9.12.2010

మళ్ళీ మళ్ళీ రావాలి ఈరోజు..

ఇది 2008 సంవత్సరం రాసిన టపా.. మళ్ళీ ఈరోజు ఇదిగో అమ్మ పుట్టినరోజు. అంతే సంతోషంతో పొద్దున్నే "పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి...నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి  "  అంటూ శుభాకాంక్షలు చెప్పాము. మళ్ళీ ఒకసారి అందరం అలా స్మరణ చేసుకుంటూ ....ఇక్కడ ఇలా మీ, మా... మనందరికోసం. 
 ******
"హల్లో! అమ్మా చెప్పు ఏంటి ఫోన్ చేసావు?"

"ఏముంది చెప్పడానికి? నీకు అసలు అమ్మ ధ్యాస ఉందా అసలు? నా అంత నేనే ఫోన్ చెయ్యాలి కాని, నువ్వసలు అమ్మ ఒకత్తి ఉంది అని పట్టించుకొంటున్నావా? అంతేలే, సంపాదన పరులయ్యాక ఇక అమ్మ ఎందుకు? ఎంతసేపు ఆ బ్యాగులేసుకొని ఉరుకుల పరుగులే, అమ్మ అసలేలా ఉందో ఒకసారి ఫోన్ చేద్దాము అన్న ఆలోచనే లేదాయే"!

"అమ్మా! ఆపు ఆఫీసులో ఉన్నా! నేనేమి సమాధానం చెప్పలేను. ఇంతకీ ఎందుకు ఫోన్ చేసావో చెప్పు?"

"ఎప్పుడూ ఆఫీసు! ఆఫీసు! వెధవ సంత, బుద్ధిగా ఇంట్లో కూర్చొని, పిల్లల్ని చూసుకోక. సరే! రేపు వినాయక చవితి గా ఏమి చెస్తున్నావు?".

"రేపటి గురించి ఇంకా ఏమి అనుకోలేదు, సాయంత్రం ఇంటికొచ్చి మాట్లాడతాలే ఫోన్ పెట్టేయి."

" ఓ రెండు ముక్కలు మాట్లాడతానో లేదో ఫొన్ పెట్టేయి అంటావు, ఇంటికోపట్టాన రావు. వాడు అలానే తయారయ్యాడు, నువ్వు అలానే తయారయ్యావు, అవునులే! అడ్డాలనాడు బిడ్డలు కాని, గడ్డాల్నాడు బిడ్డలా మీరు?" ....

"సరె నాకు గడ్డాలు లేవు కాని సాయంత్రం వస్తానన్నా కదా! నువ్వు ఫొన్ పెట్టేలా లేవు కాని నేనే పెట్టెస్తున్నా! సాయంత్రం కలుస్తాను."

***

"అలిగితివా అమ్మా!! అలుక మానవా?"

"నాకెందుకు కోపం? మీరు మీ ఉద్యోగాలు, మీ పిల్లలు... ఇంట్లో పెద్దవాళ్ళు గుర్తొస్తారేంటి మీకు?"

"అలిసిపోయి వచ్చానమ్మా! ఇప్పుడు దండకం మొదలెట్టకుండా మధ్యాహ్నం ఫోన్ ఎందుకు చేసావో చెప్పు?".

"అంతేనమ్మా! ముందు ఆఫీసు గోల! ఆనక ఆలిసిపోవడం గోల! ఎదన్నా అంటే నాది దండకము, లేదా భారతాలు, భాగోతాలు ఇవేగా మీరనేది. వాడు అంతే పెత్తనమంతా పెళ్ళానికి ఇచ్చి కూర్చున్నాడు. ఎమన్నా అడిగినా, మాట్లాడినా "తనకి చెప్పమ్మా!" అని అంటాడు. ఇంతప్పటినుండీ పెంచాను,నిన్న కాక మొన్నొచ్చింది నేను దానిని అడగడమేమిటి? అదేమిటిరా అంటే, నాకు నీతులు చెప్తాడు, నాకు తెలీదా ఏంటి, ఎదో గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్లు.."

"అమ్మా! ఇంట్లో పిల్లలొక్కళ్ళే వున్నారు, నేను వెళ్ళాలి ! నీ బాధ అంతా తరువాత వెళ్ళగక్కుదుగాని, కాస్త కాఫీ అన్నా ఇస్తావా! నన్ను వెళ్ళమంటావా?" .

"అయ్యో పిచ్చి తల్లీ! మర్చేపోయాను ఇస్తానుండు, ఏవిటో! ఈ మధ్య మతిమరుపు ఎక్కువవుతోంది. వచ్చినప్పటినుండి నా కష్టాలు ఏకరువు పెట్టుకోడమే సరిపోతోంది, ఈడ్చుకొంటూ పడి , లేచి వస్తావన్న ధ్యాసే ఉండదు నాకు".

****ఇలా తనకు లేని బాధలు మాకు చెప్పుకొంటూ, తన తీయనైన అష్టొత్తర, శతనామవాళితో మా బాగోగుల్ని చూసుకొంటూ నిత్యం సందడి సందడిగా ఉండే మా అమ్మ పుట్టినరోజు , నిన్ననే మనవలు మనవరాళ్ళ మధ్య నిరాడంబరంగా జరిగింది.

మళ్ళీ మళ్ళీ రావాలి ఈరోజు అని ఆశిస్తూ.. కుటుంబ సభ్యులందరి తరుపునా ...

మా అమ్మకి పుట్టిన రోజు శుభాకాంక్షలు

12 comments:

 1. మీ అమ్మ గారికి "పుట్టిన రోజు శుభాకాంక్షలు".

  ReplyDelete
 2. మీ మమ్మీకి హేపీ బర్త్ డే!
  కేకేది .. "కెవ్వ్వ్"
  కేక కాదు .. కేక్!!

  ReplyDelete
 3. మీ అమ్మగారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో వర్ధిల్లాలని, మీకిలాగే వెళ్ళినపుడల్లా కమ్మని కాఫీలు కలిపి ఇస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  ReplyDelete
 4. నా తరఫున కూడా మీ అమ్మగారికి హ్యాపీ బర్త్ డే చెప్పండి.

  ReplyDelete
 5. మీ అమ్మ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. టపా మనసుకు హత్తుకుంది. అభినందనలు.

  ReplyDelete
 6. రమ్మూ, మీ అమ్మగారికి హృదయపుర్వక జన్మదిన శుభాకాంక్షలు.. ఎంతైనా అమ్మ చేతి కాఫీ రుచే వేరు కదా!

  ReplyDelete
 7. మీరు పిల్లలకు తల్లయినా, మీ అమ్మ దృష్టిలో ఒక అమ్మాయే.అదే తల్లి హృదయం. మీ అమ్మ గారికి "పుట్టిన రోజు శుభాకాంక్షలు".

  ReplyDelete
 8. అవును రమణి గారు,మనల్ని అమ్మలు కాకపోతే ఇంకెవరు అలా తిడతారు?మా అమ్మ(లు)తిట్టేవాళ్ళుకాదు కానీ నాకేమో తిట్టించుకోవాలని ఓ తెగ ఇదిగా ఉండేది.ఇప్పుడు అమ్మే లేదనుకోండి.అమ్మకి ఇక్కడి నుండే నా నమస్కారాలు తెలియజేయండి.

  ReplyDelete
 9. శుభాకాంక్షలందించిన వారికి పేరు, పేరునా అంటే బ్రహ్మి గారికి, కొత్తపాళీ గారికి( కేకా!! అంటే ఇదీ కెవ్వు కేక కాదు, మేము తినేసాం గా!) , సుజాత గారికి(నా తరుపున కూడా నెనర్లు, అమ్మ చేతి కాఫీ... కి) , జ్యోతిగారికి, కత్తి మహేష్ కుమార్ గారికి (నా తరుపునుండి కూడా నెనర్లు, టపా విషయంలో), అరుణ గోసుకొండ గారికి, పూర్ణిమ గారికి, నిషిగంధ గారికి(నా తరుపునుండి నిషా! అమృతమే అమ్మ చేతి కాఫీ), సి. బి రావుగారికి (దేశానికి రాజయినా తల్లికి బిడ్డేట రావు గారు) రాజేంద్ర కుమార్ దేవరపల్లిగారికి(నిజమే రాజేంద్ర గారు, అమ్మ కాకపోతే ఎవరు తిడతారు చెప్పండి అందులోనే దీవెనలు చూసుకోవాలట మనం) ధన్యవాదాలు, ఆశీస్సులు తెలపమంది అమ్మ.

  ReplyDelete
 10. అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు .... ఆవిడ ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని కోరుకుంటున్నాను.

  ReplyDelete

Loading...