11.11.2009

జర భద్రం తల్లీ!..

తెలుగు బ్లాగర్స్‌లో పాత పోస్ట్‌లేవో చదువుతుంటే నా కంటబడింది నేను అప్పట్లో రాసిన ఈ పోస్ట్. కొత్తలో రాసిన పోస్ట్‌ ఇది. మళ్ళీ చదువుతుంటే "బాగుంది" అన్న భావన కలిగి మళ్ళీ ఇక్కడ పబ్లిష్ చేస్తున్నాను. మళ్ళీ చేయడానికి కారణమంటూ చెప్పాలంటే ఇది అప్పుడు రాసింది నా బ్లాగులో కాదు. నాదగ్గిర భధ్రపర్చుకొన్నట్లుగా ఉంటుందని... ఇలా.... చదువరులకు అసౌకర్యమనిపిస్తే క్షమించండి, బాగుందనిపిస్తే చదివేయండి సరదా.. సరదాగా.

******

జర భద్రం తల్లీ!

“వచ్చిండన్నా, వచ్చాడన్నా వరాల తెలుగు మనదే” అన్న భావనతో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతీయ భాషలో రాయడానికి సాహసం చేస్తున్నాను. తప్పులేమన్నా ఉంటే మన రమణియేగా అని అనుకొని మన్నించేస్తారుగా. మరయితే రండి! చూద్దాము సరూపక్క చెల్లెలు వెన్నెల చేసే సందడి, సందడి.
***

జర భద్రం తల్లీ! సల్లంగ ఉం(సూ)డాల!

“యేందె సరూపక్క! ఎట్లున్నావు? ఓటెయనీకి వచ్చిన, ఏందే! గట్ల యిచిత్రంగా సూస్తవ్! యాద్మర్చినవ్ లే! ఔ మల్ల సానా దినాలయ్యిందిగదా! లకడీ కా పూల్ పోరిని, లాలుదర్వజా లస్కర్ బోనాల్నాడు కలిసి “యెన్నెలా! ఇట్లుంటె ఎట్లనే, కాసింత కండ పట్టాల్న అన్నవ్”, మరిప్పుడు కండపట్టిన గదా, మంచిగొడ్తలేనే! “

ఔ గాని యక్కా! ఏమో మస్తు ముచ్చట్లుజెప్తున్నావంట గదా! మా పొరగాడు సెప్పిండు. గది యినంగానే ఉరుక్కొంట్టొచ్చినా. బత్తీ బంద్ అని మంచిగ చెప్పినవ్ గానక్కా! మొన్నోపాలి నా పొరగానినికి వొల్లెచ్చబడిందే!
“దవఖానకి పో బిడ్డా! ” అంటే

“నేంపోను తల్లో ! సర్కారు దవఖానకు”, అని ఎర్ర గోలీ తెమ్మన్నడు.

పొరగానికి కాబట్టి గోలీ యేసినా! మరి భూమి తల్లికి వొల్లెచ్చబడితె ఏమి గోలీయేస్తామక్కా?

పెద్దోళ్ళకాడ పనిజేసుటకు యెల్లిన. అక్కో! అక్క! యేమి ఇల్లక్కా, పాత సైన్మ మాయాబజారు లెక్క గొడ్తుంది. గడప, గడపకి ఓక టి.వి పెట్టిండ్రు. దినాము ఒకటే మోగుడే, మోగుడు, ఇగ వంట గదిలో బర్రుమని సప్పుడే సప్పుడు! అన్నము కూడా చివరాకరికి కరెంటే వాడ్తారక్క. ఆ సప్పుడికి నా చెవులు సిల్లులు పడినాయక్క. గట్ల సుకపడ్డోల్లకి, కట్టం తెలేదక్క, కట్టం చేసే మనలాంటొల్లకి సుకం యిలువ తెలుస్తాది. మందేముంది అక్కా! ఓ గడప, ఓ బల్బు, గంతే గద. భూమి తల్లి ఆడ పెద్దోల్ల ఇంటికాడ కన్నా మనదగ్గిర సల్లంగుంటుందక్క.

“బాబులు! బాబులు! ఓ పాలి , ఓ గంట బల్బులన్నీ బంద్ చేసి, భూమి తల్లిని సల్లంగ సూసుకొండని” పెద్దొల్లకి జెప్పాల్నక్క.

అమ్మతో పనికెల్లేకాడినుండి, లాంతరు దీపాలే కదనే. ఇగ పోర్గాల్లు యీది దీపం దగ్గర సదూకుంటరు. మనకి దీపమున్నఒకటే, లేకున్న ఒకటే.

ఇంటిలో, మోంబత్తీ యెలిగించి, గా భూమి తల్లిని సల్లంగయ్యెల జేస్తాము. మరి, గా రోడ్డు మీద దినమంతా తిరిగే బస్సులను, కార్లను ఎవరాపుతారక్క? ఆడ ఆ రాసుడుకు మరింత యేడెక్కదా తల్లి?

గందుకే నీ మరిదికి ముందే జెప్పిన అక్కా! ” జర ఒకదినాం లేద రెండు దినాలు బండి నడపడం గిట్ల నిలుపుజేమంటే యినుకో బత్తీ బంద్ లెక్క ” అని, మంచిగా మనూర్లో అయితే యడ్లబండి మీద యెల్లోటొల్లము గదే. అంతా మారిపోయినాదక్క! అందుకే భూమి తల్లికి బరూవనిపించినాది. బాద పడలేకనే యేడి సేసినాదక్క.

“నీ మరిదా అక్క! మంచిగున్నడు, నన్ను మంచిగ సూసుకొంటుండు. నెలకో కోక తెస్తడు.”

“గదేందక్క? పేరు మర్సినావే? గట్ల అడుగుతుండావు?”

జరంత సిగ్గుగుంది గాని “సెంద్రన్న” నేను యెన్నెలనయితే ఆడు సెందురుడు, ఇగ మాకు బల్బెందుకక్క?

నువ్వన్నట్లు జూను 15 కాదక్కా! ఏ దినాము మా ఇల్లల్లో బాల్బులు ఎలగవు, మోంబత్తి యెలుగులోనే కూడు తింటము, సక్కంగా ఆరు బయట నులకమంచం యేసితినా, మబ్బులసాటుకు యెల్లే ఆ సందురిడికిమల్లే, ఈ యెన్నెల సాటుకు గీసందురుడొచ్చెస్తాడక్కా! ఇగ బల్బుల పనేమున్నదే మాకు.

గీ బత్తీ బంద్ యిసయం పెద్దోల్లకు జెప్పల్నే. టి వి లు కట్టుండ్రి , అన్నం గిన్నెలో వండుకొండ్రి, మన తల్లిని బద్రంగ జూసుకొండ్రి అని.

“ఔ అక్కా! బావెట్లున్నడే? గప్పుడు బోనాల్కి లబ్బరు గాజులు తెస్తనన్నడు, తేకనేపొతి. జర్రంత యాద్ జేయి. నే పోత అక్కా నీ మరిదొస్తాడు, నే ఇంట లేకపొతే ఆగమాగం జేస్తడు.

ఎట్లుందక్క ఈ సలవద్దాలు? నీ మరిది తెచ్చిండు, “ఎండలో అక్కిల్లంటూ పోతున్నవ్, కల్లకెట్టుకో” అని, ” మంచిగొడ్తున్నాన్ అక్క ఈ అద్దాలల్లో? “

ఎండలో కల్లు యేడిజేస్తాయని చలవద్దాలు, ఒల్లు సల్లబడడానికి, మెత్తని కోకలు అనుకొంట, మన బాగు సూసుకొంటున్నం మరి, యేడిజేసే ఆ తల్లి ని గురించి జరింత సూసుకొంటే మంచిగుంటదక్క.

నేజెప్తాలే అక్కా! మనింటి కాడ చుక్కమ్మ, రత్తమ్మ, సమ్మక్క, సారక్కలకి జరింత మంచి సేద్దం రండ్రి అని, జూను పదియేను, ఏడుగంటల నుండి ఓ గంట కదనే. దగ్గరుండి ఆపు జేయిస్తానక్క.

మరి ఉంట అక్క నేను, ఔ అక్కా ! మామిడి కాయ తొక్కు బెట్టినావంట కదనే! పొరగాడు జెప్పిండు, జరంత ఈయరాదే! సేపల పులుసు జేసిన, మామిడి ముక్క నంజుకొంటూ జల్సా జేసుకొంటాడు నీ మరిది.

ఉంట అక్క! ఇదిగో మంచి ముచ్చట్లు జెప్పేముందు “సెల్లీ! యెన్నలా!” అని బిలిచినవనుకో, ఉరుక్కొంటొస్తా.

భూమితల్లీ జర భద్రం తల్లీ! సల్లంగ ఉం(సూ)డాల!

***

1 comment:

  1. రమణి గారు బాగుంది. ఈ విధమైన భాషలో రాయాలన్న అందరు రాయలేరు. చాలా జాగ్రత్తగా రాయాలి. మంచిగ వివరించారు. చాలా ముచ్చట్లు చెప్పారు.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...