10.21.2010

టిక్..టిక్..టిక్.... గడియారం పన్నెండయ్యింది.

నాకు 4 సంవత్సరాలప్పుడు:
"చిన్నా!! టైం ఎంతయ్యిందో చూడరా"
"ఆ.. నాన్నగారు ఎండ నందివర్థనం చెట్టుదాకా వచ్చింది"
"అంటే 10 అవుతోదండి. ఎంత సేపు నా కంఠశోషేగాని ఆ ఎండ నడినెత్తికి వచ్చేదాకా మీరా పేపరు పట్టుకొని వదలరు . తొందరగా తెమలండి మళ్ళీ నన్నంటారు. "
"అందుకేగా పాపని టైం అడిగింది. ఇంకో అరగంటలో రెడీ అవుతా!! టిఫిన్ సంగతి చూడు. "
"టిఫిన్ ఎప్పుడో రేడి! మీదే ఆలస్యం.. వచ్చేయండి"
********
నాకు 7 సంవత్సరాలప్పుడు (3వ తరగతిలో ఉన్నప్పుడు):
"అమ్మలు టైం ఎంతయ్యింది రా?"
"నాన్న పెద్ద ముల్లు తొమ్మిది దగ్గర, చిన్నముల్లు తొమ్మిదికి పదికి మధ్య ఉంది."
"అంటే ఎంతయినట్లు వారం ముందేగా నేర్చుకొన్నావు అప్పుడే మర్చిపోయావా?"
"వారం ముందు పెద్ద ముల్లు ఎక్కడుందో , చిన్నముల్లు ఎక్కడుందో చెప్తే చాలు , విన్న వాళ్ళకి టైం తెలిసిపోతుంది, అని మా లెక్కల టీచరు చెప్పారు , అంతే నాన్నగారు నేను అదే అడిగాను మిమ్మల్ని. ఇప్పటికిది చాలన్నారు. నేనేమి తప్పు చెప్పలేదు కదా!."
"అందరూ తెలుసుకొంటారు సరె ! మరి నువ్వెప్పుడు నేర్చుకొంటావు?"
"ఇంకేమి నేర్చుకోవాలి? పెద్దముల్లు , చిన్నముల్లు ఎక్కడున్నాయో చెప్పడం తెలుసుకదా!"
"పిచ్చిదానా! అంతే కాదు, అసలు నేను నేర్పుతాను ఉండు నీకు ..ఏది ఆ బల్ల మీద ఉన్న ఆ గడియారం పట్రా!"
"ఇదిగొండి నాన్నగారు!"
"చూడు ఇందులో 1 నుండి 12 సంఖ్యలు వరసగా ఉంటాయి. నీకు ఐదవ ఎక్కాం వచ్చుగా?"
"వచ్చు నాన్నగారు! చెప్పమంటారా?"
"ఊ చెప్పు!"
బుద్ధిగా చేతులు కట్టుకొని, కళ్ళు గట్టిగా మూసుకొని " ఐదు ఒకట్ల ఐదు.. ఐదు రెండ్లు పది, .. ఐదు మూళ్ళూ పదిహేను.............ఐదు పన్నెండ్ల అరవై."
"చాలు నీకు ఐదో ఎక్కం వస్తే చాలు టైం చెప్పడం వచ్చేసినట్లె, ఈసారి ఎవరన్నా టైం అడిగితే ఐదో ఎక్కాం మననం చేసుకో చాలు. ఇక టైం ఎంతయ్యింది అనేది ఎలా చెప్పాలంటే....................."
"ఏంటి పసిపిల్లతో ముచ్చట్లు మీకాఫీసు టైం దాటిపొవట్లేదూ...... లేవండి.. దాంతో సాయంత్రం తీరిగ్గా మాట్లాడుకోవచ్చు! అది నేను ఎక్కడికి వెళ్ళము. "
"సరే తల్లీ! ఆఫీసు టైం అవుతోంది సాయంత్రం వచ్చి చెప్తాను. నువ్వు ఎవరన్నా టైం అడిగితే మటుకు ఇలా పెద్దముల్లు చిన్నముల్లు అని చెప్పడం మానేసేయి. చక్కగా ఐదో ఎక్కం గుర్తు తెచ్చుకో. "
"సరె నాన్నగారు. "
అ తరువాత చాలా రోజుల దాకా ఈ ఉసెత్తిన ధాఖలాలు లేవు.
**********
ఓ 20 రోజుల తరువాత అందరూ వేసవి సెలవలకని ఊర్లో కలిసిన వేళ....
అమ్మా, పిన్నిలందరూ భోజనాలు చేస్తున్నారు. ఇంతలో... వాళ్ళల్లో ఒక పిన్ని..
"చిన్న అమ్మలూ ఒక సారి టైం ఎంతయ్యిందో చెప్పరా? "
"ఆ! పిన్ని వస్తున్నా! చెవిలో నాన్నగారు చెప్పిన మాటలు (ఎవరూ టైం అడిగినా ఐదవ ఎక్కం మననం......) గుర్తు రాగా.. పిన్ని దగ్గరికి వెళ్ళి బుద్ధిగా చేతులు కట్టుకొని, కళ్ళు గట్టిగా మూసుకొని ఐదు ఒకట్ల ఐదు.. ఐదు రెండ్లు పది, .. ఐదు మూళ్ళూ పదిహేను.............ఐదు పన్నెండ్ల అరవై. అని చెప్పి కళ్ళూ తెరిచి చూద్దును కదా! వా అ అ అ అ అ అ...... :-( అమ్మా , పిన్నిలు అందరూ ఒకటే నవ్వు.
ప్చ్! అప్పడు, ఇప్పుడు కూడా నాకర్థం కాని విషయం ఇది. నాన్నగారు చెప్పింది చెప్పినట్లు అక్కడ చెప్పాను. ఎండ, నీడలు నందివర్థనం దాకానో , గుమ్మందాకానో వస్తోంది అంటే టైం తెలుసుకొంటారు.. పెద్దముల్లు చిన్నముల్లు ఎక్కడుందో చెప్తే చాలు టైం తెలుసుకొంటున్నారు మరి నేను ఐదో ఎక్కం చెప్తే నవ్వడం?? అసలు ఇప్పటికి అర్థం కావడం లేదు. మరి మీకేమయినా అర్థం అయితే చెప్పండి కొంచం.. ప్లీజ్!
*******
ఇప్పుడు..అమ్మావాళ్ళింట్లో..
"అమ్మా! టైం ఎంతయ్యిందో చెప్పమ్మా!"
"ఇదిగో ఇప్పుడీ 'స్రవంతి' అయిపోతే ఎనిమిదిన్నర అవుతుంది".
"కాస్త కాఫీ ఇవ్వమ్మా!"
"కాస్త ఆగవే!! ఇదిగో ఇంకో పావుగంటలో 'చక్రవాకం ' అయిపోయి మళ్ళీ "మెట్టేల సవ్వడి" మొదలయ్యెలోపులో ఇస్తాను. "
"అప్పటికి భోజనాల టైం అవుతుందేమోలె వద్దు నేనింటికి వెళ్తాను".
"అప్పటికి భోజనాల టైం ఎమిటి పిచ్చిమొహమా! 'కలవారి కోడలు' వచ్చేప్పుడు తొమ్మిదిన్నర అవుతుంది . అప్పుడే ఎక్కడా ఇంకా చాలా టైం ఉంది."
"అబ్బా! ఈ సిరియల్ టైం ఏమిటమ్మా బాబు! వదిలేయి."
గడియారం అందుబాటులో లేకపోయినా పర్వాలేదు అనెంతగా ఇలా ఒక సీరియల్ ని బట్టో, ఎండని బట్టో, మనకొచ్చిన ఎక్కాల్ని బట్టో కాలాన్ని లెక్కించేసి చకా చకా చక్రాలని తిప్పెస్తారు.
(ఇక్కడ సీరియల్స్ ఎప్పుడొస్తాయో నాకు తెలీదు ఊరికే చెప్పాను గుర్తున్న సీరియల్ని చెప్పాను అంతే)
*******
కాని ఈరోజు:
అక్కడున్న ప్రతి ఒక్కరూ కను రెప్ప కూడా వేయకుండా 'గడియారం' వైపు తదేకంగా చూస్తున్నారు. పెద్ద ముల్లు 11 దగ్గిర, చిన్నముల్లు 12 దగ్గిర ఉన్నాయి. అందరూ అదేదో యుద్ధరంగానికి సిద్ధమయినట్లుగా తరువాత చేయబోయే కార్యక్రమాలకి ఉద్యుక్తులై కళ్ళల్లో ఒక్క సెకను కూడా మిస్ అవకూడదనే టెన్షన్ తో ఉన్నారు. అక్కడే ఒకే ఒక శబ్ధం అతి చిన్నగా అయినా అదే చెవి కర్ణభేరులని చేధిస్తుందేమో అనేంత పెద్దగా వస్తోంది. సూదిమొన కింద పడినా వినిపించేంత నిశబ్ధంలో వినిపించే ఆ శబ్ధంబ్ధం .... వింటూ అప్పటిదాకా ఆడి ఆడి అలసి సొలసి పోయి వారందరూ అలా గడియారంవంక చూస్తూ .. ఆ శబ్ధం వింటూ .. కౌంట్ డౌన్ చేసుకొంటున్నారు. ఆ శబ్ధం
టిక్ ...టిక్....టిక్.......
వీళ్ళంతా మనసులో ప్రతి టిక్ కి ఒక సంఖ్య అనుకొంటున్నారు.
టిక్ ...టిక్....టిక్.......టిక్ ...టిక్....టిక్.......టిక్ ...టిక్....టిక్.......టిక్......
51...52...53..54...55....56...57...58...59...60
యాహు! టిక్..టిక్..టిక్.... గడియారం పన్నెండయ్యింది.
H A P P Y N E W Y E A R
ఒక్కసారిగా కేకలు మిన్నంటాయి. ఒకళ్ళూ కేక్ కట్ చేస్తున్నారు, మరొకరు బాణసంచా కాలుస్తున్నారు, ఇంకొకరు డాన్సులు వేస్తున్నారు. ఇంటి ముందంతా సందడే సందడి. లౌడ్ స్పీకర్లో పాటలు ఆ శబ్ధాలకి భూకంపం వస్తుందేమో అన్నట్లుగా.. అంత ఉత్సాహంగా 2009 కి మా కొత్త ఇంట్లో చుట్టుపక్కల దాదాపు 25 మందిమి కలిసి అరిచి గోల గోల చేస్తూ స్వాగతం పలికాము. ఆ సందడి సంతోషం తో మీకందరికి కూడా...
H A P P Y N E W Y E A R .
******
కొ.మె: మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా .. ఇంత తదేకంగా, దీక్షగా, ఇన్త ఉద్వేగంగా గడియారం వంక చూసే అవకాశం రాదేమో. గడియారం పండగ మటుకు డిసెంబర్ 31 తారీఖే రాత్రి 12 గంటలకే, అంటే తెల్లవారితే జనవరి 1 వ తారీఖు. :-)

16 comments:

 1. chaal bhaga wishes cheparu madam,

  same to you ani simplega chepthunanduku sorry.

  Anyway Happy new year to you,your family and all other bloggers.

  ReplyDelete
 2. chaalaa baagaavrasaaru kaalagamanaanni.

  ReplyDelete
 3. నూతన సంవత్సర శుభాకాంక్షలతో,

  ReplyDelete
 4. ha..ha..ha..ha....happy new year 2009

  ReplyDelete
 5. Very interesting one. Happy New year 2009 to you also.

  ReplyDelete
 6. వినూత్నంగా చెప్పారు శుభాకాంక్షల్ని,మీక్కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.

  ReplyDelete
 7. హ్హ హ్హ హ్హ... చాలా బాగా చెప్పారు రమణి గారూ... బహుశా అందరివీ ఇవే అనుభవాలేమో ..

  బుద్ధిగా చేతులు కట్టుకొని, కళ్ళు గట్టిగా మూసుకొని " ఐదు ఒకట్ల ఐదు.. " ఇది మాత్రం సూపర్.. చిన్నప్పుడు అచ్చంగా ఇలానే ఎక్కాలు చెప్పేవాళ్ళం.

  మీకూ మీ కుటుంబానికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు...

  ReplyDelete
 8. మీకున్న ఇతర బిరుదులకి ఇది కూడ జోడించేసుకోండి .. ఎక్కాల రమణి :)
  అభినందనలు మరియూ శుభాకాంక్షలు

  ReplyDelete
 9. I really like the way you narrated.
  Happy new year to you all.

  ReplyDelete
 10. చాలా బాగా చెప్పారు రమణి గారూ..నూతన సంవత్సర శుభాకాంక్షలు

  ReplyDelete
 11. అబ్బో భలే బాగా చెప్పారే.అంటే ఇంతకీ మనకి గంట చెప్పడం వచ్చిందా ఇంకా ఎక్కమే చెపుతున్నారా ఎక్కాల రమణి గారూ?(సరదాగా)హ్హహ్హహ్హహ్హహ్హహ్హహ్హ..నూతన సంవత్సర శుభాకాంక్షలు..

  ReplyDelete
 12. బావుంది రమణిగారూ
  అవునూ అయిదు డభైలెంత టక్కున చెప్పాలిమరి

  ReplyDelete
 13. మా చిన్నప్పుడు రేడియోలో వార్తల టైము ,ప్రోగ్రామ్స్ ని బట్టి టైం చెప్పుకొనే వాళ్ళము. ఇప్పుడు ఇంచుమించు చాలా మంది ఇళ్ళవద్ద సీరియల్స్ టైం నే ఫాలో అవుతున్నారు.బాగుందండి మీ న్యూ ఇయర్ టపా నాలాంటి వాల్లకోసమనమాట మల్లీ పోస్ట్ చేసింది.
  రమణి గారు మీ హాస్యచతురత , మీ బ్లాగ్ నాకు చాలా నచ్చాయండి..

  ReplyDelete

Loading...