3.26.2009

గుర్తుకొస్తున్నాయి..



నిన్న సాయంత్రం మా పాప ఎదో డాన్స్ ప్రోగ్రాం అంటూ తెగ హైరానా పడిపోతోంది. ఎక్జామ్స్ ఓ పక్క , "ఇప్పుడీ డాన్స్ ఎంటీ" అని కోపంగా అడిగే(కసిరే)సరికి, పాపం! ఒక్కసారిగా బేల మొహం పెట్టేసి, "అసలు నీకేమి తెలుసమ్మా! మా స్కూల్ లో farewell party ఉంది అసలు నీకు ఆ పార్టీ అంటే ఎంటో తెలుసా? మళ్ళీ రమ్మంటే వస్తారా 10th class అక్కలు?" అని అడిగేసరికి నాకు చాలా బాధ అనిపించింది. 10th class... ఒకవిధంగా బాల్య జీవితానికి, స్కూల్ జీవితానికి ముగింపు, ఇంకా చెప్పాలంటే అది ఒక టర్నంగ్ పాయింట్ జీవితానికి. "సర్లే చేసుకో కాని, చదువుని నెగ్లెక్ట్ చేసావంటే ఊరుకొనేది లేదని చెప్పి, నా పనులలో పడ్డాను. ఇంట్లో పనులయితే చేస్తున్నా కాని, మనసు మటుకు నా దగ్గిర ఉండనని ఒకటే గోల, మేము చదువుకొన్న స్కూల్ వైపు వెళ్ళోద్దాం రా! అని మారాం చేసింది. ఇక నాకు మనసు మాట వినక తప్పట్లేదు. మరి ఒక్కసారి అలా మా స్కూల్ దాకా వెళ్ళొస్తా! ప్లీజ్ ఇక్కడే ఉండండి.. ప్చ్! కుదరదా మీకు? సరె అయితే నాతో పాటు వచ్చేయండి, కలిసే అనుభవాలు నెమరేసుకొందాము.

*****

10th class farewell party , అప్పుడప్పుడే ప్రిఫైనల్స్ రాసి, ఇంకా పరీక్షలకి ఎంతో కాలం లేదనగా ఇక మళ్ళీ కలవరని వారికి వీడ్కోలు చెప్దామనే ప్రయత్నం ఈ పార్టీ. అప్పట్లో తెలియలేదు కాని, ఇలా వీడ్కోలు చెప్పడం అనేది నిజంగా బాధే అందులో కల్మషం లేని వయసులో మొదటినుండి ఒక పది సంవత్సారాలు ఒకే స్కూల్లో చదివిన వారు విడిపోతున్నారు అంటే.. మళ్ళీ అంతటి స్వఛ్చత , అంతటి స్నేహశీలత దొరుకుతుందా మనకి? రంగు రంగుల సీతాకోక చిలకల్లా రెడి అయి వచ్చిన ఆ తరగతి వాళ్ళు ఇక కాలేజ్ చదువులకి వెళ్తారు అంటే , అప్పట్లో తొమ్మిదో తరగతిలో ఉన్న మాకు అబ్బా! మాదెప్పుడు అయిపోతుందో అన్న భావన కలుగుతుంది. అందుకే ఈ ఆలోచనలు కలిగినప్పుడూ ..ఒక్కోసారి అనిపిస్తుంది కాలం ఒక్కసారి వెనక్కి వెళ్తే బాగుండును. ఏ అనుభూతిని ప్రోది చేసుకోలేకపోయాము. ఇంకోసారి అవకాశం దొరికితే దానిని సద్వినియోగం చేసుకోవాలి అన్న ఆకాంక్ష కలుగుతుంది. మరిచిపోలేని మధుర క్షణాలవి. అలాంటి పార్టీని మేము ఒక చిన్న నాటిక వేసి, మా సీనియర్స్ 10th వాళ్ళని అలరించాము.

"కల కాదిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలిచేయకు..." అన్న పాటని అదే ట్యూన్ ని అలా సాగించి, మా తెలుగు టీచరు రాసిన పాట, పూర్తిగా గుర్తులేదు కాని, "విడలేమని, విలువైనదని, స్నేహం మరువద్దనీ .. అలా ఒక గ్రూప్ సాంగ్ పాడాము. పాట చివర్లో మటుకు నిజమైన పాటలో లా "ఏది తనంత తాను నీ దరికి రాదు శోధించి , సాధించాలి" అని ముగించాము. అంతా ముగించే సరికి అక్కడ హాలంతా వెక్కిళ్ళే, "మేము వెళ్ళము టీచర్" అంటూ 10th వాళ్ళంతా టీచర్లని పట్టుకొని ఏడ్చేస్తుంటే.. ఆ వీడలేమనే వీడ్కోలు ఇది చెప్పడానికి నాకు పదాలు కూడా కరువవుతున్నాయి. నిజానికి మనం ఆ స్కూల్ నించి వెళ్ళిపోతున్నాము అనే బాధ కన్నా ఇన్ని హంగులు ఆర్భాటలతో పంపించబడుతన్నాము అన్న బాధ చెప్పనలవి కానిది. ఆ తరువాత సంవత్సరానికి ఆలాగే ఆ స్కూల్ నిండి మేము కూడా సాగనంపబడ్డాము., అంతే హంగు ఆర్భాటాలతో..

ఇదంతా ఒక ఎత్తయితే చివర్లో మేమందరం మా టీచర్ల దగ్గిర తీసుకొన్న ఆటోగ్రాఫ్ లు. అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పేవాళ్ళే అయితే మా తెలుగు టీచరు రాసిన ఆటో గ్రాఫ్ కొంచం ప్రత్యేకంగా ఉంది.

"ఇచ్చుటలో ఉన్న హయి వేరెచ్చటనూ లేనే లేదు. మరి ఆ ఇచ్చినది పుచ్చుకొనేప్పుడు మన వంతు కర్తవ్యం మనం నెరవేర్చాలి. దేవుడు మనకీ జన్మ ఇచ్చాడు, మానవ జన్మని మనం పొందాము. మరి ఆ దేవుడికి సదా కృతజ్ఞులై ఉండాలి. మీ జీవితం సన్మార్గంలో నడవాలంటే దేవుడిని మరవద్దు.. ఆయనని కీర్తించండి" అని .....

ఒక నాలుగు మాటలు చెప్పారిలా..

"కృతజ్ఞత ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు, ఒకళ్ళు వద్దంటే పోయేది కాదు. తల్లి తండ్రులకైనా,గురువులకైనా, శ్రేయోభిలాషులకైనా ఈ సారీలు , కృతజ్ఞతలు చెప్పడం అంటే, దాని అర్థం వాళ్ళు మనకి మార్గదర్శకులు కాబట్టి మనం తప్పటడుగులు వేస్తున్నపుడే ఎక్కడ తప్పుటడుగులు వేస్తామో అని జాగ్రర్త వహించేవారు కాబట్టి , వారికి మన ప్రేమతో ఆకట్టుకోగలగాలి కాని , ప్రతి రోజు కృతజ్ఞతలు చెప్పాల్సిన ఆవకశ్యత లేదు. మన ఉన్నతి, మంచి నడవడికే వాళ్ళని గౌరవించడం, ప్రేమించడం, వాళ్ళకి కృతజ్ఞత చూపించడం./చెప్పడం లాంటిది. అలాగే మనం తెలియక చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ఉంది కాని, తెలిసి చేసే తప్పు ఒక ’సారీ’ తో సమసిపోదు. అలా అని మన స్వయకృతాపరాధం తెలుసుకుని కూడా అదే దారిలో పయనించి, గొప్ప ఉన్నతినో గొప్ప పేరునో సంపాదించేసి మా ఉన్నతి చూడండి, అంటూ మా టీచర్ల దగ్గరికి వచ్చి "థాంక్స్" అని చెప్తే , అది చెల్లని రూపాయి నాణెంతో సమానం. మీ రందరూ ఇప్పుడు మీదైన ప్రపంచంలో అడుగుపెడ్తున్నారు. ఇప్పుడిది టర్న్ంగ్ పాయింట్. అందరికి good luck " అని ముగించారు.

కళ్ళనీళ్ళతో వీడలేమంటూ వీడుకోలంటూ బయటికి వచ్చాము. ఇప్పుడందరూ ఎక్కడెక్కడ ఉన్నారో, ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఒక పది సంవత్సారాలు కలిసి ఉన్నవాళ్ళము మేమంతా....

****

మిత్రులొకరు "మనిషి జీవితమే అశాశ్వతమైనప్పుడు, ఇహ మధుర క్షణాలు శాశ్వతమవుతాయా? అని ప్రశ్నించినందుకు.. పాప farewell party ఇస్తున్న సందర్భం... నా చిన్నప్పటి పార్టీ అనుభవాలు , మా టీచర్ "ఇచ్చుటలో ఉన్న హయి" అన్న హిత భోధ వెరసి ఈ ’గుర్తుకొస్తున్నాయి ’ పోస్ట్. మరి నా farewell party మధుర క్షణాలని ప్రోది చేసి మాలిక చేసి ఈ సుమ మాల లో పేర్చలేదూ..? ఇది శాశ్వతం కాదంటారా? మనిషి జీవిత కాలాన్ని శాసించలేముకాని, నా బ్లాగు జీవిత కాలంలో ఈ మధురక్షణాల నుదిటి రాత నేనున్నంత కాలం నాదే కదా అంటే నా చేతిలో ఉన్నదే కదా.. ఎన్నాళ్ళు కావల్సి వస్తే అన్నాళ్ళు. కాదంటారా? మరి మీరు కూడా మీ 10 వ తరగతి వీడ్కోలు కి సంబంధిన అనుభవాల్ని,అనుభూతుల్ని పంచేసుకొండి.
*******
Justify Full

2 comments:

  1. నా పదవతరగతి వీడ్కోలు అనుభవాలూ ఇప్పటికీ గుర్తున్నాయి . అప్పుడప్పుడూ మా పదవతరగతి స్నేహితులను కలసి నప్పుడు నాకెంతో సంతోషంతో వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టు ఉంటుంది . అప్పుడు మేము చేసిన అల్లరి ఇప్పటికీ తీపి గుర్తులే.

    ReplyDelete
  2. అదే౦టే! అసలు విషయ౦ మర్చిపోయావా.మీరొక నాటక౦ వేసారూ, అ౦దులో నువ్వు పొడుగ్గా వు౦టావని కర్ర పట్టుకుని తాత వేష౦ చాలా బాగా వేశావు కదా ఆ వేష౦లో నువ్వు బాగున్నావని మేమ౦తా పొగిడాము గుర్తొచ్చి౦దా!ఆ అనుభవాలు జీవిత౦లో మరిచిపోలేని అనుభూతులు.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...