3.23.2009

సరదా సరదా స్వీట్ హోంఅనేసింది! తను అనుకొన్నంత అయ్యింది. ఎంత మాటంది, తనకు తెలుసు ఇలా ఎవరో ఒకరు ఎపుడో అపుడు మాట తూలతారని, అందుకే ఎన్నో సార్లు చెప్పింది తను బుచ్చిబాబుకి.. "నువ్వు మరీ అలా అమాయకుడిలా ఉండకు బుచ్చీ!, ఎవరో ఒకరు మరీ మెత్తనివాడమ్మా.. మీ ఆయన" అని అంటారు అని, ఆహ! వింటేగా.. 'విమల ప్రియే' అంటూ.... రాని చెప్తాను. తను "చెప్పు బుచ్చిప్రియే" అని కరిగిపోకూడదు ...ఇంకెంత చెప్పను.. లౌక్యం తెలీదా అంటే.. పెద్ద లాయరాయే!


"అబ్బా! " ఒక్కసారిగా ఉలిక్కిపడి వేలు చూసుకొంది .. సూది గుచ్చుకొన్నంత మేరా రక్తం వస్తోంది. ఎప్పుడు ఇంతే బుచ్చిబాబు గురించి ఆలోచించడం, ఇలా వేలు గుచ్చుకోడమో..కొసుకోడమో జరగడం.. "పుట్టింటి వాళ్ళ దగ్గిరన్నా కాస్త కనిపించూ బుచ్చీ! " అని చెప్పినా వినడు. మొన్నటికి మొన్న తమ్ముడు ఇంటికొస్తే మాట్లాడొచ్చు కదా.. అహ! "విమలా! అలా బయటికి వెళ్ళోస్తా " అని తప్పుకొన్నాడు. తరువాత "ఎందుకలా బయటికి వెళ్ళడం? బావమరిదితో కాసేపు మాట్లాడొచ్చుకదా!" అని అడిగితే "ఆ.. ఏమి మాట్లాడతాము చెప్పు! అయినా నువ్వు మాట్లాడుతున్నావు కదా, నువ్వుంటావు కదా ఇంట్లో" అంటూ అటు తిరిగి పడుకొన్న బుచ్చిబాబుని చూస్తే అసలు ఈయన లాయరేనా? నేనేమన్నా తప్పు చేసానా? అని అనిపిస్తుంది. మంచివాడే అని అన్నయ్య చెప్తే కదూ ! తను చేసుకొంది. ... థాంక్ గాడ్ ! పాదాలకింద చోటిమ్మని ఆ పాత విమలలా అడగలేదు. అడిగుంటే ఆ బుచ్చిబాబులా గేలి చేసేవాడో.. నీ స్థానం ఇక్కడ అని హృదయం చూపించేవాడో.. ప్చ్ ఏది ఏమైతేనేమి, ఆ బుచ్చి బాబు కి ఈ బుచ్చిబాబుకి తేడా లేదనిపిస్తొంది . షర్ట్ కి బటను కుడ్తూ టైం చూసింది, అమ్మో! 5 అవుతోంది. ఆకలంటూ వస్తాడు. వస్తూనే వంటిల్లంతా వెతికేస్తాడు. కాసిని పకోడీలు వేసి అసలు విషయం చెప్పాలి. ఎంత మాటంది అతని చెల్లెలు.. ఎంత మంచివాడు, బంగారంలాంటి మనిషిని అంత మాటంటుందా? ఇదంతా బుచ్చి ఇచ్చిన అలుసు కాదూ.....


"విమలా కాసిని మంచినీళ్ళు ఇవ్వూ"


ఆలోచనలో పడి చూసుకోలేదు వచ్చేసినట్లున్నాడు. అనుకొని మంచినీళ్ళు ఇచ్చి, కలిపి ఉంచిన పిండితో పకోడి ప్రహసనంలో పడింది విమల.


"ఆకలేస్తోంది విమలా.. ఏంటి టిఫిన్? "


"వేస్తుంది , వేస్తుంది ఎందుకు వెయ్యదు. నా దగ్గిరే ఈ మాటలన్నీ.. ఎవరన్నా వస్తే మూగవాడేమో అని అనుకొనేట్లు నోట్లో ముద్ద పెట్టుకూర్చుంటారు.. ఓ మాట లేదు మంతి లేదు. కాస్త ఎవరన్నా వస్తే కలివిడిగా మాట్లడడం ఎప్పటికి వచ్చేనూ మీకు? ఇప్పటికి సవాలక్షసార్లు చెప్పాను, అలా మూగనోము పట్టద్దండీ కాస్త నోరు తెరవండీ అని, అహ వింటేనా.. ఎప్పుడు ఎడ్డెమంటే తెడ్డెమనేవాళ్ళకి ఎన్ని చెప్పినా ఒకటే...... " అంటూ విసురుగా పకోడిల ప్లేట్ తీసుకొచ్చి అక్కడ పెట్టింది.


"అబ్బా ఎందుకు విమలా అంత కోపం ఇప్పుడేమన్నాను? టిఫిన్ ఏంటి అని అడిగినందుకు ఇంత క్లాసా?"

"నా ఖర్మ! టిఫిన్ ఏంటి అని అడిగినందుకు కాదు బాబు.. నాతో పాటే మిగితావాళ్ళు మనుషులే .. నీ ధైర్యం నా దగ్గిరే కాదు వాళ్ళ దగ్గిర కూడా కాస్త ప్రదర్శించు అని చెప్తున్నా.."

"హఠాత్తుగా ఎమైంది విమలా నీకు? పొద్దున్న బానే ఉన్నావు కదా, ధైర్యం ప్రదర్శించడాలు అవి మాట్లాడుతున్నావు.. "

"ఆఆఆఆఆ... నిన్నూ.. ఛ! నీకు మంచి చెప్పాలి అనుకొన్నాను చూడు అది నాది తప్పు..నువ్వు మారవిక".

"ఇప్పుడు బానే ఉన్నా కదా ఇంకా మార్పెందుకు? అయినా నువ్వున్నావు కదా విమలా, ఇక నేనెలా ఉన్నా పర్వాలేదు. "

"నువ్వో రాయి.. నీ హృదయం ఓ పెద్ద బండరాయి."

"ఊ అవును.. అందుకే హృదయంలో చోటడగకుండా నీకిచ్చేసాను. విమల ప్రియే!"

"ఛట్! నాకు చాఆఅలాఆ ఖోపంగా ఉంది అలా పిలవకు, మీ చెల్లెలు ఎంత మాటందో తెలుసా అసలు? ఇక నువ్వెప్పుడు తెలుసుకొంటావు?"

" నువ్వు చెప్పందే నేనెలా తెలుసుకొంటాను, ఇందాకే అన్నావు ఎంతమాటందో తెలుసా? అని.. పోనిలెద్దూ విమలా, ఎవరేమనుకొంటే మనకెందుకు? అనవసరంగా నువ్వెందుకు బాధపడ్తావు చెప్పు?"

"ఇదిగో నీ లాయర్ బుర్ర నాదగ్గిర చూపించకు.. ఎవర్నో అంటే నాకెందుకు ఇంత బాధ, అన్నది నిన్నూ.. "

"అసలేమంది విమలా?"


"అబ్బో బుచ్చిబాబు బుద్ధిమంతుడులా అసలేమంది విమలా? ఎంత నెమ్మదిగా అడుగుతున్నాడో.."


" చెప్తే చెప్పు.. లేకపో్తే లేదు, అవునూ వచ్చి ఇంతసేపయింది పిల్లలు కనపడరేం? నా మీద కోపం వాళ్ళమీద చూపించావా?"


"ఆ మరె.. నేనో పెద్ద రాక్షసిని వాళ్ళని రాచి రంపాన పెట్టేస్తున్నాను. ఎక్కడో ఆడుకోడానికి వెళ్ళుంటారు. నువ్వు మాట మార్చకు"


"అబ్బా! పిల్లల గురించి అడగడం కూడా తప్పేనా? సరె చెప్పు, ఏమంది మా చెల్లెలు?"


"ఏమంది మా చెల్లెలు? ఎంత నెమ్మదిగా అడుగుతున్నావో? నువ్విచ్చిన అలుసుకాదూ! అది,.. ఎన్నిసార్లు చెప్పాను, కాస్త ఆ మెతకతనం మానుకో అని వింటేగాఆఅ.."


"ఏమందో చెప్పు విమలా! "

"ఏమంటుంది?
వదినా ముందు అన్నయ్యని మారమనూ.. అలా బుద్ధావతారంలా ఉండోద్దని చెప్పు, కాస్త గట్టిగా అల్లుడి హోదాలో చెప్తే.. ఎవరన్నా వింటారు, అంతే కాని అంత మెతకతనము కూడదొదినా " అని అంది.."

"హ హ్హ హ్హ హ్హ.. అంతేగా ఈ మాత్రం దానికేనా అంత ఉక్రోషం? అంత కోపం? అయినా కోపంలో కూడా భలే అందంగా ఉంటావు విమలా నువ్వు.."

"మీ చెల్లెలు అంత మాటంటే నీకు అది నవ్వులాటగా ఉందా? నేను అందంగా ఉన్నానా? నా కోపం నీకంత ఆటగా ఉందా? "


"లేదు బాబోయ్! లేదు. సరె నేను మారతాను. , ఈసారి నుండి ఎవరూ నన్నేమి అనలేనంతగా మారిపోతాను. "

"నా బుచ్చి బంగారం, అలా ఉండాలి, ఇదిగో ఇంకో రెండు పకోడీలు వెయ్యనా.." ఉ షారుగా అంది.

"ఊ వెయ్యి! బాగున్నాయి , పకోడీలు.. అవును కాని విమల ప్రియే...!"

"చెప్పు బుచ్చి ప్రియే!"

"నిజంగానే కోపంలో కూడా అందంగా ఉంటావు. పకోడీల రుచిలా.."

"ఏంటి పకోడిలకి నాకు పోలికా?"


"అదిగో మళ్ళీకోపం... ఎదో పకోడీలు ఎదురుగా ఉన్నాయని అలా అన్నాను. సర్లే.. కాదులే.. ఎంటో మీ ఆడాళ్ళకి ఎప్పుడు కోపమొస్తుందో, ఏమంటే కోపం వస్తుందో తెలియడం లేదు.. అవునూ.. సాయంత్రం ఏం కూర చేస్తున్నావు?"


"కొరివికారం చేసి పెడతాను, ఛ ఎప్పుడూ తిండి గోల, వంట గోల... నువ్వు మారవు కదా.." విస విసా వంట ఇంటివైపు వెళ్ళిపోయింది విమల.

"ఎంటో ఈ ఆడవాళ్ళు అర్థంకారు" అనుకొన్నాడు బుచ్చిబాబు.

******

ఓ వారం తరువాత.........

"విమలా నేనలా రావు గారింటికి వెళ్ళొస్తా..." బయటికి వెళ్తూ విమలని కేకేశాడు బుచ్చిబాబు.

"ఇప్పటిదాకా బానే ఉన్నావు హఠాత్తుగా ఇప్పుడు బయటికి వెళ్ళడం,, " అంటూ చేతులు కొంగుకి తుడుచుకొంటూ హాల్లోకి వచ్చిన విమలకి సందు చివర్లో అన్నయ్య తమ ఇంటి వేపు రావడం కనపడింది.

నా ఖర్మ.. పకోడీల కోసమో, వంట కోసమో మారతానని మాటలన్నమాట.. ఇక ఈ జన్మకి మారడు.. తన కంఠశోష తప్పితే...

********

స్వీట్ హోం లోని పాత్రలు మాత్రమే తీసుకొన్నాను మిగతా అంతా నా సొంతమే..సరదాగా రాద్దామనిపించి..ఇలా..

5 comments:

 1. laughing tonic la undhi. sharma P K

  ReplyDelete
 2. tit bit for laughing p k sharma

  ReplyDelete
 3. tit bit for laughing whole heartedly.

  ReplyDelete
 4. అదిరింది. :-)

  ReplyDelete
 5. ఇంతకీ ఈ బుచ్చెవరో,విమలెవరో కాస్త తెలియచేస్తారా?

  ReplyDelete

Loading...