10.30.2010

"నువ్వు-మీరు" ల మధ్య జరిగే మర్యాదల అంతః కలహాలు

ఎదుటి మనిషిని మనము "నువ్వు" అని పిలిచామంటే వాళ్ళు మనకి ఎంతో దగ్గరివాళ్ళు అయివుండాలి లేదా మనకన్నా చిన్నవాళ్ళయినా అయివుండాలి .. అలాంటప్పుడే.. మనము వాళ్ళని "నువ్వు" అని పిలవడానికి సంకోచించకూడదు.. ... అపరిచితులని ఎప్పుడైనా సరే.. "మీరు" అని పిలవడమే.. మన మర్యాద.. మనం మాట్లాడే తీరు మన సంస్కారాన్ని తెలియజేస్తుంది... మనకన్నా పెద్దవారిని .. మనకి తెలియని వారిని పలకరించాల్సివచ్చినప్పుడు "మీరు" అని పిలవాలి.. చిన్నప్పుడు "క్రిష్ణవేణి టీచర్ చెప్పిన మాటలవి..
మన తెలుగులోనే ఈ మర్యాదల ఏకవచన బహువచన సంభోధనలు దీని వలన బయటికి చెప్పలేని అంతః కలహాలు ఎన్నో....
అవతలి మనిషిమీద గౌరవం అనేది మనసులోంచి రావాలి చూడగానే మనకే నమస్కారం పెట్టాలి అనిపించాలి.. అదిగో.. మీవాళ్ళు నాకు అసలు గౌరవం ఇవ్వరు.... అని అంటే అది అడిగి(అరువు అనచ్చేమో) తెచ్చుకొన్న గౌరవ మర్యాదలే అవుతాయి తప్ప సహజసిద్దంగా వచ్చినవి కావు.. (ఇందుకు ఎవరు అతీతులు కాదని అనిపిస్తుంది)
మొన్న మా బాబు అడిగాడు.. "నువ్వు" అనే పిలుపు దగ్గరి తనానికి ప్రతీక అయి నప్పుడు.. అది అమర్యాద ఎలా అవుతుంది?డాడినే ఎందుకు "మీరు" అని పిలుస్తారు?? డాడి మనకి చాల దూరమా?? అని... పెద్దవారు కదా "మీరు" అని పిలవాలి.. అని చెప్తే వెంటనే మరి నువ్వు కూడా పెద్దదానివె కదా నేను ఇప్పటినుండి నిన్ను కూడా "మీరు" అనే పిలుస్తాను అన్నాడు... ఒక్కరోజు అలా పిలిచి.. పిలవడానికి కష్టపడి .... ఇక నావల్లకాదమ్మా నువ్వేంటో దూరమైపొతున్నట్లుగా వుంది అని మానేసాడు...
అవును ఎందుకిలా?? అమ్మని "నువ్వు" అని నాన్నని "నాన్నగారు" అని అలా పిలవడం ఇద్దరికి వ్యత్యాసం ఏమిటి?? ఆడ మగ అవడమేనా అని ...ఆలోచిస్తే అనిపించింది.. ఇదివరకు రోజుల్లో అయితే.. నాన్న బయట పనులు.. అమ్మ ఇంట్లో పనులు... అదీ కాక అమ్మ కూడా నాన్న ని "మీరు" అని సంభోదించేది... ఇంటికి పెద్ద అనే హోదా.... అలా అలవాటైపొయింది... ఇక్కడ కాదు కాని ఆంధ్ర వైపు ఈ మర్యాదలన్ని ఇంకా కొనసాగుతూనే వున్నాయి... నాన్న ని "నువ్వు" అని పిలవడం ఏదో పాపం అన్నట్లువుండేది... ఇంకా కొన్ని చోట్ల అయితే "నాన్నగారండి" అని కూడా పిలుస్తారు..
పిల్లలు "నాన్నగారు ఫలనాది తీసుకురండి" అని అనడానికి "అమ్మగారు అన్నం పెట్టండి" అని అనడానికి ఎంతో వ్యత్యాసం వున్నట్లుగా వుంది...వినడానికే బాగోలేదని అనిపిస్తోంది...
మరెందుకీ వ్యత్యాసం అంటే నర నరాల్లో జీర్ణిచుకుపోయిన.. ఆచారాలు .. సాంప్రదాయాలు... కొన్ని ఇలా కష్టంగా...మరికొన్ని ఇష్టంగా భరించేగలిగే శక్తి వుండడం అంతే.. కాని "నువ్వు" వరకు పర్వాలేదు.. కొన్ని ఇళ్ళళ్ళో "ఏమేవ్.. ఒసేవ్.. లాంటివి కూడా వాడతారు...." ఇలా చెయ్యవే... అలా చెయ్యవే... " " అది వస్తానంది రాలేదా" అని మాట్లాడుతుంటే ఎంత బాధేస్తుందో..."అది" "ఇది" అని పిలవడానికి ఆడవాళ్ళేమన్నా వస్తువులా?? పేరు ఉపయోగించచొచ్చుగా .. ఒక వింత ఏటంటే .... ఇలా పిలిచే వాళ్ళే ఇప్పటి పిల్లలు తోటి అబ్బాయిల్నో లేదా వాళ్ళ బాయ్ ఫ్రండ్స్ నో ఏరా.. ఓరేయ్ ... అంటే సహించలేరు...(ఇలా పిలవడం కరెక్ట్ అని కాదు నా వాదన.. ఒక వేలు ఎదుటి వారి తప్పు చూపిస్తే మూడు వేళ్ళు మనవైపు చూపిస్తాయి.. అన్నట్లు... ఎదుటివారంటే గౌరవం మర్యాద లేనివాళ్ళు తప్పులెంచడానికి అనర్హులు)
మర్యాదని ఇచ్చిపుచ్చుకోవాలి అంటారు పెద్దలు.. మనము ఇచ్చే మర్యాదని బట్టే మనకొచ్చే మర్యాద... నీ భర్తని నువ్వు గౌరవిస్తేనే ఎదుటివారికి కూడా గౌరవం వుంటుంది. అని ఒక భర్త బార్యకి చెప్పి "మీరు" అనో "ఏవండీ" అనో పిలిపించుకొంటున్నారంటే.. మరి ఇదే సూత్రం బార్యకి కూడా వర్తిస్తుందేనే సత్యం గ్రహించగలగాలి...అంటే భర్త తన బార్యని "మీరు" అని పిలవాలి అని కాదు... అలా ఒక వస్తువునో.. లేద ఒక పనికిరాని వ్యక్తి తో మాట్లడుతున్నట్లో కాక ఆ "నువ్వు" నే ప్రేమగా పిలవగలగాలి... తప్పులేదు అనుకొంటే.. బార్య కూడా... "మీరు" నుండి "నువ్వు" అని పిలిచి... ప్రేమను పంచు(పెంచు)కోవాలి ...ఇక్కడ "నువ్వు" కి అర్ధం దగ్గరితనానికి ప్రతీక కాని అమర్యాద ఎంతమాత్రం కాదు..
ఒక పరిచయం లేని వ్యక్తి మొదటి పరిచయంలోనే "నువ్వు" అని అంటున్నారంటే .. అది ఖచ్చితంగా అమర్యాదే...
అందుకే అనిపిస్తుంది.. ఈ మర్యాదలు అనేవి ఎప్పటికి ఇలా అంతః కలహాలుగానే వుంటాయి.. బయటికి చెప్పుకోలేము .. . దాచుకోలేము...

13 comments:

 1. తెలిసి రాసారో లేక తెలియక రాసారో కానీ కుటుంబ దినోత్సవం నాడు మంచి వ్యాసం రాసారు.....అభినందనలు

  ReplyDelete
 2. తెలీదు..విజయ భాస్కర్ గారు తెలియజేసినందుకు నెనర్లు.. అందరికి కుటుంబ దినోత్సవ శుభాభినందనలు..

  ReplyDelete
 3. బాగుంది మీ ఆలోచన,logical గా కాని పాతుకుపోయినవాటిని పెకిలించలేము

  ReplyDelete
 4. నే మా అమ్మని ఏరా, ఒరేయ్ అని పిలుచుకొంటాను. మీరనట్టు నాన్నని మాత్రం నాన్నగారు అని పిలవము. హాయిగా - నాన్నోయ్ అనో మరీ సరదా మూడ్లొ ఉంటే అయ్యోయ్ అనో లెకపోతే ఓ! డాడీ అని ఇల్లెగిరిపొయెటట్టు అరుస్తుంటాము. పాపం మా నాయన మాత్రం - ఎందుకురా అలా, గొంతు నెప్పెడుతుంది అంటారు.

  ReplyDelete
 5. రమ గారు,
  అమ్మని నువ్వు అని పిలవటంలో స్వేచ్చ, దగ్గరితనం ఉంటే, నాన్నని మీరు అనటంలో భయం, గౌరవం ఉన్నాయి. ఇంతా చేస్తే, ఇదంతా మన స్వంత తెలివి కాదు. చిన్నప్పటినుంచి అలా పిలవటం అలవాటుచేసిన మన సంస్కృతి, సంప్రదాయాలదీనూ.

  అదే తెలంగాణాలో వాళ్ళ సంస్కృతీ సంప్రదాయాలననుసరించి అందర్నీ నువ్వు అనే పిలుస్తారు, ఆఖరికి పీఠాధిపతులు, మఠాధిపతులతో సహా.

  ఈ గోలేమీ లేకుండా, ఆంగ్లంలో హాయిగా "యూ" నే అందరికీ వాడతారు.

  ఇంతకీ చెప్పొచ్చేదేమంటే, ఒకళ్ళ భాష మరొకళ్ళకి వినటం కష్టమే గానీ, పెద్దలన్నట్లు "యధ్బావం తద్భవతి".

  ReplyDelete
 6. మేము "నాన్నగారండీ" అనే పిలుస్తాము.పెద్దవాళ్ళ పేర్లు వున్న పిల్లలని కూడా మర్యాదగానే పిలుస్తాము.పెద్దవాళ్ళు కూడా ఆ పిల్లలని మర్యాదగా పిలవడమో లేక ప్రేమగా "ఒరేయ్ తాత","పెద్దయ్య"...ఇలా వరసలతో పిలుస్తారు.

  ReplyDelete
 7. మేము కూడా నాన్నగారు, తాతగారు అనే పిలిచేవాళ్ళం.నేను మాత్రం మా అబ్బాయితో(వాడికి ఇంకా మాటలు రాలేదు) ఏకవచనంలోనే(నాన్నగారు అనో, మీరు అనో కాకుండా) అని పిలిపించుకోవాలని అనుకుంటున్నాను. వికటకవిగారన్నట్లు ఇవి మన నరనరాల్లో జీర్ణించుకుపోయిన సంప్రదాయాలు. మారటం కొద్దిగా కష్టం. అంతెందుకు,పెళ్ళయిన కొత్తలో మా ఆవిడకి చెప్పా నన్ను మీరు అనాల్సిన అవసరం లేదని, పేరుపెట్టి పిలవచ్చునని. కాని తనకి నన్ను బహువచనంలో సంబోధిస్తేనే ఇష్టమని చెప్పింది!!!

  ReplyDelete
 8. solarflare గారు, వికటకవి గారు, రాధిక గారు, బ్లాగాగ్ని గారు నెనర్లు... రాకేశ్వర రావు గారు అది నిట్టూర్పా?? ఇంతే ఇక అని ఓదార్పా?? ఇంత పెద్ద టపా చదవలేక చదివిన ఏమరుపా... లేక మైమరపా??(అంత సీన్ లేదనుకొండి నా టపా కి.. అయినా.. ఎదో పదకూర్పు బాగుందని అడిగానంతే) "హూ" కి అర్ధం అర్ధం కాలేదండి..

  ReplyDelete
 9. naku matram ekkadina "nanna garu, nanna garandi" ila maatalu vinte mathram thega navvu vastadi. nanna, amma ani piliste ma daggara matram adi gouravam ledani kaadu, adi daggarithaname :)

  nenu matram ma parents ni raka rakaluga pilustuntanu. amma, mom, moms, nanna, dads ani inka variety ga chitti mummy, chitti potti mummy, chitti potti daddy ani muddu mudduga pilusthuntanu mari love ekkuvayinapudu :)

  ma nanna or amma vere vallaki na gurinchi edina vaste na original peru petti vere vallaki chepte edo paraayi valla gurinchi cheppinattu anipistadi naku, enadukante intlo nick name tho alavatayi valla notlo nunchi suddenga original name tho ante :(

  ReplyDelete
 10. naku matram ma ayanatho eme, osey ani anipinchukodam ishtam adi evvaru lenapudu matrame ;)

  ReplyDelete
 11. రాకేశుడి హూ... అంటే 'ఇది ఆలోచించాల్సిన విషయమే సుమా' అని అర్థం అనుకుంటానండీ!

  మంచి విషయం ప్రస్తావించారు :)

  ReplyDelete

Loading...