4.28.2010

బాల్యం మొదలు జీవితం ఒక బంధిఖానానా?

చిట్టి చిలకమ్మా
అమ్మ కొట్టిందా
తోట కెళ్ళావా
పండు తెచ్చావా
గూట్లో పెట్టావా
గుటుక్కున మింగావా...

చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే కోటి పూలు తేవే
బండెక్కి రావే బంతిపూలు తేవే
తేరు మీద రావే తేనె పట్టు తేవే
పల్లకిలో రావే పాలు పెరుగు తేవే
నా మాట వినవే నట్టింట బెట్టవే
అన్నీ తెచ్చి మా అబ్బాయికి(అమ్మాయికి)య్యవే

కాళ్ళాగజ్జీ కంకాలమ్మ
వేగు చుక్కా వెలగామొగ్గా
మొగ్గా కాదూ మోదుగబావీ
నీరూ కాదూ నిమ్మల వారీ
వారీ కాదూ వావింటాకు
ఆకూ కాదూ గుమ్మడి పండూ
కాల్దీసి కడగా పెట్టు.

తప్పెట్లోయ్ తాళాలోయ్
దేవుడి గుళ్ళో బాజాలోయ్
పప్పూ బెల్లం దేవుడికోయ్
పాలూ నెయ్యి పాపడికోయ్

ఇలా ఏ ఇరుగింట్లోనో , పొరుగింట్లోనో ఆటలాడి పాటలు పాడి వాళ్ళ పిల్లలతో పాటు నిద్దరపోతే, "పిల్ల ఇంకా రాలేదేమిటి చెప్మా?" అని తల్లీ వచ్చి నిద్రపోతున్న పిల్లలిని జాగ్రత్తగా తన ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టిన రోజులేవి? లేదా పిల్లలే అమ్మా..

"ఆటలు ఆడీ పాటలు పాడీ
అలసీ వచ్చానే- తియ్యాతియ్యని
తాయిలమేదో తీసీ పెట్టమ్మా"

అని అనగలుగుతున్నారా? అనుక్షణం భయం భయం .. భయమనే నీడలో బాల్యం గడిపేస్తోంది. బాధగా లేదు?
****

ఈరోజు పొద్దున్నే టిఫిన్ ప్రోగ్రాంలో ఉండగా మరదలు ఫోన్.. "వదినా ఏమి చేస్తున్నారు? " అంటూ.. "టిఫిన్ చేస్తున్నాను" అని సమాధానమిచ్చేలోపు "వదినా పాప జాగ్రత్త సెల్ ఫోన్ పట్టుకుని బయట ఒంటరిగా కూర్చుంటుంది.." అంటూ గడ గడా పాఠం అప్పజెప్పినట్లు చెప్తుంటే ఇంతట్లోనే (నిన్న సాయంత్రామే కలిసి మాట్లాడుకున్నాముగా అన్న ఆలోచన అన్నమాట) ఏమయ్యిందా అని ఆలోచిస్తూనే ప్రవాహం ఆగాక "అసలేమయ్యింది " అని అడిగాను. " ఇదిగో మన వీధిలోనే 14 యేళ్ళ పాపని ఎవరో తీసుకెళ్ళారట అరగంటనుండి పో
లీసులు తిరుగుతున్నారు.. ఒకసారి బయటకి వచ్చి చూడండి, మీ ఇంటిముందు కూడ పోలీసులు ఉన్నారు " అని.. కంగారుగా చెప్పింది, బయటకి వచ్చి చూశాను బయట ఇంటిముందే బైక్ ఆపి ఎవరితోనో సెల్ లో మాట్లాడుతున్నారు ఒక పోలీసు,... ఎక్కడ ఎవరిల్లు అని ఆరా తీసి, ఎక్కడ పనులక్కడ ఆపేసి, మరదలితో కలిసి వాళ్ళింటికి వెళ్ళాను. పక్కనే స్కూల్ 8 వ తరగతి పరీక్షలు రాసింది పాప. ఈరోజు రిజల్ట్స్ ఇస్తున్నారుట, వాళ్ళ ఇల్లు మా వీధిలోనే మూడో అంతస్థులో ఉంటున్నారు. స్కూలుకి వెళ్ళే హడావిడిలో ఉన్నారుట... తల్లి తలుపు తాళం పెట్టేలోపు "కింద వేయిట్ చేస్తానమ్మా" అని చక చకా దిగిందిట. మధ్యలో "అమ్మా" అని గట్టిగా అరుపు వినపడింది కాని, తొందరగా రమ్మనమని పిలుస్తుందేమో అని అనుకున్నారు, కాని, అక్కడ అప్పటిదాక కాపు కాస్తున్నవారు లిప్తపాటు సెకనులొ కళ్ళకి గంతలు కట్టేసి, తీసుకుని వెళ్ళారుట, వెంటనే పోలీసులకి కబురందడంతో స్పందించి నాలుగుమూలలా చెక్ పాయింట్లు పెట్టేసరికి మా కాలనీ కి 3 కిలోమీటర్లో దూరంలో చెకింగ్ కి తాళలేక వదిలేసి వెళ్ళారుట ఆ అగంతకులు. ఇంటి ఓనరు నాకు జాగ్రత్తలు చెబుతూ..... జరిగిన విషయం ఇలా క్లుప్తంగా వివరించారు.

"నేనిలా చెప్తున్నానని నువ్వేమనుకున్నా పర్వాలేదమ్మాయి, పిల్ల దొరకగానే మావాడు వెంటనే అన్నమాట ..." "ఫలనా వాళ్ళ మేనకోడలికి (మా పిల్లలు మా తమ్ముడి మేనకోడలు, మేనల్లుడిగానే ఇక్కడ ప్రసిద్ధి)కూడా జాగ్రత్త చెప్పమ్మా.. ఫ్రండ్‌స్ ఇళ్ళకని వెళ్తూ ఉంటుంది ఒక్కతే.. రోజులు బాలేవు. " అని అన్నాడు, "నువ్వెక్కడికన్నా వెళ్తే నా దగ్గిర ఉంచు, రెండు తగిలించి మరీ కూర్చోబెట్టేస్తాను, పిల్లలు నన్ను తిట్టుకున్నా పర్లేదు" అని ఆ పెద్దావిడ నాకు హితం చెప్పడం చూస్తుంటే... నాకు ఒక పక్క శ్రేయోభిలాషుల సూచనలకు ఆనందించాలో, "ఇలా ఇంట్లోనే ఉండండమ్మా, మన వీధిలో కూడా బయట ఆడుకోవద్దు, కంప్యూటర్, టి.వి, వీడియో, లేదా ఇండోర్ గేంస్ అంతే ఇదే మీ జీవితం, బయట చల్లటి గాలులు ఆస్వాదించే అవకాశం మీకు లేదు" అని వారిని బంధించాలో , అసలేమి చేయాలో , ఏమి చేయకూడదో.. భగవంతుడా, క్షణికమయిన ఈ జీవితానికి ఈ బంధిఖాన ఏంటి? అని నా మనసు మౌనంగా రోదిస్తొంది.

ఏవి మన ఆటలు, ఏవి మన పాటలు, కోతి కొమ్మచ్చి, నాలుగు స్థంభాలాట, చార్ పత్తర్, కబడీ, గచ్చకాయలు, చింతపిక్కలు.. అన్ని మరుగున పడిపోయాయి. పక్కన ఎవరుంటున్నారో కూడ తెలియనిదీ అపార్ట్మెంట్ కల్చర్. పక్కవాళ్ళు బయటకి వస్తుంటే పలకరించడం అనే సాంప్రదాయం ఎప్పుడో పోయింది ... ఫడేలమని మొహం మీదే తలుపులు వేసే కల్చర్ ఇది. "ఇదిగో కాంతమ్మగారు పిల్లలికి ఇక్కడే వంట చేశేసానులెండి, మీరు హైరాన పడకండి .. ఆడుకుంటున్నారుగా... పిలవకండి ఊరికేనే" అంటూ మా చిన్న తనంలో పక్కనావిడ మమ్మల్ని ఆటలనుండి కదపడం ఇష్టం లేక వంట చేసేసిన ఆ రోజులు.. ప్చ్ మళ్ళీ రావు.. ఇలా జైల్లో ఉన్నట్లుగా , అమ్మా , నాన్న , ఇద్దరు లేదా ఒక పాప/బాబు.. ఇదే జీవితం ఇదే ఆనందం, ఎవరు వద్దు, ఎవరూ రాకూడదు, ఎక్కడికొస్తే ఏమవుతుందో, భయం, భయం అనుక్షణం భయం. నాలుగురోజుల ఈ జీవితం భయంతో బతికేస్తున్నాము కదా.. ఎప్పుడో మార్పు .. ఆనందమైన స్వేచ్ఛా జీవితం ఈ పసి పిల్లలికి.
******

పగవాళ్ళ పిల్లలికి కూడా ఇలాంటి బంధిఖాన జీవితాలొద్దు అని మనసారా ప్రార్థిస్తూ, పిల్లలూ కొంచం జాగ్రత్తగా ఉండండి, హైదరాబాదులో ఇలాంటి సంఘటనలు తరుచుగా జరుగుతున్నాయి... అని చెప్పడమే ఈ టపా ముఖ్య ఉద్దేశ్యం.

******

1 comment:

  1. యు ఎస్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలలో పిల్లల రక్షణ బాగానే వుంటుంది కానీ ఈ వేసవి సెలవుల్లో పిల్లలు ఇండియాకి వెళతారు కాబట్టి ఇలాంటివి ఆలోచిస్తే దడగానే వుంటుంది. ఇక్కడి భద్రతకీ అక్కడి భద్రతకీ తేడాలేంటో, అక్కడ ఎలా సేఫుగా వుండాలో అప్పుడప్పుడు తెలియపరుస్తూ వుంటాము.

    ReplyDelete

Loading...