10.28.2010

పదిహేనేళ్ళ పసిడిప్రాయానికి పసుపు(ఉరి)తాడు??

ఒంట్లో నలతగా ఉందని, ఇంటికి తొందరగా వచ్చేసాను ఈరోజు. ఇంట్లో ఎవరూ లేరు, పిల్లలు అమ్మావాళ్ళింటికి వెళ్తున్నామని, ఫొన్ చేసి చెప్పారు. బయట బాల్కనీలో చైర్ వేసుకొని, వేడి వేడి కాఫీ తాగుతున్నా! సన్నగా చినుకులు పడ్తున్నాయి. కరెంట్ కూడా ఉండనా? వద్దా? అన్నట్లుగా ఊగిసలాడ్తోంది, అందుకే బయట కాస్త చల్లగా ఉందని కూర్చొన్నా.. ఎదురు అపార్ట్ మెంట్లోంచి మాటలు వినిపిస్తున్నాయి, కొంచం అర్ధం అయి అవనట్లుగా, ఎందుకులే వినడం సభ్యత కాదని, వచ్చే పోయే వాళ్ళని చూస్తూ కూర్చొన్నా. ఇంతలో మరి సిగ్నల్ అందడం లేదో, మరింకోటో గాని ఎదురింటి అమ్మాయి బయటకి వచ్చి మాట్లాడుతోంది, అసలు మాట్లాడుతోంది అనేకన్నా అరుస్తోంది అనడం సబబేమొ. వినకూడదు అనుకొన్నా, నా ప్రమేయం లేకుండానే నా చెవిన పడ్డాయామాటలు.

"చూడు మామయ్య! బుద్ధిగా స్కూల్ కెళ్ళి చదువుకొంటున్న నన్ను, ప్రేమ అంటూ లొంగదీసుకొన్నాడు నీ కొడుకు, నిజంగా ప్రేమించాడో లేదో కాని, అమ్మ కాళ్ళమీద పడిందో, లేక నువ్వె జాలిపడ్డావో తెలీదు , పెళ్ళి చేసావు, నీకు తెలుసు పెళ్ళినాటికే నాకు మూడో నెల, ఇప్పుడు ఇద్దరు పిల్లలు, నాకీ రొగం వచ్చిందని వదిలేసి వెళ్ళిపొయాడు నీ కొడుకు, అతను వెళ్ళినందుకు నేనెమి బాధ పడడం లేదు, మహా అయితే ఇంకో 10 యేళ్ళు బతుకుతానేమొ, నా గురించి నాకు దిగులు లేదు, నా పిల్లల సంగతేంటి? నువ్వు రా ఇక్కడికి మాట్లాడుకొందాము. నా బతుకు నేను బతకగలను. ముక్కు పచ్చలారని నా పిల్లల్ని అన్యాయం చేయలేను. నా పిల్లలికో దారి చూపించండి చాలు ."

పూర్తిగా విన్న నేను, చేష్టలుదిగి ఉన్నాను. నేను కలలో కూడా ఊహించని మాటలవి. ఆ మధ్య వచ్చిన "10 క్లాస్", "నోట్ బూక్" లాంటి సినిమా ప్రభావాల వల్ల, ఈ అమ్మాయి స్కూల్ కి వెళ్ళి వచ్చే టైం కి అక్కడే కాపు కాసి, "నిన్ను ప్రేమిస్తున్నాను", అంటు వెంటపడి, లొంగదీసుకొని ఊరికి వెళ్ళిపోయాడని, అతనెవరో కాదు, వాళ్ళ అమ్మకి మేనల్లుడే అని, తల్లి తండ్రులు బతిమాలో, బామాలో 10 తరగతిలోనే ఆ చదువు కూడా పూర్తి చేయకుండా , పెళ్ళి చేసారని కొంచం కొంచంగా తెలుసు ఆ అమ్మాయి కధ.

ఎప్పుడు చూసినా, ఎవరితో ఒకరితో ఎదో పెద్ద ఆరిందాలా చేతులు తిప్పేస్తూ బాధ్యతలగురించి, పెళ్ళి, పిల్లల గురించి మాట్లాడేస్తూ ఉండడం వింటుంటే, కొన్నిసార్లు సరదాగా అనిపించి, నవ్వుకొంటూ విన్నా మరికొన్నిసార్లు ఎంటో బాధ అనిపించేది, చిన్న వయసు పెద్ద మాటలు అని.

ఇప్పుడు నిండా 20 యేళ్ళు ఉండవు, పెద్దగా పరిచయం లేదు కాని, దాదాపు చిన్నప్పుడు నుండీ చూస్తూనే ఉన్నా, చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళడం, డాన్స్ చక్కగా చేస్తుందని, ఎన్నో బహుమతులు గెలుచుకొన్న పసిడి మొగ్గ ఆ అమ్మాయి . వాళ్ళ అమ్మావాళ్ళు నిత్యం సాయి సన్నిధిలో ఉంటారు, వాళ్ళ ఇంటి సగం స్థలం కూడా సాయిబాబ గుడికని ఇచ్చారు.

ఈమధ్య ఎవరో చెప్పగా విన్నాను, చిన్న వయసులో పెళ్ళీ, పిల్లలు వల్ల ఆ అమ్మాయికి ఏదో ఆరోగ్య సమస్య వచ్చి, వంటినిండా ఏవో మచ్చలు వచ్చాయి అని, కాని ఏంటి అనేది ఇదిమిద్దంగా తెలీదు. అప్పుడప్పుడు బాల్కనీ లో నించొని వున్నప్పుడు, ఓ క్షణం అలా ప్రత్యక్షమై ఇలా మాయమయ్యెది, మధ్య మధ్యలో వాళ్ళ వాటాలోంచి మాటలు మటుకు గట్టిగా వినిపించేవి. ఏదో సంసారం గొడవలు అనుకొనేదాన్ని కాని, ఇప్పుడు ఈ ఫోన్ సంభాషణ విన్నాక నిజంగా చాలా బాధ అనిపించింది ఆమె పరిస్థితి తలుచుకొని, ఎంత పెద్ద ఆపదలో చిక్కుకుంది చిన్నపిల్ల అని . అతను వదిలేసి వెళ్ళిపోయడట, పైగా "నీకు రోగం వచ్చింది, నా వల్ల కాదునిన్ను చూసుకోడం" అన్నాడట.

ఆ 15 యేళ్ళ వయసులో పెళ్ళీ , పిల్లలూ, బాధ్యతలు ఎంతకి దారి తీసిందో, పైగా అబ్బాయి అయినవాడే, అయినా నావల్ల కాదు పొమ్మన్నాడు. సినిమా ప్రభావం మనిషిని ఎంతగా దిగజారుస్తోందో. సినిమా వాళ్ళ వ్యాపార దక్షత, ఇక్కడ చూసేవాళ్ళ ఆకర్షణాపరంపరలకి పెద్ద శిక్ష.

"8 క్లాస్ లో ఎవరో ఇద్దరమ్మాయిలు వాళ్ళ బాయ్ ఫ్రండ్స్ తో స్కూల్ నుండి ఇంటికి రాకుండా వెళ్ళిపోయారు" అన్న మాటలు వింటున్నప్పుడు, అసలేమి చెయ్యాలి ? పిల్లల్నిసినిమాలు చూడనివ్వకుండా ఆపాలా? లేక చదివించడం ఆపాలా? ఎమైపోతోందీ ఈ పసిడి వయసు అని అనిపిస్తోంది. పరిస్థితి చేతులు కాలే దాక వచ్చినప్పుడు తల్లి తండ్రులు మాత్రం ఏమి చెయ్యగలరు?

ఒక్కసారి ఇంట్లో పెద్దవాళ్ళు,స్కూల్ లో గురువులు ఆలోచించి , పరిష్కార మార్గాలు చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది అనిపిస్తుంది. హాస్టల్ లో ఉన్నా, ఇంట్లో ఉన్నా ఈ సినిమా ప్రభావం నుండి దూరంగా తీసికెళ్ళగలగాలి ఈ పిల్లలిని.

"మంచి తీసుకొని, చెడు వదిలేయండి" అని చెప్పడమంత సులువు కాదు వీరిని కాపాడుకోవడం అనిపిస్తుంది, ఒక్కోసారి ఇలాంటి సంఘటనలు వింటుంటే.

12 comments:

  1. సత్య హరిశ్చంద్ర సినిమా చూసిన కొందరు విధ్యార్థుల్ని ,"ఈ సినిమా ద్వారా ఏమి నేర్చుకున్నారూ?" అని అడిగితే,"అబద్దం చెప్పాలి. లేకపోతే అతగాడిలా కష్టాలపాలు కావాల్సి వస్తుంది" అన్నారట. అంటే సినిమా చూపించడమొక్కటే సరిపోదు, అందులో ఏంచూడాలో కూడా పిల్లలకు చెప్పాలి.

    ఆ సోషియల్ ఇంజనీరింగ్ ఈ మధ్యకాలంలో అసలు లేదు. పిల్లల చదువులు (అదీ ముఖ్యంగా ర్యాంకులు) తప్ప వారి జీవితాలు పట్టని తల్లిదండ్రులు ఒక వైపు, బూతులు తప్ప నీతులు లేని సినిమాలు మరోవైపూ కలిపి యువతను ఇలా ‘రహస్య ప్రేమల’ వైపుకు తోసి మంటలు రేపుతున్నాయ్.మీరు చెప్పిన అమ్మాయి ఆ మంటలకి బలైన ఒక ఉదాహరణ.

    ReplyDelete
  2. వామ్మో!మీ టపా చదువుతుంటే నాకు చాలా భయం/బాధ వేసింది.

    ReplyDelete
  3. సినిమాలొక్కటే కారణం కాదు. పైగా, వాటిని మనం నియంత్రించనూ లేము, సినిమాలు చూడకుండా పిల్లల్ని కళ్ళకు గంతలు కట్టి కూర్చోబట్టనూ లేము.
    అసలు సమస్య .. తలి దండ్రులకి పిల్లలతో ఎటువంటి అనుబంధం ఉంటోంది .. అని. నలత వస్తే మాత్ర వేసుకోవడం, ఇంజక్షను వేయించుకోవడం అనే సంస్కృతి తయారైంది. ఆరోగ్యంగా బతకడానికి కావలసిన డిసిప్లిన్ మాత్రం ఎవరికీ అక్కర్లేదు.
    మనం కనే పిల్లలు మన కుటుంబానికి, మన సమాజానికి, దేశానికీ, మానవాళికీ మనం పెట్టే పెట్టుబడి అనే స్పృహ ఎంత మందికి ఉంది?
    బైదవే, సినిమాల వల్ల పిల్లలు చెడిపోతున్నారు అనే ఆలోచన కూడ కొత్తది కాదు. ఎప్పుడో 60ల్లో వచ్చిన సుడిగుండాలు అనే సినిమాలో ఈ విషయం (తలిదండ్రుల బాధ్యత విషయం కూడా) చాలా బలంగా చెప్పారు.
    నేను గనక ఏదన్నా రాజ్యానికి నిరంకుశాధిపతినైతే, కనీసం ఒక ఏడాది పిల్లల పెంపకం శిక్షణ తీసుకుని, అందులో నూటికి నూరు సాధించిన వారికి మాత్రమే పిల్లలు కనే లైసెన్స్ ఇస్తాను!

    ReplyDelete
  4. పిల్లలు చెడిపోవడంలో తల్లిదండ్రుల పాత్ర వుందండంలో నాకు చాలా సందేహాలున్నాయి. ప్రతీ ఒక్కరూ తమ పిల్లల్ని మంచిగానే పెంచాలనుకుంటారు.దానికి తగినట్టుగా అన్ని అమర్చిపెడతారు.ఎవరయినా సరే తల్లిదండ్రులతో గడిపే సమయం చాలా తక్కువ.ఎక్కువ సమయం గడిపేది స్కూల్ లోనే[సమాజంతోనే].మంచి స్కూలా కాదా అని చూసి చేర్చడం ద్వారా తల్లిదండ్ర్లు తమ బాధ్యత కొంతవరకు నెరవేర్చుకున్నటే.మంచి సమాజాన్ని పరిచయం చేయడం అనేది మన పిల్లలు మంచిగా ఎదగాలనే కదా.అంతకన్నా వారు ఏమి చెయ్యగలరు?ప్రతీ నిమిషం నీడలా తిరగడం వీలవుతుందా?అలా చేసినా కూడా ఏదో తప్పు చెయ్యాలనుకునేవాళ్ళు కన్నుగప్పి చెయ్యడం ఎంత సేపు?వాళ్లని ఎంతవరకు అదుపులో పెట్టగలం? ఆంక్షలు ఎక్కువయ్యేకొద్దీ వాటిని చేధించాలన్న కోరిక బలపడుతుంది కదా.మరి పిల్లల్ని ఇలాంటి ఆలోచనల నుండి తప్పించడం ఎలా?మరి ఇందులో తల్లిదండ్ర్లుల తప్పు ఏముంది?

    ReplyDelete
  5. రమని గారు:

    ఆలోచించాల్సిన విషయం గురించి బ్లాగు చేశారు. ఈ సమస్యకు సత్వర పరిష్కారం నాకు తెలియదు గాని.. తల్లిదండ్రులే ముఖ్య పాత్ర పోషించాలి. ఆడయినా, మగయినా అవతలి వారితో మర్యాద గీత దాటకూడదని నచ్చజేప్పాలి. హద్దులు దాటి ప్రవర్తించే వారిని ఎదురుకోదానికి ఆత్మరక్షణ నేర్పించాలి. లేకపోతే ఆడుతూ పాడుతూ ఎదగాల్సిన వయస్సులో ప్రపంచాన్ని ఎత్తినేసుకోవాల్సి వస్తుంది.

    ReplyDelete
  6. @రాధిక గారు,పిల్లలు చెడిపోవడానికి తల్లిదండ్రులే కారణం అని చెప్పడం లేదుగానీ, చెడిపోకుండా చూడటంలో పాత్రవహించాల్సిన పిల్లల పట్ల ‘స్నేహం’ కొరవడిందని మాత్రం చెప్పొచ్చు.

    "ఆ"వయసు సమస్యలగురించి, భావాలగురించీ తమ పిల్లలతో ఓపన్ గా చర్చించే సంస్కృతి మన సమాజంలో లేకపోవడం ఈ పరిస్థితులకి కారణం కాదంటారా? తల్లిదండ్రులు పిల్లలు చెడిపోవాలని కోరుకోకున్నా, వారి అశక్తత, సమాజం ఈ విషయాలపై కల్పించిన ఇబ్బందికరమైన ‘సైలెంస్’ వీటికి కారణం కాదా?

    ReplyDelete
  7. నా దృష్టిలో 15, 16 ఏళ్ళ వయసులో వివాహాలు మంచివే. నానా అవసరాల దృష్ట్యా భవిష్యత్తులో అవి ఎక్కువవుతాయి కూడా ! అసలు బడిపిల్లలే ఆగలేకపోతున్న రోజులివి.

    అదీగాక ఇప్పటి తరంలో భార్యాభర్తల మధ్య గొడవలెక్కువ కావడానికి గల కారణాల్లో ప్రధానమైనది ఒకటి - ఇద్దరూ బహుబాగా ముదిరిపోయాక పెళ్లిచేసుకోవడం. ఎవరి చుట్టూ వారు బలిష్ఠమైన వ్యక్తిత్వాల గోడలు కట్టుకుని కలిసిపోవాల్సినంతగా కలవలేకపోవడం. సుదీర్ఘకాలం పాటు వేఱువేఱుచోట్ల పెఱగడంచేత ఎవరి పుట్టింటి సెంటిమెంటుకు వారు అంటుకుపోవడం.

    తత్ఫలితంగా ఇప్పుడు మన దేశంలో విడాకులు 24 శాతానికి చేరుకున్నాయి. వరకట్నాలూ, బార్యనుంచి సంపాదన లాంటి బాదరబందీలేవీ పెట్టుకోదల్చుకోకపోతే 16
    ఏళ్ళ అమ్మాయిని నిరభ్యంతరగా కోడలుగా తెచ్చుకోవచ్చు. తప్పేమీలేదు.

    ReplyDelete
  8. @ మహేష్ కుమారు గారు: నెనర్లు. "సినిమాలు చూపించడమొకటే కాదు, ఏం సినిమాల్లో ఏం చూడాల్లో వాళ్ళకి చెప్పాలి". చెప్తే వినేట్లున్నార పిల్లలు? ఉదా: "హ్యాపీ డేస్" నాకు నచ్చలేదు అని చెప్పినందుకు, నాతో మాట్లాడడం మానేసిన రోజులున్నాయి మా బంధువుల పిల్లలు. వాళ్ళని చూసి మన అభిప్రాయాలు మార్చుకొనే దుస్థితిలో ఉన్నాము, వాళ్ళకు చెప్తే వినడం అదీ ఈ రోజుల్లో అంటే అంత నమ్మ శక్యంగా లేదు, ముఖ్యంగా ఇలా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే ఒకప్పుడు, అంటే మా చిన్నప్పుడు మా తల్లి తండ్రులకి చెప్పాలని తెలియలేదు, ఇప్పుడు ఈ కాలంలో చెప్తే, అసలు మీకేమి తెలుసు అన్నట్లుగా పిల్లలు ఉన్నారు.
    @పూర్ణిమగారు : నెనర్లు. తల్లితండ్రులు బాధ్యత వహించాలి అన్న మీ మాటలకి నేను ఏకీభవిస్తాను.
    @ క్రాంతి గారు: నెనర్లు.కొత్తగా పెళ్ళయిన కోడెవయసు జంట కొన్నేళ్ళవరకైనా బ్లాగులు(ఇలాంటివి) చదవరాదంట(భయమేస్తోంది అన్నారని..).
    కొత్తపాళీగారు: నెనర్లు, నిజమే తల్లితండ్రులకి పిల్లల్ని పెంచడం లో ఒక అవగాహన రావాలి. కాని ఇప్పటి తల్లితండ్రులు ఎలా ఉన్నారంటే , మా పెద్దలు మాకు చెప్పలేదు మేము మీకేమి చెప్తాము అన్నట్లుగా ఉన్నారు. తీరా కొంతమంది చెప్పే ఉద్దేశ్యంలో ఉన్నా పిల్లలు అందనంత ఎత్తుకు ఎదిగి మీకెమి తెలుసు అనే విధంగా మాట్లాడుతున్నారు.
    రాధికగారు:నెనర్లు. మీకో చిన్న విషయం చెప్పాలండీ! స్కూలో ఎక్కువ టైం ఉంటారు కాబట్టి బాధ్యత టీచర్లదే అనేది ఒకసారి ఆలోచించండి. అక్కడ పరిస్థితి నాకు తెలీదు కాని ఇక్కడ స్కూల్ ఇప్పుడు చదువు చెప్పే సరస్వతీ దేవాలయం ఎంతమాత్రం కాదు. ఎంత డబ్బు తెస్తే అంతే చదువు చెప్తాము. పుస్తాకాల్లో ఉన్న పాఠ్యాంశాలు పూర్తి చేయడానికే వాళ్ళకి టైం సరిపోవడం లేదు ఇక మన పిల్లలికి బుద్ధులేమి చెప్తారండీ ఇప్పటి ఉపాధ్యాయులు? ఇదివరకు మేము చదివేప్పుడు మోరల్ క్లాస్ అని ప్రత్యేకంగా ఉండేది. ఆ క్లాస్ లో అసలు ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎలా మసలుకోవాలి? అనేవి చెప్పేవారు. ఇప్పుడు అసలు అలా ప్రత్యేక క్లాసులంటూ ఏమన్న ఉన్నాయా? అలాంటప్పుడు మన పిల్లల్ని అంత వ్యాపారత్మక ధోరిణీలో ఉన్న స్కూల్ "వాళ్ళు చెప్తార్లే" అని ఎంతవరకు గుడ్డిగా నమ్మగలము? మనమే గురువులుగా, తల్లితండ్రులుగా వాళ్ళకి చెప్పాలి మన బాధ్యత. చెప్పడమే మన ధర్మ వినకపోతే వాళ్ళ ఖర్మ అనుకోవడమే.
    తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు: నెనర్లు. మా పాప చిన్నప్ప్పుడు బుడి బుడి అడుగులు వేస్తూ అప్పుడే వచ్చి రాని మాటలు మాట్లాడుతున్నప్పుడు, చూసి మురిసిపోయి, చ! ఇది పెద్దయ్యాక ఎవరికో ఇచ్చి పెళ్ళి చేసి, అక్కడ పాప కష్ట పడుతుంటే చూసి మనము బాధ పడాల్సిందేనా? ఇంత మురిపెంగా చూసుకొంటున్నాము, 15 యేళ్ళు రాగానే పెళ్ళి చేసి, ఇల్లరికం అల్లుడిని తెచ్చుకొని ఇక్కడే ఉంచుకోవాలి అని అనుకొనేదాన్ని, కాని, ముక్కుపచ్చలారి పాపని అలా ఎలా 15 సంవత్సారలకే పెళ్ళి చేయగలము? మనకి వీలయితే నెమ్మదిగా చెప్పుకోగలగాలి అన్నది నా అభిప్రాయం, లేదా వాళ్ళని ఎటువంటి పరిస్థితి వచ్చినా నిలబడి ఎదుర్కోగలిగే ధైర్యం ఇవ్వగలగడం అంతే కాని, పెళ్ళి చెసేసి అత్తారింటికి పంపితే, అక్కడ అటువైపు పిల్లాడు చిన్నవాడే, అప్పుడు అత్తగారింటి లో పెద్దవాళ్ళ ఆరళ్ళు ఎక్కువగా ఉంటాయి కదా. అర్ధం చేసుకొనే వయసా? ఇటు 15 16 యేళ్ళ పాపకి గాని,అటు 20 22 యేళ్ళ బాబు కి గాని, అపార్ధాలు, గొడవలే ఉంటాయి వాళ్ళకి అంత చిన్నవయసులో. అలా కాకుండా కుటుంబాల మధ్య సయోధ్య ఉంటుంది అని నమ్మకముంటే, మీరన్నట్లు చిన్నవయసులో పెళ్ళిళ్ళు ఒకే. కాని 1% కూడా అంతటి సయోధ్య ఉందని నేను అనుకోవడం లేదు.

    ReplyDelete
  9. మీరు సుపరిచితమైన వాదనని ముందుకు తెచ్చారు. మీరలా అనుకోవడం సహజమే. కాని, I have n't seen anybody so far who is giving a serious thought to the raging problem of court cases and divorces. ఇది భవిష్యత్తులో అందరినీ invalidate and irrelevant చేస్తుంది.

    An old culture is getting replaced but none is emerging in its place.

    ReplyDelete
  10. అవును నిజమే తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు! వాదన సుపరిచితమే అయినా, వాదననుండి పుట్టుకొచ్చే పాయింట్లు మటుకు ఎప్పటికప్పుడు కొత్తగానే ఉండి కొత్త పరిష్కారం మార్గాలు చూపెడుతున్నాయి. ఆచరించే యోగ్యమైతే ఆచరించడానికి వీలుగా. నావరకు 15 యేళ్ళకి పెళ్ళి చేసి పిల్లల్ని, మన దగ్గరే ఉంచుకొని వాళ్ళు చదువుతాను అన్నంతవరకు చదివించి, అన్ని తెలిసిన తరువాతే అత్తరింటికి పంపడం ఉత్తమమైన పద్ధతి అని అర్ధమయ్యింది ఈ వాదన ద్వార. కాని, ఎటొచ్చీ, పిల్లలు తరువాత “అదిగో చిన్నప్పుడే మాకు పెళ్ళి చేసేసారు, మాకంటూ అభిప్రాయాలు ఉన్నాయి అని చెప్పే స్వతంత్రత లేకుండా" అని అడగనంతవరకు అది మంచిదే. సమానత్వం అనే వ్యక్తిత్వ బేధాలు లేనంత వరకు కూడా ఇది సబబె. ఇక్కడున్న మైనస్ పాయింట్ ఏంటంటే, మీరన్నట్లుగానే బడిపిల్లలే ఆగలేని రోజులు కాబట్టి, పెళ్ళి చేసిన తరువాత వాళ్ళని చదివించగలమా? మన దగ్గర ఉంచుకోగలమా? అంతులేని వాదనే ఇది.

    ReplyDelete
  11. em cheppinaa vaLLu chepparu ani manam maaripomu kadanDi... mana vaLLu kuDa komchemn alochimchali kadaa... arey vaDu edo chesasesaDu manam kudaa cheddam anukumTe elaa.... alaa antey cinema llo konni konni manchi vishayaalu kuDa vumTayi vaaTini emduku paaTimcharu mari.

    ReplyDelete
  12. aa ammayi ki emanna cheyyagalama andi?

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...