11.14.2012

ఇంతలో ఎంత మార్పు

అందరూ బాగున్నారా? చాలా రోజులు/నెలలు అయింది కదా బ్లాగు వైపు చూసి.. ఎందుకో మరి బ్లాగు రాయాలి అన్న భావన కలగడం లేదు. గూగుల్ + లో తరచు "నేనున్నాను " అని అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా ఎదో వెలితి.. అదే ఈ బ్లాగు , రాయడం లేదన్న భాద,  రాయలన్న తపన , సమయం లేదా అంటే హాస్యాస్పదం. 24 గంటలు ఖాళీగా ఉన్నా,  ఆలోచనలు బ్లాగు దాకా రానీయడం లేదు. సరే ఇక ఈరోజు ఒకసారి బ్లాగు మిత్రులను ఒకసారి పలకరిద్దామని వచ్చాను. మరి ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తానా?  ఏమో మాటిచ్చాననుకొండి మాటకి కట్టుబడి ఉండలేనేమో , ఇలా మూడ్ వచ్చినప్పుడు రాయలనిపించినప్పుడు కీ బోర్డ్ టక టకలాడించేయడమే :-)

ఏమి రాయడంలేదు అని నేనేమి రాయనప్పుడు .. రాస్తున్నప్పుడు సలహాలిస్తూ,  సహకరిస్తున్న / భరిస్తున్న మిత్రులందరికి ముందస్తూ ధన్యవాదాలతో.. :-)

****

దీపావళి పిల్లలికి భలే సరదా సరదా పండగ. నరకచతుర్థశి కి ముందే ఆఫీసు నుండి వచ్చేప్పుడో వెళ్ళేప్పుడో టపాసులు కొనేసేవాళ్ళం .. వాటిని ఎండబెట్టడం తుపాకులతో కాల్చుకోడం అవి మొదలెట్టేవాళ్ళు.. చిచ్చుబుడ్లు. చిన్న చిన్న సీమ టపాకాయలు కాలుస్తున్నప్పుడు.. నేను , శ్రీవారు పక్కనే ఉండి ఎన్నో జాగ్రత్తల మధ్య ప్రతీ దీపావళిని ఆహ్లాదంగా చేసుకుంటూ ఉండేవాళ్ళము.  ఒక బకేట్ నిండా నీళ్ళు, ఎందుకన్నా మంచిదని బర్నాల్, కాటన్, ప్రతీసారి అన్ని రేడీ గా ఉంచుకుని మరీ పిల్లలచేత  కాల్పించడమనే  కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసేవాళ్ళము. 

"చింటూ జాగ్రత్త,"
"అమ్మలూ జాగ్రత్త.."

 అంటూ ఇద్దరం వాళ్ళేమాత్రం ఆలశ్యం చేసినట్లనిపించినా ఎత్తుకుని దూరంగా వచ్చేవాళ్ళము అవి పేల్తున్నప్పుడు.. దీపావళి ఎంత ఆనందంగా చేసుకునేవాళ్ళమో , అంతా పూర్తయింత తరువాత "హమ్మయ్య " అని అంతే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునేదానిని. 

మరి ఈరోజు.. 

నిజమే వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు. "లైట్ అమ్మా.. అవసరమా?  పండగ కాబట్టి ఎదో నాలుగు అలా అలా కాలుద్దాము అంతే!"  అని మూడు రోజులనుండి అంటున్నారు.. కాని చివరికి మావాడు బానే తెచ్చాడు అన్ని రాకెట్స్, బాంబులు , నాకిష్టమని చిచ్చుబుడ్లు.. ఇక నా గురించి చెప్పేదేముంది.. 

భయం .. 

ఇద్దరు దూకుడుగానే ఉంటారు వెనకా ముందు చూసుకోరు వాళ్ళిద్దరిని జాగ్రత్తగా చూడాలి ఇవే ఆలోచనలు ఉదయం నుండి  .. అనుకున్న సమయం వచ్చింది...  ఎప్పట్లానే అన్ని రేడీ చేశాను. 

కాకపోతే ఇదివరకటిలా వాళ్ళు కాలుస్తున్నప్పుడు అక్కడ ఉండగానే పేలిపోతాయేమో  అనే ఆదుర్ధా .. ఎత్తుకువచ్చేంత చిన్న పిల్లలు కాదు వాళ్ళు అన్న ఆలోచన, కాని వాళ్ళకి వెనకాల ఉండి , జాగ్రత్తలు చెప్పడమే అనుకున్నాము ఇద్దరం.. కాని మేము అనుకున్నట్లు జరగలేదు .. మా ఆలోచనలకి , అంచనాలకి అందనంతగా... ఇంకా చెప్పాలంటే మా కళ్ళు చెమ్మగిలేంతగా....

"అమ్మా రా, డాడీ రండీ.. "
"దా అక్కా... ఆ కాకరపువ్వొత్తులు తీసుకో... కాలుద్దాము మావాడి హడావిడి.. "
నా ఆలోచన అంతా వాడు అల్లంత దూరాన ఒక రాకెట్ పెట్టాడు... ఇక్కడ నేను కాకరపువ్వొత్తు(sparkles) రేడీ చేసి ఉంచితే అవి  కాలుస్తాడు అని..
కాని అలా జరగలేదు...
 " రా అమ్మా! నీకిష్టమయిన చిచ్చుబుడ్లు (flower pots) కాల్చు....


 అమ్మా జాగ్రత్త.. ,
"అదిగో అమ్మా బాంబ్ అక్కడ పెట్టాను దా!  అగరబత్తి  జస్ట్ అలా అంటించి వచ్చేద్దాము, "

"అమ్మా జాగ్రత్త అంటుకుంది దా వచ్చేయ్!.. అమ్మా!  నన్ను పట్టుకో!"
"డాడీ అమ్మకివ్వండి,  అమ్మ కాలుస్తుంది"
ఇలా ఇద్దరూ దాదాపుగా మా చేతే అన్నీ కాల్పించారు.. ఎంతలో ఎంత మార్పు....
ఒక విధంగా చెప్పాలంటే ఇది నాకు అసలయిన దీపావళి.. ఇది ఒక తల్లి ఆనందం.

ఈ ఆనందంతోనే మిత్రులందరికీ ..

*****
అసలు కొసమెరుపు చెప్పడం మరిచాను: నిన్న ఈ కాల్చడం హడావిడిలో  lakshmi bomb  నా చేతిలోనే పేలింది..... ఒక్క క్షణం ఏమి జరిగిందో అర్థం కాలేదు.. వెలిగించిన తరువాత వదిలేశాను అనుకున్నాను, కాని వదలలేదు వింత ఏమిటంటే ఏమి జరగలేదు.. కనీసం కాలింది అని చెప్పడానికి కూడా అవకాశం లేదు అన్నంత యాధాతధంగా ఉంది నా చేయి.. అదృష్టం .. ఏదో అదృశ్య శక్తి నన్ను కాపాడింది అని మనసులోనే థాంక్స్ చెప్పుకున్నాను. ఆ Time  లో  నేను కట్టుకున చీర కూడా మాములు సిల్క్ చీరే.. ఒక్క నిప్పు రవ్వ పడినా అంతే ఇక....  అయినా ఏమి కాలేదు చేతిలోనే పేలింది  అని చెప్పడానికి చేతిలో మిగిలిన బాంబ్  తాలుకూ పేపర్లే సాక్ష్యం. చేయి కాసేపు మొద్దు బారినట్లుగా అయిపోయింది అంతే.  భగవంతుడో లేక ఎదో అదృశ్య శక్తో మరింకేదో దీపావళిని నిరాశ పరచకుండా నన్ను అక్కున చేర్చుకుని   నా ఆనందంలో పాలు పంచుకుంది.
*******


5 comments:

  1. టపా బాగుందండీ..
    అమ్మో చేతిలో ఎలా పేలిందండీ బాబు.. అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారు. నేను రెండు రోజులూ ఆపకుండా తమ్ముడ్ని వారిస్తూనే ఉన్నాను చేత్తో కాల్చి విసరద్దురా అని.

    ReplyDelete
  2. దీపావళి బాగా జరుపుకున్నందుకు సంతోషం. అభినందనలు. నయం.
    భగవంతుడు దయామయుడు. మీ మంచితనం, మీ పిల్లల అదృష్టం మిమ్మల్ని కాపాడింది. ముందు ముందు జాగ్రత్తగా వుండండి.

    ReplyDelete
  3. welcome back to the blogworld. nice post. interestingly written.

    ReplyDelete
  4. Silk saree ? I am hurt. U should have been careful Madam. Happy Diwali.

    ReplyDelete
  5. వేణు గారు, లలితగారు, మురళీ కృష్ణ గారు : థాంక్స్ అండీ.. వేణు గారు అదే తెలీదండి ఎలా జరిగిందో ఎమో .. ఏమైనా దేవుడి దయ అంతే.

    సుజాతగారు చాలా థాంక్స్ అండీ మీ అభిమానానికి అసలు నేను దీపావళి క్రాకర్స్ కి దూరంగా ఉంటాను.. పిల్లలిద్దరినీ చూసుకోడం వరకే.. ఏమి కాల్చను కదా అన్నట్లు మాములుగా సిల్క్ సారీలో ఉన్నాను. లేకపోతే మార్చేసేదానిని. పిల్లలు అలా బలవంతపెట్టి నాచేత కాల్పిస్తారని ఊహించలేదు. ఏది ఏమయినా ఈసారి మటుకు గాడ్స్ గ్రేస్. మరోసారి మీ అభిమానానికి మరో థాంక్స్.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...