12.10.2009

మనోభావాలకనుగుణంగా...

" అమ్మా ! ఎలా అన్నా ఆ కాయిన్ వేసేయ్యాలి నువ్వు. పర్లేదు నెమ్మదిగా ఆడు ...సూటిగా ఉందమ్మా స్లోగా కొట్టు" బాబు హడావిడి చేసెస్తున్నాడు.

నేను చాలా దీక్షగా ఆడాలనే పంతంగా కాయిన్ పట్టుకొని కూర్చున్నా..బాబు ప్రోత్సాహం సాక్షిగా .. కిందటేడు అమలాపురం అన్నయ్యవాళ్ళింటికి వెళ్ళినప్పుడు భోజనాలు ఆలస్యమవుతాయంటే క్యారంబోర్డ్ ఆడుతున్నప్పుడు జరుగుతున్న హంగామా అది. నేను మా బాబు ఒక జట్టు, అన్నయ్య కొడుకులిద్దరు ఒక జట్టుగా ఆడుతున్నాము.

బాబెంత ప్రొత్సహించినా అనుకున్నట్లుగా కాయిన్ పడలేదు సరికదా "అమ్మా
నువ్వు ఎప్పుడు ఇంతే " అని చిన్నబుచ్చుకున్నాడు .

మళ్ళీ రెండో సారి... అలాగే జరిగింది. రెండో సారి జరిగినప్పుడు మటుకు అన్నయ్య కొడుకు "అత్తా మేమే విన్" అని అననే అనేసాడు. మనసులోంచి అభిమానమో మరి ఉడుకుమొత్తనమో తెలీదు కాని ఒక్కసారిగా తన్నుకొచ్చేసింది. "చట్! నాకాకలి వేస్తొంది నేనాడను " అంటూ మొత్తం బోర్డ్ మీద కాయిన్స్ అన్నీ చెల్లాచెదురు చెసేసాను.

ఇంట్లో ఆడే చిన్న చిన్న ఆటలకే అవతలి వాళ్ళు ఏదో అంటున్నారని, లేకపోతే సరిగ్గా ఆడట్లేదని, మనల్ని మోసం చేసేస్తున్నారనో, లేకపొతే ఆత్మన్యునతా భావం ఆవరించో ఎదో మొత్తానికి పూర్తిగా ఆడలేము. అవతలివాళ్ళకి దొరకకూడదు అనే పంతం. నాకు తెలిసి ఈ భావన అందరిలో ఉంటుంది. కొంతమంది గుంభనంగా ఉంటారు , కొంతమంది కంటనీరు ద్వారా బయటపడ్తారు, ఇహ నాలాంటి వాళ్ళు అలా ఆట మొత్తాన్ని చెడగొడ్తారు. దానికి కారణం ఏదన్నా కావచ్చు చిన్నపిల్లలతో ఓడిపోవడం ఇష్టం లేకపోవచ్చు, గిల్టీ కావచ్చు, పొగరు, ఉడుకుమోత్తనం, అసహయత, అభిమానం మొ! ఏ పేరు పెట్టుకున్నా అక్కడినుండి తప్పుకోడం ముఖ్యం.
******

"మనోభావాలకనుగుణంగా.." అంటే ఎంటో కాని ఈ మధ్య ఈ తెలంగాణ, సమైక్యాంధ్ర, గ్రేటర్ రాయలసీమ అంటూ మీడియావాళ్ళు మాటి మాటికి ప్రజల మనోభావాలకనుగుణంగా అంటూ ఊదరకొట్టేస్తున్నారు. అదే మీడియా... మరి అవే మనోభావాలతో ఆటాడుకొని, పాల్గొంటున్న వారి మనోభావాలని దెబ్బతీస్తూ..చూస్తున్న వాళ్ళని వెఱ్ఱి జనాలని చేసి వ్యాపారాన్ని చేసుకొంటున్నారు. దీనికి ఉదహరణే నిన్న జరిగిన ఒక ప్రముఖ ఛానెల్ లో జరిగిన కార్యక్రమం(రియాల్టీ??). "

సమైక్యాంధ్ర, తెలంగాణా, రాయలసీమ, కళింగ రాష్ట్రం ఇలా ఛానల్స్ అన్నీ పోటిగా మనకి తాజా వార్తలందించడంలో నేను ముందంటే, నేను ముందు అని హడావిడి పడ్తుంటే.. ఏది చూడాలో తెలియక ఛానెల్ మార్చే ప్రక్రియలో కంటపడిందో రియాల్టీ అనుకుంటున్న ఒక కార్యక్రమం. కాసేపు ఈ రాష్ట్రాల గొడవలకతీతంగా చూడచ్చు కదా అని అదే ఉంచి చూస్తూ ఉన్నా. యాంకర్ కొత్తేమి కాదు అందరూ దేవుడు, జీవితాలు నిలబెట్టాడు అంటు పొగుడుతున్న వ్యక్తే. పేరెందుకులెండి అసలే రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉంది. :) సరే విషయానికి వద్దాము. పోటి కొరియోగ్రాఫర్ల మధ్య.. ఇంతకుముందు
వీళ్ళందరి కుప్పిగంతులు చూసి చూసి విసుగొచ్చి చూడడం మానేసాము. వీళ్ళే మళ్ళీ ఇంకో ఛానెల్ ని ఆక్రమించారు.

వీళ్ళకి నిజంగా ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదో మరి మనకోసం పధకంగా స్క్రిప్ట్ రాసుకుంటారో కాని, "నువ్వు నా కాలి గోటికి సరిపోవు", లేదా "నీకు నాతో పోటినా .. " ఇంకోచం ముందుకెళ్ళి సినిమా సంభాషణలకు మేమేమి తీసిపోము అన్నట్లుగా బయటకి చెప్పలేని రీతిలో ధూషించుకోడం.. అసలు డాన్స్ కన్నా ఈ గోల ఎక్కువగా ఉంటుంది. సరేలే ! డాన్స్‌లో నన్నా అమీ తుమీ తేల్చేస్తారు అనుకొనే లోపులో ... ఓ ఇద్దరిని డేంజర్ జోన్ అంటూ పంపి.. ఎలిమినేషన్ ఎపిసోడ్ అంటూ సాగతీస్తారు. ఆ ఇద్దరి మధ్య కళ్ళు మూసుకుని ఒక డాన్స్, హావాభావాలు , పరికరాలు అంటూ పోటి పెడ్తారు.

అంతా అయి అందరి అభిప్రాయాలు తీసుకుని... కంటెస్టెంట్స్ వాళ్ళు వాళ్ళ ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయి ఏడుస్తుంటారా లేదా అని చూపించడానికో వాణిజ్య ప్రకటన, కళ్ళు తుడుచుకుంటూ ఉంటే ఒక ప్రకటన, యాంకర్ నవ్వూతూంటే ఒకటి ఇలా మాట్లాడే/పోట్లాడే పద పదానికి చేస్తున్న చేయబోయే చర్యలకి మధ్య ఒక ప్రకటన వెరసి ఒక గంటన్నర మనల్ని ఏవిధంగా వేపుకు తినాలో ఆ విధంగా తినేసిన తరువాత ఎవరు ఎలిమినేట్ అయ్యారో .... మన కంటినీటి తుడుపుకోసం అన్నట్లుగా చెప్పి... మళ్ళీ ఒక వంద వాణిజ్య ప్రకటనల తరువాతా.. యాంకర్ ఒక వెఱ్ఱి నవ్వుతో..
"ఓకే కంటెస్టెంట్స్, జడ్జెస్& వ్యూయర్స్ .. చూసారుగా ఈరోజు ఎపిసోడ్, ఇప్పటిదాకా జరిగిన ఈ సంగ్రామం, ఈ ఎలిమేనెషన్ ఎపిసోడ్లో అసలు ఎలిమినేషన్ అనేదే లేదు... అసలు ఎలిమినేట్ చేస్తే వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చూద్దామని ఇంతవరకు ఇలా చేసాము" అంటూ చావు కబురు చల్లగా చెప్తారు.

ఇక్కడ ఎవరి ఫీలింగ్స్ దెబ్బ తింటున్నాయి? ఎవరి మనోభావాలకనుగుణంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు? షూటింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, పాట
కి ... పాటకి మధ్య జరిగే ఏర్పాట్లవల్ల మధ్యలో కనీసం ఒక గంట time ఉంటుంది. ఆ time లో అందరు కలిసి మాట్లాడుకుంటూ, తరువాత ఏవిధంగా మార్క్స్ వెయ్యాలి అని చర్చించుకుంటూ, ఎవరిని పంపించాలో కూడా ముందుగానే నిర్ణయించుకుంటూ కార్యక్రమ షూటింగ్ తీసే వీళ్ళు అటు ఆ స్టేజ్ మీదున్న వారిని కాదు.. ఇక్కడ ఆసక్తిగా చూస్తున్నవాళ్ళని ఫూల్స్ ని చేశారనిపిస్తుంది. ఎలిమినేషన్ లేదు అంటూ ఒక ఎపిసోడ్ నిర్వహించి, మళ్ళీ దానికి వాణిజ్య ప్రకటనలు, పాల్గొన్నవారి ఏడుపులు ... యాంకర్ చిద్విలాసంగా నవ్వడం... చూస్తున్న ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తూ ఉంటాయి. అసలే రాష్ట్రం ముక్కలయిపోతోంది , రోజు రోజుకి మూడు ధర్నాలు , ఆరు బంద్‌లతో చికాకు చికాకుగా, "శాలరీలు వస్తలేదు సెల్ బిల్లు కడ్తలేదు" అన్న చందాన భాగ్యనగర సగటుజీవి సెలవుల గోలలో ఉంటే, రియాల్టి పేరుతో అసహజంగా కుప్పిగెంతులు వేస్తూ .. మరింత చికాకుకి గురిచేస్తున్నాయి ఈ కార్యక్రమాలు. ఎప్పుడు విముక్తో వీటన్నిటినుండి.... చూస్తున్నారు కాబట్టి , తీస్తున్నారు అంటే, ఇంట్లో ఎప్పుడో వ్యాపకానికి T V చూసే మాలాంటివాళ్ళు ఇలా మౌనం వహించి బ్లాగుల్లో మా బాధని వెళ్ళగక్కుకోవల్సిందే. ఏమంటారు????... :)
********

6 comments:

  1. ప్చ్ ....ఏమంటాం ...అవునంటాం :) :)

    ReplyDelete
  2. ఇదివరకు డాన్స్ బేబి డాన్స్ అని ఒకిటో ,రెండో డాన్స్ ప్రోగ్రాములు టీవిలో వచ్చేవి.యాంకర్ల ఓవర్ యాక్షన్లు కూడా తక్కువే ఉండేవి .ఇప్పుడు అన్నిచానల్స్లోనూ డాన్స్ ప్రోగ్రాంలే,వాళ్ల ఓవర్ యాక్షన్ చూస్తే చానల్ వెంటనే మార్చేయాలనిపిస్తుంది.

    ReplyDelete
  3. నేను ఈ రియాల్టీ షోలు వస్తుంటే ఛానల్ మార్చేయడం ఎప్పుడో మొదలెట్టేశా... దూరదర్శన్ లో పశువుల పెంపకమైనా పర్లేదు కానీ ఈ రియాల్టీ షోలుమాత్రం చూడకూడదు.

    ReplyDelete
  4. అసలు చూట్టమెందుకండీ? :-)

    ReplyDelete
  5. చాలా రోజుల తరువాత నిన్నే ఈ షో మళ్ళీ చూడాల్సొచ్చిందండి. నేను కొత్తగా గమనించినదేమిటంటే ఇదివరకు జడ్జీలైనా కాస్త హుందాగా ప్రవర్తించేవారు. ఇప్పుడు అదీ లేదు. వాళ్ళు కూడా తెగ ఆవేశపడిపోతూ, ఒకరినొకరు (ఉన్నది ఇద్దరే) చాలెంజ్ చేసుకుంటూ... చాలా చిరాగ్గా అనిపించింది.

    ReplyDelete
  6. అసలు టివి లని మనందరం కలిసి మూకుమ్మడి గా బహిష్కరిస్తే ??? ఇప్పటికే సగం మంది ఆ పని చేసేసారు. మిగిలివాళ్ళు చేసేసి వాటికి సమాధి కట్టేద్దాం.

    ఇరవయి నాలుగు గంటల్లో,మనసు కి, మెదడు కీ వినోదం కావలసింది.. మహా అయితే ౨ గంటలు...అ రెండు గంటల కోసం దిక్కుమాలిన రెండు వందల చానల్సా?..

    మీరేమి అనుకోనంటే నాదొక చిన్న సలహా. ఉన్నంతలో NDTV Good Times కాస్త పర్వాలేదనిపిస్తుంది. వీలుంటే చూడండి.
    The big fat wedding , Scope for Improvement, royal wheels, High way on my plate, In 85 plates around the world, chak le India ఇవి కొన్ని అందరికి నచ్చే కార్యక్రమాలు. అలాగే Bindaas chaannel లో The big switch కూడా బాగుంటుంది.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...