10.18.2010

భావి తరానికి బంధువులేరి?

మొన్నే నేనో ఫంక్షన్ కి వెళ్ళాను. ఎందుకో ఇలాంటి ఫంక్షన్స్ ఇక ముందు తరాలవాళ్ళకి తెలిసే అవకాశం లేదనిపిస్తోంది. ఆచార వ్యవహారలు పక్కనపెడితే, కేవలం బంధువుల మాత్రమే లేదా బంధువుల సమక్షంలో మాత్రమే జరిగే కొన్ని ఫంక్షన్స్ ఇకముందు కను(తెర)మరుగైపోతాయి. ఎందుకంటే, ఆలోచిస్తే భావి తరాలవారికి అసలు బంధువులు వుండరేమో అనిపిస్తుంది.

నా చిన్నప్పుడు మా ఇంటికి చాలా మంది చుట్టాలొచ్చేవారు. ఎవరెవరో అస్సలు అర్దమయ్యేది కాదు. వివరించి చెప్పడంలో అమ్మకి కూడా భలే ఛాన్స్ దొరికిందని, తెగ ఆనంద పడిపోయేది. అవును మరి! దగ్గర్లో నేనేగా వుండేది. "ఈయనెవరో తెలీదే నీకు? పిచ్చిదానా! మా అమ్మమ్మ లేదూ, వాళ్ళ ఆడపడుచు అత్తగారి, తమ్ముడి బార్య కి , వేలు విడిచిన మేన మామ" అంటూ ఏదో పెద్ద చుట్టరికం చెప్పేది కాని, నాకర్ధం అయ్యేది కాదు. అర్ధం కాకపోయినా, అర్ధం అయ్యిందని తల ఊపేసేదాన్ని, ఏమన్నా బహుమతులు తెచ్చారేమో అన్న కుతూహలంతో. ఆ బంధువు పిప్పరమెంట్ల పాకెట్(అప్పట్లో ఇవే ఫేమస్ మరి) చేతికిచ్చి "ఆడుకోమ్మా" (పండగ చేసుకో అనే లెవెల్ లో) అని అనేవారు. అలాగే ఇంకెవరో అమ్మకి తమ్ముడి (కజిన్) వరస చుట్టాలు నన్ను గిర గిరా తిప్పేసి "అక్కా నీ చిన్న కూతుర్ని మటుకు నేను తీసుకెళ్తాను" అంటూ మనిద్దరం బొంబాయ్ వెళ్దామొస్తావా? అంటూ తెగ ముద్దు చేసేవారు. మా వారితో ఏవన్నా చిలిపి తగాదాలు వస్తే, అవి కాని, గాలి వాన అవుతున్నాయని అనిపిస్తే, ఈ సంఘటలు చెప్తాను వాతవరణాన్ని చల్లబరచడానికని. "నన్ను ఎత్తుకొని , గిర గిరా తిప్పేవారు , బోల్డు బోల్డు పిపరమెంట్లు తెచ్చేవారు తెలుసా" అని, తను ఉడుక్కొని "ఏవరు? ఏమిటి? " అంటే చెప్పేదాన్ని చివర్లో ."అప్పుడు నా వయసైదేళ్ళు ఆ వచ్చినది మా మామయ్య" అని. బావ- మరదళ్ళ విషయం అయితే చాలా హస్యం . ఇంకో 5 నిముషాలలో మా వారు నాకు తాళి కడతారు అని నేను ఎంతో బుద్దిగా తలవొంచుకొని కూర్చొంటే, మా మావయ్య కొడుకు దగ్గరికి వచ్చి, "నువు నన్నెంత మోసం చేసావో తెలుసా! నేను నీ గురించి ఎన్ని కలలు కన్నానో" అని చెవిలో చెప్తే , నా ముందు ఒక్కసారిగా అలలు ఎగసి , ఎగసి ఎత్తున వున్నా కొండలను తాకుతున్న ఫీలింగ్, హృదయం ఆక్రోశించింది(ఇది కరెక్టేనా?) . వృక్షాలన్నీ మోడువరినట్లుగా, ఎడారిలో ఎర్రటి ఎండలో పెద్ద వడ గాలి వీచినట్లుగా , నా హృదయాంతరాళాలు బద్దలయినట్లు ఫీలింగ్ వచ్చేసింది. "బావ! బావ! బావ! ఎంతపని చేసావు బావ! అసలు నాకెందుకు చెప్పలేదు బావ? నేనెప్పుడు కలలో కూడా అలా అనుకోలేదే, అయ్యో! పోని ఇప్పుడు తాళి కట్టొద్దని చెప్పనా?" అని అందామనుకొన్నాను, కాని అనలేదు. అనేలోపులో పక్కన కోలహలం వినిపించిది. మా బావలుంగారు ఎవరితోనో పందేం కాసాడట, నన్ను అవాక్కయీలా చేస్తానని. అదండీ సంగతి.

మరి ఇప్పటి/ఇకముందు తరానికి మనమీ మధురమైన, చిలిపి అనుభవాల్ని,అల్లర్లని ఇవ్వగలమా? అసలు భావి తరానికి బంధువులేరి? ఎవరో వేలు విడిచిన మేనమామలు, పిన్నులు అంటూ అప్పట్లో వచ్చేవారు కాని, ఇపుడసలు దగ్గిర వాళ్ళంటూ ఎవరు లేరు. ఆలోచిస్తుంటే బాధగా అనిపిస్తోంది. ఇంటికొక్కరు చాలు అనుకొంటున్న ఇళ్ళళ్ళో, ఆ ఒక్కరికి ఇంకో ఒక్కరు చేసుకొంటే, వారికి బంధువులేరి? బంధువులమీద ఎన్ని జోక్స్ వున్నా, ' బంధువులు రాబందులు' అని అనుకొన్నా, అసలు బంధువులంటూ లేకపోతే వూహించుకోడం కొంచం కష్టంగానే వుంది! ఇటు అమ్మా,నాన్న అటు అత్త, మామ వీళ్ళే బంధువులు అంతే. ఎంతో సున్నిత జీవన విధానానికి దూరమవుతోంది భావితరం. అవునా? ఆలోచించండి. పండగ అంటే పరవాన్నాలు, పిండి వంటలు కాదు. ఎక్కడో దూరాన వున్న అమ్మాయి, అల్లుడు, అబ్బాయి, కోడలు, మనవరాళ్ళూ, వెరసి పండగ సందడి. ఇంత సందడి ఇకముందు మనము చూడగలమా?
మనిషికి:
బంధువులు తలవాకిట దాక,
కొడుకు కొరివి పెట్టేదాక
బార్య కడ దాక అని అన్నారు.

బంధువుల స్థానం కాస్త తక్కువే అయినా, వారి ఉనికి మటుకు గొప్పదనే చెప్పుకోవచ్చు.. మరిప్పుడు ఆ తల వాకిట దాక కూడా రాడానికి ఎంతమందికి ఎంతమంది బంధువులు వున్నారు?

6 comments:

  1. ఔరా చిలిపి బావ ఎంత పనిజేశాడు!! :)

    ReplyDelete
  2. నిజమే రమణిగారు,

    పిల్లలను మనమే అన్ని ముఖ్యమైన ఫంక్షన్లకి తీసికెళుతూ బంధువులను పరిచయం చేయాలి. లేకుంటే వాళ్లకు ఎలా తెలుస్తుంది.. అప్పుడే వాళ్ళకు ప్రేమ , ఆప్యాయతలు తెలుస్తాయి. అలాగే ఎవరిని ఎలా గౌరవించాలి. అన్నీమనమే నేర్పించాలి .

    ReplyDelete
  3. diinigurimci caalaa raayaalani vumdi.viilu cuusukuni raastaanu.

    ReplyDelete
  4. ఇంకా ఎక్కుడున్నాయండి, ఈ "ఇ-రోజుల"లో బందాలూ, అనుబందాలూ, ఇప్పుడున్నవన్ని కేవలం 'మనీ'బందాలు" మత్రమే.

    ReplyDelete
  5. బంధువులు రాక పోకలు ఈ ఉరుకుపరుగుల జీవనవిధానంలో సాధ్యం కాదేమో?
    మీ పోస్టు మంచి ప్రశ్నలు లేవనెత్తాయి.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  6. ఇప్పుడున్నవన్ని కేవలం 'మనీ'బందాలు" మత్రమే. బాగా చెప్పారు ఒక్కముక్కలో.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...