6.05.2009

అద్దం





"వివరిస్తున్నది అద్దం మన స్నేహానికి అర్థం నేను నీలాగా నువు నాలాగా కనిపించడమే సత్యం.... పాట ....అద్దంలో చూసుకొంటే స్నేహితుడు కనిపిస్తున్నాడని స్వచ్ఛమైన తన మనసుని తెలియజేయడానికని ఇంకో స్నేహితుడు పాడుకొన్న పాట. మంచి పాట నాకెంతోనచ్చిన పాట. పాట సంగతి పక్కన పెడితే అద్దంలో మన ప్రతిబింబం మనకి ఎప్పుడూ అందంగా కనిపిస్తుందనేది అక్షరసత్యం. ఇలా ఆలోచనల్లో ఉన్న నాకు ఉన్నట్లుండి.....

"అమ్మా! హౌ టు కిల్ ఉమెన్ " అని అడిగింది మా పాప.

మొదట పాప అడిగిన ప్రశ్న అర్థంకాలేదు. అంత హఠాత్తుగా అలా అడిగిందేంటబ్బా అని ఆలోచిస్తూనే...

" ఇఫ్ఫుడు వుమెన్ చంపాల్సిన అవసరమేమిట్రా?" అని అడిగాను సాలోచనగానే...

"అహ ! ఊరికే అడుగుతున్నానమ్మా " అని అంది.

"ఎమోరా .. నాకు తెలీదు " అని అన్నా.

"నేను చెప్పనా నీకు తెలీదు కదా!" అని రెట్టించింది...

నవ్వొచ్చింది నాకు. "అదలా రెట్టించినా, కాళ్ళు బాదుకొంటూ కొపంగా వెళ్ళే ఆ తత్వం చూసినా నీ పసితనమే గుర్తొస్తుందే" అనేది అమ్మ. ఎందుకో నాకే నా బాల్యం గుర్తొంచ్చింది. నవ్వుకొంటూనే "ఊ చెప్పు" అన్నాను.

"వుమెన్‍కి కాస్మెటిక్స్ , గొల్డ్ ఆర్నమెంట్స్ , మంచి డ్రసెస్ లేకపోతే శారిస్ అన్నీ ఇచ్చేసి ఒక రూమ్‍లో ఉంచి లాక్ చేసి ఉంచాలి. మర్చిపోకుండా ఆ రూమ్‍లో ఎక్కడా అద్దం మటుకు ఉంచకూడదు" అని చెప్పింది.


పాప చెప్పేవిధానం హాస్యంగా అనిపించినా,
ఆలోచిస్తే నిజం లేకపోలేదు .. చిన్నప్పటినుండి అద్దం చూసుకోకుండా ఉన్న రోజులు ఎన్ని ఉన్నాయి అని ఆలోచించాను. ప్చ్! ఒక్కరోజు గుర్తులేదు. అమ్మా వాళ్ళింట్లో పాతబడిన అద్దం ఒకటి గోడకి వేళ్ళాడి ఉండేది., స్కూల్ టైం అయిపోతోంది అని నేను... కాలేజ్ టైం అయిపోతోంది అని అక్కా, నేను ముందంటే , నేను ముందంటూ ఆ అద్దం ముందు నించొని తయారవడానికి తంటాలు పడ్డ రోజులు కళ్ళముందు తిరిగాయి.

"ఎప్పుడూ ముందు నువ్వే నించొంటావా? నన్నొక్కసారన్నా అద్దం చూసుకోనిచ్చావా?" అని అక్కతో పేచి పెట్టుకొనే దానిని.

" రోజు నువ్వే కదే ముందు తయారయ్యేది, ఈరోజే కదా నేను "... అని అక్క..

" కిందటి జన్మలో మీ ఇద్దరూ సవతులయి ఉండి ఉంటారఱ్ఱా.. ఈ జన్మలో ఇలా అక్కచెల్లేళ్ళయి నా ప్రాణం తీస్తున్నారు.. " అని అమ్మ విసుక్కొనేది.


అమ్మ ఎంత విసుక్కొన్నా.. అద్దం ముందునుండి కదలడం అంటే నా ప్రాణాలు అద్దం దగ్గిర వదిలేస్తున్నట్లే అనిపించింది. ఆడవాళ్ళకి అద్దానికి అంతటి అనుబంధం ఉందని నాకు రోజు అద్దం చుసుకొంటున్నాను కాబట్టి తెలియలేదు కాని, అద్దం లేకపోతే పడే ఇబ్బంది మటుకు మొన్నామధ్య నేను వెళ్ళిన పెళ్ళిలో అర్థం అయ్యింది. అచ్చు మా పాప పైన చెప్పినట్లుగా... అదేదో సినిమాలోలా.. " అమ్మా కట్టుకోడానికి బట్టలిచ్చావు.. .." అంటూ ప్రకాష్ రాజ్ అన్నట్లుగా అయ్యింది మా పరిస్థితి. పెళ్ళికి వెళ్ళడానికి అన్ని రకాల హంగు ఆర్భాటలతో వెళ్ళాం... ఒక అద్దం తప్ప. నలుగురిలో ఈ చీర బాగుందా? పెట్టుకొన్న నగ బాగుందా? నా మేకప్ ఎలా ఉంది అని పదే పదే అడగడం కూడా ఇబ్బందే. ఇలాంటి సమయాల్లో అద్దం ఆవశ్యకత తెలిసొచ్చింది. ముందంతా అంటే హోటల్ లో నిలువుటద్దాలలో చూసుకొంటూ తీరా పెళ్ళి సమయానికి మంటపం దగ్గరికి వెళ్ళేప్పుడు ... అసలయిన సమయంలో అద్దం లేకపోడం .. మాములుగా ఈ విషయాన్ని పాప దగ్గిర ప్రస్తావించడం జరిగింది. అప్పుడు విన్న పాప .....ఆ తరువాత వారం రోజులకి ఇలా "హౌటు కిల్ వుమెన్ " అంటూ చెప్పడం అద్దం గురించి ఇలా వ్రాసేలా చేసింది. :) ఇలా వ్రాస్తుంటే అనిపించిన ఇంకో విషయం.. మన అందానికి అద్దం.. మరి మనసు అందం చూసుకోడానికి అద్దం??



*********

epilogue: హ్మ్!! ఆ తరువాత తిరుగు ప్రయాణంలో టికెట్ చూపించమని కండక్టర్ అడిగితే ... తీద్దామని బ్యాగ్ తీసిన నాకు ....వెక్కిరిస్తూ కనిపించింది..
ఓ చిన్న అద్దం... అప్పటిదాక కనిపించకుండా...దోబూచులాడిన నా అద్దం.... :(



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

Loading...