*****
అసెంబ్లీ లో పద్మశ్రీ .. పద్మశ్రీ పక్కన నేను.. ఎప్పుడూ పక్కన బొమ్మలా నిలబడడమే, ఎప్పుడు స్కూలుకి రాకుండా ఉండదు. ఒక్కరోజన్నా నాకు ఆవకాశం రాదు, "భారత దేశం నామాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు...." గట్టిగా చెప్పేస్తోంది. ఆమె స్కూల్ లీడరు, నేను 2nd లీడర్ని. అంటే పద్మ రాకపోతే నాకు అలా భారతదేశం .. అంటూ ప్రతిజ్ఞ చెప్పే అవకాశం వచ్చేది. ఒక్కరోజు కూడా అవకాశం ఇవ్వదు. పోనిలే ఈరోజన్నా కాస్త నాకంటూ ఒక ప్రత్యేకత ఉంది కదా, చూద్దాం , వాళ్ళే గమనిస్తారు అని మౌనం వహించి అందరితో పాటు " భారతదేశం నా మాతృభూమి.. అంటూ గొంతు కలిపాను. కాని మనసు మాత్రం ఊహల్లో తేలిపోతోంది, ఇంకాసెపే అందరూ నన్ను గమనిస్తారు, సిస్టర్ వచ్చి నన్ను ఏంటి అని అడుగుతారు.. అప్పుడు ఇదీ సంగతి అని చెప్తాను, అప్పుడు అందరూ గట్టిగా చప్పట్లు.. చప్పట్లతో పాటు ..అందరూ.. అని ఆలోచిస్తూ ఉండగా, అందరి చప్పట్లు మిన్నంటాయి, అరెరె! నేను చెప్పకుండానే అందరికి తెలిసిపోయినట్లుంది అనుకొని ఆలోచనలని కట్టిపెట్టి, అసెంబ్లీ చుట్టూ చూద్దును కదా!.. అంతా సైలెంట్, మైక్ లోంచి "జన గణ మన అది నాయక జయహే..." అదేంటి అసెంబ్లీ అయిపోయింది, ఎవరూ గమనించలేదు.. ప్చ్! నా కళ్ళలోంచి నీళ్ళూ..ఇదే ఆఖరి సంవత్సరం ఇంక ఇక్కడ కుదరదు ఎలా? స్కూలంతా ఒక్కచోట చేరేది అంటే ఇక్కడే కదా పొద్దున్న అసెంబ్లిటైంలోన కదా..ఎందుకిలా జరిగింది, జనగణమన తరువాత అడిగితే....?? "ఇంక ఇప్పుడొద్దు, అసెంబ్లీ అయిపోయింది క్లాసులకి వెళ్ళండి " అనేస్తారు. నాలో మధనపడ్తూనే.. క్లాస్ వైపు దారి తీసాను అందరితో పాటుగా.. పోనిలే కృష్ణవేణి టీచర్ కి చెప్పి క్లాసులో సరిపేట్టుకోవచ్చు అనుకొని.
****
పీరియడ్లు మొదలయ్యాయి.. అంతా ముందర ఉన్న హాఫ్యర్లీ పరీక్షల సిలబస్ ముగించే ప్రయత్నంలో హడావిడి, సాయంత్రం ప్రత్యేక క్లాసుల హడావిడి.. ఎవరూ గమనించడం లేదు , ప్రత్యేకంగా వెళ్ళి అసలు విషయం చెప్దామంటే ఆ అవకాశం రావడం లేదు, వస్తున్నారు హడావిడిగా క్లాసులు తీసుకొంటున్నారు, మధ్య మధ్యలో "మీరు 10 వ తరతిలోకి వచ్చారు, ఇంక చిన్నపిల్లలు కారు .. మిమ్మల్ని కొట్టలేము, అలా బాగా చదువుకోవాలి, రేపు కాలేజిలకి వళ్తారు, ఫలనా స్కూల్ పిల్లలు అని మా స్కూల్ పేరు నిలబెట్టాలి అని చెప్తున్నారు తప్పితే అసలు ఇటుకేసి చూడరు.. అసలు చివర కూర్చున్నవాళ్ళ పరిస్థితే అంతేనేమో.. మధ్యాహ్నం రెండయింది. ఇంకో గంటన్నర ఉంది, కాని అప్పటి దాకా ఆగితే ఆ తరువాత నా కోరిక నెరవేరుతుందని ఎలా అనుకోడం.... ఈ సంవత్సరం కాకపోతే మళ్ళీ ఈ కోరిక నెరవేరుతుందా? అర్థం చేసుకోరూ... సుశీల టిచర్ లెక్కల క్లాసులో ఉన్నాను, బోర్డ్ మీద (a+b) హోల్ స్క్వేర్ ఎంతా అనేది చెప్తున్నారు, అది వినే పరస్థితి కాదు నాది.. ఎలా ఎలా ఎలా ఇదే నా ఆలోచన, ఇక ఉండ బట్టలేక లేచి నించొన్నా.. నేను నించోగానే "ఏంటి" అన్నట్లుగా చూసారు టీచర్ నా వైపు.. హమ్మయ్య గమనించారు మొత్తానికి అనుకొని, నెమ్మదిగా ముందుకొచ్చా..
"టీచర్ కృష్ణవేణి టీచర్తో మాట్లాడాలి " అని అడిగాను.
"ఏంటి పని? "
" అదే టీచర్ ఈరోజు.. ఈరోజు..."
"ఊ ఈ రోజు తెలుసు.. నీ పుట్టినరోజే కదా..ఇచ్చేవుగా చాక్లెట్లు."
"అదే అందర్లా..నేను టీచర్ తో మాట్లాడుతాను"
"నాకు చెప్పు నేను చెప్తాలే ఆ టీచర్ కి"
"అదే టీచర్ ఇంక తరువాత అంటే మేము కాలేజ్కి వెళ్తాము, మరి మరి...."
"నస పెట్టకు చెప్పు ఎంటో.."
"అందరికి అసెంబ్లీలో పాట పాడ్తారు... మరి ఈరోజు నాపుట్టినరోజుకి అందరూ మర్చిపోయారూ... అది చెప్దామని..."
"ఇందుకా..మళ్ళీ అసెంబ్లీ ఎలా కుదురుతుంది ఇక రేపే కదా.. సరే వెళ్ళు వెళ్ళీ మాట్లాడు.. " అని పంపిచారు.
అలా వెళ్ళిన నేను ఆ టీచర్ దగ్గిర భయపడ్తూనే అసలు విషయం చెప్పాను. మళ్ళీ సంవత్సరం పుట్టినరోజు చేసుకోలేను కదా టీచర్ అని, నిజానికి ఆవిడ అర్థంచేసుకొన్నారు.
అందరూ ఉదయం మర్చిపోయారు. అసలు స్కూల్ లీడర్ చెప్పాలి, ఈరోజు పుట్టినరోజు అమ్మాయిలు స్టేజ్ పైకి రండి అని అప్పుడు అందరూ కలిసి ... హ్యాపి బర్త్ డే టు యు అని పాడ్తారు. మరి పద్మ ఎందుకు మర్చిపోయిందో తెలీదు. మొత్తానికి స్కూల్ వదిలే పావు గంట ముందు, మా ప్రిన్స్ పల్ అనుమతితో స్పెషల్ అసెంబ్లీ ఏర్పాటు చేసుకొని, అందరి చేత అడిగి పుట్టినరోజు పాట పాడించుకొన్న వైనమిది. అలా గుర్తుండిపోయింది. అది ఎవరి పుట్టినరోజునైనా అలా కళ్ళముందు మెదుల్తూ ఉంటుంది.
******
10 తరగతి, పబ్లిక్ పరీక్షలు తీసేస్తారు అంటే, ప్రాధాన్యత తగ్గినట్లే.. ప్రైవేట్ క్లాసుల హడావిడి లేదు. 10వ తరగతి అనేది ఒక మైలు రాయి అనే ప్రాధాన్యత తగ్గింది, దీనివల్ల చదువు విలువ కూడా తెలియదు పిల్లలికి అనిపిస్తుంది. ఇదివరకు 7th క్లాస్ కామన్ అనేవారు, అది తీసేసినా అంత అనిపించలేదు కాని, పిల్లలికి పరీక్షల విలువ తెలియాలి, రెపొద్దున్న ఎదన్నా కాంపిటేషన్ ఎక్జామ్స్ వ్రాయలంటే ఈ పదో తరగతి ప్రీ ఎక్జామ్ అవ్వాలి. ఆ వి్లువ తగ్గింది అనిపిస్తొంది. లాభం ఏంటి అంటే పిల్లలు ఒక్క సబ్జెక్ట్ లో పోయినా సంవత్సరం అంతా వృధా అన్నది నిజం. దీనిని ప్రత్యామ్నాయం ఆలోచిస్తే బాగుంటుంది కాని, పబ్లిక్ తీసేయడం మాత్రం ఏమో.. ఒక స్కూల్ స్టాండర్డ్ ఎలా తెలుస్తుంది? ఇప్పటిదాకా 10 వ తరగతి ని స్టాండర్డ్ కి ప్రామాణికంగా తీసుకొనేవారు. ఇప్పుడు ఏ స్కూల్ ఎలా అన్నది కచ్చితంగా అంచనా వెయ్యలేము. ఇప్పటికే పరీక్షల ప్రాధాన్యత తగ్గింది. ఆ హడావిడి లేదు.
*******
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మా పాప 10 వ తరగతి. సెలవులంతా ప్రైవేట్ క్లాసులని స్కూల్ కి వెళ్ళింది, ఇప్పుడా ప్రైవేట్ క్లాసుల కళ లేదు. ఎదన్నా అంటే "హ్యాపీస్ అమ్మా! పబ్లిక్ లేదు" అంటోంది. "అమ్మో 10 వ తరగతా" అనే బాద లేదు.. ఏమనను.. "చదువుకో తల్లీ " అంటే .. "నొ ప్రాబ్లం" అని నాకు అభయమిస్తోంది. పబ్లిక్ లేదు అన్నది అమలులోకి వస్తే.... పరిస్థితి??
ఇవన్నీ పక్కన పెడితే , ఈ రోజు పాప పుట్టినరోజు, పబ్లిక్ ఉన్నా లేక పోయినా పరీక్షలు రాయక తప్పదు, అది స్కూల్ వదలక తప్పదు. అందుకే నా అనుభవం పాపకి జరగకూడదని, ముందే చెప్ప్పాను. ఈ అనుభూతులు మళ్ళీ రమ్మన్నా రావు నాన్న! ఒకవేళ పాడక పోతే అడుగు అని... (వాళ్ళకి కూడా అసెంబ్లీ పాటా మొ! ఉన్నాయి) స్కూల్ అనుభూతులు, ఆ అనుభవాలు ఎన్ని చెప్పినా తక్కువే .. తిరిగిరాని బాల్యం అది. అందుకే పాపని + మా పాప వయసులు పిల్లలిని కూడా ఏమి మిస్ అవ్వద్దని చెప్పడానికే ఈ ప్రయత్నం.
*****
చిట్టితల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలతో.. ఇట్లు ప్రేమతో అమ్మ.