8.18.2010

దేవుడికో ఉత్తరం

దాదాపు ఒక రెండేళ్ళ క్రితమనుకుంట .. "మనసులో మాట"  అంటూ ఒక కొత్త బ్లాగు రాస్తున్న సమయాన కథల పోటి జరిగింది.    దీనిని   శ్రీ కొత్తపాళీ గారు నిర్వహించేవారు. (బాగా రాసిన ) మంచి కథకి బహుమతి .. ఆ కథని      " ఈ-మాటలో " ప్రచురించడం. బహుమతి సంగతి పక్కన పెడితే కథ మొదలు పెట్టడానికి ఒక చిన్న పాయింట్ చెప్పేవారు. ఆ పాయింటు వారి బ్లాగులోకి వచ్చే అరగంట టైంలో  పందిరి చుట్టూ అల్లుకున్న మల్లెతీగలా ఆ పాయింటు చుట్టూ కథ అల్లేసి పంపించేసేదానిని. అదో సరదా.. బహుమతి గురించో లేక అందరు మెచ్చేసుకుకోవాలనో ఆలోచన ఉండేది కాదు. :) నాలోని సృజనాత్మకత ఎంతవరకూ ఉంది అని నన్ను పరీక్షించుకునేదానిని. (రాసిన ఏ కథ ఎందులోను రాలేదు లెండి అది వేరే విషయం) ఆ క్రమంలో అప్పుడు రాసిన కథ "దేవుడికో ఉత్తరం" ఒక చిన్నపిల్లాడికి అంటే పుస్తకం కూడా కొనుక్కోలేని ఒక పేద పిల్లాడికి ఒక తెల్ల కాగితం దొరికితే ఏమి చేస్తాడు? ఇది పాయింటు.

ఇదే నిజంగా జరిగినప్పుడు అంటే కాగితం దొరకాల్సిన అవసరం లేకుండా   చిన్నపిల్లాడు దేవుడికో ఉత్తరం రాసినప్పుడు,..  అది నా కంట పడినప్పుడు... క్షణకాలం కాలం నేను ఏమి చేయలేకపోయాను. ఎక్కడినుండి మొదలు పెట్టాలో తెలియడం లేదు. అసలు జరిగింది ఏమిటంటే.. 
***

కొన్ని పరిస్థితుల ప్రభావం .. ఒక మంచి కార్యం తలపెట్టడం వల్ల మేము ఉంటున్న ఊరు నుండి మా అక్కావాళ్ళు ఉండే ఊరికి మారాల్సి వచ్చింది. మార్పు అనేది పిల్లల్లో  మరింత ఉత్తేజం తీసుకువస్తుంది అనేది మరొక కారణం. జులైలో మారాము. పాపకి కాలేజ్ మరింత దగ్గిరవడం సంతోషంగా ఉన్నా.. చిన్నప్పటి స్నేహితులని వదిలేస్తున్నాను అన్న బాధ ఉంది. కాని పర్వాలేదు అర్థం చేసుకుని కొత్త పరిసరాలకి అలవాటు పడ్తోంది. బాబు..... వీడే.. వీడి గురించే అంతుపట్టడం లేదు. ఎందుకో రోజు రోజుకి ఒకరకమైన అంతర్మధనానికి గురి అవుతున్నాడనిపించింది. ఒకటికి రెండుసార్లు ఎదో చెప్పబోయాడు.. కాని నేనే "ఎదో సాకు చెప్పి స్కూల్ కి వెళ్ళను అంటే వాయించేస్తాను" అని అనేసరికి చెప్పాల్సింది కాస్త గొంతులోనే పూడ్చేసుకున్నాడు.. నిజానికి అమ్మని అయి ఉండి నేనే అర్థం చేసుకోలేకపోయాను. వాడికి గత్యంతరం లేక వాడు చేసినపని దేవుడిమందిరంలో మొన్న ఒక ఉత్తరం రాసి ఒక గంట పూజ చేసుకున్నాడు. మర్నాడు కూడా అందరికన్నా ముందు లేచి గబా గబా తయారయి సాయిబాబా ఆరతి పాటలన్ని పాడుకుని తన ఉత్తరానికి సమాధానం చెప్పమని ఆ దేవుడిని వేడుకున్నాడు. ఎప్పుడు లేనిది వీడేంటి ఇలా పూజ చేస్తున్నాడు అని అనుకున్నాను కాని ... పెద్దగా ఆలోచించలేని గొప్ప తల్లిని నేను. కథకి వచ్చే ఆవేశం ..నిజానికి ఎందుకు రాలేదో నాకు ఇప్పటికి బాధే నాకు .. కథ రాసి ఎంత గొప్ప సృజనాత్మకత శక్తి నాది అని నన్ను నేను అనుకుని మురిసిపోయాను..  నిజంగా జరిగితే  ఏమి చెయ్యాలో తెలియని సృజనాత్మకత  ఉండి నిరుపయోగమే కదా. 

పనులన్నీ ముగించుకుని, బాబు స్కూల్ కి వెళ్ళిన తరువాత దేవుడి మందిరంలోకి వెళ్ళిన నేను ....తెల్లటి కాగితం చూసి ఏంటిది? అని చదివాను. ఒక్కో ప్రశ్న చదువుతుంటే నాకు కళ్ళ నీళ్ళు ఆగలేదు. ఎంత మధన పడి ఉంటె మావాడు అలా తన సమస్యలన్నీ దేవుడికి నివేదించుకుంటాడు అనిపించింది. అందుకే వెంటనే స్కూల్ కి వెళ్ళి వాడిని అసలు ఏంటి వాడి సమస్య?  అని తెలుసుకుని వాళ్ళ ప్రిన్సిపల్ తో మాట్లాడి... ఇంటికి తేసుకొచ్చేసాను. వాడు నాకు సంధించిన ప్రశ్నలు:

1. "మా పాత స్కూల్‌లో ఎవరన్నా కొత్తవాళ్ళు చేరుతుంటే మేమందరం ఎవరు ముందు వాడికి ఫ్రండ్ అవ్వాలా అని పోటి పడి friendship  చేస్తాము. ఇక్కడేంటమ్మా! ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోరు",

2. ఎవరన్నా మాట్లాడితే చెప్పడానికి వీలులేనంతగా వేటి గురించో మాట్లాడుతారు? నాకు భయమేస్తొంది అమ్మా ఇక్కడ... ఏమి చెయ్యను?"

3. అలా మాట్లాడిన సరే .. చదువే ముఖ్యమని నువ్వన్నావని..నిన్ను బాధ పెట్టకూడదని నేను స్కూల్ కి వస్తున్నాను. కాని ఈ టీచర్స్ ఏంటమ్మా అదేదో నేను ఎన్నో ఏళ్ళనుండి వీళ్ళకి తెలిసినట్లుగా నన్ను తిడుతూనే ఉంటారు? జూన్ లో నేను లేనని వీళ్ళకి తెలుసు కదా మరి exams  రాయలేదని కొడతారెందుకు?"

4. ఆ స్కూల్ లో నేను మెరిట్‌లో ఉండేవాడిని, ఇక్కడేంటమ్మా ఎంత చదివినా మార్కులు వేయరు?"

 ఇక వాడు దేవుడిని సూటిగా అడిగిన ప్రశ్నలు: ఏది వదలకుండా యధా తధంగా:


ఓం సాయిరాం నా సమస్యలు నువ్వే తీర్చాలి.

1. నీకు ఈ ప్రదేశం బాగా నచ్చిందేమో కాని ..నాకు అస్సలు నచ్చలేదు స్కూల్ కి వెళ్ళబుద్ది కావడం లేదు ఇక నా ప్రశ్న.

2. మొదట కష్టాలు వాటి తరువాత ఫలితం అంటావట మారి నాకేంటి ఫలితం ఇంత కష్టపడుతున్నాను.

3.  నాకు నా quarterly , half yearly  మరియుAnnual లో మార్కులు ఎలా వస్తాయి?

4. నన్ను ఈ ఉపాధ్యాయులు , (టీచర్స్, మరియు sirs  ) ఇలానే తిడుతూ ఉంటారా?

5.  నా స్నేహితులు నన్ను ఇలానే ట్రీట్ చేస్తారా?

6.  నాకు స్కూల్ కి  వెళ్ళాలి అనిపించేలా చేస్తావా?

7. కష్టపడితే పైకొస్తావు అని నన్ను చిక్కుల్లో పడేయకు , వీటన్నిటికి పరిష్కారం చెప్పవా ప్లీజ్ ...అమ్మా ! నువ్వు చెప్పు ప్లీజ్.

8. నేను absent  అయినందుకు ఏమన్నా అంటారా?

9.  నన్ను కాపాడు.

10.  నాకు వచ్చిన తెలుగు రాసాను, ఏమన్నా తప్పులు ఉంటే క్షమించు..(నేను కరెక్ట్ చేసి ఇక్కడ రాస్తున్నాను తెలుగు సరిగ్గా రాయలేడు మా బాబు)

11. అమ్మ ఫోన్ మాట్లాడిన తరువాత అమ్మకి ఒక్కొక్కటి మెల్ల మెల్లగా సమాధానాలు చెప్పవా..

12. మళ్ళీ పాత స్కూల్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా?

13.  చిన్నపిల్లోణ్ణి నా సమస్యలు తీర్చవా బాబా..

14. ఇప్పుడే చెప్పవా (ప్లీజ్) బైయాలజీ, ఇంగ్లీష్, తెలుగు ఇంకా అందరు ఉపాధ్యాయుల , ఇంకా మా పి .టి సర్ కూడా నన్ను తిట్టకుండా చూస్తావా?

చదివిన తరువాత వాడి చిన్ని మనసు ఎంత గాయపడి ఉంటుందో తెలిసింది. ఇదిగో ఈరోజు మళ్ళీ వాడి పాత స్కూల్ కి వెళ్తున్నా ఇంకా T C  తీసుకోలేదు కాబట్టి, వాడు అదే స్కూల్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాస్త ప్రశాంతమైన మనసుతో చదువుకుంటాడు. ఇదే నా ఆలోచన? నేను ఆలోచిస్తున్నది కరెక్టేనా? మీరు ఆలోచించండి వాడు చదివేది 9th. ఇదే ఒక పునాది లాంటిది వాళ్ళకి ఇప్పుడు కనక నేను ఆలోచించలేకపోతే వాడి భవిష్యత్తు ఇబ్బంది అవుతుంది అవునా.. 

ఇక కొత్త స్టూడెంట్ ఎవరన్నా వాళ్ళ స్కూలో చేరుతున్నారు అంటే అతను అక్కడినుండి మారకూడదు అనిపించాలి కాని, ఇలా డిస్కరేజ్ చెయడంవల్ల పిల్లలు ఎంత కష్టపడ్తారో స్కూల్ యాజమాన్యం తెలుసుకోగలగాలి. పేరెంట్స్ మీటింగ్ లాంటివి ఏర్పాటు చేసి పిల్లల గ్రోత్ తెలుసుకోవాలి కాని వ్యాపార దోరిణి స్కూల్స్ ఎన్నాళ్ళు ఇలా? నేను బాబుని ఒక మంచి పేరు ఉన్న స్కూల్ లొనే చేర్చాను. కాని మేడిపండని తెలీదు నాకు. ఒకే ..  సరిఅయిన సమయంలోనె స్పందించాను అనుకుంటున్నాను.
****

7 comments:

  1. Nice& touching post.
    Your boy is able to express, what about many shy type children who are silently bearing all this! I am lost .. :(

    ReplyDelete
  2. స్వామి ఆవిధంగా మీ బాబు కోరిక తీర్చాడనుకుంటా.. నాకు కళ్లల్లొ నీళ్లు తిరిగాయి. ఇంత చిన్న వాడికి అంత భక్తి ఉన్నందుకు చాలా సంతోషమేసింది. :)

    ReplyDelete
  3. మంచి పని చేశారు రమణి గారు.

    ReplyDelete
  4. మా అబ్బాయి కూడా వాడి చిన్నపుడు ఇలాగే ఏడ్చాడు, నేను వెళ్ళి వాళ్ళ టీచర్ కి చెప్పాను. వాళ్ళందరూ ఎన్నో గ్రీటింగ్స్, గిప్ట్స్, పెయింటింగ్స్ వేసి వాడిని ప్రెండ్ ని చేసేసుకున్నారు. అంతా కలిసిపోయారు. ఆ తరువాత 5th claas లో పేరున్న స్కూలు కదా అని వాడిని రామంతపూర్ పబ్లిక్ స్కూల్ లో వేసాము. మా ఇంటికి దూరమవటం, వెళ్ళి రావడానికే అలసి పోవడం,ఆటలు మీద ఎక్కువ ఆసక్తి చూపడం అనే అనేక కారణాల వల్ల వాడి చదువు దెబ్బతింది.90 above తెచ్చుకునేవాడు కాస్తా 80 above కి వచ్చేసాడు. నాకయితే పిల్లల్ని దగ్గర లోనే ఉంచుకుంటే బాగుండేదేమో అని ఒకసారి, హాస్టల్ లో వేస్తే బాగుండే్దేమో అని ఒకసారి అనిపిస్తుంది. మనకి ఏది మంచిది అనిపిస్తె అది చేస్తాం. తప్పొప్పులు ఆ భగవంతుడి దయ.

    ReplyDelete
  5. హ్మ్...i am happy that he'd get what he needs.

    ReplyDelete
  6. snkr గారు, రాజశేఖరుని విజయ శర్మ గారు , నాగర్జున గారు: థాంక్స్ అండి. బాబుని మళ్ళీ పాత స్కూల్‌ల్లోనే చేర్చాను.

    నిహారిక గారు: మొదటినుండి అంటే నర్సరీ నుండీ ఒకే స్కూల్‌లో చదువుకుని ఉన్నట్లుండి మారితే కలిగే ఇబ్బంది అనుకున్నాను కాని, వాడికి మార్కులు తక్కువ వస్తుంటే మటుకు నిజంగానే నేనే మా బాబు బాల్యాన్ని బంధించేసున్నాను అన్న భావన కలిగింది. స్నేహితులు ఎవరు మట్లాడకపోడం వాడి మౌనరోదన చూసాక నేను చేసిన పని మంచిదే అనిపించింది. ఆడుతూ పాడుతూ చదువుకోవాలి కాని ఇలా ఆదరా బాదరా బాధల చదువు వద్దనిపించి మళ్ళీ పాత స్కూల్ లోనే చేర్చాను. మీరన్నట్లు భగవంతుడి దయే అనుకుంట మరి. :)

    ReplyDelete
  7. అయ్యో చాలానే టెన్షన్ పడి వుంటాడు ఆ చిట్టి బుర్రకు అమ్మ ను సంతోషపెట్టాలి అని. స్కూల్స్ మారితే మధ్యలో పిల్లలకు ఇబ్బందే. కొందరు చిటుక్కున కలిసి పోతారు కాని చాలా వరకు టెన్షనే కదా.. మంచి పని చేసేరు పాత స్కూల్ లో జాయిన్ చేసి.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...