4.26.2010

కొత్తగా పెళ్ళయిన కోడేవయసు జంట...

కొన్నేళ్ళవరకయినా నిదురే పోరాదంట..

కదా.. ఆలోచిస్తే ఎంత చక్కటి అర్థవంతమయిన అనుభూతి.. బార్య భర్తల బంధానికి చక్కటి పునాది రాయిలాంటి మాట ఈ పాట. తనవారిని, తన అలవాట్లను, తన ఆలోచనలను పుట్టింట్లో వదిలేసి, భర్త అడుగుజాడల్లో నడుద్దామని వచ్చే కొత్త పెళ్ళికూతురు ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎన్నో కోరికలను మదిని నింపుకుని, రెక్కల గుఱ్ఱంపై వస్తాడనుకునో , చక్కటి సంసారం , చల్లని సంతానం అనుకునో, వంటింటి సామ్రాజ్యాన్ని ఏలాలి అనుకునో "ఇదంతా తనది" అనుకుని వచ్చే ఆ పడతి ఆలోచనలు, అటో , ఇటో కాస్త తారు మారు అయితే పర్వాలేదు కాని, మరీ కల్లో కూడా ఊహించని విధంగా జరిగినప్పుడు ఆ అమ్మాయి ఏమి చెయ్యాలి? అసలు సంసారం అంటే కూడా ఏంటో తెలియని ఆ పడతి కి ఇలాంటి పరిస్థితులు ఏవిధంగా బతకమని ధైర్యాన్ని ఇవ్వగలవు?
******

మొన్నమధ్య నాటితరం ప్రముఖనటి జమున కూతురు వరకట్నవేధింపులతో మీడియా ముందుకు వచ్చి ఉమెన్ ప్రొటెక్షన్‌కి తన గోడు వెల్లడించుకుంది. ఇక్కడ ప్రముఖులయినా, సాధారణ జీవనాన్ని కొనసాగిస్తున్నవారయినా ఆడవాళ్ళయితే చాలు ఇలాంటి వేధింపులు తప్పవు అన్నది రుజువు చేస్తున్నారు ఈ మగవారు + అత్తింటివారు. చాలాచోట్ల విలన్ అత్తగారే అవడం విశేషం. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సంఘటనలో కూడా అత్తగారే కనిపించీ కనిపించని విలన్. అసలు సంఘటనలోకి వెడితే..
*****
2009 ఆగస్ట్‌లోఈ అబ్బాయి పెళ్ళి అయింది. ఎన్నో సంబంధాలు చూసారు, వరుడు వాళ్ళకి నచ్చక తిరిగి వెళ్ళిన సంబంధాలే అన్నీ (వెన్నక్కి వెళ్ళినవాళ్ళు అదృష్టవంతులు) కుదిరిన సంబంధం కుదిరినట్లుగా కట్నం తక్కువే అడిగి, వారం తేడాతో పెళ్ళి జరిపించేసి ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఈ అబ్బాయికి 10 యేళ్ళక్రితం ఒక మేజర్ ఆక్సిడెంట్ అయింది, తల పైభాగం పూర్తిగ విడిపోయింది అని చెప్పొచ్చు, డాక్టర్లు చేతులెత్తెశారు కాని, మరి శస్త్ర చికిత్స తరువాత ఏదేవుడు కరుణించాడో తెలీదు కాని బతికాడు. కొంచం మెల్లకన్ను, ముక్కు దగ్గరనుండి కుట్లు కనిపిస్తూనే ఉంటాయి. ప్రమాదం తలదగ్గిరే కాబట్టి సాధారణంగా తలనొప్పితో బాధపడుతూ ఉంటాడు. అందువల్ల తన ఆరోగ్యమే సమస్యగా ఉంది మరి పిల్లనెలా చూసుకుంటారో అని చాలావరకు సంబంధాలు వెనక్కి వెళ్ళాయి. ఇక కుదిరిన సంబంధం.. ఆ అమ్మాయి చాలా సాదా సీదాగా ఉంది, తల్లి, తండ్రి, అన్న ఇదీ వారి కుటుంబం. M.Sc. చేసింది పెళ్ళినాటికి ఊర్లోనే ఏదో లెక్చరర్ ఉద్యోగం చేస్తోంది.

లెక్చరర్‌గా చేసింది కాబట్టి కాస్త కలుపుగోరుతనంగా ఉంటుంది అనుకున్నాము కాని మరీ ముగ్ధ ఈ అమ్మాయి. ఎవరితో "ఊ" అనదు "ఆ" అనదు.. ఏమన్నా అడిగితే ఆ అడిగినదానికి సమాధానం తరువాత మౌనం అంతే. ఇంటికెవరన్నా వస్తే వాళ్ళకి టీలో కాఫీలో ఇవ్వడం అలా ఆ వంట ఇంటిలోనే గడపడం.

ఇవి మొదటినుండి మాకొస్తున్న ఫిర్యాదులు. కొత్తగా పెళ్ళయినవాళ్ళు కదా వాళ్ళే సర్దుకుంటారులే అని మేము మిన్నకున్నాము. మూడు నెలల క్రితం ఓ ఆదివారం అనుకుంట పొద్దున్నే నేను , మావారు రైతుబజార్‌లో ఉండగా ఫోన్ వచ్చింది. బాబు హాస్పిట‌ల్లో ఉన్నాడు అర్జంట్‌గా రమ్మనమని పెళ్ళి కొడుకు తండ్రినుండి ఫోన్.

ఎమయిందా అని ఉరుకుల పరుగుల మీద వెళ్తే 104 డిగ్రీల జ్వరం, తల విపరీతంగా నొప్పి ఎదో నరం పట్టు తప్పింది చిన్న ఆపరేషన్ చేయాలని అన్నారట. అలా అతను ఒక నెల ఇంటిపట్టునే ఉండడం. ఆర్థికంగా ఇబ్బంది అన్ని కలగలిపి ఇంటికొచ్చిన కొత్త కోడలి తప్పన్నట్లుగా చిత్రీకరించారు. ఏమి జరిగిందో, అసలెందుకు జ్వరం, తలనొప్పి ఆపరేషన్ దాక దారితీసిందో చెప్పడంలేదు కాని కారణం మటుకు అమ్మాయి తల అబ్బాయికి కొట్టుకోడంవల్ల అని నేరం అమ్మాయి మీదకి నెట్టేశారు. దానితో ఆ అమ్మాయి మనసు వికలమయిందో ఏమో , వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళింది. అక్కడినుండి క్షమాపణలు, రాయబారాలు సాగుతున్న అత్తగారు మటుకు కనికరించడంలేదు. ఆవిడ రావడం వల్లే ఇంతా జరిగిందని నీలాపనింద. పూర్తిగా సంవత్సరం కూడా కాని వాళ్ళ పెళ్ళి ఇలా పెడదారి పట్టడం బాధకరమయిన విషయం. గొరుచుట్టు మీద రోకటిపోటులా పాపం ఆ అమ్మాయి తల్లిగారు ఉన్నట్లుండి గుండేపోటుతో మరణించడం వీళ్ళ కొత్త సంసారానికి మరో పెద్ద దెబ్బ అయిపోయింది.

"సరే అయిందేదో అయిపోయింది, అసలే జరగరాని వాటితో ఆ అమ్మాయి మరీ కృంగిపోతోంది పాపం ఆ అమ్మాయిని తీసుకొచ్చేయండి, చక్కగా ఇద్దరిని బయటికి ఎక్కడకన్నా పంపండి, వాళ్ళిద్దరు ఉండగా మీరు అక్కడే ఉండడం వల్ల ఒకరినొకరు అర్థం చేసుకునే ఏకాంతం దొరకడంలేదేమో" అని మేము మరికొంతమంది పెద్దలతో కూడుకుని, ఆ అత్తమామలకి నచ్చ చెప్పాము. ప్చ్! లాభం లేదు, అసలలా చేస్తే వాళ్ళు అత్తమామలెందుకవుతారు? మా మాటలకి "సరే అలాగే " అని కొంచం ముక్తసరి సమాధానం, ఆ అమ్మాయి అక్కడ ఒకపక్క తల్లి పోయిన బాధ, మరో పక్క తనని భర్త అర్థం చేసుకోడం లేదు అనుకుంటూ ... అలా బంధువుల ఇంట్లో కాలక్షేపం చేస్తుండగా .. ఇదిగో!! మూడు రోజుల క్రితం మళ్ళి ఇంకో విషాదకరమైన వార్త, ఆ అమ్మాయి తండ్రి , "తన కూతురు తప్పేమి లేదు నా కూతురిని బాగా చూసుకో బాబూ.." అని ఫోన్ చేసి కూతురి గురించి బెంగతో , బార్య లేదన్న బాధతో విషం తీసుకుని ఆత్మహత్య చేసుకోడం.

అంతా తన కోడలి వల్లే అంటూ ప్రచారం చేసే అత్తగారు, తన కొడుకు తను గీసిన గీత దాటడు , బయటకి వెళ్ళాలంటే బండికి పెట్రోల్ డబ్బులు తనే ఇవ్వాలి అని చెప్పుకుని మురిసిపోయే మామగారు.. ఇదా కొత్తగా పెళ్ళయిన జంటకి కలగాల్సిన అనుభవం?
******

అసలిక్కడ నాకు కలిగిన చాలా ఆలోచనలు... . ఆడపిల్ల ఉన్నవాళ్ళకి ఈ తిప్పలు తప్పవా? ధైర్యం చెప్పాల్సిన తల్లి తండ్రి లేరు, మాములుగానే బేల. ఇక ఇలాంటి పరిస్తితుల్లో ఈ అమ్మాయి కూడా తండ్రిలా ఆలోచిస్తే వీళ్ళ గతి ఏంటి? లేదా నన్ను పెళ్ళి చేసుకున్నందుకో, నా తల కొట్టుకున్నందుకో కాదు మగడా.. నిన్ను పెళ్ళి చేసుకున్నందుకు నా తల్లి తండ్రిని కోల్పోయాను అని ఆ అమ్మాయి తిరగబడితే??

అసలు పెళ్ళి చేసుకుందాము అన్న ఆలోచన వచ్చిన మనిషి తనకంటూ ఒక సొంత వ్యక్తిత్వమంటూ అలవర్చుకోలేడా? తనవారిని, తనమనుషులని వదిలి వచ్చే తన సొంత మనిషికి తను అండ - దండ అయి ఉండాలి అని ఆలోచించలేడా? "అంతా నీ ఇష్టం అమ్మా.. అంతా మీ ఇష్టం నాన్నా " అంటూ మాట్లాడే అమ్మా నాన్న కూచులకి పెళ్ళెందుకు అన్న సందేహం వస్తోంది నాకు. తల్లి తండ్రులంటే గౌరవము ఉండాలి కాని, పెళ్ళి చేసుకుని ఆ వచ్చే మనిషిని "మీ ఇష్టం " అంటూ వాళ్ళకి అప్పజెప్పే హక్కు భర్తకి ఉందా?

బార్యముందు "నాన్న పెట్రోల్ కి డబ్బులివ్వండి" అని అడగడం నామోషిగా ఉండదా? ఇది గొప్పతనమా? ఆధారపడడమా? "బార్యకి మల్లేపూలు కొనాలి డబ్బులివ్వండి నాన్నా " అంటే అది తన బార్యకి తలవంపులు కాదా? ఆలోచించరా అసలు? ఈమాత్రం పెట్రోల్ కొనడానికో, మల్లేపూలు కోనడానికో స్వతంత్రత లేనప్పుడు అసలు పెళ్ళెందుకు? భర్త అనారోగ్యాన్నయినా, భర్త చాతకానితనాన్నయినా, భర్త అవిటితనాన్నయినా భరిస్తుందిట బార్య , కాని పిరికివాడయితే సహించలేదుట. "ఏరా కోడలిని తీసుకురమ్మంటావా మరి" అని అడిగితే "మీ ఇష్టం నాన్నా మీకెలా నచ్చితే అలా చేయండి" అనే మగాడిని నించోబెట్టి నిలువునా చీల్చినా పాపం లేదని అనిపిస్తుంది నాకు. ప్రతిదానికి ఈ ఆధారపడే మనస్తత్వం ఎదుగుదలకి అడ్డు కాదా?
*****

తన బార్యని తను తీసుకొచ్చి కొన్నాళ్ళు ఈ జనారణ్యానికి దూరంగా వెళ్ళి, సంసార సరిగమల వీణని మీటుకుంటూ.. కొత్తగా పెళ్ళయిన కోడెవయసు జంట ... కొన్నేళ్ళవరకయినా నిదురేపోరాదంట అని తీయటి ఊసులు చెప్పుకుంటూ.. నలుగురు తమంత తామే తప్పుకునేలా చేస్తే.....

ప్చ్.. మనమేమి చేయగలము? చెప్పవలసింది చెప్పాము. ఎంతయినా చెప్పడమే మన ధర్మం వినకపోతే ఎవరి కర్మ వారిదేగా మరి.
*****

2 comments:

  1. స్వంత వ్యక్తిత్వం లేని వాడు అసలు పెళ్ళి చేసుకొని ఉండ కూడదు.

    ReplyDelete
  2. మీరు వివరించిన విధానం చాలాబాగుంది. రోజులు మారినా కొద్దీ సమస్యలు పెరుగుతున్నాయి కాని తరగటం లేదు. తమకు తామే ఆలోచించుకొని అందరూ సత్సంబంధాలతో జీవితాలు గడపటం ఎప్పటికి జరుగుతుందో. తల్లీతండ్రీ, అత్తామామా అందరూ కావాలి. అన్ని సంబంధాలు నిలవాలి. ప్రతిఒక్కరి ఆలోచనా విధానంలో తప్పకుండా మార్పు రావాలి. సమస్యలు అనేకరకాలు. తమ సమస్యని తామే పరిష్కరించుకో గలగాలి.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...