6.07.2009

పెళ్ళంటే....



ఏదో మా బావమరిది గడ్డం కింద బెల్లం ముక్క కొట్టి "మా అక్క ఉంది బావగారు అన్నాడు కాబట్టి కాని, లేకపోతే హాయిగా కాశీలో ఉండేవాడిని కాదు ఈ పాటికి " అంటూ ఎదన్నా వాదనలో , చిలిపి తగాదాలో వచ్చనప్పడు, వాటిని పెంచకుండా అంటూ ఉంటారు మా వారు. విన్నప్పుడల్లా భలే ఉంటుంది ఈ కాశీ సన్నివేశం అని నవ్వొస్తుంది నాకు. "వెళ్ళుండాల్సింది నాకు సగం బాధ తప్పేది" అని నేను..

నా పెళ్ళి తెల్లవారుఝామున 3.45 నిముషాలకేమో అప్పటిదాకా ఎవో గౌరి పూజలని... అవనీ ....ఇవనీ చేయించి ఉన్నారేమో.. మంటపం దగ్గరికి తీసుకెళ్ళే సమయంలో నిద్ర వచ్చేసి పక్కన బల్ల మీద తల వాల్చాను. పిన్నులో, అత్తయ్యలో తెలీదు కాని, " పెళ్ళి కొడుకు కాశీ వెళ్తానంటున్నాడే.. లే.. తమ్ముడు బతిమాల్తున్నాడు,అక్కడ మా అక్కనిచ్చి పెళ్ళి చేస్తాం అంటూ రా .. వెళ్దాం " అని "అబ్బా! నిద్దరొస్తోంది, వెళ్తే వెళ్ళనిద్దూ.. తమ్ముడు అంత బతిమాలడం ఎందుకు? వచ్చిన తరువాత చేసుకోవచ్చులే, ఏం పని ఉందో ఎంటో " అని అన్నానట నిద్రలో. ఇప్పటికీ చెప్పుకొని నవ్వుకొంటూ ఉంటారు చుట్టాలు ఏ పెళ్ళిలో కలిసినా.. :)

కట్నాలు, కానుకలు, లాంఛనాలు, ఆర్థిక పరిస్థితి లాంటి వన్నీ పక్కన పెడితే పెళ్ళిలో జరిగే సాంప్రదాయకమైన కొన్ని పద్దతులు భలే సరదాగా, సందడి సందడిగా.. ఉంటాయి. నాకు చాలా నచ్చుతాయి. ప్రేమ వివాహాలనో, ఇంకోటనో వివాహలన్నీ రిజిష్టర్ ఆఫీసుల్లో సంతకాల వరకో, గుళ్ళో దండల మార్పిడులకో పరిమితమవుతున్నాయి, కాని ఇలాంటి సరదాలకి ఒకసారి దూరం అయ్యామంటే ఇక మనము అలాంటివి జరిగితే చూడడానికే మాత్రమే పరిమితమవుతాము (అదృష్టం బాగుండి ఎక్కడన్నా జరిగితే)తప్ప.. ఆ అనుభవం స్వతహాగా మనకి తెలీదు. పూర్వకాలంలో అయితే ఐదురోజుల చేసేవారు పెళ్ళి. అప్పటిరోజుల్లో వివాహం వ్యాపారం కాదు కాబట్టి సరదాగా ఉండేది. ఇప్పుడు ఒక్కరోజు చేయడమే గగనం. అలాంటి వివాహాల్లో నేను చూసిన మా అన్నయ్యల అక్కల పెళ్లి తంతు .. ముచ్చట్లలో కొన్నిటి గురించి సరదాగా మీతో పంచుకొందామని ....... మరి... చిత్తగిస్తారు కదూ...

********

పెళ్ళి స్నాతకంతో మొదలయి కాశీ ప్రయాణం ,
ఎదురు సన్నాహాం, వివాహంఘట్టం , సూత్రధారణ, మధుపర్కాలు, యఙ్ఞోపవీతధారణ , తలంబ్రాలు....ఇలా ఇంకా ఎన్నో అంశాలతో కూడుకొ్ని..చివరికి అప్పగింతలతో ముగుస్తుంది.

బ్రహ్మచర్యం నుండి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించేముందు స్నాతకం చేసుకోవాలి. ఇది సర్వ ప్రాయశ్చిత్తం కోసం, శరీర శుద్ధికోసం చేస్తారని పెద్దలు చెప్తారు. .

బ్రహ్మచర్య దీక్షను వదలి, వేడినీటితో స్నానం చేసినవాడు స్నాతుడౌతాదని అందుకనే ఈ స్నాతకం . పూర్వకాలంలో బ్రహ్మచారిగా గురుకులానికి వెళ్ళి విద్యనభ్యసించి యువకునిగా తిరిగి ఇంటికి వచ్చినవాడు వీలయినంత తొందరలో వివాహం చేసుకోవాలిట. ముందుగా గణపతి పూజ అయ్యాక, శుద్ధ పుణ్యాహవాచనం చేస్తారు ఆతర్వాత హోమాలు . ఈతంతు అయ్యేసరికి గంటా, గంటన్నర పడ్తుంది.

కాశీయాత్ర:

ఆతర్వాత పెళ్ళీకొడుకుకి కాటుక పెట్టి, బుగ్గను చుక్క పెట్టి, స్నాతకానికి కూర్చునేముందే కుంకుమతో నామం, కాళ్ళకు పసుపు పారాణి పెట్టి మెళ్ళో ముత్యాల హారం వేస్తారు . చెవులకు దర్భతో చేసిన గుండ్రని రింగులు తొడుగుతారు. భుజమ్మీద కండువాలో స్వయంపాకానికి కావలిసిన సామగ్రి పెట్టి, ఒక తాటాకుల గొడుగు (ఇప్పట్లో మామూలు గొడుగులే వాడుతున్నారు), చేత్తో ఒక కర్ర పట్టుకొని పాంకోళ్ళు తొడుక్కొని (ఇది వేసుకొని నడవడం దుర్భరంట మావారు అంటారు) కాశీ యాత్రకు బయల్దేరమంటారు.

ముందు సన్నాయి, వెనుక పెళ్ళికొడుకు, పురోహితులు, వెనక్కాల బంధువర్గం ఇలా బయల్దేరి వీధిలోకి వచ్చి తూర్పుదిశగా కొంత దూరం నడుస్తూవుండగా భావమరది ఎదురవుతాడు. "నేను వేదధ్యాయనం పూర్తిచేసి వేదవ్రతాలను అనుష్టించాను. నాకు కాశీ యాత్రకు వెళ్ళడానికి అనుమతి యివ్వండి" అని బంధువులను అనుమతి కోరుతున్నట్లు అనిపిస్తారు.

ఈకాశీయాత్ర ఒక వేడుకగా జరుగుతుంది. అయితే ప్రతీ వేడుక వెనక ముఖ్య ప్రయోజనాలు,
ఉద్దేశ్యాలు ఉంటాయని పెద్దలు చెప్తారు. అవన్నీ వివరిస్తే ఇదో పెద్ద గ్రంధం అయిపోతుంది. అందుకనే సరదాగా ఉండే కొన్ని సన్నివేశాలను చెప్దామని నా ప్రయత్నం.

"ఓ బ్రాహ్మణుడా! నీకు మాకుమార్తెనిచ్చి వివాహం జరిపిస్తాం. అపుడు ధర్మపత్నీ సమేతుడవై త్రేతాగ్నులతో కూడ వెళ్ళగలవు. ఇప్పుడు మాయింటికి రమ్ము" అని బావమరిదిచేత అనిపించి అతనిచేత కాళ్ళు కడిగించి, గంధంపూసి, సెంటు రాసి, తాంబూలం చేతికి ఇచ్చి నూతనవస్త్రాలు (పంచెలచాపు) మెడలో కప్పి, బెల్లంముక్క గడ్డంకింద మూడుసార్లు సుతారంగా కొట్టినట్టు ఆనించి "బావగారూ! మా అక్కను ఇచ్చి పెళ్ళి చేస్తాము, కనుక కాశీయాత్ర విరమించండి" అని బ్రతిమాలుతున్నట్లు అనిపిస్తారు.

ఈ తంతు ఒక వినోదం. బెల్లం ముక్కతో గట్టిగా కొట్టరా ... అని ఒకరు సలహా ఇస్తే, ఇప్పుడు మీరు వెళ్ళడానికి లాంచీలు లేవు. లాంచీ దొరికినా స్టేషన్ వెళ్ళేసరికి రైలు దాటిపోతుంది అని ఒకరు అంటే, మరేం ఫరవాలేదు జట్కామీద తీసుకు వెళ్ళి అక్కడ బస్సు ఎక్కిస్తాం అక్కడినుండి రైలు అందుకోవచ్చు కనుక కాశీ యాత్ర మానక్కర్లేదు అని మరొకరు చమత్కరిండం..... సరదా సరదా సన్నివేశమీ కాశీ ప్రయాణం

తెరసెల్లా:- మురిసెను వలపులు మనసెల్లా... తొలగెను తలపుల తెరసెల్లా.........

సుముహూర్తమునకు ముందుగా వధూవరులు ఒకరినొకరు చూడకుండా మధ్య తెరసెల్లా అడ్డం పెడతారు. వరుడు పరమాత్మ, వధువు జీవాత్మ, తెరసెల్లా మాయ జీవాత్మ పరమాత్మను సుముహూర్తసమయంలో కలవగానే మధ్యనుండే మాయ అనే తెర తొలగిపోతుందిట. పెద్దలు చెప్తారు . "తల వంచమ్మా కాస్త.. నువ్వెంత తల పైకెత్తి చూసినా అబ్బాయి కనపడడం కల్ల.. అంటూ చమత్కిరించే వాళ్ళుంటేనే ఈ తెరెసెల్లాకి అర్థం.


గంపలో పె
ళ్ళికూతురు: దివిలో నిర్ణయం భువిలో పరిణయం

మా అమ్మాయి అసలే ఏడుమల్లెల ఎత్తు బంగారు బొమ్మ కాస్త నెమ్మదిగా తీసుకురా అన్నయ్యా/తమ్ముడూ అని పెళ్ళి కుమార్తె తల్లి వేడుకొంటే..... గంప మోసే మేనమామని చూస్తే నవ్వు రాక మానదు. ఇదో సరదా వేడుక పెళ్ళిలో.... పెళ్ళికుమార్తె చేతికి తాంబూలం కొబ్బరిబొండాం ఇచ్చి గంపలో కూర్చోమని, ఆ గంపను మేనమాలు మోసుకొని వచ్చి కన్యాదాత దంపతుల ప్రక్క ఉంచుతారు.

సుముహూర్తం:

సుముహూర్తానికి ముందు పురోహితులు మహాసంకల్పం చెప్పారు.

సుముహూర్తం సమీపించేలోగా పురోహితులు జీలకఱ్ఱ బెల్లం నూరిన ముద్దను రెండు తమలపాకులలో పెట్టి ఒకటి వరునికి , మరొకటి వధువుకు ఇస్తారు.

"ఆఁ ఆఁ! టైం అయింది" అని పెళ్ళికొడుకు తండ్రిగారు అనగానే, జీలకఱ్ఱబెల్లం ముద్దను పట్టుకొన్న పెళ్ళికొడుకు చేతిని పెళ్ళికూతురు నెత్తిమీద, పెళ్ళికూతురు చేతిని పెళ్ళికొడుకు నెత్తిమీద పెట్టిస్తారు .

"తలమీద గట్టిగా మొత్తేసిందే బాబు.. అలా పెట్టాలా?? నేను నెమ్మదిగా పెట్టాను" అని మా తమ్ముడు బేలగా అడిగాడు వాడి పెళ్ళిలో మా మరదలు జీలకఱ్ఱబెల్లం ధాటికి తట్టుకోలేక... ఇదో సరదా




మంగళ సూ
త్రం:

పుత్తడిబొమ్మకి పుస్తెలు కడుతూ పురషుడి మునివేళ్ళు పచ్చని మెడపై రాసే వెచ్చని
చిలిపి రహస్యాలు. పెళ్ళయిన తరువాత పూర్తి హక్కు ఉంటుంది కాని, ఇలా అందీ అందనప్పుడు చేసే చిలిపి అల్లరికోసం తాళి కట్టే దాకా ఎదురుచూడాల్సిందే....కడుతూ..... కాబోయే శ్రీవారి చిలిపిదనం.....


తలంబ్రాలు:

కాశీ ప్రయాణం
తరువాత మళ్ళీ అంతటి సరదా సరదా సన్నివేశం ఈ తలంబ్రాలు. మంగళసూత్ర ధారణ అయ్యాక, పెద్దలు అక్షింతలు వేసాక, వరుణ్ణి వధువుకు ఎదురుబొదురుగా పీటలమీద కూర్చోపెడ్తారు. వారియిద్దరి మధ్యా తలంబ్రాలువున్న పళ్ళేలను వుంచి, వరుణ్ణి పాలలో తామలపాకు ముంచి వధువు దోసిలలో అద్దమని, ఆ తరువాత ఎండుకొబ్బరి చిప్పతో మూడుసార్లు తలంబ్రాలు బియ్యం ఆమె దోసిలలో పోయమని చెప్తారు.

ఆ తర్వాత పురోహితులు అదేవిధంగా వరుని దోసిలిలో కూడా తలంబ్రాల బియ్యం పోసారు. ఇప్పుడు వరుని దోసిలిని ఆమె దోసిలపై వుంచి పైన నీళ్ళగ్లాసుపెట్టి అక్షతలు యిద్దరి నెత్తిమీద వేసి, వరున్ని ముందుగా ఆమెశిరస్సుపై తలంబ్రాలు పొయ్యమంటారు. ఆతర్వాత ఆమెను వరుని శిరస్సుపై పొయ్య
మన్నారు. రెండోసారి అల్లాగే తలంబ్రాలు దోసిళ్ళలో పోసాక, ఈసారి వరుని దోసిలపై ఆమె దోసిలను వుంచి నీళ్ళగ్లాసు పైన పెట్టి మళ్ళీ అక్షింతలు వేసి ఆమెను ముందుగా వరుని శిరస్సుపైన పొయ్యమంటారు. మూడోసారి మొదటిసారిలాగే చేయనిచ్చి, ఆపైన ఇక మీయిష్టం అని వదిలేస్తారు.

ఇది ఒక వేడుక. చుట్టూ చేరిన పిల్లలు, ఆడవారి కేరింతలతో పెళ్ళిపందిరి ప్రతిధ్వనిస్తుందంటే అతిశయోక్తికాదు. వరుని వైపు వాళ్ళూ వరున్ని ప్రోత్సహిస్తూ వుంటే వధువు తరఫు ఆడవాళ్ళు ఆమెను ప్రోత్సహిస్తారు .


అప్పగింతల కార్యక్రమం లోగా ప్రత్యేకమైన వేడుకలు జరిపించడం ఆనవాయితీ. మిగిలిన కార్యక్రమాలను కావలిస్తే కుదించండిగాని, ఈ వేడుకలు కుదించడానికి వీలు లేదు అని పట్టుపట్టిన సందర్భాలు కూడా ఉంటాయి.

ఒక బిందెలో కాసిని నీళ్ళుపోసి వధూవరులనిద్దర్నీ ఎదుబొదురుగా కూర్చోబెట్టి ఆ బిందెలో బంగారు వుంగరం పడేసి వాళ్ళని తియ్యమంటారు. ఇద్దరూ ఒకేసారి చేతులు పెట్టి వెతికుతారు. ఎవరు ముందుగా తీస్తే వారి భావిజీవితంలో వారిదే పెత్తనం అని అంటారుట.

నా పెళ్ళప్పుడైతే మరి మూడుసార్లు
నేనే తీసాను ఉంగరం.. మరి మీరు ఒకసారి మీ పెళ్ళి ముచ్చట్లకి వెళ్ళండి ఎవరు తీసారు ఉంగరం.?

ఈ విధంగా మూడు సార్లు తీయిస్తారు. అలాగే వెండి మట్టెలు కూడా వేసి తీయమంటారు. తీసిన ప్రతిసారీ పురోహితుడు ఆ వుంగరం, మట్టెలు నీళ్ళతో సహా తను పుచ్చుకొని ఆనీళ్ళు వారి శిరస్సులపై జల్లుతారు.

అలాగే నాగవల్లికి ముందు అల్లుడు అలగడం ఇది కూడా వేడుకే.

వధూవరులనిద్దర్నీ ఒక మంచం మీద చెరోప్రక్కా కూర్చోబెట్టి పూలచెండులతో బంతులు ఆడించడం, (సిగ్గూపూబంతి విసిరే సీతామాలచ్చి...... అని అనుకొంటూ..) ఒక చీర వుయ్యాలలో బొమ్మను పెట్టి దాంట్లోంచి వసంతం పోసి ఇద్దరిమీదా పడేటట్టు వుయ్యల వూపడం, "బొమ్మను వధువుచేతికి ఇచ్చి నేను వంట చేసుకోవాలి, బిడ్డను ఎత్తుకోండి " అని వరునికి బొమ్మను ఇస్తూ వధువు చేత అనిపించడం
(ఇక్కడ వధువు సిగ్గుపడుతూ చాలా టైం తీసుకోవడం) "నాకు ఆఫీసుకు వేళైంది కుదరదు" అని తిరిగి ఆబొమ్మను వధువుకు ఇవ్వడం, ఇలాంటి వేడుకలతో సరదాగా సాగే సాంప్రదాయమైన పెళ్ళి మనది.

అప్పగింతలు:

ఈ కార్యక్రమంలో ముఖ్యమైన వారు వరుడు, అతని తల్లి తండ్రులు. వధువు తన తల్లితండ్రుల మధ్య కూర్చోవాలి. ఎదురుగా వరుడు కూర్చోవాలి. వారి మధ్య ఒక పళ్ళెంలో పాలు పోస్తారు.

వధువు రెండుచేతులను పాలలో ముంచి వరుని చేతిలో పెట్టి అప్పగించాలి.

తర్వాత అత్తమామలు వరుని ప్రక్కన కూర్చొనగా, వారికి కూడా వధువు రెండు చేతులు పాలలో ముంచి వారి చేతులో అద్ది...అప్పగిస్తారు.


ఈ అప్పగింతలు చేసేవారికి, చూసే వారిలో చాలామందికి కంట తడిపెట్టిస్తుందనడంలో అతిశయోక్తి కాదు. ఇన్నాళ్ళుగా తాము పెంచి పోషించిన కూతురు తమను విడిచి అత్తవారింటికి వెళ్తుందని ఆమెను వదలి వుండాలే అనే బాధ కన్నవారికి కలగడం సహజం.

అప్పగింతలు అయ్యాక పెళ్ళికూతురుని లోపలకి తీసుకు వెళ్ళి కాస్త పెరుగూ అన్నం తినిపించి, ఆమెకు ఒక చీరలో స్వయంపాకం దినుసులు వేసి నడుముకు వడిగంటుగా కట్టి పెళ్ళికుమారునితో విడిది గృహప్రవేశానికి పంపుతారు.

**********

ఇవండీ పెళ్ళిముచ్చట్లు సరదాగా గుర్తున్నంతవరకూ రాశాను. సీరియస్ గా డబ్బుతో ముడిపడి ఉన్నవి, బట్టలు పెట్టాల్సిన తంతూ చాలా ఉన్నాయి కాని వాటిని ప్రస్తావించడం ప్రస్తుతం అప్రస్తుతం అనిపించి వ్రాయలేదు. ఇంతటి సాంప్రదాయంగా ఇప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా అంటే.... ఉహు! అనే చెప్పచ్చు. ఎంతో ఆర్భాటంగా జరిగే పెళ్ళిళ్ళు కుడా , టైంలేదు అంటూ తూ తూ మంత్రంగానే జరిపించేస్తున్నారు. భవిష్యత్ లో ఇలా చదువుకోడమేనేమో .... అప్పుడు పెళ్ళిళ్ళు అలా చేసేవారు అంటూ.. ఐదు రోజుల పెళ్ళి గురించి ఇప్పుడు మనం చెప్పుకొంటునట్లుగా......

******

చివరాఖరికి పెళ్ళంటే ఇదేనా అని నన్ను నిలదీసేస్తారేమో.. చదువరులు. పెళ్ళంటే ఒక వేడుక, పెళ్ళిని మనం ఆనందించగలగాలి. సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా .. మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం అని చెప్పారు.. అదే పెళ్ళంటే ..
*******

3 comments:

  1. mi pellipusthakam story super ga undi

    ReplyDelete
  2. మీకు చాలా డీటేల్స్ తెలుసండీ. అల్లు అర్జున్ గాని మొగం చూసి బయపడి వరుడు చూళ్ళేదుగానీ ఐదు రోజుల పెళ్ళంట. ఆ పాటకుద చాల బావుంది

    ReplyDelete
  3. మీరు రాసిన పెళ్ళి ముచ్చట్లు బాగున్నాయి. నేను కూడా నా కథలో కొన్ని వ్రాశాను. వీలైతే చదవండి రమణి గారు!
    http://nityavasantam.blogspot.in/2011/11/14_25.html

    Best Wishes,
    Suresh Peddaraju

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...