10.29.2009

మరి వీళ్ళనేమి చేద్దాము?


కార్తీకమాసం ఏకాదశో మరి పౌర్ణమో తెలీదు కాని మా చుట్టాలెవరో సత్యనారయణవ్రతం చేసుకొంటున్నారంటే ప్రసాదానికని అమ్మ నన్ను పంపింది. అందరూ శ్రద్ధగా కథ వింటున్నారు. ఐదో కథ అయిపోయింది, వెంకటేశ్వర దీపారధన చేసి, మంగళహారతి పాడేసి ఇక ఉద్యాపన చెప్పడమే.. "మంగళహారతి ఎవరో ఒకరు పాడాలి " అని అన్నారు పంతులుగారు. అందరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకొన్నారు, అందరికంటే చిన్నగా నేనే కనిపించాను .. "నువ్వు పాడవే " అంటూ అందరూ నన్నడిగారు నేను అప్పుడు 6 వ తరగతి చదువుతున్నా.. మా స్కూల్ ప్రభావమో ఏమో ..అసెంబ్లిలో నించుని ఎంతో దీక్షగా నలుగురితో పాడేదాన్ని కాబట్టి, జంకు బొంకు లేకుండా పాట అందుకొన్నా. పాట మొదలెట్టగానే అక్కడున్నవారు "ఆపేయ్ !!." మేమే పాడుకొంటామని గట్టిగా అరిచేసరికి.. భయంతో ఒక్కసారిగా వణికిపోయను. ప్రసాదం తీసుకొని... బయటకి వచ్చేప్పుడు కళ్ళనీళ్ళతో అడిగేశాను వాళ్ళని "ఎందుకు ఆపమన్నారు నేను బాగా పాడలేదా?" అని.. ఆవిడ నామీద గట్టిగా అరిచేసింది. "ఇక్కడ జరుగుతున్న పూజ ఏంటి, నువ్వు పాడిన పాట ఏంటి? తప్పు కదా " అని.. నిజానికి ఆ పాట పాడకూడదని నాకసలు తెలీదు అప్పట్లో ఇప్పటిలాగ 6 వ తరగతికే జ్ఞానాలు వచ్చేవి కాదు, టీచర్ ఇలా చెయ్యమంది అంతే. అదొక్కటే మనసులో ఉండేది. ఎక్కడ ప్రార్థన జరిగినా ఈ పాట పాడాలి అని చెప్పిన తెలుగు టీచర్ మాట అది. తరువాత అమ్మ కి చెప్తే .. అమ్మ కూడా చెడా మడా దులిపేసింది. ఇంతకీ నేను పాడిన పాట నడిపించు నా నావా నడి సంద్రమున దేవా.. అల్లేలూయా ... అల్లెలూయా (అంతగా గుర్తులేదు) అంటూ పాడేను.

ఎప్పుడో చిన్నప్పుడు 6 తరగతిలో జరిగిన ఈ సంఘటన , ఎవరు సత్యనారయణవ్రతం చేసుకొన్నా... మదిలో మెదులుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రాయడానికి కారణం .. మైదకూరులో పిల్లల మెళ్ళో వెళ్ళాడతీసిన బోర్డ్... తెలుగుని అపహాస్యం చేసిన వైనం. ప్రతిఒక్క తెలుగు భాషాభిమాని బాధపడేంతగా జరిగిన ఆ సంఘటన. ఇది తల్లి తండ్రుల తప్పా? ఉపాధ్యాయుల తప్పా? అని చర్చినుకొంటున్నారు అందరూ.

క్లాస్ రూముల్లో "మనది మనవతావాదం, మనది మానవకులం వెరే ఏ కులాలు లేవు, మతాలు లేవు అంటూ భోదించి తరగతి గడపదాటాగానే పిల్లలిని తెలియకుండా మతం అనే ఊబిలోకి లాగుతున్నారు. అంటే స్లో పాయిజన్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ మిషనరీ స్కూల్స్‌లో
జరిగేవి ఇవే. మాజి దివంగత ముఖ్యమంత్రిగారు తనలా చాలా మంది మంత్రులని ఇంకో మతంలోకి మారేలా చేసారని ఎక్కడో చదివాను. ఈ మతాభిమానుల ప్రధమ కర్తవ్యం అదేనేమో అని అనిపిస్తుంది.

మిగతా స్కూల్లో ఎలా ఉందో నాకు తెలీదు కాని, మొన్నామధ్య మా పాప పుట్టినరోజుకి వాళ్ళ మావయ్య చక్కటి రోజా పువ్వుల బోకే పంపితే "అమ్మా రోజుకో పువ్వు తల్లో పెట్టుకొని వెళ్తానని " సంబరపడి దాచుకొని మొదటి రోజు పెట్టుకొని వెళ్ళింది మా పాప. అంతే 5 రూపాయలు పరిహారం పూలు పెట్టుకొన్నందుకు.. పూలు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, బొట్టు అసలు కనిపిస్తోందా లేదా అన్నట్లు పెట్టుకోవాలి.అసలు పెట్టుకోపోతే మరీ మంచిది కాళ్ళకి పట్టీలు పెట్టుకోకూడదు. ఆఖరికి చెవులకి కూడా ఏమి వద్దంటారు, అందరు విధ్యార్థులు ఒక్కటే ఒకలానే ఉండాలి , ఐకమత్యం అని ఇలా యునిఫార్మ్ పెట్టడం మంచిదే .. కాని, వాళ్ళ అభిరుచుల్ని చంపేయడమెందుకు? ఎప్పుడో ఖర్మకాలితే ఇవన్నీ తీసేయ్యాలని అనేవారు పెద్దవారు. అదిప్పటినుండి అలవాటు చేస్తున్నామేమో అనిపిస్తుంది.

పాఠ్యాంశాలలో మత ప్రస్తావన లేకపోయినా, ఇలా పాటల ద్వారా, వారి యునిఫార్మ్ రూపేణా వారిలో ఒక భావాన్ని జొప్పించేయడం నిజంగా బాధాకరమైన విషయం. ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన సౌందర్యాభిలాషణని ఇలా మొగ్గలోనో తుంచేయ్యడమేమొ అనిపిస్తుంది. నేనే ఊరుకోలేక ఒకసారి ఈ విషయాన్ని వాళ్ళ ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. " వాళ్ళకి వేరేవాటిమీద దృష్టి మళ్ళకుండా ఒక్క చదువుపై మాత్రమే ఆసక్తి కలిగేలా చేయడానికి ఇలా..." అని సమాధానం ఇచ్చారు ఆ ప్రిన్సిపల్. ఈ ఆలోచన మరి వాళ్ళకి చదువులు చెప్పే ఉపాధ్యాయులమీద లేదా? స్లీవ్లెస్స్ బ్లౌజులు, కట్టామా లేదా అన్నట్లు కట్టే చీరలు, ఇవన్ని చెప్తే?? మనమా.... పిల్లలికి ఎల్లవేళల్లో అందుబాటులో ఉండము గబుక్కున నామీద కోపం వస్తే .... పిల్లలే బలి అవుతారని నోటిమీద వేలేసుకోడం.... ఇదే మన సంస్కృతి. .

పోని స్కూల్ మార్చేద్దాము అనవసరంగా పిల్లలు దృష్టి చదువునుండి మరల్తోంది అంటే దగ్గర్లో అంతకంటే చెప్పదగ్గ స్కూల్స్ లేవు. ఉన్నా ఈ కోవలోకి చెందినవే, పొయ్యి మీంచి పెనం మీద పడ్డట్టు అవుతుంది. స్కూల్లో ఉన్నంతసేపు వాళ్ళిష్టం ఇంట్లో మనమే పిల్లలికి నెమ్మదిగా నేర్పుకోవాలి. అలాగే తెలుగు భాషా విషయంలో కూడా తల్లి తండ్రులకే సరైన అవగాహన ఉండాలి. స్కూల్లో ఏమి చెప్తే అది అంతే, మీరలానే ఉండాలి అని వాళ్ళని ఆధారపడేలా కాక, వాళ్ళంత వాళ్ళు ఆలోచించుకొనే అవకాశం ఇవ్వగలిగేది, వాళ్ళకి మార్గదర్శకులయ్యేది తల్లితండ్రులే నా ఉద్దెశ్యంలో. ఇలా భాష విషయంలో , మతం విషయంలో స్లో పాయిజన్ ఇస్తుంటే ప్రత్యామ్నాయాలు తల్లితండ్రుల దగ్గిరే ఉంటాయి. కాబట్టి మన పిల్లలిని మనమే మార్చుకొందాము...మనము మారిపోకుండా...

"మనము మారిపోకుండా....." అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, మావాళ్ళకి తెలిసినవాళ్ళ అమ్మాయి ఈ భోదనలకో, పాటలకో ఆచరించే విధానాలకో, అకస్మాత్తుగా ఎదో డబ్బు వచ్చేస్తుందనే ఆశతోటో తెలీదు కాని వెరే మతంలోకి వెళ్ళి పెద్దవాళ్ళతో వాదించి,, " మీకు ప్రాణమున్న నేను కావాలా? నేను అలంకారానికి పెట్టుకొనే ప్రాణంలేని బొట్టు కావాలా" అని నిలదీసిందిట, "బొట్టుతో కళ కళ లాడే నువ్వు కావాలి" అని అనడంపోయి తల్లితండ్రులు కూడా మారిపోయారట . . కాబట్టి పుట్టినప్పటినుండి మనకి మతమంటే ఎంటో తెలియనప్పటినుండి చక్కటి అలంకరణ చేసుకొనే మనం ఎవరో ఏదో చెప్తున్నారని గుడ్డిగా ఆచరించడం ఎంతవరకూ సమంజసం? మరి వీటికి కారణభూతులయ్యేవారిని మనమేమి చేద్దాం? అసలేమి చేయగలము?
******

4 comments:

  1. రమణి గారు పరిస్తితులు విపరీతంగా మారిపోతున్నాయి. ఇటువంటి పాఠశాలల మీద ప్రభుత్వమే చర్య తీసుకోవాలి. లేక పొతే రోజులో చాలా సమయం స్కూళ్ళలోనే ఉండే పసిపిల్లలు చివరికి ఏమైపోతారొ చెప్పలేము. ఇళ్ళల్లో తీసుకొనే జాగ్రత్తలు సరిపోవు. తల్లితండ్రులు శక్తికొలది తమ పిల్లలను కాపాడుకోవలసి వొస్తోంది. మీరు చాలా వివరంగా, మంచి విశ్లేషణతో రాసారు. బాగుంది.

    ReplyDelete
  2. muMdu tallidaMdrulu pillalanu chercheppude ee vishayala gurimchi paatasaala yaajamaanyam to charchimchaali , maa chaaraalanu kimchaparachavaddani cheppaali

    ReplyDelete
  3. మావాణ్ణి ఇక్కడ ఒక క్రిస్టియన్ బళ్ళో వేసాం. చాలా మంచి బడి అని చెప్పారు చాలామంది. బాగనే ఉంది బడి వాతావరణం అన్నీ. ఐతే ముందుగానే వాళ్ళు అప్లికేషన్ లో మీ అబ్బాయికి క్రిస్టియానిటీ గురించి మేము ఎంతచెప్పవచ్చు
    ౧. కొంచెం.
    ౨. ఎక్కువ
    ౩. టూమచ్ గా

    అని మాత్రం ఆప్షన్స్ ఇచ్చారు. వద్దు అనేది లేదు. విన్నదేంటంటే, పై
    ఆప్షన్స్ లో ఏది తీస్కున్నా, వాళ్ళు ౩ కే సెట్ చేస్తారని. నిన్నటికి
    వాడికి నాల్రోజులు నిండింది బడికెళ్ళటం మొదలెట్టి. నిన్న ఇంటికొచ్చాక,
    పాక్య్ ప్రార్ధన చెప్పారు నిన్న, ఏందిరా అంటే, గుండెమీద సెయేస్కుని,
    జీసస్ సేవ్స్ అజ్ అని చెప్పించారు అని చెప్పకొచ్చాడు.
    అదే మన బళ్ళల్లో ఇలాంటివి ఎందుకులేవు?
    ఇక్కడ బడికొచ్చేవాళ్ళు నానా జాతి సమితి అని తెలిసినా జీసస్ సేవ్స్ అని
    చెప్పిస్తున్నారు
    అక్కడ వందేమాతరం హిందుత్వం అని, ఆపేయాలని గోలచేస్తున్నారు.
    మీరు చెప్పిన బడికి అసలు డిస్క్లైమర్ ఉందా? మిమ్మల్ని అడిగారా? మీ అనుమతి లేకుండా మీ పిల్లలకి *ఆ బళ్ళో చేరినంత మాత్రాన* మతం గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

    ReplyDelete
  4. జయగారు : నెనర్లు. అక్షరసత్యం చెప్పారండి. కాని మనగోడు పట్టించుకొనేదెవ్వరు? ఎవరికి నచ్చని పనిని అందరు తల్లితండ్రూ కలిసి చెప్పగలగాలి. ఎంతసేపు పిల్లలు చదువుకొంటున్నారు చాలు అని అనుకొని మడి కట్టుకొని కూర్చుంటే చాలా అనర్థాలు జరుగుతాయి. మరి ఇలాంటప్పుడు నేను బాగుంటే చాలు నా పిల్లలు బాగుంటే చాలు అనే స్వార్థం కూడా రావాలి,మన పిల్లలికి మనమే చెప్పుకోగలగాలి. (అందరం కలిసి కంప్లైంట్ ఇద్దామని ఎన్నో ప్రయత్నాల విఫలంతో చెప్తున్న మాటలివి).
    @దుర్గెశ్వర గారు: మాష్టారు, వాళ్ళు మేము చేయడానికి ఇదిగో ఇది కారణం అని చెప్పడంలేదు, పూల సువాసన తరగతిని డిస్టర్బ్ చేస్తుంది, బొట్టు, గాజులు ఇవన్నీ చదువు మీద ఏకాగ్రతని తగ్గిస్తాయి అంటు చదువు పేరు చెప్తున్నారు. ఆచారాలు వ్యవహారాలు అనడంలేదు కదా మనం చెప్పడానికి. నేను ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్ళినా "చదువు కోసమండి: అని సమాధానం వచ్చింది.
    బా.రా.రా గారు: డిస్క్లైమరా ఇంకేమన్నానా? చలితేలులా వ్యవరిస్తున్నారు కదండి ఈ స్కూళ్ళు. పైకేమి మతం పేరైన ఎత్తరు కదా.. కాకపోతే వాళ్ళ అలవాటు అంటూ.... పిల్లలు పొద్దున్న సాయంత్రం "పరలోకమునందుండు మా యొక్క తండ్రి........కీడులో నుండి మమ్మల్ని రక్షింపుడి అంటూ ప్రార్థన చేయాల్సిందే... కాని ఇలా చేస్తే పిల్లలికి చక్కటి ఏకాగ్రత పెరుగుతుంది అని చెప్తున్నారు అందుకే చెప్పాను కదా స్లో పాయిజన్ అని, తెలిసి తెలియకుండా చేస్తున్నారు కదా. ప్రత్యేకంగా మతం గురించి అనే మాట ఎత్తకుండా..

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...