" వాళ్ళ కుటుంబం నాకంత నచ్చలేదు అందుకే అతనితో పెళ్ళి వద్దు అనుకుంటున్నాను. " ఒకమ్మాయి ఉవాచ,
"మాది చాలా మంచి కుటుంబం ఆంటీ. మీరు చెప్తే నమ్మరు కాని మేమంతా చాలా సరదాగా ఉంటాము కలిసి ఉంటాము" మాటల సందర్భంలో ఒక 23 ఏళ్ళ అబ్బాయి మాటలు ఇవి.
ఇద్దరి మనస్థత్వాల అభిప్రాయాలివి.
****
నా పెళ్ళికి ఒక సంవత్సరం ముందు అనుకుంట నా ప్రియ స్నేహితురాలి పెళ్ళి అయ్యింది. తన పెళ్ళికి వచ్చిన ఒకే ఒక అడ్డంకి వాళ్ళ అక్క పెళ్ళి అవకపోడం. ఎందుకు అవలేదు అని అడిగి కారణం తెలుసుకున్నవారు ఆశ్చర్యపోక తప్పదు. ఒక సంబంధం అబ్బాయి బాగోకపోవడం అయితే అన్నీ కుదిరి శుభలేఖల దాకా వచ్చిన సంబంధం "ఛ అబ్బాయి పేరేంటి నాకసలు నచ్చలేదని" పెళ్ళి రద్దు చేసుకుంది ఆ స్వతంత్ర భావాలు కలిగిన ఆ అమ్మాయి. (ఇప్పటికి పెళ్ళి కాలేదు అది వేరే విషయం అనుకొండి) అంతా బాగుండి, పేరు బాలేదనో, కుటుంబం నచ్చలేదనో వెనక ముందు ఆలోచించకుండా ఇలా పెళ్ళిళ్ళు వద్దు అనుకుంటే ఎలా? అసలు పేరు బాలేదు అంటే మార్చుకునే అవకాశం లేదా? కుటుంబం గురించి పూర్తి అవగాహన లేకుండా , చక్కటి సంబంధాలని మిడి మిడి జ్ఞానంతో వెనక్కి పంపుతున్న అమ్మాయిలకి కనీసం తల్లి తండ్రులన్నా ఏమి చెప్పరా? ఉన్నత చదువులు చదివి వారికంటూ ఒక వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న వారయినా ఈ కుటుంబం విషయలో అంతగా ఆలోచించలేరు. కారణం ఉంది, అప్పటిదాక తను, తన ఇల్లు, తన చుట్టాలు మొ! తప్పితే పెద్దగా బయట ప్రపంచం తెలియనివాళ్ళే ఉంటారు. తెలిసినా అవతలి కుటుంబం వాళ్ళు మనకన్నా కొంచం వేరుగానో కొంచం సాంప్రదాయబద్దంగానో కనిపిస్తే ...మనకి కలిగే భావన మన కుటుంబం మాత్రమే మంచిది అన్న భావన కలుగుతుంది. ఎందుకంటే మన కుటుంబంలో అయితే మనకి పూర్తి స్వతంత్రం.. పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అది మన ఇంట్లో తప్పితే మనది కాని ఇంకెవరి ఇంట్లో నన్నా ఉన్నట్లు అనిపించినా మనం అవతలి వాళ్ళకి అతిధులమే.
మా పాపన్నా తరచూ వాళ్ళ నాన్నగారు నాకు పనిల్లో చేదోడు వాదోడుగా ఉన్నప్పుడు..." డాడీ లాంటి మనిషినే పెళ్ళి చేసుకోవాలి అమ్మా!!" అంటుంది. నిజానికి మా పాపకి ప్రస్తుతం తెలిసింది మా కుటుంబం , మా బంధువర్గాలు అంతే ఇంకా బయట ప్రపంచం తెలీదు కాబట్టి, చూసినవాళ్ళల్లో తన డాడీ తనకి, నాకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు కాబట్టి అనే మాటలవి. నిజానికి మాకన్నా మంచి కుటుంబాలు ఉంటాయి... పనులేమాత్రం చేయకపోయినా మావారికన్నా కూడా మంచివాళ్ళు ఉంటారు. ఆ విషయపై పూర్తి అవగాహన లేదు మా పాపకి.... మా పాపకనే కాదు చాలావరకు ఇప్పటి ప్రేమ వ్యవాహారాల్లో మునిగి తేలుతున్న ప్రతి ఒక్కరికీ "కుటుంబం " అనేది పెద్ద సమస్య. మన కుటుంబంలా లేరు అని అనేస్తారు. ఒకసారంటూ ఆ ఇంట్లో అడుగిడిన తరువాత అక్కడి వారి మనస్థత్వాలని గమనించి, మంచివయితే వాళ్ళతో కలిసిపోడం లేదా భర్తకి చెప్పుకుని సంధర్భానుసారంగా ప్రవర్తించి పరిస్థితులకి మనం లొంగకుండా, పరిస్థితుల్నే మనకి అనుగుణంగా మార్చుకునే నైపుణ్యం అలవర్చుకోవాలి కాని, పేరు బాలేదనో కుటుంబం నచ్చలేదనో జీవితాలని మార్చేసుకోడం .... ఒక స్థిరమైన అభిప్రాయలు లేకపోడం, త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది.
ఈ మధ్య ఇలాంటి సంఘటనలు చాలా చూస్తున్నాను. అబ్బాయిలేమో చాలా సున్నితంగా ఆలోచించుకుని, ఆ అమ్మాయిని తప్పితే చేసుకోనని, ఎన్నాళ్ళయినా ఎదురుచూస్తానని ప్రతిన బూని పీకలలోతు ప్రేమలలో మునిగిపోతుంటే , దానిని తృణిప్రాయంగా భావిస్తూ.. పేరు బాలేదు, కుటుంబం నచ్చలేదు , మీవాళ్ళు నచ్చలేదు అంటూ చిన్న చిన్న కారణాలు చూపిస్తూ పెళ్ళికి వ్యతిరేకిస్తుంటే, అసలు ప్రేమకి అర్థం ఉందా అనిపిస్తుంది. ప్రేమిస్తున్నాను అన్నప్పుడే ఇలాంటి ఆలోచనలను చెప్పాలి, పెళ్ళిదాకా వచ్చినప్పుడు ఇలాంటి చిన్న కారణాలు చెప్పడం అనేది పెళ్ళి అనే ఒక తంతుని వారు కలిసి నడుద్దామనుకున్న ఆ ఏడు అడుగులని వెరసి వారి వారి జీవితాలని వారు అవమానించుకున్నట్లు కాదా? ప్చ్! చూద్దాము వీళ్ళల్లో మార్పు రావాలని, కోరుకుంటూ... :-)