9.29.2010

మాటలకందని భావాలు


నిజమే కొన్ని భావాలు చెప్పాలంటే మాటలు రావు. మనసు మూగబోతుంది. అదిగో అలాంటి సమయంలో ఏమి మాట్లాడాలో తెలియక , మౌనాన్ని ఆశ్రయిస్తాం. ఇదే అపార్థాలకి దారి తీసి, మనము దూరం అయిపోతున్నామేమో అని అనేసుకొంటారు మనలాంటి మనకున్న మన శ్రేయోభిలాషులు.

మన తోటి మనిషి అయితేనేమి, మన స్నేహితుడైనా, బంధువులైనా, ఎవరయినా సరే మనకి దూరంగా ఉండడం వల్ల వాళ్ళతో అనుబంధం పెరిగిపోతుంది, దగ్గరగా ఉంటే ఆ బంధం తగ్గుతుంది అని అనుకోడం మన భ్రమ. దూరాలు , దగ్గరితనాలు బంధాలకి కొలమానం కాదు. ఇదంతా ఎందుకు చెఫ్తున్నాను అంటే ఈరోజు మధ్యాహ్నం ఎఫ్.మ్ లో విన్న చిన్న సంభాషణా సారాంశమే నన్ను ఇలా ఆలోచించేలా జేసింది.
*******
communication gap.. ఎఫ్.మ్ లో ఈరోజు మధ్యాహ్నం ఈ విషయం గురిచి ప్రశ్నోత్తర కార్యక్రమం జరుగుతోంది. కమ్యూనికేషన్ గాప్ అనేది మనిషిని ఏ విధంగా కృంగదీస్తుంది అనేది చర్చాంశం. అయితే ఇలా ఈ విషయం గురించి తన సొంత అనుభవాన్ని చెప్పడానికి ఒక మేడం ఫోన్ చేసారు. ఆవిడ చెప్పిన తన సమస్య:

"నాది ప్రేమ వివాహం, ఇద్దరు పిల్లలు, ఒకరు ఇంటరు సెకండ్ ఇయరు ఇంకొకళ్ళు 10 వ తరగతి చదువుతున్నారు. నా సమస్యల్లా ఒకటే, గత నాలుగేళ్ళుగా మావారు ఏ ఉద్యోగం చేయడం లేదు, అలా ఇంట్లోనే ఉంటున్నారు. ఆఖరికి ఇంటర్ చదువుతున్న మా బాబు కూడా "డాడీ ఫ్రండ్స్ అందరూ "మీ డాడీ ఏమి చేస్తారు ?" అని అడుగుతుంటే నాకు చాలా సిగ్గుగా ఉంది "ఇంట్లో ఉంటున్నారు" అని చెప్పడానికి " అని వాపోతున్నాడు, నాకు వాడి బాధ అర్థం అవుతోంది. మేము మాకున్న కొంత ఆస్థి తో జీవితాన్ని నెట్టుకొస్తున్నాము. ఎన్నోసార్లు నెమ్మదిగా చెప్పి చూసాను. కాని మనిషి మారడంలేదు. చిన్న వ్యసనాలకి లోబడి, ఇంట్లో ఉంటూ, అసలెందుకు తను ఉద్యోగం చెయ్యరో కూడా చెప్పకుండా ఒక విధమైన డిప్రెషన్ లో ఉన్నారు. నావైపు నుండి తప్పేమన్నా ఉందేమో అని ఆలోచించి, అసలు తన సమస్య ఏంటో నెమ్మదిగా అడిగి చూసినా చెప్పడం లేదు. ఒక మనిషి ఉన్నా లేని పరిస్థితి నాది. ఇంట్లో ఉంటూ తండ్రి చూపించే ఆప్యాయతలకి , అతను నెరవేర్చాలిన బాధ్యతలకి నా పిల్లలు దూరమైపోతున్నారు. నేను ఇదంతా నా మీద జాలి పడండి అని చెప్పడానికి కాదు, మీరెవ్వరూ జాలి పడొద్దు. కమ్యునికేషన్ గాప్ అనేది దూరంగా ఉండి మాట్లాడక ోతేనో, మరింకేవిధమైన సాంకేతికాల వాల్లనైతేనేమి, మాట్లాడడం కుదరక పోవడం కాదు, ఇంట్లో ఎదురుగుండా ఉన్న నాకు, నా భర్తకి, నా పిల్లలికి మధ్య చాలా కమ్యునికేషన్ గాప్ ఉంది. అది గమనించి , ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఎవరన్నా ఉంటే పిల్లల కోసం మారండి అని వేడుకొంటున్నాను. " అంటూ ముగించారావిడ.

చాలా బాధ కరమైన విషయం కదా ఇది. ఒక ఇంట్లో ఉంటూనే ఎవరూ ఎవ్వరితో మా
ట్లాడక పోవడం అనేది ప్చ్!
అసలు ఒకే ఇంట్లో ఒకమనిషికి ఇంకో మనిషికి అసలు సంబంధం లేదు అన్నట్లుగా ఎలా ఉండగలము.. అనేది ఎంత ఆలోచించినా అంతుబట్టదు నాకు. "మనతో ఎవరన్నా మాట్లాడక పోతే అది వాళ్ళ తప్పు, వాళ్ళు మంచి స్నేహితులని కోల్పొతారు, మనమెవ్వరితోనన్నా మాట్లాడకపోతే అది మన తప్పు, మనము మంచి స్నేహితులని కోల్పోతాము ". కాని ఇక్కడ మనం ప్రతి చిన్న విషయానికి ఎక్కువ ఆలోచించేసుకొని, అంటే మన స్నేహితులైతే ఏంటి, మన వాళ్ళు అనుకొనే ఎవరయినా సరె, కొన్ని పని వత్తిడుల వల్లకాని, ఇంకేదో వ్యక్తిగత పనుల వల్ల అయితేనేమి, మనతో కాస్త దూరంగా ఉన్నంత మాత్రాన , వారు మనకు దూరం అయిపోతున్నారు అనేసుకోడం అంత సబబుగా అనిపించడం లేదు. అసలు కమ్యునికేషన్ అంటే పొద్దస్తమాను కూర్చొని, మాట్లాడుకోడమో, మెయిల్స్ రాసుకోవడమో, చాటింగ్ చేసుకోడమో కాదు. దూరంలో ఉన్నా , ఒక బంధం నిలబడేందుకు, ఒక మనసుని ఇంకో మనసు అర్థం చేసుకోడం.

ఈరోజు నేను నా ప్రియ స్నేహితుడితోనో /స్నేహితురాలితోనో మాట్లాడలేక పోయాను అంటే , దాని అర్థం వాళ్ళని నేను మర్చిపోడం కాదు. మర్చిపోడానికి చేసే ప్రయత్నమో కాదు. నా మనసు వాళ్ళకి తెలుసు. వాళ్ళ మనసు నాకు తెలుసు. మా మనసులు ఊసులు చెప్పేసుకొంటున్నాయి. అని అనుకోవాలి కాని, దూరం అయిపోతున్నామేమో అన్న భావన రాకూడదు. అలా అని, అవతలి వాళ్ళు ఆ దూరం కూడా పెంచేసుకోకూడదు. మన పని వత్తిడిలో, మన వ్యాపకాలో ఒక మనిషిని కలవలేంతగా ఉన్నాయి అంటే ఆ అవతలి మనిషి మనల్ని "మిస్" అవుతున్నారు అనే మధుర భావన కలజేయాలి కాని, ఈ దూరాన్ని పెంచేసుకొని మనం లేకపోయినా ఆనందంగా బతికేయగలరు అనేంతగా కమ్యునికేషన్ గాప్ ఉండకూడదని నా అభిప్రాయం. ఎందుకంటే ఎంతటి ఆత్మీయులను కోల్పోయినా, ఎవ్వరు లేకపోయినా జీవితాన్ని కొనసాగించే గుండె నిబ్బరం మనిషికి ఆ దేవుడు ఇచ్చాడు. "నువ్వు లేక పోతే నేను లేను" అన్నవి మాటలే, ఏ మనిషి లేకపోయిన ఇంకో మనిషి ఉంటాడు, కాని ఆ మనిషి మనసు అతనిలో ఉండదు అది తను మెచ్చిన, తనకి నచ్చిన వారి వద్ద ఉంటుంది. ఆ భావన చెప్పడానికి మాటలకందనిది. అందుకే ..

మాటలకందని భావాలు మంచి మనసులు చెబుతాయి అంటారు.
****

9.28.2010

తల్లడిల్లే వేళా.. తల్లి పాడే జోలా..

పాల కన్నా తీపి పాపాయికి..
చిన్నప్పుడు అమ్మమ్మ అలా పట్టెమంచం మీద కూర్చుని కధలు చెప్తుంటే కళ్ళప్పగించి, చెవులు రిక్కించి, నోళ్ళు వెళ్ళబెట్టి వినేవాళ్ళము,అంత ఆసక్తి గా చెప్పేది. వేసవి సెలవలకని వెళ్ళేవాళ్ళము. అమ్మావాళ్ళు నలుగురు అక్కచెళ్ళెళ్ళు, ఒక అన్నయ్య వీరందరి పిల్లలు ఒక్కొక్కరికి ఆరుగురు చొప్పున లెక్కపెట్టినా మొత్తం అందరం పాతికమందిదాకా వుండేవాళ్ళము ఇక సందడే సందడి. చాల సరదాగా వుండేది. నలుగురు అక్కచెళ్ళెళ్ళూ వంట పనిలో హడావిడి గా వుండేవారు. పిల్లలందరికి అమ్మమ్మ కాపలా. కధలతో మమ్మలందరిని కట్టిపడేసేది ఆవిడ. అదేవిటో ! ఆ రామాయణం ఎంతకి తరిగేది కాదు ఎప్పుడూ హనుమంతుడు లక్ష్మణుడి కోసం సంజీవని పర్వతం తీసుకొని రావడం దగ్గిర ఆగిపోయేది. పిల్లలెవరో వినలేదంటూ మళ్ళీ మొదటి నుండీ చెప్పుకొచ్చేది. అలా ఆవిడ చెప్పిన కధలు మాని భోగి, వెర్రి వెంగళప్ప, ఒక రాజు ముగ్గురు కూతుళ్ళూ కధలు గుర్తుండిపోయాయి. ఇవన్నీ కాస్త మాకు వూహ వచ్చాక చెప్పిన కధలే. ఇక పాటల సంగతి చెప్పనక్కర్లేదు. జోల పాట దగ్గరినుండి మంగళహారతి పాట దాక అన్ని పాటలు నలుగురు అక్కచెళ్ళెళ్ళకి కరతలామలకమే. ఆస్వాదించే మనసుండాలి కాని అప్పటి పాత హీరోయిన్లు గుర్తొస్తారు వాళ్ళ పాటలయితే ఏంటి, మాటలయితే ఏంటి వింటుంటే.(కాసింత కళాపోషణ ఉంటే).
ఇప్పుడు ఈ ఉప్పొద్ఘాతమేంటి అని ఆలోచిస్తున్నారా? వస్తున్నా.. పాయింట్ కే వస్తున్నా. అప్పటి రోజులు అలా పెద్దవాళ్ళు చెప్పే కధలతోనో లేదా వాళ్ళు పాడే పాటలు వినడం తోనో సరదాగా గడిపేవాళ్ళము. కాని, ఇప్పటి పిల్లలికి అసలు మన చెప్పే కధలు కాని, పాటలు కాని వినే తీరిక కాని వుందంటారా? ఎంతసేపు వాళ్ళకి ఇచ్చే బండెడు హోంవర్క్ చేసుకోడంతోనే సరిపోతోంది. కనీసం వాళ్ళకి చెప్పే పాఠాలు చదివే తీరిక, కోరిక, ఓపికా కూడా వాళ్ళకి వుండడం లేదు. కాస్త తీరిక సమయం దొరికితే కంప్యూటర్ ముందు కూర్చుని ఆటలు లేదా ఆ టి.వి. లో కార్టూన్స్ ఇవి తప్పితే వేరే వ్యాపకాల జోలికి వెళ్ళడం లేదు. మరి పిల్లలు ఇన్ని వ్యాపకాలతో ఇంత బిజీ గా వున్నప్పుడు తన తల్లి ఏ కధ చెప్తోంది? ఏ పాట పాడుతోంది? అనే ఆలొచనల జోలికి పిల్లలు వెళ్ళలేరు, ఫలనా హోంవర్క్ చూసి ఫలనా టీచరు ఏమంటుందో ? లేదా ఫలనాది చదువుకోలేదు ఆ టీచర్ కొడ్తుందేమో అన్న ఆలోచనల వల్ల కలిగే భయం తల్లిని తన దగ్గిర వుండమనో తనదగ్గిర పడుకోమనో చెప్పెట్లుగా చేస్తాయి. అలా ఇద్దరూ ఒకచోట వున్నప్పుడు, కలిగే నిశ్శబ్ధం వల్ల మళ్ళీ రేగే భయం లాంటి ఆలోచనలు తల్లిని పాట పాడమనో లేదా కధ చెప్పమనో అడిగేలా ఉసిగొల్పుతాయి. ఉ.. కొడ్తూ నిశ్చింతగా నిద్రపోడానికి చేసె చిన్ని మనసుల అతి చిన్ని ప్రయత్నమది. అంతే కాని తల్లి ఏ కధ చెప్తుందో ఈ పాట పాడుతుందో అనే ఆలోచన కాదది. మరి అలాంటప్పుడు తన బాబు ఆ పూటకి నిద్రపోతే చాలులే , చాల అలిసిపోయి వున్నాడు అని తల్లి మర్నాటి తన ఇంటి యువరాజు ఏమిచేస్తాడో చెప్పడం అనేది యాదృచ్చికంగా జరిగేదే కాని, కావాలని చెప్పడం జరగదు. ఆ తల్లికి నిజంగా కధలు వస్తే కధలు చెప్తారు . ఆ నిముషంలో తనకి కధలు వచ్చా లేదా పాటలు వచ్చా, అని ఆలోచించదు తల్లి మనసు. ఒక్కటే ఆలోచన బాబు పడుకోవాలి అంతే.
ఈ సంధర్భంగా మీకో చిన్న ఉదాహరణ చెప్పాలి. మా బాబు చదువు విషయంలో చాలా టెన్షన్ పడిపోతుంటాడు. బాగానే చదువుతాడు కాని భయం ఎక్కువ తనకన్నా ఇంకెవరో బాగా రసేస్తారు అనే భయం ఎక్కువ వాడికి. అందుకే చిన్న చిన్న స్లిప్ టెస్ట్ లకి కూడ వాడు మూడింటికి, రెండింటికి లేచి చదివేస్తూ వుంటాడు, అదిగో అలాంటప్పుడు నన్ను లేపేసి అమ్మా! ప్లేజ్ నా దగ్గిర వుండవా! అంటూ తన దగ్గిర కూర్చోబెట్టుకొంటాడు తోడుగా. ఎన్నోసార్లు ధైర్యం చెప్పాను వాడికి, అయినా వినడు. ఒక్కోసారి వాడే మైండ్ డైవర్ట్ చేసుకోడానికో ఏమో అమ్మా! ఎమన్నా మాట్లాడు అంటాడు. పాట పాడనా నాన్న!! అంటు పాట పాడి (నా గొంతు అస్సలు బాగోదు. కాని ,నేను ఆ క్షణం ఆలోచించేది బాబు పడుకోవాలి ప్రశాంతంగా నిద్రపోవాలి అన్నదే నా ఆలోచన ) వాడు నిద్రపోయే ప్రయత్నం చేస్తాను తప్పితే నా గొంతు బాగుందా లేదా అని నేను ఆలోచించను.
అసలు అమ్మ చెప్పేది తెలియని వూహ లేని వాళ్ళకి ఇక ఈ పాటలు, కధలు అస్సలు అవసరం లేదు తోడుగా పక్కన వుంటే చాలు వాళ్ళకి. కాని కాస్త వూహ తెలిసిన పిల్లలికి మాట కూడ ఒక కధ రూపేణా వుండాలి. ఇక పాట అయితే వాళ్ళ తల్లడిల్లే మనసులని సేద తీర్చేలా వుండాలి అని నా అభిప్రాయం మరి మీరేమంటారు??

9.26.2010

వేలు పట్టి పరిగెత్తిస్తుంటే...

"అమ్మా! ప్లీజ్ ఈ ఒక్క లెక్క! ఇంక చెప్పకు ఇప్పుడు, 'ఆట' ప్రోగ్రాం వస్తుంది చూడాలి ఈరోజు గ్రాండ్ ఫినాలే," అంటూ పాప

సరే! పోనిలే , వాళ్ళు ఎక్కువ టి .వి చూడరు కదా అని ఒప్పుకొని, ఫ్రండ్ కి ఫోన్ చేసా మాములుగా క్షేమ సమాచారాలు తెలుసుకొందామని,

"హాయ్ ! ఇప్పుడు చాలా బిజీ ఇంకాసేపట్లో 'ఆట ' ప్రోగ్రాం వస్తుంది ఆ టైం కల్లా డిన్నర్ అయిపోవాలి, ఈరోజు గ్రాండ్ ఫినాలె ఏంటీ నువ్వు చూడడం లేదా?" చకా చకా మాట్లడేస్తూ, బై చెప్పేసింది ఫ్రండ్.

నిజమే! నేను సాధారణంగా టి.వి చూడను, చూడను అనేకన్నా టైం తక్కువ, మళ్ళీ మర్నాడు వంటకి సంబంధించిన కార్యక్రమాల్లో మునిగిపోతాను ఆ టైం లో, ఇలాంటి వాటిని వింటాను కాని, చూడడం అనేది చాలా తక్కువే. వీళ్ళందరూ ఇంతలా చెప్తున్నారని ఆరోజు చూసా, చూసిన తరుర్వాత ఆనందం కన్నా, బాదే ఎక్కువ కలిగింది నాకు. ఎందుకంటే, ఇలాంటి కార్యక్రమాలు , పిల్లల జీవితాలను శాసిస్తున్నాయి. తల్లితండ్రుల పేకమేడల లాంటి ఆశాభావాలను ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నాయి.

"వేలు పట్టి నడిపిస్తుంటే చంటిపాపలా, నా అడుగులు చూపే గమ్యం చేరేదెలా?"

ఒక సున్నితమైన ఆలోచన అది, తల్లి తండ్రులు పిల్లల గురించి పెట్టుకొన్న ఆశల ప్రతిరూపం అలా వేలు పట్టి నడిపించడము. ఎంత పెద్దయినా తమ పిల్లలు పసి పిల్లలే అనే సున్నితమైన ఆర్ధ్రత వుంది ఇందులో. ఇదంతా ఒకప్పుడు.

కాని ఇప్పుడు? పిల్లలు ఎంత తొందరగా పెరుగుతారా? ఎంత తొందరగా సంపాందించేసి తమని ఉన్నత స్థాయి కి తీసుకెళ్తారా అని అతిగా ఆలోచించేసి, ఆ అతి ఆలోచనలని, అంత లేత వయసులో, ఆ మోయలేని భారాన్ని పిల్లలపై రుద్దేసి, వాళ్ళ మనసులు తట్టుకొలేనంత శిక్ష వేసి, పెద్దవాళ్ళు కన్న కల కాస్తా కల్ల అయితే, దానికి కూడా కారణం పిల్లలిదే అని, వారిని శతృవుల్లా చూడడం, దాని వల్ల జరిగే అనర్ధాలకు ప్రతి రూపం ఇప్పటి పిల్లల జీవితం.

ఈమధ్య బెంగాలి చానెల్ లో ఇలాంటి డాన్స్ ప్రొగ్రాం లోనే, పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి డాన్స్ చేసిన ఓ అమ్మాయి, తను గెలవలేదన్న షాక్ తో పెరాలసీస్ వచ్చి మూగదయ్యింది అన్న వార్త విన్నా. అంటే ఇక్కడే అర్ధం అయిపోతుంది,ఆ పాప మీద తల్లి తండ్రులు + ఆ చానెల్ కి సంభందించిన వాళ్ళు(నిర్వహకులు+ స్పాన్సర్స్) వత్తిడి ఎంత వుందో.

ఒకప్పుడు వీధి డ్రామలకి పరిమితమైన ఈ డాన్స్, ఇప్పుడు మీడియా ద్వారా , పసి పిల్లల జీవితాలతో ఆడుకొంటోంది. పిల్లల మధ్య పోటీ అనేది ఆరోగ్యదాయకమే, కాని ఇలా డబ్బుతో ముడి పెట్టి , వాళ్ళ వయసుకి మించిన పనులు వల్ల, అది పైశాచికత్వం అవుతుంది కాని, ఆనందం అవదు. దీనికి తప్పు, ప్రోగ్రాం నిర్వహించే వారిది అనేకన్నా, వాటికి వత్తాసు పలుకుతూ, తమ పిల్లలిని డబ్బులు తెచ్చే మర మనుషులుగా మార్చేస్తున్న తల్లి తండ్రులది.

10 వ తరగతి చదువుతున్న బాబు చేత కుప్పిగంతులు వేయిస్తూ, దానికి 'ఎక్స్ ట్రాడరీ' లాంటి వచ్చిరాని తెలుగు/ఇంగ్లీష్ జడ్జిమెంట్, ఆ కమెంట్స్ కి , మంచి భవిష్యత్తు వున్న ఈ పిల్లలు ఎగిరి గంతేసి చదువులను పక్కన పెట్టి మరీ ఈ డాన్స్ ల కోసం పోటి పడడాలు, ఆనక బహుమతుల రాజకీయాలలో చిక్కుకొని, జీవితాన్ని ఛిన్నా భిన్నం చేసుకోడం, వీటన్నిటికీ తల్లితండ్రుల వత్తాసు. దీనికన్నా వినాయకుడి నవరాత్రుల ఉత్సవాలకు జరిగే ఆ వీధి డాన్సులు మేలేమో అనిపిస్తోంది . అర్ధం లేని ఈ పోటీల వల్ల మాములుగా ఆడుతూ,పాడుతూ పెరగాల్సిన పిల్లలు , వాళ్ళ బాల్యాన్ని ఇక్కడ కుదువ పెట్టేస్తున్నారు.
*****

9.25.2010

"పక్కింటి మంత్రం " -వావ్! వాట్ ఆన్ ఐ(అవు)డియా!

ఎదురింటి మంగళ గౌరి వేసుకొన్న గొలుసు చూడు, ... ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగు పడ్డారు నగా నట్రా టి.వి గట్రా అంటూ ....నేనేరోజన్నా బాధపడ్డానా? మరి చూడండి! నిన్న కాక మొన్నే కదా మీకు, నా చిటికెన వేలు నలిగి ఎంతో బాధపడిపోతూ, కందిపచ్చడి ఎలా చేసానో .. దాని రుచి ఎంతో బాగుంది అని చెప్తూ , మావారు గుటుకు గుటుకు అంత అంత ముద్దలు చేసుకొని తిన్నారని చెప్పానా! ఇదిగో! ఈ రెండు రోజులనుండి అదేమిటో నేనెమి చేసినా "ఉప్పు ఎక్కువయ్యింది అనో ,"కారం తక్కువ వేసావనో" వంకలు పెట్టడం మొదలు పెట్టారు. అయినా ఆయనని ఏమి లాభం! మా అమ్మ చెప్పనే చెప్పిందిలెండి "పెరటి చెట్టు వైద్యానికి పనిరాదని" హు! నేను వింటేగా..

"ఈ మధ్య ఇలా మారిపొయారెంటబ్బా? నాకయితే అన్నీ బాగానే వుంటున్నాయి" అని అనుకొని పిల్లలిని అడిగాను. "కూరలు అసలేమి బాగుండడం లేదామ్మా"? అని "చాలా బాగంటున్నాయమ్మా, మా ఫ్రండ్స్ అందరికి నువ్వు చేసే వంట ఎంతిష్టమో" అంది మా పాప. నేను ఆశ్చర్యంగా "మీ ఫ్రండ్స్ కా?? మరి నువ్వేమి తింటున్నావు?" అని అడిగితే "మా ఫ్రండ్స్ తెచ్చుకొన్నది", చల్లగా చెప్పింది . అదిగో! అప్పుడు వెలిగింది నా కళ్ళముందో వెలుగు. ఎంటా?? అని చూసుకొంటే నా జ్ఞాన నేత్రం తెరుచుకొంది. కళ్ళు ఒకసారిగా విచ్చుకొని కనువిప్పు కలిగింది.

ఒహ్! ఇదన్నమాట అసలు సంగతి! ఇంతవరకు అసలు తెలియనేలేదని ఎంతో మధనపడిపోయాను. ప్చ్! ఇక లాభం లేదని, ఆ రోజు నుండి నేననుకొన్న పధకాన్ని అమలులో పెట్టాను. ఇహ చూసుకొండి! ప్రతి రోజు "ఈ కూర ఎంత బాగుందో!" " ఏంటి ఈ పప్పు అబ్బో! అమోఘం! అద్భుతం! అసలు కూరలంటే ఇలా వుండాలి" అంటూ, మావారు తెగ పొగిడేస్తూ తింటుంటే, నిజం చెప్పొద్దు! నా కళ్ళళ్ళో ఆనందబాష్పాల లాంటి కళ్ళనీళ్ళు కాస్త అసూయతో..ఇంకాస్త ఈర్షతో!

కాని మనసులో ఎక్కడో చిన్న అనుమానం, హఠాత్తుగా ఎప్పుడైన అసలు నిజం తెలిసిపోతే?? లేదా కూరలు అవి తెగ నచ్చిపోయి ఈయన ఏ డైమండ్ నక్లేస్సో,లేదా ఇంకేదో వజ్రపుటుంగరమో తెచ్చేసి, నా కళ్ళు మూసేసి "ఏమి తెచ్చానో చెప్పుకో చూద్దాము" అని గారం చేసేసి "నాకు తెలీదు మీరే చెప్పండి" అని నేను మారాం చేస్తే, నా ముందు ఆ ఫలాన ఉంగరమో, నక్లేసో చూపించేసి....."నీకు కాదుగా నాకు రోజు ఎంతో బాగా కూరలు అవి చేసి పెడ్తున్న పక్కింటి పిన్ని గారికి, ఎదురింటి ఆంటి కి, వెనకింటి వెంకయమ్మగారికి" అని చెప్తే?..

నాకెందుకో నా ఊహలలో, ఎదురింటి, పక్కింటి, వెనకింటి వార్ల పిన్నిగార్లు, ఆంటిగార్లు అందరు వంటి నిండా నగలతో మావారికి బోల్డూ థాంక్స్ చెప్పేస్తున్నట్లుగా ..

ఇదండీ సంగతి!! మీకర్ధమయిపోయిందిగా నా ప్లాన్. రోజు నేను చేసే వంటకాలన్ని పక్కింటి పిన్నిగారు చేసారనో, లేదా ఇంకెవరో చేసారనో చెప్తూ , ఈరోజు వరకు నా పతి భక్తిని నిరూపించుకొంటూ వస్తున్నాను. ష్!! మీరు చెప్పకండీ ప్లీజ్! అయినా నాకు తెలుసు లెండి! మీకందరికి కూడా పొరిగింటి పుల్ల కూర రుచి గానే వుంటుంది గా! కాబట్టి చెప్పరు.

కాని , ఏ మాటకామాట చెప్పుకోవాలి.నా కల ఎప్పటికైనా నేరవేరుతుందన్న నమ్మకం నాకుంది. మావారు తప్పకుండా మారిపోతారు, ఎప్పటికైనా నా వంటలన్నీ ఇదివరకటిలా మెచ్చేసుకొని, నాకో గొప్ప వజ్రాల నక్లేస్ తెచ్చేసి "ఒహొ! మేఘమాలా.. చల్లగ రావేలా.. మెల్లగ రావేలా .. నిదురపోయే రామచిలక బెదరిపోతుందీ..కల చెదరిపోతుందీ.. అని పాడేసుకోని, నిద్రపోతున్న నన్ను లేపకుండా, సుతారంగా నా మెడకి అలకరించేస్తారని చిన్ని చిన్ని ఆశ. చూద్దాము! ఇంకెన్నాళ్ళో ఈ పక్కింటి మంత్రం.

9.24.2010

ఆనందం - మంచి కాఫి తాగిన ఫీలింగ్ ....బాధ - చేదు కాఫిపొడుం లాంటిది.

మీ అందరికి చిరుపరిచితురాలు, వనితావని వేదిక  బ్లాగరు, వేద (మా అక్క) పుట్టిన రోజు సందర్భంగా మళ్ళా ఆ మధుర స్మృతులు మీ ముందు ..


పిల్లలందరూ కలిసి అక్కచేత కట్ చేయించిన కేక్ సంబరం.. :)




 ******
 చిన్ననాటి ఆ అనుభూతులు కలిగిన ఆనందాలు.. కష్టాలు బాధలు అన్నీ ఒక్కోసారి మదిని స్పృశిస్తుంటే అనిపిస్తుంది ఓ మంచి నేస్తం వుంటే బాగుండేది ఇలాంటి అనుభూతులని పంచుకోడానికి అని..
అమాలపురం దగ్గిర గోడిలంక... చిన్న పల్లెటూరు.. ఇప్పుడెలా వుందో కాని అప్పుడు ఆ ఒండ్రుమట్టి... ఈతకాయలు .. చెరువు గట్టుదగ్గర ఆటలు అరుగుమీద తాతగారి పంచాయితులు అప్పుడప్పుడు వెళ్ళినా ఎప్పుడు గుర్తుండిపోయేవి.. పెద్దకళ్ళాడొస్తున్నాడంటు (అప్పట్లో మా ఇంట్లో పాలేరు సూరిగాడు అని పిలిచేవారు) పాలేరుని చూపించి భయపెట్టి అన్నం తినిపించే అమ్మమ్మ తీయని గోరుముద్దలు... తలుచుకొంటే ఎప్పుడు అక్కడే అలా వుండిపోతే ఎంత బాగుండేది అన్నంత హాయిగా వుంటుంది.. నేను మా బడి సెలవలిస్తే మా తమ్ముడిని తీసికెళ్ళడం కుదరకపోతే అమ్మ నన్ను తీసికెళ్ళేది.. అలా నేను వెళ్ళింది వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు కాని ఆనందాలు మాత్రం బోల్డు..
అదిగో అలా ఓ వెసవి సెలవల ప్రహసనం.. అక్క అక్కడే చదువుకొంటూ ఉండేది..అమ్మమ్మ కి తోడుగా అని పంపించారు... సో!! నేను అక్కడివారికి కొత్త.. పైగా పట్నం నుండి వచ్చాను అంటే ఇంకా కొత్త + వింత(అని నా ఆలోచన)..
లేక లేక పుట్టాడని అన్నయ్యని... ఆడపిల్లల్లో మొదటిదని అక్కని... చివరగా పుట్టాడు పసివాడు అని తమ్ముడిని మా అమ్మ అందరిని గారంగా ప్రేమగా చూస్తుంది ...నన్ను మాత్రం వదిలేసిందని నాకు చిన్నప్పటినుండి మా అమ్మ మీద ఒక అపోహ ఉండేది...(అసలు మధ్యలో పుట్టిన అందరికి ఈ ఆలోచన వుంటుందేమొ) ఆ ఆలోచన.. మా అక్కకి నాకు క్షణం పడకుండా చేసింది చిన్నప్పుడు..

గోడితిప్ప సంతకి వెళ్దామని అక్క నన్ను బయల్దేరతీసింది.. మార్గ మధ్యలో తొందరగా నడూ అంటూ వెనకనుండి ముందుకు తోసింది.. జాగ్రత్తగా వుండకపోవడమో లేక ఇంకేంటో కాని పడ్డాను.. పెదవి చిట్లి రక్తం.. అందరూ నీళ్ళతో కడుగమ్మా అని సలహాలు... నాకు మటుకు పిచ్చ ఆనందం.. నాకు ఛాన్స్ దొరికింది.. నాకొస్తున్న రక్తం చూసి ఈరోజు ఇంట్లో అందరూ అక్కని తిడ్తారు... అమ్మయితే కొడ్తుందేమొ కూడా.. లేకపోతే ఎప్పుడు అక్కనే ముద్దు చెయ్యడం.. నన్ను అసలు పట్టించుకోరు... వీళ్ళందరు కడగమంటున్నారు .. ఈ రక్తం రావడం ఆగిపోతే అసలు దెబ్బ సరిగ్గా తగలలేదనుకొంటారు... చిన్నదే అని వదిలేస్తారెమో... అమ్మో అసలు అలా వీలు లేదు... అక్క పక్కనుండి పోరు పెడ్తోంది.. దా !!అక్కడ నీళ్ళు వున్నాయి కడుగుతాను అని.. ఆహ.. వింటేనా.. నాకేమక్కర్లేదు.. చెప్తానుండు నీ పని..(మనసులో ఆనందం ఈరోజు అయిపోయింది నీ పని) మద్య మద్యలో ఏయ్! ప్లీజ్ అమ్మకి చెప్పకే నేను తోసానని.. నీకు నా గౌన్లన్నీ ఇచ్చేస్తాను అని అక్క బతిమాలుతుంటే నాకు నవ్వు.. నా ఆలోచనలు మాత్రం.. ఇంటికెళ్ళగానే చెప్తే అమ్మ అక్కని కొడ్తుందా?? ఊరందరు వస్తారా?? అయ్యో !! ఎంత రక్తమో అని బాధపడ్తారా??.. అమ్మమ్మ "నా బంగారు తల్లి నీకింత దెబ్బ తగిలిందా" అంటూ ఆ బుజ్జగింపు ఎంత బాగుంటుంది.. ఇంకా గట్టిగా ఏడ్వాలి ఈ ఏడుపు సరిపోదు.. అక్క బతిమాలుతూనే వుంది ఇంకా... లేదు అసలు వినకూడదు..

ఇల్లు దగ్గరికొచ్చింది... తలుపుకొట్టగానే అమ్మమ్మ.. అయ్యో!!తల్లి ఏంటే రక్తం.. ఏమయ్యింది (అమ్మమ్మ అనుకున్నట్లుగానే స్పందించింది కాని అమ్మే ఏంటి అలా అక్కడినుండి కదలడం లేదు అన్న ఆలోచన ) అని అడగగానే.. అక్క తోసింది అంటూ గట్టిగా ఏడుపు.. నేను అనుకొన్నది ఏమి జరగట్లేదు... అందరు నింపాదిగానే వున్నారు ఎవరూ కంగారుపడట్లేదు... ముఖ్యంగా అమ్మ.... అక్కని ఏమి అనట్లేదు.. పోనిలే అమ్మా!! దీనికే కాస్త దుడుకుతనం ఎక్కువ అది చూసుకోలేదేమొ.. కాస్త కాఫిపొడుం పసుపు పెడ్తే అదే తగ్గిపోతుంది.. ఏడవకే!! నీకేమి కాలేదు అని నావైపు చూసి కసరడం..

హు! అమ్మ ఎప్పుడూ ఇంతే ...నేను ఎప్పుడూ డామిట్ కధ అడ్డం తిరిగింది అని అనుకోవడమే..

ఇలాంటి సంఘటనలు (మా అక్కకి నాకు సంబంధించి ) చాలానే వున్నాయి .. కాని మా అక్క శాంత స్వభావాన్ని నా దుడుకుతనాన్నీ సమన్వయించేసి సర్ధి చేప్పేసేది అమ్మ..అప్పుడవి కాఫిపొడుమంత చేదుగా వున్నా ఇప్పుడు తలుచుకొంటుంటే సరదాగా మంచి కాఫీ తాగిన ఆనందాన్ని ఇస్తూవుంటాయి...


*****

9.23.2010

ఆడవాళ్ళమండి మేము

"నాలో కలిగిన ఈ అంతర్మధానినికి దగ్గరగా ఉండే ఈ ఆలోచనలు ఒక అమ్మాయి నుండి రావడం కొత్తగా ఉంది"-నేను రాసిన 'సప్తపది' టపా స్పందనగా దిలీప్ గారి వ్యాఖ్య.
పై వ్యాఖ్య నా ఆలోచనలనో ఊపు ఊపింది నిజం చెప్పాలంటే.
దిలీప్ గారి ఈ ఆలోచన వల్ల నాకు మొదట్లో " ఎందుకు ఆడవాళ్ళకి ఇలాంటి ఆలోచనలు కలగకూడాదా?"అని ప్రశ్నించాలని అనిపించినా, తరువాత నా ఆలోచనలని కాస్త అటువైపు మరలిస్తే, అందులో నిజం లేకపోలేదనిపించింది. ఎందుకంటే, "మల్లె తీగ వంటిది మగువ జీవితం, చల్లని పందిరి ఉంటే అల్లుకుపోతుంది" అంటూ ఆడవాళ్ళు ఎప్పటికి అధారపడేవాళ్ళే చల్లని పందిరి ఉండాల్సిందే, ఫలానా వాళ్ళ కూతురు, ఫలాన వాళ్ళ సోదరి, ఫలాన వాళ్ళ బార్య అంటూ ఎప్పటికప్పుడు ఎవరిదో ఒకరి పేరు తగిలించి ఆధారపడేలా చేస్తారు తప్పితే వాళ్ళ సొంత పేరుతో గుర్తించే వారు ఎంతమంది? ఈ విధమైన ఆధారపడడం అనే విధానాన్ని, ఉగ్గుపాలతో సహా నేర్పేయడం వల్ల వాళ్ళకంటూ స్వతంత్ర అభిప్రాయాలు, సొంత ఆలోచనలు తక్కువే ఒకప్పుడు (ఇప్పుడు కూడా కొంతమంది ఇలానే ఉన్నారు). మరి అలాంటప్పుడు దిలీప్ గారి ఆలోనలు తప్పు లేదు అనిపించింది.

అసలెక్కడిదాకో ఎందుకు? నేను రాసిన 'సప్తపది ' ఆర్టికల్ కి మహిళా పాఠకుల స్పందన మటుకు ఎంతవరకు ఉంది? (theresa  గారు తప్పితే) అక్కడికీ నా స్నేహితులని ఒకరిద్దరిని "మీ అభిప్రాయం ఏంటి" అని అడిగితే "బాగుంది" తప్పితే ఇంకేవిధమైన స్పందనా లేదు. మా ఆడవాళ్ళమంతా ఇంతే, టి.వి లో అత్తా కోడళ్ళ ఏడుపుగొట్టు సీరియళ్ళను, మా శక్తి కోలదీ కన్నీళ్ళు కార్చేస్తూ, రెప్పేయకుండా అసలేవిధమైన ఆలోచన లేకుండా చూసేసి, ఆనక అంతే కోపంతో సదరు అత్తాకోడళ్ళని శాపనార్ధాలు పెట్టేస్తూ, దీని గురించి అనవసరంగా అర్ధం లేని చర్చలు చేసేసుకొంటాము వెరసి ఫొను బిల్లులు, సెల్ బిల్లులు తడిసి మోపెడంత అయ్యేలా.
ఒక అర్ధవంతమైన చర్చ ఏదన్నా జరుగుతుంటే అరంగుళం కూడా ముందుకు కదలము, పైపెచ్చు అదేదో మగవాళ్ళ పనే మనకి సంభందం లేదన్నట్లు ఉంటాము. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకరో ఇద్దరో ఇందుకు కొంచం భిన్నం గా ఉంటే, మిగతావారికి "ఆడవాళ్ళు ఇలా కూడా ఆలోచిస్తారా ?" అని అనుకోవడం సహజమేగా మరి.
రోజూ సాయంత్రం నేను నా స్నేహితురాలు కలిసి ఎక్కే ఓ లోకల్ ట్రైన్ లో మా ముందు స్టేజ్ లో ఒక మహిళ ఎక్కుతారు, ఎంతో హుందాగా, చిరునవ్వుతో ఆ పలకరించే విధానం అది నాకు చాలా నచ్చుతుంది. ఎందుకో ఆవిడని చూడగానే ఒక విధమైన గౌరవం దానితో పాటు ఆవిడ మాట్లాడే విధానం, అదీ చూస్తుంటే ముచ్చటేస్తూ ఉంటుంది. మాట్లాడకుండా ఆవిడనీ, ఆవిడ మాటలని గమనిస్తూ ఉంటాను.
ఓ రోజు మాటల సంధర్భంలో, ఈ విషయం నా స్నేహితురాలితో మామూలుగా అన్నాను.
"ఆ! ఆవిడకి అంత లేదు లెండి, వాళ్ళాయన పచ్చి తాగుబోతు, తాగి రోడ్డు మీద పడిపోతూ ఉంటాడు" అంది నా స్నేహితురాలు వ్యంగ్యంగా.
వాళ్ళయన తాగి పడిపోడానికి, నాకు ఈవిడ మాట్లాడే తీరు నచ్చడానికి అసలు సంభందమంటూ ఏమైనా ఉందా? ఒక అమ్మాయిని/మహిళ వ్యక్తిత్వాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులతోనో లేదా భర్త ప్రవర్తనతోనో అంచనా వేయడం ఎంతవరకు సబబు? ఎవరికి మటుకు ఉండదు తన భర్త క్షేమంగా ఉండాలని, అలా ఈవిడ మటుకు చెప్పుకోదా ఇది మంచి పద్దతి కాదని? అతను వినకపోతే ఈమె ఏమి చేస్తుంది? అంతమాత్రానికి వాళ్ళని వాళ్ళ సొంత వ్యక్తిత్వాన్నీ చులకన చేస్తామా? చేతనైతే ఓదార్చగలగాలి, కాని భర్త ని అడ్డుపెట్టుకొని మనిషిని చులకనగా అంచనా వేయడం అంత సబబు కాదేమొ అనిపిస్తుంది నాకు.
నా మటుకు నాకు, భర్త హోదాని అడ్డుపెట్టుకొని ఆడంబరంగా ఉండడమో లేదా భర్త చెడు అలావాట్లని తలుచుకొని కృంగిపోతూ మనల్ని మనం చులకన చేసుకొవడం అంటే నచ్చని విషయం. మన సొంతంగా మనమేమి చేయగలము అనేది ఆలోచించాలి. భర్త పేరో, లేదా ఇతర కుటుంబ సభ్యుల పేరో వాడుకొని పని చేయించుకోవడం అంటే , అప్పు చేసి పప్పు కూడు తింటున్నామేమో అనిపిస్తుంది.
మారుతున్న ఈ తరంలో ఆడవాళ్ళు ఇలా భర్తని బట్టి బార్య అన్నట్లుగా ఉంటే, మరి ఇలాంటి అంతర్మధనం అమ్మాయిలో కలగడం కొత్తగా ఉంది అని అనడం అమోదయోగ్యమేగా మరి.
"నీతో ఎవరన్నా మాట్లాడకపోతే అది వాళ్ళ తప్పు, ఓ మంచి స్నేహితురాలిని కోల్పొతారు, నువ్వెవరితోనన్నా మాట్లాడకపోతే అది నీ తప్పు, ఓ మంచి స్నేహితురాలిని కోల్పోతావు " అని అనుకొని మన అభిప్రాయాలని నిరభ్యంతరంగా చెప్పగలగాలి.

సప్తపది

ఇది ఏ విశ్లేషణలనూ, కాని ఏ మతాలని కాని ఏ కులాలని కాని, ఏ వ్యక్తిని కాని కించపరిచే ఉద్దేశ్యం కాదు. ఎవరినన్నా నాకు తెలియక భాదిస్తే క్షమించమని ప్రార్ధన.

ఇప్పుడే పర్ణశాల లో 'సప్తపది ' చదివాను, ఒక సినిమా ఇలా తీస్తే బాగుండేది, ఆ సినిమాలో అంతా ఓ కుల ప్రస్తావన సంభందించిన అంశం పైన చర్చ, సోమయాజులిలా, హేమ అలా, గౌరినాధుడు ఇంకోలా అనుకొంటూ వెశ్లేషణ ని అన్ని కోణాలనుండి పరిశీలించి మరీ బ్లాగు పాఠకులని ఆలోచింపజేసారు. ఒక సినిమాకి స్పందించ తీరు అభినందనీయమే. మరి నిజజీవితంలో అలా జరిగితే? అంత పెద్ద పెద్ద మాటలు వాడి, అంత విశ్లేషణ నేను చెయ్యలేను కాని, నాకు తెలిసినంతలో ఎంతో కొంత చెప్పడానికి ప్రయత్నిస్తాను. అసలు నాకెందుకు అని ఊరుకొన్నా, కాని ఊరుకోలేని మనసుని ఊరడించలేక రాస్తున్నదే ఈ సప్తపది .

ఇక్కడ నిజజీవితం లో హేమ, ఎంతో గొప్పగా చెప్పుకొనే ఉన్నత కుటుంబంలోని పుత్రిక , చిన్నాప్పటినుండి ఆచారవ్యవహారంటూ అన్నీ కట్టుబాట్ల మద్య పెరిగింది. అదే ఆ సినిమాలో లా హరి ని ప్రేమించి ఏ సోమయాజుల (మారే) అవసరం లేకుండానే పెళ్ళి చేసుకొంది. సప్తపది సినిమా ఇక్కడితో ముగుసింది. కాని నిజ జీవితం ఇక్కడితో ఆగిపోలేదు. ఇక్కడే మొదలవుతుంది.

ఏ ఆచార దురాచారాలైనా మనుషులు ద్వారా కనుగొనబడినవే. వాటిని రూపు మాపెందుకు తమ వంతు కృషిగా, చేస్తున్న ప్రయత్నమే (కొంత వ్యాపార దక్షతని మేళవించి) ఈ సినిమాలు, ఈ కళా తపస్వుల ప్రయత్నాలు అవి, కాని ఒక్కటి మటుకు నిజం! ఈ ఆచారలను, దురాచారాలన్నిటినీ కూకటి వేళ్ళతో సహా పెకిలించలేమన్నది అక్షర సత్యం. మరి ఒక ఆచార వ్యవహారంలో 23 యేళ్ళు ఒక ఆచారానికో , ఒక మడి కట్టుకొన్న వ్యవహారానికో అలవాటు పడ్డ వ్యక్తి, ఒక్కరోజులోనో, ఒక్క గంట లోనో ,ఓ సినిమా చూసినందువల్లో, మారడమనేది అసాధ్యం.

ఇక బార్య భర్తల భందం:

"ధృవంతే రాజావరుణో ధృవం దేవో బృహస్పతిః ధృవంతే ఇంద్రశ్చాగంచ్ఛ రాష్ట్రం థార్యతాం ధృవం."
అంటే, ఈ గృహస్తూ జీవితం నిలకడగా ఉండాలని, చివరిదాక ఇద్దరూ ఎడబాటు లేకుండా జీవించాలని, అన్యోన్యమైన దాంపత్యాన్ని కలిగి ఉండాలని, పెళ్ళి సుమూహర్తం సమయంలో , వేదపండితులు, బ్రహ్మగారు ౠగ్వేదం లోని ఈ మంత్రాన్ని ఉచ్ఛరిస్తారు.
చివరి దాక ఉండే ఈ భందంలో, మరి అలా ప్రేమ అంటూ ఈవిధమైన(కులాంతర, మతాంతర) వివాహం చేసుకొన్న వారు ఎంతమంది చివరిదాక నిలకడగా ఉన్నారు? అసలు ఆ భర్త కాని, ఈ బార్య కాని ఎవరు మారాలి ఇద్దరిలో? భర్త /బార్య తను శాఖాహారిగా /మాంసాహారిగా మారలా? ప్రేమాకర్షణ మత్తులో మారుతాను అని చేసే బాసలన్నీ జీవితాంతం ఉంటాయా? సంవత్సారాల తేడాలోనే "నా కుటుంబం, మా అలవాట్లు, మా ఆచారాలు" అంటూ ఆ రెండోవారిని తమ వైపు తిప్పుకొంటారు.
ఇక్కడ నేను అమ్మాయిలు మాత్రమే అనడం లేదు ఓ ఉన్నత కుటుంబలోని ఓ అబ్బాయి అమ్మాయి కోసం ఆచారాలన్నీ పక్కన పెట్టేసి అమ్మాయి వైపు కులం లోకో మతంలోకో మారిపోయి చేసుకోడం నిజంగా దయనీయ పరిస్థితి. ఇక ముందు తరంలో కనక ఈ కుల ప్రస్తావన కనక రావడమంటూ జరిగితే(వస్తుంది, ఇంకా ఎక్కువగా ఇప్పుడు మొహమాటపడి చెప్పుకోడం లేదు కాని, అందరికి వుంది ఈ కుల పట్టింపు) వాళ్ళకి పెద్దవాళ్ళు చెప్పేది ఇలా ఉంటుంది. "పూర్వం మా ముందు తరంలో , ఇన్నీ ఆచారాలు ఇన్ని వ్యవహారలు ఉండేవి అప్పట్లో వాళ్ళు నిప్పుతో నీళ్ళు కడిగే వాళ్ళు , రాను రాను వాళ్ళు అంతరించి పోయారు వాళ్ళ ద్వార పరిచయం కాబడ్డ ఆ ఆచారాలు లేవు " అని. ప్రతీ వారికి కుల మత పట్టింపులు ఉన్నాయి, వాళ్ళ కులం గురించో మతం గురించో గొప్పగా చెప్పుకొంటుంటారు. వాళ్ళందరూ హ్యప్పీగానే ఉన్నారు వాళ్ళ పేర్ల చివర వాళ్ళ కులాల పేర్లు తగిలించుకొని. " కులాలు అంతరించి పోవాలి, అంతరించి పోవాలి" అంటూ గొంతెత్తి అరిచే వాళ్ళు కూడా, మర్నాడు పేపర్ లో తన పేరు చివర తన కులం పేరు లేదని అరిచేవారే.
ప్రతీ ఆచారం వెనక ఓ అర్ధం ఉంటుంది అని, అర్ధం చేసుకొని ఏ కుల ప్రస్తావన లేకుండా సంతోషంగా ఉండగలగడమనేది ఓ కళ. ఇది సినిమా కాదు 3 గంటల్లో ముగిసిపోవడానికో, ఓ 6 పేజిల వెశ్లేషణ రాసి చర్చించుకోడానికో, నిజ జీవితం. ప్రేమించామంటూ, జీవితం ఎవరి చేతుల్లోనో పెట్టేసి మారిపోవడం కాదు. మన జీవితం మనం జీవించడానికి, అలాగే మన మీదా మన వ్యక్తిత్వం మీద మనకి నమ్మకం ఉండాలి కాని, అవతలి వాళ్ళు మారిపొమ్మంటే గుడ్డిగా మారడం కాదు. ఈ జీవితాన్ని మనకి నచ్చిన రీతిలో మలుచుకోడానికి మనకు మనమే కళా తపస్వులం, మనమే విశ్వనాధులం కూడా.
అందరూ ఇలా ఉంటున్నారని నేను అనడం లేదు, ఎక్కడో కొందరు ఆదర్శంగా కూడా ఉంటున్నారు అని చెప్పడం నాకిస్టం లేదు. ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారేమో కాని నా చుట్టుపక్కల ఎక్కడ నాకు కులం అవసరం లేదు, కుల పట్టింపు లేదు, నా పిల్లలు అన్నిటికి అతీతులు మేము మనుషులం అంతే అన్నవారు లేరు. ఉన్న ఏ ఒక్కరో ఇద్దరో, ఉద్యోగాల్లోనో, బడిలోనో, కొన్ని కొన్ని షరతులకి లొంగినవారే. ఎందుకో ఇక ఈ అర్ధం లేని కబుర్లు, నేరవేర్చుకోలేని ఆశయాలు. ఇవన్నీ సినిమాలకే పరిమితం కాని నిజ జీవితానికి మాత్రం కాదు.
నేను గొప్ప అంటే , నేనే గొప్ప అని ప్రతి ఒక్కరూ ఏదో ఒక సంధర్భంలో తన కులం గురించి అనుకొనేవారె, ఎవరు బయటికి కనపడరు. కనపడినవారు అలా సినిమాలు తీస్తారు. అందులో కూడా నాకు ఏ పట్టింపు లేదు అని స్పృష్టంగా చెప్పరు. చెప్పడానికి ప్రయత్నిస్తారు కాని, బంధాలో బాద్యతలో ఒప్పుకోవు, ముఖ్యంగా ప్రేక్షకులు ఒప్పుకోరు. అందుకే ప్రశ్నలు ప్రేక్షకులకే వదిలేస్తారు.

అక్కడ చదివేసి, ఇక్కడ కాస్త ఆవేశంగా ఇంత పెద్ద టపా రాసాను అంటే , నెనేదో నీతి వాక్యాలు నేర్పెద్దామని కాదు కాని, ఒక్కసారి ఆలోచించండి, ఇవేవి మారిపోయెవి కావు, గోవుల్లు తెల్లన, గొపయ్య నల్లన అన్నవి పాటలవరకె బాగుంటాయి. ప్రేమ వివాహాలు, మతాలు మార్చుకోడాలు లాంటివి చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. మాములు శాఖాబేధం ఉన్న పెళ్ళిళ్ళు చేసుకొనే వాళ్ళే అప్పుడప్పుడు కొన్ని కొన్ని విబేధాలల్లో చిక్కుకొంటున్నారు. మరి ఇక మత మార్పిడులు, చిన్నప్పటినుండి మనం పెరిగిన వాతావరణం కాక పూర్తి భిన్నంగా ఉన్నా ఇంకో వాతవరణంలోకి, వెళ్ళి మనసు చంపుకొని చెయ్యలేని పనులు చేసే కన్నా, ఒక్క క్షణం ఆలోచించి, ఆకర్షణలకి లొంగిపోకుండా ఉంటే మంచిదని నా అభిప్రాయం.
కొ.మె: నాకు ఒక్కటే ఎప్పుడు అర్ధం కానిది. తమ జంటకి పిల్లలు పుడితే, ఎంతో గర్వంగా పేరు చివర ఆ కులం పేరు పెట్టుకొనే ఆ భర్త , " అరే! తన బార్యకి కూడా కొంత స్వతంత్ర ఆలోచనలు ఉంటాయి చుద్దాము ఆలోచించి ఓ నిర్ణయానికి వద్దాము" అనుకొనో, లేదా నేనింత గొప్పగా చెప్పుకొంటున్నాను కదా మరి తన అభిప్రాయం ఎంటో అని ఆలోచించడెందుకో? అలాగే సదరు బార్య కూడా "అరె! అంత పెద్ద/చిన్న కుటుంబం నుండి వచ్చాను కదా! మరి తను అంత గొప్పగా తన కులం గురించి చెప్పుకొంటున్నప్పుడు మరి నేనెంటి ఇలా మౌనం" అని అనుకోదెందుకు? హ! అందుకే అన్నది, ముందు తరంలో కుల పట్టింపులు ఇంకా ఎక్కువవుతాయి అప్పుడు, ఈ ఉన్నత కులాల గురించి, ఈ సప్తపదుల గురించి కథలు కథలు గానే చెప్పుకొంటారు. ఎందుకంటే వాస్తవం కనిపించదు. అంతరించేది అదొక్కటే కాబట్టి. 90% ప్రేమ వివాహాల్లో, వధూ వరులిద్దరులో ఒకరు ఉన్నత కులాలవారు/మతాలవారు అవడం విశేషమయితే, సదరు ఉన్నత కులాల/మతాల వధూ/వరులు, వాళ్ళ కులాన్నో/మతాన్నో మార్చుకోడం మరో విశేషం. ఏ కళాతపస్వి దర్శకత్వం లేకుండానే.

9.21.2010

హ్హ! హ్హ! హ్హ

"నవ్వవయ్యా బాబు...నీ సొమ్మేం పోతుంది"?

నవ్వు నాలుగు విధాల చేటు అంటారు కాని, నవ్వు నలబై విధాలా రైటు అనిపిస్తుంది. ఏ మాట కా మాట చెప్పుకోవాలి. "నవ్వు" అనేది మనిషికి దేవుడిచ్చిన వరం. "నవ్వు" గురించి క్లాస్ పీకేస్తున్నాను అనుకోకండి. ఏదో నాకు తెలిసింది మీతో షేర్ చేసుకొందామని..

"ముసలివాళ్ళు అవడం వల్ల నవ్వడం ఆపేసాము అని అనుకోకూడదట. అసలు నవ్వడం ఆపేయడం వల్ల వాళ్ళు ముసలివాళ్ళు అయ్యారేమో" అని ఆలోచించాలట.
కొంతమందిని చూస్తే అనిపిస్తుంది అసలు , వీళ్ళకి నవ్వడం తెలీదేమో అని. ఈ నవ్వు అంటే నాకోకటి గుర్తోస్తోంది.
సరిగ్గా ఆరునెలల క్రితమనుకొంట, అదేదో ఛానెల్ లో "మిసెస్స్ లావుపాటి సుందరి" అని , ఒక టైటిల్ తో ఎదో ప్రొగ్రాం నిర్వహించారు. అది చూసి మావారు నేనెక్కడ పాల్గొంటానో అని, చాల కొంచం భయపడి, "నువ్వీమధ్య చాలా లావయినట్లున్నావు "యోగా" చేస్తే బాగుంటుందేమో", అని ఓ ఉచిత సలహ ఇచ్చారు. "నేనా? యోగా నా? అమ్మో అయినా రాళ్ళు తిని హరయించుకొనే ఈ వయసులో నాకు యోగా ఎందుకండి" అని వాపోయాను. రాళ్ళంటే గుర్తొచ్చింది, నేను మరీ అంత లావేమి కాదులెండి, ఏదో కొంచం ఐశ్వర్యా రాయి కన్నా ఎక్కువ హైటు గాను, కల్పనా రాయి కన్నాఎక్కువ ఫాట్ గాను ఉంటాను అంతే. సరే ! నాధుడి మాట జవదాటనేల అని, యోగా క్లాసెస్ కి వెళ్ళాను. ప్రాణామాయం, సూర్య నమస్కారాలు అయిన తరువాత వున్నట్లుండి అందరిని గట్టిగా "హ్హ! హ్హ! హ్హ " అని నవ్వమన్నారు. నవ్వామనుకొండి, అది వేరే విషయం. నాకొకటే ఆశ్చర్యమనిపించింది ఏమిటంటే, ఎప్పుడూ సీరియస్ గా వుండేవాళ్ళు కూడా అలా తెచ్చిపెట్టుకొని నవ్వడం, అది చూస్తుంటే భలే తమాషాగా కూడా అనిపించింది. . కృత్రిమత్వం స్పృష్టంగా కనిపిస్తోంది వాళ్ళల్లో.

అలా ఒక రెండు నెలలు వెళ్ళాను, మరీ సన్నగా అయిపోతే అర్జంట్ గా "శ్రీమతి ఆంధ్రప్రదేశ్ " , "మహిళలు మహరాణులు" లాంటి వాటికి పిలిచేస్తారేమొ అని , భయపడి మానిపించేసారు(మానేసాను) మా వారు. "భార్య రూపవతి శత్రు " అన్నారు కదండీ పెద్దలు అదన్నమాట. అసలయినా , ఆయనకి ముందే చెప్పాను ఈ వయసులో అవసరం లేదండీ అని.(తరువాత తెలుసుకొన్నాను అనుకొండి యోగా కి , వయసుకి సంభందం లేదని). వయసంటే గుర్తొచ్చింది. అసలు మా తమ్ముడు అంత ఠక్కున వయసడగగానే, ఎందుకు చెప్పేస్తాడో నాకెప్పటికి అర్ధం కాదు, వాడలా వాడి వయసు చెప్పగానే "వాడి కన్నా ఇన్ని యేళ్ళు పెద్ద కదా నువ్వు" అంటూ నన్ను యక్ష ప్రశ్నలు వేసేస్తారు. అదేదో పెద్ద పొడుపు కధ విప్పేసినట్లుగా మహదానంద పడిపోతుంటారు మా బంధువర్గం. "నువ్వు చెప్పకురా" అంటే వినడు నాలా బుద్దిగా 30+ అనొచ్చుగా. ఏవిటో.. 21 నుండి 30 వరకు చాలా ఫాస్ట్ గానే చెప్పేసాను. ఇదిగో 30 నుండే కాస్త వయసు లెక్కల్లో వీక్ అయిపోయాను.

అయినా మనము "నవ్వు" గురించి కదా మాట్లాడుకొంటున్నాము వయసు గురించి కాదుగా. 

మొన్నామధ్య , నాకు చాలా రోజులు ఆఫీస్ కి సెలవిచ్చేసారు. అలా ఖాళీ దొరికితే మేము చేసేదేముంది, వంట ఇంటి సామ్రాజ్యం ఏలేయడమేగా, అదే అదను చూసి మావారు .."అసలు నువ్వు కందిపచ్చడి చేసి ఎన్నాళ్ళయ్యిందో ఈరోజు చెయ్యొచ్చు కదా" అని అడిగితే , పాపం అని, కొంచం జాలిగా, నేను కంది పచ్చడి ఎంత బాగా చేసేస్తానో అని, కొంచం సంతోషంగా పప్పు వేయిస్తూ వుండగా "నువ్వెలా చేస్తావో చూద్దాము" అన్నట్లుగా మా ఇంట్లో కరెంట్ పోయింది. 

ఇక మా వారి ఆనందం చూడాలి, ఎలాగు ఇక మిక్సీ జోలికి నేను వెళ్ళలేను, రోట్లోనే చేస్తానుగా , తెగ ఆనందపడిపోయారు. పైగా "ఏది ఏమైనా రోటి పచ్చడి కున్న రుచి, ఈ మిక్సీ పచ్చడికేమొస్తుంది" అని సు(త్తి)క్తి ముక్తావళి. హు!! ఇక నాకు తప్పుతుందా? మొదలయితే పెట్టాను కాని , కాస్త అనుభవలోపంవల్లనో ఏమో, చిటికిన వేలు కాస్త నలిగి చిన్నగా కమిలిపోయిది. గట్టిగా అరిచినా పట్టించుకోని పతి ని చూసి, ఎందుకనో "రాదే చెలి నమ్మరాదే చెలి" అని అనుకొంటూ, నా పెళ్ళి అయిన కొత్తలో జరిగిన సంఘటనల కోసం, అలా నాముందు గుండ్రం గుండ్రంగా పెద్ద పెద్ద వృత్తాలని తిప్పేసుకొన్నాను. 

నాకు పెళ్ళైన కొత్తలోనన్నమాట.
తనెంత పద్ధతి గల అమ్మాయిని చేసుకొన్నారో తెలుసుకోవాలని, నేను తలంటు పోసుకొని, పెద్ద టర్కి టవలు జుట్టుకు కట్టేసుకొని, ఓ పట్టు చీరలో నేను తులసి మొక్క చుట్టు తిరుగుతుంటే, అలా తలుపు కి జార్లపడి శోభన్ బాబు లా చేతులు కట్టేసుకొని నవ్వుతూ ఆనందపడిపోవాలని, నేను ఆవేశపడి పోయి, తెల్లవారుజామున 5 గంటలకి లేచి "కౌశల్యా సుప్రజా" అని టేప్ రికార్డర్ ఆన్ చేసి, (కొంచం గట్టిగా అన్నమాట, లేవాలిగా మరి ఆయన) గబా గబా స్నానం చేసేసి , మంచి పసుపు రంగు పట్టు చీర కట్టేసుకొని (పెళ్ళైన కొత్త కదా బోల్డు పట్టుచీరలు), కొత్తిమీర కాడ లాంటి నా జడకి పెద్ద టర్కి టవలు చుట్టేసుకొని (ఎంత బరువుందో) తులసికోట చుట్టు ప్రదక్షిణాలు చేసేస్తున్నాను. క్రీగంట, ఓరకంట చూస్తున్నాను, తలుపు దగ్గిర అలా చేతులు కట్టుకొని చూస్తున్నారేమో అని ప్చ్! ఎదురుచూసాను.. ఎదురుచూసాను.. ఎంతకి రాలేదు, ఇక ఇలా లాభం లేదని , కాఫి ప్రయోగం చూద్దాము అని, రెండో ప్రయత్నం మొదలుపెట్టాను. 

చక్కగా, చిక్కగా, స్ట్రాంగ్ కాఫి తయారుచేసి, నెమ్మదిగా లేపితే, తను చిరునవ్వుతో లేచి, "అబ్బ ఎంత అందంగా వున్నావు అనాలి" అలా అనలేదు సరి కదా, "ఏంటి ఇంత పొద్దున్నే పట్టు చీర కట్టావు? నేను బ్రష్ చేసుకోకుండా కాఫి తాగను. అబ్బా! ఆ టేప్ రికార్డర్ ఆఫ్ చేయి లేదా కాస్త సౌండ్ తగ్గించు" అని , నా ఆశలన్నీ అడియాసలు చేసి అటు తిరిగి గుర్రు పెట్టారు నా నిజ జీవిత శోభన్ బాబు. ఛ! ఈయనింతే అనుకొని , ఇలా అస్సలు ఇక కలలు కన కూడదని నిర్ణయించేసుకొని, వంట ప్రయత్నంలో పడ్డాను. "అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా.. ఆశా నిరాశేనా" అని పాడుకొంటూ బెండకాయలతో పాటు నా వేలిని కూడా కట్ చేసేసుకొని "అబ్బా" అని గట్టిగా అరిచి చూద్దును కదా .. 

మా ఆయన, నా నాధుడు లేచి వచ్చి, నా వేలు పట్టుకొని "అయ్యో" చూసుకొవద్దా ? చ్చో, చ్చో అంటు కంగారుగా నా పట్టు చీర చింపబోయి, అమ్మో పట్టు చీర, అని కొంచం ఆగి , పక్కనున్న బట్టతో వేలిని చుట్టి, జుట్టు చుట్టూ వున్న టవలు తీసి , నా జడకి ఓ రబ్బర్ బాండ్ తగిలించి, ఆరోజు నేను చేసిన వంటలో చాలా చాలా సహయం చేసిన నా పతి, మై హజ్బెండ్, నా శోభన్ బాబు.. (గుండ్రం గుండ్రంగా పెద్ద పెద్ద వృత్తాలు)
..ఈరోజు ఇలా .. నా వేలు నలిగినా పట్టించుకోకుండా.. అందుకే అనిపిస్తుంది
"అంతా బ్రాంతి యేనా ?? " అని.

రాదే చెలి నమ్మరాదే చెలి మగవారినిలా నమ్మరాదే చెలి." 

ముగింపు: హూ! ముగింపు ఏముంటుందండి ? అలా వేలు నలిగి కష్టపడి, నేను చేసిన కందిపచ్చడి మావారు ఎంతో ఇష్టంగా అంత నెయ్యి వేసుకొని కలుపుకొని, ఇంత ఇంత ముద్దలు గుటుకు గుటుకున మింగుతుంటే , నలిగిన నా చిటికెన వేలు బాధతో ఎంత విల విల లాడిందో..:(
****

9.17.2010

దీని భావమేమి తిరుమలేశా!!

ఏమి రాయాలో తోచక  .. అలా పాత పోస్ట్‌లు చదువుతూ ఉంటే సరదాగా అనిపించిన పాత పోస్ట్ మళ్ళీ ఇక్కడ ఇలా మీకోసం.
*****

"స్వామీ మీరా... నేనేంటి ఇక్కడ... అసలెక్కడ వున్నాను.... "
ష్॥ష్..కంగారుపడకు... నువ్వు నా దగ్గర.. తిరుపతిలో వున్నావు.... గట్టిగా మాట్లాడితే .. మా పద్దు లేస్తుంది....

నేనా తిరుపతిలోనా..... పద్దునా ... ఆవిడెవరు....నా తికమకలకి చిద్విలాశంగా నవ్వుతూ...

పద్దు॥ ఏవరో తెలియదా.. పద్మావతి .. నా అర్ధాంగి... కొంచం నేను కూడా మీ మానవులని చూసి అలా పిలవడం నేర్చుకొన్నాలే....

ఒహ్!! అబ్బో!!... మంచి పరిపక్వత.... చాల బాగుంది... ఇంతకి నన్నెందుకు ఇక్కడికి రప్పించినట్లో కొంచం సెలవీయండి ... పాపం నా పిల్లలు... నా భర్త ఎలా వున్నారో??
ఓహ్! అదా॥ చింతపడకు .. నువ్వు మీ ఇంట్లో ఇప్పుడు నిద్రావస్థలో వున్నావు... కలలో నిన్నిక్కడికి తీసుకొచ్చాను...

కలా!! సరె సరె చెప్పండి స్వామీ!! మళ్ళీ తెల్లారిపోతుంది..
ఏమి లేదు.... నాకో చిన్న సహాయం చెయ్యాలి... చెయ్యగలవా??
ఏమిటి స్వామి॥ అది॥ కుబేరుని అప్పు లెక్కలు చెప్పలా?? తిరుపతి హుండీలో వున్న ఆస్తుల లెక్కలు చెప్పాలా??

అవేమి వొద్దు... మొన్నామధ్య॥ ఎవరో అజ్ఞాత భక్తుడొకడు... ఇదిగో ఈ పరికరము నా హుండీలో వేసాడు ... సరే... చిన్నగా అందంగా వుంది అని తీసుకొన్నాను। । దీనిని ఎలా వాడాలో కొంచం చెప్పమ్మా....

బాగుంది స్వామి మీ ఉబలాటం॥ అయినా తాతకి దగ్గులు నేర్పడమా... అన్ని తెలిసిన మీకు నేను నేర్పడమా .. సరె మీరడిగిన తరువాత కాదు అనడమా....ఇవ్వండి ఇటు చెప్తాను....దీనిని సెల్ అంటారు

ఇదేమిటి స్వామి.. ఇందులో ఇన్ని సందేశాలు (sms)వున్నాయి ఏ ఒక్కటి చదివినట్లుగా లేదు మీరు..

అయ్యో!! అదే వస్తే నిన్నెందుకు రప్పించుకొంటానమ్మ నేను.... ఏమిటవి కొంచం చూసి చెప్పు పనిలో పనిగ నాకు నేర్పు ఎలా చూడాలో..... మానవుడు చాల మెధావి అయిపొతున్నాడు రాను రాను... ఇలాంటి పరికరముల పరిచయములతో... ఏ భక్తుడు ఏమని విన్నవించుకొంటున్నాడో పాపం చూడమ్మా కొంచం....

అవును స్వామి ఇది విన్నపమే.... ఆంగ్లములో మరియు హింది బాష లో కొన్ని వున్నాయి । అన్ని సందేశాలకి అర్దం ఒక్కటే చెప్తాను వినండి॥

" ఓం శ్రీ వెంకటేశాయ నమః"ఈ మంత్రం ఇంకో 15 మందికి పంపండి... మీరు అనుకొన్నవి నెరవేరిపొతాయి... ఈరొజే మొదలుపెట్టండి .... 15 రోజుల తరువాత మీకు అధృష్టం కలిసివొస్తుంది... ఇది నమ్మండి నిజం.... "

ఇది స్వామి మరి పంపించండి ॥ 15 మందికి పంపుతారో..లేక ద్వాపరయుగంలో వున్న మీ 16000 మంది గోపికల కి పంపుతారో మరి..

నాకెక్కడ కుదురుతుందమ్మా!! హుండిలో కానుకలు వేసె భక్తుల కోరికలే తీర్చనా?? లేక కుబేరుని అప్పే తీర్చనా?? లేక ఇలా కొత్త కొత్తగా వేలం వెర్రి గా సందేశాలు పంపే భక్తుల కోరికలే తీర్చనా?? ఎంత పని పెడ్తున్నాడు ఈ మానవుడు.... ఇంతవరకు నాకు తెలియదు ఈ విధానం ఒకటి వుందని॥ మా సొదర దేవుళ్ళందరు ..ఒక సమావెశం ఏర్పరుచుకొవాలి..దేనికి ఏదొ ఒక ఆచరణ యొగ్యమైన పధకాన్ని ఏర్పరుచుకొవాలి... అవును..కుబేరుడి అప్పంటే గుర్తుకొంచ్చింది.. పద్దూ!!..పద్దూ!!....

ఎందుకు స్వామీ ఆవిడని లేపుతున్నారు నాకు చెప్పండి నేను చేస్తాను ఆ పనెంటో..
అహా! ఏమి లేదు.. ఈ సెల్ తో పాటే ఇంకేదొ డబ్బా వుంది లోపల అందుల కుబేరుని అప్పు.. హుండీలొ ఆస్తుల లెక్కలు వుంటాయట కదా కొంచం అవి కూడా...

తప్పుతుందా స్వామి॥ ఎక్కడుంది చెప్పండి..

ఒహొ!!! ఇదా స్వామీ॥ దీనిని మేము కంప్యూటర్ అంటాము.. ఇది లాప్ టాప్ అన్నమాట....

అవును... ఇందులో కూడా ఎక్కడి ఎక్కడి నుండో సందెశాలు లేఖలు పంపవచ్చట కద॥ కొంచం నేర్పమ్మా... భక్తుడెవరో నా ఈ-మైల్ చిరునామ కూడా ఇచ్చాడు ... నేను కొంచం మా అలివేలు మంగమ్మకి లేఖలు పంపుకొవాలి...

అయ్యో అదేమిటి స్వామీ ...

"నడిరేయి ఏ ఘాములో స్వామి నిను చేర దిగివొత్తునో ॥ తిరుమల శిఖరాలు దిగివొత్తునో"

అంటూ॥ మా మానవులు.. తమ కొరికలని అలివేలు మంగమ్మకి సిఫార్స్ చేస్తారని విన్నాను...

హు! అది ఒకప్పుడమ్మా॥ అప్పుడు ఆ భక్తుల కొరికలవల్ల నేను వెళ్ళగానే తన నృత్యగానలతో నన్ను అలరించేది ప్చ్!! కాని ఇప్పుడో మానవుడిద్వారా రుపొందిపబడిన మరియు నిర్మించబడిన ఆ దూరదర్శన్ నాటకములను చూచుచూ తరువాత భాగం ఎప్పుడూ వొచ్చునా తరువాత భాగంలో ఏమి అగునో అని ఇప్పటినుండీ వగచుచూ కాలం తెలియకుండా గడుపుచున్నది॥ఇక నేను ఏకాంత( ఏ కాంత) సేవ చేసుకొనే సమయము లేదుకద..కనీసం లేఖలన్న పంపుదామన్న యోచన..

ప్చ్! ఎన్ని కష్టాలు స్వామీ మీకు॥ ఈ లాప్ టాప్ లో కూడా 16000 లేఖలు వొచ్చాయి స్వామీ॥ అన్నీ దాదాపుగా... పైన చెప్పిన "శ్రీ వెంకటేశాయ నమః లాంటివే...

కౌశల్యా.. సుప్రజా రామ సూర్యా... సంధ్యా ప్రవర్థతె
స్వామీ॥ స్వామీ తెల్లారినట్లుంది ॥ అప్పుడే మీ సుప్రభాతం వొచ్చుచున్నది.. నేను వెళ్తాను స్వామి ఇక.....

అవును అటు చూడు॥ సుప్రభాతం మీ ఇంటి నుండే వొస్తొంది॥ నా భక్తుడు నీ పతి దేవుడు.. నన్ను, నిన్ను నిద్ర లేపుచున్నాడు....

నా సెల్ లో కూడా ఏదొ సమాచరమున్నది......మీ పేరు కానవచ్చుచున్నది॥

మోసం .. మీరు కూడా అలా పైన ఉదహరించిన "శ్రీ వెంకటేశాయ నమః" అనా....?? దీని భావమేమి తిరుమలేశా!!

ఏమో మరి అలా పంపితే అలివేలుమంగ కరుణిస్తుందేమొ... కుబేరుని అప్పు తీరిపొతుందేమొ... చిన్ని ఆశ॥ అయినా ఏ మాటకామాట చెప్పాలి ... నీవు నేర్పిన (మీ మానవులు ) విద్యే కదా..

హతోస్మి॥

కధ మళ్ళీ మొదలయ్యింది.....

(దయచేసి నాకు తెలిసినవాళ్ళు ఇది చదువుంతుంటే ప్లీజ్ నాకు మటుకు అలాంటి sms పంపొద్దని మనవి.....నేనెవరికి పంపలేను)

9.12.2010

మళ్ళీ మళ్ళీ రావాలి ఈరోజు..

ఇది 2008 సంవత్సరం రాసిన టపా.. మళ్ళీ ఈరోజు ఇదిగో అమ్మ పుట్టినరోజు. అంతే సంతోషంతో పొద్దున్నే "పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి...నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి  "  అంటూ శుభాకాంక్షలు చెప్పాము. మళ్ళీ ఒకసారి అందరం అలా స్మరణ చేసుకుంటూ ....ఇక్కడ ఇలా మీ, మా... మనందరికోసం. 
 ******
"హల్లో! అమ్మా చెప్పు ఏంటి ఫోన్ చేసావు?"

"ఏముంది చెప్పడానికి? నీకు అసలు అమ్మ ధ్యాస ఉందా అసలు? నా అంత నేనే ఫోన్ చెయ్యాలి కాని, నువ్వసలు అమ్మ ఒకత్తి ఉంది అని పట్టించుకొంటున్నావా? అంతేలే, సంపాదన పరులయ్యాక ఇక అమ్మ ఎందుకు? ఎంతసేపు ఆ బ్యాగులేసుకొని ఉరుకుల పరుగులే, అమ్మ అసలేలా ఉందో ఒకసారి ఫోన్ చేద్దాము అన్న ఆలోచనే లేదాయే"!

"అమ్మా! ఆపు ఆఫీసులో ఉన్నా! నేనేమి సమాధానం చెప్పలేను. ఇంతకీ ఎందుకు ఫోన్ చేసావో చెప్పు?"

"ఎప్పుడూ ఆఫీసు! ఆఫీసు! వెధవ సంత, బుద్ధిగా ఇంట్లో కూర్చొని, పిల్లల్ని చూసుకోక. సరే! రేపు వినాయక చవితి గా ఏమి చెస్తున్నావు?".

"రేపటి గురించి ఇంకా ఏమి అనుకోలేదు, సాయంత్రం ఇంటికొచ్చి మాట్లాడతాలే ఫోన్ పెట్టేయి."

" ఓ రెండు ముక్కలు మాట్లాడతానో లేదో ఫొన్ పెట్టేయి అంటావు, ఇంటికోపట్టాన రావు. వాడు అలానే తయారయ్యాడు, నువ్వు అలానే తయారయ్యావు, అవునులే! అడ్డాలనాడు బిడ్డలు కాని, గడ్డాల్నాడు బిడ్డలా మీరు?" ....

"సరె నాకు గడ్డాలు లేవు కాని సాయంత్రం వస్తానన్నా కదా! నువ్వు ఫొన్ పెట్టేలా లేవు కాని నేనే పెట్టెస్తున్నా! సాయంత్రం కలుస్తాను."

***

"అలిగితివా అమ్మా!! అలుక మానవా?"

"నాకెందుకు కోపం? మీరు మీ ఉద్యోగాలు, మీ పిల్లలు... ఇంట్లో పెద్దవాళ్ళు గుర్తొస్తారేంటి మీకు?"

"అలిసిపోయి వచ్చానమ్మా! ఇప్పుడు దండకం మొదలెట్టకుండా మధ్యాహ్నం ఫోన్ ఎందుకు చేసావో చెప్పు?".

"అంతేనమ్మా! ముందు ఆఫీసు గోల! ఆనక ఆలిసిపోవడం గోల! ఎదన్నా అంటే నాది దండకము, లేదా భారతాలు, భాగోతాలు ఇవేగా మీరనేది. వాడు అంతే పెత్తనమంతా పెళ్ళానికి ఇచ్చి కూర్చున్నాడు. ఎమన్నా అడిగినా, మాట్లాడినా "తనకి చెప్పమ్మా!" అని అంటాడు. ఇంతప్పటినుండీ పెంచాను,నిన్న కాక మొన్నొచ్చింది నేను దానిని అడగడమేమిటి? అదేమిటిరా అంటే, నాకు నీతులు చెప్తాడు, నాకు తెలీదా ఏంటి, ఎదో గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్లు.."

"అమ్మా! ఇంట్లో పిల్లలొక్కళ్ళే వున్నారు, నేను వెళ్ళాలి ! నీ బాధ అంతా తరువాత వెళ్ళగక్కుదుగాని, కాస్త కాఫీ అన్నా ఇస్తావా! నన్ను వెళ్ళమంటావా?" .

"అయ్యో పిచ్చి తల్లీ! మర్చేపోయాను ఇస్తానుండు, ఏవిటో! ఈ మధ్య మతిమరుపు ఎక్కువవుతోంది. వచ్చినప్పటినుండి నా కష్టాలు ఏకరువు పెట్టుకోడమే సరిపోతోంది, ఈడ్చుకొంటూ పడి , లేచి వస్తావన్న ధ్యాసే ఉండదు నాకు".

****



ఇలా తనకు లేని బాధలు మాకు చెప్పుకొంటూ, తన తీయనైన అష్టొత్తర, శతనామవాళితో మా బాగోగుల్ని చూసుకొంటూ నిత్యం సందడి సందడిగా ఉండే మా అమ్మ పుట్టినరోజు , నిన్ననే మనవలు మనవరాళ్ళ మధ్య నిరాడంబరంగా జరిగింది.

మళ్ళీ మళ్ళీ రావాలి ఈరోజు అని ఆశిస్తూ.. కుటుంబ సభ్యులందరి తరుపునా ...

మా అమ్మకి పుట్టిన రోజు శుభాకాంక్షలు
Loading...