పెట్టుకొనే నగలు గొప్పకోసం
కట్టుకొనే ఇల్లు హోదా కోసం
చేసుకొనే శుభకార్యం మన అంతస్థుకు అద్దం
అవసరార్థం అయ్యో పాపం అంటాం
అనవసరమైనా ఆహ , ఓహో అంటాము
ఈ జగన్నాటకంలో కొన్ని పాత్రలు వెయ్యకా తప్పదు
కొందరిని మొయ్యకా తప్పదు.
నవ్వూ, ఏడుపూ మెప్పు కోసం,
తిప్పలు ముప్పని తెలిసినా తప్పులు
అన్నీ 'లోక కల్యాణం ' కోసమే.
మరి ఇన్నిటిలో మనకోసం కేవలం మనకోసమే మన అభిప్రాయాలు పంచుకోడం కోసం, మనల్ని మనం అర్ధం చేసుకోడం కోసం, మనగురించి ఇంకొకరు తెలుసుకోడం కోసం జరిపే అన్వెషణా ఫలితమే ఈ బ్లాగులు.
బ్లాగులు ఎవరైనా వ్రాసుకోవచ్చు, విద్యార్ధి, ఉద్యోగార్ధి, సంసారి, బ్రహ్మ చారి అన్న తేడా లేదు. ఎవరు వ్రాసుకొన్నా భాష మెరుగుపడ్తుంది, వ్యక్తీకరణ బాగవుతుంది, మనకి మనం అర్ధం అవుతాము. మనలో ఉన్న రచయిత, విమర్శకుడు, విశ్లేషకుడు, తాత్వికుడు అందరు కట్టగట్టుకొని బయటకి వస్తారు. మనకే తెలియని కొత్త కోణాలు చూపెడ్తారు, మనల్ని మనకే కొత్తగా పరిచయం చేస్తారు.
*******
ఈనాడులో "డైరి" గురించి చదివినప్పుడు మురిసిపోయి రాసుకొన్న వ్యాసం ఇది. ఈరోజు వరకు అలానే అనుకొంటున్నాను. ఇకముందు కూడా ఇదే భావనతో ఉంటాను. ఇకపోతే..
ఒక కుటుంబం లేదా మా కుటుంబమనే అనుకొందాము ఏదన్నా ఫంక్షన్ కి వెళ్ళాలనుకొన్నామనుకొండి, చక్కగా ఎవరికివారు తయారయిపోయి "పదండి వెళ్దాం" అనేసుకొంటామా ? లేకపోతే మనమెలా ఉన్నాము అని అడుగుదామన్నా ఆలోచన లేదా ఆ భావన ఒక్కసారన్నా కలుగుతుంది. ఈ డ్రస్ ఎలా ఉందనో, ఈ నగ బాగుందా అనో అడుగుతాము. "అమ్మా బాగుందా మరీ ఓవర్గా ఉందా చెప్పు నువ్వే చెప్పాలి పార్టీలో ఇంకెవరన్నా చెప్తే గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది." అని అంటుంది మా పాప . నాకు నచ్చితే " బాగున్నావు " అని చెప్తాను లేకపోతే "ఇలా మార్చు" అని చెప్తాను. నాకు నచ్చకపోతే ఇంకొకళ్ళకి కూడా నచ్చకూడదని రూల్ ఏమి లేదు. పాప విషయంలో "ఇది బాలేదు" అంటే, లేదు "నాకు నచ్చింది " అని మావారు అన్నారనుకొండి, కాదు కూడదు అని పోట్లాట దిగము కదా! ఇక్కడే అంటే ఇంట్లోనే కుటుంబసభ్యులం భిన్నాభిప్రాయాలతో ఉంటాము. అలా అని ఏఇద్దరి మధ్య ఏవైరము లేదు. ఒక స్నేహపూరితమైన వాతావరణంలో అభిప్రాయాలని తెలియజేసుకొంటున్నాము. అలాగే ఒక కథ విషయంలోనో, ఒక నవల విషయంలోనో, ఒక పుస్తకం గురించో .. మన అభిప్రాయం విమర్శగానో , పొగడ్తగానో వెలిబుచ్చడం తప్పు కాదని నా అభిప్రాయం.
ఇక్కడ నా బ్లాగులో నేను చేసింది అదే. నాకు ఒక కథ నచ్చలేదు, ఎందుకు నచ్చలేదో చెప్పాను. అలాగే ఇంకో కథ నచ్చింది, ఎందుకు నచ్చిందో కూడా చెప్పాను. నాకు నచ్చడం , నచ్చకపోడం అనేది నా బ్లాగులోనె వెలిబుచ్చాను. అలాగే నా అభిప్రాయలని ఏకిభవించినవాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించినవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక చర్చలాంటి అభిప్రాయ సేకరణ జరిగింది. అంతేకాని ఏకీభవించినవారు ప్రాణమిత్రులు కారు, వ్యతిరేకించిన వారు శత్రువులు కారు. ఒకళ్ళకొకళ్ళము తెలియని మనమధ్య వ్యక్తిగత ధూషణలు, ప్రతీకారవాంఛలు , శపధాలు ఎంతవరకు సమంజసం?
ఇక నేను విమర్శించినది కథని కాని , రచయిత్రిని కాదే? మరి ఏవిధంగా అంటే ఏ విషయాన్ని ఆధారం చేసుకొని నన్ను "మీకు సిగ్గుండాలి " " "దిగజారుడుతనం" "దివాళకోరుతనం" లాంటి పదాలు వాడతారు?
ఇన్ని వాదాలు ఇన్ని అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నా నేను పరుషంగా ఒకమాట మాట్లాడానా? " సిగ్గుండాలి " "దిగజారుడుతనం" "దివాళకోరుతనం" అని నన్ను అన్నందుకు నా మనోభావాలు దెబ్బతిన్నాయా?... అని రెండు క్షణాలు ఆలోచించాను. ఆలోచించినతరువాత తీసుకొన్న నిర్ణయం.. ఇకముందు ఇలా అన్నవారి వ్యాఖ్యలు నన్ను ఆకాశానికి ఎత్తేసినట్లు పొగిడినా, పాతాళానికి కృంగిపోయేట్లు అవేశ వ్యాఖ్యలు వ్రాసినా ప్రచురింపబడవు.. ఎందుకంటే నాకు సిగ్గు ఉంది కాబట్టి , సిగ్గులేకుండా ప్రచురించలేను కాబట్టి(మనోభావాలు ఇంతలా దెబ్బతిన్నాయి).
ఇకపోతే చివరిగా నేను తెలియజేయాలనుకొన్న ముఖ్యమైన విషయం , నిజంగా నేను విమర్శించిన కథలోలా ఓ 60 యేళ్ళ స్త్రీ మళ్ళీ పెళ్ళి చేసుకొని(దేనికోసమైనా కావచ్చు) , నాదగ్గిరకి వచ్చినా.... ఓడిపోయాను, గెలిచాను లాంటి ఫీలింగ్స్ నాకు కలగవు. ప్రస్తుత సమాజానికి సరిపడదు అని వ్రాసాను తప్పితే ఎవరెలా ఉన్నా నాకెంత మాత్రం అభ్యంతరంలేదు , దీనిగురించి ఆలోచించాల్సిన అవసరం , ఎవరెవరికో క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ విషయాల గురించి నిరూపణలు గట్రా అంటూ శపధాలు చేయడాలు , సవాళ్ళు విసరడాలు లాంటివెన్ని జరిగినా.. నేను ఏ హిమాలయాలకి వెళ్ళను, ఏ కాషాయ వస్త్రాలు ధరించను. ప్రస్తుతానికి నేను కోరి మనసుపడి సృష్టించుకొన్న నా కుటుంబమే నాకు హిమగిరిసొగసులాంటి మనోజ్ఞ సీమ.
Note 1: నేను ఫీల్ అవుతున్నానని ఫోన్ ద్వారా . మెయిల్ ద్వారా నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చిన స్నేహితులకి మనఃపూర్తిగా ధన్యవాదాలు.
Note 2: వాదనలొద్దు అన్నతరువాత వ్యాఖ్యలు ఎందుకు ప్రచురించానా అని అనుకొంటున్నారా? వ్యక్తిగత ధూషణ, దాడులు లాంటివి ఎవరికి జరిగింది అన్నది.. విజ్ఞులైన పాఠకులకి తెలియాలి అని. ఇప్పటికీ నేను మౌనమే. నా నిర్ణయాలు చెప్పాను అంతె.
*******