9.23.2010

సప్తపది

ఇది ఏ విశ్లేషణలనూ, కాని ఏ మతాలని కాని ఏ కులాలని కాని, ఏ వ్యక్తిని కాని కించపరిచే ఉద్దేశ్యం కాదు. ఎవరినన్నా నాకు తెలియక భాదిస్తే క్షమించమని ప్రార్ధన.

ఇప్పుడే పర్ణశాల లో 'సప్తపది ' చదివాను, ఒక సినిమా ఇలా తీస్తే బాగుండేది, ఆ సినిమాలో అంతా ఓ కుల ప్రస్తావన సంభందించిన అంశం పైన చర్చ, సోమయాజులిలా, హేమ అలా, గౌరినాధుడు ఇంకోలా అనుకొంటూ వెశ్లేషణ ని అన్ని కోణాలనుండి పరిశీలించి మరీ బ్లాగు పాఠకులని ఆలోచింపజేసారు. ఒక సినిమాకి స్పందించ తీరు అభినందనీయమే. మరి నిజజీవితంలో అలా జరిగితే? అంత పెద్ద పెద్ద మాటలు వాడి, అంత విశ్లేషణ నేను చెయ్యలేను కాని, నాకు తెలిసినంతలో ఎంతో కొంత చెప్పడానికి ప్రయత్నిస్తాను. అసలు నాకెందుకు అని ఊరుకొన్నా, కాని ఊరుకోలేని మనసుని ఊరడించలేక రాస్తున్నదే ఈ సప్తపది .

ఇక్కడ నిజజీవితం లో హేమ, ఎంతో గొప్పగా చెప్పుకొనే ఉన్నత కుటుంబంలోని పుత్రిక , చిన్నాప్పటినుండి ఆచారవ్యవహారంటూ అన్నీ కట్టుబాట్ల మద్య పెరిగింది. అదే ఆ సినిమాలో లా హరి ని ప్రేమించి ఏ సోమయాజుల (మారే) అవసరం లేకుండానే పెళ్ళి చేసుకొంది. సప్తపది సినిమా ఇక్కడితో ముగుసింది. కాని నిజ జీవితం ఇక్కడితో ఆగిపోలేదు. ఇక్కడే మొదలవుతుంది.

ఏ ఆచార దురాచారాలైనా మనుషులు ద్వారా కనుగొనబడినవే. వాటిని రూపు మాపెందుకు తమ వంతు కృషిగా, చేస్తున్న ప్రయత్నమే (కొంత వ్యాపార దక్షతని మేళవించి) ఈ సినిమాలు, ఈ కళా తపస్వుల ప్రయత్నాలు అవి, కాని ఒక్కటి మటుకు నిజం! ఈ ఆచారలను, దురాచారాలన్నిటినీ కూకటి వేళ్ళతో సహా పెకిలించలేమన్నది అక్షర సత్యం. మరి ఒక ఆచార వ్యవహారంలో 23 యేళ్ళు ఒక ఆచారానికో , ఒక మడి కట్టుకొన్న వ్యవహారానికో అలవాటు పడ్డ వ్యక్తి, ఒక్కరోజులోనో, ఒక్క గంట లోనో ,ఓ సినిమా చూసినందువల్లో, మారడమనేది అసాధ్యం.

ఇక బార్య భర్తల భందం:

"ధృవంతే రాజావరుణో ధృవం దేవో బృహస్పతిః ధృవంతే ఇంద్రశ్చాగంచ్ఛ రాష్ట్రం థార్యతాం ధృవం."
అంటే, ఈ గృహస్తూ జీవితం నిలకడగా ఉండాలని, చివరిదాక ఇద్దరూ ఎడబాటు లేకుండా జీవించాలని, అన్యోన్యమైన దాంపత్యాన్ని కలిగి ఉండాలని, పెళ్ళి సుమూహర్తం సమయంలో , వేదపండితులు, బ్రహ్మగారు ౠగ్వేదం లోని ఈ మంత్రాన్ని ఉచ్ఛరిస్తారు.
చివరి దాక ఉండే ఈ భందంలో, మరి అలా ప్రేమ అంటూ ఈవిధమైన(కులాంతర, మతాంతర) వివాహం చేసుకొన్న వారు ఎంతమంది చివరిదాక నిలకడగా ఉన్నారు? అసలు ఆ భర్త కాని, ఈ బార్య కాని ఎవరు మారాలి ఇద్దరిలో? భర్త /బార్య తను శాఖాహారిగా /మాంసాహారిగా మారలా? ప్రేమాకర్షణ మత్తులో మారుతాను అని చేసే బాసలన్నీ జీవితాంతం ఉంటాయా? సంవత్సారాల తేడాలోనే "నా కుటుంబం, మా అలవాట్లు, మా ఆచారాలు" అంటూ ఆ రెండోవారిని తమ వైపు తిప్పుకొంటారు.
ఇక్కడ నేను అమ్మాయిలు మాత్రమే అనడం లేదు ఓ ఉన్నత కుటుంబలోని ఓ అబ్బాయి అమ్మాయి కోసం ఆచారాలన్నీ పక్కన పెట్టేసి అమ్మాయి వైపు కులం లోకో మతంలోకో మారిపోయి చేసుకోడం నిజంగా దయనీయ పరిస్థితి. ఇక ముందు తరంలో కనక ఈ కుల ప్రస్తావన కనక రావడమంటూ జరిగితే(వస్తుంది, ఇంకా ఎక్కువగా ఇప్పుడు మొహమాటపడి చెప్పుకోడం లేదు కాని, అందరికి వుంది ఈ కుల పట్టింపు) వాళ్ళకి పెద్దవాళ్ళు చెప్పేది ఇలా ఉంటుంది. "పూర్వం మా ముందు తరంలో , ఇన్నీ ఆచారాలు ఇన్ని వ్యవహారలు ఉండేవి అప్పట్లో వాళ్ళు నిప్పుతో నీళ్ళు కడిగే వాళ్ళు , రాను రాను వాళ్ళు అంతరించి పోయారు వాళ్ళ ద్వార పరిచయం కాబడ్డ ఆ ఆచారాలు లేవు " అని. ప్రతీ వారికి కుల మత పట్టింపులు ఉన్నాయి, వాళ్ళ కులం గురించో మతం గురించో గొప్పగా చెప్పుకొంటుంటారు. వాళ్ళందరూ హ్యప్పీగానే ఉన్నారు వాళ్ళ పేర్ల చివర వాళ్ళ కులాల పేర్లు తగిలించుకొని. " కులాలు అంతరించి పోవాలి, అంతరించి పోవాలి" అంటూ గొంతెత్తి అరిచే వాళ్ళు కూడా, మర్నాడు పేపర్ లో తన పేరు చివర తన కులం పేరు లేదని అరిచేవారే.
ప్రతీ ఆచారం వెనక ఓ అర్ధం ఉంటుంది అని, అర్ధం చేసుకొని ఏ కుల ప్రస్తావన లేకుండా సంతోషంగా ఉండగలగడమనేది ఓ కళ. ఇది సినిమా కాదు 3 గంటల్లో ముగిసిపోవడానికో, ఓ 6 పేజిల వెశ్లేషణ రాసి చర్చించుకోడానికో, నిజ జీవితం. ప్రేమించామంటూ, జీవితం ఎవరి చేతుల్లోనో పెట్టేసి మారిపోవడం కాదు. మన జీవితం మనం జీవించడానికి, అలాగే మన మీదా మన వ్యక్తిత్వం మీద మనకి నమ్మకం ఉండాలి కాని, అవతలి వాళ్ళు మారిపొమ్మంటే గుడ్డిగా మారడం కాదు. ఈ జీవితాన్ని మనకి నచ్చిన రీతిలో మలుచుకోడానికి మనకు మనమే కళా తపస్వులం, మనమే విశ్వనాధులం కూడా.
అందరూ ఇలా ఉంటున్నారని నేను అనడం లేదు, ఎక్కడో కొందరు ఆదర్శంగా కూడా ఉంటున్నారు అని చెప్పడం నాకిస్టం లేదు. ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారేమో కాని నా చుట్టుపక్కల ఎక్కడ నాకు కులం అవసరం లేదు, కుల పట్టింపు లేదు, నా పిల్లలు అన్నిటికి అతీతులు మేము మనుషులం అంతే అన్నవారు లేరు. ఉన్న ఏ ఒక్కరో ఇద్దరో, ఉద్యోగాల్లోనో, బడిలోనో, కొన్ని కొన్ని షరతులకి లొంగినవారే. ఎందుకో ఇక ఈ అర్ధం లేని కబుర్లు, నేరవేర్చుకోలేని ఆశయాలు. ఇవన్నీ సినిమాలకే పరిమితం కాని నిజ జీవితానికి మాత్రం కాదు.
నేను గొప్ప అంటే , నేనే గొప్ప అని ప్రతి ఒక్కరూ ఏదో ఒక సంధర్భంలో తన కులం గురించి అనుకొనేవారె, ఎవరు బయటికి కనపడరు. కనపడినవారు అలా సినిమాలు తీస్తారు. అందులో కూడా నాకు ఏ పట్టింపు లేదు అని స్పృష్టంగా చెప్పరు. చెప్పడానికి ప్రయత్నిస్తారు కాని, బంధాలో బాద్యతలో ఒప్పుకోవు, ముఖ్యంగా ప్రేక్షకులు ఒప్పుకోరు. అందుకే ప్రశ్నలు ప్రేక్షకులకే వదిలేస్తారు.

అక్కడ చదివేసి, ఇక్కడ కాస్త ఆవేశంగా ఇంత పెద్ద టపా రాసాను అంటే , నెనేదో నీతి వాక్యాలు నేర్పెద్దామని కాదు కాని, ఒక్కసారి ఆలోచించండి, ఇవేవి మారిపోయెవి కావు, గోవుల్లు తెల్లన, గొపయ్య నల్లన అన్నవి పాటలవరకె బాగుంటాయి. ప్రేమ వివాహాలు, మతాలు మార్చుకోడాలు లాంటివి చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. మాములు శాఖాబేధం ఉన్న పెళ్ళిళ్ళు చేసుకొనే వాళ్ళే అప్పుడప్పుడు కొన్ని కొన్ని విబేధాలల్లో చిక్కుకొంటున్నారు. మరి ఇక మత మార్పిడులు, చిన్నప్పటినుండి మనం పెరిగిన వాతావరణం కాక పూర్తి భిన్నంగా ఉన్నా ఇంకో వాతవరణంలోకి, వెళ్ళి మనసు చంపుకొని చెయ్యలేని పనులు చేసే కన్నా, ఒక్క క్షణం ఆలోచించి, ఆకర్షణలకి లొంగిపోకుండా ఉంటే మంచిదని నా అభిప్రాయం.
కొ.మె: నాకు ఒక్కటే ఎప్పుడు అర్ధం కానిది. తమ జంటకి పిల్లలు పుడితే, ఎంతో గర్వంగా పేరు చివర ఆ కులం పేరు పెట్టుకొనే ఆ భర్త , " అరే! తన బార్యకి కూడా కొంత స్వతంత్ర ఆలోచనలు ఉంటాయి చుద్దాము ఆలోచించి ఓ నిర్ణయానికి వద్దాము" అనుకొనో, లేదా నేనింత గొప్పగా చెప్పుకొంటున్నాను కదా మరి తన అభిప్రాయం ఎంటో అని ఆలోచించడెందుకో? అలాగే సదరు బార్య కూడా "అరె! అంత పెద్ద/చిన్న కుటుంబం నుండి వచ్చాను కదా! మరి తను అంత గొప్పగా తన కులం గురించి చెప్పుకొంటున్నప్పుడు మరి నేనెంటి ఇలా మౌనం" అని అనుకోదెందుకు? హ! అందుకే అన్నది, ముందు తరంలో కుల పట్టింపులు ఇంకా ఎక్కువవుతాయి అప్పుడు, ఈ ఉన్నత కులాల గురించి, ఈ సప్తపదుల గురించి కథలు కథలు గానే చెప్పుకొంటారు. ఎందుకంటే వాస్తవం కనిపించదు. అంతరించేది అదొక్కటే కాబట్టి. 90% ప్రేమ వివాహాల్లో, వధూ వరులిద్దరులో ఒకరు ఉన్నత కులాలవారు/మతాలవారు అవడం విశేషమయితే, సదరు ఉన్నత కులాల/మతాల వధూ/వరులు, వాళ్ళ కులాన్నో/మతాన్నో మార్చుకోడం మరో విశేషం. ఏ కళాతపస్వి దర్శకత్వం లేకుండానే.

14 comments:

 1. chaala bagundhi. gist emitante anaadhiga vasthunna samprdhayam / prathi sthree thanu entha swathanthra bavaalu galadhi eina paristhithula prabhavam valla gani ardhika swathanthramu lekapovadam vallanaithe nemi purushini chetha anaga thokka badindhi. Andhuvalla sthree swathanthra bavvalu or swathanthranni purushudu bahyamga oppukunna manasulo ee moolo vatini angeekariche stage ki mogavaadu edhagaledhu. because pprushud janmathaha ahankari andhuku stree swathanthranni bahyamga sahinchledu. Kaani poaristhula drushtya ippudippude oppukuntunnadu. So ennellu gadachina stree ki thanadantoo abhiprayam vyaktham cheyyaleka pothundhi .

  ReplyDelete
 2. ఆలోచించాల్సిన విషయాలు చెప్పారు. కాస్త ఆలోచించి మళ్ళీ వస్తా

  ReplyDelete
 3. కులాంతర వివాహాల గురించి ఆలోచిస్తున్నప్పుడు నాలో జరిగే అంతర్మధనానికి దగ్గరగా ఉంది ఈ టపా. కానీ అలాంటి ఆలోచన ఒక అమ్మాయి నుండి రావడం కొత్తగా ఉంది నాకు.

  ఆకర్షణలో/ప్రేమలో అన్నీ వదులుకోవడానికి సిద్ధపడిన అమ్మాయి తరవాత జీవితంలో ఎదురయ్యే పరిస్థితులకి రాజీపడిపోతుంది.తను కొన్ని విలువలని,ఆదర్శాలని నమ్మి తన తల్లిదండ్రులని వదిలి వస్తే ఆ విలువలని జీవితాంతం పాటించినప్పుడు అది హర్షించదగినది అవుతుంది. అలా కాక, తను ఫలాన వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలి అనే కోరికతో మాత్రమే, ఇంకేమీ ఆలోచించకుండా, తను సిద్ధపడితే ఆ ప్రయత్నం హర్షించదగినది కాదు.భర్త కులపు,మతపు ఆచారాలు పాటిస్తూ, పిల్లలకి ఆ కులపు పేర్లు తగిలించి తన పుట్టింటి ఆచారాన్ని, అభిమానాన్ని ప్రశ్నిస్తూ జీవితాంతం వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తారు.ఒక్కోసారి వాళ్ళ కన్న ప్రేమ వాళ్ళ అభిమానాన్ని చంపుకుని రాజీపడేట్టు చేస్తుంది.కొంతమంది తల్లిదండ్రులు ఎప్పటికీ రాజీపడలేరు. ఎందుకంటే ఆ అమ్మాయి కులరహితంగా/మతరహితంగా లేదు కాబట్టి, వాళ్ళ కులాన్ని/మతాన్ని వదిలేసి, వేరే కులాన్ని/మతాన్ని పాటిస్తున్నారు కాబట్టి... అలాంటి చాలా సంధర్భాల్లో అసలు అమ్మాయిలు ఆలోచిస్తున్నారో లేదో అర్ధం కాదు, ఒకవేళ ఆలోచించినా ప్రతిఘటిస్తున్నారో లేదో అర్ధం కాదు.నాకు ఎక్కువగా తెలిసిన కులాంతర,మతాంతర వివహాలు పైన చెప్పిన బాపతులోనివే...


  ఒకవేళ నిజంగా తను నమ్మిన విలువలు ప్రకారమే పెళ్ళి చేసుకుని, ఆ తరవాత ఎదురయ్యే ప్రతీ పరిస్థితికి ఇద్దరూ కలిసి ఆలోచించి వాళ్ళు ఆ విలువల ప్రకారమే జీవనం కొనసాగిస్తుంటే అది హర్షణీయమే...

  మా కుటుంబ స్నేహితుల్లొ ఒక కుటుంబం గురించి చెప్తాను.వారిది కులాంతర వివాహమే. ఇరవై మూడేళ్ళ క్రితం వివాహమైంది.ఆయనే ఇష్టపడి,వెంటపడి ఒప్పించారు.ఆయనేమో సంతానం పుట్టగానే కులం పేరు కలిపి పేరు పెడితే గానీ, అది పేరు కాదు అనుకునే కులంలో పుట్టినవారు. ఈవిడ ఇంకో అగ్ర వర్ణానికి చెందినావిడ,కానీ పేరు చివర కులం పేరు పెట్టాలి అనే పట్టింపులేని కులం. అదేంటో మరి,మొదటి సంతానం పుట్టినప్పుడు ఆయన తన కులం పేరు పెట్టడానికి సిద్ధమైపోయారు. అప్పుడు ఆవిడ సరే పెట్టుకో, రెండో సంతానానికి నా కులం పేరు పెట్టుకుంటాను అన్నారు.అలా అన్నప్పుడు ఏ బుద్ధున్న మగవాడైనా కులం పేరు పెడతారా? పెట్టలేదు!! అలా ఆవిడ తన ఆలోచనలని ఎప్పటికప్పుడు వినిపించేది.ఇప్పటికీ కలిసే ఉన్నారు.ఇప్పుడు పిల్లలు పెళ్ళీడు కి వచ్చారు.ఇప్పుడు ఏంజరుగుతుందో చూడాలి.

  అలా అని తను నమ్మినదానికి కట్టుబడిన ఆవిడ నిజంగా అభినందించదగిన మహిళ.

  ఈ తరం దృక్పథంలో చాలా మార్పు వచ్చింది.ఈ విషయంలో వాళ్ళు జాగురూకతతోనే వ్యవహరిస్తారని అనుకుంటున్నాను...

  ReplyDelete
 4. Good job ramaNi!
  I don't have any disagreement here :)

  ReplyDelete
 5. టపాలోని బిట్వీన్ ద లైన్స్ భావాలను దిలీప్ గారి కామెంటు ఎలివేట్ చేసింది. టపాకి మరింత సాధికారికత లభించింది.
  అభినందనలతో
  బొల్లోజు బాబా

  ReplyDelete
 6. మీ ఈ సప్తపది కి జోహార్.మీరు రాసిన ,లేదా ఎవ్వరో cinema తీసిన ఇవి మారనివి ఎవరి ద్రుషి లో వారే గొప్ప తప్ప వీరు మారరు,వారూ మారరు:)
  అంతె:)

  ReplyDelete
 7. రమణి గారి ఆలోచనలు కానీ పరిశీలనలు కానీ ఎప్పుడూ నేలబారుగా ఉండవు. ఆమె అభివ్యక్తి కూడా దానికి తగ్గట్టు పదునుగానే ఉంది. మంచి చర్చ లేవదీసినందుకు అభినందనలు.
  వధూవరుల మధ్య అన్ని విషయాల్లోనూ ఒక సమతూకం ఉన్నా కూడా పెళ్ళి, వైవాహిక జీవితం అంత సులువు కాదు - ఈ సంగతి పెళ్లైన వాళ్ళందరికీ తెలుసు. ఎంతో అవగాహనా, ఓర్పూ, అర్ధం చేసుకునే గుణం ఇవన్నీ ఉండాలి.
  ఇక ప్రేమ వివాహంలో, ఈ సమతూకంలో ఏ విషయం తేడా వచ్చినా తద్వారా ఉత్పన్నమయ్యే సమస్యలు ఇంతకు పదింతలుగా ప్రత్యక్ష మవుతాయి.
  నా ఉద్దేశంలో అసలు ప్రేమించడానికి మొదటి క్వాలిఫికేషను ఆత్మ గౌరవం. రమణి గారు చెప్పినట్టు తన మీద తాను నమ్మకం కలిగి ఉండటం, ఆడైనా, మగైనా. రెండో క్వాలిఫికేషను అవతలి వ్యక్తి పైన గౌరవం. ఈ రెండూ లేని వాళ్ళు ప్రేమించడానికి అనర్హులు. ఇలాంటి వాళ్ళు ప్రేమించి పెళ్ళాడితే వారిలో ఒకరికో, ఇద్దరికీనో మిగిలేది జీవిత పర్యంత బానిసత్వమే.
  దురదృష్టం కొద్దీ, ఆ వేడి వయసులో, వ్యక్తిత్వం పూర్తిగా వికసించని స్థితిలో ఈ విషయం వారికి తోచదు, ఇంకొకరు చెబితే అర్ధం కాదు. పై పెచ్చు ఆ చెప్పేవాళ్ళు తన ప్రేమని చంపెయ్యడానికి పుట్టిన విలన్లుగా కనిపిస్తారు.
  దిలీపు చెప్పిన ఉదాహరణలోలాగా దంపతులిద్దరూ వివేకవంతులై, పరస్పర అవగాహనతో ఇటువంటి పొరపొచ్చాలు లేకుండా జీవితాల్ని చక్కదిద్దుకున్న జంటలు చాలామందే ఉన్నారు.
  ఈ చర్చలో నాకు తోచిన ఇంకో మాట - ఇది ఊరికినే political correctness, fashion అని యద్దేవా చేస్తే నేను చెప్పేదేం లేదు గానీ మనం వాడే మాటలు, భాష కూడా క్రమేణా మన ఆలోచనల్ని రూపొందిస్తాయని నా నమ్మకం. ఈ చర్చలో "ఉన్నత" కులం, "అగ్రవర్ణం" అన్న మాటలు వాడారు. ఈ ఉన్నత-నిమ్న, అగ్ర-నీచ అనే వర్గీకరణలు మనం వదిలి పెడితే మంచిది. చెప్పాలినిపిస్తే ఫలాని కులం అనండి (కులం గురించి చర్చ ఇంత దాకా వచ్చాక, ఇహ చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు?) అలా చెప్పడం ఇష్టం లేకపోతే కులం ఏ, కులం బీ అనండి. వేరే విశేషణాలు అనవసరం.

  ReplyDelete
 8. రమణి గారూ, చాలా ఆలోచింప చేసే టపా అండీ. మన సిస్టం అలా అలవాటు చేస్తుంది, పెళ్ళి అవగానే అమ్మాయి అబ్బాయి ఇంటికి వెళ్ళి అక్కడ ఆచార వ్యవహారాలకి అణుగుణం గా మారాలి అని.

  అది మరి నా అవగాహనా రాహిత్యమేమో తెలీదు కానీ అసలు ఎవరైనా మారాల్సిన అవసరం ఏముంది అనేది నా మదిని ఎప్పుడూ తొలిచే ఓ ప్రశ్న. ఒకరి అలవాట్లని ఒకరు గౌరవిస్తూ బతకడం అసాధ్యమేమీ కాదే... నువ్వంటే నాకిష్టం కానీ నువ్వు నీ మతం మర్చుకో లేదా శాఖాహారిగా ఉండు లేదా నాకు నచ్చినట్లు ఇలా మారు అనో లేదా నువ్వంటే నాకిష్టం కాబట్టి నేను ఇలా మారుతాను మనం పెళ్ళి చేసుకుందాం అనో బేరం పెట్టడం ప్రేమ అనిపించుకుంటుందంటారా. కేవలం అలాంటి ప్రాతిపదిక మీద పెళ్ళి చేసుకున్న వాళ్ళు నాకు తెలిసీ సంతోషం గా ఉండ లేరు. మీరు చెప్పినట్లు కుల మతాల గురించి మేం పట్టించుకోం అని అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కుల మతాల పై వ్యామోహం ఏళ్ళతరబడి సమాజం లో వేళ్ళూనుకు పోయిన ఓ మహా వృక్షం దాన్ని పెకలించడం సామాన్యమైన విషయం ఏమీ కాదు.

  ReplyDelete
 9. కామెశ్వర శర్మగారు: నేనర్లు. స్త్రీ అణగదొక్కబడింది ఒకప్పుడు. ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా, మార్పు అంత ముప్పు కాదేమో. ఇప్పుడు ఆర్ధిక స్వాంత్ర్యం ఉంది కాబట్టి ఆలోచించండి.
  ఏకాంతపు దీలీప్ గారు: మీకు కొత్తగా అనిపించే విషయం నన్నింకో టపా రాసేలా చేసింది నా ఆలోచనలనో కుదుపు కుదిపింది. నెనర్లు. ఇక మీరు చెప్పిన జంట కి నా తరుపున అభినందనలందజేయండి. ప్రేమ వివాహాల్లో, కులాంతర వివాహాల్లో ఇలాంటి సొంత ఆలోచనలు, ఒకింత తెగింపు ఉండాలన్నది నా అభిప్రాయం.
  బాబా గారు: నెనర్లు.

  @ హర్షోల్లాసం: మారితే అసలీ టపా ఎందుకండి. నెనర్లు సప్తపది కి జోహారలందించి నందుకు.
  @కొత్తపాళీ గారు: మీరిచ్చిన సూచనకి నెనర్లు. ఇంతా రాస్తున్నప్పుడు "చల్లకొచ్చి ముంత దాచడమెందుకని" నేరుగానే రాసా కాని, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకొనేవారెక్కువ నా చుట్టుపక్కల, "నా ఇష్టమొచ్చినట్లు రాసుకొంటా" అని ఎదురు తిరిగే ధైర్యం ఉంది. కాని వాళ్ళ తిరుగుబాటుని ఎదుర్కొనే శక్తి లేదు నాకు. బ్లాగులో అయితే బ్లాగు మిత్రులు ఉన్నారన్న భరోసా ఉంది కాని, మరి చుట్టుపక్కల ఎవరూ లేరు కదండీ. ఇక ఏ కులం, బి కులం అన్నా అక్కడా ఎది దేనికన్నా తక్కువ, ఏది దేనికన్నా ఎక్కువ అనేది చెప్పాలి. అన్నీ సమానమే అని అనుకొంటే అసలీ సప్తపది టపానే లేదు. కాదంటార చెప్పండి?
  @వేణూ శ్రీకంత్ గారు: నెనర్లు మీది అవగాహన రాహిత్యం కానే కాదు. మీరు చెప్పింది చాలా ఆమోదయోగ్యం. ఎవరూ మారనవసరం లేకుండా ఒకరిని ఒకరు గౌరవించుకొంటూ, ఒకరి అభిప్రాయాలను, ఒకరి ఆలోచనలను, ఆచార వ్యవాహారలనూ ఇంకొకరూ గౌరవించుకొంటే అసలు ఇక ఈ సప్తపది సినిమాలు అక్కర్లేదు. అలా జరగడానికి కొన్ని యుగాలు పట్టొచ్చు అని నిన్ననే జరిగిన ఒకానొక చర్చలో తేలిన విషయం.

  ReplyDelete
 10. థెరెసా గారు:Thanks a lot.

  ReplyDelete
 11. మీరు నర్మగర్భంగా చెప్పడం వలన, టపాలో సృజనాత్మక పెరిగినా,కొత్తపాళీగారు చెప్పినట్లు కొంత ‘చల్లకొచ్చి ముంతదాచిన’ అనుభూతిని మిగిల్చింది. ఈ భావానికి మీరిచ్చిన సమాధానం మీరు టపాలో చెప్పిన పరిస్థితికి అద్దం పడుతుంది.

  "మార్పు అందరికీ కావాలి. కానీ తాము మారితే జరిగే పరిణామాలను స్వీకరించలేనివారు చాలామంది" అందుకే అభిలషించాల్సిన వేగంగా ఈ మార్పులు జరగటం లేదు.

  ReplyDelete
 12. ఇంటి పేరుకీ / కులం పేరుకీ తికమకపడి.. నాన్న సాయం తీసుకుంటే కానీ అర్ధంకాని నేను.. ఈ టపాకి వ్యాఖ్యాన్నించడం దుస్సాహసమే అవుతుంది. అయినా నా అభిప్రాయాలు చెప్పకుండా వెళ్ళలేను.

  అసలు ఆడపిల్లకి పెళ్ళి అంటే ఏమిటి? ఒక చోట జీవం పోసుకుని, అక్కడే ఆడుతూ పాడుతూ ఆరోగ్యంగా పెరిగున్న ఒక మొక్కను వేళ్ళతో సహా పెకలించి.. ఇంకో పంచన నాటడం. అయిన వాళ్ళందరికీ దూరమైన బాధ పక్కకు పెడితే.. ఇప్పుడా మొక్కకున్న "ఛాలంజెస్స్" ఏంటీ అంటే.. కొత్త మట్టిలో బాగా పాతుకుపోవాలి. కొత్త వాతావరణానికి అలవాటుపడాలి. జీవిత కాలంలో ఓ పాతిక వంతు అలవడిన జీవన శైలికి దూరమైయ్యి.. ఇప్పుడో కొత్త జీవితాన్ని సంతరించుకోవాలి. అలా పుష్పించి.. ఫలించి.. ఆ వంశానికి నూతనోత్తేజాన్ని ఇవ్వాలి. ఇదీ ఆడపిల్ల పెళ్ళి.. ఆడపిల్ల నుండి పెళ్ళి ద్వారా ఉండే "expectations".

  ఇప్పుడు.. వేరే తోట (అత్తారిల్లు) తన ఇంటిలోదే (మేనమామ- మేనత్త సంబంధాలు) అయినా, వేరే ఇంటిదైనా (అదే ఊరు), ఇంకో ఊరులో తనవారిదైనా (కులం, ప్రాంతం), ఇంకో రాష్ట్రం (భాషాంతర, మతాంతర), ఇంకో దేశమైన (జాతి) అయినా, ఈ మొక్క మహావృక్షంగా మారాలంటే.. ఒక మొక్కతో అయ్యే పని కాదు. తోటమాలి (భర్త), అనుకూల వాతారణం (అత్తమామలు, తక్కిన కుటుంబం) అందరూ తగిన సహాయసహకారాలు అందిస్తే తప్ప.. ఆ సంసారం సరిగ్గా ఉండదు. ఆ మొక్క మాను కాలేదు.

  సింపులగా చెప్పాలంటే.. కులం, మతం, భాషా, ఆదర్శాలు, ఆలోచనావిధానాలు.. ఇవేవీ ఒక బంధాన్ని "నలిపేసేంత" ఎదగలేవు.. ఆ బంధంలో సమతుల్యం ఉన్నంత వరకూ. నీ కులం పేరా?? నా దా?? అని కొట్టుకునే వారు... "మీ నాన్నమ్మ పేరా??", "మా నాన్నమ్మ పేరా?" అని కూడా కొట్టుకోవచ్చు!! అంతా వాళ్ళ ఆలోచనా విధానంలో ఉంటుంది.

  ఇక సినిమాల్లో "శుభం" కార్డు పడేవేళకు.. నిజజీవితంలో పెళ్ళి పుస్తకం తెరుచుకుంటుంది. మీరు ఈ విషయమై చర్చించినందుకు చాలా అభినందనీయులు. నేను ఈ టపాను ఎలా మిస్స్ అయ్యానో ఇంకా అర్ధం కావటం లేదు!!

  ReplyDelete
 13. మీ వుద్దేశ్యం వర్ణ వ్యవస్త ఇంక ఇలా పది కాలాల పాటు ఇలాగే కొనసాగుతూ ఈ దురాచరం కొనసాగాలిసిందేనా? (సారీ మీరు ఇది దురాచరం అనుకొవట్లెదు కదా) రెసెర్వతిఒన్స్ పై మీ అభిప్రయం ఎమిటీ? నేను ఒక "అగ్రవర్ణపు కుటుంబం లో పుట్టిన దాన్ని. రెసెర్వాషిఒన్స్ కి వ్యతిరేకంగా వచ్చిన ఒక పుబ్లిచ్ పెటిషిఒన్ లో సంతకం చేసినదాన్ని. ఇంతెర్చస్తె పెళ్ళి చేసుకొన్న వ్యక్తిగా మీ కంటె ఎక్కూ మాట్లాదగలిగే అధికారం వున్న దాన్ని. మనకి ఈ ఙాఞ్ నాంధకరం (రచయిత వసుంధర గారి కధ) ఎప్పటికి ఎలా పోవాలొ సూచిస్తే ఇంకా ఎక్కువ ఉపయోగంగా వుండేది. ఇంతమంది తైము శక్తి సద్వినియోగం అయ్యెవేమో.
  ఒక చిన్న అభ్యర్ధన. కొత్త పాళి గారి బ్లాగు లో పెట్టినట్ట్లు లేఖిని లింక్ కాని, ఈమాట లొ పెట్టి నట్ట్లు ఇంబుఇల్త్ తెలుగు త్రాన్స్లిటెరతిఒన్ సౌకర్యమో పెడిథే బాగుంటుందని సూచన.

  ReplyDelete
 14. madam garu,
  Mee Tapaki Naa Johaarlu. Since I left my nation I feel like iam far matured in my life.Ippudu nenu inka Pasivadini kaadu ani anipisthundi.Where as till now I lived like a kid, but after going thru your blog I feel my feelings are correct. Because these thoughts are existing even with you and all our bloggers. As Iam not thorough with telugu, iam not sure what exactly you mean to say , but still trying to get your point by reading number of times .I hope I understood your theme. which even I feel.

  Any how Iam thankfull to you for writing a goodthing, which is useful for my future.

  Expecting more from you like this.

  ganesh

  ReplyDelete

Loading...