9.21.2010

హ్హ! హ్హ! హ్హ

"నవ్వవయ్యా బాబు...నీ సొమ్మేం పోతుంది"?

నవ్వు నాలుగు విధాల చేటు అంటారు కాని, నవ్వు నలబై విధాలా రైటు అనిపిస్తుంది. ఏ మాట కా మాట చెప్పుకోవాలి. "నవ్వు" అనేది మనిషికి దేవుడిచ్చిన వరం. "నవ్వు" గురించి క్లాస్ పీకేస్తున్నాను అనుకోకండి. ఏదో నాకు తెలిసింది మీతో షేర్ చేసుకొందామని..

"ముసలివాళ్ళు అవడం వల్ల నవ్వడం ఆపేసాము అని అనుకోకూడదట. అసలు నవ్వడం ఆపేయడం వల్ల వాళ్ళు ముసలివాళ్ళు అయ్యారేమో" అని ఆలోచించాలట.
కొంతమందిని చూస్తే అనిపిస్తుంది అసలు , వీళ్ళకి నవ్వడం తెలీదేమో అని. ఈ నవ్వు అంటే నాకోకటి గుర్తోస్తోంది.
సరిగ్గా ఆరునెలల క్రితమనుకొంట, అదేదో ఛానెల్ లో "మిసెస్స్ లావుపాటి సుందరి" అని , ఒక టైటిల్ తో ఎదో ప్రొగ్రాం నిర్వహించారు. అది చూసి మావారు నేనెక్కడ పాల్గొంటానో అని, చాల కొంచం భయపడి, "నువ్వీమధ్య చాలా లావయినట్లున్నావు "యోగా" చేస్తే బాగుంటుందేమో", అని ఓ ఉచిత సలహ ఇచ్చారు. "నేనా? యోగా నా? అమ్మో అయినా రాళ్ళు తిని హరయించుకొనే ఈ వయసులో నాకు యోగా ఎందుకండి" అని వాపోయాను. రాళ్ళంటే గుర్తొచ్చింది, నేను మరీ అంత లావేమి కాదులెండి, ఏదో కొంచం ఐశ్వర్యా రాయి కన్నా ఎక్కువ హైటు గాను, కల్పనా రాయి కన్నాఎక్కువ ఫాట్ గాను ఉంటాను అంతే. సరే ! నాధుడి మాట జవదాటనేల అని, యోగా క్లాసెస్ కి వెళ్ళాను. ప్రాణామాయం, సూర్య నమస్కారాలు అయిన తరువాత వున్నట్లుండి అందరిని గట్టిగా "హ్హ! హ్హ! హ్హ " అని నవ్వమన్నారు. నవ్వామనుకొండి, అది వేరే విషయం. నాకొకటే ఆశ్చర్యమనిపించింది ఏమిటంటే, ఎప్పుడూ సీరియస్ గా వుండేవాళ్ళు కూడా అలా తెచ్చిపెట్టుకొని నవ్వడం, అది చూస్తుంటే భలే తమాషాగా కూడా అనిపించింది. . కృత్రిమత్వం స్పృష్టంగా కనిపిస్తోంది వాళ్ళల్లో.

అలా ఒక రెండు నెలలు వెళ్ళాను, మరీ సన్నగా అయిపోతే అర్జంట్ గా "శ్రీమతి ఆంధ్రప్రదేశ్ " , "మహిళలు మహరాణులు" లాంటి వాటికి పిలిచేస్తారేమొ అని , భయపడి మానిపించేసారు(మానేసాను) మా వారు. "భార్య రూపవతి శత్రు " అన్నారు కదండీ పెద్దలు అదన్నమాట. అసలయినా , ఆయనకి ముందే చెప్పాను ఈ వయసులో అవసరం లేదండీ అని.(తరువాత తెలుసుకొన్నాను అనుకొండి యోగా కి , వయసుకి సంభందం లేదని). వయసంటే గుర్తొచ్చింది. అసలు మా తమ్ముడు అంత ఠక్కున వయసడగగానే, ఎందుకు చెప్పేస్తాడో నాకెప్పటికి అర్ధం కాదు, వాడలా వాడి వయసు చెప్పగానే "వాడి కన్నా ఇన్ని యేళ్ళు పెద్ద కదా నువ్వు" అంటూ నన్ను యక్ష ప్రశ్నలు వేసేస్తారు. అదేదో పెద్ద పొడుపు కధ విప్పేసినట్లుగా మహదానంద పడిపోతుంటారు మా బంధువర్గం. "నువ్వు చెప్పకురా" అంటే వినడు నాలా బుద్దిగా 30+ అనొచ్చుగా. ఏవిటో.. 21 నుండి 30 వరకు చాలా ఫాస్ట్ గానే చెప్పేసాను. ఇదిగో 30 నుండే కాస్త వయసు లెక్కల్లో వీక్ అయిపోయాను.

అయినా మనము "నవ్వు" గురించి కదా మాట్లాడుకొంటున్నాము వయసు గురించి కాదుగా. 

మొన్నామధ్య , నాకు చాలా రోజులు ఆఫీస్ కి సెలవిచ్చేసారు. అలా ఖాళీ దొరికితే మేము చేసేదేముంది, వంట ఇంటి సామ్రాజ్యం ఏలేయడమేగా, అదే అదను చూసి మావారు .."అసలు నువ్వు కందిపచ్చడి చేసి ఎన్నాళ్ళయ్యిందో ఈరోజు చెయ్యొచ్చు కదా" అని అడిగితే , పాపం అని, కొంచం జాలిగా, నేను కంది పచ్చడి ఎంత బాగా చేసేస్తానో అని, కొంచం సంతోషంగా పప్పు వేయిస్తూ వుండగా "నువ్వెలా చేస్తావో చూద్దాము" అన్నట్లుగా మా ఇంట్లో కరెంట్ పోయింది. 

ఇక మా వారి ఆనందం చూడాలి, ఎలాగు ఇక మిక్సీ జోలికి నేను వెళ్ళలేను, రోట్లోనే చేస్తానుగా , తెగ ఆనందపడిపోయారు. పైగా "ఏది ఏమైనా రోటి పచ్చడి కున్న రుచి, ఈ మిక్సీ పచ్చడికేమొస్తుంది" అని సు(త్తి)క్తి ముక్తావళి. హు!! ఇక నాకు తప్పుతుందా? మొదలయితే పెట్టాను కాని , కాస్త అనుభవలోపంవల్లనో ఏమో, చిటికిన వేలు కాస్త నలిగి చిన్నగా కమిలిపోయిది. గట్టిగా అరిచినా పట్టించుకోని పతి ని చూసి, ఎందుకనో "రాదే చెలి నమ్మరాదే చెలి" అని అనుకొంటూ, నా పెళ్ళి అయిన కొత్తలో జరిగిన సంఘటనల కోసం, అలా నాముందు గుండ్రం గుండ్రంగా పెద్ద పెద్ద వృత్తాలని తిప్పేసుకొన్నాను. 

నాకు పెళ్ళైన కొత్తలోనన్నమాట.
తనెంత పద్ధతి గల అమ్మాయిని చేసుకొన్నారో తెలుసుకోవాలని, నేను తలంటు పోసుకొని, పెద్ద టర్కి టవలు జుట్టుకు కట్టేసుకొని, ఓ పట్టు చీరలో నేను తులసి మొక్క చుట్టు తిరుగుతుంటే, అలా తలుపు కి జార్లపడి శోభన్ బాబు లా చేతులు కట్టేసుకొని నవ్వుతూ ఆనందపడిపోవాలని, నేను ఆవేశపడి పోయి, తెల్లవారుజామున 5 గంటలకి లేచి "కౌశల్యా సుప్రజా" అని టేప్ రికార్డర్ ఆన్ చేసి, (కొంచం గట్టిగా అన్నమాట, లేవాలిగా మరి ఆయన) గబా గబా స్నానం చేసేసి , మంచి పసుపు రంగు పట్టు చీర కట్టేసుకొని (పెళ్ళైన కొత్త కదా బోల్డు పట్టుచీరలు), కొత్తిమీర కాడ లాంటి నా జడకి పెద్ద టర్కి టవలు చుట్టేసుకొని (ఎంత బరువుందో) తులసికోట చుట్టు ప్రదక్షిణాలు చేసేస్తున్నాను. క్రీగంట, ఓరకంట చూస్తున్నాను, తలుపు దగ్గిర అలా చేతులు కట్టుకొని చూస్తున్నారేమో అని ప్చ్! ఎదురుచూసాను.. ఎదురుచూసాను.. ఎంతకి రాలేదు, ఇక ఇలా లాభం లేదని , కాఫి ప్రయోగం చూద్దాము అని, రెండో ప్రయత్నం మొదలుపెట్టాను. 

చక్కగా, చిక్కగా, స్ట్రాంగ్ కాఫి తయారుచేసి, నెమ్మదిగా లేపితే, తను చిరునవ్వుతో లేచి, "అబ్బ ఎంత అందంగా వున్నావు అనాలి" అలా అనలేదు సరి కదా, "ఏంటి ఇంత పొద్దున్నే పట్టు చీర కట్టావు? నేను బ్రష్ చేసుకోకుండా కాఫి తాగను. అబ్బా! ఆ టేప్ రికార్డర్ ఆఫ్ చేయి లేదా కాస్త సౌండ్ తగ్గించు" అని , నా ఆశలన్నీ అడియాసలు చేసి అటు తిరిగి గుర్రు పెట్టారు నా నిజ జీవిత శోభన్ బాబు. ఛ! ఈయనింతే అనుకొని , ఇలా అస్సలు ఇక కలలు కన కూడదని నిర్ణయించేసుకొని, వంట ప్రయత్నంలో పడ్డాను. "అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా.. ఆశా నిరాశేనా" అని పాడుకొంటూ బెండకాయలతో పాటు నా వేలిని కూడా కట్ చేసేసుకొని "అబ్బా" అని గట్టిగా అరిచి చూద్దును కదా .. 

మా ఆయన, నా నాధుడు లేచి వచ్చి, నా వేలు పట్టుకొని "అయ్యో" చూసుకొవద్దా ? చ్చో, చ్చో అంటు కంగారుగా నా పట్టు చీర చింపబోయి, అమ్మో పట్టు చీర, అని కొంచం ఆగి , పక్కనున్న బట్టతో వేలిని చుట్టి, జుట్టు చుట్టూ వున్న టవలు తీసి , నా జడకి ఓ రబ్బర్ బాండ్ తగిలించి, ఆరోజు నేను చేసిన వంటలో చాలా చాలా సహయం చేసిన నా పతి, మై హజ్బెండ్, నా శోభన్ బాబు.. (గుండ్రం గుండ్రంగా పెద్ద పెద్ద వృత్తాలు)
..ఈరోజు ఇలా .. నా వేలు నలిగినా పట్టించుకోకుండా.. అందుకే అనిపిస్తుంది
"అంతా బ్రాంతి యేనా ?? " అని.

రాదే చెలి నమ్మరాదే చెలి మగవారినిలా నమ్మరాదే చెలి." 

ముగింపు: హూ! ముగింపు ఏముంటుందండి ? అలా వేలు నలిగి కష్టపడి, నేను చేసిన కందిపచ్చడి మావారు ఎంతో ఇష్టంగా అంత నెయ్యి వేసుకొని కలుపుకొని, ఇంత ఇంత ముద్దలు గుటుకు గుటుకున మింగుతుంటే , నలిగిన నా చిటికెన వేలు బాధతో ఎంత విల విల లాడిందో..:(
****

47 comments:

  1. రమగారు,

    ఈ టపా మీవారితో చదివించండి. కొంచెమైనా ప్రయోజనముంటుందేమో చూడండీ. నాకైతే నమ్మకంలేదనుకోండీ. ఈ మొగుళ్ళ మీద...

    ReplyDelete
  2. ఏదో సరదాగా మనందరం కాసేపు నవ్వేసుకొందామని అలా రాసాను కాని జ్యోతిగారు , మనవాళ్ళమీద ధ్వజం ఎత్తేందుకు కాదండి. నిజ జీవితంలో అందరూ అలాగే వుంటారండీ ఒక్క మావారే కాదు. అయినా.. మనలో మన మాట, ఇదేమి 3 గంటల్లో అయిపోయే సినిమా కాదుగా.

    ఇకపోతే మావారిని చదవమంటే, చదివేసి "బాగుంది" అని చిన్నగా ఓ చిరునవ్వు నా మొహాన పడేసేంతటి భావుకత వుంది ఆయనలో.

    ReplyDelete
  3. చాలా బాగా హాస్యం పండిస్తున్నారు!

    ReplyDelete
  4. హ్హ హ్హ హ్హ...ఇది మాత్రం కృత్రిమం కాదు, నిజంగా నిజంగానే.

    యోగా క్లాసులలో లాఫర్స్ క్లబ్బుల్లలో నవ్వే నవ్వు నాకు కూడా కృత్రిమంగానే అనిపిస్తుంది. అలాంటి నవ్వు ఆరోగ్యాన్నిస్తుందా, ఏమో!!

    ReplyDelete
  5. పొద్దున్నే మంచి టపా చదివించారు రమణి గారు :)) మీరన్నట్లు ఇంచుమించు అందరి 'వారు ' లు ఇంతే!

    ReplyDelete
  6. నాకూ అనుమానమే , ఇంట్లో అన్ని సమస్యలు, మనసులో బాధ పెట్టుకుని అలా బలవంతంగా గట్టిగా నవ్వగలగడం సాధ్యమా?? అవసరమా? దాని బదులు సమస్యలు బాధను మనసులోనుండి తీసేయడానికి ప్రయత్నించడం, అన్నింటిని నవ్వుతూ ఎదుర్కోవడం మంచిదేమో???

    ఇది నా అభిప్రాయం మాత్రమే...

    ReplyDelete
  7. ఇదేం బాలేదు. మీరేమో ఎంచక్కా రోట్లో రుబ్బిన కందిపచ్చడి మీ ఆయనకి పెట్టేసి, ఇలా ఓ టపా మా మొహాన కొడితే, మాబోంట్లం ఏంకావాలి? మా ఇంట్లో రు.రో లేదే, ఉంటే ఫ్యూజు పీకేసైనా సరే ఇవ్వాళ అదేదో తినుండేవాడిని.
    ఇప్పుడు నా ముందు కూడా గుండ్రం గుండ్రంగా వృత్తాలు, చిన్ననాడు అమ్మ రుబ్బిన పచ్చడి...

    ReplyDelete
  8. మరేం పర్లేదు మా ఇంట్లో వుంది రు.రో. ఇలా అత్యవసరం వస్తుందనే అలా దాచి వుంచాను. నేను చేసి పెడ్తాను మా ఇంటికి వచ్చేయండి నాగరాజు గారు. వేలు నలిగినా, వీర నారిలా చేసేస్తాను. అనుభవం బోల్డు పాఠాలు నేర్పేసింది మరి.

    ReplyDelete
  9. ఏక పక్షం,ఏక పక్షం,

    బ్లాగాడపడుచులు అందరూ కలసి ఇలా "వారు"లను ఆడిపోసుకోసుకోవడం దాఋణం కన్నా దాఋణం.
    ఇహ కందిపచ్చడంటారా??ఈ విషయం లో ప్రాప్తం ఉండాలి అన్నసంగతి బాగా నమ్ముతా.కందిపచ్చడంటె ? అని అడిగింది (వైజాగ్ లో పుట్టి పెరిగిన)మా ఆవిడ

    ReplyDelete
  10. మీ బ్లాగులో ఇంతకు ముందు నేను చదివిన చాలా టపాల కన్నా ఇది చాలా వైవిధ్యమైన narration తో నడిపించారు. ఇంతకు ముందువి మీ మది పొరలలో మెదిలిన/తిరుగాడే అనుభవాల దొంతరలకు యధాతధ అక్షరరూపం అనిపిస్తే ఇది మాత్రం హాస్యపు చెణుకులతో, సరదా వ్యాఖ్యలతో, నొప్పించని వ్యంగ్యోక్తులతో, ఫక్కున నవ్వించే ఉపమానాలతో అద్యంతం చాలా అధ్భుతంగా అనిపించింది....అందుకు మీకు వేనవేల అభినందనలు.

    హాయిగా, మనసారా మరియు స్వఛ్ఛంగా నవ్వించిన ఈ టపాతో నిజంగా ఈ రోజు ఆనందోదయం. (7:30AM Pacific కి conferenc call ఉంది అని మొహం మాడ్చుకుని/తిట్టుకుంటూ లేచిన నాకు ఈ టపా తెప్పించిన నవ్వులతో అవన్నీ మటుమాయం:) అందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు ...

    ReplyDelete
  11. ప్రాణామాయం...30 నుండే కాస్త వయసు లెక్కల్లో వీక్...సు(త్తి)క్తి ముక్తావళి...నా పతి, మై హజ్బెండ్, నా శోభన్ బాబు ..
    చమత్కారాల జడివాన కురిసింది.
    ఆంధ్రదేశంలో వరదలు సృష్టిస్తున్న వానలకి కేంద్రం ఈ వాయుగుండమేనేమో?
    అన్నట్టు వాడెవడో వెర్రి కుట్టె తొందరపడి మాగాయ మహా పచ్చడి అని మాగాయని పొగిడేశాడు గానీ రోట రుబ్బిన కంది పచ్చడి మహిమ తెలియని తెలుగు పురుషుడెవడు?
    ఒక వేళ ఎవడన్నా ఉంటే .. ఇదే నా గీతోపదేశము:
    కంది పచ్చ డదియె కామితార్ధ ఫలము
    ఋషుల కైన ఘన పురుషులకైన
    రోట రుబ్బ దాని రుచులు మిన్నంటురా
    రస భరితము విందు రమణి బెట్ట.

    ReplyDelete
  12. రూటు మార్చి సరదా సంఘటనలు రాసేశారు.30+ బాధలు భలే వున్నాయి.

    నాకో డౌటు, పెళ్ళయిన కొత్తలో ప్రతి ఇంట్లోనూ మీ లాంటి సీను ఒకటి వుంటుందా. ఎందుకంటే ఆ తరువాత అవి వుండవు కదా.

    లాఫింగ్ యోగా మా ఇంట్లో భలే వుంటుంది. ఆరేళ్ళ పెద్ద బుడ్డోడు మోకాలు మీద కూచుని హహ్హ హా అంటే ఒకటిన్నరేళ్ళ చిన బుడ్డోడు వాడి ఒళ్ళో కూచుని హీ..హీ అని చేతులు పైకెత్తుతాడు. మాకు అప్పుడు లాఫింగ్ యోగా చేసే అవసరం రాదు.

    ఇంతకూ కంది పచ్చడి అంటే ఏంటి ?

    -- విహారి

    ReplyDelete
  13. అబ్బా అదరగొట్టేసారుగా.ఈ కామెంటులన్నీ చదివిన తరువాత చెప్పుకోడానికి కొద్దిగా సిగ్గుగా వుంది.నాకు కూడా కంది పచ్చడి తెలియదు.ఒక్క సారి కూడ రుచి చూడలేదు.దాని తయారీ కాస్త చెప్పుదురూ?

    ReplyDelete
  14. అహహ... భలే రాసారు.

    మొత్తానికి ఆడవాళ్ళందరూ కలిసి ఇక్కడ తమ పతులని విమర్శించే సామూహిక కార్యక్రమం పెట్టుకున్నట్టున్నారే ?

    నా కల బ్లాగులలో మగ వారి గురించి ఏ ఒక్క ఆడవారయినా మంచి రాస్తారేమోనని :)

    ReplyDelete
  15. అంతమాటన్నారు, అదే పదివేలు. తప్పకుండా వస్తా, ఆ రు.రో అలాగే ఉంచండి. ఈ సారి మీ ఊరు వచ్చినప్పుడు ఖాయం (మీ చిటికినవేలుకోసం బాండ్‌-ఎయిడ్‌ పట్టుకొనే వస్తాలెండి పాపం). ఇంతకీ కొత్తపాళీ మాస్టారు ఇంతకు మునుపు పూతరేకులడిగితే, అతివలంతా ఏవో కథలు చెప్పారు. ఇప్పుడు, కందిపచ్చడి కోసం కాంతామణిని కందంతో కాకా పడుతున్నట్టున్నారే పాపం. లాభంలేదు గురూజీ, ప్రార్ధనగీతం మీరాలపించినా, వరం నాకు దక్కింది. లక్కుండాలండీ. ఇంతకీ ఇది కందమేనా, ప్రాస కుదిరింది కదా అని వాడేసా..

    ReplyDelete
  16. @నాగరాజుగారు .. ఏవిటి తినేది? మీరే రుబ్భేసుకునా .. ఆ మాత్రం భుజబలం మాకూ ఉంది.
    @ రాజేంద్ర .. అర్జంటుగా మీ ఆవిణ్ణి "ది కుయిజీన్‌ ఆఫ్ టెల్గూస్" అనే శిక్షణ తరగతిలో చేర్పించు. అంత కష్టం పడలేనంటే నువ్వే మడికట్టుకో!
    @ నిషిగంధ .. మీరు కొటేషన్‌సులో పెట్టిన పదం చదివితే పూర్వం విజయవాడ ఆకాశవాణిలో సాయంత్రం మార్కెట్ ధరలలో ప్రకటించే ఒకానొక అంశం గుర్తొచ్చి వొళ్ళు జలదరించింది.

    ReplyDelete
  17. కొత్తపాళీ గారూ, రమ(ణి) గారి టపాతో కందిపచ్చడి గుర్తొచ్చి నోరూరితే మీ పద్యంతో దాన్ని ఇంకా ఎక్కువ చేసారు, వెంటనే రుబ్బేసుకోవాలి, కానీ రు.రో లేదే, ఈ మధ్యే దానం చేసేసాను వాడటం లేదు కదా అని :)). రమణి గారూ, ఇక మీ ఇంటి మీదకి దండయాత్ర చేసేయ్యాల్సిందే !!

    ReplyDelete
  18. hmmmmmm

    రమణిగారు,
    నిషిగంధ చెప్పినట్టు అందరు "వారు" లు ఇంతే.. ఇంతమంది మొగుళ్ళు(మొగాళ్ళు) కామెంట్లు రాసారు. ఒక్కరన్నా. అయ్యో! అని మీ వేలిమీద కామెంట్ చేసారా?? వాళ్లకు కందిపచ్చడి మీదే దృష్టి.
    ఇక రు.రో సంగతి.
    నాగరాజుగారు,
    ఇంతోటిదానికి కరెంట్ ఫ్యూజు తీయడం ఎందుకు? కరెంటుతో నడిచే రు.రో ఉన్నాయిగా. కొనేసి మీ ఆవిడ గాని ధైర్యముంటే మీరే చేసేయండీ. ఇందులో వేలు నలిగే చాన్స్ లేదు.

    రాజేంద్రగారు,
    ఇందులో మీ ఆవిడను ఆడిపోసుకోవడం ఎందుకు? కొత్తపాళిగారన్నట్టు ఆయన చెప్పిన పద్యం పాడుకుంటూ మడి కట్టుకోండి.

    ఇక కంది పచ్చడీ ఎలా చేయాలో ఇవాళే నా షడ్రుచులు లో ఇస్తున్నాను. .. చూద్దాం ఎంతమంది చేసుకుంటారో????

    ReplyDelete
  19. నేనూ ఈ మధ్య కంది పచ్చడి ఎక్కువగా చేస్తున్నాను.
    రుచి మాత్రం మా అమ్మమ్మ చేసింత బాగా కుదరడం లేదు.
    రహస్యం ఇప్పుడు తెలిసింది, రుబ్బు రోలూ, చిటికెడు ... అన్న మాట.
    రుబ్బు రోలు వరకూ పరవాలేదు కాని, ....

    మా స్నేహితురాలూ కందిపచ్చడి తెలియదంటే నాకు ఆశ్చర్యపడడానికి కూడా తోచనంత ఆశ్చర్యం వేసింది.
    నేనే తననుంచి వంటలు నేర్చుకుంటుంటాను.

    జ్యోతి, దయ చేసి కంది పొడి ఎలా చెయ్యాలో కూడా రాయరూ?

    రమ గారూ, మీ పచ్చడి తినే అదృష్టం లేదు కాని, మీ పోస్టు మాత్రం అదిరిందండీ.
    నేనూ కూడా మీ చిటికెన వేలు మీద జాలి చూపించట్లేదు కదూ. సారీ:-)

    ReplyDelete
  20. అంటే ఏమిటండీ మా ఇంట్లో వంటలన్నీ మా ఆవిడే వండిపారేస్తుందనా మీ అభిప్రాయం.మాకూ చిటికెనవేళ్ళూ నలిగాయి,అరచేతులూ కోసుకు పోయాయి.చిన్నప్పుడు మారాజుగాడు ఎంతమంచోడొ అనిపించుకున్నపాపానికి ఎన్ని సంవత్సరాలు నాజీవితం మా అక్కలకు,అమ్మలకు అవీఇవీ అందిస్తూ గడిచిపోయిందో ఇప్పుడు గుర్తు చేసుకుంటే గుండె
    తరుక్కుపోతుంది
    @అయ్యా కొత్తపాళీ గారు,మొన్న మీ బెజవాడ పటమట లో పచ్చిపులుసు వడ్డిస్తే అబ్బ,ఇదేదో భలేవుందే,ఏంటక్కాయ్ ఇదీ ఎట్లాచెస్తారూ అని ఒకటే అడిగారంట పెళ్ళికొడుకు తల్లిని మొన్న బుధవారమో పెళ్ళిలో.

    ReplyDelete
  21. @తెరెసా గారు: నెనర్లండీ. @సిరిసిరిమువ్వ గారు: మీ దండయాత్ర ఎప్పుడో కొంచం చెప్పండి, ఒక్క షరతు రుబ్బురోలు మీకివ్వడానికి కాదండోయ్! నేనే చేసిపెడ్దామని.@ నిషిగంధ గారు: భలే అర్ధం చేసుకొన్నారండి. నెనర్లు. @ జ్యోతి గారు: గాజుల గల గలలు, మూతి ముడుపులు, మాట విసుర్లు, కోప తాపాలు, కొంగుతో తుడుచుకోడాలు లాంటివేమి లేకుండా యాంత్రికంగా, యంత్రాలతో చేసే పచ్చడి రుచిగా వుంటుందంటార చెప్పండి? ఇక నా భర్త పట్టిచుకొలేదు కాబట్టి మీరందరూ నామీద నా నలిగిన వేలిమీద జాలిపడండీ అని నేను రాయలేదండి.నాకెందుకోఅ ఫీలింగ్ 'ఇంట్లో బావ వున్నాడని బయటికి వెళ్ళి బట్టలు మార్చుకొన్నట్లుగా అనిపిస్తోంది." హాస్యంగా రాసాను అపహాస్యం వద్దండీ. ఇదంతా చెప్తున్నాను అంటే నేనేదో పాత చింతకాయ పచ్చడి లాంటి అమ్మమ్మ కాలం లాంటి దాన్ని అని అనుకోకండి,అసలు నా వయసెంతని మొన్నేగా 29 వెళ్ళి 30+ లోకి అడుగుపెట్టాను ఇంకో 10,20 యేళ్ళ దాక ఇలా 30+ లోనే . ప్చ్! అబ్బా మళ్ళీ నా వయసు చెప్పాల్సి వస్తోంది..నవ్వెయండి జ్యోతిగారు. సరదాగా వుందాము.

    ReplyDelete
  22. రాజెంద్ర కుమారు గారు: జ్యోతిగారి షడ్రుచుల్లో కంది పచ్చడి గురించి ఇస్తారట మీ ఆవిడ కి చెప్పండి నేర్చేసుకొంటారు. కాకపోతే కొంచం వేలు నలిగినప్పుడు " రాదే చెలి నమ్మరాదే చెలి" అని పాడుకొనే అవకాశము రానివ్వకండి. ఇంకోటి, నలభీమ పాకం అన్నారు కాని రమణి ,జ్యోతి పాకం అనేలేదుగా మగవారికి వంట రాకపోవడం అంటే నలభీములకి ఎంత అన్యాయం చేసినట్లో కదా, మీరు వంటల్లో ఎందులో స్పెషలో కాస్త చెప్పండి..కొంచం మేము నేర్చేసుకొంటాము. @ రాధికగారు,లలిత గారు,విహారి గారు: నెనర్లు, ఇక కందిపచ్చడి కేర్ ఆఫ్ జ్యోతిగారు షడ్రుచులే.

    ReplyDelete
  23. తెలుగు 'వాడి ' ని గారు: చాల థాంక్స్. మొదటిసారి నా బ్లాగుకి వ్యాఖ్య ఇవ్వడం. మీరు కాన్ ఫరెన్స్ కి నవ్వుతూ వెళ్ళేలా చేయగలిగింది నా బ్లాగు అంటే నాకు చాలా ఆనదంగా వుందండి.మీ తెలుగు పదకూర్పు చాలా బాగుంటుంది.

    ReplyDelete
  24. ప్రవీణ్ గార్లపాటి గారు: పతులని విమర్శిస్తే మటుకు ఈ ఏకపత్నీ వ్రతులు వూరుకొంటార చెప్పండి?అయినా మేము అనుకొనేది మావాళ్ళందరూ మంచివాళ్ళే కాని ఎందుకనో కొన్ని విషయాలు మరీ పట్టించుకోరు అని ...
    "ఉత్తమ నాధుడీతడు
    ఎదురుత్తరివీయడు
    రేగి, రేగి ఇప్పుడిట్లు దూషించనేలో?
    మద్యపుకుండలో మాటల 'వస ' కలిపెనేమో అత్తా.. "
    నా భర్త మచివాడే నేనన్న మాట జవదాటడు ఇదే ఈ పాడు మందులో ఏదో కాస్త మాటల వస కలిపి వుంటారు అందుకే ఇలా చెల రేగుతున్నాడు అని అన్నదట ఓ గడుసు ఇల్లాలు. అలా మా వాళ్ళందరూ మంచివాళ్ళే ఏదో కత్తిపీట, రు.రో తప్పే కాని .....ఏ మాట కా మాట ప్రవీణ్ గారు మావారు కూడా ఉత్తమ నాధుడే.

    ReplyDelete
  25. నాగరాజు గారు: కొత్త పాళీ గారి చమత్కార పద్యానికి మురిసి ముక్కయిపోయానండి ఇక వారిని ప్రత్యేకంగా ఆహ్వానించేది ఏముంది? భోజన ప్రియులైన బ్లాగర్లు, బ్లాగడపడుచులు అందరూ, ఆంధ్ర భోజనాలకి మా స్వీట్ హోం కి ఆహ్వానితులే(ఆదివారం మాత్రమే).
    ముఖ్య గమనిక: నాగ రాజు గారితో పాటు మిగతా వారు కూడా బాండ్ ఎయిడ్ ఉచితంగా తెస్తానంటే, చిటికిన వేలుతో పాటు మిగతా చూపుడు, మధ్య, ఉంగరం, బొటనవేళ్ళకి కూడా న్యాయం చేకూరుస్తానని హామి.

    ReplyDelete
  26. కొత్త పాళీ గారు: చాలా థాంక్స్ అండీ నా మాటలు చమత్కార జడి వాన అంటున్నారు కాని, మీ సంధర్బోచిత గీతోపదేశం అదరహో.
    తప్పకుండా అరిటాకులో - అంత ఆవకాయ, ముద్దపప్పు, నెయ్యి, కంది పచ్చడి, కారంపొడి, మొదలగు అధరవులతో ఆంధ్ర బోజనం మా ఇంట్లో ప్రతి ఆదివారం వుంటుంది. విందుకి రండి.

    ReplyDelete
  27. రమణిగారు,

    కాళహస్తీశ్వర మహత్మ్యం లోని పద్యం భలే చెప్పారు సమయానికి...

    కంది పచ్చడి, పొడి షడ్రుచులులో రెడీ..

    http://shadruchulu.blogspot.com

    ReplyDelete
  28. @కొత్తపాళీ గారు, మార్కెట్ ధరలలో ఏ అంశం ప్రకటించేవాళ్ళండీ?? నాకైతే 'నవారు ' తప్ప ఇంకేం తట్టడం లేదు :)

    @రమణి గారు, మీ టపా మూలంగా మావారికి ఈ వీకెండ్ కందిపచ్చడి (జ్యోతి గారి షడ్రుచుల సౌజన్యంతో) తినే అదృష్టం పట్టబోతోంది! :)

    ReplyDelete
  29. @ నిషిగంధ, కొత్తపాళీ గారు అన్నది "పంది వారు" గురించి....అంటే పంది తోలుతో తయారు చేసిన తాడు-

    ReplyDelete
  30. @ నిషిగంధ: నవారులో 'న' నాస్తి. కందిపచ్చడితో నోరూరుతున్నవాళ్లకు దాన్నెందుకు లెండి గుర్తుచెయ్యడం?

    రమ(ణి) గారూ! మీరు అంత ఉత్సాహంగా అన్నివేళ్లకు న్యాయం చేకూరిస్తే కందిపచ్చడి మీద ఆశ పెట్టుకున్నవాళ్ళు అన్యాయమైపోతారేమోనండీ!

    ReplyDelete
  31. సుగాత్రి గారు: అంతా ఉచిత మహిమండీ. ఉచితంగా వస్తుందంటే, వెధవది వేళ్ళదేముందండీ, నలిగితే నలిగాయి, అదే తగ్గిపోతుంది. ఇక కందిపచ్చడి మీద ఆశ అంటారా, మళ్ళీ చెయ్యొచ్చు, ఉచితంగా ఒక్కసారే కదండీ. ఎదో వస్తువుకి చెంచా ఫ్రీ అంటే చెంచా కోసం భర్త కొత్త బట్టలు, స్టీల్ సామాను వాళ్ళకి ఇచ్చేసే గొప్ప సాంప్రదాయమున్న మహిళా లోకంలో పుట్టానండీ నేను.
    ఇక నేను రమణి నే , రమ(ణి)అని అందరూ అలా బ్రాకెట్స్ పెట్టి చెప్తుంటే అసలు నిజమేనా? నా పేరు రమ(ణి) నా, రమణి నా అన్న అనుమానము కలుగుతోంది మరి, మీరు కూడా ఒకసారి కన్ ఫర్మ్ చేసి నా పేరు ఏదో నిర్ణయించేయండి కొంచం ప్లీజ్.

    ReplyDelete
  32. Ramani,
    It is a splendid artical which made me to think about the tast of kandhi pachhcadi made on rubbu rolu.

    ReplyDelete
  33. సర్, కామేశ్వర శర్మ గారు బాగున్నారా? మొత్తానికి వ్యాఖ్య ఎలా ఇవ్వాలో నేర్చేసుకొన్నారన్నమాట. కంది పచ్చడి కోసమా? సో, అలా అప్పుడప్పుడు మా బ్లాగ్ వైపు ఓ కన్నేసి వుంచండి.
    కంది పచ్చడి మా మాడం గారిని అడగండి చేసి పెడ్తారు. రు.రో విషయం నాకు తెలీదు మరి. మీరెక్కడో దుబాయి లో వున్నారు ఎలా?

    ReplyDelete
  34. @నిషిగంధగారు,
    ఈ లింకు ఒకసారి నొక్కి చూడండి

    http://visakhateeraana.blogspot.com/2007/12/blog-post_07.html

    ReplyDelete
  35. రమణిగారు,
    టపా చాలా బావుంది,
    కొత్తాపాళీ గారు, కంది పచ్చడి లోకి "అప్పుడు గాచిన నెయ్యి"లా మీ ఆశువు అద్భుతం.

    ReplyDelete
  36. పతీరమణీయం

    రుబ్బురోలూ కందిపచ్చడీ
    నలిగెనా వేలు నాథునికోసం
    శోభన్ బాబు చిక్కటి కాఫీ
    యోగా క్లాసు ముప్ఫై వయసు
    నవ్వులవిందు భలే పసందు

    ReplyDelete
  37. Kandi pachchadiki inta power vundani ee blog choosina taravata ardhamayyindandi..inta mandini kadilinchina a kandhi pachchadini kanipettina variki naa dhanayavadalu.
    inka mana andra specials gongura..avi ivi kooda ee blogs ni dominate chesta emo ani ...eduru choostunna ...kadedi blog ku anarhitama!
    ala saradaga chamtakaralu vuntune..inta mandi paddalunnaru...mana samajaanni vuddesinchi ..maa boti vallaku koni directions istarani kooda aasinchutu..
    selavu..
    uthappa.

    ReplyDelete
  38. హన్నా! ఇన్నాళ్ళు కంది పచ్చాడి ఎలా మిస్సయ్యానబ్బా.రమణిగారూ, ఈ సారిఎప్పుడు కంది పచ్చడి చేస్తున్నారో ముందుగా చెప్పండి. నేనూ తయారైపోతాను విస్తరి పట్టుకుని.

    చూశారూ, నలిగిన వేలితో చేసిన కంది పచ్చడి మహా రుచిగా వుంటుంది ;-).

    మహా రుచికరంగా రాసారు సుమా!


    ప్రసాదం

    ReplyDelete
  39. నేను చేసిన కందిపచ్చడి ఘాటు మీదాక ఇంకా రాలేదేంటి చెప్మా ! అని అనుకొన్నాను, లేటు గా అయినా చాలా ధీటుగా స్పందించారండీ ప్రసాదం గారు. నెనర్లు.

    ReplyDelete
  40. రమణి గారూ, మీ "ఏకాంత సేవ" టపా తెరుచుకోవటం లేదేంటి? మొదటి రోజు బాగానే తెరుచుకుంది, తరువాతనుండి మొరాయిస్తుంది....

    ReplyDelete
  41. Ramani

    Mee kandhi pachchadi jooru choosthunte next time A P Elections lo meeru R R Symbolga nilabadithe thappakunda C M ayye avakaasalu chaala kanipisthunnai.
    Mee kandhi pachhcadi ruchi A P ke kakunda Gulf loki kooda pakuthondhante entha ruchiga untundho oohinchukuntunte nee noru oori sonthamga K P chesedhamannantha usharochesthondhi. Hats off to your kandhi pachchadi.

    ReplyDelete
  42. అదే ఏమయ్యిందో నాకు తెలియడం లేదు సిరి సిరి మువ్వగారు. చదవలేదా మీరు? నా దగ్గర కూడ మిస్ అయ్యింది. ట్రై చేస్తాను మళ్ళీ పబ్లిష్ చేయాడానికి. ఆప్ రేటింగ్ కొత్త కదా . ఏమి చెయ్యబోయి ఏమి చేసానో డిలీట్ అయ్యిందేమొ! అని అనుమానం.

    ReplyDelete
  43. @రాఘవ గారు: పతీ రమణీయం టైటిల్ రమణీయం గా వుందండి. చూస్తుంటే ఇదే టైటిల్ తో ఏదన్నా రాసేయ్యాలని కుతూహలం నాలో బయల్దేరిందంటే నమ్మండి. నెనర్లు
    @ఊకదంపుడు గారు : నెనర్లు
    @శర్మగారు: కందిపచ్చడి, గల్ఫ్ దాకా పాకడం, మొ! ఇంతవరకు బాగానే వుంది కాని, ఈ రాజకీయాలెందుకండీ బాబు. నన్నిలా వుండనివ్వండి. నిన్ననే అవిశ్వాస తీర్మానం అంటూ అన్ని రాజకీయ పార్టీలు కొట్టుకొంటున్నారు.. ఆ వాడీ, వేడిలో కందిపచ్చడి ఘాటు నషాలనికి అంటితే, అమ్మో వద్దులెండి, పిల్లలున్నారు సర్ ఇలా వుండనివ్వండి.

    ReplyDelete
  44. కమెంట్స్ తో సహా తిరిగి ఎలా ప్రచురించారు? నాకు కొంచెం చెపుతారా?

    ReplyDelete
  45. నిహారిక గారు : నా దగ్గిర ఆల్రేడీ డ్రాఫ్ట్‌లో ఉన్నాయండి పాత పోస్ట్లు కమెంట్స్‌తో సహా..

    ReplyDelete
  46. హ హ. బావుంది మీ టపా. మీ యోగా అహ్హహ్హ చదువుతుంటే నా యోగా క్లాసు ఒకటి గుర్తొచ్చింది. ఓ రోజు శీర్షాసనం ప్రాక్టీసు చేస్తున్నాం. మా ఫ్రెండును కాస్త పడకుండా కాళ్ళు పట్టుకొమ్మని చెప్పాను. అతడు కాళ్ళు పట్టుకోకుండా...కాలి బొటనవేలి మీద వున్న వెంట్రుకలు పట్టుకొని నా బాడీని బ్యాలన్స్ చెయ్యసాగాడు. తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి వాడిమీద ఏమని అరుస్తాం? నాకేమో నేను కదిలినప్పుడల్లా వెంట్రుకలు లాగి నొప్పెడుతోంది. వాడి మీద పళ్ళు నూరుదామంటే ఆ స్థితిలో ఎంతప్రయత్నించినా కుదరలేదు. క్లాసు అయిపోయాక ఓ ముచ్చట చెబుతా అని వాడిని పక్కకు తీసుకెళ్ళి నెత్తి మీద ఒక్కటి పీకి "ఏంది బే, కాళ్ళు పట్టుకో అంటే ఇంకేమో పట్టుకున్నావు?" అని గద్దించాను.
    "అలా చేస్తే నొప్పితో నీ బాడీని ఇంకా చక్కగా బ్యలన్స్ చేస్తావు కదా అనుకున్నా అన్నా" అన్నాడు
    "ఓరి నీ తెలివి మండిపోనూ, శీర్షాసనం వేసినంత సేపు చచ్చాను కదరా" అని తిట్టాను!

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...