3.07.2011

పోరాటాల్లో పుట్టిన అంతర్జాతీయ మహిళాది నోత్సవం


* అలెగ్జాండ్రా కొల్లంతారు (1920)

* అలెగ్జాండ్రా కొల్లంతారు (1872-1952) రష్యా విప్లవోద్యమంలో ప్రముఖ నాయకురాలు. ధనిక కుటుంబంలో పుట్టిన ఆమె కమ్యూనిస్టు ఉద్యమంలో చేరి రష్యా విప్లవంలో చురుకుగా పాల్గొన్నారు. అనేక దేశాల్లో ప్రవాస జీవితం గడిపారు. మంచి వక్త, రచయిత అయిన కొల్లంతారు రష్యాలో మహిళలను సమీకరించ డంలోనూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆవిర్భావంలోనూ కీలక పాత్ర నిర్వహించారు. తొలినాటి మహిళా ఉద్యమం, దాని విప్లవ లక్ష్యాలను వివరిస్తూ 1920లో రాసిన వ్యాసం ఇది:
******

'మహిళా దినోత్సవం' అననీయండి, 'శ్రామిక మహిళా దినోత్సవం' అననీయండి ఈ రోజు (మార్చి 8) అంతర్జాతీయ సంఘీభావ దినోత్సవం. శ్రామిక మహిళా ఉద్యమం తన బలాన్ని, నిర్మాణాన్ని సమీక్షించు కోవాల్సిన రోజు. అయితే ఇది మహిళలకు మాత్రమే ప్రత్యేకించిన రోజు కాదు. మార్చి 8 అనేది కార్మికులకు, రైతాంగానికి, కార్మికవర్గానికి యావత్‌ ప్రపంచ కార్మిక వర్గానికి చారిత్రాత్మక మైన, మరుపురాని రోజు. 1917లో ఈ రోజునే రష్యాలో మహత్తర ఫిబ్రవరి విప్లవం బద్దల యింది. పీటర్స్‌బర్‌లో శ్రామిక మహిళలు ఈ విప్లవానికి నాంది పలికారు. జారు చక్రవర్తి, అతని సైనికులకు వ్యతిరేకంగా జెండా ఎత్తారు. అందుకే శ్రామిక మహిళలకు ఇది రెండు పండగలు కలిసివచ్చిన సందర్భం. మార్చి 8వ తేదీ శ్రామిక వర్గానికి సార్వ త్రిక సెలవు దినం అయినా మనం దీన్ని మహిళా దినోత్సవం అని ఎందుకు పిలుచుకుంటున్నాం. ప్రత్యేకించి శ్రామిక, రైతాంగ మహిళా సమావే శాలు నిర్వంహించడం మీదే ఎందుకు దృష్టి పెడుతున్నాం. దీనివల్ల మనం కార్మికవర్గ ఐక్యతను గానీ, అంతర్జాతీయ సంఘీభావాన్ని గానీ దెబ్బతీస్తున్నామా? ఈ ప్రశ్నలకు సమాధా నం చెప్పుకోవాలంటే మనం ఒకసారి చరిత్రను తరచి చూసుకోవాలి. ఏ లక్ష్యం కోసం మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామో గుర్తు చేసుకోవాలి.

ఎందుకు, ఎలా..?


పదేళ్ల క్రితం నుండి(1910) మహిళా సమానత్వం గురించి, మగవాళ్ళతోపాటుగా మహిళలకు కూడా రాజకీయ పాలనాధికారం గురించి తీవ్రమైన చర్చ సాగుతోంది. పెట్టుబడి దారీ దేశాలన్నింటా కార్మిక వర్గం శ్రామిక మహిళల హక్కుల గురించి పోరాటాలు నిర్వ హిస్తూ ఉన్నది. కానీ బూర్జువా వర్గం శ్రామిక మహిళలకు హక్కులు ఇవ్వనిరాకరి స్తోంది. కార్మిక వర్గం ఓటింగ్‌ హక్కును విస్తృతం చేయ డం ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కార్మికవర్గం బలపడడానికి, తమ ఆధిపత్యం వదులుకోవడానికీ బూర్జువా వర్గం సిద్ధంగా లేదు. అందుకే బూర్జువా వర్గం ప్రతిదేశంలోనూ మహిళలకు హక్కులు కల్పించే బిల్లులకు చట్ట పరమైన ఆమోదం లభించకుండా ఆటంకాలు కల్పిస్తూనే ఉన్నది.

అమెరికాలో సోషలిస్టులు మహిళలకు ఓటు హక్కు కోసం పట్టుపట్టి పోరాటాలు నిర్వ హించారు. 1909 ఫిబ్రవరి 28న శ్రామిక మహిళలకు రాజకీయ హక్కులు కల్పించాలనే డిమాండ్‌తో అమెరికా అంతటా ప్రదర్శనలు, మీటింగులు జరిగాయి. ఒకరకంగా చెప్పుకో వాలంటే ఇదీ 'మహిళా దినోత్సవమే'. మహిళా దినోత్సవ నిర్వహణకు సంబంధించి చొరవ చేసింది అమెరికన్‌ మహిళా కార్మిక వర్గమే అని చెప్పుకోవచ్చు.

1910లో జరిగిన శ్రామిక మహిళల రెండవ అంతర్జాతీయ సదస్సులో క్లారాజెట్కిన్‌ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరం గురించి లేవనెత్తింది. మహిళలకు ఓటింగ్‌ హక్కు సాధించుకోవడం ద్వారా మహిళా ఐక్యతను పెంపొందించుకుని సోషలిజం సాధననను బలోపేతం చేయ్యలనే నినాదంతో ప్రతి దేశంలో ప్రతి ఏడాదీ ఒకే రోజున 'మహిళా దినోత్సవం' నిర్వహించు కోవాలని సదస్సు పిలుపునిచ్చింది.

ఈ కాలంలో మహిళలకు వయోజన ఓటు హక్కు కల్పించడం ద్వారా పార్లమెంటును మరింత ప్రజాస్వామికరించాలనే అంశం కీలక ప్రాధాన్యతను సంతరించుకుంది. మొదటి ప్రపం చ యుద్ధ్దానికంటే ముందుకాలం నుంచే ఒక్క రష్యాలో మినహా అన్ని బూర్జువా దేశాల్లోనూ కార్మికులకు ఓటు హక్కు ఉంది. కేవలం మహిళలు, మతిస్తిమితం లేని వాళ్లను మాత్రమే ఈ హక్కు నుండి మినహాయించారు. అదే సందర్భంలో పెట్టుబడిదారీ విధానం ఎదుర్కొన్న కటువైన వాస్తవ పరిస్థితులు ఏమిటంటే దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ అవస రాలు అంతకంతకూ పెరుగుతూ వచ్చాయి. ఫ్యాక్టరీలలో, వర్క్‌షాపులలో, ఆఫీసులలో పని చేయడానికి మహిళల అవసరం ఏటికేటికీ పెరుగుతూ వచ్చింది. పురుషులతో సమానంగా మహిళలూ పనిచేసి దేశ సంపద పోగు చేయడంలో తమవంత కృషి చేశారు. అయినా మహిళలకు ఓటు హక్కు లేకుండా పోయింది. అయితే యుద్ధానికి ముందు సంవత్సరాల్లో ఆహార ఉత్పత్తుల ధరల విపరీతంగా పెరిగి పోయి ఇంటిపట్టున ప్రశాంతమైన జీవితం గడిపే గృహిణీమణులు కూడా ఇందుకు గల రాజకీయ కారణాలను అర్థం చేసుకుని బూర్జువా ఆర్థిక వ్యవస్థ దోపడిని ప్రశ్నించే స్థాయికి ఎదిగారు. గృహిణీమణుల తిరుగుబాట్లు, రోడ్లమీదకొచ్చి ప్రదర్శనలు చెయ్యడం, నిరసన తెలపడం నానా టికీ పెరిగాపోయాయి. ఈ నిరసనలు ఒక్కో దేశం నుండి ఇంకో దేశానికి అగ్గిలా రాజుకు న్నాయి. ఆస్ట్రియా, ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ వంటి దేశాలన్నింటా ఇలాంటి ఉద్యమాలు నడిచాయి.

మార్కెట్లలో కొట్లమీద పడి ధ్వంసం చేయ డం, వ్యాపారస్తులను చితకబాదడం పరిపాటి అయిపోయింది. అయితే ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రయోజనం లేకుండాపోతుందని, ప్రియం అయిపోయిన ధరలకు మూలకారణం ప్రభు త్వం అనుసరిస్తున్న రాజకీయ విధానాల్లో ఉందని శ్రామిక మహిళలు అర్థం చేసుకు న్నారు. పరిస్థితుల్లో మార్పు రావాలంటే రాజకీ యాల్లో మార్పు తీసుకురావాలనీ, అందుకోసం మహిళలకూ ఓటింగ్‌ హక్కు కల్పించాలనే డిమాండ్‌ ముందుకొచ్చింది. ఈ హక్కు సాధన కోసం ప్రతిదేశంలో విధిగా మహిళా దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళ లందరికీ ఈ హక్కుల సాధన సాధ్యం కావా లంటే ఉమ్మడి లక్ష్యంతో అంతర్జాతీయ సంఘీ భావంతో ఉద్యమాలు నడపాలనీ, ఏటా శ్రామిక మహిళల నిర్మాణ బలాన్ని అంచనా వేసుకుంటూ సోషలిజం సాధన దిశగా ఎలాంటి కార్యక్రమాలు రూపొందించుకోవాలో మహిళా దినోత్సవం రోజున సమీక్షించుకోవాలనీ నిర్ణ యం జరిగింది.

తొలి అంతర్జాతీయ మహిళాదినోత్సవం


సోషిలిస్టు మహిళల రెండవ అంతర్జా తీయ సదస్సు ఇచ్చిన ఈ పిలుపు కాగితాలకే పరిమితం కాలేదు. 1911 మార్చి 19న తొలి అంతర్జాయతీయ మహిళా దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. మార్చి 19వ తేదీని ఎంచుకోడానికి ఒక ప్రాముఖ్యత ఉంది. జర్మన్‌ శ్రామిక వర్గానికి ఆరోజుకు ఉన్న ప్రాముఖ్యత రీత్యా మార్చి 19వ తేదీని ఎంచుకుందామని జర్మన్‌ మహిళా ప్రతినిధివర్గం ఆ సదస్సులో సూచించింది. శ్రామిక వర్గ ప్రజల సాయుధ తిరుగుబాటుకు రష్యా రాజు తలొగ్గిన రోజు 1848 మార్చి 19. రాజు ప్రజలకు అనేక వాగ్ధానాలు చేశాడు. మహిళలకు ఓటు హక్కు కల్పిస్తానని కూడా తొలిసారిగా అంగీకరించాడు. అయితే ఆ తరువాత ఈ వాగ్ధానాల్లో అనేకం నిలబెట్టు కోలేదు. అదివేరే సంగతి. జనవరి 11నుండి జర్మనీ, ఆస్ట్రియాలలో మహిళా దినోత్సవం నిర్వహణకు చురుకుగా ఏర్పాట్లు సాగాయి. ఒక భారీ ప్రదర్శన నిర్వ హించాలని నోటిమాటగా ప్రచారం చేశారు. పత్రికులకు ప్రకటనలు ఇచ్చారు. అయితే ఇంకో వారం రోజుల్లో మహిళా దినోత్సవం జరగ నుంది అనగా రెండు పత్రికలు మాత్రం ఈ వార్తతో పాటు కొన్ని వ్యాసాలూ ప్రచురిం చాయి.

'జర్మన్‌ మహిళలకు ఓటుహక్కు', 'ఆస్ట్రి యాలో మహిళా దినోత్సవం', 'మహిళలు- పార్లమెంటు', 'శ్రామిక మహిళలు - మున్సిపల్‌ వ్యవహరాలు', 'గృహిణులకు రాజకీయాలతో పనేంటి' వంటి శీర్షికలతో పత్రికలు నిండి పోయాయి. సమాజంలో, ప్రభుత్వంలో మహి ళా సమానత్వ సాధన అవసరం, సాధ్యా సాధ్యా ల గురించి క్షుణ్ణమైన విశ్లేషణ నడిచింది. దాదాపు అన్ని వ్యాసాల్లో వెలిబుచ్చి అభిప్రయాల సారంశం ఒక్కటే. పార్లమెంట్‌ను మరింత ప్రజాస్వామీకరించాలంటే మహిళలందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పిం చాల్సిందే.

1911 మార్చి 19న తొలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. అంచ నాలకు మించి జయప్రదమైంది ఈ కార్యక్రమం. జర్మనీ, ఆస్ట్రియాలలో శ్రామికమహిళా ప్రదర్శనలు సముద్రంలా పోటెత్తిపోయాయి. చిన్న చిన్న పట్టణాలు, పల్లెల్లో కూడా మహిళా సమావేశాలు జయప్రదంగా జరిగాయి. చాలా చోట్ల జాగాలేక సమావేశానికి వచ్చిన మగ వారిని వెళ్లిపోమ్మని చెప్పాల్సిన పరిస్థితి వచ్చిం దంటే మహిళా దినోత్సవం ఏ మేరకు విజయ వంతమైందో అంచనా వేసుకోవచ్చు.

శ్రామిక మహిళల సమరశీలతికు అద్దం పట్టిన తొలిప్రదర్శన ఇది. మగవాళ్లు ఇంటి పట్టునే ఉండి పిల్లల ఆలనాపాలనా చూసు కున్నారు. అప్పటికే వంటింటికే పరిమితమైన గృహిణులు తొలిసారిగా వీధికెక్కారు. అప్పట్లోనే దాదాపు 30,000 మంది మహిళలు ఆ భారీ ప్రదర్శనలో పాల్గొన్నారు. పోలీసులు వాళ్లు చేపట్టిన బ్యానర్లు లాక్కోవాలని ప్రయత్నించారు. శ్రామిక మహిళలు వాళ్ల ప్రయత్నాలను అడ్డు కున్నారు. తోపులాట జరిగింది. ఇంకాస్త ఉంటే పోలీసులు ఆప్రదర్శనను రక్తపుటేరుల్లో ముంచెత్తే వాళ్లు. కాని పార్లమెంట్‌లో సోషలిస్టు ప్రతినిధు లుగా ఉన్నవాళ్లు జోక్యం చేసుకుని దాన్ని నివారించారు. 1913లో అంతర్జాతీయ మహిళా దినోత్స వాన్ని మార్చి 8వ తేదీకి మార్చారు. అప్పటి నుండి మార్చి 8 మహిళా దినోత్సవంగా, శ్రామిక మహిళల సమరశీలతికు కొండ గుర్తుగా మారింది.

మహిళా దినోత్సవం అవసరం ఉందా..?


అమెరికా, యూరప్‌ దేశాలలో మహిళా దినోత్సవం అద్భుతమైన ఫలితాలు సాధించింది. బూర్జువా పార్లమెంట్లు అప్పటిదాకా కార్మికులకు ఎలాంటి రాయితీలు ఇవ్వడానికి గానీ, మహిళా సమస్యల పట్ల స్పందించడానికి గానీ ఏమ్రాత్రం సిద్ధపడలేదు. ఎందుకంటే వాళ్లకు తక్షణం సోషలిస్టు విప్లవాల నుండి ఎదురయ్యే ప్రమాదం ఏదీ లేదు. అయితే మహిళా దినోత్సవం నిర్వహణ ఒకమేరకు కదలిక సాధించింది. రాజకీయంగా అంత చైతన్యవంతం కాని శ్రామిక మహిళా సోదరీమణుకు ఒక అద్భుతమైన పోరాట రూపాన్ని అందించింది. మహిళా దినోత్సవానికి ఉద్ధేశించిన సమావేశాలు, ప్రదర్శనలు, పోస్టర్లు, కరపత్రాలు, దినపత్రికల పట్ల వారి ఆసక్తి పెరిగింది. రాజకీయంగా బాగా వెనుకబడిన గ్రామీణ ప్రాంత శ్రామిక మహిళల్లో కూడా ఇది చైతన్యం కలిగించింది. 'మా పండగ రోజు' అనే ఉత్సాహం కలిగి సమావేశాలు, ప్రదర్శ నలవైపు పరిగెట్టించింది. ఏటేటా జరిగే ఈ మహిళాదినోత్సవం ప్రభావంతో కార్మిక సంఘాలలో, సోషలిస్టు పార్టీలలో మహిళలు ఎక్కువ ఎక్కువగా వచ్చి చేరసాగారు. వీటి నిర్మాణబలం పెరిగింది. రాజకీయ చైతన్యం అభివృద్ధి అయింది.

మహిళా దినోత్సవం వల్ల ఒనగూడిన మరో ఫలితం ఏమంటే కార్మికుల మధ్య అంత ర్జాతీయ సంఘీభావం పెంపొందింది. వివిధ దేశాలలో ఉన్న పార్టీలు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసే సమావేశాలకు ఇతర దేశాల వక్తలను పిలిచి వారి అనుభ వాలను పంచుకునేవారు. జర్మన్‌ కామ్రేడ్‌లు ఇంగ్లాండ్‌ వెళ్తే, ఇంగ్లాండ్‌ కామ్రేడ్‌లు హాలాండ్‌.. ఇలా వేర్వేరు దేశాలకు వెళ్ళేవారు. కార్మిక వర్గం మధ్య అంతర్జాతీయ సుహృద్భావం బలపడి తద్వారా శ్రామిక వర్గం పోరాటపటిమ మరింత పెంపొందింది. ఇవన్నీ శ్రామిక మహిళా దినోత్సవ సమర శీలత ఫలితాలే. శ్రామిక మహిళల నిర్మాణానికి, వారి చైతన్య స్థాయిని పెంపొందించేందుకు మహిళా దినోత్సవ నిర్వహణ ఎంతగానో ఉపక రించింది. ఒక్కమాటలో చెప్పుకోవాలంటే కార్మికవర్గం మెరుగైన భవిష్యత్తు కోసం జరిగే పోరాటాలకు ఊతంగా నిలిచింది.

రష్యాలో శ్రామిక మహిళా దినోత్సవం


రష్యాలో 1913లో తొలిసారిగా శ్రామిక మహిళాదినోత్సవం జరిగింది. అప్పట్లో కార్మిక వర్గం, రైతాంగం జారు చక్రవర్తి ఉక్కు పిడికిట నలిగిపోతోంది. అలాంటి నేపథ్యంలో శ్రామిక మహిళా దినోత్సవం జరుపుకోవడంగానీ, ఆ పేరిట బహిరంగంగా ప్రదర్శనలకు దిగడంగానీ ఊహకైనా తట్టని అంశం. అయినా సంఘటిత శ్రామిక మహిళలు మహిళాదినోత్సవాన్ని నిర్వ హించుకున్నారు. కార్మికవర్గం కోసం నడిపిన రెండు పత్రికలలో - బోల్షివిక్‌లు నడిపిన 'ప్రాప్పా', మెన్షవిక్‌లు నడిపిన 'లూక్‌'లలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మీద అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ప్రత్యేక వార్తలు, ఇతర దేశాలలో జరిగిన మహిళా దినోత్సవ చాయా చిత్రాలతో పాటు కామ్రెడ్‌ క్లారాజెట్కిన్‌, బెబెల్‌ వంటి హేమాహేమీల సందేశాలూ ప్రచురించాయి.

సమావేశాలు నిషేధించబడిన ఆ చీకటి రోజుల్లో పెట్రోగ్రాడ్‌లోని 'కాలాషి కోవెన్కీ ఎక్స్ఛేంజ్‌'లో పార్టీ నాయకత్వంలో మహిళా సమస్య మీద బహిరంగ చర్చావేదిక నిర్వహిం చారు. ప్రవేశ రుసుము ఐదు కొపెక్కులుగా నిర్ణయించారు. అది చట్టవ్యతిరేక సమావేశం అయినా హాలు పూర్తిగా నిండిపోయింది. పార్టీ సభ్యులు కొందరు ప్రసంగించారు. నాలుగు గోడల మధ్య పకడ్బంధీగా ఈ సమావేశం నిర్వహించినా, ముగింపుకు వచ్చేసరికి పోలీసు లకు ఉప్పంది జోక్యం చేసుకున్నారు. వక్తలను అనేకమందిని అరెస్టు చేశారు. జారుచక్రవర్తి తీవ్ర నిర్బంధంలో ఉండి కూడా రష్యన్‌ మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవంతో మమేకం కావడానికి ఇలాంటి సాహాసోపేత కార్యక్రమం చేపట్టారు. రష్యాలో పెరుగుతున్న ప్రజా చైతన్యానికి ఈ సమావేశం ఒక ప్రతీక. జారు చక్రవర్తి చెరసాలలు, ఉరికొ య్యలు కార్మికుల పోరాట స్ఫూర్తి ముందు శక్తివిహీనంగా తయారయ్యాయి. 1914లో శ్రామికమహిళా దినోత్సవం ఇంకాస్త మెరుగ్గా జరిగింది. కార్మికులు, వార్తా పత్రికలు ఇది తమ సంబరంగా భావించారు. పోలీసు జోక్యంవల్ల ప్రదర్శన నిర్వహించడం సాధ్యంకాలేదు. శ్రామిక మహిళా దినోత్సవం ఏర్పాట్లతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ జైల్లో పెట్టారు. అందులో కొంతమందిని సైబీరియాకు తరలించారు. శ్రామిక మహిళలకు ఓటు హక్కు కల్పించాలనే నినాదం సహజంగానే రష్యాలో జారు చక్రవర్తి రాజరికాన్ని కూలదోసే బహిరంగ పిలుపుగా మలుపు తీసుకుంది.

సామ్రాజ్యవాద కాలంలో

శ్రామిక మహిళా దినోత్సవం


ఇంతలో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. దేశదేశాల కార్మికవర్గం రక్తపిపాసి యుద్ధ కోరల్లో చిక్కుకుంది. 1915-1916 సంవత్సరాల్లో ఇతర దేశాల్లో శ్రామిక మహిళా దినోత్సవం పేలవంగా జరిగింది. వామపక్ష, సోషలిస్టు భావాలతో ప్రభావితం అయిన రష్యన్‌ మహిళలు మాత్రం బోల్షవిక్‌ పార్టీ పిలుపు మేరకు మార్చి 8 మహిళా దినోత్సవాన్ని యుద్ధా నికి వ్యతిరేకంగా శ్రామిక మహిళా దినంగా మలిచే ప్రయత్నం చేశారు. కానీ జర్మనీ తదితర దేశాల్లో సోషలిస్టుల ముసుగులో ఉన్న విప్లవ ద్రోహులు మహిళా కామ్రెడ్లు చేసే ప్రయత్నాలను సాగనివ్వలేదు. తటస్థ దేశాలలో జరుగుతున్న అంతర్జాతీయ మహిళా సదస్సులకు హాజరు కావడానికి అవసరమైన పాస్‌పోర్టులు జారీ చేయడానికి నిరాకరించారు. మహిళా దినోత్స వాన్ని భగం చేయాలని బూర్జువా పాలకులు ప్రయత్నించి విఫలమయ్యారు. అంతర్జాతీయ సంఘీభావం వెల్లివిరిసింది. 1915లో నార్వేలో మాత్రమే మహిళాదినత్సోవం సంద ర్భంగా ఒక అంతర్జాతీయ ప్రదర్శన జరిగిం ది. దీనికి రష్యా నుండి, ఇతర తటస్థ దేశాల నుండి మహిళా ప్రతినిధులు హాజరయ్యారు. రష్యాలో ఆ ఏడాది మహిళా దినోత్సవం నిర్వహించాలన్న ఊసే తలెత్తలేదు. జారు చక్రవర్తి అధికార మదోన్మత్తతతో, సాయుధ సైనిక పశుబలం అందుకు ఎలాంటి వెసులుబాటూ ఇవ్వలేదు.

ఇంతలో రానేవచ్చింది మహత్తర 1917 వ సంవత్సరం. ఆకలి, ఎముకలు కొరికే చలి, యుద్ధనేర విచారణలు, శిక్షలు.. ఇవన్నీ రష్యా శ్రామిక - రైతాంగ మహిళల ఓర్పును చంపేసాయి. 1917 మార్చిన 8న (రష్యా కాలమాన ప్రకారం ఫిబ్రవరి 23న) శ్రామిక మహిళలు నిర్భయంగా పెట్రోగ్రాడ్‌ వీధులకె క్కారు. వారిలో కొందరు శ్రామికులు, ఇంకొం దరు సైనికుల భార్యలు. 'మా పిల్లలను బతికించుకోవాడానికి ఇంత రొట్టె ఇవ్వండి' 'కందకాల్లో ఉన్న మా భర్తలను వెనక్కి రప్పించండి' అన్న నినాదాలు వెల్లువెత్తాయి. సముద్రపు టలల్లా ఎగసి పడుతున్న ప్రజాగ్ర హాన్ని చూసి జారు చక్రవర్తి రక్షణ దళాలు చేష్టలుడిగి మిన్నకుండి పోయాయి. మహిళల మీద తమ ప్రతాపం చూపించడానికి ఏమా త్రం సాహసించలేకపోయాయి. ఆ రోజు చారిత్రాత్మక దినంగా మిగిలి పోయింది రష్యా చరిత్రలో. రష్యన్‌ మహిళలు శ్రామిక వర్గ విప్లవ దివిటీని చేతబట్టి పాడు ప్రపంచానికి ఒక మూల నిప్పుబెట్టారు. ఫిబ్రవరి విప్లవానికి నాంది ఈ శ్రామిక మహిళా దినోత్సవ నిర్వహణే.

సమరానికి 'సై'

వందేళ్ల క్రితం(1910) మహిళలకు రాజకీయ సమానత్వ కావాలని, సోషలిజాన్ని సాధించాలనే లక్ష్యంతో శ్రామిక మహిళా దినోత్సవం రష్యాలో మనం జరుపుకున్నాం. ఈ లక్ష్యాన్ని సాధించుకున్నాం కూడా. సోషలిష్టు రష్యాలో సార్వత్రిక వయోజన ఓటింగుహక్కు, ఇతర పౌరహక్కుల కోసం శ్రామిక- రైతాంగ మహిళలు పోరాడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ హక్కులను సోషలిస్టు వ్యవస్థ వారికి కట్టబెట్టింది. పురుషులతో సమానంగా స్త్రీలకు అన్ని హక్కులూ దక్కాయి. జీవితాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకునే అవకాశాలు మహిళలకు పుష్కలంగా లభించాయి. కేవలం ఓటుహక్కే కాకుండా సమిష్టి క్షేత్రాల్లో, ఉమ్మడి సంస్థలలో మహిళలకు భాగస్వామ్యం దక్కింది.

హక్కులు సాధించుకోవడంతోనే మనం తృప్తి పడకూడదు. ఆ హక్కులను ఎలా ఉప యోగ పెట్టుకోవాలనే మెళకువ సంపాదించు కోవాలి. ఉదహారణకు ఓటు హక్కునే తీసుకుందాం. ఆ ఓటు హక్కును స్వీయ ప్రయోజ నాలకు, కార్మికవర్గ శ్రేయస్సుకు, రాజ్య ప్రయోజనాలకు అనుకూలంగా ఎలా ఉపయో గించుకోవాలో అర్థం చేసుకుంటేనే ఆ హక్కు మన చేతిలో వజ్రాయుధంగా మారుతుంది.

సోవియట్‌లో కార్మికవర్గం అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది. అయితే మన జీవితాల్లో స్వల్పకాలంలోనే మౌలికమైన మార్పులు ఇంకా రాలేదు. మన సమాజంయొక్క అణిచివేత స్వభావం చీకటికోణాలు ఇంకా మనల్ని వెన్నంటి వస్తూనే ఉన్నాయి. దీనికి తోడు చుట్టూ ఉన్న ప్రపంచం అలానే ఉంది. ఒక్క రష్యాలో మాత్రమే ఇందుకు భిన్నంగా కమ్యూనిస్టు సమాజ స్థాపన లక్ష్యంగా కృషి జరుగుతోంది. శ్రామిక మహిళల మీద కుటుంబ బంధనాలు, ఇంటి పనిభారం, వ్యభిచారం వంటి ప్రభావాలు ఇంకా బలంగానే ఉన్నాయి. ఇవన్నీ కేవలం చట్టాలు చేసినంతమాత్రన తొలగిపోవు. శ్రామిక రైతాంగ మహిళలు ఉమ్మడిగా తమ శక్తియుక్తులన్నీ కేంద్రీకరించి పై బంధనాల నుండి విముక్తికోసం కృషిచేస్తే తప్ప రష్యాలో కమ్యూనిస్టు వ్యవస్థ స్థాపన సాకారం కాదు. ఈ క్రమాన్ని వేగవంతం చేయాలంటే ముందు కుప్పకూలిన రష్యన్‌ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవాలి. అందుకు మనం రెండు తక్షణ కర్తవ్యాలు నిర్దేశించుకోవాలి. మొదటగా రాజకీయంగా చైతన్యవంతమైన కార్మికవర్గంతో బలమైన నిర్మాణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. రవాణా వ్యవస్థను పునరు ద్ధరించుకోవాలి. మన శ్రామిక సైన్యం తలుచు కోవాలేగాని త్వరలోనే మనం ఆవిరి ఇంజన్‌లు తయారు చేయగలం. రైల్వే వ్యవస్థనూ సరిగా పనిచేయించగలం. తద్వారా ఇవాళ శ్రామిక ప్రజాజీవనానికి కావల్సిన ఆహారం, వంటచెరుకు సమకూరుతుంది. రవాణా వ్యవస్థను మళ్లీ గాడిన పెడితే కమ్యూనిస్టు విజయం వేగవంతమవు తుంది.

కమ్యూనిజం వర్దిల్లుతేనే మహిళలకు మౌలికమైన సమానత్వం లభిస్తుంది. అందుకే ఈ యేడాది మనం జరుపుకోబోయే శ్రామిక మహిళాదినోత్సవం సందేశం ఎలా ఉండాలంటే శ్రామిక రైతాంగ మహిళలు తల్లులు, చెల్లెళ్లు, గృహిణులు అందరూ ఏకతాటిపై రైల్వే వ్యవస్థ పునర్నిర్మాణానికి కృషి చేస్తున్న శ్రామిక వర్గానికి అన్ని విధాలా అండదండలుగా నిలవాలి. ఆహారం, వంటచెరుకు, ముడిఖనిజాల సాధన కోసం జరిగే కృషిని జయప్రదం చేయాలి. గతే డాది శ్రామిక మహిళాదినోత్సవం సందర్భంగా ఎర్రదండుకు సకల విజయాలు కలగాలి అన్న నినాదం తీసుకున్నాము. ఎర్రదండు విజయానికి మహిళాలోకం అందించిన తోడ్పాటు అంతా ఇంతా కాదు. అలానే ఈ యేడాది అదే స్ఫూర్తితో శ్రామిక దండు తమ లక్ష్యాన్ని నెరవేర్చడానికి కావల్సిన అండదండలు అందించాలి. ఎర్రదండు నిర్మాణం క్రమశిక్షణగల సంస్థ. త్యాగాలకు వెరువని సంస్థ. అందుకే శత్రువుమీద విజయం సాధించగల్గింది. గాడితప్పిన రవాణా, ఆర్థిక వ్యవస్థలు, ఆకలి, ఆరోగ్యం ఇవే మనముందున్న అంతర్గత శత్రువులు. వీటిపై పైచేయి సాధించ డానికి కష్టపడి పనిచేసే స్వీయక్రమశిక్షణ, త్యాగబుద్ది కలిగిన శ్రామికదండు అవసరం ఎంతైనా ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ దండులో చేరండి. విజయం సాధించడానికి మీలో ప్రతి ఒక్కరూ వీరికి తోడ్పడండి. శ్రామిక మహిళాదినోత్సవం నూతన కర్తవ్యాలు మహాత్తర అక్టోబర్‌ విప్లవం మహిళలకు పురుషులతోపాటు సమానత్వం ఇచ్చింది. పౌరహక్కులూ ఇచ్చింది.

నిన్నమొన్నటిదాక రష్యా శ్రామిక మహిళలు తీవ్రమైన అణిచివేతకు గురైన దురదృష్టవంతులు. కాని ఇవాళ మిగతా ప్రపంచ దేశాల మహిళల ముందు గర్వంగా తలెత్తుకునే స్థితిలో ఉన్నారు. అంతేకాదు మహిళలు రాజకీయ సమానత్వం సాధించాలంటే రష్యాలో మాదిరి శ్రామికవర్గ నియంతృత్వం తప్ప వేరే మార్గం లేదని పద నిర్దేశం చేశారు. ఇప్పటికీ పెట్టుబడిదారీ దేశాల్లో మహిళల పరిస్థితి క్లిష్టంగానే ఉంది. పనిబారం బండెడు, సౌకర్యాలు అరకొర. అప్పులు నామ్‌కే వాస్తే తీరుగా ఉంది. ఇలా మహిళల పరిస్థితి, ఈ దేశాల్లో శ్రామిక మహిళల పరిస్థితి బలహీ నంగా ఉంది. అయితే నార్వే, ఆస్ట్రేలియా, ఫిన్‌లాండ్‌ వంటి దేశాల్లో ఉత్తర అమెరికా ఖండంలోని కొన్ని రాష్ట్రాల్లో మొదటి ప్రపంచ యుద్దానికాన్నా ముందునుండే మహిళలు పౌరహక్కులు సాధించుకున్న మాట వాస్తవమే. జర్మనీలో టైజర్‌ చక్రవర్తి రాజరికాన్ని కూలదోసి బూర్జువా రాజ్యాన్ని నిలబెట్టారు. రాజకీయ వాదులు నడిపిన ఈ ప్రభుత్వంలో పార్లమెంటుకు 36 మంది మహిళలు ఎంపిక య్యారు. వారిలో ఒక్క కమ్యూనిస్టూ లేరు. అలాగే 1919లో ఇంగ్లాండ్‌లో తొలిసారిగా ఒక మహిళా ప్రతినిధి పార్లమెంటుకు ఎన్నికైంది. ఆమెను అమ్మగారూ అనేవారు. మన అమ్మలాం టిది కాదు ఆవిడ నిజంగా అమ్మగారే. కులీన కుటుంబం నుండి వచ్చిన ఒక మహిళా రాజ వంశస్తురాలు. ఫ్రాన్స్‌లో మహిళలకు ఓటింగ్‌ హక్కు కల్పించాలనే అంశంమీద చర్చ నడుస్తూనే ఉంది. అయితే భూర్జువాపార్లమెంటు చట్టంలో శ్రామిక మహిళలకు ఏం హక్కులు ఒనగూరు తాయి. అధికారం అంతా పెట్టుబడిదారీ చేతుల్లో, సంపద యజమానుల చేతుల్లో ఉన్నం తకాలం శ్రామిక మహిళకు మిగిలేది ఇంటా బయటా సాంప్రదాయభానిసత్వమే తప్ప రాజకీయ హక్కులు నామమాత్రంగానే అలంకార ప్రాయంగానే మిగులుతాయి.

ఒక పక్కన బోల్షివిక్‌ విప్లవం బూచీ పొంచి ఉంది. కాబట్టి శ్రామిక మహిళలకు ఓటు హక్కును నగారాగా అందించాలని ఫ్రాన్స్‌ భూర్జువావర్గం పాచిక వేసింది. కాని ఘనమైన భూర్జువా అయ్యలు 'మీరు ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. మహత్తర అక్టోబర్‌ విప్లవం అనుభవం నుండి ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్‌ తదితర దేశాల్లోని శ్రామిక మహిళలకు ఒక విషయం స్పష్టమైంది. శ్రామికవర్గ నియంతృత్వం ద్వారా సోవియట్‌లో చేపట్టిన అధికారం ద్వారా మాత్రమే మహిళలకు సమానత్వం సిద్ధిస్తుందని అర్ధం చేసుకున్నారు. శతాబ్దాల తరబడి దాస్యశృంఖ లాలలో చిక్కుకొని బనాయించిన దోపిడీ అణిచివేతలు స్వస్తిపలకడం ఒక్క కమ్యూనిజం తోనే సాధ్యమని అవగాహనకు వచ్చారు. ఒక పక్కన భూర్జువాపార్లమెంటులో మహిళలు ఓటుహక్కుకోసం పోరాడుతున్న నేపథ్యంలో జరుపుకోవాల్సిన శ్రామిక మహిళాదినోత్సవం సందర్భంగా మనం మన కర్తవ్యాన్ని ఎంచు కోవాలి. మూడవ కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ ఇచ్చిన నినాదాల వెనుక అత్యధిక శ్రామిక మహిళావర్గాన్ని సమీకరించాలి. భూర్జువాపార్ల మెంటులో భాగస్వామ్యానికి బదులు కమ్యూనిస్టు రష్యాని ఆదర్శంగా తీసుకోమని చెప్పాలి. ఈ ప్రపంచాన్ని దోచుకుతింటున్న పెట్టుబడిదారీ వర్గానికి వ్యతిరేకంగా విశాల ప్రతిఘటనా వేదికలో దేశదేశాల శ్రామిక మహిళలు భాగస్వాములు కావాలి. బూర్జువాపార్లమెంటరీ తత్వాన్ని తెగనాడాలి. సోవియట్‌లో అధికారాన్ని స్వాగతించాలి. శ్రామికవర్గం ఎదుర్కొంటున్న అసమానతలు తొలగించాలి. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం విజయం సాధించేందుకు కంకణ బద్ధులు కావాలి. నూతన ప్రపంచ క్రమం, అది పెట్టుబడీదారి దేశాలు చెప్పుకుంటున్న వ్యవస్థలో మహిళల స్థితిగతులు ఆశించిన స్థాయిలో మెరుగుపడలేదనే వాస్తవాన్ని ఆ దేశాల్లోని మహిళావర్గం గుర్తించింది. పెట్టుబడీదారి విధానాన్ని కూలదోసి కమ్యూనిజాన్ని స్థాపించ డం ఒక్కటే సమస్యకు పరిష్కారం. కేవలం ఓటు హక్కుకోసం సీట్లకోసమే కాకుండా మానవాళి సంపూర్ణ విముక్తికోసం మహిళా సమానత్వం కోసం ఇకమీదట యుద్ధం జరగాలి. ఈ యుద్ధంలో మహిళలు గెలవాలి. అలా గెలవాలంటే కమ్యూనిజం తప్ప వేరే మార్గం లేదు.

ప్రపంచపెట్టుబడిదారీ విధానం నశించాలి!

బూర్జువా ప్రపంచ సాంప్రదాయాలైన అస మానతలు, హక్కుల లేమి తొలగిపోవాలి!!

ప్రపంచశ్రామిక మహిళల్లారా ఏకం కండి!!!

శ్రామికవర్గ నియంతృత్వంలో శ్రేయోరాజ్య స్థాపనకు భుజం భుజం కలపండి!!!!
సేకరణ : రమణి

7 comments:

  1. అలెక్సాండ్రా కొల్లొంటాయ్ రచనలు నా దగ్గర ఉన్నాయి. అప్పట్లో భర్తని విడిచిపెట్టి పార్టీలో చేరాలంటే చాలా తెగింపు ఉండాల్సి వచ్చేది.

    ReplyDelete
  2. వావ్! ఏం దెబ్బకొట్టారండి! ఇప్పుడూ మొగాళ్ళమైనందుకే కాదు, కేపిటలిస్టుల మైనందుకు కూడా ఎక్కడన్నా దాక్కోవాలా?

    ReplyDelete
  3. inka communism ni pattukuni veladutunte..mahilabudayam ilane vuntundi...communism proved to be a failure in every aspect of life..its roots are no longer worth their words now...come to reality..come to the forefront of living times...not rest on old outdated views..stories...to achieve social justice to women...

    ReplyDelete
  4. u r right murty....ee words choodandi..capitalists,pettubadidaritanam,burjuva
    ila paadadam tappa...saadinchedi emiledu..worldwide communist countries anni enduku kuppa koolayi?India made a grave blunder by following communist USSR for along time..itcorrectedits mistakes n see India now and then...u r going to see non communist partiesruling kerala&west bengal also soon...realisticga alochinchi...aa ism ee ism anikakunda...mahilalaku melu jarigela choodadam mana andari bhadyata....kadantara....

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. అన్ని విషయాలను ఒక్క చోట చాలా బాగా వివరించారండి. మీకు నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

    ReplyDelete
  7. రమణి గారు కొల్లోంతాయి వ్యాసాన్ని పరిచయం చేసినందుకు దన్యవాదాలు...there is no alternative to communism.....happy womens day.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...