9.28.2010

తల్లడిల్లే వేళా.. తల్లి పాడే జోలా..

పాల కన్నా తీపి పాపాయికి..
చిన్నప్పుడు అమ్మమ్మ అలా పట్టెమంచం మీద కూర్చుని కధలు చెప్తుంటే కళ్ళప్పగించి, చెవులు రిక్కించి, నోళ్ళు వెళ్ళబెట్టి వినేవాళ్ళము,అంత ఆసక్తి గా చెప్పేది. వేసవి సెలవలకని వెళ్ళేవాళ్ళము. అమ్మావాళ్ళు నలుగురు అక్కచెళ్ళెళ్ళు, ఒక అన్నయ్య వీరందరి పిల్లలు ఒక్కొక్కరికి ఆరుగురు చొప్పున లెక్కపెట్టినా మొత్తం అందరం పాతికమందిదాకా వుండేవాళ్ళము ఇక సందడే సందడి. చాల సరదాగా వుండేది. నలుగురు అక్కచెళ్ళెళ్ళూ వంట పనిలో హడావిడి గా వుండేవారు. పిల్లలందరికి అమ్మమ్మ కాపలా. కధలతో మమ్మలందరిని కట్టిపడేసేది ఆవిడ. అదేవిటో ! ఆ రామాయణం ఎంతకి తరిగేది కాదు ఎప్పుడూ హనుమంతుడు లక్ష్మణుడి కోసం సంజీవని పర్వతం తీసుకొని రావడం దగ్గిర ఆగిపోయేది. పిల్లలెవరో వినలేదంటూ మళ్ళీ మొదటి నుండీ చెప్పుకొచ్చేది. అలా ఆవిడ చెప్పిన కధలు మాని భోగి, వెర్రి వెంగళప్ప, ఒక రాజు ముగ్గురు కూతుళ్ళూ కధలు గుర్తుండిపోయాయి. ఇవన్నీ కాస్త మాకు వూహ వచ్చాక చెప్పిన కధలే. ఇక పాటల సంగతి చెప్పనక్కర్లేదు. జోల పాట దగ్గరినుండి మంగళహారతి పాట దాక అన్ని పాటలు నలుగురు అక్కచెళ్ళెళ్ళకి కరతలామలకమే. ఆస్వాదించే మనసుండాలి కాని అప్పటి పాత హీరోయిన్లు గుర్తొస్తారు వాళ్ళ పాటలయితే ఏంటి, మాటలయితే ఏంటి వింటుంటే.(కాసింత కళాపోషణ ఉంటే).
ఇప్పుడు ఈ ఉప్పొద్ఘాతమేంటి అని ఆలోచిస్తున్నారా? వస్తున్నా.. పాయింట్ కే వస్తున్నా. అప్పటి రోజులు అలా పెద్దవాళ్ళు చెప్పే కధలతోనో లేదా వాళ్ళు పాడే పాటలు వినడం తోనో సరదాగా గడిపేవాళ్ళము. కాని, ఇప్పటి పిల్లలికి అసలు మన చెప్పే కధలు కాని, పాటలు కాని వినే తీరిక కాని వుందంటారా? ఎంతసేపు వాళ్ళకి ఇచ్చే బండెడు హోంవర్క్ చేసుకోడంతోనే సరిపోతోంది. కనీసం వాళ్ళకి చెప్పే పాఠాలు చదివే తీరిక, కోరిక, ఓపికా కూడా వాళ్ళకి వుండడం లేదు. కాస్త తీరిక సమయం దొరికితే కంప్యూటర్ ముందు కూర్చుని ఆటలు లేదా ఆ టి.వి. లో కార్టూన్స్ ఇవి తప్పితే వేరే వ్యాపకాల జోలికి వెళ్ళడం లేదు. మరి పిల్లలు ఇన్ని వ్యాపకాలతో ఇంత బిజీ గా వున్నప్పుడు తన తల్లి ఏ కధ చెప్తోంది? ఏ పాట పాడుతోంది? అనే ఆలొచనల జోలికి పిల్లలు వెళ్ళలేరు, ఫలనా హోంవర్క్ చూసి ఫలనా టీచరు ఏమంటుందో ? లేదా ఫలనాది చదువుకోలేదు ఆ టీచర్ కొడ్తుందేమో అన్న ఆలోచనల వల్ల కలిగే భయం తల్లిని తన దగ్గిర వుండమనో తనదగ్గిర పడుకోమనో చెప్పెట్లుగా చేస్తాయి. అలా ఇద్దరూ ఒకచోట వున్నప్పుడు, కలిగే నిశ్శబ్ధం వల్ల మళ్ళీ రేగే భయం లాంటి ఆలోచనలు తల్లిని పాట పాడమనో లేదా కధ చెప్పమనో అడిగేలా ఉసిగొల్పుతాయి. ఉ.. కొడ్తూ నిశ్చింతగా నిద్రపోడానికి చేసె చిన్ని మనసుల అతి చిన్ని ప్రయత్నమది. అంతే కాని తల్లి ఏ కధ చెప్తుందో ఈ పాట పాడుతుందో అనే ఆలోచన కాదది. మరి అలాంటప్పుడు తన బాబు ఆ పూటకి నిద్రపోతే చాలులే , చాల అలిసిపోయి వున్నాడు అని తల్లి మర్నాటి తన ఇంటి యువరాజు ఏమిచేస్తాడో చెప్పడం అనేది యాదృచ్చికంగా జరిగేదే కాని, కావాలని చెప్పడం జరగదు. ఆ తల్లికి నిజంగా కధలు వస్తే కధలు చెప్తారు . ఆ నిముషంలో తనకి కధలు వచ్చా లేదా పాటలు వచ్చా, అని ఆలోచించదు తల్లి మనసు. ఒక్కటే ఆలోచన బాబు పడుకోవాలి అంతే.
ఈ సంధర్భంగా మీకో చిన్న ఉదాహరణ చెప్పాలి. మా బాబు చదువు విషయంలో చాలా టెన్షన్ పడిపోతుంటాడు. బాగానే చదువుతాడు కాని భయం ఎక్కువ తనకన్నా ఇంకెవరో బాగా రసేస్తారు అనే భయం ఎక్కువ వాడికి. అందుకే చిన్న చిన్న స్లిప్ టెస్ట్ లకి కూడ వాడు మూడింటికి, రెండింటికి లేచి చదివేస్తూ వుంటాడు, అదిగో అలాంటప్పుడు నన్ను లేపేసి అమ్మా! ప్లేజ్ నా దగ్గిర వుండవా! అంటూ తన దగ్గిర కూర్చోబెట్టుకొంటాడు తోడుగా. ఎన్నోసార్లు ధైర్యం చెప్పాను వాడికి, అయినా వినడు. ఒక్కోసారి వాడే మైండ్ డైవర్ట్ చేసుకోడానికో ఏమో అమ్మా! ఎమన్నా మాట్లాడు అంటాడు. పాట పాడనా నాన్న!! అంటు పాట పాడి (నా గొంతు అస్సలు బాగోదు. కాని ,నేను ఆ క్షణం ఆలోచించేది బాబు పడుకోవాలి ప్రశాంతంగా నిద్రపోవాలి అన్నదే నా ఆలోచన ) వాడు నిద్రపోయే ప్రయత్నం చేస్తాను తప్పితే నా గొంతు బాగుందా లేదా అని నేను ఆలోచించను.
అసలు అమ్మ చెప్పేది తెలియని వూహ లేని వాళ్ళకి ఇక ఈ పాటలు, కధలు అస్సలు అవసరం లేదు తోడుగా పక్కన వుంటే చాలు వాళ్ళకి. కాని కాస్త వూహ తెలిసిన పిల్లలికి మాట కూడ ఒక కధ రూపేణా వుండాలి. ఇక పాట అయితే వాళ్ళ తల్లడిల్లే మనసులని సేద తీర్చేలా వుండాలి అని నా అభిప్రాయం మరి మీరేమంటారు??

7 comments:

 1. మాగంటి వంశీగారు రాసిన టపా చదివినతరువాత ఇలా రాయాలనిపించింది. వంశీ గారి వేదన అర్ధమయ్యింది. తెలుగు కధలు నిజంగానే మరుగున పడిపోతున్నాయి. వీటి స్థానే మాములు మాటలు కధలు గా రూపు దిద్దుకొంటున్నాయి అంటే బాధ అనిపించింది. కాని, ఆలోచిస్తే పిల్లలికి మటుకు వినే తీరిక ఏమాత్రం వుంది అనిపించింది.అంతేనంటార వంశీ గారు?

  ReplyDelete
 2. నేను మీతో పూర్తి గా ఏకీభవిస్తాను.నాకూ మూడేళ్ళ కొడుకు వున్నాడు.వాడికి మాటలే సరిగా రావు.ఇంగ్లీషే అంతంత మాత్రం గా మాట్లాడుతాడు.ఇంక తెలుగు ఎలా నేర్పాలి?అందుకే నేను ఎంచుకున్న మార్గం రోజువారీ పనులని,వాడు ఏమి చేస్తాడో,ఎలా చేస్తాడో అన్నీ ఇంగ్లీషు లో చెప్పి వెంటనే తెలుగులో చెపుతాను.అలా వాడికి కొన్ని తెలుగు మాటలకు వచ్చాయి.ఇప్పుడు వాడికి సాధారణం గా రోజువారీ జీవితం లో వాడే మాటలకి చాలావరకు అర్ధం తెలుసు.కానీ తెలుగులో బదులు ఇవ్వలేడు.లేదు,వద్దు,కాదు లాంటి చిన్న పదాలు తప్పించి తెలుగులో మాట్లాడలేడు.ఈ మాటల కార్యక్రమం అయ్యాకా పద్యంతోనో,శ్లోకంతోనో రోజు ముగుస్తుంది.అలా అని రోజుకొకటి కాదు.నెల రోజులకొకటి.రమ గారు చెప్పినట్టు పిల్లలు రోజూ ఒకే కధని/పనిని/సినిమాని/పద్యాన్ని చెప్పడానికి/చూడడానికి ఇష్టపడతారు.
  భాషే రాని/తెలియని వాడికి కధలు చెపితే ఏమి అర్ధం అవుతుంది?

  ReplyDelete
 3. చాలా థాంక్స్ రాధిక గారు నాతో ఏకీభవించినందుకు. నెవేదన బ్లాగ్ లో మీ వ్యాఖ్య చదివాను, పోటీ అయ్యేదాకా ఎందుకండీ? ఎవరి ప్రత్యేకత వారిది. పోటికోసం అని మనసులో పెట్టుకోకుండా మీరు కధ ప్రచురించండీ. పోటి కోసమా కధలు అని నాకనిపిస్తోంది..మీ కవితల్లాగే మీ కధకి కూడ మంచి ప్రాచుర్యం వుంటుందని నా మనసు చెప్తోంది మీ కవితలు చాలు కధ గురించి చెప్పడానికి. (ఒక్కమెతుకు చాలు అన్నము వుడికిందో లేదో చూడడానికి) మీ తెల్ల కాగితం కధ కోసం ఎదురు చూస్తూ... WISH YOU ALL THE BEST.

  ReplyDelete
 4. ఇలాంటి విషయాల పైనే నా గోడు ఇక్కడ.
  http://telugu4kids.wordpress.com/2008/03/05/%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b0%ae%e0%b0%be%e0%b0%ae-%e0%b0%95%e0%b0%a5%e0%b0%b2%e0%b1%81-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%81-%e0%b0%aa%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2/

  నేను రాసిన కథ ఇక్కడ.
  http://telugu4kids.wordpress.com/2008/03/05/%e0%b0%85%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%a6%e0%b1%8a%e0%b0%82%e0%b0%97%e0%b0%be/

  రాధిక గారు, మీ కథ కోసం waiting.

  ReplyDelete
 5. Rama garu

  What you said is perfectly right and acceptable. But what mrs.radhika says is outrageous."ఇంగ్లీషే అంతంత మాత్రం గా మాట్లాడుతాడు.ఇంక తెలుగు ఎలా నేర్పాలి?". This is how our telugu people think. Congrats, one more more addition to the ploughed land. I being a mother of 2 yr old and a 5 yr old I never taught to my kids english in the first place. But it's mrs radhika's choice.

  Kavitha

  ReplyDelete
 6. కవితగారు చాలా థాంక్స్ అండీ నాతో ఏకీభవించినందుకు. రాధికగారు అన్న మాటలు తప్పుగా అర్ధం చేసుకోవద్దు. ఆవిడ ఉండేది ఇక్కడ కాదు ఎక్కడో పరాయి దేశంలో ఉంటున్నారు. ఆ దేశంలో వాడుకగా మాట్లాడే భాష ఇంగ్లీష్ కావడం వల్ల ఆవిడ అలా అన్నారు. అదే నేనయితే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కాబట్టి వాడికి తెలుగే సరిగ్గా మాట్లాడడం రాదు అనేదానిని. ఇంకో విషయం బాబు కి ఇంకా మూడే ఏడే కాబట్టి ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకొంటున్నాడు. అందుకే ఆవిడ అన్నారు రోజు ఒక పద్యంతోనో ఒక శ్లోకంతోనో ముగుస్తుంది. బాబుకి తెలుగు నేర్పడానికి చేసే ప్రయత్నంలో భాగమే కదా .. మీరొకసారి రాధికగారి బ్లాగ్ చూడండి తెలుగు కవితలలో ఆవిడది అందె వేసిన చేయి.

  ReplyDelete
 7. నేను రాసిన దానిలో ఇంత తప్పుగా అర్ధం వస్తుందని అనుకోలేదు.కవిత గారూ నేను చిన్నప్పటినుండీ మా అబ్బాయికి తెలుగే నేర్పూన్నాను.మెమౌ ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటాము.కానీ మా అబ్బాయి మాటలు మొదలు పెట్టే వయసుకి ప్లేయ్ స్కూల్ కి వెళ్ళేవాడు.రోజులో 8 గంటలు వాడు ఇంగ్లీషువాళ్ళతోనే వుండాల్సి వచ్చేది.ఇంటికి వచ్చాకా నాతో గడిపే సమయం మహా అయితే 3,4 గంటలు.ఆ కొద్ది సమయం లో కూడా ఇంటికి వచ్చేపోయే,ఫోనులో మాట్లాడే పర రాష్ట్ర భారతీయుల వల్ల వాడు చాలా వరకూ ఇంగ్లీషే వినవలసి వస్తుంది.వాడికి మాట్లే సరిగారానందువల్ల ఇంత ఇంగ్లీషులో బ్రతుకుతున్నా వాడికి అది కూడా రాలేదు అని చెప్పాలని నా ఉద్దేస్యమండి.నిజానికి మనం ఎంత చేసినా,ఎన్ని చేసినా ఇక్కడి పిల్లలకి తెలుగు నేర్పడం,వాళ్ళని తెలుగులో మాట్లాడించడం చాలా కష్టమయిన పని.[ఇది అనుభవ పూర్వకం గానే తెలుస్తుంది.ఏదీ చెప్పేటంత సులభం కాదు].ఇప్పుడు మావాడి ప్రీ స్కూలు నుండి నాకొచ్చే కంప్లయింట్ ఏమిటో తెలుసాండి?ఇంగ్లీషులో తెలుగు పదాలు వాడుతున్నాడని.మై అమ్మా కమ్మింగ్,వాట్ హేపెండ్ కి బదులు ఏమి హేపెండ్ అని ఇలా మాట్లాడుతున్నాడని.నేనిప్పుడు ఏమి చెయ్యాలో మీరేమన్నా సలహా ఇవ్వగలరా?

  ReplyDelete

Loading...