7.11.2009

ఊహ కాదు నిజమే

రేరాజుగారి పోస్ట్ చదువుతుంటే దొరికింది లింక్ "నాకు ఈ కథ చాలా నచ్చింది ఎందుకూ అని ఎవరన్నా అడగాలని ఆశ అన్నారు. ఎందుకు అని అడుగుదామనుకొని నా అభిప్రాయం చెప్పిన తరువాత అడుగుదామనిపించింది. అందుకని ఆ లింక్ లోకి వెళ్ళి చూస్తే శారద గారి "ఊహ చిత్రం " కథ. నిజానికి నాకు చాలా నచ్చింది. ఇక్కడ కథని ఒక శుభం, ఒక విషాదంతో ముగించారు. ఇంచుమించు ఇలాంటి కథే నా పరిధిలో నిజంగా జరిగింది. అందుకే నాకు ఈ కథ లాంటి నిజం మీకు చెప్పాలనిపిస్తోంది . సహజంగాను, నిజంగాను జరిగే కొన్ని సంఘటనలు ఇందులో ఉండబట్టి రేరాజు గారు నచ్చిందీ అంటున్నారా అని ఆలోచించాను. నేను చెప్పిన ఈ సంఘటన తరువాత ఈ కథ ఎందుకు నచ్చిందా అని చెప్పదల్చుకొన్నాను. జరిగిన సంఘటనని కథగా వ్రాద్దామనుకొంటున్నా కాబట్టి పేర్లు మారుస్తున్నాను.
రేణుక నల్లగా ఉంటుంది అయినా ఆ కళ్ళల్లో ఎంత కళో. చూసినవాళ్ళు నల్లగా ఉన్నా ఎంత అందంగా ఉంది అని అనుకోకుండా ఉండలేరు. బేగంపేటలో కాలేజ్లోని ఇంటర్ చదువుతోంది. ఈమెకి ఇద్దరు ఫ్రండ్స్. రేణుకది సి .యి. సి గ్రూప్ అయితే వీళ్ళిద్దరిది ఎం.పి. సి గ్రూప్. ఒకే స్కూల్లో చదవడంవల్ల వీళ్ళ ముగ్గురి స్నేహం అలా కొనసాగుతూ ఉంది. రేణుక ఈ కథలో ముఖ్యపాత్ర అయితే ఆమేకి తోడుగా జాహ్నవి, పద్మజ ఉండేవారు. కాలేజ్కి ఎదురుగుండా పబ్లిక్ స్కూల్ ఉంది. దానికానుకొని బస్ స్టాండ్. అక్కడ 3 గంటలవుతుంటే చాలు అబ్బాయిలు గుమిగూడేవారు. ఎదురుగుండా వచ్చే సీతాకోక చిలుకల్లాంటి అమ్మాయిల్ని చూడడానికి.


తమకి సంబంధించిన వాళ్ళు రాలేదేమా... అని ఇటువైపు నుండి అమ్మాయిలు తమ కలువరేకులాంటి కళ్ళని చక్రాల్లా తిప్పేస్తు అటు మొదలయిన బ్రిడ్జ్ నుండి, ఇటు కాలేజ్ ఎదురుగా స్కూల్ కి పక్కగా ఉన్న పెట్రోల్ బంక్ దాకా కలయజూసేవారు, పక్కన స్నేహితులతో "పొద్దున్న వస్తానన్నడే రాలేదు చూడు" అంటూ..

ఇదిగో ఇలాంటి కోవలోకే వస్తుంది రేణుక. తనకి పరిచయమై ప్రేమ అంటూ వెంటబడిన ఓ అబ్బాయిని "సరే " అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన మర్నాడు అందంగా ఓణి వేసుకొని చూపరులని కళ్ళు తిప్పుకోలేనట్లుగా చేసేసి, "పొద్దున్న వస్తానన్నాడే తరుణ్ ఇంకా రాలేదు" అంటు కళ్ళు తిప్పుతుంటే ప్రవరాఖ్యుడైనా వెంట పడ్తాడేమో అనిపించేది.

అలా ఇద్దరూ కాలేజ్లో ఉన్నన్ని రోజులు వేళ్ళతో లెక్కపెట్టుకోలేనన్ని రోజులు సినిమాలని, షికార్లని, పార్కులని ప్రపంచమంతా తమ చేతుల్లొనే తీసేసుకొన్నట్లుగా తిరిగారు. కాలేజ్ అంతా తెలుసు ఫలనా కాలేజ్ అబ్బాయి , రేణుక మంచి ప్రేమికులు అని. వీళ్ళిద్దర్ని ఆదర్శంగా తీసుకొని ప్రేమికులైనవారు లేకపోలేదు ఆ కాలేజ్ లో .

అలా వాళ్ళు ప్రేమలో మునిగితేలుతుండగానే ఇంటర్ పరీక్షలయి ఎవరికి వారు వేరయ్యారు. తరువాత .....తరువాత పద్మజ ఊరికే ఉండడం ఎందుకని ఎక్కడో చిన్న ఉద్యోగంలో చేరింది. జాహ్నవి ఇంట్లోనే ఉంది.

ఒక నెల రోజుల తరువాత, ఓరోజు రేణుక , పద్మజ జాహ్నవి ఇంటికి వచ్చారు. రేణుక కళ్ళలోని వెలుగు ఆ నవ్వు చూస్తుంటే జాహ్నవికి అర్థమయిపోయింది ఏదో శుభవార్తే అయి ఉంటుందని.. "ఏంటి సప్రైజ్ ?" అని అడిగే లోపులే రేణుక..

"నా పెళ్ళి నువ్వు, పద్మజ తప్పక రావాలి" అని అంది

ఆమే ఆనందం చూస్తుంటేనే అర్థమయ్యింది జాహ్నవికి, అంతే సంతోషంతో "మొత్తానికి కోరుకొన్నవాడిని చేసుకోబోతున్నావన్నమాట కంగ్రాట్యులేషన్స్" అంటూ రేణుక ఇస్తున్న శుభలేఖ అందుకొంది జాహ్నవి.

"అంత లేదులే ఏదో కాలక్షేపానికి ప్రేమే కాని, పెళ్ళెవరు చేసుకొంటారు " అని విసురుగా చెప్పేసరికి , మరి పెళ్ళికొడుకెవరయి ఉంటారని శుభలేఖ తెరిచిన జాహ్నవికి తరుణ్ బదులు వేరే ఏదో పేరు కనపడింది. మరి తరుణ్.. మనసులో అనుకొంది కాని పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి బంధం అంతగా తెలీదు.. అదీ కాక ఒకే వయసు వాళ్ళవడంతో ఇంతేనేమోలే అనుకొంది.

ఆ తరువాత నాలుగో ఐదో.. సంవత్సారాలకి అనుకొంట ఎందుకో ఎవరో తెలిసినవాళ్ళకి బాలేదు పక్కనే ఉన్న మానసిక చికిత్సాలయంలో చేర్చారు అని తెలిసి, చూడడానికి వెళ్ళిన జాహ్నవికి అక్కడ పిచ్చిగా తిరుగుతున్నవాళ్ళల్లో కనిపించిన వ్యక్తిని చూసి హతాశురాలయ్యింది. త ..రు.. ణ్... ఏంటి ఇలా ఇక్కడ... ఒక్కసారిగా ఏదో ఆందోళన లాంటి భావనేదో పద్మజకి ఫోన్ చేసింది. "ఏంటి పద్మా తరుణ్ ఇక్కడ ఇలా నీకు తెలుసా అంటే".. "రేణుక పెళ్ళి టైం కే అతనలా అయిపోయాడుగా... నీకు చెప్పడానికి కుదరలేదు" అని చెప్పింది పద్మజ. ఇప్పుడు ఈ కథలోని తరుణ్ ఇంకా అక్కడే అంటే ఆ మానసిక చికిత్సాలయంలోనే ఉన్నాడు. పెళ్ళి చేసుకొన్న ఆనందంగా ఇద్దరు పిల్లలతో , పేరుమోసిన వస్త్రవ్యాపారికి బార్యగా... మంచి పేరు ప్రఖ్యాతలతో అప్పుడప్పుడు మన టి.వి ల్లో దర్శనమిస్తూ చెన్నై లో ఉంటున్నారు. పద్మజ ఆ మధ్య కొంతకాలం సింగపూరు ఈమధ్యే బెంగళూర్..
ఇది నిజమైన ఒక కథ.

******

పైన నేను చెప్పిన కథలో ఎవరిది తప్పు అంటే మీరేమని చెప్తారు? అబ్బాయిది కాదు, అమ్మాయిది కాదు అది వయసు తప్పు. అప్పటి వయసు వాళ్ళిద్దరిని ఆలోచింపనివ్వలేదు. మరి వాళ్ళిద్దరు ఏమి వాగ్ధానాలు చేసుకొన్నారో ఏమో. అసలు ప్రేమంటే కూడా తెలియకుండా పిచ్చిఆకర్షణలో పడిపోయాడా యువకుడు. అందుకే ఊహించలేని షాక్ నుండి తేరుకోలేదు. ఇక్కడ అతనిది తప్పుకాదు నిజానికి ఆ వయసులో అది ప్రేమ కాదు కూడా. ఆ అమ్మాయి అందం అతనిని పిచ్చివాడిని చేసివుండాలి అని నేను అనుకొంటున్నాను లేదా ఇంకో విధంగా ఆలోచిస్తే.. ఇంట్లో ఒక్కడే అవడం వల్ల "ప్రేమ" అనో లేకపోతే "నీకొసమే నేను " అనే చిన్న చిన్న భావనల్తో మనసుని నింపేసుకొని ఉంటాడు. ఆ అమ్మాయికి చేతినిండా డబ్బు, ఏదో ఇప్పుడిది ఫాషన్ అని అనుకొందేమో .. ఈ కథ నిజంగా జరిగింది కాని ఒకవేళ కథ అయి ఉండి, మనము ఈ అబ్బాయిని మానసిక చికిత్సాలయం .. అంటే కథ ఎవరికి నచ్చదు. పెళ్ళి చేసుకొన్న ఆ అమ్మాయి సంతోషంగా ఉన్నప్పుడు, అబ్బాయికెందుకు అన్యాయం జరగాలి అనుకొంటారు. ఇక్కడ ఎవరు ప్రేమ దాని విలువ అంటూ ఆలోచించరు.

శారద గారు వ్రాసిన కథలో ఇంచుమించు ఇలానే జరిగింది కాకపొతే , అమ్మాయికి చివరి క్షణంలో తనని ప్రేమించినవాడు ఎలా ఉన్నాడో అనే ఆలోచన కలిగింది. ఆమే ఊహల్లో అతను తనకోసం ఆలోచించుకొంటూ ఇంకా పెళ్ళి చేసుకోకుండా ఉన్నాడు అన్న భావన ఉంది, కాబట్టి తనకిలా అయ్యిందని తెలియజేయమని డాక్టర్ని అడగడం బాగుంది. ఇక్కడ ఆ డాక్టరు ఆమె చనిపోయిన తరువాతే ఇండియా వెళ్ళడం కథకి అర్థవంతంగా ఉంది. అలాగే అక్కడ ఆ సదరు ప్రేమికుడికి ఈమె వివరాలు చెప్పకపోడం కూడా మెచ్చేట్లుగా ఉంది. అతను కూడా వేరే పెళ్ళి చేసుకొని సంతోషంగా ఉండడం సహజంగా ఎవరి జీవితాలు ఈ ప్రేమలాంటి ఆకర్షణలో పడకపోడంవల్ల , "ఇది బాగుంది" అనిపించిందేమో అని నాకు అనిపిస్తోంది. అదే కనక అతను ఇంకా ఈమె గురించి కొట్టుమిట్టాడుతుంటే "అయ్యో పాపం " జాలి పడేవాళ్ళం. కాని నాకెందుకో శారదగారు చెప్పినట్లు జరగడమే న్యాయం అనిపిస్తోంది. పిచ్చివాళ్ళు కాకుండా జీవితం విలువ (ప్రేమ విలువ కాదు) జీవిచడంలోని అనుభూతిని తెలుసుకొంటారు.

అంతేనంటారా రేరాజ్ గారు? మీకు ఎందుకు నచ్చిందో చెప్తారా? మీ బ్లాగులో మీ పోస్ట్ కన్నా వ్యాఖ్య ఎక్కువవుతోందని ఇక్కడ ఇలా అడుగుతున్నా... :)

1 comment:

  1. @ramani:
    థాంక్యూ.
    ఈ కథ జీవితం విలువనీ చెప్పిందీ, ప్రేమ కూడా విలువైనదనీ చెప్పింది. అందుకని ఈ కథ మనకు నచ్చింది.

    ReplyDelete

Loading...