్మని"  అని దురుసుగా చెప్పిందిట  .. అది బిక్కమొహం వేసి చెప్పింది ఈ విషయం.. ఏమి చెయ్యాలి ఇలా ఎలా ఉండాలి తెల్లారేదాక? పాపకి సేఫ్టీ లేదు, నాకు సంభందించి  ఏవిధమైన అవసరం తీరడం లేదు ఎలా ఇక్కడ? వెంటనే అక్కడి నర్స్ ని పిలిపించి "రాత్రి డిస్చార్జ్ ప్రాసెస్ ఉందా?" అని అడిగాను.. మీరు సంతకం పెట్టి వెళ్ళచ్చు అని చెప్పింది ఆవిడ.. "హమ్మయ్య బ్రతుకు జీవుడా! " అనుకుని.. శ్రీవారికి, తమ్ముడికి ఫోన్ చేసాను.. "ఎంత ఖర్చు అయినా పర్వాలేదు.. ఆంబులెన్స్ తెప్పించండి... ఇక్కడినుండి వెళ్ళిపోదాము"  ఇక్కడ  నా పరిస్థితి ఇది అని వివరించి చెప్పాను. 

బయట ఉన్న వాళ్ళకి నేను ఎంత చెప్పినా   ఇక్కడి పరిస్థితి అర్థం కాకపోవడంతో ....  "ఈరోజుకి ఇంటికి వచ్చేస్తాను పొద్దున్నే ఎదో ఒక హాస్పిటల్‌కి వెళ్దాము కాని ఈ నరక కూపంలో నేనుండను " అని వాళ్ళు ఒక రేంజ్ లో విసుక్కున్నా...  తెగేసి చెప్పేసాను.. "ఆంబులెన్స్ లో స్ట్రెచర్ ఉండదక్కా!  నువ్వు ఇంటికి ఎలా వస్తావు మా ఇంట్లొ అంటే  మెట్లు ఎక్కలేవు.. మీ ఇంటికంటే మెట్లు దిగలేవు  అర్థం చేసుకో ..ఈ ఒక్కరాత్రికి ఓపిక పట్టు"  అని తమ్ముడు బయట ఉండి నన్ను బతిమలాడడం..  "లోపల నా పరిస్థితి ఓపిక పట్టేది కాదురా! "  అని నేను.. మా ఇద్దరి వాదులాట తీవ్రస్థాయిలోకి వెళ్ళింది.. అంత జరిగిన ఒక పావుగంటకి ఆంబులెన్స్ తో మా తమ్ముడు వచ్చాడు .. పైన ఒక సిగ్నేచర్ పడేసి వచ్చేసాము కిందకి నేను,  మా పాప.. తమ్ముడు సీరియస్ గా/కోపంగా  "ఇదిగో అక్కా లక్షలు ఖర్చయినా పర్వాలేదు చాయిస్ నీదే .. ఏ  హాస్పిటల్ చెప్పు.."  అని ,   "నీ ఇష్టం ఇక్కడినుండి బయట పడితే చాలు"   అని నేను. అలా ఇద్దరం కాసేపు మాట్లాడుకుని పక్కనే నేను చిన్నప్పటినుండి చదువుకుని నా బాల్యాన్ని గడిపిన స్కూల్ కి సంభందించిన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను.  ఇంటికి దగ్గర.. నడుచుకుంటూ వచ్చే దూరం అన్నిటికన్నా ముఖ్యం నాకంటూ స్పెషల్ రూం.. పాపకి సేఫ్టీ .. 

అలా  ఇంత ప్రహసనం తరువాత మేమా నరకకూపం నుండి బయటపడ్డాము. "హమ్మయ్య!! "  అని పాప ఊపిరి పీల్చుకుని ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది.  అప్పటికి టైం 2.30 am.   
******
PS: మావారు, మేనల్లుడు, మాబాబు ఇంటికి వెళ్ళలేదు బాధగా ఎదో ఒకటి చేయాలి అని ఆ నరక కూపం  కిందే ఉన్నారన్న సంగతి నాకు తెలీదు వాళ్ళు చెప్పేదాకా..      
Loading...