5.17.2009

ఆత్మీయ స్పర్శకి శుభాభినందనలతో.......

పెద్దవారిని ఆత్మీయంగా పలకరించి,వారి ఆశీర్వాదం పొంది, వారికి తోడుగా ఉడతా భక్తిగా తమవంతు సాయం అందించిన ప్రమదలకి శుభాభినందనలు.

*****


వ్యాఖ్య విషయంలో ఒక చిన్న అభ్యంతరం - అభ్యర్ధన...కూడాను.


కొత్త పాళీ

చాలా సంతోషం. "ఊరికే గాజులు తొడుక్కు కూర్చునే చేతులు " కావీ ప్రమదలవి, సంఘటితమైన శక్తితో సహాయం చెయ్యగలిగిన చేతులివి అని సగర్వంగా నిరూపిస్తున్నారు. మీ సభ్యులందర్నీ మనసారా అభినందిస్తున్నాను."


పైన వ్యాఖ్యలోని ఊరికే గాజులు తొడుక్కొని కూర్చోడం అనేది ఒక తప్పు అన్నట్లుగా ధ్వనిస్తోంది. గాజులు తొడుక్కోడం లేదా వేసుకోడం అనేది ఆడవాళ్ళకి అలంకారం. గాజుల చెయ్యి మన ముందు తరాల నుండి ఎప్పుడు ఊరికే లేదు. గాజులు వేసుకోడం , పసుపు రాసుకోడం ఇవన్నీ ఆడవాళ్ళ సౌందర్యాన్ని ఇనుమడించడంలో భాగం. కాబట్టి ఊరికే కాకపోయినా డబ్బులిచ్చి కొనుక్కొని అయినా వీటిని ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఊరికే గాజులు తొడుక్కోడం, గాజులు తొడుక్కొని కూర్చున్నామనుకొన్నావా లాంటి పదాలు గాజులు మురిపెంగా వేసుకొనే వాళ్ళకి వినడానికి ఇబ్బందే. గాజులు వేసుకోడం తప్పా?? అన్న ఆలోచన రాకమానదు

సంధర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకో విషయం ...మన తెలుగు సినిమాల్లో ఆడవాళ్ళను అవమానపరిచే మరో విషయం.. " ఇంట్లో ఊరికే కూర్చొని ఏమి చేస్తున్నారు? బాగా తిని ఒళ్ళు పెంచుకోడం తప్ప " అని , ఇలా అనడం ఎంత అవమానకరమంటే, ఊరికే తినడం అనేది వినడానికి ఇబ్బందే, ఇది నేను చాలా చోట్ల బయట కూడా విన్నాను. అదేదో హాస్యం అన్నట్లుగా వినేసి నవ్వేసే ఆడవాళ్ళు కూడా లేకపోలేదు. ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయకపోయినా ఇంట్లో కూడా ఊరికే ఉండరు, వాళ్ళకి సంబంధించిన బాధ్యతలు అనేకం. కాని ఇలాంటి సంభాషణలు అసంఖ్యాకం. అలాగే మనవాళ్ళే, మన ఆడవాళ్ళే మగవాళ్ళ పౌరుషాన్ని పరీక్షిస్తూ అనే మాటలు "గాజులు తొడుక్కొని రండి.." పసుపురాసుకొండి మొ!... రాను రాను ఈ సౌందర్య ప్రతీకలైన గాజులు, పసుపు అనేవి మనం రాసుకొంటే /వేసు
కొంటే తప్పేమో ...అని అనుకొనే స్థాయికి మనమే దిగజారుతున్నాము. మనల్ని మనమే "గాజులు తొడుక్కొన్నామనుకొంటున్నారా.." అంటూ అవమాన పరుచుకొంటున్నాము. మీరే ఆలోచించండి నేనన్నది తప్పుగా అనిపిస్తోందా? మనల్ని ఎవరు పొగడాల్సిన అవసరంలేదు. మన నిత్య అలంకార సౌందర్య సాధనాలను ఆధారం చేసుకొని అవహేళన చెయ్యకపోతే చాలు. పైన వ్యాఖ్య అభినందనీయమే. కాని ఆ ఒక్క పదం ఉపయోగించకుండా ఉండిఉంటే బాగుండేది. పెద్దవారు .... చెప్పతగ్గ వాళ్ళము కాదు కాని, ఎందుకో .... గాజులు , పసుపు , కుంకుమ, ఇవన్నీ పిరికితనానికి ప్రతీకలు కావు అని చెప్పాలనుకొన్నాను కాని , ఒకరిని తప్పు పట్టాలన్న ఉద్దేశ్యం నాకు లేదు.

నోట్: మరీ ముఖ్యంగా చెప్పాలనుకొన్న విషయం నేను ఇక్కడ వ్యాఖ్యాతని విమర్శించలేదు, వ్యాఖ్యలోని ఆ ఒక్క పదానుబంధాన్ని మాత్రమే విమర్శించాను గమనించగలరు.
****

No comments:

Post a Comment

Loading...