3.04.2009

గోరింటాకు - మురిపాల అరచేత మొగ్గ తొడిగింది.


"అన్నయ్య తాగిన ఆ కాఫీ గ్లాస్ కడిగి తీసుకురామ్మా! కొంచం".

"ఉహు నేను తీసుకురాను, నా చేతులు పాడైపోతాయి."

"ఇంతట్లోనే చేతులు పాడై పోతాయా? వేషాలు కాకపొతేను.. తన్నెస్తాను మాట వినకపోతే, గారం ఎక్కువైపోయింది నీకు రోజు రోజుకి.."

"నువ్వెనన్నా తిట్టు.. నేను తీసుకొని రాను గాక తీసుకొని రాను, నీళ్ళు పడితే చేతులన్ని పాడైపోతాయి."

"దీనికి బాగా పొగరెక్కువయ్యింది. అస్సలు మాట వినడం లేదు, సాయంత్రం స్కూల్ నుండి రా చెప్తా నీ పని, వీపుమీద నాలుగంటిస్తే కాని దారిలోకి రావు, వెళ్ళు వెళ్ళి స్నానం చేసి తొందరగా తయారయి స్కూల్ కి వెళ్ళు. "

"ఉహు ! అమ్మా ఈరోజు నేను స్నానం కూడా చెయ్యను, స్నానం చేస్తే సబ్బు వాడాల్సివస్తుంది, మొత్తం చెయ్యంతా పాడైపోతుంది, ఫ్రండ్స్ అందరికి రాత్రి పెట్టిన గోరింటాకు చూపించాలి, ఎంత ఎర్రగా పండిందో తెలియద్దా ఏంటి? ఈ ఒక్కరోజు ప్లీజ్ అమ్మా! నేను స్నానం చెయ్యను."

"ఒహో! ఈ సంబరమంతా గోరింటాకు గురించా, ఆమాత్రం గ్లాస్ కడగడానికీనీ, స్నానం చేస్తేనూ... ఎరుపు తగ్గిపోతుందేమిటి? స్నానం చెయ్యి... ఇంతట్లోకి ఏమి అయిపోదు."


"నేను అందుకే చెప్పానమ్మా! రేపు పుట్టినరోజయితె ఈరోజు గోరింటాకు పెట్టుకొంటారు కాని నువ్వు నిన్న పెట్టావు. రేపటికి ఈ ఎరుపంతా పోయి చెయ్యి పాతబడిపోతుంది. పో! నేనసలు ఏ పని చెయ్యను. అన్నం కూడా నువ్వే తినిపించు. నేను తింటే మళ్ళీ చెయ్యి కడుక్కోవాలి. ఈరోజంతా ఇలా కొబ్బరినూని రాసుకొంటూ ఈ రంగు పోకుండా జాగ్రత్తగా చూసుకొంటాను..

"అంబలి తాగేవాడికి మీసాలెత్తేవాడొకడని, నన్ను చంపేస్తున్నావు, నీ వెనకాల పదిమంది ఉండాలి అనే మనస్తత్వం మంచిది కాదు ముందే చెప్తున్నా.. రేపొద్దున్న పెద్దదానివయ్యాక ఇలాగే చేసావంటే అత్తారింట్లో బడిత పూజ చేస్తారు.. నీకు గోరింటాకు పెట్టాలి, అన్నం తినిపించాలి....ఇలా అడుగులకి మడుగులొత్తడం నావల్ల కాదు, ఈసారి గోరింటాకు పెట్టమ్మా! అని రా... చెప్తాను. గోరింటాకు పేరు చెప్పి పనులన్నీ ఎగ్గొట్టేస్తున్నావు."
********

గోరింటాకు నాకు చాలా ఇష్టం. అలా అమ్మ చేత ఎన్ని తిట్లయినా తింటాను కాని, చేయి ఎర్రగా పండిన తరువాత నా స్నేహితులకి చూపించేదాకా నేను పేషంట్ లా అన్నీ సపర్యలు చేయించుకొంటూ ఉండేదాన్ని.

గోరింటాకు మీకేనేంటి మాకందరికీ ఇష్టమే అంటారేమో. .... :) గోరింటాకు, కాళ్ళకి పసుపు లాంటివి మాకిష్టం లేదు అని అనేవాళ్ళేవరండి అసలు.. ఏదో కాస్త తెలియక గోరింటాకా...ఛీ ఛీ, పసుపా..ఛ, ఛ అని అంటారు కాని,

ఎంచక్కా పండీన ఎర్రన్ని చుక్క....
చిట్టీ చేమంతానికి శ్రీ రామ రక్ష.....
కన్నె పేరంటానికి కలకాలం రక్ష....అంటూ

గోరింటా పూచింది కొమ్మా లేకుండా.....
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది....

అని మురిపెంగా అమ్మ అలా అంటూ పెడ్తుంటే , "గోరింటాకు అంటే నాకిష్టం లేదు" అని అన్నవాళ్ళని వాళ్ళకి మంచి అభిరుచి లేదు అని అనుకోవాలి. ఇప్పుడంటే ఈ గోరింటాకు కోన్ లాంటివి వచ్చాయి కాని, అప్పట్లో అయితే ఆషాడమాసం, అట్లతద్ది, గోరింటాకు సందడే సందడి. ఎక్కడ దొరుకుతుందో వెతికి పట్టుకొని మరి ప్రతి ఆకు కోసి , జాగ్రత్తగా తీసుకొని వచ్చి ఇస్తే , అమ్మ మెత్తగా రుబ్బి ఎప్పుడెప్పుడు పెడ్తుందా అని ఎదురుచూడడం ఎంత బాగుంటుందో.. ఉట్టప్పుడు బారెడు పొద్దెక్కినా... మా అమ్మ అరిచి, గీ పెడ్తున్నా.... లేచేవాళ్ళము కాదు కాని, ఈ అట్లతద్దికి మాత్రం తెల్లవారుఝాముకన్నా ముందే లేచి, జామ చెట్టుకు ఉయ్యాలొకటి కట్టేసుకొని, చేతినిండా గోరింటాకు ఎరుపుదనంతో....


"అట్లతద్దోయ్
ఆరట్లోయ్
ముద్దపప్పొయ్
మూడట్లోయ్ "

అని చుట్టుపక్క పిల్లలందరం కలిసి పట్టు పావడాలు కట్టేసుకొని పాడుకొంటూ ఉయ్యలూగుతుంటే, ఆ అనుభూతి ఇలా మాటల్లోను, రాతల్లోను చెప్పనలవా....రాత్రి గోరింటాకు పెట్టి ఓ పెద్ద ప్లాస్టిక్ కవర్లు రెండు చేతులకి పెట్టి తాడు కట్టి , మంచం కోడుకి కట్టేసేది అమ్మ, చెయ్యి కదపడానికి వీలు లేకుండా, అలా కట్టినందుకు రాత్రి ఎంత బాధ పడినా, పొద్దున్నే ఎర్రగా పండిన చేతులు చూసుకొంటే ఎంత ఆనందం వేసేదో. చేతులు రెండు అందంగా మెరిపోతుంటే, అబ్బా! ఇలా ఉండిపోతే బాగుండుననిపిచేది. కలర్ తగ్గుతున్న కొద్దీ ఉసూరుమనిపించేది. ఇహ మళ్ళీ పెట్టమన్నా పెట్టరు. "మొన్నేగా పెట్టించుకొన్నావు" అని కసిరేవాళ్ళు. ఏది ఏమైనా ఇప్పుడు ఆ గోరింటాకు సహజత్వం , పసుపు పారాణి సాంప్రదాయం ఎక్కడా కనిపించడం లేదు.
******
"ఆంటీ ఈరోజు నా పుట్టిన రోజాంటి " అని పక్కన పాప స్వీట్స్ ఇస్తుంటే... చూసా పాప అరిచేతులవైపు, పింక్ కలర్లో చిన్న డిజైన్ తో ఏదో రంగు పులిమినట్లుగా ఉంది.

"ఏంటమ్మా ఆ కలరంతా, చక్కగా గోరింటాకు పెట్టుకోవచ్చు కదా" అని అడిగాను.

"మా మమ్మీ కి ఇష్టంలేదాంటి పెట్టడం.. ఇదైతే సాయంత్రం కడిగేసుకొంటే పోతుంది, గోరింటాకు వారమ్రోజులు అలా ఉండిపోతుంది. పైగా నల్లగా అయిపోతుంది చెయ్యి అని ఇలా పెట్టింది " అంటే.....

నాకెందుకో ఈ గోరింటాకు ఆలోచనలు అలా మనసుని తట్టిలేపాయి. సహజత్వానికి భిన్నంగా కృత్రిమానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా ఉంది ఈ తరం అనిపించింది. :(
********

6 comments:

  1. మీ గోరింటాకాయణం బావుందండి.

    తరాల అంతరాలు ఎపుడూ ఉండేవేనండి.....

    చిన్నప్పుడు అమ్మ కుంకుడుకాయలతో పోసుకొండర్రా, శీకాకాయ వాడండి మంచిది....అని చెప్పినా వినకుండా ఇపుడు మనమంతా ఎలా షాంపూలకు అలవాటయిపొయామో...ఇదీ అంతే.
    కాకపొతే మంచి అనుభూతులను నెమరువేసుకున్నారు, పంచుకున్నారు......అది చాలదు? :-)

    ReplyDelete
  2. బాగుందండీ.... మీ గోరింటాకు కధ.

    ReplyDelete
  3. కృత్రిమానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా ఉంది ఈ తరం.ఇది మాత్రం నిజం .బావుందండి.

    ReplyDelete
  4. కొత్తతరాన్ని గురించి పాతతరం ఎప్పుడూ ఇలా అనుకుంటూనే ఉంది, గానీ గోరింటాకుతో మీ అనుబంధాన్ని చాలా బాగా రాశారు.

    ReplyDelete
  5. అట్లతద్ది, గోరింటాకు జ్నాపకాలు భలే రేపెట్టారు. చిన్నప్పుడూ గోరింటాకు పెట్టించుకునే వరకూ ఆరాటమే, పెట్టిందగ్గర్నించీ దాన్ని తీసి ఎంత బాగా పండిందో చూస్కునే వరకూ ఆత్రమే. నాకయితే ఆ వాసన కూడా భలే ఇష్టం!
    ఇలాంటిదే ఏదో ఒక తద్దికి పేలాల పొడి కూడ చేస్తారు. దొంగతనంగా బీరువాలో పైనెక్కడో పెట్టిన డబ్బాలోంచి హడావుడిగా ఆ పిండి బొక్కటమూ, దగ్గుతో ఉక్కిరిబిరవ్వటమూ ... అమ్మమ్మ గారూర్లో చిన్నతనాన్ని బాగా గుర్తుజేసింది మీ టపా!

    ReplyDelete
  6. బాగున్నాయి మీ గోరింటాకు విషయాలు.history repeats itslef అన్నట్లు, మళ్ళి గోరింటాకు రోజులు తప్పకుండా వస్తాయి.

    తెరెసా గారు, పేలాల పిండి తొలిఏకాదశికి చేస్తారు.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...