11.03.2010

పుత్తడి బొమ్మకి పుస్తెలు కడుతూ...

పురుషుడి ముని వేళ్ళు పచ్చని మెడపై రాసే వెచ్చని చిలిపి రహస్యాలు .
ఎంత చక్కటి భావన. స్పర్శ గురించి సున్నితమైన అర్ధం అంతర్లీనంగా దాగి వుంది ఇందులో. స్త్రీ - పురుషుల మధ్య వుండే సంభంధాన్ని ఎంతో సున్నితంగా వివరించారో గేయ రచయిత, పైన వాక్యంలో.
చలం పుస్తక ప్రభావం అయితేనేమి, ఇంకేమన్నా కానివ్వండి,ఉసిగొల్పి.. ఉసిగొల్పి ఈ వ్యాసం రాసేలా చేస్తోంది, ఈనాడులోని ఆదివారం కధ "స్లీపింగ్ పీల్". ఈరోజు నేనిలా రాసే వ్యాసం ఎవరినన్నా నొప్పిస్తే క్షమించేసి చదవడానికుపయుక్తులు కండి.
ముందుగా కధలో తరతరాల్నించి, పురుషుడు , స్త్రీ పై, స్త్రీ ప్రమేయం లేకుండా తన ఆధిక్యత ఎలా నిలబెట్టుకొంటాడో, చెప్పడం అక్కడ ముఖ్య ఉద్దేశం గా వివరించడం జరిగింది. అయితే ఇదే ఈనాడులో, ఓ నెల క్రితం అనుకొంటా! వీరిద్దరి మధ్య సంబంధం గురించి సర్వెలో ఇప్పటి నవజంటలు వెల్లడించిన విషయాలు, అసలు సంసారం చెయడానికి టైం లేదనడం. ప్రస్తుత ఈ ఉరకల పరుగుల జీవితంలో కాస్త సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువత (కొత్త జంటలు) ఎక్కువగా వారి వారి అభివృద్ది కోసం పడే తపన వల్ల అసలు మాములుగా మాట్లడే తీరిక కూడా లేదని ఆ పరిశోధనలో వెల్లడైందని చెప్పడం జరిగింది .
మరి ఇప్పటి తరం ఇలా వున్నప్పుడు ఈ కధ యువతకి ఎంతవరకు ఒక సందేశం ఇవ్వగలదు పైగా లేని అపార్ధాలు , అర్ధం తెలియక అపోహ పడడం జరిగే అవకాశం కలిగించేదిగా వుందీ కధ. తనే కాకుండా ఎక్కడో అమెరికాలో వున్న తనకూతురు కళ్ళ నీళ్ళు వత్తుకొంటొందా లేదా?? లేక చిన్నప్పుడు తన అత్త, తన తల్లి కళ్ళ నీళ్ళు ఎందుకు వత్తుకొన్నారో? అర్ధం , అప్పుడు తెలియకపోవడం అదేదో ఇప్పుడు తెలిసినట్లుగా, స్త్రీలందరికి ఈ విషయంలో చాల అన్యాయం జరిగిపోతోంది అని అనడం అంత సమంజసంగా లేదనిపిస్తోంది. ఇదంతా స్త్రీకి లేని అసహయతని చూపించినట్లుగా వుంది. ఇప్పటి స్త్రీ పురుషులు అంతటి అజ్ఞానం లో లేరు, ఒకరి అభిప్రాయాలు ఒకరు అర్ధం చేసుకొంటున్నారు. ఇదే కధని పెళ్ళి కాని వాళ్ళు చదివితే వాళ్ళకి లేని భయం సృష్టిస్తున్నట్లుగా వుందీ కధ.
కళ్ళతో మాట్లాడుకోడం, మనసు మనసు ముడిపడడం , మాములుగా ఒకరితో ఒకరు మాట్లాడుకొడం ఇవన్నీ ఇచ్చే తృప్తి కాన్నా వెయ్యి రెట్లు ఆనందం తృప్తినిచ్చేది స్పర్శ.. అది ఏ ఇద్దరి మధ్య అయినాకావచ్చు. పసిపిల్లలు ఉయ్యాలలో ఏడుస్తున్నప్పుడు, దూరం నుంచి ఎంత ఊరడించినా తాత్కాలికంగా ఊరుకొన్నా ఎవరన్నా వచ్చి ఎత్తుకొంటే వెంటనే ఆపేస్తారు. అంత గొప్పది స్పర్శ . రోజుల వయసునుండి స్పర్శ కి అలవాటు పడిన మానవ జన్మ మనది, అత్త వడి పువ్వు వలే మెత్తనమ్మా.. అని ఒక్కో స్పర్శ గురించి ఒక్కోవిధంగా వివరించారు. మరి అలా అన్ని స్పర్శలని అంత ఆనందంగా అనుభవించగలిగినప్పుడు స్త్రీ పురుషుల మధ్య వుండే సంభాందాన్ని మటుకు ఎందుకలా లేని పోని అపార్ధాలవైపు తీసుకెళ్తారో, కొంతమంది.
ఎయిడ్స్ గురించి చర్చించుకోండి, జాగ్రత్త గా ఉండండి అని ప్రచారం చేసేవారు, అసలు సృష్టికార్యం (సక్రమమైన ) ఎంత గొప్పదో , మాతృత్వం ఎంత మధురమో కూడా ప్రచారం (కళ్ళ నీళ్ళు వత్తుకొని కాదు) చెయ్యాలని నా ఉద్దేశ్యం, లేదా పెద్దవారు చెప్పగలిగితే తమ పిల్లలికి(ఇప్పటి పిల్లలు అర్ధం చేసుకొనే వారే) సున్నితంగా వారికి అర్ధం అయ్యే రీతిలో చెప్పాలి. వారి అభిప్రాయలని నిక్కచ్చిగా చెప్పగలిగే దైర్యం కూడా ఉండేలా చేయగలగాలి. కాని ఇలాంటి కధలని అధారంగా చేసుకొని లేని పోని భయాలని సృష్టించకూడదు.
ఇదే కధ ఎవరో బ్లాగరు కూడ తన బ్లాగులో లింక్ ఇచ్చారు చదవని వారు చదవడానికి వీలుగా(ష్.. నాకు లింక్ ఎలా ఇవ్వాలో తెలీదు సారి !!అందుకే...ఇలా..)

10 comments:

 1. మీ విశ్లేషణ అభినందనీయం.

  ReplyDelete
 2. మీరు మరోలా అనుకోనంటే ఒక చిన్న సూచన. మీ టపాల్లో ఫుల్‌స్టాపుకి, కామాకి, సెమీకోలన్‌కి, హైఫనుకి - ఇట్లా విరామ చిహ్నాలన్నిటికీ మీరు మూడు చుక్కలు పెడతారు, అందువల్ల - ఎక్కడ ఎంతసేపు ఆపి చదువుకోవాలో తెలియటం లేదు. చాలా చోట్ల, మూడు చుక్కల బదులు ఒక చుక్క, లేదా ఒక కామా సరిపోతుంది కదా?

  మరో ఉచిత సలహా: వీలైతే, బ్లాగు టెంప్లేటు మార్చండి, ఖతి (ఫాంటు) పెద్దది చెయ్యండి. ప్రస్తుతం, అక్షరాలన్నీ ఒకదానితో ఒకటి అలుక్కుపోయినట్టుగా ఉన్నాయి. స్క్రీనులో ఎడం పక్క రెండు ఇంచీలు, కుడిపక్క రెండు ఇంచీలు ఉన్న రిబ్బను తీసెస్తే, పెద్ద ఫాంటు పెట్టుకోవచ్చు.

  ReplyDelete
 3. @వల్లూరి గారు నెనర్లు.
  @ నాగరాజు గారు: అలవాట్లో పొరపాటు అండి అది అలా రెండు మూడు చుక్కలు పెట్టడం. మనసులో వున్న ఆలోచనని అలా కీబోర్డ్ మీద పెట్టేస్తాను వీటి గురించి ఆలొచించలేదు ఎప్పుడు. మీకు చాల థాంక్స్ అండీ. ఇప్పుడు మార్చాను చూడండి. మీ మొదటి సూచన పాటించాను. ఇక మీ రెండో సూచన, అసలు నాకు ఎలా ఆ ఇంచెస్ మారుస్తారో తెలీదు.టాంప్లెట్ మార్చడం కొంచం కష్టమే, ఇది నాకు చాల నచ్చిన టాంప్లెట్ లైట్ కలర్, సొ..సారి అండీ, ఎవరన్నా హెల్ప్ చేస్తాను అంటే నొ ప్రాబ్లం.

  ReplyDelete
 4. ఆ బ్లాగు పేరు తూర్పు-పడమర. సాహిత్యం సెక్షన్లొ ఉంది.మీ విశ్లేషణ బాగుంది.

  ReplyDelete
 5. ఇప్పుడు చాలా బావుంది. మీది చక్కటి నారేటివ్ స్టైల్. చదువుతూంటే, మీరు ఎదురుగా కూర్చొని మాట్లాడినట్టే ఉంటుంది.

  పంక్చుయేషన్ గురించి చాలా రోజులనుంచీ చెప్దామనుకొంటున్నా గాని, ఏమనుకొంటారో అని సందేహించానిన్నాళ్ళూ.
  చీర్స్,
  నాగరాజు (సాలభంజికలు)

  ReplyDelete
 6. ప్రతీ సంఘటననీ ఏదో ఒక వాదంలోంచి, దృష్టి కోణంలోంచి (రంగద్దాల్లోంచి) చూడడం వల్ల వచ్చే కధలూ, అభిప్రాయేలవి. తూ.ప. బ్లాగులో చూసి పెద్ద కామెంటు 2 సార్లు రాసి పోగొట్టుకుని వదిలేసా. మీ విశ్లేషణ లో కథని(బాగుందనివేరే చెప్పక్కర్లేదనుకుంటా) ప్రస్తుతసమాజధోరణి పరంగా అన్వయించడం సముచితంగా ఉంది.

  ReplyDelete
 7. అంబానాధ్ గారు, "తల్లితనం" నేర్పాలి అని అన్నప్పుడు ఈ బ్లాగ్ ప్రపంచంలో ఒక "తుఫాను' రేగింది.

  నేడు మీరు "స్పర్శ", మాత్రుత్వంలోని మాధుర్యాన్ని అందరూ తెలుసుకోవాలి అని అంటున్నారు.

  వారేమో ఇక్కడ http://tinyurl.com/yqqby6 'వైవాహిక అత్యాచారం'గురించి చెప్పానని అంటున్నారు.
  ఒకటి మాత్రం నిజం: మానవ సంభంధాలు విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నవి. మార్పులు కూడా చాలా బాధాకరంగా ఉంటున్నవి. ఆ అభిప్రాయాలను మరొక బ్లాగులో..

  ReplyDelete
 8. @తెరెసా గారు, సత్యసాయి గారు: నెనర్లు.
  @ నాగరాజు గారు: థాంక్స్ అండీ మీ కాంప్లిమెంట్ కి.
  @ నెటిజెన్ గారు : లింక్ ఇప్పుడే చదివాను, చదివిన తరువాత ఇంకా ఎదో రాయాలని అనిపిస్తోంది తొందర్లో వస్తాను మీ ముందుకి మళ్ళీ ఇంకో టపా తో, అందులో ఆ టపాలో మా మహిళలు ఇచ్చిన వ్యాఖ్యలు ఇంకా కసి పెంచుతున్నాయి నాలో రాయమని, ఏవో పరీక్షలకి ప్రిపేర్ అవుతుండడం వల్ల కొంచం లేట్ అవుతుంది కాని దీని గురించి రాయడం మర్చిపోను, నెనర్లు

  ReplyDelete
 9. http://kalpanarentala.wordpress.com/2008/02/24/%e0%b0%8f%e0%b0%ae%e0%b0%bf%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%88-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b2%e0%b1%80%e0%b0%aa%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b1%8d-%e0%b0%aa%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%95%e0%b0%a5/

  http://kalpanarentala.wordpress.com/2008/02/16/%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b2%e0%b1%80%e0%b0%aa%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b1%8d-%e0%b0%aa%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d/

  రమ గారు, కథకు సంబంధించిన లంకెలు రెండూ పైన ఇచ్చాను. కథను రచయిత్రి తన స్వంత బ్లాగులో మొదట ప్రచురించారు. తర్వాత దాని పై వివరణ ఇచ్చారు.

  మీ విశ్లేషణ లో మీరు చెప్పదల్చుకుంది అర్థం అయ్యింది. అయితే నా అభిప్రాయం సుజాత గారి (కథ పై వ్యాఖ్యలలో) స్పందనకు దగ్గరగా ఉంటుంది.

  కథలో "సహజమైన" అనురాగానికి సరైన అవగాహన కావాలి అన్న సందేశం నాకు కనిపించింది.

  http://mynoice.blogspot.com/2006/12/blog-post_9320.html
  పై లంకెలో నా వ్యాఖ్యలను గమనించండి.

  చలం అయినా డా వించీ కోడ్ రాసిన డాన్ బ్రౌన్ అయినా, స్త్రీ పురుష సంబంధంలోని దివ్యత్వాన్ని చూపించి అసలు ఆ సంబంధాన్నే ఏదో సృష్టి కోసం స్త్రీ భరించాల్సిన బాధ్యత లాగా భావింపబడే orthodixy ని నిలదీశారు. అంతే కాని ఆ సంబంధానికి అనువైన పరిస్థితులకు సరైన అవగాహన అనే పునాది కావాలి అన్నది వారూ ఒప్పుకోవాల్సిన నిజమే కదా.

  ఒక వారంలో పెళ్ళి చేసేసుకుని వెళ్ళి పోయి ఆర్నెల్ల తర్వాత వీసా ఫార్మాలిటీలు ముగించుకుని విదేశానికి వచ్చి భర్తను పూర్తి ఏకాంతంలోనే ఐనా, ఒంటరితనం, homesickness, సహజమైన బెరుకు అనే బరువులతో సహా కౌగిలించుకునే భార్యలు, ఎదురుచూపులు తీరి తను ఎదురు వస్తున్నా తన మనిషే అయినా కొత్త మనిషిగానే ఉన్న ఆమెతో సంబంధం ఏర్పడడానికి సమయం అవసరం. ఇది నేటి కాలపు ఉదాహరణే.

  సహజమైన వాటికి కూడా కాస్త సమయానుకూలతా, సరైన విజ్ఞతా అవసరం. బాధ్యతగానో, బరువుగానో అవసరంగానో కాక స్నేహానికి, అనురాగానికి పరాకష్ఠగా నిలవాలి దాంపత్యంలోని ఆ అనుభవం అని చెప్పిన వారిలో కల్పన గారు కూడా చేరుతారు అనే నాకనిపిస్తోంది.

  ReplyDelete
 10. లలిత గారు మీరు చెప్పినది నిజమే నేను కాదు అనడం లేదు అలాగే కల్పన గారు చెప్పింది కూడా నేను వ్యతిరేకి ని కాను కాని ఇలాంటివాటి గురించి మనకి వీలయితే ఎంతో సున్నితంగా చెప్పగలగాలి కాని, ఇలా చెప్పడం చదివే వాళ్ళకి అమ్మో పెళ్ళా? అనే భయం కలుగుతుందని నాకనిపిస్తోంది. ఎప్పుడో గుంటూరు వెళ్ళే ట్రైన్ ప్రమాదం జరిగింది కాబట్టి మనము అసలు గుంటూరు వెళ్ళడం మానేస్తామా? చెప్పండి తీసుకొవాల్సిన జాగ్రత్త లు తీసుకొని వెళ్తాము అయినా జరిగింది అనుకొండి అది మన్న ఖర్మ అనుకొని కర్మసిద్దంతాన్ని వల్లే వేస్తాము అంతే ఈ దాంపత్య జీవితం కూడా, నేనేమి పురుషులందరివైపు వుండి మాట్లాడడం లేదు, మనకి ఈ కష్టం కలిగింది కాబట్టి మన పిల్లల విషయంలో జాగ్రత్త పడాలి అనుకొంటాము, అంతే కాని అసలు పెళ్ళే చేయకూడదు అని అనుకోము కదా, అలా అని ఇలాంటి విషయాలు పిల్లలికి చెప్పి భయపెట్టము కూడా, ఇక్కడ మనకున్న అనుభవంతో పిల్లలికి పరిస్థితి ఒకవేళ ఇలా వుంటే ఎలా ఎదుర్కోవాలో మనము చెప్పగలగాలి అని, నేను చెప్పడం జరిగింది అంతే కాని, అసలు అలా ఎవరూ లేరు అని చెప్పడం లేదు.. ఒక్క విషయం పాలగ్లాస్ తో గదిలోకి వెళ్ళే అమ్మాయికి జాగ్రత్తగా వుండమ్మా, అతను ఏది చెప్తే అది వినూ అని చెప్పే పాత రోజులు కావని చెప్తున్నాను.. అలాగే అమెరికా అయినా ఆంధధ్రా అయినా.. మీరన్నట్లు ఒక అవసరంగా కాక ఒక అవగాహనతో ఆనందాన్ని అనుభవించగలిగే నేర్పు ఓర్పూ సమయానుకూలత ని పిల్లలికి నేర్పల్సిన బాధ్యత పెద్దవాళ్ళకి వుంది. కాని తను కష్ట పడ్డాను తన కూతురు ఏమి చేస్తోందో? ఈ ఆడ జన్మ ఇంతేనా? అని అనుకొనే మనకి పరిస్థితులు వద్దు. తప్పనిపించి మ్మిమ్మల్ని నొప్పిస్తే నన్ను మన్నించండి, నా ఆలోచనా పరిధి ఇంతవరకే వుంది, ఇంతకన్నా ఎక్కువ నేను ఆలోచించలేకపోతున్నానేమొ.

  ReplyDelete

Loading...