5.13.2014

మనం ఈదుతున్నాము ఓ చెంచాడు భవసాగరం..

"లక్ష్మీ బ్రష్ ఏది? పేస్ట్ పెట్టావా?"

హు! మొదలయినట్లుంది భాగోతం, లేచినట్లున్నారు.. "ఆ వస్తున్నానండీ! ఇదిగో తెస్తున్నా"

"తెల్లవారుజామునుండి లేపుతున్నా! ఇప్పటికి లేచారన్నమాట, లేస్తే ఇక ఆగరుగా కాళ్ళ కింద నిప్పులు పోసేస్తారు.. అబ్బా! ఏమి మగవాళ్ళో ఏమో! సన్యాసంలో కలిసిపోతే బాగుండనిపిస్తొంది ఈ భవ సాగరం ఈదలేక, హు!! అయినా చేసుకొన్న వాళ్ళకి చేసుకొన్నంత అని , నాకు తప్పుతుందా ఇదిగొండి! బ్రష్! బ్రష్ మీద పేస్టూ.. దీనికి కూడా బార్య రావాలి, పని చేసుకొనివ్వరు పెట్టి పుట్టారు, ఈ పిల్లలు లేచారో లేదో, వీళ్ళొక్కళ్ళు రాక్షషులు నా ప్రాణానికి".

"అబ్బా! బుద్ధి పొరపాటై అడిగా, మొదలెట్టావా దండకం.. అయినా పొద్దున్నే పిల్లల్నెందుకు తిడతావు లక్ష్మీ? పడుకోనిద్దూ కాసేపు.."

"ఆ! మీకే ఎన్నయినా చెప్తారు, లేవడం, తయారవడం టింగు రంగా అంటూ ఆఫిసుకెళ్ళడం, మీకెమి తెలుస్తాయి మా ఆడవాళ్ళ బాధలు, ఇప్పుడు ఈ వెధవలు లేవకపోతే ఎప్పుడయ్యేను నా పనులు? నేనెప్పుడెళ్ళను ఆఫీసుకి? అయినా నేనీ గొడ్డు చాకిరి చెయ్యలేకపొతున్నాను, ఓ వారం రోజులు సెలవు పెట్టి అమ్మావాళ్ళింటికి వెళ్ళిపోతాను".

"అమ్మో బార్యమణీ!! అంత మాటనకు, నిను చూడక నేనుండలేను.... సరె ! కాని కాస్త కాఫీ ఇవ్వు, స్నానానికి వేణ్ణీళ్ళు పెట్టావా? ఆఫీసు కి టైం అయిపోతొంది ఓ పక్క!"

"అవుతుంది అవకేమి చేస్తుంది, బారెడు పొద్దెక్కాక లేచారు, పైగా ఏదో ప్రేమ ఉన్నట్లు , విరహ గీతాలొకటి.. నన్ను చూడక ఉండలేరా, నేను వెనకాల పడి పనులు చేయకపోతే ఉండలేరా? అయినా నాదే తప్పులెండి పెళ్ళయిన కొత్తలో మీకెందుకండీ శ్రమ అంటూ, అన్ని పనులు నేను నెత్తిన వేసుకొన్నాను చూడండీ! అది నా తప్పు. ఎవరి కర్మ కి ఎవరు బాధ్యులు లెండి, సుఖపడడానికి కూడ ప్రాప్తం ఉండాలి, ఉండండి కాఫీ తెస్తాను".
ఇంకా ఎక్కువ మాట్లాడితే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల కధలన్నీ మొదలు పెడ్తారు ఈ ఆడవాళ్ళు అని మిన్నకున్నాడు శ్రీనివాస్.
***
శ్రీనివాస్, సుబ్బలక్ష్ములకు పెళ్ళి అయి 10 యేళ్ళయ్యింది . శ్రీనివాస్ బ్యాంక్ ఉద్యోగి అయితే, సుబ్బలక్ష్మి ఓ ప్రైవేటు కార్పొరేట్ సంస్థ లో ఉద్యోగిని.. ఇద్దరు పిల్లలు. చక్కటి సంసారం. ఇద్దరిది అన్యోన్య దాంపత్యం. అరమరికలు లేని సంసారం.

మొదట్లో బాగానే ఉండేది, భర్త కి కావాల్సినవన్నీ దగ్గరుండి చూసుకొనేది, రాను రాను మరి వయసు ప్రభావమో,ఇంకోటో తెలియదు కాని లేని అసహయత, అంతా తనే చెయ్యాలి, అన్నీ తనే చూసుకోవాలి, అనే అశక్తతో, ఇంకోటో కాని ఈ మధ్య కాస్త చిరాకు ఎక్కువయ్యింది, అందుకే మాట్లాడితే, ఓ 10 రోజులు పుట్టిల్లు అంటుంది. పుట్టింటికని ఒకటికి నాలుగు సార్లు అంటుంది కాని, తనకు మటుకు తెలీదా ? పుట్టింట్లో తన పరిస్థితి, పెళ్ళయిన ఆడపిల్ల పుట్టింటి కి ఇక చుట్టంలా వెళ్ళాల్సిందే , అందుకే అన్నారు అలిగి అమ్మంటికి, చెడి చెల్లెలింటికి వెళ్ళకూడదని. ఇప్పుడీయనకి, ఈయన చెప్పే పనులకి అలిగి అమ్మ ఇంటికి వెళ్తే ... "ప్చ్! కుదరని పనిలే!" అయినా పెళ్ళికాకముందు ఎంత హాయి గా ఉండేది, అమ్మ చేతి గోరుముద్దలు, సుప్రభాతాల మేలుకొలుపులు, ఆ రోజులే వేరు.
***
"మొగాడికి మొగుళ్ళా పడుకొంటావు, ఓ శుక్రవారం లేదు, ఓ మంగళవారం లేదు, అయినా ఆడపిల్లలికి అంతంత సేపు ఎలా పడుకోబుద్దవుతుందే?? మా కాలంలో మేము తెల్లవారు ఝామున లేచి, కల్లాపి జల్లి ముగ్గులెట్టేవాళ్ళము, ఇప్పుడేముంది? అంతా సుద్దముక్కల భాగొతమాయే".. ఓ కల్లాపి జల్లడమా ముగ్గులు పెట్టుకోవడామా? లక్ష్మీ దేవి రమ్మంటే ఎందుకొస్తుందీ?? కుంచమంత కూతురుంటే కూడు కూడా మంచం దగ్గరికే వస్తుందంటారు. తాడిలా ఉన్నావు, కంచం నుండి , మంచం దాకా అన్నీ అమరుస్తే కాని, నీకు తెల్లారదు, .. లే! రేపొద్దున్న పెళ్ళి అయితే ఎలాగో ఏమిటో, ఇంత అరుస్తున్నా , నా కంఠ శోషే కాని, కనీసం కదలవు.
****

అలా అమ్మ మురిపంగా తిడుతూ లేపే సుప్రభాతంతో హాయిగా ఆఫీసు కి వెళ్ళి వచ్చేదాన్ని. ప్చ్! ఇప్పుడు మరీ తెల్లవారు ఝాము కన్నా, ముందుగానే లేవాల్సివస్తోంది. ఈయనకి అన్నీ అమర్చేసరికే ప్రాణం అలసిపోతోంది, అమ్మా! ఛస్తున్నాననమ్మా తల్లీ! ఈ మొగుడితో ఏ అదృష్టమో లేదా అదృష్టదేవతో వచ్చి తన పరిస్థితి మార్చేస్తే బాగుండును. "నను బ్రోవమని చెప్పవే...."అనుకొంటూ ఆ ఆలోచనల్లోనే .... మగతగా నిద్ర పట్టింది లక్ష్మి కి, నిద్రలో ఎక్కడికో దూరంగా పయనం అహా! ఏంటది? దూరంగా .... పాలకడలిలో శేషతల్పంపైన పవళించిన విష్ణు మూర్తి, పాదాలొత్తుతూ అమ్మవారు లక్ష్మీదేవి..తన గురించే ఏదో మాట్లాడుకొంటున్నారు, ఏంటి వీళ్ళిద్దరి మధ్య తన ప్రస్తావన...
***
పాలకడలి శేషతల్పం:

"స్వామీ ఏమిటా ధీర్ఘాలోచన"

"స్వామీ ఉలకరు, పలకరేమి స్వామీ"?

"నిరంతరం ఆ పరికరము పట్టుకొని తిరుగుచున్నారు, నాకన్నా అదే ఎక్కువయినదా స్వామీ, ఏమది? నా పని ఇలా మీ పాదసేవలో తరించుటయేనా ..నాధా! ... నాధా! నాధా!"

"అబ్బా! ఏమిటి దేవి ఆ హాస్యం? కాలిపై చూడు గోటి గుర్తులేలా భాదించుచున్నవో!? పిలిచిన పలకనా?"

"పిలిచి పిలిచి అలసితిని నాధా! మీరా పరికముతో పరవశించుచున్నారు, ఏమా పరికరం! "

"ఓహ్! ఇదా దేవి నా భక్తుడొకడు ఇచ్చినాడు, దీనిలో భక్తుల కోరికలు చూచుచూ, అచ్చిక బుచ్చికలాడుతున్నా."

"అచ్చిక బుచ్చికలా? అదేమి స్వామి కొత్తగా ఉన్నది."

"అదా అదీ! ఏమియునూ లేదు కాని, ఎందుకు పిలిచితివో చెప్పుము దేవి!"

"ముందు ఆ మాటకి భావం చెప్పండి నాధా".

"అచ్చిక బుచ్చికలనగా ఏమియునూ లేదు దేవి ! ముచ్చట్లు, ప్రత్యక్షంగా మనముందు లేని వారితో ముచ్చట్లు చెప్పుకొనుట అన్నమాట. "

"ఇంతకీ తమరి అచ్చిక బుచ్చికలెవరితో స్వామీ? ద్వాపరయుగంలో 16 వేల మంది గోపికలతోనా? కలియుగంలో శ్రీదేవి తోనా".

"ఎంతమాట దేవి! పక్కన నీవుండగా...."

"ఊ! మాదేముందిలెండి స్వామీ! .. నిత్యం పాదసేవయే పరమావధిగా భావించేడివాళ్ళము, అదియట్లుంచి, అక్కడ భూలోకంలో నా భక్తురాలు నన్ను దీనంగా అభ్యర్ధించుచున్నది స్వామీ, పతి తో వేగలేక తరుణోపాయం చెప్పమని, కొంచం అటువైపు దృష్టి సారించినచో..."

"ఎమది దేవి! నీ భక్తురాలికంత కష్టం వచ్చినదా? ఏమైనదామెకి, భర్త తాగుబోతా?, తిరుగుబోతా? లేక మందమతా?"

"అవి ఏమియునూ కావు స్వామీ! మీరు, మీ దివ్యదృష్టి అటువైపు సారించుడు, ఏమైననూ నన్ను వేడుకొన్న నా భక్తురాలిని నేను కాపాడవలెను, ఇది నా చిరు కోరిక స్వామీ!"

"తప్పకుండా దేవి ! మీరజాలగలనా నీ ఆనతి"

"పరిహాసములకిది వేళ కాదు నాధా!"

"దేవి! నీ భక్తురాలి కష్టమేమి అంత పెద్ద కష్టంగా అగుపించుట లేదు. అయినను నీవడిగితివి కాన .. చూచెదము, కాని ఇది మా పని కాదే?.. విధాత సృష్టి ఇది, పద దేవి! బ్రహ్మదేవుల వారినిఒకసారి చూచినట్లూ ఉంటుంది, కాస్త నీ సమస్యను పరిష్కరించే మార్గము తెలుస్తుంది."

బ్రహ్మలోకం:

పరవశంగా సరస్వతీ దేవి వీణ గానాన్ని వినాల్సిన, బ్రహ్మ దేవుడు ఒళ్ళో ఉన్న పరికరంతో (అంకోపరి)కుస్తీ పడుతూ, తనలో తను నవ్వుకొంటూ ....

"స్వామీ! అతిధులు వేంచేయుచున్నారు" అన్న సరస్వతిదేవి మాటకు తల ఎత్తి చూసిన బ్రహ్మదెవుడు, దూరం నుండి వస్తున్న లక్ష్మీ సమేత విష్ణుదేవుని చూచి సాదరంగాఆహ్వానించాడు. "చిరకాలదర్శనం! ఊరక రారు, మహానుభావులు అంతా కుశలమేనా?" అంటూ..

ఆడవారిద్దరూ వారి ఆభరణాల ముచ్చట్లలో మునిగిపోగా, బ్రహ్మ అడిగిన ప్రశ్నకి సమాధానమిస్తూనే, తాము వచ్చిన విషయం ఏకరువు పెట్టాడు విష్ణు మూర్తి.

"ఊ! కొంచం జఠిలమైన సమస్యే. ఏమి చేయుదము?" పక్కన ఈ సమస్యా పరిష్కారం ఎమిటా అని, చేరిన అతివలను చూసి నవ్వుచూ, "ఓ పని చేయుదమా? మగవారు తమ గురించి ఏమనుకొనుచున్నారో మరియూ వారి గుణ గణాలు మొ! ముందుగానే ఆడువారికి తెలిసేలా చేస్తే...ఉపయోగ కరంగా," ఈ మగవాళ్ళతో పడలేకపోతున్నాము బాబోయ్!" అన్న బాధ కొంతవరకూ మటుమాయం చేయవచ్చునేమో..."సాలోచనగా అన్నాడు విధాత.

"ఇది బహు బాగుగా యున్నది. ఒకసారి మానవులపై ప్రయోగించి చూచెదము! ముందుగా వివాహము కాని జంటలపై ప్రయోగించేదము, వివాహము అయిన వారిపై ప్రయోగించినచో, విడాకుల ప్రమాదం గోచరించుచున్నది. " అన్నాడు విష్ణు మూర్తి.

"అయినచో, పదండీ భూలోకంలోని సంజీవయ్య ఉద్యానవనమునకు, అక్కడ లెక్కలేని ప్రేమ జంటలు మనకు అగుపడగలరు". అమ్మవారు లక్ష్మి దేవి.

"దేవి! మనము తరువాత విహారం చేసేదము, భూలోకమునకు పోవలెనన్న నీ కోరికను నేను గమనించితిని కాని,చేతిలో ఈ పరికరములుండగా ఈ ప్రయోగంకొరకై మనమెళ్ళడమెందులకు?" అంటూ పరికరంలోనే ఉద్యాన వనంలోని ప్రేమ జంటలను ఆహ్వానించాడు విష్ణు మూర్తి.

విధాత కూడా తన ప్రయోగానికి ఉపక్రమించినవాడై, చాలా ఆసక్తి కనబరుస్తూ, భూలోకం వైపు దృష్టి సారించాడు, ఆ వెనుక అమ్మవార్లు లక్ష్మి సరస్వతులు కూడా..
*****
భూలోకంలో ప్రేమికుల పార్క్:

"రాజా! ఇంకెన్నాళ్ళు ఇలా పార్కుల చుట్టూ తిరగడం, మా నాన్న నాకు వేరే సంభందాలు చూస్తున్నాడు, ఎప్పుడూ ఏదో ఒక వంక చెప్పి నెట్టుకొస్తున్నా, మనము పెళ్ళి చేసుకొందామిక ఇప్పటికే ఆరు నెలలయ్యింది".

"అవును రాణి! చేసుకొందాము, రేపే మా అమ్మా వాళ్ళతో మాట్లాడి, మీ ఇంటి వచ్చే ఏర్పాట్లు చేస్తాను."

"అబ్బా! నువ్వెంత మంచివాడివి రాజా! నా మనసుని అర్ధం చేసుకొన్నావు, మన ప్రేమ సఫలం కాబోతున్నందుకు, నాకెంత ఆనందంగా ఉందో, చూడు! నా కళ్ళనుండి ఆనందభాష్పాలురాలుతున్నాయి, మనసు మూగబోతోంది, మాటలు కరువయ్యాయి".

" అబ్బా! ఈమె గొలేంటో, ఇప్పటికే స్నేహితులకిచ్చిన గడువైపోయింది, ఎంట్రా! ఇంకా లైన్లో పడలేదా అంటూ వాళ్ళు గోల, ఇటు ఈమేమో, ఆనందభాష్పాలు అంటూ భారి సినిమా డైలాగులు, అమ్మేమో, మీ మావయ్య బోల్డు కట్నం ఇస్తానంటున్నాడు, నువ్వా సుందరినే చేసుకోవాలి అని పొద్దున్నే చెప్పింది, స్నేహితుల పందెం, అమ్మ కట్నం గోల, ఇక్కడ ఈమే ఆనందబాష్పాల గోల, ఎంటో ఏది వదులుకోవాలో, ఏదో సరదాగా ప్రేమిద్దామని వస్తే పెళ్ళి దాకా తీసుకొస్తోంది ఈ రాణి"..

బ్రహ్మ దేవుడి ప్రయోగం వల్ల , అతను మనసులో అనుకొంటున్న మాటలు ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క అక్షరం పదాలుగా , ఆపై వాక్యాలుగా స్పృష్టం గా వినిపించసాగాయి. ఒక్కసారిగా తను కన్న కలలన్నీ ఎవరో కూల్చేస్తున్నట్లుగా అనిపించి, బాధతో తనముందున్న ప్రేమికుడిపై భధ్రకాళీ లా విరుచుకుపడింది రాణి.

"ఏయ్ రాణి ! ఏమి చేస్తున్నావు?? ఏంటి ఆనందభాష్పాలోస్తే ఇలా కొడ్తారా? , ఆగు ! ఆపు! ప్లీజ్ ఎందుకు కొడ్తున్నావు? నేనేమన్నాను నిన్ను?....."
***
"ఇక్కడ మీ ప్రయోగం సఫలం కాలేదు స్వామీ! అలా మందిరం వైపు వెళ్ళెదము , ప్రయోగం పరిచయం కాని వారిపై మన్మధుడిని పిలిపించి, ఆ మధనుడి శరం విడువమనెదము. అప్పుడు వారిరువురు స్వఛ్చమైన ప్రేమలో తెలియాడుదురు" అంది సరస్వతీ దేవి, బ్రహ్మ వైపు చూచుచూ.

"లెస్స పలికితివి దేవి! అటులనే గావించెద"
***

గుడి ప్రాంగణం:

"ఏయ్! చూడు ఎంత బాగున్నాడో! చేసుకొంటే అలాంటి అందమైన వాడినే చేసుకొవాలి, అబ్బ నా కలల రాకుమారుడిలా ఉన్నాడే అతను .. పద, పద, ప్రదక్షణాలవ్వగానే, పలకరిద్దాము, నాలో ఏదో జలదరింపు కలుగుతోంది. తొలి వలపు అంటే ఇదేనేమో" అంది వాణి తన స్నేహితురాలు వసుధ తో.

"అవును చాలా అందంగా , హుందాగా ఉన్నాడు, నీకు సరి జోడే, పద వెళ్ళి పలకరిద్దాము". అంది వసుధ

"హాయ్! ఐ యాం వాణి, గ్లాడ్ టు మీట్ యు!".

మంచి ఫిగర్,రాత్రి తను హోటల్లో ఎంజాయ్ చేసినదానికన్నా సుపర్ గా ఉంది, తనే వచ్చి పలకరిస్తొంది కదా! తొందరగానే పడేట్లుంది, చూద్దాము! నెమ్మదిగా దారిలోకి తీసుకు రావాలి , ముందుగా పలకరించేద్దాము. తనలో తను అనుకొంటూ..

"హాయ్! ఐ యాం వేణు!". పలకరించాడు వేణు.

ఇంకా పూర్తిగా మాటలు పూర్తికాలేదు, విస, విసా అక్కడినుండి వెళ్ళిపోయింది వాణి ప్రత్యుత్తరమివ్వకుండా, బ్రహ్మదేవుని ప్రయోగ ఫలితమది.
***

"స్వామీ! భూలోకంలో! ప్రేమకి విలువలేకున్నది , ఇది యేమి కలి కాలం? ఎవరునూ పెళ్ళి సంగతులు మాట్లాడుట లేదు, ఈ ప్రయోగమేదో వికటించుచున్నది, ఏమి చేయుదము?? మార్పులేమన్నా చేసినచో ఫలితం కలుగునేమో ?" అంది అమ్మవారు లక్ష్మీ దేవి.

"అవును దేవి! నాకుయునూ అటులనే అనిపించుచున్నది. ఓ పని చేయుదము! మగవారు పని చేయునట్లూ, ఆడువారు ఇంట్లో, మగవారివలే సేవలందుకొనునట్లు చేసినచో, తరువాత మగవారికి , వీరు పడు కష్టములు తెలుసుకొని, ముందు, ముందు జాగూరకతో ఉండేదరు ఎమందురు బ్రహ్మదేవా? " అన్న విష్ణుదేవుని మాటలకు తన అంగీకరం తెలిపెను బ్రహ్మ.

"ఎవరిపైనో ఎందులకు నాధా! నా భక్తురాలు సుబ్బలక్ష్మి పైన ప్రయోగించేదము." తన భక్తురాలి ఆవేదన తీర్చవలెనన్న/తీరుతుందన్న ఆనందంతో అన్నది లక్ష్మీ దేవి.
***

"ఎవండోయి! శ్రీమతిగారు లేవండోయి పొద్దెక్కింది" అన్న మాటలకి ఉలిక్కిపడి లేచింది లక్ష్మి .

"అమ్మో!ఆఫీసు టైం అయిపోతొంది అని, లేచేసరికి, ఎదురుగుండా కాఫీ కప్ తో తన శ్రీనివాసులుంగారు.

"అబ్బా! మీరెంత మంచివారండీ"

" ఈరోజునుండీ అన్నీ నేనే చేస్తాను", పద బ్రష్ చేసుకొందూ గాని, ఇదిగో బ్రష్, పేస్ట్, వెళ్ళు నువ్వొచ్చేసరికి పిల్లల్ని లేపి వాళ్ళని స్కూళ్ళకి రెడీ చేస్తాను" .

"ఏంటి మీరేనా? కలయా? నిజమా? మీరు నా పతి, మై హజ్బండ్ నాకు పని చేసి పెట్టడమా.. నాకెంత ఆనందంగా ఉందో!. అయినా అన్నిపనులు మీరెందుకండీ ? సరె అన్నీ మీరే చెయ్యనక్కర్లేదు, నేను చేస్తుంటే, పనికి పది పనులు పెట్టకుండా , మీరు మధ్య మధ్యలో కాస్త ఆసరగా ఉంటే చాలు. " తన అదృష్టానికి మురిసిపోతూ , ఎంతో మురిపెంగా భర్తని చూసుకొంటూ చెప్పింది సుబ్బలక్ష్మి.

*****

"ఏయ్! లక్ష్మీ! లక్ష్మీ! ఏంటా మొద్దు నిద్ర! ఎంత ఆదివారమైతే మటుకు, ఇంట్లో మొగుడూ పిల్లలు ఉన్నారు , ఏమన్నా చేసిపెడ్దాము అన్న ఆలోచన లేకుండా.. లే! లే! సాయంత్రం నాలుగవుతోంది, కాస్త వేడి వేడి గా, పకోడిలు వెయ్యి, అదిగో చూడు ! పనమ్మాయి వచ్చింది, కాస్త చూడు".

ఉలిక్కిపడి లేచింది లక్ష్మి! "ఏంటి భర్త అరుపుల్లా ఉన్నాయి, తనింతవరకు నిద్రలో ఉందా? అంటే లక్ష్మీ దేవి, బ్రహ్మదేవుడు, పార్కులు, అన్నిటికన్నా ముఖ్యం, భర్త, కాఫీ ఇవన్నీ కలా? ప్చ్! కలేనా? "

"అయినా నా పిచ్చి కాని, ఇలాంటి మార్పులు మాత్రం మగాణ్ణి మార్చుతాయా? ఈ సంసార సాగరం ఇలా సాగాల్సిందే, ఇందులోనే ఆనందం ఉందని , ఆడవాళ్ళు మురిసిపోవాల్సిందే ఈ చెంచాడు భవసాగరానికి మళ్ళీ ప్రయోగాలొకటి" అనుకొని నీర్సంగా నిట్టూర్చింది.

"లక్ష్మీ! లక్ష్మీ! " భర్త పిలుపు.. కాదు కాదు అరుపు..

"ఆ! వస్తున్నానండి ఎందుకలా అరుస్తున్నారూ.... "

"కాస్త ఆ ఫాన్ ఇటువైపు తిప్పుదూ.., వేడి వేడి పకోడీలు, కాఫి గట్రా..."

మళ్ళీ మొదలు...


కొత్త పాళీ గారు, LED మహిమల కథ రాయండి ... అన్నదానికి స్ఫూర్తి ఈ కథ.

5.07.2014

పెళ్ళిపుస్తకం


ముందు మాట 

ఈ నవల మొత్తం హిందూ సాంప్రదాయమైన వివాహ వ్యవస్థ గురించి విపులంగా చెప్పాలనే సదుద్ధేశ్యంతో రాయడం జరిగింది.

ముఖ్యంగా మన పూర్వకాలంలో ఐదు రోజుల పెళ్ళిళ్ళని, పదహారోజుల పండగని ఎంతో వేడుకగా చేసుకునేవారు.. నేటి యువతీ యువకులది  ఉడుకు రక్తం.. వీరి దూకుడు తత్వంతో జీవితం వేగవంతమైన కారు ప్రయాణం లా తయారయింది.  ఈ ప్రయాణంలో నైతిక విలువలు కారు చక్రాలకిందపడి నలిగిపోతున్నాయి. ప్రయాణం చేయడమే కాని డ్రైవింగ్ నియమాలు, నిబంధనలతో వీరికి అవసరం లేదు

అలాంటి ఈ తరంలో  ఒక్కరోజు పెళ్ళే గగనమయిపోయింది. చేసుకున్నా.. సహనం లేక, యాంత్రిక, సాంకేతిక సుఖాలకు అలవాటు పడిపోయి ఎక్కువ సేపు కూర్చో డం ఇష్టం లేక .. మంగళ సూత్రం కట్టేస్తే చాలు పెళ్ళి అయిపోతుంది అన్న భ్రమలో ఉండి తు. తు .మంత్రంగా చేయించేస్తున్నారు. వీటి అన్నిటితో పాటు ప్రేమ వివాహాలు, పెద్దలు ఒప్పుకోలేదని సంతకాల పెళ్ళిళ్ళు ఎక్కువయిపోయాయి. అదీ కాకపోతే  ఏ ఆర్య సమాజ్ అంటారు .. ఇవన్ని దృష్టిలో పెట్టుకుని అసలు మన వివాహ పద్ధతి, వాటి విధి విధానాలు.. మంత్రాలు, తెలిసినంతవరకు వాటి అర్థాలు అన్ని కలగలిపి ఒకచోట కూర్చి పేర్చి మీ అందరికీ  ఇద్దామనే చిరు ప్రయత్నమే ఈ నవల.

ఇకపోతే ఇందులోని చాలా వరకూ మంత్రాలు వాటి అర్థాలు  అంతర్జాల  సహాయంతోను ,  మా ఇంటి దగ్గర్లోని దేవాలయ పూజారుల ద్వారా మరియూ వివాహ వేడుకలు జరిపించే సేవా సంస్థల బ్రహ్మం గార్ల ద్వారా తెలుసుకుని వ్రాయబడ్డవే..

-రమణి రాచపూడి

******


"ఏమి చేద్దాం?"
"ఏమి చేద్దాం?"
"నువ్వేదంటే నేనదే...."
"నువ్వేదంటే నేనదే...."
"ఏయ్ చిలిపి... వెళాకోళాలా... నడుము చుట్టు చేయి వేసి దగ్గరికి తీసుకు అధరాలని ఆత్రంగా అందుకునేంతలో....."
"వద్దు అన్నీ పెళ్ళి అయ్యాకే....."     

"అదే మరి అడుగుతున్నా … పెళ్ళి ఎప్పుడు , ఎలా ... మా అమ్మా, నాన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.. మరి మీ వాళ్ళు..? అయిష్టంగా అమె నుండి దూరం జరుగుతూ అన్నాడు మోహన్.
"ఇంకా అడగలేదు మోహన్... చెల్లి రిజిష్టర్  ఆఫీసులో పెళ్ళి చేసుకుని వెళ్ళినప్పటినుండి వాళ్ళకి ఒకరకమైన భయం పట్టుకుంది.. ప్రేమ వివాహాలు... అదరా బాదరా పెళ్ళిళ్ళు ఎక్కువ కాలం నిలవవు అంటూ నన్ను సతాయించేస్తున్నారు... అందుకే వారి నిర్ణయం ప్రకారం నిదానమే ప్రధానం అనుకుని… కాస్త ఆగుదాం... ప్లీజ్.. అయినా… మనకేంటి పెళ్ళి చూపులనాడే నువ్వు బాగా నచ్చేశావు మావాళ్ళకి.. చెల్లి గురించి కూడా చెప్పేశారు... పెళ్ళి గురించి తర్జన బర్జనలు జరుగుతున్నాయి... కాస్త ఓపిక పడితే ఆ తరువాత రోజులన్నీ మనవే కదా....నుదుట ముంగురులు లాస్యమాడుతుంటే చేతి కొన వేటితో బంధించి వాటితో ఆడుకుంటూ అంది కీర్తన.

"అబ్బ కీర్తూ!  నేను అదే కదా అంటున్నా అయినా మనకేంటి.. అందరూ ఒప్పేసుకున్నారు కదా చిన్న చిన్న ఆనందాలు దూరం చేసుకోడమెందుకు చెప్పు..... ఒక్కసారి... ము...ము...ము.......  దగ్గరగా జరుగుతూ అన్నాడు మోహన్

"ఏయ్ ష్! ష్! దూరం…. దూరం…  నాకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి మోహన్! వాటికి విరుద్ధంగా నేనుండలేను...పెళ్ళికి ముందే సరసాలు, సరాగాలు అంటూ చొరవ చూపించలేను....  నా పెళ్ళి విషయంలో సాంప్రదాయం, పద్ధతి అంటూ అమ్మా, నాన్నా ఎంత తపన పడుతున్నారో,  నాకు అంతే కుతూహలం ఉంది.. మన సాంప్రదాయం ప్రకారం, మన ఆచారం ప్రకారం ఒక పద్ధతిలో చూసిన పెళ్ళి… ఎప్పుడో నేను స్కూల్లో ఉన్నప్పుడు మా కజిన్ ది చూశాను.. భలె సరదాగా గడిచింది, బాగా అల్లరి చేసాము.. ఉంగరాలు తీసినప్పుడు, తలంబ్రాలు పోసినప్పుడు మేమంతా బావగారి వైపు ఉండి ఆట పట్టించాము.. నా పెళ్ళి అలా జరగాలి.. అంత ఆనందంగా, అంత వేడుకగా జరగాలి.. అది నా కల మోహన్!   చెల్లి లా నేను రిజిస్టర్ అంటూ సంతకాల పెళ్ళి చేసుకోడం ఇష్టం లేదు.. కఛ్ఛితంగా తన అభిప్రాయాన్ని నొప్పించకుండా చెప్పింది కీర్తన.

“పెళ్ళి, ఆచారం, సాంప్రదాయం,  పందిళ్ళు, సందళ్ళు  ఇవన్నీ ట్రాష్ కీర్తూ! పైగా బోల్డు డబ్బు ఖర్చు కూడా  ... అదంతా బ్యాంక్ లో ఫిక్స్‌డ్ చేసుకుంటే ముందు ముందు మనకే పనికొస్తుంది... అయినా నువ్వేంటి మీ చెల్లిలా కాకుండా ..ఒక బామ్మలా మాట్లాడతావు.. ముహుర్తాలవరకు పంతులుగారిని పెట్టమందాము.. హ్యాపీగా రిజిస్టర్ ఆఫిసులో ఆ ముహుర్తానికి సంతకాలు పెట్టేసి దండలు మార్చేసుకుందాము...”

లేదు మోహన్! చెల్లి పెళ్ళి జరగకుండా ఉండి ఉంటే నేను నీతో ఏకీభవించేదాన్ని,  కాని ఇప్పుడల కాదు.. అమ్మా నాన్నా కోరిక సాంప్రదాయబద్ధమైన వివాహం.. ప్రస్తుత కాలములో వారి వారి అభిరుచుల, అవసరాల, అలవాట్ల, ఆర్ధిక స్థితిగతుల, ఆకాంక్ష ల మేరకు అయిందనిపించుకునేందుకు  సంబంధము కలుపుకొని నిశ్చయించు కుంటున్నారు.
ప్రస్తుతము వివాహ సంబంధాలు ఈ రోజుల్లో ఏక కుటుంబాలలో ఎక్కువగా ఆ కుటుంబములోని వారే నిశ్చయ నిర్ణయములు తీసుకోవడము అలవాటుగా మారుతూ ఆనవాయితీగా మారిపోయింది.
జీవితంలో మరపురానిది పెళ్ళి. ఇది స్త్రీ పురుషులకు జీవన స్నేహబంధాన్ని ఇస్తుంది. "క్రమ బద్ధమైన జీవితాన్ని ఆశచూపి పురుషుడినీ, భధ్రతను భరోసాగా ఇచ్చి స్త్రీని, పెళ్ళి అనే తాడుతో గట్టిగా కట్టి పడేశాక ఇక వారివైపు చూడదు సమాజం. పెళ్ళికున్న పాత ధర్మాలు పాతబడ్డాయి, కొత్తవి రాలేదు" అన్నారు చలం.

దానిని మనిద్దరం వ్యతిరేకించద్దు.. ఖర్చు అంటావా .. నా పెళ్ళికి అంటూ నాన్న బ్యాంక్‌లో కొంత డబ్బు ఉంచారు.. వీలయినంతవరకూ తక్కువ ఖర్చులో సాంప్రదాయంగా చేసుకుందాము... నువ్వు చెప్పు అసలు మన పద్ధతిలో ఈ మధ్య ఎప్పుడయినా పెళ్ళి చూశావా?

"లేదు చూడలేదు... అంత ఇంటరెస్ట్ లేదు నాకు... ఇప్పుడెలాగు నువ్వు వదిలేట్టు లేవుగా నా పెళ్ళే చూడాలనుకుంట ఒక 10 గంటలు అలా కూర్చుని.. "

"యెస్ మోహన్ చూద్దాము.. ప్రతి మంత్రానికి అర్థం- పరమార్థం తెలుసుకుంటూ చేసుకుందాము...  "  మూతి ముడుచుకుని కోపంగా ఉన్న మోహన్ ని కన్ను గీటి  చిలిపిగా...  "ఇక వెళ్దామా! చీకటి పడుతోంది “ అని అంది కీర్తన....

"ఒకే ఒక్కసారి... ఒక్కసారి............” చిలిపికళ్ళ కీర్తన చెయ్యి పట్టుకుని గోముగా అడిగాడు మోహన్....

"చెప్తే వినవు కదా... అన్ని పెళ్ళి అయ్యాకే కాబోయే శ్రీవారు! మావారూ! బంగారు!... వెళ్తున్నా.. చేయి విదిలించుకొని... పార్క్ గేటు వైపు దారి తీసింది కీర్తన.....

వెళ్తున్న కీర్తనను తదేకంగా చూశాడు మోహన్.... ఎంత అందంగా ఉంది.. ఎంత స్థిరంగా తన అభిప్రాయాలని వెల్లడిస్తోంది ... వ్యక్తిత్వం.. అందం మూర్తీభవించన ముగ్ధ కీర్తన అని అనుకోకుండా ఉండలేకపోయాడు... తనకీ ఇష్టమే హిందూ సాంప్రదాయ వివాహ పద్ధతి.. కాని అలా వద్దు అంటే తన నుండి వచ్చే సమాధానం కోసం అలా నటించాడు.. పెళ్ళి చూపులనాడే, తను నచ్చినట్లుగా... తన చెల్లెలి విషయం చెప్తూ .... నచ్చానా లేదా అనే అభిప్రాయాన్ని అక్కడే కఛ్ఛితంగా చెప్పమన్న ముదిత ఈ కీర్తన..... అమ్మా, నాన్న గౌరవం కాపాడడానికి పెద్దలముందు , "ఇంటికి వెళ్ళి కబురు చేస్తాము" అని చెప్పినా "మీరు నాకు నచ్చారంటూ ఆమేకి చెప్పేసిన తనకి...ఈరోజు మీదుమిక్కిలి గర్వంగా.. ఆనందంగా ఉంది.. తనకి కాబోయే బార్య ఇంటిని చక్కదిద్దుకునే స్వతంత్ర్య వ్యక్తిత్వం, అభిప్రాయాలు  కలది అని ...

ఆలోచిస్తూ .....గేటు వైపు వెళ్తూ ఉన్న కీర్తనని చూస్తూ.... నెల రోజుల ముందు గతం అనే పెళ్ళి చూపుల ఘట్టాన్ని , కీర్తన చెప్పిన చెల్లెలి కథని.. జ్ఞప్తికి తెచ్చుకుంటూ ముందుకి కదిలాడు మోహన్.
*******
తెలుగు వారి పెళ్ళిళ్ళలో ఉండే ఆ సందడి, సంతోషం ఎవరూ  మరువలేరమ్మా!  సకుటుంబ సపరివార సమేతంగా, బాజా భజంత్రీల నడుమ, సంతోషంగా జరిగే ఆ కళ్యాణ మహోత్సవం అందరి జీవితాలలో ఒక మరువలేని మరుపురాని మధురమైన సంఘటన.
పెళ్ళి చూపులతో పెళ్ళి కార్యక్రమం ప్రారంభం అవుతుంది. సాంప్రదాయం ప్రకారం అబ్బాయి, అమ్మాయి ఇంటికి బంధువర్గ సమేతంగా వెళ్ళి , అమ్మాయిని చూస్తారు. కట్న కానుకలు, లాంఛనాలు అన్నీ కుదిరాక నిశ్చితార్థపు తేదీ నిర్ణయించు కుంటారు.  ఇదిగో ఇప్పుడు నీకు పెళ్ళి చూపులు మొదలయ్యాయి..కీర్తన తల్లీ!  నచ్చితే ఇహ పెళ్ళే.... చెప్పారు పంతులుగారు, అసలెందుకు పెళ్ళి చూపులు అని అడిగినందుకు..
"అవునా! పంతులు గారు! ఈ పెళ్ళి చూపుల తరువాత జరిగేది ఏంటి?"
"పెళ్ళి వారు వచ్చేస్తున్నారు..!!!!! పంతులుగారు.. మీరు ముందు ఎదురెళ్ళండి.. అమ్మా కీర్తనా!  నువ్వు తొందరగా రేడీ అవు.. " అని హడావిడి పెట్టారు రావు గారు.. కీర్తన తండ్రి.
అనుకున్న సమయానికి పెళ్ళి చూపులకి రావడం, వాళ్ళ టైం మేనేజ్‌మెంట్  కి ముచ్చటేసింది కీర్తనకి.. మొదటి పెళ్ళిచూపులు.. ఈ పెళ్ళి చూపులే సక్సెస్ అయిపొతే హ్యాపీ... ఇంకోసారి అంటే …. అందరికీ కనిపించడమంటే చికాకు...
“కీర్తనా! కాస్త ఆ కూల్‌డ్రింక్స్ తీసుకురామ్మా!..”  తండ్రి పిలుపుకి ఆలోచనలనుండి తేరుకుని అక్కడే ఉన్న కూల్‌డ్రింక్ ట్రే ని తీసుకుని వెళ్ళి పెళ్ళి చూపులకి వచ్చిన వారికి ఇస్తూ.. పెళ్ళికొడుకుని ఓరకంట చూసింది...
లైట్ బ్లూ కలర్ షర్ట్, బ్లాక్ కలర్ పాంట్... చేతికి నల్లటి వాచ్... కూర్చుంటేనే భుజాలు సోఫాకి ఒకటి రెండు అంగుళాల  పైకి వస్తున్నాయంటే .. ఆరడుగులు ఉండొచ్చు.. ఆజానుబాహుడన్నమాట... తెల్లగా బాగున్నాడు.. నెమ్మదిగా తలపైకెత్తి కూల్డ్రింక్ తీసుకోమనే నెపంతో తలపైకెత్తి చూసింది.... తననే చూస్తున్నాడు.. కళ్ళు .. కళ్ళు కలిసాయి... ఎంత అందమయిన కళ్ళు.. చిన్నవే అయినా.. చూసే చూపు స్ఫురధ్రూపి అని తెలియజేస్తున్నాయి..
కుడిచేతితో ఆడిస్తున్న కార్ కీ చైన్ పక్కనే టేబుల్ వైపు పెడుతూ..   తనవైపు వచ్చిన ఆమెని  చూస్తూ.. ఆమె ఇచ్చిన గ్లాస్ తీసుకుంటూ.. ఆమెని గమనిస్తున్నాడు మోహన్.
లైట్ బ్లూ కలర్ శారీ లో... మెడలో ముత్యాల హారం, ముంజేతికి ముత్యాల గాజులతో సింపుల్‌గా హుందాగా ఉన్న కీర్తన చూడగానే నచ్చేసింది మోహన్ కి.
" చెప్పండి బావగారు! అబ్బాయికి అమ్మాయి నచ్చిందో లేదో తెలుసుకోకుండానే ఇలా పిలుస్తున్నానని మరోలా అనుకోవద్దు... నేను కట్న కానుకలు ఎక్కువ ఇచ్చుకోలేను కాని, పెళ్ళి మటుకు ఘనంగా చేద్దామని ఆలోచన.. ఇదే మా ఇంట ఆఖరి పెళ్ళి.. మా చిన్న కూతురు వయసు మోజులో, అలోచన లేకుండా .. ఆదర్శం అంటూ ఆవేశంతో  ప్రేమ అంటూ తొందరపడి రిజిస్టర్ ఆఫీసు పెళ్ళి చేసుకుంది...ముందే మీకీ విషయం మధ్యవర్తి ద్వారా తెలియజేశాము.. చిన్నకూతురు తప్పిదానికి  పెద్ద కూతురికి శిక్ష వేయలేను కదా... అయినా  ఇహ ఆ సాంప్రదాయాలు, ఆచారాలు మన ముందు తరాలవాళ్ళు పాటిస్తారో లేదో తెలీదు కనీసం మా పెద్దమ్మాయి పెళ్ళి అయినా కళ్ళ నిండుగా చూసుకోవాలని మా కోరిక.. మీ నిర్ణయం కోసమే మా ఎదురుచూపులు ఇక.." వాళ్ళ ఇంట నెలకొన్న పరిస్థితిని క్లుప్తంగా వెల్లడించారు రావుగారు.
"అయ్యో ! అలా ఏమి లేదండి మీరెలా పిలిచినా పర్వాలేదు... మీ చిన్న కూతురి విషయం మధ్యవర్తి చెప్పారు.. తప్పేముంది మనసుకు నచ్చిన వాడిని పెళ్ళి చేసుకుంది.. వాళ్ళిద్దరూ సుఖంగా ఉంటే చాలు... ఈ ప్రేమ వివాహాలకి మనం నిమిత్త మాత్రులమండి... అవి నిలబడితే మనం ఆనదించడం.. పడిపోతే ..నిలబెట్టడం అంతకన్నా మనం చేయగలిగేది ఏమి లేదు... పెళ్ళి పద్ధతి మీ ఇష్టం ,, ఒకసారి మా అబ్బాయి అభిప్రాయం కూడా తెలుసుకుని.. మీకు వారం రోజులలో విషయం కబురు పంపిస్తాము..." గుంభనంగా, మరింత బెట్టుసరిగా అన్నాడు మోహన్ తండ్రి...
మోహన్‌కి ఇదేమి అర్థం కాలేదు.. అమ్మాయి నచ్చేసింది అని చెప్దామన్న ఆత్రం అతనిది.. కాని తండ్రి ఏంటి ఇలా ... సరే.. చూద్దాము ఇంటికెళ్ళాక చెప్దాము అనుకునేంతలో...

"అమ్మాయి .. అబ్బాయితో మాట్లాడిలిట మరీ....". సణిగారు   అక్కడ ఉన్న పంతులుగారు...
వెతకబోయిన తీగ కాలికి దొరికిందన్నంత ఆనందం వేసింది మోహన్ కి.. తనకి ఒకసారి కీర్తనతో మాట కలపాలని ఆరాటంగా ఉంది...
పెద్దవారంతా హాల్ వదిలి వెళ్ళారు .. అక్కడ కీర్తన, మోహన్.. మోహన కీర్తనం... మోహన రాగం... మదిలో మోహనమైన రాగాలు కీర్తనలు సరాగాలు ఆడుతున్నవేళ.... తీయగా వినిపించింది ...
"మీ పేరు?"...
"మోహన్ ... మోహన కృష్ణ....  ఏమి మాట్లాడాలో తెలియని బెరుకుతనమే పేరు అడగడం.. కీర్తనా... ? అడిగాడు చిలిపిగా..
"లేదు.. ఎలా మొదలెట్టాలో తెలియక"
"గడుసువారే... ఇంతకీ నేను నచ్చానా?"
"నచ్చడం , నచ్చకపోవడం అనేది ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని బట్టి ఉంటుంది.. అదే మా చెల్లి.. మా చెల్లి గురించి మీకు తెలియాలి.. చెప్పిన తరువాత మీకు నేను నచ్చానో లేదో చెప్పండి.. ఆ తరువాత నా అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తాను"... వచ్చిన అవకాశం జారవిడుచుకోకుండా ... తన చెల్లెలి ప్రేమ వివాహాన్ని గురించి అతనికి చెప్పాలన్న ఆదుర్దా ముఖంలో కనిపించగా నిక్కచ్ఛిగా అంది కీర్తన.

ఓ కే.. నేను మీకు నచ్చినా, నచ్చకపోయినా... నేను చెప్పాలనుకున్నది మటుకు నాకు మీరు నచ్చారు.. నేను చేసుకోవాలి అనుకుంటున్నది మిమ్మల్ని .. మీ చెల్లెలిని కాదు.. కాబట్టి మీరు ఆమె గురించి చెప్పిన చెప్పకపోయినా నాకేమి అభ్యంతరం లేదు. మీకు నచ్చితే చాలు.. చెల్లెలు , అక్క ఇవన్నీ నాకనవసరం.. తను అంతే నిక్కచ్చిగా జవాబు ఇచ్చాడు మోహన్.

అతనిచ్చిన సమాధానానికి మనసులోనే ఆనందించింది కీర్తన... తనకి అతను బాగా నచ్చాడు.. కాని, చెల్లెలి గురించి చెప్పక తప్పదు.. తను ఇప్పుడు చాలా కష్ట పడుతోంది... అందుకే అమ్మా నాన్నల కోరిక ప్రకారం తాను వేద మంత్రాల నడుమ పెళ్ళి చేసుకోవాలని తాపత్రయ పడుతోంది.. పంతులుగారేమో ఇతను ఆదర్శ భావాలు.. అంటూ చెప్పుకొచ్చారు..... ఆలోచిస్తూ కాలి వేలు నేలపై రాస్తూ అతన్ని పరికిస్తోంది కీర్తన.

"హల్లో మేడం.. ఇంతసేపు మనమిద్దరం.. మీరు మౌనం ..ఏంటి ఏదో చెప్తానన్నారు.. మరి ఇంక ఆలస్యమెందుకు నా అభిప్రాయం మారదు.. చెప్పడం చెప్పకపోవడం మీ నిర్ణయం.. " అని మోహన్ అన్న మాటలకి ఉలిక్కిపడి చెల్లెలి గురించి చెప్పసాగింది..
*******
  
పల్లవి..  
అందమైన పేరు.. అందమైన అంగన.. ఇంకా అందమయిన పలుకు.. పోతపోసిన బాపు బొమ్మ రావు గారి రెండో కూతురు.. చలాకీగా నేటి యువతరానికి గుండే చప్పుడుగా... గల గలా మాట్లాడుతూ... హడావిడి చేసే రేడియో జాకిగా మంచి గుర్తింపు ఉన్న సుందరాంగి.

తన అందం.. మాట తీరు , ఆ వాక్చాతుర్యం చూసిన అబ్బాయిలు ఇట్టే ఆమె ఆకర్షణలోకి  పడకమానరు.. అందులో ఆ వయసు అలాంటిది.. పెళ్ళి, కుటుంబం, పిల్లలు వీటికి అర్థాలు తెలియవు. ... తెలిసిందల్లా.... లైఫ్ “ఎంజాయ్”  చేయాలి అనే దుడుకుతనం.. చిన్నవయసులోనే ఐదు అంకెల జీతం.. ఇంట్లో జీవితపు అటుపోట్లు.. సమస్యల సుడిగుండాలు... ఇవేమి తెలియక "జల్సా" చేయాలి అనే ఆరాటం... వీటన్నిటికి డబ్బు తోడూ... ఇహ చెప్పేదేముంది..

పైన లక్షాణాలు ఉన్న పడచుకు సరి జోడు దూకుడుతనం... మధ్యతరగతి హుందాతనం.. బయటపడని పేదరికపు గొప్పతనం వెరసి.. వరుణ్... హడావిడిగా వచ్చి ఆగిపోయే వాన చినుకులాంటి వాడు.. డబ్బు ఉన్న ప్రియురాలికోసం అన్వేషణ.. అన్వేషణా ఫలితం పల్లవి..  జగతిని ఉన్నది మనమిద్దరమే.. మనకే ప్రేమ అంటే అర్థం తెలుసు అనే ఆలోచన..ఆమె అందం , మాట.. సంపాదించే డబ్బు అతనికి ఆయుధాలు.

ప్రేక్షకుడిగా , ఆమె అభిమానిగా పరిచయం చేసుకుని, ఆమె ఆకర్షణకి లొంగి.. ప్రియుడిగా మారాడు.. అడగ్గానే డబ్బు.. ఆ పిచ్చి …. వారిద్దరూ అరక్షణం ఆలోచించకుండా ... "ఓ వర్షం కురిసిన రాత్రి" అంటూ ఏకమయ్యారు.. ఫలితం పల్లవి.. తల్లి కావడం... తన శరీరంలోని మార్పు తనకే అర్థం కాక.... తీరా అర్థమయ్యేసరికీ తప్పు జరిగిపోయింది ఏమి చేద్దాం అని అడిగేసరికి "పెళ్ళిచేసుకుందాం " అని బెరుకు లేకుండా అదేదో “సినిమాకెళ్దాం “ అన్నంత సులువుగా అన్న వరుణ్ చూసి అది ధైర్యమనుకుని మురిసిపోయి తండ్రి దగ్గరికి పెళ్ళి ప్రస్తావన తీసుకొచ్చింది రావు గారి చిన్న కూతురు పల్లవి....
"నాన్నా నేను పెళ్ళి చేసుకుందామని అనుకుంటున్నా!"
పెళ్ళా.... ఇదేమన్నా బొమ్మలాట? ఇంత అర్జంట్‌గా పెళ్ళేమిటమ్మా.. నీకన్నా ముందు అక్క వుంది.. అక్కకి పెళ్ళి అయిన తరువాత కదా ....."

మాటలింకా పూర్తవకుండానే...” నాకు తెలీదు నాన్నా.. నేను పెళ్ళి చేసుకుంటాను.. వరుణ్ అని నా అభిమాని అతనిని ప్రేమించాను.. అక్క.. చెల్లి ఈ వరసలు ఇప్పుడు అనవసరం.. నాకు ముందు చేసేయండి.” దుడుకుగా సమాధానం చెప్పింది పల్లవి.

"పల్లవీ! దుడుకు స్వభావం మానుకో..నువ్వు చెప్పిందే జరగాలి అనే మంకు పట్టుదల మంచిది కాదు.. అసలు ఆ అబ్బాయి ఎవరో ఏంటో వివరాలు ఏమి తెలుసుకోకుండా నేనెలా పెళ్ళి చేస్తాను అసలు వరుడు , వధువులకి అర్థం నీకు తెలుసా? పెళ్ళంటే ఆషామాషీ కూడా కాదు...
“హిందూ సంప్రదాయం ప్రకారం లక్ష్మీ, సరస్వతి, పార్వతి ల ఏకాత్మక రూపంగా వధువును తలుస్తారు. పచ్చదనంతో లోకాన్ని చైతన్య పరచే ప్రకృతి యొక్క ప్రతిరూపంగా వధువుయొక్క కాళ్ళకు పారాణి రాసి జడలో మల్లెలు తురిమి మొహానికి పసుపును రాసి అందంగా అలంకరిస్తారు.”
“త్రిమూర్తుల దివ్యస్వరూపం. విధాత చూపిన విజయోన్ముఖ పథంలో విజ్ఞతతో నడిచేందుకు సిద్ధమైన సిద్ధ పురుషునిగా వరుడిని తలుస్తారు.”
“ధర్మార్ధ కామమోక్షాల నాలుగు పురుషార్ధాలలో ఒకటైన కామాన్ని ధర్మ బద్ధం చేయటానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్యం నిర్వహణా మార్గం సుగమం చేయబడుతుంది. వివాహానంతరం స్త్రీ పురుషులకు అనేక సంప్రదాయక విధులు నిర్వహించే అర్హత కలుగుతుంది. (ఉదాహరణగా బాలసారె నుండి వివాహం వరకు ఉన్నా అనేక సుసంస్కారములు జరిపించటానికి హిందూ ధర్మశాస్తం ప్రకారము వివాహం జరగని వారుకాని, వివాహానంతరం అనేక కారణాలవలన ఒంటరిగా మిగిలిన స్త్రీ, పురుషులయిననూ ఈ సంప్రదాయక కార్యక్రమములు నిర్వహించటకు అనర్హులవుతారు. )  దంపతులైన స్త్రీ పురుషులు మాత్రమే సంప్రదాయక విధి నిర్వహణకు అర్హులవుతారు. తీర్ధయాత్రల సమయంలో చెప్పే సంకల్పం, దేవతామూర్తుల కళ్యాణము, సత్యనారాయణ వ్రతం, హోమం, యజ్ఞం, యాగం లాంటివి నిర్వహించటానికి గృహస్థు ధర్మపత్ని సమేతంగా జరపాలని నియమం ఉంది. “
“అదీకాక  తల్లిదండ్రుల అనుమతి లేకుండా 21 ఏళ్ళ లోపు వయసున్న యువతిని పెళ్లాడడం శిక్షార్హమైన నేరమని కోర్టు ప్రకటించింది.  కాబట్టి నా మాట విని అక్కకి పెళ్ళయ్యేదాక ఆగు.. ఈలోగా ఆ అబ్బాయి ఎలాంటివాడో ఏంటో ఆరా తీస్తాను.. మన కులం కాకపోయినా పర్వాలేదు.. మన సాంప్రదాయాలను, ఆచారలను గౌరవించే వాడయితే చాలు.. ఇది నీ జీవితం.. నిర్ణయం తీసుకోడం అనేది ఇంకొకరి మీద ఆధారపడి ఉండకూడదు.. నీ తల్లి ..తండ్రిగా మంచి చెడు చూసేది మేమే కాబట్టి అర్థం చేసుకుని పిచ్చి పిచ్చి పనులు మానేసేయ్ .. అర్థమయిందా!”  ఒకింత కోపంతో హెచ్చరించాడు పల్లవి తండ్రి..

“అర్థమయ్యింది నాన్నా.... నువ్వు మా ప్రేమని అర్థం చేసుకోవు.. చావనైనా చస్తాను కాని.. మా ప్రేమని వదులుకోను.. నువ్వు అక్కకి ముందూ.. పెళ్ళి , వరుడు , వధువు అంటూ పుక్కింటి పురాణాలను బూజు పట్టిన సిద్ధాంతాలను వల్లె వేస్తున్నావు.. పెళ్ళి విషయంలో నా నిర్ణయం మారదు.. నేను చెయాల్సిందేదో చేస్తాను... ఎందుకంటే ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నాను..” అసలు విషయం చెప్పేసి విస విసా వెళ్ళిపోయింది పల్లవి.

చివర్లో ఆమె చెప్పిన విషయం విని నిర్ఘాంతపోయాడు పల్లవి తండ్రి... నోట మాట రాక, అప్పటికప్పుడు ఏమి చేయాలో అర్థం కాక.. కూర్చున్న సోఫాలో అలా ఒరిగిపోయారు అచేతనంగా...
దూరం నుండి వారిద్దరి సంభాషణ వింటున్న కీర్తన… నాన్న పరిస్థితి ని చూసి  "నాన్నా" అంటూ ఒక్క ఉదుటున  పరిగెత్తుకుంటూ వచ్చి...పక్కనే ఉన్న ఫోన్ అందుకొని ఆంబులెన్స్ పిలిపించుకొని హాస్పిటలో అడ్మిట్ చేసింది.
*****
పల్లవి ఇవేమి పట్టించుకోకుండా... ఆ రాత్రే తన స్నేహితురాలింటిలో ఆశ్రయం పొంది, ఆ తరువాత రెండు రోజులకి వరుణ్ తో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని.. తండ్రికి కబురుపంపింది.. తాను పెళ్ళి చేసుకున్నట్లుగా... ఏమి చేయలేని పరిస్థితుల్లో ... బేలగా కీర్తన వైపు చూశాడు ఆ ఆడపిల్లల తండ్రి.. అప్పుడే నిర్ణయించుకుంది కీర్తన తండ్రి కోరిక ప్రకారం తాను పెళ్ళి చేసుకోవాలని......
*******
ఇప్పుడు చెప్పండి మోహన్.. "నేను నచ్చానా" ?

ఆమె చెప్పిన కథంతా విని..." ముందు చెప్పిన నిర్ణయమే నాది.. మారదు.. నాకు  మీరు నచ్చారు.. కాని మా పెద్దవారి గౌరవం నిలబెట్టాలి కాబట్టి వారి ద్వారా వారం రోజుల తరువత ఏ విషయం తెలియజేస్తాం..."  తెచ్చి పెట్టుకున్న పెద్దరికంతో.. కాస్త గంభీరంగా ... చిలిపిగా ఆమె వైపు చూస్తూ  చెప్పాడు మోహన్...
అతను చెప్పిన తీరుకు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ... లోపలికి వెళ్ళిపోయింది కీర్తన....
******
అలా ఒకరికొకరు నచ్చారని తెలిసిన తరువాత వాళ్ళు అప్పుడప్పుడు ఇలా పార్క్ అని, సినిమా అని బయటకి వచ్చి అభిప్రాయలను ఆలోచనలను పంచుకుంటూ హద్దులు దాటకుండా పెద్దలు చేసే పెళ్ళికోసం ఎదురుచూస్తూ ……గడుపుతున్నారు.
******
"ఒరేయ్! మోహన్!  అమ్మాయి తరుపువాళ్ళు నిశ్చితార్థ ముహూర్తం పెట్టారు రా.. ఎల్లుండే.... మన దగ్గర బంధువులందరిని పిలుద్దాము ఇప్పుడే రావు గారు ఫోన్ చేశారు..." ఇంటికి వచ్చిన కొడుకుకి ఎదురుపడి శుభవార్త చెప్పడు మోహన్ తండ్రి.

మేమిద్దరం ఒకరికొకరం నచ్చిన తరువాత ఇంకా నిశ్చితార్థం ఎందుకు నాన్నా?  .... డైరెక్ట్గా పెళ్ళికి ముహూర్తం పెట్టేయచ్చు కదా.. కొంచం పరాకుగా తన తొందర పడ్తున్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు మోహన్.

"పిచ్చివాడా.. ఈ నిశ్చితార్థం పెళ్ళి ముహూర్తం కోసమే రా.. ఇదో వేడుక.. పెళ్ళికి ముందు చేసే ఈ నిశ్చితార్థం వధూవరులు పరస్పరం నచ్చాక వారి తలిదండ్రులు కట్నకానుకలు, ఆభరణాలు మొదలగు విషయాలు మాట్లాడుకొన్న తరువాత ఒక శుభముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని లగ్న పత్రికగా రాయించి, లగ్న పత్రికలు, తాంబూలాలు మార్చుకొంటారు. ఈ వేడుక ఒక పెళ్ళి కోసం జరిగే  ఒప్పందం లాంటిదనుకోవచ్చు. నిశ్చితార్థం రోజున అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చుకోవటంతో సగం పెళ్ళి జరిగినట్టుగానే భావిస్తారు. కాబట్టి మీకు సగం పెళ్ళి ఎల్లుండే అయిపోతుందన్నమాట” చెప్పాడు మోహన్ తండ్రి 
వారానికొకసారి మాత్రమే కలవాలి అన్న కీర్తన నియమానికి లోబడినా నిశ్చితార్థం రూపేణా మళ్ళీ కీర్తనని ఎల్లుండే కలుస్తున్నానన్న ఆనందం మనసంతా నిండగా తండ్రి పసిగట్టకుండా "ఆ ఏర్పాట్లేవో మీరు చూసుకొండి నాన్నా... ఫొన్ ద్వరా చెప్పాల్సిన వాళ్ళకి నేను చెప్తాను"  అని  హుషారుగా ఈల వేసుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు మోహన్...

                                                    ******
ఆ అనుకున్న ఎల్లుండి వచ్చేసింది.. ఘనంగా నిశ్చితార్థ వేడుక జరిగింది..
క్రీం కలర్ షర్ట్ , బ్రవున్ కలర్ పాంట్ లో  హీమాన్ లా మాన్లీ గా ఉన్నాడు మోహన్..

నేను మటుకు తక్కువుతిన్నానా అన్నట్లు బ్రవున్ కలర్ పట్టు చీరలో తన అందాన్నతా ఇనుమడింపజేసింది కీర్తన....

ఉంగరం తొడిగినప్పుడు అతని స్పర్శ కి నరనరాల్లో తీయని అలజడి కలిగింది కీర్తనకి.. ఓరకంట మోహన్ ని చూసి చిలిపిగా నవ్వింది...

ఆ నవ్వు చూస్తే ఆమె తనదనిపించింది.. మౌనం మనదనిపించిది వెరసి ఆమె… తను మోహన కీర్తనం... సమ్మోహనం.. సంకీర్తనమోహనం...

ఆ స్పర్శకి చుట్టుపక్కన ఎవరూ లేకపోతె అమాంతం ఆమెని కౌగిలో బంధించేసి.. ముద్దుల వర్షం కురిపించేంతటి భావన కలిగింది మోహన్ కి.. ఇద్దరూ అలా తీయని మధురమైన తలపులతో గడుపుతుండగా.. కీర్తన సెల్ మ్రోగింది..
"హల్లో!"
“అంతేలేవే... నీకో చెల్లెలుందని మర్చిపోయావు... నిశ్చితార్థానికి పిలవలేదు.. కనీసం పెళ్ళికయినా పిలుస్తావా అదీ లేదా.. అవును బావగారు బాగున్నారా? ఎలా ఉంటారు?”
పల్లవి.. తన చెల్లెలు.. పెళ్ళి అయినప్పటినుండి ఎక్కడ ఉందో ఎలా ఉండో కూడా తెలీదు.. 6 నెలల గర్భవతి అని తెలుసు.. అంటే లెక్క వేసుకుంటే తన పెళ్ళి అయి నాలుగు నెలలు మాత్రమే అయ్యింది.. ఎలా ఉందో.. కనీసం ఫోన్ నంబర్ లేదు.. పిలవడానికి, రేడియో జాకి గా మానేసింది పెళ్ళి అయిన వెంటనే.. తను ఎన్ని సార్లు వాకబు చేసింది.. ఎక్కడ అడ్రస్ కూడా దొరకలేదు.. థాంక్ గాడ్.. ఇప్పుడు ఫోన్ చేసింది...

"పల్లవీ!.. ఎలా ఉన్నావు.. ?” కళ్ళ నిండా నీళ్ళతో ప్రేమగా అడిగింది కీర్తన.
అస్సలు బాలేను... బుద్ధి గడ్డి తిని ప్రేమ ప్రేమ అంటూ పెళ్ళి చేసుకున్నాను.. వరుణ్ నా పాలిట రణంగా మిగిలాడు... నా సోది ఎందుకులే నీ పెళ్ళెప్పుడు ? నన్ను పిలుస్తావా? లేక ఇలాగే నిశ్చితార్థంలా చేసేసుకుంటావా?"
"అదేమిటి పల్లవి అలా అంటావు? నీ నంబర్, అడ్రస్ తెలీక కాని, నిన్ను పిలవకుండా నా పెళ్ళి అవుతుందా అసలు.. అడ్రస్ చెప్పు నేనే వస్తా పెళ్ళి శుభలేఖలు తీసుకుని.. "
“సరే తీసుకో ఎదురుచూస్తా నీ రాక కోసం... నీతో బోల్డు మాట్లాడాలి.. ఉంటా మరి, బావగారిని అడిగానని చెప్పు.. “  అడ్రస్ చెప్పిన తరువాత ఫోన్ పెడ్తూ అంది పల్లవి.

                                                           ****

ఇదిగో వరుణ్.. అక్క కి చెప్పాను మనల్ని పిలవడానికి , శుభలేఖలు ఇవ్వడానికి ఏ క్షణమన్నా  రావచ్చు..నువ్వు అతి చేసి అనవసరంగా అరిచి అక్కకి అన్నీ తెలిసేలా చేయకు.. నాకెలాగు సుఖంలేదు నీతో , అది అందరికీ తెలిసేలా చేసి రసాభాస చేయకు.. కొంచం కోపంగా, గట్టిగా అరిచింది.. పల్లవి సోఫాలో ఉన్న వరుణ్‌తో...
వరుణ్‌కి ఇంట్లో ఉన్న ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల  కాస్త చికాకుగా ఉన్నా ఎందుకో ఈమధ్య ఈ పెళ్ళిళ్ళంటే కాస్త ఉత్సుకత చూపిస్తున్న మాట నిజమే.. అందుకే కాస్త సౌమ్యంగా "వాళ్ళయితే శుభలేఖలు ఇవ్వనీ పల్లవీ!  వెళ్దాము " అన్నాడు.


ఆహ్వాన పత్రికలు  
అవును వరుణ్! .. నిర్ణయించబడిన ముహూర్తానికి వరుని తరపువారూ, వధువు తరపువారూ వారి వారి ఆచారానుసారంగా ఆహ్వానపత్రికలు ముద్రించుకుంటారు. వీటిని శుభలేఖలు లేదా పెళ్ళి పత్రికలు అంటారు. మంగళ సూచకంగా శుభలేఖకు నాలుగువైపులా పసుపు పూస్తారు. ఎంత బాగుంటుందో కదా.... శుభలేఖలు రావాలి.. ఆ ఆహ్వాన పత్రికల చుట్టూ పసుపు పెట్టి.. అందంగా వరుడి పేరు.. వధువు పేరు రాసి.. శుభమూహుర్తం.. కళ్యానమంటపం వివరాలు.. భలే ఉంటుంది కదా పత్రిక.. మనం వీటన్నిటికి దూరమే కదా.. ఒకసారి ఊహించు.. మా పెద్దవాళ్ళో మీ పెద్దవాళ్ళో శుభలేఖలు ఇస్తున్నట్లుగా మనిద్దరి పేర్లూ.. ఓహ్..
పెళ్ళి పిలుపులు
మా నాన్న వాళ్ళు పిలవాలే కాని అందరూ వస్తారు వరుణ్.. ఎన్నిరోజులయిందో మా మావయ్యలని, బాబయ్యలని, పెదనాన్నలని, చిన్నమ్మలని చూసి.. ఇప్పుడు అందరిని చూస్తాను. వీళ్ళు పెళ్ళి పిలుపులకి వెళ్తారు కదా... అందరిని పిలుస్తారు… బంధుగణమును పిలుచుకోవడం అనేది పెళ్ళిళ్ళలో సర్వ సాధారణం. ఎక్కడెక్కడో ఉంటూ, అప్పుడెప్పుడూ కలిసే బంధువులందరూ కలువవగలిగే మంచి సంధర్భాలు, పెళ్ళిళ్లు. ఆ కలయికలకు వేదికగా పెళ్ళివారి ఇల్లు మారిపోతుంది. మళ్ళీ ఇన్నేళ్ళకి చూస్తున్నాను.. అందుకే ఇలా అందరూ కలిసేలా పెళ్ళి చేసుకోవాలే కాని మనలా మాత్రం ఎవరు  చేసుకోకూడదు వరుణ్….
ఆపకుండా అలా ఆనందంగా  మాట్లాడుతున్న పల్లవిని చూసి మురిసిపోతున్నాడు వరుణ్.. ఏన్నేళ్ళయింది ఎప్పుడో పెళ్ళి కాకముందు చూసాను ఇలా ఆనందంగా మాట్లాడడం మళ్ళీ ఇప్పుడు... ఎవరూ తమకి సపోర్ట్ లేక ఇబ్బంది పడ్తున్నారే కాని.. లేకపోతే పల్లవి అంటే తన ప్రాణం.. అలా జరిగిపోయింది లేకపోతే పెద్దవాళ్ళు తమకి కూడా ఇప్పుడు పల్లవి చెప్తున్నట్లే చేసేవారు కదా..
ఆ ప్రవాహాన్ని ఆపేయాలి లేకపోతే అలా తలుచుకుంటూ తలుచుకుంటూ.. ఆ ఆనందం కాస్తా బాధలోకి మళ్ళిపోతుంది.. తనకలా జరగలేదన్న భావనతో అందుకే..
“ఇప్పుడు వదినా, మావయగార్లు ఏమి చేస్తూ ఉంటారు పల్లవి.”. అని అడిగాడు పక్కన కూర్చున్న పల్లవి చేతిని తన చేతిలోకి ప్రేమగా తీసుకుంటూ....
పెళ్ళి  సరంజామా
ఏమి చేస్తుంటారేంటి వరుణ్. ఎంత హడావిడిగా ఉంటారో.. నిశ్చితార్థం అయిపోయింది కాబట్టి ఇక పెళ్ళి పనులు మొదలెట్టేస్తారు.. పెళ్ళి సరంజామ కొంటూ ఉంటారు.. బోల్డు చీరలు..పెళ్ళి సరంజామా కొనటం అనేది పెళ్ళి వారి ఇండ్లలో అన్నిటికంటే పెద్దపని. పెళ్ళి అనగానే పట్టుచీరల రెపరెపలు, బంగారు ఆభరణాల ధగధగలు, కొత్తకొత్త వస్తువులు ఇలా అన్నీ కొత్తగా కొనుక్కుంటారు.

కళ్యాణ మండపము
ఆ తరువాత కళ్యాణ మంటపం తీసుకుంటారు.. మరి నాన్నగారు ఏమి చేస్తారో, కొందరు మండపములను వాడితే మరికొందరు వాడరు. సాధారణంగా పల్లెలలో కొబ్బరి ఆకుల పందిరి వేయుట వలన మండపంయొక్క ఆవశ్యకత తక్కువ. పట్టణాలలో టిప్ టాప్ పందిరి వేయుట వలన మండపాలు తప్పని సరిగా వాడటం జరుగుతుంది.
నాన్నగారి ఆలోచన ఏంటో కాని నాకయితే చక్కగా తాటాకు మంటపం వేసి చేస్తే బాగుంటుంది అనిపిస్తోంది.
"పెళ్ళి గురించి ఆ పనుల గురించి నీకు బాగా తెలుసు పల్లవి.. ఎంత చక్కగా చెప్తున్నావో, నువ్వలా చెప్తుంటే మనం మిస్ అయ్యామనే అనిపిస్తోంది" అన్నాడు వరుణ్ కొంచం విచారంగా

తనెంత బాధపడినా, కోపంగా ఉన్నా వరుణ్ ని చికాకుగా, విచారంగా, బాధగా చూడలేదు పల్లవి అందుకే ..
లేదు వరుణ్! అలా బాధ పడకు.. నేను అర్థం చేసుకోగలను నిన్ను, వాళ్ళు వచ్చి పిలుస్తారు, పెళ్ళికి వెళ్ళాలి మనం. అక్కడ జరిగే ప్రతి ఒక్క తంతూ గమనించు, మనకే జరుగుతున్నట్లూ అనుకో. అలా ఆనందం పొందుదాము మనం.” అంది పల్లవి.. వరుణ్ ని ఓదారుస్తూ
***********
పెళ్ళివారిల్లు..  
పెళ్ళివారిల్లు..చాలా సందడిగా ఉంది. ఉదయం కీర్తనని పెళ్ళీకూతుర్ని చేశారు. అటువైపు విడిదింట్లో అంతా హడావిడి, ఈ లోపులో పెళ్ళికొడుకు మోహన్ తరుపు పెద్దమ్మ

"ఏరా మోహన్!  కీర్తనని పెళ్ళి కూతుర్ని చేశారట కదా.. ట్రైన్ ఆలశ్యం అవడం వల్ల టైం కి రాలేకపోయాను , ఓ సారి అటెళ్ళి పెళ్ళికూతుర్ని చూసొస్తా... అంటూ ఏమఱ్ఱా ! ఎవరన్నా వస్తారా నాతో.. అని పెళ్ళి హడావిడంతా తన మీద ఉన్నట్లుగా హడావిడి పడ్తూ అడిగింది..
"మేమొస్తాం మేమొస్తాం "వదిన (పెళ్ళికూతురు) ఎంత బాగుందో.. పెద్దమ్మా పదా"  అంటూ కళ్యాణ మంటపం తీసుకున్న వైపు అడుగులేశారు ఓణీల రెప రెప ల నలుగురు వయసు గుమ్మలు.

"తొందరగా తెమలండి వెళ్ళి మళ్ళీ వచ్చేయాలి.. స్నాతకం టైం అయింది అప్పటికి మనం ఇక్కడుండాలి." అంటూ వడి వడిగా అడుగులేసిందా  పెద్దావిడ.
"స్నాతకమా అంటే ఏంటి పెద్దమ్మా.." అడిగిందో ముద్దుగుమ్మ!

"పెళ్ళీడొచ్చింది కాని పెళ్ళంటే అబ్బాయి , అమ్మాయి పీటలమీద కూర్చుంటే చాలనే తెలివితేటలు ఇప్పటి వాళ్ళవి.. లేకపోతే, ఆర్యసమాజం పెళ్ళిళ్ళు లేదా గుళ్ళో పెళ్ళిళ్ళు అంటూ తు..తు మంత్రంగా చేయించేస్తున్నారు కాని ఎక్కడ ఒక పద్ధతా పాడా.. ఏమి తెలియక ఇదిగో స్నాతకమంటే ఏంటి? తాళి అంటే ఏంటి ? అనేవాళ్ళు పెరిగిపోయారు.. " అంటూ మెటికలు విరిచిందావిడ.

"అబ్బా! పెద్దమ్మా నస పెట్టకుండా స్నాతకమంటే ఏంటో చెప్పచ్చు కదా! " ముద్దు ముద్దుగా కసురుకుందా గుమ్మ

స్నాతకము
పెళ్ళి కుమారుని ఇంటిలోగాని, కళ్యాణమండపంలోగాని లేదా విడిదిలోగాని పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి, అన్ని ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ది కోసం బ్రాహ్మణులు వరునిచే గోత్ర ప్రవరలు చేయిస్తారు.
గోత్ర ప్రవరలు :-
గోత్రం అనగా వంశం. ప్రవర అనగా ఆ వంశ మూలపురుషుల కూటం. వరుడు కన్యా అన్వేషణ చేయమని అడిగిన తరువాత కొందరు పెద్దలు వెళ్లి కన్యా దాతకు వరుని వంశాన్ని గురించి వివరించి చెప్పడాన్ని ఇక్కడ గోత్రప్రవరలు చెప్పడం అంటారు. అంటే వరుని ముత్తాత, తాత , తండ్రి ఎవరెవరో కన్యా దాతకి తెలియజేసి కన్య ముత్తాత, తాత , తండ్రి ఎవరెవరో తెలిసికొని "మీ కన్యను మా వరునికి ధర్మ, సంతాన ,సంపద కోసం ఇవ్వండి" అని అడగడమే ఇక్కడ ప్రధానాంశం. ఆడపిల్లలు తక్కువగా ఉండే రోజులలో ఆడపిల్ల పుట్టడంతోనే సంబంధాలు కలుపుకోవాలని ఆలోచనలు ఉండేవి. అందువల్లనే పిల్లవాడి తరఫు వాళ్ళు వెళ్లి  "పిల్లనివ్వండి అని అడగవలసి వచ్చేది".ఇప్పుడు పరిస్ధితులు పూర్తిగా తారుమారు అయ్యాయి మీకు ఏమి కావాలన్నా ఇస్తాం.మా పిల్లను చేసుకొంటారా అని కన్యాదాత బ్రతిమాలే రోజులలో మనం ఉన్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా మూడు మారులు ప్రవర చెప్పడం జరుగుతుంది. ధర్మ కార్యముల నిమిత్తం సంతానం , నిమిత్తం ఇటువంటి వరునకు, ఇటువంటి కన్యను కోరుతున్నాము అని అర్ధము. “వ్రునీద్వం”  అని కన్యాదాత పలుకవలెను. కన్యాదాత అలాగే మా కన్యను ఇస్తాను అని మూడు మారులు తన అంగీకారాన్ని తెలియజేస్తాడు. క్రుతార్దాః వయం ఇతి వరాయ వేదయేయు:  అని చెప్తారు. అనగా నీకు కన్యను వేదకుటలో మేము కృతార్ధులమైనాము అని మధ్యవర్తులైన పెద్దలు వచ్చి తమ నిర్ణయాన్ని వరునకు తెలియజేస్తారు. ఇప్పుడు పెళ్ళిలోనే దీనిని జరుపుతున్నారు.ఈనాడు సంబంధ నిశ్చయానికి ముందు వరకూ జరిగే సంప్రదింపుల కార్యక్రమమే ఇది. ఇలా ప్రవరులు చెప్పించేప్పుడు మనమక్కడ ఉన్నామనుకో మన గోత్ర నామాలు కూడా చదువుతారు.. అందరికీ మనం ఫలానా బంధువులం అని తెలుసుతుంది. అలా అందరిముందు పురోహితుడు గోత్రనామాలు ప్రవర చదువుతున్నప్పుడు ఎంత హూందాగా ఉంటుందో మన ఇంట్లో పెళ్ళీ..  అని అంటూ వివరించింది  ఆవిడ.
పెళ్ళి కూతురు అలంకరణలో అత్యంత సుందరంగా ఉంది కీర్తన.. గోధుమరంగు చీరలో ,ముక్కుపొడుం రంగు బార్డర్తో కట్టుకున్న చీరకే మరింత వన్నే తెచ్చేలా ఉంది ఆమే అందం. చూడగానే ముచ్చట పడేలా ఉంది ఆమే అలంకరణ. ఆమె అందానికి ముచ్చట పడుతూ ఆ ముద్దుగుమ్మల పెద్దమ్మ.. "ఇదిగో అమ్మాయ్!  అత్తగారు లేరనుకునేవ్!  నేనే మీ అత్తగారిని.. నాకు నచ్చాలి లేకపొతే ఇదిగో ఈ స్నాతకం తరువాత కాశీ ప్రయాణం ఉంది పంపించేస్తాను ఏమనుకున్నావో.. కీర్తన బుగ్గ గిల్లుతూ పరిహాసమాడింది ఆవిడ.
పెళ్ళిళ్ళేమి చూడకపోవడమో ఏంటో… కాని ఈ కాశీ ప్రయాణమేంటో తెలుసుకోవాలన్న ఉత్సుకత కలిగింది కీర్తనకి. కాని పెళ్ళికొడుకు తరుపువాళ్ళు గబుక్కున అడిగితే బాగోదేమో అని బిడియపడ్తూ ఆలోచిస్తున్నంతలో.. 

"కాశీ ప్రయాణమా అంటే ఏంటి అత్తయగారు, బావగారిని కాశీ పంపిస్తానంటున్నారు అలా వదిలేస్తామేమిటి" చనువుగా వరస కలిపేసి అడిగేసింది పల్లవి.
ఎవరే పిల్లా నువ్వు! అప్పుడే అత్తయగారు అంటూ వరస కలిపేశావు.. నాకో కొడుకుండాలే గాని ఇట్టే నిన్ను కోడల్ని చేసుకోవాలనిపిస్తోంది ..

“అమ్మో అత్తయా.! అంత మాటనకండి మీకో కొడుకున్నా .. మా ఆయనకి అన్యాయం చేయలేను”  అంటూ ఆవిడ పక్కకి చేరి అల్లరిగా అంది..
“ఒహో! నీకు పెళ్ళి అయిందా! మరి నీకు కాశీ ప్రయాణమటే తెలియాలి కదా పిల్లా ! “ అని అంత ధీటుగా అడిగింది ఆ పెద్దావిడ.
హు.. మాది రిజిష్టర్ ఆఫీసులో అయింది అత్తయ్యా! అందుకే ఈ పద్ధతులేవి తెలియవు, ఇంతకీ కాశీ ప్రయాణం చెప్పలేదు మీరు " గుర్తు చేసింది పల్లవి. 


కాశీప్రయాణం
స్నాతకం అయ్యాక  మీ బావగారు బాజా భజంత్రీల మద్య వరుడు గొడుగు పట్టుకొని చేత్తో కర్ర పుచ్చుకొని కాళ్ళకు పాదుకలు ధరించి మెడలో పసుపు బట్టను వేసుకొని తాను సన్యాసం స్వీకరించేందుకు కాశీయాత్రకు వెళ్తున్నానని బయలుదేరుతాడు. అప్పుడు మీ తమ్ముడో, అన్నయ్యో .. వచ్చి 'అయ్యా, బ్రహ్మచారిగారూ! మీకాశీ ప్రయాణం విరమించుకోండి. మా సోదరిని వివాహం చేసుకొని గృహస్థుగా జీవించండి', అని చెప్పి బొట్టు పెట్టి, నూతన వస్త్రాలను ఇచ్చి వెనుకకు తీసుకొని వస్తాడు.
"తమ్ముడో, అన్నయ్యో.. వీళ్ళు లేరనుకొండి అత్తయ్యా.. మరి బావగారు కాశీ వెళ్ళిపోతారా ?" చిలిపిగా అడిగింది పల్లవి.
" బావగారిని కాశీ పంపించేలా ఉన్నావే నువ్వు..అంటూ.. వరస తమ్ముళ్ళు కాని, వరస అన్నయ్యలు కాని ఆ పని కానివ్వచ్చు , .. కాశీ యాత్ర మొదలయినప్పుడు కబురంపుతాము తమ్ముణ్ణో, అన్నయనో పంపండి , వెళ్తమమ్మా.. అక్కడ వరపూజ((ఎదురుకోలు), మొదలెట్టేప్పటికి  ఇక్కడ గౌరీ పూజ చేసుకోమ్మా.. అంటూ.. పదండఱ్ఱా!  ఇంకా ఇక్కడే ఉంటే అక్కడ ప్రవర సమయానికి వెళ్ళలేము”  అంటూ లేచింది పెళ్ళికొడుకు పెద్దమ్మ.
వరపూజ (ఎదురుకోలు)
కాశీ ప్రయాణానికి సన్నద్ధమయ్యే బావగారి గడ్డం కింద బెల్లం ముక్క కొట్టి మా అక్కని చేసుకొండి అని అభ్యర్ధించడానికి బయల్దేర్తున్న 14 యేళ్ళ కీర్తన చిన్నమ్మ కొడుకు.. వరపూజ మాట విని అదేదో బాగుందే అన్నట్లుగా వాళ్ళతో పాటు విడిదింటికి వెళ్తూ అడిగాడు..
"వరపూజ అంటే ఏంటండీ?  బావగారిని మంత్రాలతో పూజిస్తారా? "
"నువ్వెవరివిరా? పెళ్ళి కూతురి తరుపా పెళ్ళి కొడుకు తరుపా బావగారు అంటున్నావు?" అడిగింది పెద్దమ్మ
"నేను మా కీర్తనక్క తమ్ముడిని, బావగారి కాశీ ప్రయాణం ఆపడానికి వస్తున్నా మిగతావాళ్ళందరూ రెడీ అవుతున్నారు,  నన్ను మీతో వెళ్ళమన్నారు.. కీర్తనక్కేమో గౌరీపూజ హడావిడిలో ఉంది, మీరేమో వరపూజ అంటున్నారు.. గౌరి పూజ , వరపూజ ఎండు వేరు వేరా లేక రెండు ఒకటేనా?  ఇంతకీ వరపూజ...?" అన్నాడు.
వరపూజ అంటే ఎదుర్కోలు కాశీయాత్ర విరమించుకొని వరుడు కళ్యణ మండపానికి వస్తుంటే మీ పెదనాన్నగారు (కన్యాదాత) మేళ తాళాలతో, పానకం బిందెలతో, కొత్త బట్టలతో ఎదురేగి స్వాగతం పలుకుతాడు. పానకం వరునికి ఇచ్చి రుచి చూపించి,  తరువాత బంధువులందరికీ ఇస్తారు. తరువాత అంటే మీ పెదనాన్నగారు (కన్యాదాత) అందరినీ మండపానికి తీసుకెళతాడు.
మరీ.. గౌరీ పూజా.. నసిగాడు కీర్తన తమ్ముడు…
వస్తున్నా అక్కడికే వస్తున్నా..
ఇక గౌరీ పూజ.. ఇది పెళ్ళికూతురింట్లో పెళ్ళికూతురు చేసే పూజ.. పార్వతియే గౌరి. వివాహాదులందు ఈ పూజ ప్రసిద్ధము.. అన్యోన్యానురాగమును ఈ పూజ వర్థిల్లజేస్తుంది.  నామజపము, స్తోత్రపాఠము, నామ సంకీర్తనము దురితక్షయము చేసి వాక్ శుధ్ధికి కారణమవుతుంది. ఈశ్వరానుగ్రహము సిధ్ధింపజేస్తుంది …
“అవునుకాని పెద్దమ్మా.. వరపూజ గౌరీ పూజ, పెళ్ళికూతురు ఇవన్నీ చెప్పావు మరి నా చిన్నప్పుడెప్పుడో మా పిన్నికి పసుపు రాసి, నలుగు పెట్టి స్నానం చేయించారు.. అప్పట్లో మంగళ స్నానం చేయించడఱ్ఱా అని తాతగారు అరుస్తుంటే విన్నాను.. అసలీ మంగళ స్నానం అంటే ఏంటి చెప్పవా.. ఇప్పుడు ఇక్కడ మంగళ స్నానాలు అయిపోయాయా?”
గౌరీ పూజ గురించి, వరపూజ గురించి వివరిస్తున్న పెద్దమ్మని అడిగిది పెళ్ళికూతురిని చూడ్డానికంటూ వచ్చిన గుమ్మల్లో ఓ గుమ్మ.
మంగళ స్నానాలు
అవునే.. ఈరోజే మీ అన్నకి, వదినకీ మంగళ స్నానాలు చేయించారు.. అంటే  పెళ్ళికి ముందర ఒక మంచి రోజున గానీ, స్నాతకం-అంకురార్పణల రోజున గానీ  పెళ్ళికొడుకును-పెళ్ళికూతురును చేయడం ఆచారం. ఆ ఉదయం మంగళ స్నానాలతో  కార్యక్రమం మొదలవుతుంది. వధూ-వరుల ఇళ్లలో, ఉదయం తెల-తెలవారుతుండగానే, మంగళ వాయిద్యాల మధ్య ఇంటి ముందర మామిడి ఆకులతో తోరణం కట్టే కార్యక్రమం ముందుగా జరుగుతుంది. వధువుకు, కన్యా దాత దంపతులకు, తోటి పెళ్ళి కూతురుకు (వధువు సొంత చెల్లెలు గాని, వరుసకు చెల్లెలు గాని), తెల్లవారక ముందే, ముత్తైదువలు బొట్టు పెట్టి, మాడుపై నూనె అద్ది, హారతిచ్చి, మంగళ స్నానాలకు సిద్ధం చేస్తారు. అలానే వరుడికి, తల్లి-తండ్రులకు, తోటి పెళ్ళికొడుకుకు (వరుడి సొంత తమ్ముడు గాని, వరుసకు తమ్ముడు గాని) కూడా జరుగుతుంది.
ఏంటఱ్ఱా ఆ హడావిడి.. పెళ్ళి కూతురి తండ్రి పంచె సర్దుకుంటూ పరిగెడుతున్నారు.. కాశీ ప్రయాణ సన్నాహలనుకుంట పదండి పదండి..

నమస్కారం అక్కయగారు.. ఎదుర్కోలు సన్నాహం ఉంది కదా.... అప్పుడే వద్దామనుకున్నాను కాని "కన్యావరణం"  ఉంది కదా వచ్చి వెళ్ళమని విడిదింట్లో పంతులుగారు పిలిచారు అందుకని వస్తున్నాను.. వెనకాల బాజ బజంత్రీలవాళ్ళు వస్తున్నారు. అన్నాడు కీర్తన తండ్రి.. వడి  వడి గా వచ్చిన ఆయసంతో రొప్పుతూ ..
పర్వాలేదు అన్నయగారు, మీరు విడిదంటిదాకా రానవసరం లేదు.. పెళ్ళికొడుకుని పందిరిదగ్గరకి తీసుకొచ్చేప్పుడు ఎదురొచ్చి దీవిస్తే చాలు.. ఈ పంతులుది అంతా హడావిడే.. అంది మోహన్ పెద్దమ్మ.
"బాబాయ్! ఇందాకట్నుంచి వింటున్నా వరపూజ, గౌరిపూజ అన్నారు మళ్ళీ ఇప్పుడు కన్యావరణం అంటున్నారు ఏంటి బాబయ్ అంటే ఏమి చేస్తారు అడిగాడు కాశీప్రయాణం ఆపడానికి వెళ్తున్న కీర్తన తమ్ముడు..

కన్యావరణము   అంటే ..మీ బావగారు మీ అక్కని అంటే మన కీర్తనని పెళ్ళి చేసుకుంటున్నారు కదా అంటే ఇన్నాళ్ళు పాటించిన బ్రహ్మచర్యాన్ని వదిలి గృహస్థాశ్రమాన్ని పొందుటకై వచ్చే వరునికి నేను వెళ్ళి  ఎదురేగి 'నాయనా నా కుమార్తెను భార్యగా స్వీకరించి కలకాలం వర్దిల్లమ'ని కన్యాదాత దీవిస్తాడు.
ఒహో అందుకా మీరు అంత హడావిడిగా పరుగెడ్తున్నారు పరాలేదు బాబాయ్ ఇంకా  బావగారు ఇంకా కాశీ ప్రయాణమే ఆపలేదు. నేను ఫోన్ చేస్తానుగా మీకు వాళ్ళు బయల్దేరేప్పుడు..

నువ్వు కాశీ ప్రయాణం ఆపుతుంటే నేను చూడక్కర్లేదేంట్రా.. వస్తున్నా పదా.. అంటున్నంతలో

నాన్నా మధుపర్కం తయారు చేయమంటున్నారు పంతులుగారు.. ఎలా చేయాలో చెప్పు నువ్వే ఇవ్వాలట కదా బావగారికి అని హడావిడిగా అక్కడికి వచ్చింది పల్లవి. అసలీ మధుపర్కం ఏమిటో ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు.. చ
ఈ రిజిష్టర్ పెళ్ళిళ్ళు కాదు కాని ఏమి తెలీదు ఈ పిల్లలికి అను అనుకుంటూ పల్లవి అక్కడ మీ అత్తయ్య ఉంది కదా ఆవిడని అడుగు నేను "కాశీ ప్రయాణం, కన్యావరణానికి వెళ్తున్నా ఇక్కడ ఆగితే ఆలశ్యమవుతుంది అని అన్నడు పల్లవి తండ్రి.
మధుపర్కం 
ఎలాగు ఇటొచ్చింది కదా నేను చెప్తాలే అమ్మాయి ఇదిగో ఇలా రా.. మథుపర్కం అంటే……  
మధువు అంటే తేనె  కుమార్తెకు భర్తగా వరుని ఎంపిక తరువాత అతను వధువు తల్లి తండ్రికి సంప్రదాయం అనుసరించి పుత్ర సమానుడౌతాడు వివాహానంతరం.  మధుపర్కము అంటే తీయని పానీయము అని అర్ధము. ఇంతకు ముందు తేనే ఎక్కువగా ఉపయోగించేవారు. ప్రస్తుతము దీనికి బదులుగా వరునికి పంచదార రుచి చూపిస్తున్నారు.
మీ బావ పెళ్ళి కొడుకు అలంకారంలో మంగళగీతికలతో, వేదమంత్రములతో చక్కని వాహనమున మీ  యింటికి వస్తాడు . వాళ్ళందరినీ  ఆహ్వానించి మీ నాన్న  మధుపర్కము (తేనే) ఇస్తారు. పెళ్ళికొడుకు  మంత్రపూర్వకముగా మధుపర్కమును స్వీకరిస్తాడు. అని వివరించింది పెళ్ళికొడుకు పెద్దమ్మ.
*********
ఇటు గౌరీ పూజ, అటు వరపూజ, కాశీ ప్రయాణం, కన్యావరణం, మధుపర్కం ఇవన్నీ అయిన తరువాత పెళ్ళిపీటలమీద కూర్చుని అప్పటిదాక జరిగిన తంతుతో కాస్త అలసటగా అనిపించి కళ్ళు మూస్తున్న తరుణంలో "బావగారికి యజ్ఞోపవీతం" తెచ్చారా అక్కా!  అని పల్లవి అడగడంతో అక్కడ మళ్ళీ హడావిడి నెలకొంది.. అవును పెళ్ళిలో ఈ యజ్ఞోపవీతధారణ విధానం ఏంటి  పవిత్రమయిన ఈ కార్యం గురించి చెప్పేదెవరూ అని కీర్తన ఆలోచించింది.. పక్కనే ఉన్న వారందరినీ చూసింది.. ఎవరిని అడగాలి అని ఆలోచిస్తున్నంతలో.. తన తండ్రికి పంతులుగారు యజ్ఞోపవీతం గురించి ధరించడం గురించి  వివరణ ఇస్తుండడంతో శ్రద్ధగా వినసాగింది.


యజ్ఞోపవీతధారణ 
పరమం పవిత్రం:-
జీవితాన్ని వ్రతమయంగా పరమ పవిత్రంగా చేసుకోవడానికే యజ్ఞోపవీతం ధరించబడుతుంది. కనుక యజ్ఞోపవీతధారి జీవితం పరమ పవిత్రంగా ఉండాలి.
ఆయుష్యం:-
వ్రతమయంగా నియమబద్ధంగా జీవితం ఉంటుంది. కనుక యజ్ఞోపవీతధారికి దీర్ఘాయువు లభిస్తుంది.
అఘ్ర్యం:-
లోకహితకరములగు శ్రేష్ఠకార్యములందు యజ్ఞోపవీతధారి అగ్రగామిగా ఉండాలి.
బలమస్తు తేజ :-
యజ్ఞోపవీతధారి తేజోబల సమన్వితుడుకావాలి.
శుభ్రం:-
పవిత్రతకు చిహ్నమగు యజ్ఞోపవీతం సదా పరిశుభ్రంగా ఉండాలి. పసుపు కుంకుమలు పూయరాదు.
యజ్ఞోపవీతధారణ
యజ్ఞోపవీతధారణ చేయుటకు ముందు-
ఓం అమృతో ప స్తరణ మసి స్వాహా '
ఓం అమృతా పిధాన మసి స్వాహా|
ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రయతాం స్వాహా |
అను మంత్రములతో ముమ్మారు ఆచమనం చేయాలి. ఆచమనము- కంఠము నుండి హృదయము వరకు తడుపునంత మాత్రమే నీటిని అఱచేతిలో పోసుకొని, అఱచేతి మొదటను నడుమను పెదవులనుంచి పీల్చాలి. దీనివలన కంఠమునందలి కఫము, పిత్తము కొంత నివారిస్తాయి.
తరువాత:- - ఓం వాజ్మే ఆస్యే అస్తు.
ఓం నసోర్మే ప్రాణోస్తు.
ఓం అక్ష్ణో ర్మే చక్షురస్తు.

ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు.
ఓం బాహ్వొర్మే బలమస్తు.
ఓం ఊర్వోర్మే ఓజోస్తు.
ఓం అరిష్టాని మేజ్గాని తనూ స్తన్వా మే సహ సంతు.
అను మంత్రములతో నీటిని ఆ యా అంగములపై చల్లుకోవాలి. దీనివలన బద్ధకము దూరమవుతుంది. పిదప జందెమును సరిచేసి రెండు చేతులతో పట్టుకొని యజ్ఞోపవీత మంత్రాన్ని చదివి తలమీదుగా మొదట మెడలో హారములాగ వేసుకోవాలి. అనంతరం కుడిచేతి క్రిందికి తీసుకోవాలి. వ్రతచిహ్నమయిన యజ్ఞోపవీతంలో  మూడు పేటలుంటాయి. ఆ మూడు పేటలు ఈ మూడు రుణాలను తీర్చవలెనని స్ఫురింపజేస్తూ ఉంటాయి. మరియు యజ్ఞోపవీతంలోని మూడు పోగులు వ్రతమయంగా జీవితం గడపు మానవుని కర్తవ్యాలెన్నింటినో సూచిస్తూ ఉంటాయి. ప్రపంచ సమస్యల పరిష్కరించుకొనుటకు సృష్టికి అనాది (మూల) పదార్థములయిన జీవేశ్వర ప్రకృతుల గుణకర్మ స్వభావముల ను తెలుసుకోవాలి - అన్న సూచన ఈమూడు పోగులలో నిగూఢమై ఉంటుంది. అంతేగాదు. పదార్థ విజ్ఞానము ద్వారా అనాది పదార్థములయిన జీవేశ్వర ప్రకృతుల యొక్క గుణకర్మ స్వభావములను గుర్తెరిగి నిష్కామంతో వేదవిహిత ధర్మకర్మలాచరిస్తూ అంతఃకరణశుద్ధి సంపాదించాలి. అనంతరం అనన్య చిత్తంతో ధ్యానించి పరమేశ్వర సాక్షాత్కారం మానవుడు పొందాలి. అనగా పరమ పురుషార్థ సాధనకు జ్ఞానకర్మోపాసనలు మూడు అవసరం- అను సూచనయు ఈమూడు పోగులలో ఉన్నది. ఇంకను ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయములు, ప్రకృతి యొక్క సత్వరజ స్తమో గుణములు, పురుషార్థములగు ధర్మాథకామములు, ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవికములను త్రివిధ దుఖములు, తల్లి తండ్రి ఆచార్యుడు నను త్రివిధ విద్యాసంస్థలు, మనోవాక్కాయకర్మలు- ఇత్యాది త్రిత్వముల జ్ఞానం సంపాదించి జీవితం వ్రతమయంగా మానవుడు గడపాలనే సూచన ఈ మూడు పోగుల నిర్ణయంలో గర్భితమైఉంది. మరియు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్తములను మూడు ఆశ్రమముల వరకు ఈ యజ్ఞోపవీతధారణ పరిమితమను సూచన ఇందులో ఉంది.  సన్యాసులకు శిఖాయజ్ఞోపవీతములుండవు. మరియు శరీరంలో కుడివైపును దక్షిణభాగంగాను, ఎడమవైపును ఉత్తర భాగంగాను చెప్పుతుంటారు. యజ్ఞోపవీతం ఎడమ భుజం మీదుగా కుడి చంక క్రిందికి ధరింపబడుతుంది. అంటే యజ్ఞోపవీతం యొక్క పైభాగం ఉత్తర దిశకు ఒరిగి క్రింది భాగం దక్షిణ దిశకు ఉంటుంది అన్నమాట. గోళాకారంగా ఉన్న భూమి కూడ పైభాగం ఉత్తర ధృవం వైపునకు ఒరిగి క్రింది భాగం దక్షిణ దిశకు ఉంటుంది. కావున యజ్ఞోపవీతధారి మెడలో వృత్తరూపంగా ఉన్న యజ్ఞోపవీతం భూగోళాన్ని స్ఫురింపజేస్తూ ఉంటుంది. దీనినిబట్టి మానవుడు భూగోళంలో బంధితుడై ఉన్నట్లు బోధపడుతుంది.

కాబట్టి అతడు స్వార్థపరుడై సాటిమానవుల శ్రేయస్సే తన శ్రేయస్సుగా భావించి వ్యవహరింపవలసి యుంటుందని యజ్ఞోపవీతం సూచిస్తుంది.

“ధర్మప్రజాసంపత్యర్ధం స్త్రియం ఉద్వాహే”  అని వరుడు అనవలెను ధర్మ కార్య నిమిత్తం, సంతాన నిమిత్తం, సంపదను వృద్ధి చేసే నిమిత్తం ఈ స్త్రీని పెళ్ళాడుతున్నాను అని వివాహాంగాభూతమైన ద్వితీయ యజ్ఞోపవీతాన్ని ధరిస్తున్నాను అని సంకల్పం చేస్తాడు. యజ్ఞోపవీత ధారణ అయిన తరువాత కన్యాదాత కన్యాదానము నిమిత్తము మహాసంకల్పం పాటించాలి."
అంటూ విడిదింటి నుండి వచ్చిన పెళ్ళికొడుకు మోహన్ చేత వేద మంత్రాలతో యజ్ఞోపధారణ చేయిస్తూ.. ఇటు వివరిస్తూ ఇలా మంత్రాలకి అర్థాలు అడుగుతూ శాస్త్రోక్తంగా చేసుకుం టున్న  ఈ జంట ని చూసి తన వేద మంత్రాలకి , పెళ్ళిమంత్రాలకి ఇన్నాళ్ళకి విలువ లభించిందని తృప్తిగా వారిద్దరినీ అశీర్వదించాడు ఆ పూజారి.

యజ్ఞోపవీతధారణ గురించి పంతులుగారు అలా ధారాళంగా చెప్తుంటే.. కీర్తనకి తను చాలా అదృష్టవంతురాలిని అని అనిపించింది, ఇంత శాస్త్రోక్తంగా, అర్థాలు తెలుసుకుంటూ చేసుకోడం.. యజ్ఞోపవీతధారణ తరువాత కన్యాదాన నిమిత్తం మహా సంకల్పం అంటే .. అనుకుని ఇలా అడిగింది.. "నాన్నా వినాయక చవితికి పూజ కోసం మనం చేసే సంకల్పం ఈ మహా సంకల్పం ఒకటేనా? "జంభూ ద్వీపే ప్రధమ పాదే అని .." అంటూ అర్థోక్తిగా ఆగిపోయింది.

మహాసంకల్పం
ఆమె అడిగిన ప్రశ్నకి అక్కడ అప్పటిదాక యజ్ఞోపవీతధారణ గురించి వివరించి చెప్పిన పంతులుగారు చిరునవ్వు నవ్వుతూ.. ఒక్కటే కాని, కల్యాణోత్సవాల్లో వినిపించే మహాసంకల్పం వలన సకల దోషాలు హరించడమే కాక మానవాళికి శుభం కలుగుతుందని పురాణాల్లో చెప్తారు.
మనము ప్రతి పనీ చేసేటప్పుడు “కరిష్యే”   అని అనడం  సంకల్పం అంటారు. మానవ జీవితంలో వివాహమనేది ఒక ముఖ్యమైన ఘట్టం కాబట్టి , కన్యను ఇచ్చే తరానికి పది తరాలు వెనుక, పది తరాలు ముందు వరకు కన్యాదాన ఫలాన్ని అనుభవిస్తారు. కావున ఇక్కడ చేసే సంకల్పం చాలా విలక్షణ మైనదిగా చెప్పబడింది. కనుకనే దీనిని మహాసంకల్పం అంటారు. మహాసంకల్పం విశ్వస్వరూపాన్ని చక్కగా వివరిస్తున్నది. ఇందులో ఖగోళ స్ధితి చక్కగా వివరించబడింది.భూమండలాన్ని పరిపాలించిన షోడశ మహారాజులు , షట్చక్రవర్తులు, సప్త ద్వీపాలు, నవ వర్షాలు, నవఖండాలు, దశారన్యాలు , యాభై కోట్ల విస్తీర్ణం గల జంబూ ద్వీపం , అందులో భారత వర్షం భారత ఖండంలో ఈ కన్యాదానం ఎక్కడ చేస్తున్నదీ కన్యాదాత పేర్కొంటాడు. అలాగే బ్రహ్మ కాలమాన ప్రకారం యాభై సంవత్సరాలు పూర్వార్ధం గడువగా, యాభై ఒకటవ సంవత్సరంలో, మొదటి మాసంలో , మొదటి పక్షంలో, మొదటి పగటిలో బ్రహ్మకు ప్రాణాయామ కాలం ప్రస్తుతం జరుగుతున్నట్లు చెప్పి తొమ్మిది కల్పము లలో శ్వేత వరాహ కల్పంలో, పద్నాలుగు మన్వంతరములలో ఏడవదైన వైవస్వత మన్వంతరంలో శాలివాహన శకంలో ఇరవై ఎనిమిదవ మహా యుగంలో కలియుగంలో ఫలానా సంవత్సరంలో ఫలానా మాసంలో ఫలానా తిది రోజున ఈ సుముహూర్త సమయంలో శ్రీ లక్ష్మినారాయణ ప్ర్రీతి కోసం సర్వాలంకార భూషిత ఐన ఈ కన్యను దానం చేస్తున్నాను.
ఈ కన్యాదానం వలన నాకు బ్రహ్మలోకంలో నివసించే యోగ్యత సిద్ధించాలి. అగ్నిస్తోమ , వాజపెయాది యాగాలు చేసిన పుణ్య ఫలం లభించాలి. నాకు వెనుక , ముందు పది తరాల వాళ్ళు బ్రహ్మ లోకంలో నివసించాలి. అని కన్యాదాత సంకల్పం చేస్తాడు. వివాహ సమయంలో చేసే మహా సంకల్పంలో మనం అర్ధం చేసుకోవలసిన విషయం ఏమిటంటే మహాకాలంలో ,మహావిశ్వంలో మానవుడు ఎంత చిన్నవాడో అర్ధం చేసుకోవడానికి అహంకారాన్ని తగ్గించుకొని వినయవిధేయతలు పెంచుకొని కర్తవ్య పరాయనుడై ధర్మానికి కట్టుబడి ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

అని చెప్తూ.. మహాసంకల్పం చేయించి.. తరువాత కీర్తన తండ్రిని కాళ్ళు కడిగే కార్యక్రమానికి రమ్మనమని పిలిచారు పంతులుగారు

కాళ్ళు కడుగుట
శ్రీ లక్ష్మీనారాయణ  లక్ష్మీనారాయణ స్వరూపుడైన వరునకు పూజ

వరం అభ్యర్చ్య ........................... ఇదం వాం పాద్యం
శ్రీ లక్ష్మీనారాయనస్వరూపుడైన పెళ్ళి కుమారునికి ఈ కూర్చ ఆసనము. లక్ష్మీనారాయణ స్వరూపుడవైన ఓ వరుడా! నీ రెండు పాదములను కడుగుటకు ఈ ఉదకము సుమా! అని ముందు కుడి కాలు , తరువాత ఎడమకాలు కడగాలి.
పెళ్ళి కుమారుడు , అతని తరఫు పెద్దలు పెళ్ళికి తరలి వచ్చిన తరువాత కన్యాదాత సకుటుంబ సపరివారంగా సకల మంగళ వాద్య ఘోషలతో సమస్త సుగంధ పూజా ద్రవ్యములతో వారి దగ్గరకు వెళ్లి వర పూజ చేస్తాడు.
శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపుడైన వరునికి ఈ క్రింది మంత్రంతో పాదప్రక్షాలన చేస్తాడు.
ఓం నమోస్తు అనంతాయ ........ యుగాదారినే నమః
వేల కొలదీ రూపాలు,పాదాలు, కన్నులు, తలలు, తొడలు, బాహువులు నామాలు, కిరీటాలు ధరించిన అనంతుడైన శాస్వతుడైన పురుషోత్తమునకు నమస్కారం చేస్తున్నాను. కన్యను వరించడానికి మృగశిరా నక్షత్రంలో పెద్దలను పంపితే కన్యాదాత గౌరవానికి వాళ్ళు పాత్రులు అవుతారు. కార్యసిద్ధి కలుగుతుందని ఆపస్తంబ గృహ్య సూత్రం చెబుతోంది. దీనిని ఈనాడు వరాన్వేషణకు కూడా అన్వ ఇంచుకోవచ్చు. లక్ష్మీనారాయణ స్వరూపుదవైన ఓ వరుడా! ఇవి సుగంధ ద్రవ్యములు.అలంకార నిమిత్తం అక్షతలు. ఇవన్నీ నాశానరహితములై ఉండుగాక! అని వరునకు అర్చన చేస్తారు.
మన పెద్దవాళ్ళు ఏ పని చేసినా దేన్ని రూపొందించినా అందులో ఏదో ఒక తాత్వికభావన అంతర్లీనంగా ఉంటూనే ఉంటుంది. భారతీయ జీవన విధానంలో ఆ దృష్టి ఉండడం వల్లనే భారతీయ సంస్కృతీ ప్రపంచంలో సభ్య దేశాలన్నింటిలోనూ అద్వితీయంగా కొనియాడబడుచున్నది . పెళ్లి కొడుకు కాళ్ళు కడిగినప్పుడు ముందు కుడికాలును తరువాత ఎడమ కాలును ఇంద్రుని అంశంగా భావించి కడగాలి. తరువాత రెండు పాదాలను కలిపి కడగాలి.
అని చెప్తూ బ్రహ్మం గారు ఇలా అన్నారు……

“మీరిలా పేరు పేరునా మంత్రాలు, వివాహంలోని ప్రతి ఒక చర్య గురించి అడుగుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది.. ఇక నువ్వు అడగక్కర్లేకుండానే ఇప్పటినుండి సత్యనారాయణ వ్రతం వరకూ నాకు తెలిసింది మీ చేత చేయిస్తూ వివరిస్తాను అమ్మా.. అని బ్రహ్మంగారు అనడం చూసి కీర్తన ఆనందంతో అభినందనలు తెలిపింది.”
ఇక సుముహూర్తం ఆసన్నమయింది అంటూ ఆ ముహూర్త బలం గురించి జీలకఱ్ఱ బెల్లం గురించి వివరంగా చెప్పనారభించారు .. వాళ్ళచేత చేయిస్తూ బ్రహ్మమగారు

సుముహూర్తం (జీలకర్రబెల్లం)
పెళ్ళిచూపులతో ఒక కార్యక్రమం పూర్తి అయిన తరువాత  వారిరువురి జాతకాల ననుసరించి జ్యోతిష్యములో అనుభవమున్న పండితులతో పెళ్ళికి తగిన ముహూర్తం నిర్ణయించ బడుతుంది. వారు నిర్ణయించిన ముహూర్తానికి వరుడు వధువు తలపై జీలకర్ర బెల్లం పెట్టడం జరుగును.
బెల్లం:- ప్రతిష్టాకాముడైనవాడు కామేష్టి యందు క్షేత్రపత్స చరువును , ఇష్టిని చెయ్యాలని శృతి విధిస్తోంది.(ఇది భూమి మీద చిరకాల స్ధితిని కోరేవాడు చెయ్యాలి.)
మంత్రం:-క్షేత్రస్య పతే మధుమంతం ఊర్మిం .......... మృడయంతు. ఈ మంత్రంలో భూమిని సంబోధించడం జరుగుతోంది . ఓ భూదేవతా! ధేనువు నూతనంగా ప్రసవించిన ఆవు పాలను ఇచ్చునట్లుగా నీవు మాధుర్య రసముతో కూడినట్టి పదార్ధములను ఇచ్చుచున్నావు.
ఘ్రుతం:- నెయ్యి వలె పర్యూషితత్వ దోషం లేకపోవుటచేత అతి పవిత్రమైన నారికేళము, ఇక్షు ఖండం ,బెల్లం మొదలైన భోగ్య పదార్ధ సమూహాన్ని మాకు ఇమ్ము. యజ్నపతులు మమ్ములను సుఖపెట్టెదరు గాక.
ఈ మంత్రంలో భూమి దేవతను భోగ్య పదార్ధములను ఇమ్మని కోరే సందర్భంలో ఆ భోగ్య వస్తు పరంపరలో బెల్లమును కూడా పరిగణించి ఆ బెల్లమునకు నాలుగు విశేష గుణములను చేర్చారు. అవి
1.ఆ బెల్లము మాధుర్యోపేతం. తరంగముల వలె అవిచ్చిన్నమైనది.
2.తన మాధుర్యమును ఇతర వస్తువుల యందు సంక్రమిమ్పచేస్తుంది.
3. ఘ్రుతం వలె పవిత్రమైనది.అన్నము మొదలైన వండిన పదార్దములు ఈ రోజు వండినవి మరునాటికి పనికిరావు.కనుక అపవిత్రమవుతాయి. వాటిని తింటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అవి పర్యూషితాలు కనుక. ఘ్రుతానికి పర్యూషిత దోషం లేదు. ఈ విధంగా బెల్లం అనేక సత్ గుణాలతో కూడుకొని ఉంది. అందు చేత ఇంత పవిత్రమైన జీలకర్ర బెల్లాన్ని మిశ్రమం చేసి వధూవరులు పరస్పర హస్తాలతో శిరస్సున మంచి సుముహూర్త సమయంలో ఉంచడం ఆచారమై ఉంది. దీని వలన వధూవరుల శరీరంలో పరస్పరం ఒక విజాతీయమైన సంస్కారం కలుగుతుందని అనడంలో అతిశయోక్తి లేదు. ఇట్టి మార్పునకు అనుకూలమైన పరమ మంగళ పదార్ధముల సమ్మేళనము పరస్పర ప్రీతికి సాధనము.కనుకనే శిష్టాచారంలో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
వివాహంలో సరిగ్గా ముహూర్తం వేళకు   పురోహితుడు  జీలకర్ర, బెల్లం కలిపిన మిశ్రమాన్ని  వధూ వరూలిద్దరు ఒకరి తలమీద ఒకరు  ఉంచెలా చేస్తారు. శాస్త్రరీత్య ఈ 'గూడజీరక'  మిశ్రమానికి బ్రహ్మరంద్ర్రాన్ని తెరిపించే శక్తి  ఉంటుందట. అలా జీలకర్ర, బెల్లం కలిపి నూరిన ముద్దని తలల మీద పెట్టుకునే సమయంలో ఒకరి కళ్ళలోకి మరొకరు  చూసుకోవాలి. అలా చూసుకున్న సమయంలో వధువరులిద్దరికి ఒకరి మీద ఒకరికి ఆకర్షణ కలిగి , జీవితాంతం అన్యోన్యం గా  కలిసి మెలసి ఉంటారట. అందుకే  జీలకర్ర, బెల్లాన్ని, ఒకరి శిరస్సు మీద మరొకరు ఉంచుతారు అని 'ధర్మాసింధూ' గ్రంథం చెబుతుంధీ.
ఈ కార్యక్రమమునందు ఈ మంత్రము పఠిస్తారు.
అస్య ముహూర్తస్య సుతిర్హిం సువారం
సు నక్షత్రం సు యాగం సుకరణం
సుచంద్ర తారాబలం అనుకూలం
శుభశోభనాస్సర్వేగ్రహః సునక్షత్రాః
శుభై కాద్శ్స్థాన ఫలదాః సుప్రీతాః
సుముహూర్తాః సుప్రసన్నా వరదాః భవంతు


అభ్రాతృఘ్నీం వరుణాపతిఘ్నీం బృహస్పతే! ఇంద్రపుత్రఘ్నీం లక్ష్మంతామస్మై సవితు స్సువః!! ఓం అఘోర చక్షురపతిఘ్వేది శివా పతిభ్య స్సు మనా స్సు వర్చా!!! జీవ సూర్ధేవ కామాస్యోనా శంనో భవద్విపదే శంచతుష్టదే!!!!

ఈ ముహూర్తమునకు మంచి తిథిని మంచి వారమును మంచి నక్షత్రం, మంచి యోగమును మంచి కరణమును మంచి చంద్రతారాబలమును అనుకూలముగా చేసి శుభములు శోభనములునయి అన్ని గ్రహములును ఫలము నిచ్చునవై మంచి ప్రీతి గలవై సుముహూర్తములు గలవై సుప్రసన్న తగలవై వరములనిచ్చునవై అవుగాక.
సుముహూర్త సమయంలో చూర్నికను పఠించేప్పుడు దానిలో మంగళ ద్రవ్యములను కలిపి , అవి మంగళ కరములు అగు గాక! అని అను తలచే ఆ సమయంలో మంగళద్రవ్య వాచక పదములను పఠించిన మాత్రం చేతనే మంగళ ప్రాప్తి కలుగుతుంటే మంగళమునూ , పావనమునూ అయిన బెల్లము, జీలకర్ర కలిపిశిరస్సునందు ఉంచుటవలన విశేషమైన శ్రేయః ప్రాప్తి అగునని వేరే చెప్పనవసరం లేదు.
ఇక సమీక్షణం…..



సమీక్షణం
వరుడు వధువు ముఖాన్ని సుముహూర్త కాలంలో చూడదాన్నే సమీక్షణం లేక నిరీక్షణం అంటారు. కలయన వేదిక పైన వదువే తూర్పు ముఖంగా కూర్చుంటుంది. వరుడు పశ్చిమ ముఖంగా కూర్చుంటాడు. వీరిద్దరి మధ్యా అడ్డుగా తెల్లటి తేరా సెల్లాను పట్టుకుంటారు. శుభ ముహూర్త కాలంలో వరుడు వధువు కనుబొమ్మల మధ్య అలక్ష్మీ తొలగుటకై దర్భలతో తుడిచి వధూవరులు ఒకరినొకరు వీక్షించుతను సమీక్షణం అంటారు. ఈ సమీక్షణ కార్యక్రమమును కులాచారమును బట్టి ఆచరించెదరు.
అలాగే  ….యుగాచ్చిద్రాభిషేకం
వివాహ సమయంలో దర్భను చుట్టగా చుట్టి వధువు శిరస్సు పై ఉంచి నాగలి కాడిని వధువు శిరస్సు పై ఉత్తర దక్షినములుగా ఉంచి నలుగురు బ్రాహ్మణులు ఆ కాడిని పట్టుకొని ఆ కాడి యొక్క ఉత్తరంవైపున ఉన్న రంధ్రంలో మామిదికోమ్మను ఉంచి దక్షిణం వైపున ఉన్న రంధ్రంలో బంగారపు మంగళసూత్రమును ఉంచి పాలను ఆ బంగారపు మంగళ సూత్రములపై ఐదు మంత్రములతో అబిషేకిన్చేదారు. ఆ పాలు వధువు శిరస్సు మీద పడాలి.
దర్భలు చుట్ట చుట్టి వధువు శిరస్సు పై పెట్టుటకు కారణం ఉన్నది. అది ఏమనగా "పవిత్రం వై దర్భాః అపామ్వా ఏష ఒషదీనాగుం రసో యద్దర్భాఃఅని శ్రుతులు దర్భలు పవిత్రమైనవని చెప్పాయి. కనుక వాటి చేత సంమార్జనం మంత్ర పురస్సరంగా చేయుటవలన అలక్ష్మీ నశిస్తుందని తాత్పర్యం.
ఈ విధంగా యుగాచ్చిద్రాభిషేకం చేయుటకు ఒక ఇతిహాసము ఉన్నది. పూర్వం అపాల అనే ఒక కన్య ఉండెడిది. ఆ కన్య బొల్లి రోగ గ్రస్తురాలు అగుట వలన ఎవ్వరూ ఆ కన్యను వివాహం చేసుకొనలేదు. కాని ఆమె మనస్సులో యజ్ఞంలో ఇంద్రుని పూజించాలి ఎలాగ?అని దిగులుతో ఉండేది. అంటే వివాహం చేసుకొని భర్తతో యజ్ఞంలో ఇంద్రునికి సోమరసాన్ని హోమం చేసే అదృష్టం ఎప్పటికైనా వస్తుందా? అని నిరంతరం మనస్సులో చింతిస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజున స్నానానికి నదికి వెళ్ళింది. నదిలో దిగి స్నానం చేస్తుండగా ఆ నీటి వేగానికి కొట్టుకొని పోతుంది.
అంతలో దైవవాశం చేత ఆ ప్రవాహంలో ఒక సోమలత తన వద్దకు కొట్టుకు వచ్చింది. నేను వివాహం చేసుకొని భర్తతో కలిసి యజ్ఞంలో సోమలతను శాస్త్రీయంగా దంపి ఆ రసాన్ని ఇంద్రునకిచ్చే భాగ్యం లేదుకదా! అని తన దగ్గరకు వచ్చిన సోమలతను దంతములతో నమిలి ఆ రసాన్ని ఇంద్రుని ఉద్దేశించి ఉమ్మి వేసింది. ఆమె భాగ్య వశం చేత ఆ సమయంలో ఇంద్రుడు ఆకాశంలో రధం మీద వెడుతూ శబరీ వలె ఉన్నా ఆమె భక్తీ పారవశ్యానికి సంతోషించి రాధముయోక్క కాడి వగైరాల నుండి ఆమెపై ముమ్మారు అమృత సేచనం చేసి బొల్లి రోగాన్ని పోగొట్టాడు. ఆమెను సూర్య వర్చస్సు కల దానినిగా చేసాడు. అందుచేత కాడి రంధ్రముల నుండి స్రవించే సువర్ణ సంసృష్టములైన ఉదకముల స్నానంచేత ఈ కన్యకు వర్చస్సును బోధించే "ఖేనసః" అనే మంత్రం చేత యుగము యొక్క చిద్రమును శిరస్సునందలి దర్భేన్వమునందు ఉంచాలి
కన్యాదానం చేశే సమయం వచ్చింది అంటూ కీర్తన తండ్రిని పిలుస్తూ కన్యాదానం గురిని ఇలా చెప్పసాగారు.

కన్యాదానం
దానము అంటే ఇతరులకిచ్చునది. అది విద్య, భూమి, వస్తువు ఇలా వీటిని వారి వారి జీవన విధానానికి అనువుగా మలచుకొనేందుకు ఇస్తారు. అలాగే కన్యాదానము చేసేది వరుడు ఆమెతో సహజీవనము చేస్తూ గృహస్థుడై అభివృద్ది చెందవలెనని. ఈ క్రింది మంత్రముతో కన్యను వరునికి అప్పగిస్తారు.
కన్యాదానం చేసేది వరుడు వధువుతో కలిసి సహజీవనం చేస్తూ గృహస్థుడై అభివృద్ది చెందవలెనని ఈ మంత్రంతో కన్యను వరుడికి అప్పగించే కార్యక్రమం కూడా ముగిసింది.

కన్యాం కనక సంఫన్నాం'కనకాభరణైర్యుతాం! దాస్వామి విష్ణవే తుభ్యం'బ్రహ్మలోక జగీషియా!!
           పరాశర ప్రకారం అష్ట వర్ష భవేత్ కన్యా."అపూర్ణ దశవర్షా కన్యముద్వహేత్ "
ఆపస్థంభం.సప్తవర్షా భవేద్గౌరీ,దశవర్షాతు నగ్నికా,ద్వాదశేతు భవేత్కన్యా,అత ఊర్ద్వం రజస్వలా
వర్ష ద్వాదశకాదూర్ద్వం నస్యాత్పుష్పం బహిర్యది"అని కాశ్యప సంహిత.”

అని ……
కన్యాం కనక సంపన్నాం కనకాభ్రణైర్యుతాం!
దాస్వామి విష్ణవే తుభ్యం
బ్రహ్మలోక జిగీషయా! 

బ్రహ్మలోక ప్రాప్తికోసం నేను సువర్ణ సంపద గల, స్వర్ణాభరణ భూషిత అయిన ఈ కన్యను లక్ష్మీనారాయణ స్వరూపుడివైన నీకు దానం చేయబోతున్నాను.
ఆపస్థంభం.సప్తవర్షా భవేద్గౌరీ,దశవర్షాతు నగ్నికా,ద్వాదశేతు భవేత్కన్యా,అత ఊర్ద్వం రజస్వలా"
భవిష్యపురాణం ప్రకారం 12ఏళ్ళు దాటితే పుష్పవతి కాకున్నను సంభోగార్హత ఉంది.
"వర్ష ద్వాదశకాదూర్ద్వం నస్యాత్పుష్పం బహిర్యది"అని కాశ్యప సంహిత.
దీని అర్ధం-ఈమె బంగారం వంటి మనస్సు కలది. కనకము వంటి శరీర చాయ కలది. శరీరమంతయు ఆభరణములు కలిగినది. నా పిత్రాదులు సంసారమున విజయము పొంది శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తిపొందినట్టు శృతి వలన విని యున్నాను. నేనూ ఆ శాశ్వత ప్రాప్తి పొందుటకై విష్ణురూపుడైన నీకు నా పుత్రికను కన్యాదానము చేయుచున్నాను.మొత్తము మీద వధువు (భార్య) పురుషార్ధాలైన ధర్మ,అర్ధ,కామ,మొక్షము లకు మూలమని కన్యాదానం చెబుతుంది.
కన్యాదానం తరువాత చేసేది యోక్త్ర బంధనం

యోక్త్ర బంధనం
తరువాత ఆ కాడి యొక్క రంధ్రమందు శాంతే హిరణ్యం అను మంత్రం చేత , సువర్ణమునుఅంతర్దానంగా ఉంచాలి. సువర్ణమును పెట్టి అభిషేకం చెయ్యడానికి కారణం శృతి ఇలా అంటోంది.
పూర్వం వరుణుని యొక్క ఇంద్రియ సామర్ధ్యాన్ని ఉదకములు బయటకు వెళ్ళగొట్టాయి. అలా బహిర్గతమైన వీర్యం సువర్ణరూపందాల్చింది. అందుచేత ఇంద్రియసామర్ధ్యం బహిర్గతం కాకుండా ఉండడానికి సువర్ణం పెట్టి అభిషేకం చెయ్యాలని చెప్పి ,తరువాత సువర్ణం నుండి స్రవించిన ఉదకములు ఆయుర్వృద్ధి హేతువులుగా బోధిస్తోంది.
హిరణ్య దానం చేత అపమృత్యువు పోతుంది. కనుక హిరణ్యం ఆయు స్వరూపం. అటువంటి హిరణ్య సంయుక్తములైన ఉదకములు ఆయువును వృద్ధి పరుస్తాయి.ఆ ఉదకములే యజమానిని గూర్చి స్రవిస్తాయి.
అలాగే హిరణ్యం దీప్తి కలది. కనుక అటువంటి హిరణ్య సంబంధం చేత తేజస్సంపాదకములైన ఉదకములే ఈ యజమానుని గూర్చి స్రవిస్తాయి. సువర్ణాభరణ సంబంధం వల్ల దేహం శోభిస్తుంది. కనుక సువర్ణ సంబంధం చేత వర్చో హేతువులైన ఉదకములు ఈ యజమానుని గూర్చి స్రవించును. ఈ విధంగా ఆయుస్సు, వర్చస్సు, తేజస్సులకు సాధనమైన హిరణ్యమును ప్రాకృతంలో కాడి యొక్క రంధ్రములో ఉంచి ఆ సువర్ణం ద్వారా స్రవించే ఉదకము వధువు యొక్క శిరస్సు యందు పడుటచే హిరణ్యము, ఉదకములు ,కాడి మొదలైనవి ఆయురాది సంపాదన ద్వారా సుఖసందాయకములని పై శృతి తెలియజేస్తోంది. ఓ కన్యా! ఈ హిరణ్యం, ఈ ఉదకములు, ఈ యుగచ్చిద్రం మొదలైనవి నీకు సుఖకరములు అగు గాక!



వివాహంలో ఆశాసానా అను మంత్రం చేత వధువు నడుమునకు దర్భత్రాడు కడతారు. దర్శపూర్ణ మసేష్టులనే శ్రౌత కర్మలో ఈ మంత్రం పత్నికి యోక్త్ర బంధనం చేసేటప్పుడు చెబుతారు. ఎవని యొక్క పత్ని అగ్నికి అనువ్రతురాలవుతూ అనుసారిని అవుతూ సౌమనస్యాన్ని , సంతానాన్ని, సౌభాగ్యాన్ని, శోభన సన్నివేశమైన శరీరాన్ని కోరుతుందో ఆ పత్నిని శోభన కర్మకు సుఖమయ్యేలా యోక్త్రం చేత బంధించుచున్నాను. యోక్త్ర బందన సమయంలో పై మంత్రాన్నుచ్చరిస్తూ ఉండడం చేత ఈ పత్నిని యజ్న యోగ్యురాలుగానూ , పాప రహితురాలుగానూ చేసి సత్యమైన ఆశీస్సుతో సంరుద్ధురాలుగా చేయుచున్న వాడవుతాడు. ఈ విషయంలో విద్యారన్యులవారు ఇలా వివరించారు. "యథా వివాహే స్త్రియః కంతే మంగళసూత్రం లింగం తద్వాట్.అస్మిన్నర్దే లౌకిక వైదిక ప్రసిద్ధిం దర్శయతి తస్మాత్ ఆహుహ్ యస్చైవం వేదయస్చన యోక్త్రమేవయతే యమన్యాస్తే తస్యా అముష్మిన్ లోకే భవతి విమోక్త్రేనాలోకంలో వివాహమందు స్త్రీ కన్తమందు మంగళసూత్రం వ్రాత స్వీకరణ చిహ్నంగా ఉన్నదో అలాగే దర్శపూర్ణ మాసేష్టులలో పత్నికి యోక్త్ర బంధనం అనువ్రత స్వీకార చిహ్నమన్న మాట.
సామాన్యంగా సూత్రధారణం లోకంలోనూ, వేదం లోనూ కూడా నియమ స్వీకారమందు చిహ్నము. ఎలాగా అంటే లోకంలో ఎక్కడో దూరదేశ మందున్న దేవతా దర్శనాన్ని చేయ సంకల్పించిన వారు సూత్రం కట్టుకునే ఆచారం ఉన్నది.వేదంలో కూడా ఉపనయనంలో మౌన్జిని (ముంజి గడ్డిచే నిర్మితమైన త్రాడును) వటువునకు కడుతున్నారు. కనుక యాగమును తెలిసినవారు, తెలియనివారు అందరూ ఇలా అంటున్నారు .ఏమని అంటే ఈ పత్ని యోక్త్రమును ముఖ్యంగా ధరించుచున్నది.ఏ భర్తను అనుసరించి ఈమె వ్రతమును స్వీకరించి ఉన్నదో అతని సంబంధమైన మంగలసూత్రముతో పరలోకమందు కూడుకొన్నది అయి ఉంటుంది. దీనివలన వివాహమందు స్త్రీకి మంగళ సూత్రం అనూచానంగా ఆచారమిచ్చినట్లు స్పష్టమవుతోంది. తరువాత ఇష్టిలో యోక్త్రమును పత్నికి ముడి వేయుట వలన ఆశీస్సులను ఈ పత్నియందు పరిగ్రహించిన వాడు అవుతాడు.
అయ్యా! మంగళ సూత్రధారణ సమయం ఆసన్నమయింది.. ఇదిగో ఈ సూత్రాలు ముత్తైదువులకి చూపించి రండి.. త్వరగా.. భజంత్రీలు భజంత్రీలు.... అంటూ హడావిడిపడ్తూ.. సూత్రధారణ గురించి చెప్తున్నారు పంతులుగారు.
మంగళసూత్రధారణ
వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్ధంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో 'మంగళ' అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు కలవు. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు కలవు. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపికూడా కొందరు తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్రధారణ జరుగునపుడు ఈ మంత్రమును పఠిస్తారు.
శ్లోకం:-మాంగల్య తంతునానేనా మామ జీవన హేతునా
కన్థె బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం
మాంగల్య ధారణ ముహూర్తః సుముహూర్తః అస్తు.
 నా జీవన హేతువైన ఈ మంగళ సూత్రమును గుర్తుగా నీ కన్తమున కడుతున్నాను. మూడు ముళ్ళూ వేస్తున్నాను.నీవు నిండు నూరేండ్లు బ్రతుకు అని ఆ వేసిన ముడులకు కుంకుమ అద్దాలి. ఈ మూడు ముడులలో

1.ధర్మ పురుషార్ధానికి సంకేతము.
2.అర్ధ పురుషార్దమునాకు సంకేతము.
3.కామ పురుషార్ధమునకుసంకేతము
అని ఆర్యుల వచనం.
1.గత జన్మ బంధం
2.ఈ జన్మ బంధం
3.భవిష్యత్ జన్మ బంధం
అని కొందరు అందురు. అంటే!అన్యోన్య అనురాగంతో జన్మ జన్మలకు ఈ మైత్రి బంధం మన ఉభయులకూ , అలాగే సాగాలని ప్రేమ బంధం మూడు మారులు వెయ్యడం జరిగింది. అన్నారు మరి కొందరు. త్రి కరణయా మనసా , వాచా , కర్మణా, నీ భారం వహిస్తాను. కనుక నీవు నా భార్యవు.అని మూడు ముడులు వేస్తున్నాను.అని భావమన్నారు కొందరు.
ఈ మంగళ సూత్రములను తయారు చెయ్యడంలో గుండ్రని వర్తులాకారంలో మధ్యన బోటిమ వంటి దానిని నిర్మిస్తారు. ఇది స్ఫోటము. దీని విషయంలో అగ్నిచయనమనే క్రతువులో యజమాని కంఠమునకు ఇరవైఒక్క స్ఫోటములు కలిగిన సృవం రుక్మమును కడతారు. ఈ ఇరవై ఒక్క సంఖ్యకు కారణం ఏమిటో ఇలా చెప్పబడింది. దేవలోకములు ఇరవై ఒకటి కనుక ఈ రుక్మమునకు ఇరవై ఒక్క స్ఫోటములచేత ఇరవై ఒక్క దేవలోకముల నుండి కూడా శత్రువును కనుపించకుండా చేస్తుందని శృతి చెప్పడం వలన వివాహంలో నిర్బాధం వలన ఈ లోకంనుండి శత్రువును అంతర్హితుని చేసే ఉద్దేశ్యంతో ఒక స్పోటము ప్రస్తుతం మంగళ సూత్రములకు నిర్మితమవుతోందని భావించాలి. మంగళసూత్రమును వరుడు వదువునకు అభిముఖుడై పై శ్లోకము చెప్పుచూ కన్తమందు 21 స్ఫోటములు కలిగిన సువర్ణ రుక్మమును కడతారు. కనిపించకుండా చేసే ఉద్దేశ్యంతో ప్రస్తుతం ఒక స్ఫోటముతో మంగళ సూత్రం నిర్మితమవుతోందని భావించాలి. మంగళసూత్రమును వరుడు వదువునకు అభిముఖుడై ఈ శ్లోకం చెప్పుచూ మూడు ముళ్ళు వెయ్యాలి. నీ మనస్సుకూడా ఈ బంధమందు లగ్నమై ఉండుగాక.
1.మనస్సుతో
2.వాక్కుతో
3.శారీరక క్రియతో
సౌమనస్యంతో ఉండుగాక.నీ భారం వహిస్తున్నాను అని భావమన్నారు కొందరు. ఈ మూడు ముడులలో మరో గొప్ప అర్ధం ఇమిడి ఉంది.
ఓ కన్యా మన ఉభయులద్వారా 21 తరాలు తరించాలి. ఒక ముడికి ఏడు తరముల చొప్పున మూడు ముడులకు మూడు ఏడులు ఇరవై ఒక్క తరములు కదా! వారుతరించాలి. నిన్ను నాకు నీ తండ్రి ఇచ్చేటప్పుడు మహా సంకల్పంతో ఇచ్చాడు. “దశ పూర్వేషాం” అనగా మనకి ముందు పది తరాలు, “దశ అపరేషాం”  అనగా మనకి వెనుక పది తరాలు , మనతో 21 తరాలు అయినది. ఇది సార్ధకం కావడానికి ఈ మూడు ముడులు గుర్తుగా వేస్తున్నాను అని అర్ధం.
బ్రహ్మం గారు అలా వివరిస్తుండగా.. మనసుఫూర్తిగా ఆయన చెప్పిన 21 తరాలు తరించాలని, వారు చెప్పిన మంత్రాలని పఠిస్తూ కీర్తనకి మూడు ముళ్ళూ వేసి.. తనదానిగా చేసుకున్నాడు.. మూడో ముడి వేస్తున్నప్పుడు అతనికి కీర్తన ఇక తనది అన్న ఒక భావనతో హృదయం ఆనద తాండవం చేసింది. తనకొక బాధ్యత , భర్తగా తన హోదా పెరిగింది అన్న భావన మనసు నిండా ఆవరించి తృప్తి కలిగింది.
ఇక కీర్తన పరిస్థితి కూడా ఇంచుమించు అంతే .. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న తరుణం..
పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుని ముని వేళ్ళు
పచ్చని మెడపై రాసే వెచ్చని చిలిపి రహస్యాలు...
అన్నట్లు ఆ స్పర్శ . ఆమెని గిలిగింతలు పెట్టింది.. జీలకఱ్ఱ బెల్లం పెట్టెప్పుడే.. సమీక్షణం సమయంలో కళ్ళు కళ్ళు కలిసినప్పుడు .. సూటిగా మోహన్ చూస్తున్నప్పుడే సిగ్గుల మొగ్గ అయింది.. ఇక ఇప్పుడు స్పర్శ.. చెప్పడానికి వర్ణించడానికి తనకి మాటలు రావడం లేదు..
ఇద్దరూ అలా ఆనంద డోలికలో ఆలోచనల్లో ఉండగానే తలంబ్రాల కార్యక్రమం మొదలు పెట్టారు బ్రహ్మం గారు... వాటి గురించీ వివరిస్తూ..
తలంబ్రాలు
మంగళ సూత్రధారణ పూర్తి అయిన తరువాత తలంబ్రాల అక్షతలు తల మీదుగా పోసుకొంటారు. దీనినే అక్షతారోహణం అంటారు. 'క్షత' అంటే విరుగునది- 'అక్షత' అంటే విరగనిది. అనగా విడదీయరాని బంధము కావలెనని భావము. తలన్+బ్రాలు అంటే తల నుండి క్రిందికి జారునవి అని ఈ క్రింది మంత్రముతో పురోహితుడు తలంబ్రాల కార్యక్రమము కొనసాగిస్తాడు.
దదామీత్యగ్ని.........ఆదిత్యస్సత్యమోమితి ఈ కన్యను నేను దానం చేస్తున్నానని అగ్ని చెబుతున్నాడు.అలాగేనని వాయుదేవుడు అన్నాడు. అది నిజమా!నాకు ఇష్టమేనని చంద్రుడు అన్నాడు. సత్యమేనని ఆదిత్యుడు అంగీకరించాడు.
ఆపస్తత్సత్య ....................సంరుద్ధ్యతాం యజ్న దక్షిన రూపమైన కీర్తి కారణమైన ఈ కన్యను ఉదకము యొక్క దేవతలు తీసుకొని వచ్చారు. అందువలన నేను కోరిన సంతానం సమృద్ధిగా కలుగు గాక!
ఇలా వరుడు తలంబ్రాలు పోసిన తరువాత వధువు వరునిపై తన దోసిలిలో తలంబ్రాలను పోస్తుంది. రెండవ సారి వెనుకటి లాగానే దోసిళ్ళలో తలంబ్రాలను నింపుకొని వధువు దోసిలిని పైన పెట్టి పై మంత్రాలను చదువుతూ చివరిలో మాత్రం ఈ క్రింది వాక్యం చెబుతూ వరునిపై తలంబ్రాలను పోస్తుంది. నాకిష్టమైన పశువులు పాడిపంటలు సంమృద్ధిగా ఉండాలి. ఇక మూడవసారి పై క్రియలన్నీ జరిగిన తరువాత వరుడి దోసిలి పైన పెట్టి ఈ క్రింది మంత్రం చెబుతూ వధువు పైన తలంబ్రాలు పోస్తాడు. నాకిష్టమైన త్యాగం సంమృద్ధిగా ఉండాలి. నాలుగవసారి మంత్రాలు లేకుండానే తలంబ్రాలు పోసుకొంటారు.కొందరిమతంలో ఈ క్రింది మంత్రంతో ఇద్దరూ ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకొంటారు. మాకు కావలసిన సిరిసంపదలు సంమృద్ధిగా ఉండాలి. మాకు కీర్తి ప్రతిష్తలు సంమృద్ధిగా ఉండాలి. అనే అర్ధం వచ్చే మంత్రాలను కూడా చెబుతారు.

ప్రజాపతి స్త్రియాం యశః'ముష్కరోయధధాద్సపం! కామస్య
తృప్తిమానందం'తస్యాగ్నేభాజయేహమా!! అంటూ బ్రహ్మం గారు చెప్పడం ముగించనే..

  
అక్కా! నువ్వు పొయ్యక్కా.. మనమేమాత్రం తగ్గకూడదు.. అంటూ పల్లవి
అన్నయ్యా నువ్వు ముందు.. మనం అస్సలు తగ్గకూడదు.. అంటూ మోహన్ వరస చెల్లెళ్ళు..
అలా వాళ్ళ సరదా అల్లర్ల మధ్య తలంబ్రాల జోరు హోరు ముగిసింది.
అంగరంగ వైభవంగా మోహన్ కీర్తిల వివాహం నిర్విఘ్నంగా జరిగింది.
******
కంకణి విమోచనం, గర్భాదానం, మూడు నిద్దర్లు
“ఏమి చేద్దాం?”
"ఏమి చేద్దాం?"
"నువ్వేదంటే నేనదే...."
"నువ్వేదంటే నేనదే...."
"ఏయ్ చిలిపి... వెళాకోళాలా... నడుము చుట్టు చేయి వేసి దగ్గరికి తీసుకు అధరాలని ఆత్రంగా అందుకుని అమృతాన్ని గ్రోలుతున్న సమయంలో..
అతనినుండి విడివడి...
"మోహన్ అన్నీ తెలుసుకున్నాము పెళ్ళిలో జరిగే ప్రతీ తంతూ ప్రతి మంత్రం మనకి తెలుసు.. ఈరోజు విశిష్టత కూడా.. తెలుసుకుని...... " ఏమంటాడో అని....కొంచం బెరుకుకుగా మరికొంచం సంకోచంగా అడిగింది కీర్తన..
ఈరోజు గురించి తెలుసుకునేదంటూ ఏముంది కీర్తూ.. పెళ్ళయింది.. వ్రతం అయింది.. ఇహ  శోభనం ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోడం... మనమిద్దరం ఒకటవడం.. అంటూ ఆమె చేతిని తనచేతిలోకి తీసుకుంటూ సుతారంగా నిమిరాడు.. మోహన్.
పెళ్ళిలో ఇప్పటిదాకా జరిగినవన్నీ మనకేమి తెలియనివి కాదు కదా మోహన్.. అయినా అన్నీ వివరంగా అడిగి తెలుసుకున్నాము కదా అలాగే.... చేతిని విడిపించుకుంటూ పద అన్నట్లుగా కనుసైగ చేసి బయటకి దారి తీసింది కీర్తన.

సరే! నువ్వే తెలుసుకో .. కాని ఎవరిని అడుగుతావు? కీర్తూ.. అసహనంగా అడిగాడు మోహన్.

మా అమ్మమ్మ వచ్చిందిగా.. ఆవిడని అడుగుతాను...
****
హహహ వెఱ్ఱిదానా! ఈ విషయం తెలుసుకోడానికా ఇలా వచ్చావు...గదిలోకి వెళ్ళేప్పుడే చెప్పేదాన్నికదా అమ్మలూ... సరే విను.. ఈరోజున జరిగే కార్యక్రమాన్ని గర్భాదానం అంటారు.  గర్భాదానం అంటే స్త్రీ గర్భమును పురుషునికి దానం చేయడం అన్నమాట . అంటే పురుషుడు తన వీర్యకణ విత్తనాలు నాటుటకు స్త్రీ తన మట్టి వంటి గర్భమును దానం చేస్తుంది. గర్భాధానాన్ని మన వాడుకభాషలో శోభనం అని కూడా అంటాము .గర్భాదానం పుట్టింట 3 రాత్రులు, మెట్టినింట 3 రాత్రులు చేస్తారు. ఈ కార్యంలో భార్యా భర్తలు శారీకంగా కలుస్తారు.ఈ గర్భాదానం వలన సంతానం కలుగుతుంది.కాబట్టి ఇక్కడ మూడు రాత్రులు, నీ మెట్టినింట మూడు రాత్రులు  నిద్దర చేయాలి.. అదీ సంగతి ఇక  వెళ్ళు .. ఇప్పటికే చాలా ఆలశ్యమయింది.. అంటూ వెళ్తున్న కీర్తనని చేయి పట్టుకుని చెవిలో గుస గుస గా “ పొద్దున్నే వచ్చి ఏమి జరిగిందో చెప్పు”  అంటూ కన్ను గీటారు  అమ్మమ్మగారు...

అమ్మమ్మ అన్న మాటకి సిగ్గుల మొగ్గయి గదిలోకి వచ్చింది కీర్తన.. అలా సిగ్గుపడుతూ వస్తున్న కీర్తనని చూసి.. తనని తాను మైమరచిపోయాడు మోహన్.

అందం అణుకువ రెండూ సమపాళ్ళల్లో పోతపోసిన బొమ్మ కీర్తన, తెల్లటి చీరలో ముగ్ధ మనోహరంగా ఉంది. నడుము ఉందా లేదా అన్నట్లుగా ఉంది.. తపాన్నో తమకాన్నో ఆపుకోలేక, ఆమే తనదగ్గరికి వచ్చేదాకా కూడా ఆగలేక ఆమె దగ్గరికి వెళ్ళి నడుము చుట్టు చేవి వేసి గాలి కూడా చేరనంతగా దగ్గరికి తీసుకుని.. ఆమె పెదవుల్ని తన పెదవులతో బంధించేశాడు..

కీర్తనకి ఈ అనుభవం హాయిగా గాలిలో తేలిపోతూ ఉంది.. మోహన్ మన్మధబాణాన్నే వేశాడో లేక మదన తాపాన్నే రేకెత్తించాడో కాని.. అతని కౌగిట్లో గువ్వలా ఒదిగిపోయింది... పారవశ్యంతో.

ఆ తమకంతోనే... పెదవులని నుదిటినుండి మొదలుపెట్టి బుగ్గలని కొరికి, పెదవులపై ముద్రవేసి, శంఖంలాంటి కంటం చుట్టూ ముద్దుల హారాన్ని తొడిగి... నెమ్మదిగా కిందకీ జరుగుతూ పిలిచాడు మోహన్..
"కీర్తూ"
"ఊ" అతని స్పర్శకి తన్మయమవుతూ మత్తుగా మూలిగిది కీర్తన
"ఏమి చెప్పారు మీ అమ్మమ్మ?"
“అదే గర్భాదానం... గర్భాదానం…..”సిగ్గుతో చెప్పలేక ఆపేసింది కీర్తన
" చెప్పు కీర్తూ … గర్భాదానం అంటే ఏంటి?"
ఆమె పరువాలతో ఆడుకుంటూ అన్నాడు మోహన్...
"నేను చెప్పనా.. కాదు కాదు.. థియరీ వద్దూ ప్రాక్టికల్గా చెప్పనా.."
"ఊ" గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కీర్తన...
"యాహూ" అని మనసులోనే గట్టిగా అరిచేసుకుని స్వర్గధామం వైపు దారి మళ్ళించాడు.. మోహన్..

ఆ రాత్రి వాళ్ళకి  వసంత రాత్రే.. ప్రపంచాన్ని మరిచి ఇద్దరూ ఏకమయ్యారు.










ఒక ఆరు నెలల తరువాత….
ఏంటి కీర్తూ.. ఒకపక్క హెల్త్ బాలేదు, ఏమి రాస్తున్నావు? కాసేపు రెస్ట్ తీసుకో, అంటూ కీర్తన రాస్తున్న పేపర్స్ ని తీసి ఫైల్‌లో పెట్టబోయాడు మోహన్.
అయ్యో మోహన్ అవి మన తీపి జ్ఞపాకాలు, మధురమైన పెళ్ళి సంఘటనలు తీసెయకలా.. ఇంకా రాయాలి, ఇదిగో చూడు నాన్నకి,  నాకు ఇలా పెళ్ళి అయింది అంటూ వీటిని మనకు పుట్టబోయే పిల్లలికి బహుమతిగా ఇవ్వాలి, అది నా కోరిక . ఆ కాగితాలని జాగ్రత్తగా తీసుకుంటూ గుండెలకి హత్తుకుని, నవ్వుతూ అంది కీర్తన.
నేను వద్దన్నానా కీర్తూ కాని నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా.. చూడు ఎలా అలసిపోయినట్లుగా ఉన్నావో... లాలనగా అన్నాడు మోహన్

మన సాంప్రదాయాన్ని కాపాడే మన వివాహ విధానం నాటి నాటికి విలువ కోల్పోతోంది మోహన్, అందుకే ఈ బృహత్తర కార్యక్రమాన్ని నా నెత్తిమీద వేసుకున్నాను.  ఈ వివాహ వ్యస్థను కాపాడుకుంటూ ఇలా పుస్తక రూపంలో మన ముందు తరాలవాళ్ళకి అందివ్వాలని నా ఆకాంక్ష. మనం ప్రతి మంత్రానికి అర్థం, పరమార్థం తెలుసుకుంటూ ఒక సంకల్పంతో పెళ్ళి చేసుకున్నాము. మన ముందు తరాల వాళ్ళకి కూడా వాటి విధి విధానాలు అర్థాలు తెలియాలి అన్నది నా తాపత్రయం అందుకే.. బ్రహ్మం గారు, పెద్దవారు చెప్పినవన్నీ.. నాకు గుర్తున్నవన్నీ ఇలా పుస్తకరూపేణా ఇద్దామని. ఆపద్దు ప్లీజ్.. నా ఆరోగ్యం బాగుంది.. 5 నెలేగా ఇప్పుడు.. ఇదిగో మన పెళ్ళి అప్పుడు జరిగినవి, అడిగినవి అన్నీ తలంబ్రాలదాకా రాశేసాను. ఇంకా బ్రహ్మముడి, సప్తపది ఇత్యాదివన్నీ పంతులుగారు చెప్పినట్లుగా..    రాసేస్తె దీన్ని పుస్తకం గా మార్చి భధ్రపరచవచ్చు.

నీ మాట నేను ఏనాడన్నా కాదన్నానా కీర్తూ.. నీ ఇష్టం  అప్పుడే తలంబ్రాల దాక రాసేసావా.. మరి ఆతరువాత జరిగిన శోభనం గురించి నేను చెప్పనా? చిలిపిగా కన్ను గీటుతు అడిగాడు మోహన్.
ఛి చిలిపీ! .. ఎప్పుడూ అదే ధ్యాస.. దాని గురించి కూడా రాసాను ఇంకా.. బ్రహ్మ ముడి, సప్తపది, అంపకాలు, సత్యనారయణ స్వామి అన్నీ రాశేసాను.. చదవి ఎలా ఉందో చెప్పు.. ఎక్కడన్నా మార్చాల్సి వస్తే చెప్పు..

ఊ! చదువుతాను.. పేరు ఏమని పెడ్తావు కీర్తూ?

ఇంకా ఏమి అనుకోలేదు మోహన్.. నువ్వు చెప్పు ఏమని పెట్టను?

"మోహనకీర్తనీయం" బాగుందా మన పెళ్ళి గురించి కదా రాసింది..

"సమ్మోహనకీర్తనీయం" నవ్వుతూ అంది కీర్తన

నువూ మరీ చిలిపి కీర్తూ.. దగ్గరికి ఆమెని తీసుకుంటూ అన్నాడు మోహన్

ఎవరిది చిలిపితనం నీదే మాటల్లో దింపేసి మైమరపిస్తావు.. మురిపిస్తావు..నీతో కూర్చుంటే అసలు టైం తెలీదు, వంటింట్లో పని ఉంది వచ్చేలోపులో ఇది చదివేసి, ప్రూఫ్ ఇచ్చేయండి ఎడిటర్ గారు.. మన పెళ్ళి పుస్తకం చేయించేద్దాము, అంది కన్ను గీటుతూ..
తప్పకుండా.. కొంచం కాఫీ ఇస్తే నువ్వేమి చేయమంటే అదే చేస్తాను..అంటూ అక్కడ ఉన్న పేపర్ల దొంతరని చేతుల్లోకి తీసుకున్నాడు చదవడానికి ఉపకరమిస్తూ…
ఒకే డన్!. తీసుకొస్తాను.. బ్రహ్మముడి దగ్గరనుండి చదువు.. అని చెప్పేసి వెళ్ళింది కీర్తన..
********
బ్రహ్మముడి
వివాహంలో భార్యా భర్తల వస్త్రములకు బ్రహ్మ ముడులు అను పేరుతొ ముడులు వేస్తారు. ఆ వేయుటలో అభిప్రాయం ఏమనగా ..  బ్రాహ్మణ ఆశీర్వచనములను దంపతుల కొంగులలో ముడి వేయుట అని భావము. ఈ అర్ధమును స్ఫురిమ్పజేయు మంత్రమునే "గ్రందిం గ్రద్నాటి ఆశిష ఎవాస్యాం పరిగ్రుహ్నాతి" అను శృతిచే పాటిస్తారు. తరువాత బ్రహ్మముడి సదక్షినా ఫల తాంబూలములను వధూవరుల చేలాంచలములకు కట్టి ఆ రెండు కోణాలను కలిపి ఈ క్రింది అనువాకాన్ని చెప్పుచూ ముడి వెయ్యాలి.యోగాక్షేమస్య .................. ఆశిశామేవైతామాశాస్తే బ్రహ్మగ్రంధి ముహూర్తః సుముహూర్తః అస్తు. పాణిగ్రహనాన్గామగుట చేత మా ఇద్దరి సంరక్షణ నిమిత్తం రక్షలను కట్టుచున్నాను. వరుని చేతికి ఈ మంత్రం చెబుతూ పురోహితుడు కడతాడు. తరువాత వరుడు వధువు వామ హస్తమునకు కడతాడు.
బృహత్సామ ................... సగరేన రక్షా వద్వా వామకరే బధ్నాతి

అంగుళీకాలు తీయడం
ఉంగరాలు తీయడాన్నే ప్రధానాంగుళీయకం అంటారు. మూత కురచగా ఉండే చిన్న బిందెలో పాలూ, నీళ్ళూ పోస్తారు. దానిలో ఒక బంగారు ఉంగరాన్ని వేసి పురోహితుడు చెప్పగానే గభాలున దానిని తీయడానికి వధూవరులు ప్రయత్నిస్తారు. దొరికిన వారు వేరొకరికి తొడుగుతారు. చూడటానికి సరదాగా కన్పించే ఇది కేవలం అప్పటిదాకా పరిచయం లేని వదూవరులకు స్పర్శ తాలూకు సాన్నిహిత్యాన్ని తెలియచేయడానికి ఉద్దేశించబడిన కార్యక్రమం.
అంగుళీయకం అయిన తరువాత అగ్ని సాక్షిగా ఏడడుగుల కార్యక్రం మొదలవుతుంది
అగ్ని సాక్షిగా” – అంటే?
సోమ: ప్రథమో వివిధే
గంధర్వో వివిధ ఉత్తర:
తృతీయా గ్నిష్టేపతి:
తురీయ ష్తేమనుష్యచౌ:
సోమో దద ద్గంధర్వాయ – గంధర్వో దద దగ్నమే రియంచ పుత్రాగ్ శ్చాదా దగ్నిర్మహ్యమభో ఇమాం
వివాహ సమయంలో వరుడు అంటాడు “ఓ భార్యా! ప్రారంభకాలంలో సోముడూ, తర్వాత గంధర్వుడూ, ఆ మీదట అగ్నీ నిన్ను ఏలారు. ఇక నేను నాలుగవవానిగా అవుతున్నాను”. అంతేకాదు, సోముడు గంధర్వునికీ, గంధర్వుడు అగ్నికీ ఇస్తే, అగ్ని నిన్ను నాకు ధనముతోనూ, పుత్రులతోనూ ఇచ్చాడు” అని పెళ్ళైన ప్రతివరుడూ అనుకుంటాడు. పైశ్లోకానికి అసలైన అర్థం.
కన్య పుట్టగానే ఆమె పాలన పోషణలను చూడవలసిన బాధ్యత సోమునిది (చంద్రునిది). చంద్రుడు ఎలా ఆకర్షణీయుడుగా ఉంటాడో, ఎన్ని మాఱులు చూచినా, చూడాలని పించేలా, ఆయన కనబడని రోజుల్లో గుర్తుకు తెచ్చుకోనేలా ఎలా ఉంటాడో, అలా ఆ కాలంలో ఆ చిన్న పిల్ల ఉంటుంది. అందరి దృష్టి ఆ పిల్లమీద ఉండడానిక్కారణం సోముడు వారి మీద ఉండటమే.
కొంతకాలం తర్వాత చంద్రుడు వెళ్ళిపోతూ గంధర్వుణ్ణి పిలిచి, అ చిన్న పిల్లను అతనికి అప్పగిస్తాడు. “గంధర్వుడు చంద్రసాక్షిగా ఈమెను గ్రహిస్తాడు”
“లావణ్య వాన్ గంధర్వ:” – కన్యలో అందం అనేది ఇక అప్పటినుండి ప్రవేశ పెడతాడు. అంతేగాక, గంధర్వులు గానప్రియులు కూడాను. అందుచేత సంగీతానికి అనువైన కంఠాన్ని సమకూరుస్తాడు. ఒకవేళ ఆ కంఠం అనువు కాకపోతే సంగీతమంటే ఇష్టపడే మనసునీ గంధర్వుడు సమకూర్చుతాడు.
ఆ వయస్సులో ఉన్న ఆడపిల్లలు చక్కగా చూడ ముచ్చటగా ఉంటారు. గంధర్వుడు కన్యకి ఈయవలసిన అందాన్ని, చందనాన్ని, ఇచ్చాక, అగ్నిని పిలిచి అతనికి కన్యను అందచేసి పోతాడు. “అగ్ని ర్వై కామకారక:” ఆ అగ్ని ఆమె శరీరంలోకి “కామ” గుణాన్ని ప్రవేశపెడతాడు. ఆకర్షణీయతని చంద్రుడూ (మనస్సుని కూడ), లావణ్యాన్ని గంధర్వుడూ ప్రవేశపెట్టక, ఆమెలో కామగుణాన్ని అగ్ని ప్రవేశపెడతాడు.
ఇప్పుడు ఆమె వివాహానికి యోగ్యురాలైనది. ఇప్పుడు అగ్ని, వాయు, చంద్రు,ఆదిత్య, వరౌణులను పిలిచి “దదా మీ త్యగ్ని ర్వదతి” – అంటే ఇంక ఈ కన్యను వరునికి ఇవ్వదలచుకున్నానయ్యా అంటాడు అగ్ని. వెంటనే వాయు, చంద్రాదిత్యవరుణులు తమ అంగీకారాన్ని తెలుపుతాడు. అంటే అమ్మాయి వివాహానికి యోగ్యురాలైనది.
చంద్రసాక్షిగా గంధర్వుడూ, గంధర్వసాక్షిగా ఆ, అగి ఈమెను రక్షించగా, అగ్నిసాక్షిగా వరుడు గ్రహిస్తాడు ఈ అమ్మాయిని.
అందుకని “అగ్ని సాక్షిగా పెళ్ళి” అనే మాట వచ్చింది.
వధువు వరునితో ఏడడుగులు వేస ముందు-

ఏకమిషే విష్ణుస్తా వన్వేతు, ద్వే ఊర్జే విష్ణుస్త్వాన్వేతు..
మయో భవాయ విష్ణుస్త్వాన్వేతు
త్రీణి వ్రతాయ విష్ణుస్తా న్వేతుచత్వారి..
మయో భవాయ విష్ణుస్తా న్వేతు
పంచ పశుభ్యో విష్ణుస్తా న్వేతు షడృతుభ్యో, విష్ణుస్తా న్వేతు
సప్త హోత్రాభ్యో విష్ణుస్తా న్వేతు

ఓ చిన్నదానా! విష్ణుమూర్తి నీవు వేసే మోదటి అడుగువల్ల అన్నాన్ని నీవు నా వెంట నడు! రెండవ అడుగువల్ల బలాన్ని , మూడో అడుగువల్ల మంచి కార్యాలను, నాల్గో అడుగువల్ల సౌఖ్యాన్ని ఐదో అడుగువల్ల పశుసమృద్ధిని, ఆరో అడుగువల్ల ౠతు సంపదలను, ఏడో అడుగువల్ల ఏడుగురు హోతలను నీకు అనుగ్రహించు గాక!
సప్తపది జరిగిన తర్వాత వధువు గోత్రం వరుని గోత్రంగా మారిపోతుంది. తనవెంట ఏడడుగులు నడిచే వధువుని ఉద్దేశ్యించి వరుడు జపించే మంత్రాలివి.
సఖా సప్తపదా భవసఖా సప్తపదా బభూవసఖ్యంతే
గమేయంసఖ్యాన్మే మా యోష్ఠాః సఖ్యాల్తే మా యోపం
సమయావసంప్రీ సంకల్పావ హై ఏరోచిష్ణూ
సుమనస్యమనౌ ఇష మూర్ఖ మభి సంవసాన్నౌ సం నౌ
మనాంసి సంవ్రతా సుముచిత్తన్యకరం
వివాహంలో సప్తపది ముఖ్యమైన ఘట్టము. ఓ చిన్నదానా ! నీవు నన్ను అనుసరించి నడువుము.నీవు నడిచేటప్పుడు….
 మొదటి అడుగులో శ్రీ మహా విష్ణువు , అన్నమును,
రెండవ అడుగులో బలమును,
మూడవ అడుగులో ఉత్తమ కర్మమునూ ,
నాల్గవ అడుగులో కర్మ ఫలమునూ,
ఐదవ అడుగులో పశు  సమృద్ధిని ,
ఆరవ అడుగులో రుతు సంపత్తినీ ,
ఏడవ అడుగులో యజ్న సాధకులైనా హోత ప్రశాస్తా, బ్రాహ్మనాచ్చంసి , పోత, నిషా, అచ్చాలూక , అగ్నేద్ధ్రులనే ఏడుగురు రిత్విక్కులనూ ప్రసాదిన్చుగాక అని అర్ధమిచ్చే మంత్రమును పఠించవలెను.
వధువును అగ్నికి ఉత్తరమునకు కుడి కాలితో అగ్నికి తూర్పునకుగానీ, ఉత్తరమునకుగానీ, ఏడు మంత్రములచేత ఏడు అడుగులు నడిపించి అడుగులో "సఖా సప్త పదా భావ " మొదలు ఏహి సూనృతే వరకూ చాతుస్వరముతో వరుడు జపము చేయవలెను. హోమములకు ముందు అగ్నికిని బ్రహ్మగారికిని ప్రదక్షిణం చేసి , మునుపటి వలె ఉత్తర వరుడుగా కూర్చుని వధువు తనను తగిలి ఉండగా మంత్రపూతముగా 16 హోమములు చేయవలెను. నీవు నాతొ ఏడడుగులు నడచుట వలన మన ఉభయులకు మైత్రి సిద్ధించింది. నిన్ను నేను విడువను. నన్ను నీవు విడువకు. మనము అన్యోన్య ప్రేమతో అనుకూలమైన మనస్సు, సమానమైన దాంపత్యము కలవారమై విధి విహితమైన కార్యముల యందు సమానమైన ఆలోచనలు కలిగి ఒకే మనస్సు కలవారమై ధర్మ కార్యములు చేస్తూ చరింతుము గాక! నేను సామ వేదము వలె , నీవు ఋగ్వేదము వలె, అవినాభావ సంబంధము గల వారము అగుదుము గాక! అంటే ఋక్కులను విడిచి సామం , సామమును విడిచి రుక్కు ఉండనట్లే మనం కూడా ఆకారము విడిచి ఆకారము ఉండకుండుము గాక! నేను స్వర్గము వంటి వాడిని , నీవు భూమి వంటి దానవు. అనగా భూమి ఆధారం .స్వర్గం ఆదేయం . ఆధార ,ఆదేయములకు కూడ అవినాభావ సంబంధము ఉన్నది.

నాతో ఏడడుగులు నడచి నా మంచి స్నేహితురాలివి కావాలి. అప్పుడు నేను నీ స్నేహాన్ని. మనమిద్దరం కలిసి ఏడడుగులు నడిస్తే స్నేహితులమవుతాం. నా స్నేహం నుంచి నీవెన్నడూ వియోగం పొందకు. నీ స్నేహం నుంచి ఎన్నటికీ వియోగం పొందను. ప్రేమను పొందుతాను. ప్రమతో, అనుకూల దాంపత్యంతో ప్రకాశిస్తూ నిండు మనస్సుతో ఆయారాన్ని, బలాన్ని పొందుతూ కలసి ఉందాం మన మనస్సులు కలిసేలా కలిసి ఆలోచించుకుందాం. అలాగే అన్ని విషయాల్లోనూ బాహ్యేంద్రియాలు కూడా ఉండేటట్లు నడుచుకుందాం.

పాణిగ్రహణం
సాధారణంగా వధూవరులు చిటికెనవ్రేళ్ళు కలిపి పట్టుకుంటారు.. దీనినే పాణిగ్రహణం అంటారు. ఇకపై నీరక్షణభారాన్ని నేను వహిస్తాను అని సూచించడానికి వధువు చేతిని పట్టుకుంటాడు వరుడు.
ముందు స్త్రీ సంతానం కావాలంటే ఇద్దరూ బ్రొటనవ్రేలు విడిచి మిగిలిన నాలుగు వ్రేళ్ళతో పట్టుకోవాలట. మగపిల్లవాడు కావాలనుకుంటే బ్రొటనవ్రేలు మాత్రమే ముందుగా పట్టుకోవాలిట. ఇద్దరూకావలనుకుంటే బ్రొటన వ్రేలుతో సహా అన్ని వ్రేళ్ళూ కలిపి పట్టుకోవాలిట.
శ్లో: పూషాత్వేతో నయతు హస్తగృహ్య అశ్వినౌత్వా ప్రవాహతాన్ రదేన గృహాన్ గచ్ఛ గృహపత్నీ యధసోవశి నీత్వం వివధం అవదాసి

నిన్ను సూర్యుడు అశ్వినులు కాపాడుదురుగాక. గృహ యజమానురాలిగా సర్వమునకు అధికారం   వహించి తీర్చి దిద్దుకొనుదానవుగా యింటికి రమ్ము.
నీవు నేను కలిసి ముసలితనం వచ్చేవరకూ జీవించడానికి, యోగ్యమైన సంతానాన్ని పొందడానికి నీచేతిని పట్టుకున్నాను. ఙ్ఞానస్వరూపులగు సవిత మొదలగు దేవతలు నిన్ను నాకు గృహస్తాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించుటకై భార్యగా అనుగ్రహించినారు.
ఈ మంత్రంతో వివాహం జీవితాంతం వుండే పవిత్ర బంధం అని స్పష్ట మవుతోంది. అంతేగాక, వధువును దేవతలచే తనకీయబడిన ఒక వరంగా వరుడు భావించడం విశేషం.
నేను రేతస్సును ఉంచువాడను. నీవు ఆ రేతస్సును గ్రహించుదానావు. నేను మనస్సు వంటి దానను . నీవు వాక్కు వంటి దానవు. మనోవాక్కులకు కూడా అవినాభావ సంబంధము ఉన్నది. కనుక మనమిద్దరమూ అవినాభావ సంబంధముగాలవారమై అన్యోన్యానురాగాముతో సంచరింతుము గాక! ఓ ! సత్య వాక్కులు గల దానా! నీవు నాచే చేయబడు ధర్మకార్యములందు అనుకూలముగా సంచరిస్తూ ఉత్తమమైన ఆచరణ భోగభాగ్యములు గల సంతానము పొందుటకై నా సమీపమునకు రమ్ము. వదూవరులకు అన్యోన్యము ,సఖ్యమును చేకూర్చుటకు ఈ ప్రకరణము చెప్పబడినట్లు తోస్తోంది. ఈ విషయం వ్యాకరణ శాస్త్రంలో సాప్తపదీనం సఖ్యం " అని చెప్పబడింది. అనగా ఏడు పరములచే స్నేహం పొందుతారని నిర్వచనం చేయబడింది.
ఇక్కడ పద శబ్దానికి మాటలకూ , అడుగులకూ కూడా అర్ధం ఉంది. ఇక్కడ వదూవరులకు ప్రాధమిక స్నేహంలో సిగ్గుచేత ఏడు మాటలు సంభాషించడం అసంభవం కనుక ఏడడుగులు నడిపించుట చేత సఖ్యం చేకూరుతుందనే ఉద్దేశ్యంతో స్నేహం కోసం ఈ సప్తపది చెప్పబడింది. సాధారణంగా మనకు ఎన్నడూ పరిచయం లేని వారితో ఏవో ఏడు మాటలు మాట్లాడడం చేత స్నేహం కలుగుతోంది
సప్తపది అంటే ? ఒక పళ్ళెంలో బియ్యం పోసి ఏడు పసుపు కొమ్ములు వరుసగా వాటి మీద ఉంచి ,వాటిపై" " మొదలైన ఏడు మంత్రములచేత క్రమంగా ఆవలనుండి పాదము చేత ఏడడుగులు వేయించడం సప్తపది. ఇదీ గాక వివాహంలో వధూవరులు పెండ్లి గ్రహాన్నుండి విడిదిలోనికి పోవునప్పుడు విడిది గృహం నుంచి పెండ్లి గృహానికి వెళ్ళేటప్పుడు వీధి గుమ్మం దగ్గర స్త్రీలు వారిని లోనికి పోకుండా నిరోధించి వరునిచే వధువు పేరు , వదువుచే వరుని పేరు చెప్పించిన తరువాత లోనికి పంపుతారు. ఇది ఆపాతతః కేవలం లౌకికముగానూ , గతానుగతికంగానూ వస్తూ ఉన్న ఆచారంగా కనబడుతుందే కాని ,శృతి మూలకం కాదని తోచవచ్చు. కానీ ఈ ఆచారానికి మూల భూతములైన , శృతిస్మృతులని పరికిస్తే మన సంస్కారాలు గూడంగా ఆచరణలో ఉన్నాయని తెలుస్తోంది. వివాహ సంస్కారం ధర్మార్ధ కామ రూపములైన మూడు పురుషార్ధములకే ఏర్పడింది. ఈ మూడు పురుషార్ధములు కూడా భార్యాభర్తల స్నేహం మీద ఆధారపడి ఉన్నాయి. అందుచేత సప్తపది మొదలుకొని స్నేహం సంపాదకములైన మంత్రజపాదులు విహితమై ఉన్నాయి.వివాహంలో తలుపుల దగ్గర పరస్పరం వారి పేర్లు చెప్పడం స్నేహం కోసమని స్పష్టమైంది. వ్యాకరణ శాస్త్రంలో వివాహానంతరం కళత్రం పేరు చెప్పకూడదని ఉంది.
"ఆత్మా నామ గురోర్నామ నామాతి క్రుపనస్యచ శ్రేయస్కామో న గృహ్నీయాత్ జ్యేష్టాపత్య కళత్రయొహ్"
 వివాహంలో శేషహోమ పర్యంతం సఖ్యతకోరకు చెప్పవలెనని పెద్దలంటున్నారు.
వధూవరుల సహపంక్తి భోజనము
"మాత్రా సహా ఉపనయనే వివాహే భార్యయా సహా
అన్యత్ర సహా భుక్తిస్చేత్ పతిత్యం ప్రాప్నుయాత్ నర:
శుభిక (భాశికం)
ఈ భాశికము గురించి  వేదములో ఈ విధముగా చెప్పారు ."శుభికేసిర ఆరోహ శోభయన్తీ ముఖం మమ ముఖగుం హిమమశోభాయ భూయాగుం సంచభాగం కురు. ఓ భాశికమా! మా శిరమున నాడు ఉంది భాసించుము. నా ముఖమునకు ,మాకు, హిమవంతుని వంటి చల్లదనమును , మంచి ఐశ్వర్యమును ఇమ్ము. ఈ మంత్రమును కార్యాన్తమందు మంగళ హారతి నందు చెప్పుచున్నారు. బ్రహ్మానులకు  ఇతరులకు ఈ భాసికము కట్టుట ఆచారముగా ఉంది.. కొత్నాలు రెండు బుట్టలతో ధాన్యము వధూవరుల ఎదుట పెట్టి , ముత్తైదువులు దంచి ఆ ఊకను వధూవరుల నెత్తి మీద పల్లెరములలో చెరుగుతారు. తరువాత తలలకు చమురు పెడతారు. తరువాత వేరే బట్టలు కడతారు. మధుపర్కాలను చాకలికి వేసి , తొందరగా ఆరవేసి తీసుకువచ్చే ఏర్పాటు చెయ్యాలి. కొత్నాలు దంపిన రోకళ్ళతో ముత్తైదువులు వధూవరుల నాభి స్థానమునందు తగిలించాలి. దీనివలన ఉదర రోగములు నశింపబడునని పెద్దల ఉవాచ. వివాహ సమయంలో కాళ్ళగోళ్ళు ఆచారములో ఉన్నది. గోళ్ళు పంటితో కొరకడం శుభసూచకం కాదు. ఆయుధంతో తీయుట సదాచారము. గో టిలో విషముండునని వాటిని తొలగిస్తారు.
నీలలోహిత ధారణము
దేవేంద్రునికి ప్రియపత్ని అయిన ఓ ఇంద్రాణి! నీకు నమస్కారము. నాకు వివాహమును ,భాగ్యమును, ఆరోగ్యమునూ, పుత్రలాభామును, ప్రసాదించెదవు గాక! అని ప్రార్ధించి నీలలోహిత పూజను చేసి నీలలోహితే........... బధ్యతే అనే మంత్రాన్ని చెప్పి ముత్యముల చేతనూ, పగడముల చేతనూ, కూర్చబడిన సూత్రమును కట్టాలి. మెట్టెలు
'స్థాలీపాకం'' పేరుతో ఒక ఆచారాన్ని పాటిస్తారు. ఆ సమయంలో పెళ్ళికూతురి కాలివేళ్ళకు మెట్టెలు తొడుగుతారు.
ఈ మెట్టెలను నూపురములు, పాద అంగుల్యాభరణములు  అని కూడా అంటారు. వీటిని గూర్చి రామాయణములో కిష్కిందకాండలో సీతాదేవి వస్తువులను రామునకు సుగ్రీవుడు చూపించినప్పుడు ఆ వస్తువులు లక్ష్మణునకు చూపగా పరీక్షించి చూచి
"రామ! నాహం జానామి కేయూరే నాహం జానామి కంకనే నూపురేతు అను జానామి నిత్యం పాదాభి వందనాత్"
అనే మాటలు లక్ష్మణుడు చెమ్మగిల్లిన కళ్ళతో అనెను. అనగా సౌభాగ్యవతులైన స్త్రీలకు ఈ మెట్టెలు సౌభాగ్య అలంకారములైనవి.
సదస్యం (మహదాశీర్వచనం)
దీనినే మహదాశీర్వాచనం అంటారు. నూతన దంపతులైన సీతారాములకు వేదాశీస్సులను అందించే వ్యాజంగ సర్వజన సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఈ సదస్యం నిర్వహించారు.
నల్లపూసలు
మంగళ సూత్రంతో పాటు నల్ల పూసలు గొలుసుగా ధరించడం మన హిందూ సాంప్రదాయం. దుష్ట శక్తులు తన మాంగల్యం మీద పడకుండా ఉండటానికి ముక్యంగా ధరిస్తారు. అంతే కాకుండా నల్లపూసలు సంతాన సాఫల్యానికి, దానానికి, సుఖానికి చిహ్నాలు. నల్లపూసలు మంగళకరమైన, సౌభాగ్యమైన ఆభరణము.
అరుంధతీ నక్షత్రం
కొత్త దంపతులకు వివాహం కాగానే అరుంధతీ నక్షత్ర దర్శనం చేయించడం సంప్రదాయంగా కనిపిస్తుంది నూతన వధూవరులకు అరుంధతీ నక్షత్రాన్ని చూపించడం వల్ల వారి మధ్య అన్యోన్య అనురాగాలు పెంపొందుతాయని మహర్షులు అంటారు. అరుంధతీ వశిష్టులను ఆదర్శ దంపతులుగా మన పెద్దలు పేర్కొంటారు.
విష్ణుసహస్రనామాల్లో సైతం అరుంధతీని ప్రస్తావించారు. వీరిని చూడటం వల్ల నూతన దంపతులకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని పెద్దల వాక్కు. అంతేకాకుండా అరుంధతీ ఎన్నడు వశిష్ట మహర్శిని విడిచి ఉండలేదు. అలా నువ్వు కూడా నన్ను విడిచి ఉండకుండా అరుంధతీ తారలాగ నిలవాలని వరుడు వధువునకు అరుందతి నక్షత్రాన్ని చూపుతారు. అరుంధతీకి సంబంధించి పురాణకథ ఒకటి ఉంది.
అరుంధతీ కథ ఏమిటి?
సంస్కృతంలో అరుం అంటే అగ్ని, తేజము, బంగారు వన్నె అనే అర్థాలు ఉన్నాయి. ధతీ అంటే ధరించినది అని అర్థం. అగ్ని నుంచి తిరిగి పుట్టింది. అందువల్ల అరుంధతి అని పేర్కొన్నారు. అరుంధతిని మేధాతిథి అరణ్యప్రాంతంలో ఒక చిన్న కుటీరంలో పెంచారు.
ఒకరోజు వశిష్ట మహర్షి మేథాతిథి ఆశ్రమాన్ని సందర్శించారుఅప్పుడు అరుంధతీ ఆయనకు తీర్థ ప్రసాదాలు తీసుకుని వచ్చింది. నా పుత్రిక అరుంధతీ అని ఆయనకు మేథాతిథి పరిచయం చేశారు. అరుంధతి కూడా వశిష్ట మహర్షిని చూసి ఈయననే భర్తగా అనుగ్రహించు అని పరమేశ్వరుడిని ప్రార్థించింది.  అరుంధతి కోరినట్లుగానే వశిష్ట మహర్షి ఆమెను వివాహం చేసుకున్నారు. అరుంధతి వశిష్ట మహర్షికి తగిన ఇల్లాలుగా మసలుకుంటూ... అతిథులను ఆదరిస్తూ, జప, తపహోమాలను పతితో కలిసి ఆచరిస్తూ... పతివ్రతా శిరోమణిగా, త్రిలోకపూజ్యురాలిగా కీర్తిని పొందింది.
అరుంధతి పట్ల ప్రసన్నుడయిన పరమశివుడు ఆమెకు నక్షత్రరూపును అనుగ్రహించి, అంతరిక్షంలో సప్తర్షుల ప్రక్కన శాశ్వతంగా వెలిగేలా వరం ప్రసాదించాడు.
అరుంధతీ వశిష్టులను ఆదర్శ దంపతులుగా గుర్తించి ప్రతి శుభకార్యంలోనూ, దైవకార్యారంభంలోనూ వారిని తలచుకుని  నమస్కరించడం సంప్రదాయంగా మారింది.
అరుంధత్యన్సూయా చ సావిత్రీ జానకీసతీ తేజస్వని చ పాంచాలీ వందనీయ నిరంతరం అంటే అరుంధతీ, అనసూయ, సావిత్రి, సీత, ద్రౌపది ఈ అయిదుగురు స్త్రీమూర్తులు సర్వదా పూజనీయులు అని దీనికి అర్థం.
అంపకాలు.
అప్పగింతలు పెళ్ళిలో ఆఖరు ఘట్టం, కాని ముఖ్యమైనదే. ఈ కార్యక్రమానికి మూడు పీటలొకపక్క, ఒక పీట ఎదురెదురుగా వేస్తారు. ఒక పీటమీద పెళ్ళికూతురు, పక్క పీటలమీద తల్లి తండ్రులు కూచుంటారు. బ్రహ్మగారు కార్యక్రమం నిర్వహిస్తూ పిల్లని అప్పచెప్పడానికిగాను ఒక పళ్ళెంలో పాలు పోయించి, పెళ్ళికూతురు ఎదురుగా పెట్టి, అందులో ఒక తమలపాకు వేస్తారు. ముందుగా అప్పజెప్పుకునేది పెళ్ళికొడుకు. పెళ్ళికూతురు ఎదురుగా పీటమీద పెళ్ళికొడుకు కూచుంటే, పెళ్ళికూతురు అర చేతులలో తల్లి తండ్రులు తమలపాకుతో పాలు రాసి ఆ పాల చేతులను పెళ్ళి కొడుకు చాచిన అరచేతులకు రాయిస్తారు,మూడు సార్లు, తల్లి తండ్రులు ఇద్దరూ, పెళ్ళికూతురు చేతులు పట్టుకుని. కొన్నిచోట్ల, అమ్మాయి చేతులను తల్లి తండ్రులు పట్టుకుని పాలలో ముంచిన తరవాత, ఆ చేతుల్ని ఎదుటివారి అరచేతులకు రాయిస్తారు. అంతతో పెళ్ళికూతురుని పెళ్ళికొడుకుకు అప్పజెప్పడం అవుతుంది.అతనికి బట్టలు పెడతారు అత్త మామలు. ఆ తరవాత అప్పగించుకునేది మామ గారు, ఆయనకీ అలాగే పాల చేతులు రాయించి అప్పచెబుతారు. ఆ తరవాత అత్తగారు, ఆ తరువాత పెళ్ళికొడుకు అన్నగారు, అతని భార్య. ఆ తర్వాత ఆడపడుచు, ఆమె భర్త, ఇలా అప్పచెప్పిన వారందరికి బట్టలు పెడతారు.
 ఈ కార్యక్రమం జరుగుతున్నంత సేపు వధువు తల్లితండ్రుల బాధ చెప్పనలవి కానిది.. ఇరవై, పాతికేళ్ళు పెంచి విద్యా బుద్ధులు చెప్పించి, అపురూపంగా చూసుకున్న ఆ ఇంటి మహలక్ష్మి అనుకున్న అమ్మాయిని వివాహం చేసి పంపుతూ ఇక తన కూతురు ఈ ఇంటికి అతిథిగా రావాల్సిందే కదా .. అన్న ఆలోచన ఆ తల్లి తండ్రులని ఎంత వేదనకి గురించేస్తుందో చెప్పలేము.. వైభవంగా పెళ్ళి చేసి..బేలగా అప్పగింతలు జరపడం అంటే ఇదే..
అప్పగింతల తరవాత అమ్మాయి కి అన్నం పెడతారు. భోజనం చేయకుండా, ఆడపిల్ల అత్తవారింటికి, పుట్టింటినుంచి బయలు దేరకూడదు. మధుపర్కాలతోనే ఉంటుంది పెళ్ళికూతురు అప్పటికీ. మధుపర్కంలో, చెంగులో, ఐదు మానికల బియ్యం కందదుంపలు, పసుపు కొమ్ములు వేసి మూట కట్టి, ఆ మూట అమ్మాయి వడిలో పెట్టి మేనా ఎక్కిస్తారు,. కళ్ళ నీళ్ళుపెట్టుకుంటూ అందరికీ వీడుకోలు చెబుతుంది పెళ్ళికూతురు, వదలిపెట్టి వెళ్ళలేక వెళుతుంది, కాపరానికి.

సత్యనారాయణ వ్రతం
అత్తగారింట్లో గృహప్రేవేశం చేసిన తరువాత ముందుగా చేసేది సత్యనారయణ స్వామి వ్రతం , శుచి అయిన ప్రదేశంలో గోమయముతో అలికి, అయిదు రంగుల చూర్ణములతో ( పొడులతో ) ముగ్గులు పెట్టి, అచట ఆసనము ( వ్రతం పీట )వేసి, దానిపై కొత్త వస్త్రము( తెల్ల టవల్ ) పరిచి, దానిమీద బియ్యము పోసి, దాని మధ్యలో కలశము ( మట్టి,రాగి, వెండి లేదా బంగారం ) ఉంచి, దానిపై మరల కొత్త వస్త్రమును ( జాకెట్ పీస్ ) ఉంచవలెను. ఆ వస్త్రము మీద ప్రతిమా రూపుడైన సత్యనారాయణ స్వామిని ఉంచాలి. ( శక్తిమేర ఓ ప్రతిమను బంగారంతో చేయించి, పంచామృతములతో అభిషేకించి, దానిని కలశముమీద ఉంచాలి. )
ఆ మండపములో బ్రహ్మాది పంచలోక పాలుకులను, నవగ్రహములను,అష్ట దిక్పాలకులను ఆవహన చేసి పూజించాలి. తరువాత కలశములో స్వామివారిని ఆవాహన చేసి పూజించాలి. పూజానంతరము కథ విని ప్రసాదమును బ్రాహ్మలతోను, బంధువులతోనూ గూడి స్వీకరించాలి.
ఇక ఆతరువాత మూడు నిద్దర్లు.. విందువినోదాలు
పెళ్ళిళ్ళలో విందు వినోదములకు పెద్దపీట వేస్తారు. ఎంత గొప్పగా పెళ్ళి చేసారు అనేది వారు నిర్వహించిన విందు వినోదాల వలననే తెలుస్తుందంటారు. ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క విధంగా విందు వినోదాలు జరుగుతాయి.
తెలుగు వివాహం లోని ముఖ్యమైన అంశాలు:--
1). పెళ్ళిచుపులు 2). నిశ్చయ తాంబూలాలు. 3). స్నాతకం. 4). కాశి యాత్ర. 5).వర పూజ-ఎదుర్కోల్లు. 6). గౌరీ పూజ. 7). మంగళ స్నానాలు. 8). కన్యా వర్ణం. 9). మధుపర్కాలు. 10). యజ్నోపావితాధారణ. 11). మహసంకల్పం. 12). కాళ్ళు కడగటం. 13). జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టటం. 14). కాళ్ళు తొక్కించడం. 15). కన్యాదానం. 16). స్వర్ణజలాభి మాత్రాణం. 17). యోక్త్ర బంధనం. 18). మంగళ సూత్రధారణ. 19). తలంబ్రాలు. 20). బ్రహ్మ ముడి. 21). ఉంగరాలు తీయడం. 22). సప్తపది-ఫాణీగ్రహణం. 23). ప్రధాన హోమం. 24). సన్నికల్లు తొక్కడం. 25). లాజా హోమం. 26). స్థాలిపాకం. 27). నాగవళ్లి. 28). సదస్యాం. 29). నల్లపూసలు కట్టడం. 30). అరుందతి దర్శనం. 31). ఉయ్యాల-బొమ్మని అప్పచెప్పటం. 32). అంపకాలు. 33). గృహప్రవేశం.
************
పూర్తిగా చదివిన మోహన్.. తన పెళ్ళి ఇంత పద్ధతిగా జరిగిందా అని ఆశ్చర్యపోయాడు.. చాలా వరకు కీర్తన, తన మరదలు పల్లవి అడుగుతుంటే,  బ్రహ్మం గారు చెప్పినవి అక్కడక్కడా విన్నాడు ..  కాని స్నేహితులు, చెల్లెళ్ళ అల్లరి అంటూ అటువైపు దృష్టి సారించాడు..  , బ్రహ్మం గారు మంత్రాలు చెప్పమంటే చెప్పాడు కాని, అంతగా దృష్టి సారించలేదు.. అన్నిటికన్నా మిన్నగా కీర్తన రాసిన ప్రతి ఘట్టం యొక్క వేశేషం తనని ఎంతో ఆకర్షింది. పెళ్ళంటే ఇలాగే ఉండాలి అని అనుకునేంత దృడంగా ఉంది. మనసులోనే,  రాసిన కీర్తనకి, మన హిందూ సాంప్రదాయ వివాహ వ్యవస్థకి హాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేకపోయాడు..
కీర్తూ కోరినట్లు దీనిని మా “పెళ్ళి పుస్తకం”  గా ప్రచురించుదామని  నిర్ణయించేసుకున్నాడు.. ఇదో "సమ్మోహన కీర్తనీయం" అనుకున్నాడు నవ్వుకుంటూ..
****

సంపూర్ణం

Loading...