"ట్రైన్ అయితే మన్మాడు దగ్గిర దిగి మళ్ళీ ఏదో ఒక జీప్ చూసుకోవాలి. బస్ అయితే ఇక్కడ ఎక్కితే అక్కడ దిగొచ్చు, ఒక్కళ్ళే వెళ్ళేప్పుడు బస్ అయితేనే క్షేమం" అని చాలా మంది అనడంతో బస్ కే ప్రాముఖ్యత ఇచ్చాను. సాయంత్రం 5 గంటలకి బస్ బయల్దేరింది చుట్టు చూసాను అందరూ బార్యా భర్త జంటలు, కొంతమంది కొత్తగా పెళ్ళయిన వాళ్ళయితే కొంతమంది చిన్న చిన్న పిల్లలతో ఉన్నవాళ్ళు, ఒక్కళ్ళే వెళ్తున్నది ఎవరూ లేరా అని మళ్ళీ చూసాను నా పక్కన ఎదురుగా అమ్మాయి, సరే! చిన్న చిరునవ్వు నవ్వాను, "హాయ్" అంటూ.. తిరిగి "హాయ్" అని పలకరించింది. "ఒక్కళ్ళే వెళ్తున్నారా?" అని అడిగాను, అవునని తలూపింది, హమ్మయ్య తోడు అనుకొన్నా. షిర్డీలో అంతా ఈమె తోడుతో గడిపేయచ్చు అనుకొన్నంతసేపు పట్టలేదు, ఆమె వచ్చేది షిర్డికి కాదు అక్కడ నుండి ఇంకెక్కడకో వెళ్ళాలని చెప్పింది. పర్లేదు అక్కడ దాకా తోడు అంతే ... గుడ్డిలో మెల్ల నయం అనుకొన్నా. బస్‌లో ఆమె పరిచయం కబుర్లు.. మరాఠి అమ్మాయి ఆ అమ్మాయి తెలుగు రాదు ఇద్దరం హిందిలోనే మా సంభాషణ సాగించాము ఏదో పరీక్షలకని వచ్చిందిట, తిరిగి తన ఊరు వెళ్తోంది. అలా మాట్లాడుతూ , ఎవో భక్తి పాటలు వింటూ బస్‌లో గడిపేసాను.
తెల తెలవారుతుండగా షిర్డికీ చేరుకొన్నాము, దిగగానే అందరూ తలా ఒక హోటల్ పేరు చెప్తున్నారు. తమ్ముడు ఇచ్చిన హోటెల్ కోసం వెతుకుతూ ఉండగా కనిపించాడు ఒకతను , బస్‌లోనే చూశాను , నావైపే వస్తున్నాడు. "ఇతనికి నాతో పనేంటి?"అని అనుకొంటూ ఉండగా, అతను నా దగ్గరికి వచ్చి "మీరొక్కరే వచ్చారా? " అని హిందిలో అడిగాడు.
"అవును" అని సమాధానం ఇచ్చాను, ఇతనికి చెప్పడం అవసరమా అని మనసులో అనుకొంటూనే.. మనిషి మిలటరీలో పని చేస్తున్నాడట, పెళ్ళయి 6 నెలలు అయ్యింది, "మిలటరీ నుండి ఇంటికి వెళ్తూ... ఒకసారి బాబా దర్శనం చేసుకొందామని వచ్చాను" అని చెప్పాడు నేను అడగనవసరం లేకుండానే..అనవసరంగా మాటలు ఎందుకు పెంచుకోడం అని నవ్వేసి, చేతిలో తమ్ముడు ఇచ్చిన స్లిప్ లో ఆ అడ్రస్ కోసం వెతకడం ప్రారంభించాను. నాకు అతను మాట్లాడే హింది అర్థంకాలేదు అనుకొన్నాడో.... మరి ఎమో, నా వెనకాలే రావడం నేను ఆరా తీస్తున్నట్లుగానే అతను వసతి కోసం ఆరాతీయడం చేస్తున్నాడు. మనకెందుకని నా మానాన నేను నా పనిలో మునిగి ఉన్నాను. కొంతసేపటికి చేతిలో ఉన్న చిరునామా కాగితం చేతి చమటకి నలిగిపోయింది. మరి బస్ దిగినప్పుడే తప్పుదారి పట్టానేమో తెలీదు కాని ప్రయాణ బడలిక, అడ్రస్ దొరకకపోవడం కొంచం చికాకుగా అనిపించింది. వాతావరణం కాస్త ఎండ అక్కడక్కడ చినుకులతో కొంచం ఆహ్లాదంగా ఉంది కాబట్టి ఆ మేరకు చికాకు అంతగా లేదు. ఇంతలో మళ్ళీ ఆ మనిషి "అడ్రస్ దొరకలేదా " అని.. నన్ను వదిలేలా లేడని, తల అడ్డంగా ఊపాను లేదని. వెంటనే "పర్లేదు నాకు తెలిసినవాళ్ళూన్నారు అక్కడికి వెళ్దాం. ఆడవాళ్ళు ఇలా ఒంటరిగా ఉండడం మంచిదికాదు" అంటూ నా అంగీకార ప్రమేయం లేకుండా నా బ్యాగ్ తీసుకొని ముందుకు నడక సాగించాడా అగంతకుడు. నాలోని వ్యక్తిత్వం కించపరచబడిందో లేక నేను వెళ్ళలేననుకొంటున్నాడా అన్న పౌరుషమో తెలీదు కాని ముందుకు వెళ్తున్న అతనిపై సర్రున కోపం వచ్చిన మాట వాస్తవం , కాని చికాకు కోపాన్ని జయించింది. తప్పదు "సర్దుకుపో" అని మనసు నచ్చజెప్పింది. ఇక చేసేదేమి లేక, అతను చూసే వసతికోసం వెనక వెళ్ళక తప్పింది కాదు గుడికి దగ్గర్లోనే ఉన్న వసతిని చూసి, అక్కడ వాళ్ళతో మాట్లాడి, నా దగ్గిర డబ్బులడిగి తీసుకొని అక్కడ కట్టేసి "దర్శనానికి తొందరగా రేడి అయి వచ్చేయండి .. అదిగో అదే గుడి" అంటూ గుడి గోపురాన్ని చూపించి .. వెళ్ళిపోయాడు. "హమ్మయ్య" వెళ్ళిపోయాడు, అని మనసులో అనుకొని, రూమ్ వైపు దారి తీసాను.
*******
ఏమాట కా మాట చెప్పాలి. రూమ్ మటుకు విశాలంగా చాలా బాగుంది. మనసులోనే మళ్ళీ ఆ అపరచితుడికి థాంక్స్ చెప్పుకొన్నా(పేరు అడగలేదు అతను చెప్పలేదు). గంటలో రేడి అయి గుడికి వెళ్ళాను. ఆరోజు గురువారం అవడంతో ఇసకవేస్తే రాలనంత జనం.. "అమ్మో! దర్శనం ఎప్పటికవుతుందో" అని అనుకొంటూ.. లైన్లో నించున్నా.. బాబాని ధ్యానించుకొంటూ.. మనసులో మటుకు మధ్యాహ్న హారతి టైం కి దర్శనం అయితే ద్వారకామయి లో కాసేపు ధ్యానం చేసి భోజనానికి వెళ్ళి.. పక్కనే ఉన్న ఖండోబా దేవాలయం, బాబాగారి శిష్యుల ఇళ్ళూ , తొమ్మిది వరహాలు అవి చూడాలని ఆలోచన, సాయంత్రం మళ్ళీ 6 గంటలకి బస్ తిరుగుప్రయాణానికి.. క్యూలో ఉన్న ఈ జనాల్ని చూస్తే ఇవేవి జరిగేట్టు లేవు దర్శనం అవగానే బయల్దేరాలేమో.. అని మనసు పీకేస్తొంది ఒక పక్క. ఇలా మనసుతో మంతనాలు సాగిస్తూనే, ఒక వైపు ధ్యానం చేస్తూ.. పక్కన ఎవరో ఉన్నట్లనిపించి పక్కకి తిరిగి చూసా.. అదే చిరునవ్వు, చిరుపరిచితమైన ఆ అపరిచితుడు. .... మళ్ళీ మొదలు నా మనసు ప్రశాంతంగా ఆలోచించలేదేమో అనుకొంటుండగానే, అతను పూల మాలలు అవి నా చేతికిచ్చి ముందుకు వెళ్ళి సెక్యూరిటీతో ఎదో ఐడి కార్డ్ చూపించి నన్ను చూపిస్తూ ఎదో మాట్లాడుతున్నాడు. అదంతా చూస్తుంటే మనసులోని ఆలోచనలు కొంచంగా మారనారంభించాయి. "మంచివాడే పాపం తనే అపార్థం చేసుకొంటున్నాను" అని అనిపించింది. ఇలా ఆలోచిస్తుండగా .....అతను నా దగ్గరికి వచ్చి, "దీదీ మై బాత్ కియే" అంటూనన్ను నేరుగా దర్శనానికి తీసుకెళ్ళి నేను చూడాలనుకొన్న ప్రదేశాలు కాక , తనకి తెలిసినవి చూపించి, మళ్ళీ నేను నా రూమ్ కి వెళ్ళి బ్యాగ్ తీసుకొని బయల్దేరి బస్ ఎక్కేదాకా నా తోడు ఉండి , కనీసం నా బ్యాగ్ కూడా నన్ను పట్టుకోనివ్వకుండా తనే పట్టుకొని బస్ స్టార్ట్ అయ్యేదాక ఉండి .. "మర్చిపోవద్దు అక్కా.." అని చివర్లో కళ్ళనీళ్ళు.. అతని బార్యకి ఇప్పుడు 6త్ మంత్ అని, తనకి మొదట ఆడపిల్ల పుట్టాలని, మిమ్మల్ని చూస్తే అక్కలా అనిపించారంటూ బస్ కదిలేలోపు తన గురించి బార్యపై అతని ప్రేమ గురించి చెప్పి సెలవు తీసుకొన్నాడా వ్యక్తి. అపరచితుడవడం వల్ల ఫోన్ నెంబరు ఇవ్వలేదు. అతను అడగలేదు కూడా.. మధ్యలో అక్కడ బ్యాంక్ ATM ఎదో ఇబ్బందిగా ఉండి నాకు డబ్బు అవసరమైతే కూడా నిస్సంకోచంగా తన దగ్గిర డబ్బులు ఇచ్చిన వైనం (ఇచ్చేసాను అనుకొండి గంట తరువాత డ్రా చేసి..) తలచుకొంటే మనుషుల్లో ఇంకా మంచితనం చావలేదు అనిపిస్తుంది. తిరిగి ఇచ్చేసేవాళ్ళకన్నా అవసరానికి అప్పు ఇచ్చినవాళ్ళే గొప్పవాళ్ళు నా దృష్టిలో. ఇలా నా షిర్డి ప్రయాణం పేరు కూడా తెలియని, భాష తెలియని ఒక అపరిచితుడి పరిచయంతో విజయవంతంగా ముగిసింది.
****
అన్నయ కుంటుంబం ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్ళారు దసరా సమయంలో.. " ఎవరో వచ్చి సమయానికి దర్శనానికి ఏర్పాట్లు చేసారు అనుకొన్న సమయంలో దర్శనం జరిగింది , ఆ దేవుడి మీద నమ్మకం ఆయనే పక్కనుండి అన్నీ చూపించాడు " అని అన్నయ్య చెప్పినప్పుడు "అసలెలా జరుగుతుంది అన్నయ్యా! అలా ఎవరో అలా ఎలా కలిసి అన్నీ చూపిస్తారు వారికింక మిమ్మల్ని కలిసి అన్నీ చూపించడం తప్పితే వేరే పనులుండవా " అని అడిగితే వెంటనే "ఎందుకు అలా అనుకొంటావు? నీకెప్పుడు జరగలేదా ఇలా?" అని అన్నాడు, అదిగో అప్పుడు తళుక్కున స్మృతి పధంలోకి మెరిసి ఇంత పోస్ట్ రాసేలా చేసాడు ఆ అపరచితుడు. దేవుడిమీద నమ్మకం కన్నా. .. మనకి మనమీద నమ్మకమే మనల్ని విజయపధంలోకి తీసుకెళ్తుంది అని అనిపిస్తుంది నాకు. నాకు ఈరోజు ఈ పని అయిపోతుంది నేను చేయగలను అన్న నమ్మకం నన్ను షిర్డీ దాకా వెళ్ళేలా చేసింది. దైవ బలం తోడ్పాటు మాత్రమే, మానవ ప్రయత్నం లేనిదే దైవం కూడా ఏమి చేయలేడు. వెళ్ళడం మనపై నమ్మకం, దర్శనం లభిస్తుంది అనేది మరో నమ్మకం. ఆ సంకల్పం నమ్మకం మనకి ఇలా ఎవరో ఒకరి పరిచయంద్వారా విజయవంతం అవుతుంది. థాంక్స్ అన్నయ్యా.. బాబా దర్శనం విజయవంతంగా పూర్తిచేయించిన ఆ అపరిచితుడిని గుర్తుచేసినందుకు...... ఇలా నా అనుభవంలోని ఆలోచనలని పంచుకొనే అవకాశం కల్పించినందుకు..
******