8.02.2009

ఒక మాట...ఒక స్పర్శ..



మొన్నామధ్య ఎదో ఒక పోస్ట్ గురించి స్నేహితురాలితో మాట్లాడుతూ " ఇక నేను కూడా ఈ నోములు వ్రతాలు వీటి గురించి వ్రాసుకోడం ఉత్తమం అని అన్నా " ఎందుకో... అలా అన్నానో , లేదో ఇలా నాకో మెయిల్ వచ్చింది. మన సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మలైన ఈ శ్రావణమాసం నోముల గురించి మీకు తెలిసింది వ్రాయండి, సాంప్రదాయ విలువలని కాపాడండి అని. వ్రాద్దామని ఉపక్రమించాను, కాని అందరికీ తెలిసిందే కదా .. నేను ప్రత్యేకంగా చెప్పాడనికంటూ ఏముంది? అని సంశయించాను. దానికి తగ్గట్లుగా బంధువులు ఫోన్ చేసి, "వరలక్ష్మీ వ్రతం కదా! ఏమి చేస్తున్నావు?" అంటూ ఆరాలు.. ఏమి చేస్తున్నావు? అన్న ప్రశ్నకన్నా ఎందుకు చేస్తున్నావు? అని ప్రశ్నించుకొంటే ఎలా ఉంటుంది.... అని ఆలోచించాను.

మంగళగౌరి వ్రతం, వరలక్ష్మీ వ్రతం ఈ రెండు మన కుటుంబం క్షేమం కోసం, ముఖ్యంగా మహిళలకు నిత్య సుమంగళిగా ఉండడానికి అని చెప్తారు. మంగళగౌరి వ్రతం 5 సంవత్సరాలు, 5 గురితో మొదలయిన వాయనాలు, 5 వ సంవత్సరంలో 25 మందికి ఇవ్వడం, ఈ వ్రతం చేస్తున్నట్లయితే... వరలక్ష్మి వ్రతానికి 9 రకాల పిండివంటలు చేయడం, తోరాల సంభరం, ఆవునెయ్యి దీపాలు, ఆ దీపాల ద్వారా తయారయిన కాటుక అందాలు, వాయనాలు, " ఇస్తినమ్మా వాయనం," " పుచ్చుకొంటినమ్మా వాయనం" అనే గాజుల చేతుల సందళ్ళు, ఇంకా కొంచం లోతుగా చెప్పాలంటే , బంగారం కొనుక్కొనే ఒకే ఒక్క అవకాశం , పసుపు రాసిన పాదాలు, పట్టు చీరల రెప రెపలు, ఎఱ్ఱ సిధూరంతో ఉదయభానుడిని తలపించే నుదురు, చేతినిండా గాజులు, తలనిండా పూలు , ఒంటి నిండా అభరణాలతో, ఈ నెలలో మంగళవార శుక్రవారాలలో ఎలాంటి అమ్మాయి అయినా కళ కళ లాడడం మన సాంప్రదాయం గొప్పదనం.

ఒక జీన్స్ పాంట్, ఒక టీ షర్ట్ కొనేసుకొని, పండగ అయ్యిందనిపించే పిల్లలికి మన సాంప్రదాయాలు తెలియాలంటే ఇలాంటి పండగలు ఉండాల్సిందే. కాస్త తెలుగుదనం ఉట్టిపడే విధంగా అలకరించుకొనే అవకాశం పిల్లలికి.. అలా తెలియజెప్పే అవకాశం పెద్దలకి గల పండగలు ఇవి. ఏ పండగయినా సంకల్పంతో మొదలయి,ఆవాహనం, పూజ, సహస్రనామాలు, కథలతో ముగిసేవే. కాని వీటి వెనక ఆంతర్యాలు... పూజలు, పిండివంటలు, కొత్తబట్టలు మాత్రమే కాదు, తలోదిక్కున ఉన్న కుటుంబ సభ్యులందరూ కలవడం, మన హడావిడి జీవితాలనుండి కాస్త ఉపశమనం, ఆహ్లాదకరమైన వాతావరణం .

*******

" ఇదిగో నువ్వెళ్ళి నాలుగు మామిడాకులు తీసుకురా.. మరీ లేత ఆకులు వద్దు, గుమ్మానికి కనపడవు . నువ్వేమో .. కాస్త చుట్టుపక్కల అందరినీ రేపు సాయంత్రానికి పేరంటానికి రమ్మనమను, కుంకుమభరిణె తీసుకెళ్ళు , అన్ని మర్చిపోతావు..... నువ్వేమో ఇదిగో ఈ గడపకి పసుపురాసి కుంకుమ బొట్టుపెట్టి ......."

ఇలా పిల్లలికి పండగ , పండగకి పనులు పురమాయించి,
పండగంటే అసలు ఈ వీధిలోనే సుమా!.. అనేంతగా జరుపుకొనేవారు చిన్నప్పుడు మా వీధిలో ఒక 15 వాటాలవాళ్ళు. ఏ కుటుంబాలు ఎక్కడినుండి వచ్చాయో తెలీదు కాని, ఒకే కుటుంబంలా మెలిగే వాళ్ళము. ఇది వాళ్ళపని.... ఇది వీళ్ళ పని .. అని కాదు పండగలకి పిండివంటలయితేనేమి, పనులయితేనేమి కలిసిచేసుకొనేవాళ్ళము. ఇదంతా ఒక ఎత్తయితే.. "కాంతమ్మగారు!(మా అమ్మ) మీరు కాస్త నాకీ మెంతులు , జీలకఱ్ఱ బాగు చేసి పెట్టండి,.. " "కాంతమ్మగారు! రేపు మైసూర్పాక్ చేసిస్తారా కాస్త..." "కాంతమ్మగారు ! ఢిల్లీ నుండి ఈయనకి తెలిసినవాళ్ళు వస్తున్నారు.. మరి మీ ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేస్తాను, మీరు గుత్తోంకాయకూర బాగా చేస్తారట కదా, వాళ్ళు మా ఇంట్లో మొహమాటపడ్తున్నారు, మీవాళ్ళే,...కాస్త....." "కాంతమ్మగారు, పెద్దమ్మాయి పెళ్ళికి విడిదిల్లు మీ ఇల్లే మరి... మా ఇంటి దగ్గిర పెళ్ళీ.... ఇదిగో ఈ స్థలమంతా ఒక టెంట్ వేసేసి ఈ చివరి గది వాళ్ళకి ఏర్పాటు చేసేద్దాము,....." అని వాళ్ళ ఆలోచనలు , నిర్ణయాలు ... మా అమ్మ "కాదు, లేదు" అని చెప్పలేనంతగా తీసేసుకొని, వీళ్ళంతా అక్కచెళ్ళెళ్ళో, తోడికోడళ్ళో అనుకొనేంతగా కలిసి ఉండేవాళ్ళు.

*********




ఇప్పుడు వీళ్ళందరి వయసు 65 పైమాటే, అందరి ఇళ్ళల్లో కూతు
ళ్ళు కాపురాలకి వెళ్ళినవాళ్ళు, కోడళ్ళు కాపురాలకి వచ్చినవాళ్ళు. ఇదివరకు నేను వీళ్ళందరికి కొంచం దూరంలో ఉండడంవల్లనో .. అదీ కాక, ఆఫీసు పని వత్తిడిలోనో ఈ వ్రతాలకి, ఏదో ముగ్గురి ముత్తైదువలకి తాంబూలాలు చాలులే! అని సరిపెట్టేసుకొనేదానిని. కాని ఈసారి అలా కాకుండా , అమ్మకి దగ్గరలో రావడం ఒక కారణం, ఆఫీసుకి సెలవు రావడం ఇంకో కారణం చిన్నప్పటినుండి తిరిగి, పెరిగిన వాతావరణం అన్నీ కలిసిరావడంతో ఒక 25 మంది దాక పిలిచాను. సాయంత్రం అయ్యేసరికి ఒక్కొక్కరుగా రావడం ప్రారంభం అయ్యింది.

పిలిచిన వాళ్ళల్లో అందరూ ఇంటి కోడళ్ళు వస్తున్నారు. నే్నేమో .. ఆ తరం వాళ్ళందరూ కలుస్తారని అమ్మని కూడా ఇంటికి తీసుకొని వచ్చాను. అప్పటికే అమ్మకి నిరాశ కమ్ముకొంది "నేను వెళ్తానే అమ్మడూ" అని.. అనేసరికి "ఏంటి వాళ్ళెవరూ రారా ?" అని అడిగాను, ఇంటికి వచ్చిన కోడళ్ళని,.. "వాళ్ళ హయాం అయిపోయింది మేమొచ్చాము చాలదూ " అని అన్నారు సరదాగానే, ఇది కాదని మళ్ళా అందరిళ్ళకి వెళ్ళి అందరిని రమ్మనమని, అమ్మ ఎదురుచూస్తోందని చెప్పేసరికి...... ఎవరు కాదు అనకుండా వచ్చారు. వాళ్ళ స్నేహం ఈనాటిది కాదు మరి . వాళ్ళకి తాంబూలాల హడావిడిలో ఉన్నా నేను .. అందరూ పెద్దవాళ్ళు కాసేపు పరిసరాలని మర్చిపోయి అప్యాయంగా మాట్లాడుకొన్నారు. వాళ్ళందరూ వాళ్ళ కోడళ్ళ గురించో, కూతురు సంసారం గురించో మాట్లాడుకొంటారనుకొన్న నా ఆలోచన తారుమారై... నన్ను మరింత ఆశ్చర్యపరిచిన విషయం .. వాళ్ళు ఒకప్పటి వాళ్ళ కలసి మెలసిన తీరు గురించి, అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు ఆ పనులు, ఆ పండగ హడావిడి గురించి చర్చించుకోడం కరచాలనం, చూడడానికి రెండు కళ్ళూ సరిపోవు. ఇదంతా ఒకవైపు. మరోవైపు, రమ్మంటే కారు తీసుకొని వచ్చే కొడుకులు చేతిలో ఉన్నా , వద్దని తెగేసి చెప్పి మరీ ఒకరికొకరు చేతులు పట్టుకొని ఇంటిదాకా నడవడం, "కాంతమ్మగారు జాగ్రత్త చేయి పట్టుకొని నడవండి, రాళ్ళుంటాయి" అని ఒకావిడ, "నేను జాగ్రత్తగానే ఉన్నా మీరు నా చేయి పట్టుకొని జాగ్రత్తగా నడవండి" అని మా అమ్మ. వాళ్ళ ఆ కలిసిమెలిసి మసలే తత్వాన్ని స్నేహమంటారనికి కూడా వాళ్ళకి తెలీదు. ఇరుగు పొరుగు వాళ్ళం అంతే .. . ఎంత చక్కటి దృశ్యమది. వాళ్ళకి పక్కన నేను, మా బాబు ఉన్నామన్న ధ్యాస కూడా లేదు . వాళ్ళకి వాళ్ళే తోడుగా స్నేహంగా కలిసిమెలిసి ఉన్నవాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇరుగు పొరుగు. వారి స్నేహానికి, అర్థం చేసుకొనే ఆ మంచి మనసులకి జోహార్లర్పిస్తూ స్నేహితులందరికి ఈరోజు మాత్రమే కాదు ప్రతిరోజు మనకి ప్రత్యేకం అవ్వాలని ఆకాంక్షిస్తూ.... శుభాకాంక్షలు.
*****

ఒక మాట...ఒక స్పర్శ..స్నేహపురస్కారంగా ఒక సానుభూతి..మనిషి మనిషికీ మధ్య ప్రేమా, ఆప్యాయతా, కరుణతో కంటినిండా చిప్పిల్లిన నీళ్ళూ మనసునిండా సంతృప్తి... విషాదానికీ ఆనందానికీ తేడాలేకపోడం...ఇంతకన్నా ఏమి కావాలి జీవితానికి?... శ్రీనివాస్ పప్పుగారి బ్లాగునుండి సేకరించిన వాక్యాలివి.


5 comments:

  1. బావుంది మీ ఆత్మీయ సమావేశం. దగ్గరి వాళ్లను కలవడానికి, కలిసిన వాళ్లకు దగ్గర కావడానికి పేరంటాలు ఉత్తమ మార్గం.

    ReplyDelete
  2. పండుగలను ఇప్పుడు routine గా చేసుకుంటూ పోతున్నామేగానీ పండుగ,పండుక వెనుకనున్న అంతరార్థం,పరమార్థం,సంప్రదాయాల్ని తెలుకుంటూ చేసుకోలేకపోతున్నామేమోనని అనిపిస్తోంటుంది నాకు.మనకే సరిగ్గా తెలియడం లేదు ఇక భావితరాలవారికి ఏమి చెప్పగలము.తెలిసినవారు బ్లాగుల ద్వారా తెలియచేస్తే బాగుంటుందేమో కదా !

    ReplyDelete
  3. నోములు ,వ్రతాలు ,పూజలు అంటే చాదస్తం అనుకునే వారికి అందులోని ఆనందము ,గొప్పతనము ఏం చెప్పగలము ?
    బాగా రాసారు.బాగుంది.

    ReplyDelete
  4. ఆత్మీయతకి వయసు తేడా లేదని రుజువుచేసారు పెద్దలంతా కల్సి,బావుంది రమణి గారు పోస్ట్.
    విజయమోహన్ గారితో నేనూ ఏకీభవిస్తున్నా...

    ReplyDelete
  5. chaala chaala baagundi especially.last para......manchi pani chesaaru vallani klaisela erpatu chesi.........

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...