2.01.2010

మనం మన బ్లాగుకి బానిసలమా?

హ!! చాలా రోజులకి కదా మళ్ళీ ఇలా బ్లాగు దర్శనం. :-) ఆ మధ్యెప్పుడో అంధ్రలేఖ వాళ్ళు తిన్నగా నా మానాన నేను బ్లాగులు రాసుకుంటూ ఉంటే మొదటి పదిమందిలో .. మీ బ్లాగు కూడా అంటూ హడావిడి పెట్టేశారు. పోనిలే ఎదో వచ్చింది అని నేను ఊరుకోకుండా, ఎదో ఉద్దరించేదానిలాగా "నాకు ఓటేసెయండి" అని విన్నవించేసుకున్నాను. తరువాత తెలిసింది పావుగంటకోసారి క్లిక్కులతో పాయింట్లు పెంచేసుకోవచ్చని.. ప్చ్! లెక్క బాలేదని ఇహ దాని జోలికి వెళ్ళలేదు. ఈ క్రమంలోనే ఒక బ్లాగరితో చిన్నపాటి చర్చ కొనసాగింది. అందులో ఆవిడ అడిగిన ప్రశ్న "బ్లాగు మిమ్మల్ని నడిపిస్తోందా లేక మీరే బ్లాగుని నడుపుతున్నారా?" అని.. "హఠాత్తుగా ఈ ప్రశ్న ఇలా సంధించారేమిటి " అని అడుగుతూనే.. బ్లాగు నా చేతిలోనే ఉంది ఇంకా. నేను బ్లాగు చేతిలోకి వెళ్ళలేదు" అని కచ్ఛితంగా చెప్పాను. ":-) నిజమేనా?" అని అటునుండి చిరునవ్వుతో కూడిన చిన్న సందేహం.... అనుమానామా అని అడగాలని ఆలోచించాను. చూద్దాము.... నేనీ బ్లాగుకి బానిసనా అని ప్రశ్నించుకున్నాను. లేదనిపించింది.. లేదు అని చెప్పడమెందుకు అని ఇలా కొద్ది రోజులు దూరంగా ఉండి చూడాలనుకున్నాను. బ్లాగు అన్నది నిన్నో మొన్నో వచ్చింది. బ్లాగు లేకపోతే హ్యాపీగా మిగిలిన పనులు చక్కబెట్టుకోవచ్చు, చక్కటి మ్యూజిక్ వినచ్చు, సరదాగా స్నేహితులతో తనివి తీరా మాట్లాడుకోవచ్చు, అన్నింటికి మించి శ్రీవారితో ఎక్కువ సమయం గడపచ్చు, ఎన్నో చక్కటి అనుభూతులని కోల్పోతున్నామని అనిపించించి .. ఎన్నాళ్ళు ఉండగలనో అని , నాకు నేనే చిన్న పరీక్ష పెట్టుకున్నాను.

మరి ఈ పరీక్షలో నెగ్గానా? ఎమో మీరే చెప్పాలి. ఇన్నిరోజులు, ఇన్ని నెలలు అనుకోలేదు కాని, పర్వాలేదు బ్లాగులకి,
టి. వి లకి దూరంగా ఉంటే బోల్డు పనులు చక్కబెట్టుకోవచ్చు, ఎదో ..సరదాగా మన చుట్టూ ఎవరూ లేనప్పుడు , ఈ పెట్టెతో ఇలా కబుర్లు చెప్పుకోవచ్చు. కాదంటారా చెప్పండి?

ఆమధ్య బ్లాగులెందుకు వ్రాస్తారు అన్న విషయంపై చిన్న చర్చ చదివాను ఎక్కడో, సరిగ్గా గుర్తులేదు.. కాని " బ్లాగెందుకు వ్రాస్తారో తెలిస్తే నేను ఆపేస్తాను" అని కూడా చమత్కరిచారు ఎవరో. :-).. ఏది ఏమైనా కొత్తగా వచ్చిన ఈ బ్లాగులకి దూరంగాను ఉండగలము , మరీ ఏమి పనిలేకపోతే బానిసలము అవగలమని నా అనుభవం చెప్పింది. సొ, పరీక్ష నెగ్గాననే చెప్పొచ్చు నా బ్లాగు నా చేతిలోనే ఉంది అని ఘంటాపధంగా చెప్పగలను.

*******

సరే అసలు విషయానికి వస్తాను. మావాడు వయసుకి మించిన మాటలు మాట్లాడేస్తున్నాడు అని తెలుసుకోడానికి , పిల్లలు ఏమిచేస్తున్నారో, ఎమన్నా చదువుతున్నారో లేదో తెలుసుకోడానికి ఈ కొంత విరామం నాకు చాలా బాగా తోడ్పడింది అని చెప్పుకోవచ్చు.

స్నేహితురాలి పాప విషయంలో వాడి మాటలు కాసేపు నన్ను మాట్లడనీయకుండా చేశాయి.. పిల్లలికి ఏమి చెప్పక్కర్లేదేమో అనేంతగా.. వాడన్న మాటలు క్లుప్తంగా ఇదిగో:

"ఎవరి జీవితం వారిదమ్మా ! వాళ్ళిష్టం వాళ్ళెలా అన్నా ఉంటారు, మనమెందుకు కలగజేసుకోవడం, మేము తప్పు చేస్తే మమ్మల్ని అను, అంతవరకే నీ రైట్.. అంతేకాని ఇంకోకరిని అనడం తప్పే, ఎదో మాతో ఫ్రండ్లీగా ఉంటావని నీతో అన్నాను కాని, నువ్వలా సలహాలు ఇచ్చేస్తావని అనుకోలేదు. వాళ్ళు అక్కని అడగడం కూడా తప్పులేదు. అక్కనెవరన్నా ఏమన్నా అంటే నువ్వు వెళ్ళవా? ఎంక్వైరీ కి మరి వాళ్ళు అలాగే.. మాకు మంచేదో చెడేదో తెలుసు.. మా విషయాలే నీకు చెప్తాము కాని , ఇంకెవరి విషయం ఇంకోసారి నీకు చెప్పము అంతే.. "

చాలా కచ్ఛితంగా, మరింత ఆత్మవిశ్వాసంతో, కూసింత కోపం మేళవించి వాడు అన్న మాటలు ... నన్నేమి మాట్లాడనీయకుండా చేశాయి, అక్కని ఉదాహరణగా చేసి మరీ నాకు చెప్పాడు, " అక్కయితే నువ్వు వెళ్ళవా అలాగే ఎవరి పిల్లలికి వాళ్ళు చూసుకుంటారు కాకి పిల్లకి కాకికి ముద్దు, నువ్వెందుకు కలగజేసుకుంటావు? వాళ్ళు నాతో గొడవపడితే నీకు సంతోషమా?" తూటాల్లా తగలడంలేదు? ఎన్ని ఆలోచనలు పిల్లలివి.. వాళ్ళ ఆలోచనలని నేను అందుకోలేకపోతున్నాను అనిపించింది.

ప్రతీదీ తన.. మన అంటూ బేరీజు వేసి, ఉదాహరణలతో సహా వివరిస్తుంటే, నిజం చెప్పాలంటే , నాలోని తల్లి మనసు మనసులోనే కొంచం గర్వంగా తలగరేసింది అర్థరాత్రి అపరాత్రి "రేపు ఫలానా పరీక్షమ్మా భయంగా ఉంది" అంటూ నిద్రలేపేసి తనతో పాటు కూర్చోబెట్టుకు చదువుకొనే నా చిన్నారి చింటు వీడేనా అనిపిస్తూ ఉంటుంది .....ఒక్కోసారి వాడి మాటలు వింటుంటే... :-)

పిల్లలు ఎదుగుతున్నారు... "అడ్డాలనాడు బిడ్డలు కాని గడ్డాలనాడేమిటీ" అని అంటూ ఉండేది అమ్మ... అడ్డాలనాడు కూడా కాదేమో ఇక.. మనకందే సమయం కూడా వాళ్ళకి లేదు నిజానికి. వాళ్ళ తప్పుకూడా లేదు పోటీ ప్రపంచంలో పోటీగా ఎదుగుతున్నారు వాళ్ళు కూడా... చూసి సంతోషించడమే ప్రస్తుత మన కర్తవ్యం అంతేనంటారా?
******

"ప్రతీ మనిషీ తన అనుభవం వల్లే పాఠాలు నేర్చుకోవక్కర్లేదు.అవతలి వాళ్ళ అనుభవం నించి కూడా మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది." .... నిజమేమో కదా! :)


3 comments:

 1. మీ అబ్బాయి వయస్సు చెప్పలేదు?

  ReplyDelete
 2. మీ చింటూకు ఇంత చిన్నతనంనుంచే పరీక్షల పట్ల అంత భయం లేకుండా చూడండి. ఈ కాన్వెంటుల వాళ్ళు పెట్టే పనికిమాలిన పరీక్షల వలన వాళ్ళలో భయం పేరుకుపోయి హాయిగా అలా ఎదగాల్సిన మనసులు గాయపడి రాను రాను నిర్లిప్తతకు గురౌతాయి. చదువు హాయిగా సాగే రోజులు పోయాయి. ఈ వయసునుంచే అంత ఆందోళన వుండకుండా చూడండి.

  ReplyDelete
 3. శరత్ గారు : :) 12 years .

  కెక్యూబ్ వర్మ గారు: నెనర్లు.

  ReplyDelete

Loading...