3.19.2009

చిన్న విశ్లేషణ

ఆ మధ్య ఒకసారెప్పుడో మావారికి నాకు మాట మాట పెరిగి ఎవరికి వారం ఎడమొహం పెడమొహం అయ్యి పరాకు పరాకుగా ఉన్నాము. ఆ కోపంలో నేను ఇంట్లో వంట కూడా చెయ్యలేదు. పిల్లలికి మటుకు అమ్మ వాళ్ళింట్లో భోజనం చేసేయ్యమని చెప్పేసి నేను ఆఫీసుకి వెళ్ళాను. కాని ఎందుకో ఎక్కడో పాపం తనేమి చేస్తున్నారో ఇంట్లో అన్న ఫీలింగ్ .. ఇక ఉండబట్టలేక ఇంటిదగ్గిర వాళ్ళ ఫ్రండ్ కి ఫోన్ చేసి [మావారికి చేసినా సరిపోయిఉండేది ప్చ్! ఎక్కడో బెట్టు సడలక..:)] "ఇలా ఎదో చిన్న ప్రాబ్లం వచ్చింది ఇంట్లో వంట చేయలేదు కొంచం చూడండి .." (బయట ఎంతో అవసరం అయితే కాని చెయ్యరు ) అని చెప్పాను.

ఓ గంట తరువాత ఫోన్ చేసి "మా ఇంట్లో భోం చేసారు మీరేమి కంగారు పడకండి " అని చెప్పారు. "హమ్మయ్య" అని అనుకొన్నాను. ఇక్కడే నాకు తెలియకుండా నేను మూడో వ్యక్తికి కొంచం అవకాశం ఇచ్చేసాను. మేమిద్దరం ఎందుకు గొడవ పడ్డాము అనే విషయం శ్రీవారు పొరపాటున కూడా ఎవరికీ చెప్పరు. తనంత తను బయటపడేది చాలా అంటే చాలా తక్కువ.

ఆరోజు సాయంత్రం సదరు ఫ్రండ్ నాతో అన్నమాటలు "ఇద్దరూ ఏమి గొడవలు పడ్డారో తెలీదు. కాని ఈరోజు కొత్తగా వచ్చినవి కాదు ఈ సమానత్వ గొడవలు? మీరొచ్చి హఠాత్తుగా మారిపొమ్మంటే మారిపోయేది కాదు ఈ లోకం.. ఆయన తేకా (డబ్బులు)తప్పదు, మీరు చేయకా(వంట ) తప్పదు. ఎందుకిలా అనవసరపు గొడవలు " అని చిన్న ఉపన్యాసం ఇచ్చేసి తన బాధ్యత తీరినట్లుగా వెళ్ళిపోయారు.

ఆ స్నేహితుడు మాటల ద్వారానే తెలిసింది నాకు మావారేమి గొడవ సంగతి చెప్పలేదు అని, ఎందుకంటే మా ఇద్దరిమధ్య సమానత్వ గొడవలు రావు సాధరణంగా. కాని తన బాధ్యతగా చెప్పాలి కాబట్టి చెప్పారు ఆ స్నేహితుడు అంతె. ఇదంతా ఒక ఎత్తయితే ఆయన పైన అన్న మాటలు గమనించండి ఒకసారి. "ఆయన తేకా (డబ్బులు)తప్పదు, మీరు చేయకా(వంట ) తప్పదు. ఎందుకిలా అనవసరపు గొడవలు".

ఇక్కడ చిన్న విశ్లేషణ: నిజానికి ఆ స్నేహితుడు ఒక మంచి ఉద్దేశ్యంతో మమ్మల్నిద్దరిని కలపాలనే ఆలోచనతో చెప్పిన నాలుగు మంచి మాటలు. నిజానికి అతనిది సదుద్దేశ్యమే కాని మగవాడికైనా ఆడవాళ్ళకైనా చిన్నప్పటినుండి పెంపకం వల్ల అయితేనేమి, కుటుంబంలో మొదటినుండి ఆచార వ్యవాహారల అవగాహన వల్ల అయితేనేమి మగవాడు సంపాదించి తీసుకొని రావడం, ఆడవాళ్ళు వంట చెయ్యడం అంతే. ఇది మారదు. మారాలి అని కూడా నేను ఆవేశపడటం లేదు. నేను ఇక్కడ చెప్పేది నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను కదా... అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే నేను తెస్తున్నాను కదా! మరి అది ప్రస్తావనలోకి వచ్చిందా? అంటే ఆడవాళ్ళు ఉద్యోగం చేసినా లెఖ్ఖలోకి రాదు. కుటుంబ బాధ్యతలో భాగంగా నేటి మహిళలు వంట ఇంటి బాధ్యతతో పాటు ఉద్యోగ బాధ్యత కూడా నిర్వహిస్తున్నారు కాని నలుగురిలో మాట్లడేప్పుడు మటుకు ఇలా సామ్యం చెప్పినట్లు "ఆయన తేకా తప్పదు మీరు చేయకా తప్పదు" అని. మా అత్తగారు అంటుండేవారు "లక్షలు సంపాదించినా ఆడది ఆడదేనమ్మా... పది రూపాయాలు సంపాదించే మగవాడికి సరి రారు అని.. " ఈ విషయంలో ఎవరూ బయటపడరు కాని ఎప్పుడో అప్పుడు నరనరాల్లో జీర్ణించుకు పోయిన ఈ తత్వం వాళ్ళకి తెలియకుండా బయటపడ్తూనే ఉంటుంది. ఉద్యోగం పురుష లక్షణం అన్న సామ్యం ఉంది, కాని స్త్రీ లక్షణం వంట చెయ్యడమే ఉద్యోగం చేసినా లెక్కలోకి రాదు అని చెప్పకనే చెప్తారు మనకి.

మన ముందు రెండు తరాల తీసుకొంటే అక్కడ అప్పటికి ఆడవాళ్ళు బయటికి రాకూడదు నాలుగు గోడలమధ్యే అని అనేవారు సో, అక్కడ మగవాడు తీసుకురావడం, ఆడవాళ్ళు వంట చేయడం అంతే. మరి వాళ్ళు జీవితాంతం అదే పనిలో ఉన్నట్లే కదా. ఇల్లు చక్కబెట్టుకోడం, పిల్లలిని చూసుకోడం.

ముందుతరం దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా ఎంతోమంది తమ తమ బార్యలు ఉద్యోగాలు చేయవలసిన అవసరం లేదు అనో ఇష్టం లేదు అనో ఇంట్లోనే ఇంట్లోనే ఉంచేస్తారు . అంటే స్త్రీ బయటికి రాకుండా ఉన్నంత కాలం స్త్రీలకి ఉన్న వ్యాపకం ఏమిటి? వంట పిల్లలు, పని, అతిధి మర్యాదలు మొ! ఇలా ఎంత కాలము అంటే జీవించినంత కాలం .. ఉద్యోగం చేస్తున్న మహిళలికి కూడా ఇంతేగా మార్పంటూ ఏమి లేదుగా. అసలు ఉద్యోగమో వ్యాపారమో చేసినా చేయకపోయినా స్త్రీకి ఒకటే జీవితం సంసారం, ఇప్పుడు కొత్తగా వచ్చింది సంపాదన. డబ్బు అవసరం లేకపోయినా ఆడవాళ్ళకి ఇంకో వ్యాపకం అంటూ ఏమి లేదు , ఒకే ఒక బాధ్యతని విసుగు చెందకుండా.. నిర్వహిస్తున్నారు.

ఇప్పుడిదంతా ఎందుకు రాశాను అంటే "అప్పుడేం చేస్తారు?" అన్న పోస్ట్ కి వ్యాఖ్య రాద్దామనుకొంటే అనుకోకుండా మదిలో ఇన్ని ఆలోచనలు. ఈ "అప్పుడేం చేస్తారు?" అన్న ప్రశ్న పురుషులకి సంబంధినదే కాని స్త్రీలకి కాదేమో! స్త్రీలకి ఉద్యోగం లేకపోయినా, డబ్బు సంపాదన అన్న అవసరం లేకపోయినా ఎప్పటికి తీరని బాధ్యత కుటుంబాన్ని చూసుకోడం. గృహలక్ష్మి బాధ్యత నిర్వహించడం, మరి నా ఆలోచన తప్పంటారా?
*****

10 comments:

 1. అప్పుడేం చేస్తారూ? విశ్లేషణా రెండిటిలో వాదం బాగుంది. కానీ ఈ రోజుల్లో ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ ఇద్దరూసరిసమానంగా బాద్యతలు పంచుకుంటున్నారు. యువత స్పీడులో ఉంది. అన్నీ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక చక్కటి సంగీతానికి గానీ, ఏదైనా ఎంటర్టైన్మెంటుకి గాని వాళ్ళు ఉత్సాహముతో చాలా సందడిగా ఉంటారు. ఒక మంచి పుస్తకం గురించి చెప్పాలన్నా ,ఏది కదిపినా చెప్పగల కొంతమంది భార్యా,భర్తలున్నారు .కాబట్టి జీవితాన్ని కష్టపడుతూ, (ఉద్యోగాలు చేసుకుంటూ) సరదాగా గడిపేవారూ ఉన్నారు నాకు తెలిసి.

  ReplyDelete
 2. నిజమే. కుటుంబంలో భార్య సంపాదనని వేణ్ణీళ్ళకి చన్నీళ్ళు తోడు అన్నట్టు చూడ్డం పరిపాటి అయిపోయింది.

  ReplyDelete
 3. మంచి విశ్లేషణ మీ ఆలోచనా విధానం బాగుంది.

  ReplyDelete
 4. సుమ గారు చాలా బాగా రాశారు. విశ్లేషణ బాగుంది. ఆడవాళ్ళు ఉద్యోగం చేసినా గుర్తింపు రాదని చెప్పిన తీరు బాగుంది.

  ReplyDelete
 5. good post no more comments. mee flow baagundi.

  ReplyDelete
 6. చాలా బాగుంది సుమ గారు నా మనసులో ఆలోచనలు చెప్పినట్లుగా బాగా రాశారు. ఆడవాళ్ళందరం ఇలాగే ఆలోచిస్తారనుకొంట. వేద గారు సుమ గారు చెప్తున్నది ఆడవాళ్ళ పరిస్థితి ఇలా అసలు ఖాళీ లేకుండా ఉంది అనే కాని, ఇప్పటి స్త్రీలు ఎలా ఉన్నారు అని చెప్పడం కాదనుకొంట. సుమ గారు అవునా?

  ReplyDelete
 7. బాగుంది కాని ’అప్పుడేం చేస్తారు’ టపా సరదాగా మీరేంచేస్తారు? అని అడగడమే తప్ప మీరు కొంచం ఆవేశపడ్డారనుకొంట. మీ విశ్లేషణ మటుకు బాగుంది.

  ReplyDelete
 8. సుమగారూ.. మీరిక్కడ మరో ప్రాధమిక విషయాన్ని మర్చిపోతున్నారు. మగవాడు ఉద్యోగం చెయ్యడం అనేది గుర్తింపు కోసం కాదు, కానీ ఆడాళ్ళు మాత్రం గుర్తింపుకు మాత్రమే ఉద్యోగం చేస్తారు.
  అదీ కాక ఎక్కువ మంది ఆడాళ్ళు ఉద్యోగం చెయ్యడం అనేది వాళ్ళ భర్తల అభీష్టం మేరకే చేస్తారు తప్పితే, వాళ్ళకంటూ ఒక భవిష్యత్తు .. వాళ్ళకి అంటూ ఒక వ్యక్తిత్వం.. ఆర్దిక స్వాతంత్ర్యం.. వగైరా.. వగైరా.. ఉండాలి అనుకోరు. ఒక వేళ అలా ఆలోచించే వాళ్ళెవరైనా ఉంటే వారి శాతం చాలా తక్కువ అని నా అభిప్రాయం.
  ఇకపోతే, మీరు చెప్పినట్లుగా భార్యా భర్తల మధ్య అభిప్రాయా భేదాలు అతి సాధారణం. కానీ వాటిల్ని బయట పెట్టేది మాత్రం మహిళలే అని నేననుకుంటాను.
  ఆఖరుగా.. కుటుంబాన్ని చూసుకోనక్కరలేదు, వంటా వార్పు చెయ్యనక్కరలేదు, అయినా సరే ఒక స్వాతంత్ర పక్షిగా నీకంటూ ఒక గుర్తింపుని నువ్వు కలిగించుకో అని ఓ భర్త అన్నా.. సదురు మహిళలు.. "ఆ.. మాకెందుకులేండి.. చక్కగా ఇంటి పట్టున తిని కూర్చోకుండా .." అనే భార్యలుగా మనకు సర్వత్రా కనబడతూ ఉంటారు. కాబట్టి, అస్సలు ఆడవాళ్ళే ఈ పరిధిని గీసుకుంటున్నారు కానీ .. ఇది మీ పరిధి, మీరు ఇంటికే.. అందునా వంటింటికే పరిమితం అని ఎవ్వరూ చెప్పలేదు. కాబట్టి మీ ఆలోచన కొంచం మార్చుకో మని నా మనవి.

  అసందర్బం అనిపిస్తే, మన్నించండి

  ReplyDelete
 9. వేదక్కా! నేను చెప్పింది యువత, బార్యభర్తలు ఎవరు ఏమి ఎంజాయ్ చేయడం లేదు అని కాదు. ఒకవేళ మహిళల చేతిలో కోటానుకోట్ల ధనం మూలుగుతుంటే , జీతం రాళ్ళ అవసరం కనక వాళ్ళకి లేకపోతే అప్పుడేమి చేస్తారు అన్న ప్రశ్నలో మహిళలకోసమంటూ ఒక నిముషం వాళ్ళది లేదు. మహిళలు ఇది చేద్దాము అని నిర్ణయిచుకోలేరు కారణం వారికి ఉండే వంట, ఇల్లు, పిల్లలు అనే బంగారు బాధ్యతల మునిగిపోయి ఉంటారు ఉదాహరణగా ఎన్నో ఫామిలీస్ వారి బార్యలు ఇంట్లోనే ఉండి పిల్లల ఆలనా పాలాన చూసుకొంటున్నారు అని చెప్పాను తప్పితే ఇక్కడ ఇప్పుడేలా ఉంటున్నారు, లేదా ఇప్పుడు వారి మనసు ఏవిధంగా మారింది అని వారి వారి మనస్తత్వాల విశ్లేషణ చేయలేదు.:-) "అప్పుడేమి చేస్తారు" అనే పోస్ట్ లో ఒకే పని అలా కంటిన్యూగా చేస్తే పెచ్చెక్కదూ? అని ఉంది. మరి మన మహిళలందరూ ఒకే పని అంటే కుటుంబ బాధ్యత నిర్వహించడం అనేది విసుగు లేకుండానే చేస్తున్నారు కదా.. అలాగే మగవాళ్ళు విసుగు చెందకుండానే ఉద్యోగ ధర్మం నిర్వహిస్తున్నారు. ఈ రెంటి ఆవశ్యకత లేకపోతే మనమేమి చేస్తాము ... ఏమి చేద్దాం చెప్పు.. హాయిగా పుస్తకాలు చదువుకొంటూ, అన్ని ఊర్లు చుట్టేస్తూఉ...

  ReplyDelete
 10. @ వ్యాఖ్యానించిన వారికి పేరు పేరునా కృతజ్ఞతలు.

  @ చక్రవర్తి గారు : నెనర్లు. మీ వ్యాఖ్య మొదటినుండి వస్తున్నాను: ఆడవాళ్ళు గుర్తింపు కోసం చేసే శాతం చాలా తక్కువండి అందరు ఉద్యోగం అవసారార్థం చేస్తున్నవాళ్ళే. కాకపోతే ఇక్కద తన భర్తకి తాను అంతో ఇంతో సాయం చేస్తున్నాము అని బయటపడడం ఇష్టంలేకో, లేదా తన ఆర్ధిక పరిస్థితిని అవతలి వాళ్ళు తక్కువ అంచనా వేసేస్తున్నారేమో అన్న భ్రమవల్లో "ఆ! ఏముంది మేము కాలక్షేపానికి ఉద్యోగం చేస్తున్నామని చెప్పి తప్పించుకొంటారు తప్పితే ఎక్కడో ఏ ఒక్కరో ఇద్దరో మీరన్నట్లు కాలక్షేపానికో లేదా గుర్తింపు కోసమో చేస్తారు అంతే. (నా పరిధిలో నేను గమనించిన దాన్ని బట్ట్టి చెప్తున్నాను) ఆడవాళ్ళు భర్తల అభీష్టం మేరకు చెయ్యడం.. అంటే ఇక్కడ ఇద్దరి మధ్య సదవగాహన ఉండాలి. దీనికి వ్యక్తిత్వానికి, ఆర్ధిక స్వాతంత్ర్యానికి ముడిపెట్టడడం నాకంత సబబు అనిపించడం లేదు.. ఎందుకు సదవగాహన ఉండాలి అన్నానంటే, రెపొద్దున్న తను ఉద్యోగం చేస్తాను అంటే భర్త తనకి ఏవిధంగా సహకరించగలడు అన్న చిన్నఆలోచన, చెయ్యను అని వ్యతిరకిస్తారో, ఎందుకు అలా అనిపించుకోడం అన్న ఆలోచన లేదా మొదటినుండి మీరిలాగే ఉండాలి అన్న పెంపకం "ఆ ఎందుకులెద్దురు ఇప్పుడు నేను బయటికెళ్ళి ఉద్యోగం చేసి ఎవరిని ఉద్ధరించాలి కనక, నాకెప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు మీరిస్తున్నారు కదా అని అనేలా చేస్తుంది తప్పితే " అదే కనక "నువూ కూడా ఉద్యోగం చేయి నీకు చేదోడు వాదోడుగా నేను ఉంటాను అని అంటే ఎక్కడో మరుగున పడి ఉన్న తన సామర్ధ్యాన్ని , వ్యక్తిత్వాన్ని చూపించుకో సమర్ధులు కాదంటారా మీరె చెప్పండి. సొంత వ్యక్తిత్వం కావాలి అనుకొనే వాళ్ళు ఎక్కువే. కాని కావాలి అనిపించేలా చేయరు మగవాళ్ళు "నేను చేస్తున్నాగా నువ్వెందుకు ఇక " అని అనేవాళ్ళే ఎక్కువగాని నువ్వు వంట చెయ్యక్కర్లేదు , పిల్లలిని చూడక్కర్లేదు నేను చూసుకొంటా అనే మగవాళ్ళు నా పరిధిలో చాలా అంటే చాలా తక్కువ.
  ఇకపోతే బార్య భర్త బయటపడే విషయం: భర్తే కాదండి ఏ బార్య ఎంత గొడవ అయినా తన భర్త గొప్పతనాన్ని చెప్పడానికే ఇష్టపడ్తారు కాని, గొడవలో, లేకపోతే తన భర్తలోని లోపాలో అందరికి చెప్పాలని అనుకోరు. అతనికున్న లొపాలో, గొడవలో తనని తన మానసిక పరిస్థితిన్ క్షీణించేంత క్రిటికల్ గా తయారయితే అప్పుడు గత్యంతరం లేక నలుగురిలోకి వస్తారు తప్పితే .. ఆడవాళ్ళు కూడా ఈ విషయంలో బయటపడరని నేను బల్లగుద్దీ మరి చెప్పగలను. ఉదా: ఈ మధ్యే వాచ్చిన వార్త.. ఎవరో టి.వి యాంకర్ 2 సంవత్సారులుగా తన భర్తతో పడ్తున్న కష్టాలు, భరించలేని తీవ్రరూపం దాల్చినప్పుడు ప్రాణ భీతి కలిగినప్పుడు మాత్రమే బయటపడింది. మీరన్న ఆడవాళ్ళు చాలా తక్కువ.
  ఈ వ్యాఖ్య సంధర్బోచితంగానే ఉంది. మన్నించాడలాంటి పెద్దమాటలు మన మధ్య అవసరం లేదండి. ఒక్కోసారి అభిప్రాయలు కలుస్తాయి మరోసారి అభిప్రాయ విభేదాలు వస్తాయి. చర్చించుకోడమే.

  ReplyDelete

Loading...