5.19.2009

స్త్రీత్వం


డిసెంబర్ 5 : అక్క స్నేహితురాలి పెళ్ళి. నాకు అప్పటికి పెళ్ళయి 5 నెలలయ్యింది. పెళ్ళి కూతురు అక్కకి స్నేహితురాలే నాకు స్నేహితురాలే చిన్నప్పటినుండి కలిసి ఉండడం వల్ల. మావారేమో తన బంధువుల ఇంటి పెళ్ళికి నేను ఈ స్నేహితురాలి పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళి అయ్యింది, విందుభోజనాలప్పుడు నాకేదో కొంచం ఒంట్లో వెలితిగా అనిపించడం మొదలయ్యింది. ఇహ ఇంటికెళ్ళకుండా అటునుండే హాస్పిటల్‌కి వెళ్ళాను. ప్రెగ్నెంట్ అని చెప్పారు. నాకయితే అప్పుడే లోపల బేబీ కి కాళ్ళు చేతులు వచ్చేసినట్లు కదులుతున్నట్లు భావన. ఎదో తెలియని ఆనందం. అసలేమి తెలియని అనుభూతి. ఇది అని చెప్పలేని ఒక సంతోషం. తొలిచూలు.. నాకు నేను గర్వంగా ఫీల్ అయిన రోజు.

*****

మావారు తనకి సంబంధించినంత వరకు నన్ను కళ్ళల్లో పెట్టుకొని/పువ్వుల్లో చూసారని చెప్పాలి. ఇలాంటి మంచి అనుభూతి కోసమైతే ఎన్ని సార్లు తల్లి అయినా ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఇదో మధురమైన భావన. ఇంటినుండి ఆ మాట ఈ మాటా చెప్పి కళ్ళనీళ్ళు వచ్చేదాకా నడిపించేవారు. అటువైపు ఎదో ఒక హోటెల్ కి వెళ్ళి కాస్త కాఫీ నో టిఫిన్ టైం అయితే టిఫినో చెయ్యడం మళ్ళీ ఇంటి దాకా నడవలేక నడవలేక నడిచేదానిని. అందరిలాగే 7 నెలకి అమ్మావాళ్ళింటికి వెళ్ళాను. అత్తగారికి, అమ్మకి కలుసుకొని మాట్లాడే వీలు లేక నా శ్రీమంతం అలా అలా ఈ నెల కాదు ఇంకోనెల అంటూ 9 వ నెల దాకా పొడిగించారు. ఆగష్ట్ 3 వ
తారీఖు డెలివరీ అవ్వాచ్చు అని డాక్టర్ చెప్పారు. జూన్ 26 కి 9 నెల వస్తుంది కదా జులై 3 కి శ్రీమంతం చేద్దాము అని రెండు వైపుల ఒక అవగాహనకి వచ్చారు. రోజు మా వారు వచ్చి చూసి వెళ్తునే ఉన్నారు. లోపల బేబీ తన కదలికల అల్లరితో నన్ను మరిపిస్తూ ఉంది .

ఇహ అమ్మ వాళ్ళింట్లో, అన్నయ్యకి ఇంకా పెళ్ళి కాలేదు. తమ్ముడు చదువుకుంటున్నాడు. అక్కకి పెళ్ళి అయి ఊర్లో ఉంది. నేను అమ్మ.. మధ్యలో తను వచ్చి క్షేమ సమాచారాలు తెలుసుకొంటున్నారు కాబట్టి పర్వాలేదు అనుకొని ధైర్యంగానే ఉన్నాను. తొలి చూలు , పునర్జన్మ అంటారు ఎలా ఉంటానో, లోపల బేబీ ఏమి చేస్తున్నాడో ఏమిటో అని ఆలోచనలలో 8 నెలలు పూర్తి కావచ్చాయి. జూన్ 26 వ తారీఖు కి 8 వ నెల పూర్తి అయి 9 నెల వచ్చింది. డాక్టర్ పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకొంటే మంచిది అని చెప్పారు. జూన్ 28 సాయంత్రం ఒక స్నేహితురాలు వచ్చింది. ఈలోపులో జూలై 3 వ తారీఖు శ్రీమంతానికి అమ్మ ఎవో ఏర్పాట్లలో ఉంది. వచ్చింది బాల్య స్నేహితురా
లు కాబట్టి ఆమె వెళ్ళేప్పుడు సాగనంపుదామనే ఇంటి గేట్ దాకా వచ్చాను. ఎమంత ఇబ్బంది గా కూడా అనిపించలేదు.



జూన్ 29 వ తారీఖు : ముందు రోజు సాయంత్రం నడిస్తే ఇబ్బందేమి రాలేదు కదా అని ఆరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజకి పూలు కోస్తున్నాను. పక్కనావిడ అననే అన్నారు నిన్ను చూస్తుంటే ఈరోజో, రెపో డెలివరీ అయ్యేట్లుగా ఉంది అని.. నవ్వేసాను. అమ్మ "పొద్దున్నే లేచింది పాపం " అనుకొంటూ చపాతి చేసింది. తింటూ ఉంటే అనిపించింది ఏదో జరుగుతోంది అని... ప్చ్! తెలియడంలేదు. తరువాత విషయాలు చెప్పేముందు ఇక్కడో చిన్న విషయం చెప్పాలి. మా నాన్న గారు పోయినప్పటినుండి అమ్మకి బయట ప్రపంచం అంటే ఎంటో తెలీదు. తన చుట్టూ ఒక గిరి గీసుకొని వుంది. సో, ఏ హాస్పిటల్ ఎక్కడుందో తెలీదు. నా
కేమవుతోందో నాకే తెలియని పరిస్థితుల్లో ఉన్నాను. అన్నయ్య నిద్ర పోతున్నాడు, అమ్మతో అంటే ఇంట్లోనే డెలివరీ అయిపోతుందేమో అని కంగారుతో ఎదో హడావిడి చేస్తోంది. నాకేమి అర్థం కాక , అన్నయ్య ని లేపాను "అన్నయ్యా ఆటో తీసుకురా ఎంటోలా ఉంది.. తెలియడం లేదు " అని. అన్నయ్య లేవలేదు సరి కదా "అబ్బా విసిగించకే" అని అటు తిరిగి పడుకొన్నాడు. (అప్పట్లో మా ఇంట్లో ఫోన్ సౌకర్యం లేదు) సరే ఎదో ఒకటి అవుతుందని నేనే బయల్దేరి ఆటో మాట్లాడుకొని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. నా అదృష్టమో, మావారు ప్రేమతో నడిపించిన పుణ్యమో తెలీదు కాని, వెళ్ళిన సెకండ్స్ లో ఎనిమా కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా డెలివరీ అయిపోయింది, జూన్ 29 వ తారీఖు ఉదయం 11.30 కి ఎవరు తోడు లేకుండా .... " పుణ్యురాలి బిడ్డ పుట్టి పెరుగుతుంది, కష్టురాలి బిడ్డ కడుపులో పెరుగుతుంది అని అంటారు. నువ్వు పుణ్యురాలివేనే" అంది అమ్మ పాపని ముద్దాడుతూ.... అలా శ్రీమంతం ముచ్చట జరగకుండానే 9 వ నెలలోనే పాప పుట్టింది. సాయంత్రం సంతోషంగా మా ముద్దుల పాపతో ఇంటికి వచ్చేసాను.
******
పైన సంఘటన అక్షరం పొల్లు పోకుండా చెప్పడానికి కారణం, మా అన్నయ్యని చెడ్డవాడిని చెయ్యడం కాదు. మాతృత్వం , స్త్రీత్వం అంటే "అమ్మే గుర్తుకు రావాలి" అంటే నాది సంకుచిత స్వభావం అన్నారు పర్ణశాల మహేష్ గారు. దానికి వివరణ ఈ టపా. "అమ్మే గుర్తుకు రావాలి అంటే మా అమ్మ మాత్రమే లేకపోతే వారి వారికి సంబంధిన అమ్మ మాత్రమే అని కాదు దాని అర్థం. స్త్రీత్వం అంటే అమ్మతనం. అది ప్రతి స్త్రీలోను ఉంటుంది, అమ్మ, చెల్లెలు, బార్య ఇలా ... అమ్మ మాతృత్వానికి ప్రతీకలం మనమే. "నాకు నొప్పులు వస్తున్నాయి అన్నయ్య" అని చెప్పడానికి అవి నొప్పులు అని నాకు తెలియకపోవడం .. అక్కడ చెప్పుకోతగ్గ విషయం. నొప్పి తెలియకుండా పెంచింది అమ్మ . అది 'అమ్మ' గొప్పదనం. ఏదోలా ఉంది అంటే ఏదో మాములు విషయం అనుకొని వదిలేసాడు అన్నయ్య. ఇంక అంతకన్నా ఏమి చెప్పాలో నాకు అర్థం కాని పరిస్థితి అది. అందుకే చెప్తున్నా ప్రతి స్త్రీలోని అమ్మతనానికి విలువ ఇవ్వమని. బార్య తల్లి కాబోతున్నప్పుడు పక్కన తోడుగా ఉంటే ఆ ఆనందమే వేరు. మనకి సంబంధించినది కాదు .. పుట్టింటి వాళ్ళు చూసుకొంటారులే అని వదిలేస్తారు.. కొంతమంది. కాని ఆ ఆనందం పంచుకోడంలో అనుభూతి మాటలలో చెప్పలేము. స్త్రీ లో అమ్మతనాన్ని, ఆమె మాతృత్వాన్ని గౌరవించమన్నాను. అది ఎవరైనా కావచ్చు, మన అమ్మ అయినా, అక్క అయినా, చెల్లెలు అయినా సరె.

మాతృత్వం స్త్రీ కి పరిపూర్ణతని ఇస్తుందంటారు. అదే స్త్రీత్వం. ఆ పరిపూర్ణతే స్త్రీత్వం అన్నది నా అభిప్రాయం. ఇక్కడ ఈ పరిపూర్ణత అందరికీ (తల్లి, చెల్లెలు, బార్య ) వర్తిస్తుంది.
******

2 comments:

  1. ఏమని రాయాలో నాకు తెలియట్లేదు.. 100% agreed

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...