11.27.2011

నేను రాను తల్లో …..


“ఓకే మేడం! హోప్ యు విల్ గెట్ గుడ్ డాక్టర్.. బట్ మా దగ్గర ఆపరేషన్ రీజనబులే .. మీరెందుకు డ్రాప్ అవుతున్నారో మరి.. “


“థాంక్ యు డాక్టర్.. ఇంటికి దగ్గర్లో అయితే  కాస్త ఎవరో ఒకరు నాకు తోడుగా ఉంటారని ఈ నిర్ణయం”


“మీ ఇష్టం మేడం. “

“థాంక్ యు డాక్టర్”.

*****

నవంబర్ 5 .. చాలా సంతోషకరమైన రోజు, అలాగే అత్యంత బాధాకరమైన రోజు.. సంతోషం .. కోలీగ్స్ అందరం కలిసి ఆటలు పాటలు.. చాలా సరదగా గడించింది.. విషాదం  ఆరోజే కాలికి వీడియో వైర్ చుట్టుకుని ఫ్లోర్ మీద పడి కాలి ఎముక విరక్కొట్టుకున్న రోజు వెంటనే  పక్కనే ఉన్నా హాస్పిటల్‌కి తీసువెళ్ళారు..అదో పెద్ద కార్పోరేట్ హాస్పిటల్..ఇహ నేను చెప్పేదేముంది.. చాలా మందికి తెలిసే ఉంటుంది ఇక్కడి ట్రీట్మెంట్..అయినా నా అనుభవం కూడా చెప్పాలి కదా.. పైన సంభాషణ ఆక్కడిదే  మరి..

******

ఎమర్జెన్సీ వార్డ్:  X-Ray   తీసిన తరువాత… (వెళ్ళిన వెంటనే X-Ray  తీసారు)

హాస్పిటల్ సిబ్బంది – ఆఫీసు కోలిగ్గ్స్ మధ్య సంభాషణ..


“అయ్యో!  ఎమయింది.. కాలు ఫ్రాక్చర్ అయినట్లుంది.. డాక్టర్ రావాలి ఆపరేషన్ చేయాల్సి రావచ్చు “పేషంట్” ని అడ్మిట్ చేయండి… “

“ఇంకా వాళ్ళ వాళ్ళేవరూ రాలేదు. డీటైల్స్ తెలియకుండా ఎలా? మీరు ఫస్ట్ ఎయిడ్ చేసెయండి.. వాళ్ళ హస్బండ్ వచ్చాకా డిసైడ్ చెస్తారు..”

“ ఏమి చేయాలన్నా “పేషంట్” ని  అడ్మిట్ చేయాల్సిందే లేకపోతే చెయ్యము”

“ఒహో సరే అయితే చేసేయండి..”

“ ఆ కౌంటర్‌లో డబ్బులు కట్టేయండి......   “పేషంట్” వంటి మీద గోల్డ్ అంతా తీసేయమ్మా .. ఇదిగో ఈ అప్లికేషన్ మీద సైన్ చేయండి.. " అంటూ నాతో….

మావాళ్ళు వెళ్ళి డబ్బులు కట్టేసారు… 
ఇహ మొదలు చూసుకొండి..

“పేషంట్ “  కి బి.పి చెక్ చేయండి..”  (యంత్రాల్లా ఒకళ్ళ తరువాత ఒకళ్ళు ఎవేవో పేర్లు చెప్పి టెస్ట్లంటూ  చాలా హడావిడి చేసేసారు… ఇవన్నీ జరుగుతున్నంతసేపూ.. నేను నా పేరుని మర్చిపోయేంతగా “పేషంట్..... పేషంట్”  అని ఎన్ని సార్లు అని ఉంటారో .. ప్చ్… అఫ్కోర్స్ వాళ్ళకి నేను “పేషంట్‌"...నే... కాని మరీ మన మనో ధైర్యం కృంగదీసేలా ఇన్ని సార్లా/.పరీక్షలా?…బాబోయ్!! .)


ఆ తరువాత అసలు డాక్టరు వచ్చి పి ఓ పి వేసేరు.. ఆరోజు రాత్రి ప్రహసనం అలా ముగిసింది.

*******
మర్నాడు 06/11/2011.

ఉదయం 5 గంటలనుండి  నుండి  మళ్ళీ  మొదలు….కనీసం నేనేవరు.. ఎందుకు అడ్మిట్ అయ్యాను అన్నది కూడా అడగకుండా రొబోల్లా ఒకళ్ళ తరువాత ఒకళ్ళు కాలి కొనగోటి వేలు నుండి తలవెంట్రుక దాకా చెక్ అప్‌లు.. నేను వచ్చిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నా .. "ఇదేమి టెస్ట్ ఎందుకు చేస్తున్నారు"  అని.. అహ!  ఒక్కదానికి సమాధానం ఉండదు.. నేనేమన్నా అడిగితే" మీకు బి.పి ఉందా .. సుగర్ ఉందా.."  అంటూ ప్రశ్నలతో నన్ను దారి మళ్ళించడం.. ఒకానొక సమయంలో నాకు కోపం వచ్చి "మీరేమన్నా హౌజ్ సర్జన్లా..  నామీదెమన్న ప్రయోగాలా"  అని అడిగేసాను కూడా.. ఛట్.. నేనే దొరికానా అన్న అసహనం..

ఇలా ఆరోజు సాయంత్రం దాకా జరిగిన తరువాత ప్రత్యక్షయయ్యారు  అసలు ఆపరేషన్ చేయాల్సిన డాక్టర్.. “ఏమి లేదమ్మా చిన్న ఫ్రాక్చర్ అంతే చిన్న రాడ్ వేస్తాము.. మీరు విథిన్ మంత్స్ లో రికవర్ అయిపోతారు.. అప్రాక్స్మెట్ గా ఇంతవుతుంది.. " అని (మా బడ్జెట్ కి (లక్షల్లో) పై మాటే ) చెప్పారు.. "మీరు ఏ విషయం చెప్పేస్తే రేపు మార్నింగ్ చేసేస్తాము.. ఆలోచించుకొండి ఇదిగో నా కార్డ్.."  అని.. ఇచ్చేసి వెళ్ళారు.

ఆ డాక్టర్ వెళ్ళాక మళ్ళీ  షరా మాములే… రొబోలు ప్రత్యక్షం.. మర్నాడు మేము రెండవ ఓపీనియన్ తీసుకుని వెళ్ళేదాకా... ఆ టెస్ట్ లు ఈ టెస్ట్లు అంటూ  చేసి.. నాలో .. నాకేదో ఉందనే భయాన్ని ద్విగుణీకృతం చేసి.. వాళ్ళు చేసిన టెస్ట్లకి అంతకు తగ్గ బిల్ వేసి (మా అంచనాలకి మించి) మమ్మల్ని వదిలి పెట్టారు.. "బాబోయ్ కార్పోరేట్ హాస్పిటల్  కల్చర్ " అని అనుకోకుండా ఉండలేకపోయాను…

అక్కడినుండి బయటకి రాగానే అనిపించింది

  "నేను రాను తల్లో .....
గొప్పోళ్ళ దవఖానకు ...."
అని..

ఈ మధ్యే ఒబేసిటి గురించీ లక్షలు ఖర్చుపెట్టీ ట్రీట్మెంట్ వికటించి ప్రాణాలు పోగొట్టుకున్న మహిళ ఉదంతం T.V లో  చూసి.. .. చిన్న దగ్గు వచ్చిందని టెస్ట్ కి వెళ్ళి అటునుండి తిరిగి తిరిగి రాలేని లోకాలకు వెళ్ళిన  17 యేళ్ళ పాప.. (మా అక్కగారి బంధువు ) ఉదంతం విని నా అనుభవం రాయాలనిపించి.. ... ఇలా..

అమ్మ తల్లో..నేను రాను
నేను రాను బిడ్డో మన ఊరి దవాఖానకు

ఎర్రనీల మందు, సున్నాకు మీద సూదులయె
మందుకు తగ్గటే సూదేస్తేనే జొరమొచ్చె
నేను రాను బిడ్డో బంజల దవాఖానకు

ఔనమ్మా..ఒక్కసారి
కడుపులో నొప్పి ఆయే
compounder కాడికి వెళ్ళితే
కాలుకు కట్టు కట్టే
పన్నుకు బాధంటే తల్లో కన్నులే పీకేస్తారు
వద్దు వద్దు తల్లో యములున్న దవాఖానకు

కొడలు పిల్ల నీలాడ ఆశుపత్రికని పోతే
ambulanceకు పది
ward boy కి పదిహేను
అమ్మాయి పుడితే ఇరవయి
మొగోడు పుడితే ముప్పయి
మంచానికి ఏబయి
మందులేవో ఉండవాయె
వద్దు వద్దు తల్లో లంచాల దవాఖానకు

ఔనవును
అటు చీటి రాస్తే లంచం
ఇటు గేటు తీస్తే లంచం
ఆ సిస్టరమ్మకు లంచం
చిన డాక్టరయ్యకు లంచం

మంచాల ఉన్న మనోళ్ళను చూసొద్దమంటే లంచం
దొరల ఆశుపత్రి ఆయే..దరిలేని దోపిడి ఆయే

వద్దు వద్దు తల్లో దగుల్భాజి దవాఖానకు

కారెక్కివచ్చిన దొరలను కంటిరెప్పలగా చూస్తరు
అక్కడ వున్న మిషిణ్లన్ని ఆ దొరల కోసమే
మంచి మంచి మందులన్ని వారికే ఇచ్చేస్తారమ్మో
వద్దు వద్దు తల్లో గొప్పోల దవాఖానకు
నేను రాను బిడ్డో బంజాల దవాఖానకు
అమ్మ తల్లో..నేను రాను
నేను రాను బిడ్డో మన ఊరి దవాఖానకు
వద్దు వద్దు తల్లో మాయదారి దవాఖానకు
నేను రాను బిడ్డో బంజాల దవాఖానకు 
****

డాక్టర్లూ!!!  నన్ను మన్నించండి.....
*****

11.24.2011

నవంబర్ 20., 2011

నవంబర్.. ఈ నెలంటే నాకు చాలా ఇష్టం.. జనవరిలో  కొత్త కాలెండర్ ఇంటికి తీసుకురాగానే మొదట నవంబర్ లో కార్తికమాస ప్రారంభం ఆతరువాత పౌర్ణమి ఎప్పుడు వచ్చింది.. తరువాత పంచమి అనుకుంటూ ఆ పంచమి వచ్చిన డేట్ ని ఒక రెడ్ పెన్సిల్తో గుర్తుగా పెట్టుకునేదాన్ని. అలా చిన్నప్పటినుండి  పెళ్ళయ్యేదాకా  అలవాటయింది. పోయిన సంవత్సరం చిన్నప్పటినుండి నా జ్ఞాపకాలని తవ్వుకుని, మంచికి ఆనందిస్తూ చెడుకు బాధపడి వీడ్కోలు చెప్తూ.... గడిపాను. అయితే ప్రతీ సంవత్సరం నవంబర్ నెల నాకోసం, నేను ఆనందంగా ఉండాలి.. అనుకుంటూ గడిపాను. ఈ సంవత్సరం ఈ నవంబర్ నా జీవితానికే ప్రత్యేకం. నేను మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది. అది కూడా విషాదం లోంచి పుట్టిన ఆనందం అనుభూతి అని చెప్పొచ్చు.

"ఇదిగో ఇలా తిది వారం వర్జ్యం అంటూ ఒక్కో సంవత్సరం ఒక్కో తేది చెప్తున్నావు నీ పుట్టిన రోజు ఎప్పుడో ఎప్పుడు అర్థం కాదు నాకు.. ఆ పౌర్ణమిలు పంచమిలు కాకుండా డేట్ చెప్పు అని శ్రీవారు అన్నారని అవును ఈ తెలుగు తిధులు కాస్త కష్టమే అని పెళ్ళి అయి మూడు పుట్టిన రోజుల తరువాత తిధులు మానేసి తేది ప్రకారం (నవంబర్ 20. ) చేసుకోడం మొదలెట్టాను. కాస్త మా కుటుంబ సభ్యులు ఆ తేది గుర్తు పెట్టుకుని నాకు శుభాకాంక్షలు చెప్తారని.. అదే రివాజు మొన్న మొన్నటిదాక. ఈసారి నవంబర్ ఒకటో తారీఖే మా పాపతో సరదాగా అన్నా... "ఈసారి నా పుట్టినరోజు ఆదివారం వచ్చింది సెలవ రోజు ఛట్ నేను చేసుకోను"  అని ….

పుట్టిన రోజు నాకెప్పుడు ఎన్నిసంవత్సారాలయినా  ప్రత్యేకమే. పాపకి కూడా అదే చెప్పాను "పండగలెన్నయినా కాని కుటుంబ సభ్యులందరు కలిసి వేడుక చేసుకోవాల్సినవి....  కాని మన వ్యక్తిగతం మనకోసం మన సంతోషం అనుకునేవి పుట్టిన రోజు, పెళ్ళిరోజు ఈ రెండు మటుకు మనం పండగలా చేసుకోవాలి. అది ఎలా అన్నది వారి వారి "  ఆలోచనలు అభిప్రాయాలను అనుసరించి ఉంటాయి  " అని .. ఎందుకింత చెప్పాల్సివచ్చిందో కాని, అనుకోకుండా సందర్భం లేకుండా చెప్పాను.

అదే తిరిగి నాకు మళ్ళీ అప్ప చెప్పింది మా పాప.. ముందు రోజే అక్కా వాళ్ళు వచ్చి శుభాకాంక్షలు చెప్పి బహుమతి ఇస్తే నవ్వొచ్చింది ఇలా ఉండి  పుట్టినరోజు అవసరమా? .. ఇది ఒక భారం తప్ప అనుకున్నా.. కాని నేనలా అనుకోకూడదనుకున్నారో లేక ఆలోచించకూడదనుకున్నారొ మరి  నాకెలాంటి ఇబ్బంది కలగకుండా నా పుట్టినరోజు వెడుక జరిపించి.. నా కళ్ళ నుండి నీళ్ళు తెప్పించారు నా కుటుంబ సభ్యులు. ఆనందం.. నేనెప్పుడు కోపం వస్తేనో, నా మాట విననప్పుడో మా వాళ్ళని కసురుతూ ఉంటా “మీరందరూ ఏ జన్మలో ఏ బంగారు పూలతో పూజ చేసారో నేను మీకు అమ్మగా(పిల్లతో ) బార్యగా(శ్రీవారితో) దొరికాను అని అంటూ ఉంటా....  అదే మరి నేనేమి పూజ చేసుకున్నానో  ఎమఒ కాని వీళ్ళంతా నాకు లభించారు అని  మనసులో అనుకుంటూ ఉంటా ఇప్పుడు ...  అలా నన్ను నేను మరిచిపోయేలా నాకు చేదోడుగా ఉంటున్నారు నావాళ్ళు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా నాకు ఆనందాన్ని పంచారు.. పిల్లలిద్దరు   కొత్తబట్టలు , కేక్ అంటే ... శ్రీవారి ప్రేమ ఇంకోవిధంగా , అమ్మ నాకిదిష్టం అది ఇష్టం అంటూ వంటలు, ఆప్తమిత్రుల శుభాకాక్షలు మరోవైపు ఉక్కిరిబిక్కిరి చేసాయి. చాలా ఆనందంగా ప్రత్యేకంగా చేసుకున్న మొదటి పుట్టినరోజు ఇది. ఏందుకిలా చెప్తున్నాను అంటే నేను ప్రస్తుతం కదలలేని పరిస్థితిల్లో కూడా చాలా మనో ధైర్యంగా ఆనందంగా ఉన్నాను .. దానికి కారణం నా కుటుంబ సభ్యులు. వారందరికి నా కృతజ్ఞతలు ఇలా చెప్తున్నాను. ఎందుకు కదలేని పరిస్థితి అంటే ఇప్పుడు ఫొటో చూపిస్తాను.. నా ప్రతి ఒక్క అనుభవం మీతో తొందరలో పంచుకుంటాను.. అంతవరకు…. 

ఒకసారి ముందు పుట్టినరోజుల సందడి ..... ఇక్కడ ఇంకోసారి..

20 నవంబర్ 2008 బ్లాగు రివ్యూ: మనలోని మాట – నా మనసులోని మాట

నవంబర్ 20  2010
నవంబర్ 20, 2011
నేనిలా ఉన్నా....  అయినా  కాని  పుట్టినరోజు కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రత్యేకంగా చేసుకున్నా.. ఆనందంగా....
******

9.04.2011

మన భాష – మన బాట

ఆగష్ట్ 29 తెలుగుభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని , ముందురోజు అంటే ఆగష్టు 28 ఆదివారం తెలుగుభాషాభిమానుల్ని తెలుగుబాట పడదాం రమ్మనమన్న మన తెలుగు వారి పిలుపు మేరకు నేను సైతం అని అనుకుంటూ…. తెలుగు బాటకి బయల్దేరాను. సమయానికి చేరుకోలేకపోయినా, తెలంగాణ అయినా అంధ్రా  అయినా తెలుగే మాట్లాడతానని, తెలుగు మాట్లాడిస్తానని ప్రమాణం చేసే సమయానికి నేను అక్కడే ఉన్నాను.

తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా గల గల కల కల కదిలి వస్తారనుకున్నాను మన మహిళా తెలుగు భాషాభిమానులు బ్లాగర్లు కాని.. ఎవరు రాకపోవడం కించిత్ నిరాశాపరచినా.. అందరూ
సరదాగా మాట్లాడుతూ, తెలుగు భాషాప్రాభవాన్ని ఏవిధంగా పెంచాలి అన్న చర్చలతో కాలమనేది తెలియకుండా చేసారు తెలుగు భాషాభిమానులు.

తెలుగుభాషాభిమానులైన పలువురు  వక్తల తీయనైన తెలుగు మాటలు విన్నాను. వారి చమత్కారాలు కొన్ని :

బుష్ మన రాష్ట్రానికి వస్తే పంచే కట్టి మురిసిపోయాము..
ఈ రాష్ట్రంలోనే ఉంటూ పంచే కట్టడం మరచిపోయాము.

అమ్మ   సజీవం
మమ్మీ  నిర్జీవం.

తెలుగు తల్లిని పూలమాలతో సత్కరిస్తూ.. తాడేపల్లిగారు తెలుగు మాట్లాడే ప్రతి తల్లి తెలుగుతల్లే..  అని అనడం మనసులో ఒక  జలదరింపు….. రోమాలు నిక్కబొడుచుకున్నాయి అని చెప్పొచ్చు. తెలుగు భాషాభిమానం నాలో అలా ఆ అనుభూతికి లోను చేసింది.

ఇక ఆరోజు తన చమత్కారంతో మరింత ఆనందానికి లోను చేసిన మరో వ్యక్తి శ్రీ అనంత్ గారు.. వారి చమత్కారం..స్వయంగా మాతోనే..

నాకు కుల పట్టింపు  లేదు.. నేనెవరికి నా కులం గురించి చెప్పను.... నాపేరు అనంతా"చార్యులు" (హహహ నాకు గట్టిగా నవ్వేసి అరవాలనిపించింది "ఆచార్యులుగారు!  మీ కులమేంటో మాకు తెలిసిపోయిందోచ్"  అని) కాని నేను "అనంత్"  అని చెప్పుకుంటాను.. నా వయసు 60 యేళ్ళు అయినా నేను ఇప్పటికి నేను యువకుడినే.. 

నాతో తాడేపల్లి గారి ఛలోక్తి:  "సుమం  సుమం అని అనుకుంటున్నాము మరి మీరు బ్లాగు రాయడం తగ్గించేసారు"  అని..   హహహ.. తాడేపల్లిగారు!!  మీరు మరీ చతురులు సుమా!!.

అలా తెలుగులో సంభాషించుకుంటూ ... వచ్చినవాళ్ళు ఒకరినొకరం పరిచయం చేసుకుంటూ ఆహ్లాదంగా గడిపాను ఆదివారం. ఇంటికి తిరిగివెళ్తున్నప్పుడు వానదేవుడు సంతోషంగా ఉన్న మా పై తన ఆనందాన్ని కూడా తెలియజేస్తు చినుకుల చిరుజల్లు కురిపించాడు. 

ఆ వర్షపు జల్లులలో మా ఆనందపు ఛాయా చిత్రాలు, ఆ పండగవాతవరణంలోని ఛాయా చిత్రాలు  ఇదిగో ఇక్కడ మీకోసం... 
తెంగ్లీష్ వద్దు తెలుగే ముద్దు 

జీతం కోసం పర భాష
జీవితం కోసం మన భాష
ముగిస్తూ ఇంకో చిన్న మాట మీ చెవిన వేసి సెలవు తీసుకుంటా  మరి..

తెలుగు భాష  గొప్పతనం,
తెలుగు జాతి తీయదనం
 తెలుసుకున్న వాళ్ళకి
తెలుగే ఒక మూలధనం
తల్లి తండ్రి నేర్పినట్టి మాతృ భాషరా
తెలుగు మరచిపోతే
వాళ్ళని నువు మరిచినట్లురా
ఇది మరవబోకురా.. 

ఇది ఒక గేయ రచయిత విన్నపం.. అలాగే మనందరిది కూడా  ..
****

7.05.2011

ప్రేమ......తో!!

ఒక పాటని కాని, చెవులకింపైన సంగీతాన్ని కాని..  వినడానికి లేదా ఆ భావనలో లీనం అవడానికి వయసు ఎంతవరకు అవసరమంటారు చెప్పండి?  "మిరపకాయ్" సినిమాలో పాట అనుకుంట "చిరుగాలే వస్తే వస్తే.. అన్న పాట పాడిన గాయని కి ఉన్నలాంటి ఆ గరుకైన మధురమైన గళం మా ఆఫీసులో ఒక అమ్మాయికి ఉంది. ఆ మాట చెప్పిన మర్నాడు ఆ పాట ఆ అమ్మాయికి వినిపించాను.. తనకి తెలుగు రాదు, అయినా పాటని చాలా బాగా ఎంజాయ్ చేసింది కారణం అదే పాట సంగీతంలో హిందిలో కూడా పాట ఉందిట.. సేం మ్యూజిక్ అంటూ పాట రెంటిలో అర్థం వేరు.. సంగీతం ఒక్కటే సంగీతానికి భాష అవసరంలేదు అని ఈ సంఘటన రుజువు చేసింది అలాగే మంచి పదసంపదతో, పదాల కూర్పుతో కూడిన పాట వినడానికి వయసు కూడా అవసరం లేదని నా అభిప్రాయం. 

ఒక మంచి పాట వింటునప్పుడు పెళ్ళి అయి, పిల్లలు సంసారం భవసాగరం ఇత్యాది వన్నీ ఉన్నప్పుడు ఇంకా ఇలాంటి పాటలేంటి అని పెద్దలు మందలించినప్పుడు నాలో కలిగిన  సంఘర్షణ  ఇది. తప్పేమి ఉంది పాట.... పాటలోని భావం నాకు నచ్చాయి. వినడం తప్పులేదు అన్నీఅయిపోయాయి అని గిరి గీసుకుని కూర్చుంటామా? ఎమో కొన్ని కొన్ని నాకు అర్థం కావు అలా అనుకొని వదిలేయడమే.. హ్యాపీగా మనకి నచ్చిన పాటలని ఫీల్ అవడమే.. ... ఇంతకీ నాకు నచ్చిన పాట అంటారా.. మీరు వినండి..
 ********



అబ్బాయి : రాయి!
అమ్మాయి : ఏం రాయాలి?
అబ్బాయి : లెటర్!
అమ్మాయి : ఎవరికీ?
అబ్బాయి : నీకు.....
అమ్మాయి : నాకా..?
అబ్బాయి : ఊ(..
అబ్బాయి : నాకు వ్రాయటం రాదూ, ఈ మధ్యనే సంతకం పెట్టడం నేర్చుకున్నా..
అమ్మాయి : వెయిట్, వెయిట్.....
అమ్మాయి : నాకు నువ్వు రాసే ఉత్తరం, నేను రాసి...
అబ్బాయి : నాకు చదివి వినిపించి, తరువాత నువ్వు.. చదువుకో...
అమ్మాయి : ఐ లైక్ ఇట్ ..ఊ.. చెప్పు!
అమ్మాయి : ఊ....
అబ్బాయి: ఆఆ..
అబ్బాయి : నా ప్రియా!...ప్రేమతో.. నీకు
అమ్మాయి : నీకు....
అబ్బాయి: నే..
అమ్మాయి : రాసే..
అబ్బాయి : నేను
అమ్మాయి : ఊ....
అబ్బాయి : రాసే
అమ్మాయి : ఉత్తరం.
అబ్బాయి: ఉత్తరం..లెటర్..ఛ...లేఖ..ఊ... కాదు..ఉత్తరమే అని రాయి
అమ్మాయి : ఊ..అదీ
అబ్బాయి : చదువు..
అమ్మాయి : కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.....
అబ్బాయి : పాటలో మర్చి రాసావా..అప్పుడు నేను కూడా మారుస్తా..
అబ్బాయి : మొదట నా ప్రియా అన్నాను కదా!  అక్కడ ప్రియతమా!  అని మార్చుకో..
అబ్బాయి: ప్రియతమా నీవక్కడ   క్షేమమా.. నేను ఇక్కడ క్షేమం
అమ్మాయి: ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
అబ్బాయి : ఆహా....ఒహో.. నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది
అబ్బాయి : కానీ అదంతా రాయాలని కూర్చుంటే, అక్షరాలే..మాటలే...!
అమ్మాయి: ఉహలన్ని పాటలే కనుల తోటలో..
అబ్బాయి : అదే...
అమ్మాయి : తొలి కలల కవితలే మాట మాటలో....
అబ్బాయి : అదీ...ఆహా..బ్రహ్మాండం...కవిత..కవిత..ఊ...పాడు...

కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే...
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే....
ఉహలన్ని పాటలే కనుల తోటలో..
తొలి కలల కవితలే మాట ...మాటలో....
ఓ హో...
కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
లాల ల ...లా ల లా... లా ల ల...
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
లాల ల ...లా ల లా... లా ల ల...

అబ్బాయి: ఊ...
అబ్బాయి : నాకు తగలిన గాయం అదీ చల్లగా మానిపోతుంది..
అబ్బాయి : అదేమిటో నాకు తెలీదు, ఏమి మాయో తెలీదు నాకు ఏమి కదసలు..
అబ్బాయి : ఇది కూడా రాసుకో...
అబ్బాయి : అక్కడక్కడ పువ్వు, నవ్వు, ప్రేమ అలాంటివి వేసుకోవాలి ఆ......
అబ్బాయి : ఇదిగో చూడు... నాకు ఏ గాయం అయ్యినప్పటికి ఒళ్ళు తట్టుకుంటుంది
అబ్బాయి : నీ వొళ్ళు తట్టుకుంటుందా..?
అబ్బాయి : ఉమా దేవి....దేవి ...ఉమా.... దేవి...
అమ్మాయి : అది కూడా రాయాలా?..?
అబ్బాయి : ఆహా..హా....
అబ్బాయి : అది ప్రేమ....
అబ్బాయి : నా ప్రేమ ఎలా చెప్పాలో తెలీక ఇదవుతుంటే....ఏడుపు వస్తోంది...
కానీ నేను ఏడ్చి.. నా శోకం నిన్ను కూడా బాధ పెడుతుంది అనుకున్నపుడు... వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది.
మనుషులు అర్ధం చేసుకునేందుకు ఇది మాములు ప్రేమ కాదు.....మాములు ప్రేమ కాదు
అగ్నిలాగ స్వచ్ఛమైనది...అగ్నిలాగ స్వచ్ఛమైనది...

గుండెల్లో గాయమేమో చల్లంగా మానిపోయే,

మాయ చేసే ఆ మాయే ప్రేమాయే.....
ఎంత గాయమైన గాని... నా మేనికేమిగాదు,
పువ్వు సోకి నీ సోకు కందేనే...
వెలికి రాని వెఱ్ఱి ప్రేమ  కన్నీటి ధార లోన కరుగుతున్నదీ....
నాడు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాళనన్నదీ...
మనుషులేరుగలేరు,
మామూలు ప్రేమ కాదు,
అగ్ని కంటే స్వచ్ఛమైనది...

మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా...
ఉమాదేవిగా శివుని అర్ధ భాగమై నాలోన నిలువుమా..
శుభ లాలీ లాలి జో
లాలి లాలి జో...
ఉమా దేవి లాలిజో..
లాలీ లాలి జో
మమకారమే....ఈ లాలి పాట గా....
రాసేది హృదయమా....
నా హృదయమా....
******
బాగుంది కదా!  కమ్మనీ ఈ ప్రేమలేఖ.. ! .
ఈ పాట ఇక్కడ వినండి/చూడండి ... కమ్మనీ ఈ ప్రేమలేఖ .......

7.04.2011

XBRL గురించి ఎవరన్నా చెప్పగలరా?

హాయ్!!  అందరూ బాగున్నారా? చాలా రోజుల తరువాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఇలా పలకరించడం.. ఎప్పటికప్పుడు చాలా రాయాలి అన్న తపన ఉంటోంది కాని దానికి తగ్గట్టు టైం సెట్ చేయడమే కష్టంగా ఉంది. వీక్ ఎండ్ లో ఎదో ఒక ప్రోగ్రాం అనుకోడం రాయడం అనే నా కోరిక వాయిదా పడడం జరుగుతోంది. 

అవునూ!  మీలో ఎవరికన్నా  XBRL సాఫ్ట్ వేర్ గురించి తెలుసా? తెలిసినవాళ్ళు ఆ సాఫ్ట్ వేర్ ఎక్కడ దొరుకుతుంది? ఏఅ రేంజ్లో  దొరుకుతుంది ఇత్యాది విషయాలు చెప్పగలరా.. ఇప్పుడు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్లో XBRL  కొత్తగా ప్రేవేశపెట్టారు. జులై 15 నుండి ఉపయోగించవలసి ఉంది. తెలిసినవాళ్ళు కొంచం చెప్తారుగా మరి.

MCA Mandate

As per the mandate, in the first phase the following classes of companies need to file the financial statements in XBRL Form from the year 2010-2011:-
  • All companies listed in India and their Indian subsidiaries.
  • All companies having a paid up capital of Rs. 5 crores and above.
  • All companies with a turnover of Rs 100 crores and above.

6.04.2011

బాగుంది కదా!

This poem by Rabindranath Tagore is so beautiful that I decided to send it to you for you too to enjoy reading it.
 

5.30.2011

అలా ....మొదలైంది..



తరువాత ఎన్ని అడుగులన్నా తొలి  తప్పటడుగు మరిచిపోలేనిది. ముద్దుగారే పసిపిల్లాడు అడుగులేసాడని.. అరిసెలు చేసుకొని ఇంటిల్లిపాది ఆనందిస్తారు. ఆ అడుగు గమ్యం చేరేవరకూ అలసి పోకూడని ఆశీర్వదిస్తారు.

మొదట చూసిన టూరింగ్ సినిమా…
మొదట మొక్కిన దేవుని ప్రతిమ….
మొదటిసారిగ గీసిన మీసం…
మొదట వెసిన ద్రౌపది వేషం….
మొదటి ముద్దులో  తెలియనితనమూ…
మొదటి ప్రేమలో  తీయందనమూ ..
మొదట రాసిన/అచ్చయిన కథ..

ఇలా మొదట చేసిన ఏ పని అయినా ఆనందాయకంగా ఉంటుంది. బ్లాగ్ లోకంలో నేను సుపరిచితురాలిని.. ఇక దిన మాస, వార పత్రికలలో నేను అపరిచితురాలిని. అక్కడ కూడా నన్ను పరిచయం చయడానికి సహకిరించారు  చిత్ర మాస పత్రిక వాళ్ళు..నా కథ జూన్ మాస పత్రికలో ప్రచురించి.  “అమ్మ….”  కథ పేరు.

మొదటి ప్రయత్నం  అలా మొదలైందని ...ఇలా ఫలించిందని.. మొదటి కథ కి మీ అభిప్రాయాలు తెలియజేస్తారని..

కథ …. ప్రస్థుత పరిస్థితుల్లో.. కుటుంబ ఆర్థిక పరిస్థితి నేపధ్యంలో బార్యా భర్త ఇద్దరు ఉద్యోగులయినప్పుడు, తప్పని పరిస్థితుల్లో పిల్లలిని కేర్ సెంటర్లోనో, పెద్దవాళ్ళదగ్గరో ఉంచినప్పుడు బంధువులనుండి, ఇరుగుపొరుగు వారి నుండి ఎదుర్కునే మాటల తూట్లు.. పరిస్థితుల అవలోకనం.

నాకు చిత్ర మాస పత్రికలో కొల్లూరి సోమశంకర్ గారి కథ “సం ..సం.. మాయ” కథ కూడా నచ్చింది..  ముగింపు కొంచం కన్‌ఫ్యూజ్ అయ్యాను.

5.28.2011

ఇగో - ఇదో సునిశిత/సున్నిత విశ్లేషణ


"వదినా నేను జెనరల్‌గా అడుగుతున్నా... మీరు చెప్పిన ఇష్యూ అని కాదు..తండ్రి కొడుకుల మధ్య బేధాభిప్రాయం వచ్చినప్పుడు ఎవరు కాంప్రమైస్ అవ్వాలి?" ఒకానొక చర్చ  సంధర్భంలో మా మరిది(మావారి కజిన్)  ప్రశ్న.

"ఏ ఇష్యూ అయినా అనుభవం , వయసుపై ఆధారాపడి ఉంటాయి..  కొన్ని సర్దుకుపోవడాలు/కొన్ని నిర్ణయాలు .. మా విషయంలో అయితే మావాడు ఇంకా చిన్నపిల్లాడు కాబట్టి,  వాడు చెప్తే ఇంకా అర్థం చేసుకోలేడు కాబట్టి తండ్రే సర్దుకుపోవాలి.. బాబు కి తరువాత అంటే సమస్య పరిష్కారం తరువాత నెమ్మదిగా చెప్పుకోగలగాలి.."  నా సమాధానం.


అంటే .. చిన్నప్పటినుండి..  ఇన్నేళ్ళుగా  తాను పెంచి పోషించుకుంటున్న ఇగోని ఇంత చిన్న విషయం గురించి కుదువ పెట్టాలా వదినా?     నేనసలు ఒప్పుకోను….

పెంచి పోషించుకొంటున్న ఇగో  ఇంత చిన్న విషయం  కోసం కుదువ పెట్టడం.. “  వినడానికి ఇది చిన్న విషయంగా తోచవచ్చు కాని అలా వదిలేస్తే ఇదే పెద్ద విషయం .. మళ్ళీ పూడ్చుకోలేని విషయం.. అలా పెద్ద విషయం అవకుండా పెంచి పోషించుకుంటున్న ఇగో ని వదలడం తప్పెలా అవుతుంది? అడిగిన ఆ సందేహానికి అర్థమంటూ ఉందా అసలు? చిన్నపిల్లాడయిన తన కొడుకు కోసం  ఆమాత్రం తండ్రి సర్ధుకుపోలేడా? ఇలాంటి ఇగో ఉండడం అవసరమా?

సరే అసలు ఈ చర్చ ఎలా మొదలయింది అంటే..

మా మరిది మా బంధువుల పాపకి పరీక్షల విషయంలో కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నట్లుండి వాళ్ళ అన్నయ్యతో అన్న మాట..

"అసలు అన్నయ్యా! ఈ వైఫ్‌స్ ఏమి చేస్తారంటే.. పిల్లని తండ్రికి ఎగైనెస్ట్ గా (అంటే పిల్లలికి తండ్రిని శత్రువుని చేస్తూ) పెంచుతారు.. ఎలా అంటే  "ఇదిగో బాబు ఆ పని చేయకు.. మీ డాడీకి  చెప్తాను.. " అంటే " బాబు నాకు నువ్వు చేసే పని ఇష్టమే కాని మీ డాడీ నే కోప్పడ్తుతారు కాబట్టి చేయకు"  అని బెదిరించడమట.. అలాగే "మీ డాడీ ఎప్పుడు అంతే.. ఇదిగో డబ్బులు నువ్వెళ్ళు సినిమాకి"  అని.. డాడీని అసమర్థుడిని చేశేస్తారు అని కొన్ని సోదాహరణంగా చెప్పాడు. మౌనంగా విన్నాను.. ఏమిటీ విశ్లేషణ అనిపించింది  నాకు.

నిజానికి మన పూర్వకాల ఆచార వ్యవహారాల ప్రకారం ఆలోచిస్తే అప్పటి గృహిణి ఇంట్లోనే ఉండడం వల్ల పిల్లలికి అమ్మ దగ్గర చనువు ఎక్కువగా ఉండడం వల్ల ఏది అడగాలన్నా అమ్మని అడగడం పరిపాటి.

అలాగే పిల్లల అలన పాలన తల్లి చూసుకుంటుంది అన్న ధీమాతో ఉద్యోగానికి వెళ్ళే తండ్రి.. వాళ్ళ చదువుల విషయంలోనో , ప్రవర్తన విషయంలోనో తనకి తీరిక చిక్కినప్పుడు వారిని పరీక్షిస్తూ  ఒక అంచనాకి రావడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే ఎప్పుడో కాని మన దరికి రాని తండ్రి చదువుల విషయంలోనో,  ప్రవర్తన విషయంలొనో తను అనుకున్న ప్రకారం ఉండకపోయేసరికి కాస్త మందలించడం వల్ల పిల్లలికి ఉన్న చనువు కాస్తా తగ్గి  ఆ స్థానే భయం ఏర్పడుతుంది. ఆ భయం తల్లికి ఒక్కోసారి ఇలా సినిమాలకో షికార్లకో , అల్లర్లు చేస్తున్నప్పుడో బెదిరించడానికి ఉపయోగపడ్తుంది. అంతేకాని.. తండ్రిని శత్రువుని చేయడానికో , తండ్రిని దూరం చేయాడానికో మాత్రం కాదు. ఏ స్త్రీ అసలలా ఆలోచించదు, ఒకవేళ భర్త నిజంగా అసమర్థుడో, వ్యసన పరుడో అయితే ఆ అలవాట్లు పిల్లల దరికి చేరకుండా జాగ్రర్త పడడం జరుగుతుంది.

ఆనాటి ఆచార వ్యవహారాలే నేడు గృహిణి ఉద్యొగిని అయినా కొనసాగింపబడుతున్నాయి. తండ్రి పిల్లలికి దూరంగా ఉండే కాలం ఎక్కువ కాబట్టి తల్లి దగ్గరే పిల్లలికి చనువెక్కువ ఉంటుంది కాబట్టి, తల్లి ద్వారా రాయబారాన్ని కొనసాగిస్తున్నారు తప్పితే తండ్రి అసమర్థుడు, శత్రువు ఏమాత్రం కాదు. ఇవి వాళ్ళకై  వాళ్ళు  ఏర్పరుచుకున్న  అభిప్రాయాలు.

ఇదే విషయం నేను అతనికి విశదీకరించాను. అదిగో అలాంటప్పుడు వచ్చిన చర్చ ఇగో.. దీని గురించి మా బాబు వాళ్ళ తండ్రి మధ్య వచ్చిన సమస్య.. నిజానికి వినడానికి చాలా చిన్న విషయమే.. విన్న తరువాత నా ఆలోచన అవునా కాదా తేల్చి చెప్పాల్సింది పాఠకులే.. ఎందుకంటే ఇంతమందీ ఇలా కొడుకుదే తప్పు అని చెప్తుంటే .. నా ఆలోచన విధానమే తప్పా?  అని నన్ను నేను తరచి ప్రశ్నించుకుంటూ ఉంటాను.

బాబు పరీక్షల సమయంలో ప్రతిరోజు స్నేహితుడి ఇంటికి కలిసి చదువుకోడానికి వెళ్తూ ఉండేవాడు. ఓకరోజు వాళ్ళ నాన్న వాడు బయటకి అడుగు పెడ్తున్నప్పుడు..  ముందు పాపని పిలిచారు.. పాప పక్కన అమ్మాయితో మాట్లాడుతున్న డాడీ!”  అంటే సరే అని బాబుని చింటూ ఇటు రా అని పిలిచారు.  వాడు వాళ్ళ అక్కలాగే చదువుకోడానికి వెళ్తున్నా డాడీ!”  అని వెళ్ళిపోయాడు.  హ వాళ్ళ నాన్నకి సర్రున కోపం వచ్చేసింది మళ్ళి మాట్లాడేంతలో వాడు వెళ్ళిపోతాడా.. అని కోపం . మాములుగా ఇది చాలా చిన్న విషయం. నేను చాలా లైట్ గా తీసుకున్న విషయం. ఎందుకు పిలిచారు అంటే కాళ్ళు నెప్పిగా ఉన్నాయి పట్టడానికి..   

అది మొదలు దాదాపుగా మొన్న మొన్నటి దాకా..  అంటే వాళ్ళు ఊరు వెళ్ళే ముందు దాకా వాడితో మాట్లాడడం మానేశారు నా పతి దేవుడు.. మొదట్లో నేను పసిగట్టలేకపోయాను కాని వాడికి సంబంధించిన ప్రతి విషయం నా ద్వారా చెప్పిస్తుంటే అడిగాను.. వాడితో మీరు మాట్లాడడం లేదా?”  అని.. తరువా త బాబుని కూడా అడిగాను.. అవునమ్మా ఆరోజు నుండి డాడీ నాతో మాట్లాడడం లేదు.. ఒక్కటే  నేనేం తప్పు చేయలేదమ్మా! .. చదువుకోడానికి వెళ్ళడం తప్పా?”  అని వాడు.. వాడు నా మాట వినకుండా వెళ్తాడా అని ఈయన.. ఇద్దరి మధ్యలో నేను.. ఏమి చేసాను?? అదే చెప్తున్నా..

ఇప్పుడు బాబుకి 15 వస్తున్నాయి అంటే ఉడుకు రక్తం దుడుకు స్వభావం.. అయినా నెమ్మదిగా చెప్పాను తప్పుకదా నాన్నా!  డాడీ పిలిచినప్పుడు కొంచం ఓపికగా అసలెందుకు పిలిచారో ఎంటో కనుక్కోవాలి కదా.. అలా వెళ్ళొచ్చా?”  అని.

వాడేమో నేనేమన్నా తప్పు పని చేయడానికి వెళ్తున్నానా అమ్మా? చదువుకోడానికే కదా బయట నా ఫ్రండ్ వేయిట్ చెస్తున్నాడని వెళ్ళాను డాడీ అంత సీరియస్ అవుతారని అనుకోలేదు అని..

ఇహ లాభం లేదని..  ఇద్దరం సరదగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్న సమయంలో ప్రశాంతంగా ఉన్నారు అని నమ్మకం కలిగిన తరువాత నెమ్మదిగా కదిపాను.. దాదాపుగా గంట మాట్లాడానని చెప్పొచ్చు నెమ్మదిగా బుజ్జగిస్తున్నట్లు.

ఈ వయసులో మీరు వాడికి తండ్రిలా కాదు స్నేహితుడిలా ఉండాలి.. అంతే కాని మాట్లాడడం మానేస్తే వాడి ఆలోచనలో, అసహనాన్నో, ఆవేదననో లేదా ఆవేశాన్నో షేర్ చేసుకునేది ఎవరు? వాడిప్పుడే పెద్ద మగాడు అయిపోయిన భావనతో కనీసం వాడి పక్కన నన్ను కాని, వాళ్ళ అక్కని కాని కూర్చోనివ్వడం కూడా లేదు. ఏదన్నా  జెండర్ పరమైన సమస్య వస్తే చెప్పుకోవాల్సింది మీకే ఆ చనువు వాడికి మీరు ఇవ్వాలి కాని నా మాట వినడా హన్నా ! అని అలిగితే ఎలా?  ఫోని ఆ కోపాన్ని ఒకరోజు రెండు రోజులు.. ఇలా దాదాపుగా 15 రోజుల దాకానా.. ఆలోచించండి.. మా నాన్నగారు లేక మా తమ్ముడు , అన్నయ్య  ఆత్మన్యునతా భావంతో బాధపడ్డారు .. మీరు ఉండి వాడు అలా బాధ పడాలా?”   అని చెప్పాను.. 

ప్చ్.. ఎదురుగుండా గోడకి చెప్పినట్లే అయిందిలెండి నా పరిస్థితి.. మొత్తం విని,  ఇవన్నీ నీ కొడుక్కి చెప్పుకోవచ్చు కదా వాడి తలబిరుసు మానుకోమని.. అని.. అన్నారు.. ఏమి చేస్తాము కొడుక్కే నచ్చచెప్పి,  వాళ్ళిద్దర్ని మాట్లాడేలా చేశాను.. కాని నా ఆలోచన ఎంతవరకూ కరెక్ట్.. ? పిల్లలు కాస్త అర్థం చేసుకునేదాకా తండ్రే సర్దుకుపోవాలి అన్నది నా ఉద్దేశ్యం.. అన్నిటికన్నా ముఖ్యం ఇగో .. పెంచి పోషించడం అన్నది పక్కన పెడితే.. అసలు తన పిల్లల దగ్గిర ఇగో అవసరమా?

నాకయితే ఈ విషయంలో తండ్రిదే తప్పని అనిపిస్తోంది.. ఒకవేళ తండ్రిది తప్పులేకపోయినా సర్దుకుపోవాలన్నది నా ఆలోచన.. అవునా?  ప్చ్!!  నన్ను అర్థం చేసుకోరూ.. .  మీ ఆలోచన చెప్పండి..
*****

నల్లమోతు శ్రీధర్ గారు గాయం నుండి తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ..


మనందరికి చిరుపరిచితులైన , కంప్యూటర్ ఎరా ఎడిర్ , మనసులో బ్లాగర్,  నల్లమోతు శ్రీధర్ గారు  ప్రమాదానికి గురై మణికట్టు దగ్గర ఫ్రాక్చర్ అయి ప్రస్తుతం నాలుగునెలల  విశ్రాంతిలో ఉన్నారని , వారి  కంప్యూటర్ ఎరా మెయిల్ ద్వారా తెలిసింది.  శ్రీధర్ గారు తొందరగా గాయం నుండి కోలుకొని మరల పత్రిక పనుల ఉత్సాహంతో మనముందుకు రావాలని ఆకాంక్షిస్తూ .. 
 
"Computer Era telugu magazine Editor Nallamothu Sridhar's wrist bone fractured in an accident & operated. He is one person who prepares entire magazine since 10 years. Becoz of that June, July 2011 magazine will not release. We will meet you again with August 2011 Computer Era telugu magazine."

*****
 
వనితామాలికలో ఫిబ్రవరిలో నేను  శ్రీధర్ గారి  ఇంటర్వ్యూ తీసుకున్నాను.  శ్రీధర్ గారి గురించి తెలియనివారికోసం ఆ ఇంటర్వ్యూ లింక్ ఇక్కడ ఇస్తున్నాను.. 


శ్రీధర్ గారి  గురించి క్లుప్తంగా ఇక్కడ: (వారి మాటల్లోనే):  

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి “కంప్యూటర్ ఎరా” తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ I News, ETV2, ABN ఆంధ్రజ్యోతి, Zee 24 గంటలు, సాక్షి టివి వంటి ఛానెళ్లలో 70కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను.......
*****

5.27.2011

ఈ పోకిరే నాకు కావాలని..:-)


సెలవలు అయిపోవస్తున్నాయి.. పిల్లలు ఊళ్ళకెళ్ళడాలు రావాడాలు .. ఎండల చిటపటలు అన్ని అయ్యాయి.. ఇహ కొత్త పుస్తకాల సందడి, స్కూల్స్, కాలేజస్ తెరవడమే తరువాయి. అందుకే చెప్పాను మా బాబుకి ఇప్పటినుండి ఆ మాథ్స్ చేస్తే కాస్తా మార్క్స్ తెచ్చుకోవచ్చు.. చివర్లో కుస్తీ పడకుండా అని . ఎందుకంటే వాడిప్పుడు 10th  మరి. :)   మధ్య మధ్యలో అంటే కరెంటు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా..  తదేక దీక్షతో పేపర్లమీద రాసేస్తుంటే..బుద్దిగానే విన్నాడు.. చేస్తున్నాడు అని అనుకున్నా..

ఇందాకే వాడేదో ఆటలకంటూ బయటకి వెళ్తుంటే.. చదివే పుస్తకాలు తీద్దామని పుస్తకం చేతిలోకి తీసుకోగానే కిందపడిందో తెల్ల కాగితం.. దానినిండా పెన్సిలుతో రాతలు.. వాడి తెలుగు చదవడం కష్టమే అయినా ఇష్టంగానే చదివాను. చదివినతరువాతా నిజంగా గట్టిగా నవ్వేసాను.. నవ్వీ..  నవ్వీ .. నవ్వాపుకోలేక ఆ కాగితాన్ని అలా మా శ్రీవారి ముందుంచా.. "మనకింత తెలుగు చదవడం రాదు కాని నువ్వు చదువుదూ"  అన్నారు .. ఇహ మళ్ళీ అంటే ఇప్పటికే దాదాపుగా 101 సారి అనొచ్చన్నమాట.. వాడు ఇప్పటి పాటల ట్రెండ్ దృష్టిలో పెట్టుకుని రాసిన పాట.. అప్పుడప్పుడు "ఈ పాట నేనే కనుకున్నా చూడు"   అంటూ ఎవో  వాక్యాలు చెప్తాడు కాని పెద్దగా పట్టించుకోలేదు . ఇదిగో ఇప్పుడు పాట పేపర్ మీద పెట్టేసాడు రాబోయేకాలంలో కాబోయే పాటల రచయిత. ఈ పాట మా అబ్బాయి(పోకిరి)  సొంతమని.. ఇందులో ఏ ఒక్క పదం ఎక్కడినుండి తీసుకున్నది కాదని.. ఈ పాట  పేటంట్ హక్కులన్ని మా పోకిరివే అని మనవి చేసుకుంటూ పాట మీ కోసం. :))
టిరి టిరి టీన్..  టీట్టీటిరిడీన్
టిరి టిరి టీన్ ..టీ ట్టీ టిన్
టిరి టిరి టీన్..  టీట్టీటిరిడీన్
టీటిట్టి  టిరి టిడిన్


అటు వెళ్తున్నా.. ఇటు వెళ్తున్నా...
ప్రియా నీ కోసమే  ఈ అడుగేస్తున్నా....
....
టిరి టిరి టీన్..  టీట్టీటిరిడీన్
టిరి టిరి టీన్ ..టీ ట్టీ టిన్
టిరి టిరి టీన్..  టీట్టీటిరిడీన్
టీటిట్టి  టిరి టిడిన్  [అటు వెళ్తున్నా]
నిదరోతున్నా పడుకుంటున్నా..
ప్రియా నీకోసం కలకంటున్నా...

టిరి టిరి టీన్..  టీట్టీటిరిడీన్
టిరి టిరి టీన్ ..టీ ట్టీ టిన్
టిరి టిరి టీన్..  టీట్టీటిరిడీన్
టీటిట్టి  టిరి టిడిన్  [అటు వెళ్తున్నా]
ఎపుడో ఆ దేవుడు రాసాడు..
నువ్వు నా గమ్యానివని...

అపుడే నా గుండే ఫిక్స్ అయింది
నువ్వు నా ప్రియసఖివని...

టిరి టిరి టీన్..  టీట్టీటిరిడీన్
టిరి టిరి టీన్ ..టీ ట్టీ టిన్
టిరి టిరి టీన్..  టీట్టీటిరిడీన్
టీటిట్టి  టిరి టిడిన్  [అటు వెళ్తున్నా]
అదిగో ఆ కళ్ళల్లోని అందం ...ఎవరికి ఉంటుందని..
అదిగో ఆ నడక చూస్తే ...ఆ హంసైనా కుళ్ళుకుంటుందని..

టిరి టిరి టీన్..  టీట్టీటిరిడీన్
టిరి టిరి టీన్ ..టీ ట్టీ టిన్
టిరి టిరి టీన్..  టీట్టీటిరిడీన్
టీటిట్టి  టిరి టిడిన్  [అటు వెళ్తున్నా]
ఎపుడైనా మీ బాబు అంటాడు....
నేను వీడితో నీ పెళ్ళి చేయనని..
అపుడే నువ్వు అంటావు ...
ఈ పోకిరే నాకు కావాలని..

టిరి టిరి టీన్..  టీట్టీటిరిడీన్
టిరి టిరి టీన్ ..టీ ట్టీ టిన్
టిరి టిరి టీన్..  టీట్టీటిరిడీన్
టీటిట్టి  టిరి టిడిన్  [అటు వెళ్తున్నా]

నాకు చాలా సరదాగా అనిపించిందీ  పాట.. "కాకి పిల్ల కాకికి ముద్దమ్మా! అందుకే నీకు నచ్చింది"  అన్నాడు.. అవునేమో అనుకున్నా .. అయినా సరే!  ఒకసారి మీ అభిప్రాయం కూడా చెప్పండి స్పోర్టివ్ గా నే తీసుకుంటాము.. :-)
*****

note: రాసిన పేపర్లు ఇక్కడ ఉంచుదామంటే స్కానింగ్  ఎదో ప్రాబ్లం చూపిస్తోంది .. కుదిరినప్పుడు ఆ పేపర్ ఇక్కడ ఉంచుతాను. 

5.03.2011

ఉగాది, శ్రీరామ నవమి వనితా మాలిక చూశారా?

కొత్త కొత్త ఊసులతో  ఉగాది వనితా మాలిక ఇప్పుడు మీ కంప్యూటర్ టేబుల్ దూరంలో .. తలుపు తెరిచి కప్యూటర్ తల వాకిటనే పగలూ రేయి నిలుచున్నా.. పిలిచి పిలిచి బదులే రాక అలసి సొలసి ఎదురు చూస్తున్నా అంటోంది మాలిక. రండి మరి ...

4.30.2011

చిన్నారి పెళ్ళి కూతుళ్ళు.... :-)

మా టి. వి లో ఈ మధ్య హింది డబ్బింగ్ సీరియల్ ఒకటి వస్తోంది. నేను సాధారణంగా టి .వి జోలికి వెళ్ళను కాబట్టి ఈ సీరియల్ ఒరిజినల్ .. అంటే హిందిలో చూడలేదు.. డబ్బింగ్ అయినా నాకెందుకో ఈ సీరియల్ చాలా నచ్చింది. ముఖ్యంగా  ఎపిసోడ్ చివరిలో ఇచ్చే కోట్స్ భలె ఉంటాయి. అందుకే క్రమం తప్పకుండా చూస్తున్నా.. మొదట్లో మిస్ అయ్యాను కాని ఆ ఎపిసోడ్స్ అన్ని నైట్ 11 కి మళ్ళీ ఇవ్వడంతో స్టోరీ ఫాలో అవుతున్నా.. ఒరిజినల్ హింది అవడంతో,..నాంచడాలు, సాగదీయడాలు లేకుండా సాగుతోంది ఈ సీరియల్.   బాల్య వివాహాలు జరిగితే ఎదుర్కునే సమస్యలని , వాటి పరిష్కారాల ఆధారంగా తీస్తున్న సీరియల్ ఇది.

సీరియల్ సరే ... నాకు సడన్ గా మా అమ్మా, పిన్ని గుర్తొచ్చారు.వీళ్ళిద్దరివి ఒకేసారి ఒకరికి 9 ఏళ్ళకి ఒకరికి 7 ఏళ్ళకి వివాహాలు జరిగాయి. 

అందుకనే  అమ్మని అడిగాను అత్తారింట్లో మీరెలా ఉండేవారు అని?  దానికి అమ్మ.. "ఎలా ఉండడమేమిటే పిచ్చి మొహమా? అసలు కాపురానికి వెళ్తేగా..మీ నాన్న మంచి ఉద్యోగం వచ్చేదాకా నన్ను తీసుకెళ్ళను అన్నారు, దానికి  మీ మామ్మ వత్తాసు..నాకు  15 ఏళ్ళు రాగానే కాపురానికి పంపారు. మా మొదటి కాపురం మద్రాసులో (ఇప్పటి చెన్నై) అందరు తమిళం మాట్లాడేవారు.. నాకేమో రాదు. ఒక్కదాన్ని మీ నాన్నగారు వచ్చేదాకా బిక్కు బిక్కు  మంటూ ఉండేదాన్ని,, మామ్మ కూడా మాతో రాలేదు. "  అని చెప్తుంటే ఈవిడేనా ? నాన్నగారు చిన్నతనంలోనే కాలం చేసిన తరువాత ఒంటరిగా నలుగురు పిల్లలిని పెంచి పెద్ద చేసింది అనిపించింది. పరిస్థితులు మనకి అన్ని అలవాటు చేసి,  ఆత్మస్థైర్యాన్ని ఇస్తాయి అంటే ఇదేనేమొ. చిన్నతనంలోనే పెళ్ళి, ప్రతి మూడేళ్ళకి ఒకరు తరువాత ఒకరు, తమ్ముడు పసివాడుగా... అంటే .. 2 ఏళ్ళు కూడా పూర్తి కాకుండానే నాన్నగారు కాలం చేయడం.. సుఖం అంటే తెలుసా ఈవిడకి అని అనిపించింది. ఇప్పటికీ అదే చురుకుతనం.. "ఒంట్లో కాస్త నలతగా ఉందమ్మా!"  అంటే చక చకా తను వంట చేసేయడం.. ఒకవిధంగా ఈ "చిన్నారి పెళ్ళి కూతురు"  జీవితంలో సాధించిన విజయాలు ఏమిటి? నలుగురు పిల్లలు ఆ పిల్లల ఎదుగుదల అంతే. కదిలిస్తే.. "ఇంట్లో ఎప్పుడు 30 ఆకులు తక్కువ వేయలేదు.. పెద్ద పెద్ద గుండిగలు వార్చేదాన్ని మీరేంటర్రా  ఒక పూట వంటకే వెళ్ళాడిపోతారు"  అంటూ హడావిడిగా తిరిగేస్తూ ఉంటుంది. అదే జీవితం అనుకునే "చిన్నారి పెళ్ళి కూతురీవిడ." (పిన్ని జీవిత విధానం నాకు తెలిసింది తక్కువ అందుకే ప్రస్తావించలేదు).
******

4.29.2011

డైరీలో ఈరోజు 29/04/2011...మనసులో చిన్న తృప్తి

ఈ నెల 5 వ తారీఖున ఆఫీసుకి సంబంధించిన పనికోసం రాజ్ భవన్ రోడ్ కి వెళ్ళాను. మిట్టమధ్యాహ్నం ఎండ నడి నెత్తిమీద ఉంది. ఇంకా బేగంపేట బ్యాంక్ పనిమీద వెళ్ళాలి.. అనుకుంటూ .. అక్కడ పని ముగించుకుని బయటకి వచ్చాను. రాజ్ భవన్ రోడ్ దగ్గర ఆటోలు దొరకడం తక్కువ .. అనుకుంటూ ఉండగా "ఆటో కావాలా మేడం" అని ఆగాడు ఆటో అతను. బేగంపేట వెళ్ళాలి.. అని ఆటో ఎక్కి కూర్చున్నా.. అతనిని నేనసలు గమనించలేదు ఎక్కెప్పుడు.. ఆటో ఎక్కి కూర్చున్న తరువాత "మిమ్మల్ని నేను చాలా సార్లు చూసాను నేను మీది ఫలనా కాలనీ కదా " అని అడిగాడు.. అప్పుడు గమనించా అతనిని నిజమే మా కాలని బస్టాండ్ దగ్గర చూశాను. అదే చెప్పాను, తెలిసిన మనిషిని అవడం చేతో మరి చెప్పాలనిపించిందో కాని.. ఈ నెల 25 న నాకు operation  ఉందమ్మా.. 10 యేళ్ళ క్రితం జ్వరం వచ్చింది, ప్రభుత్వాసుపత్రికి వెళ్తే పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చారు.. Date అయిపోయిందో ఏమో అది కాస్తా వికటించింది.. కాళ్ళు రెండు చచ్చుబడిపోయాయి.. రోజుకి 14 గంటలు కష్టపడ్తాను ,  ఆటో అద్దె పోగా నెలకి 1000/- రూపాయల చొప్పున పొదుపు చేస్తున్నా.. ఇప్పటికి 25,000/- అయింది. నాకోసం ప్రార్థించండి 

అని..అప్పుడు చూశాను అతని కాళ్ళు రెండు కాళ్ళు సీట్ పైన చేతి వేళ్ళంత సన్నగా పద్మాసనం వేసి ఉండడం. "మరి ఆటో ఎలా నడుపుతున్నావు " అని అడిగాను. ఒక సంవత్సరం ఇంట్లోనే ఉన్నాడుట. స్నేహితుడు వచ్చి ఇలా కాదు ఎంతో మంది వికాలంగులు ఎన్నో రకాలుగా పని చేసుకుంటున్నారు.. నువ్వు కూడా చెయోచ్చు అని మనోధైర్యం ఇచ్చాడుట.. అలా ఆటో నేర్చుకుని,కుటుంబానికి ఆసరా అయ్యాడుట.  తండ్రి రెండేళ్ళక్రితమే కాలం చేసారు. అప్పటినుండే తనే కుటుంబానికి ఆధారమట. చెల్లెలి పెళ్ళి చేసి,  ఇదిగో ఇప్పుడు తను శస్త్ర చికిత్స చేసుకుంటున్నాడు.. "నాకు ప్రత్యేకంగా మా దేవుడే..  దేవుడు ఇంకెవరు కాదు అన్న ఆలోచన లేదు మేడం.. మీరు ఎవరిని ప్రార్థిస్తారో వారినే నాకోసం ప్రార్థించండి"  అని తన కథ ముగించాడు. ఇంటికొచ్చాక ఉడతా సాయంగా నా దగ్గర ఉన్న నేను ఇవ్వగలిగినంత అమౌంట్ అతనికి  ఇచ్చి,  నా ఫోన్ నంబర్ ఇచ్చి విషయం తెలియజేమన్నాను. ఇందాకే వాళ్ళ తరపువాళ్ళు నాకు ఫోన్ చేసి.. "అంతా బాగానే ఉంది, కాళ్ళు వస్తాయో లేదో ఇంకా చెప్పలేము అన్నారుట డాక్టర్స్ .."  అని చెప్పారు. 

ఒక మంచి పని చేయగలిగాము అని .. మనసులో చిన్న తృప్తి.
*******

అందం చూడవయా... ఆనందించవయా..

నిన్నటి పోస్ట్లో అందం గురించి మాట్లాడాను కదా ఆ నేపధ్యం ఈ అందానికి సంబందించి నాలుగు మాటలు:

అందం.. చిన్నప్పటినుండి వింటున్నమాట.. ఒక్కోసారి అందం అన్న పదం అంటేనే కోపం వచ్చేస్తుంది. ఒక్కోసారి ఆస్వాదించగలిగినప్పుడు ఇష్టంగా ఉంటుంది. నా దృష్టిలో అందం  అంటే మనం ఆస్వాదించగలగాలి, ఆనందించగలగాలి. పోల్చుకోడం వచ్చిందంటే కృంగిపోవడం ఖాయం.. మా అమ్మ నలుగురు అక్కచెల్లెళ్ళ అందం అయితే ఏంటి, మాట తీరు అయితే ఏంటి ఎవరికి వారే సాటి. నలుగురూ బాగుంటారు పాత సినిమా హీరోయిన్లలాగా నిండుగా.. ఇలా.
 ఒక్క మా మూడో పిన్నికి తప్ప మిగతా ముగ్గురికి చిన్నప్పుడే అంటే బాల్య వివాహాలే. ఈ ముగ్గురక్కచెల్లెళ్ళ పిల్లలకి ఒకటి లేద రెండు సంవత్సరాల  తేడా ఉంటుంది. ఈ అక్కచెల్లెళ్ళ మధ్య ఎవరు ఎవరికన్నా అందంగా ఉంటారు అనే ప్రశ్న తలెత్తిందో లేదో కాని మా రెండో పిన్ని కూతురునుండి మేము ఎదుర్కున్నాము .. మా అమ్మే అందరికన్నా "అందంగా" ఉంటుంది అంటూ.. ఎమో అప్పుడెలా స్పందిచానో గుర్తులేదు.. వాదించానేమో కూడా నలుగురూ నలుగురే అని..

ఈ అమ్మాయి తరువాత మా అన్నయ్య నుండి ఎదుర్కున్నామీ సమస్య  వాడు తిన్నగా ఉండక "మా అమ్మే బాగుంటుంది " అని చెప్పిన పిన్ని కూతురినే మా మిస్ కుటుంబం గా చేసేసాడు.. అప్పటినుండి అది ప్రపంచంలోనే తనంత అందం ఎవరికీ లేదనే తరహాలో ఉండేది. మా ఇద్దరి మధ్య కేవలం 6 నెలలే తేడా ఉండడంతోనూ.. అలా డిక్లేర్ చేసింది స్వయానా మా అన్నయ్య అవడంతోను నాకు సహజంగా ఉండే అసూయ మరిన్ని పాళ్ళు హెచ్చి,  అసలు ఈ "అందం" అనే పదం కనిపెట్టినవాళ్ళని కాల్చేయాలి అన్నంత కసి కలిగేది అప్పట్లో. 

అక్కడితో ముగిసిపోకుండా ఈ అందచందాల పోటీలు మా అక్క చెల్లెళ్ళ మధ్య జరిగేది.. ప్రత్యక్షంగా తక్కువే చెప్పాలంటే.. కాని పరోక్షంగా నీకన్నా మీ అక్కే బాగుంటుంది, లేదా మీ ఇద్దరిలోను మీ అక్క బాగుంటుంది .. ఈ తరహా మెచ్చుకోళ్ళూ.. అయితే మా అక్క చెల్లెళ్ళ పోల్చుకోడాలు వచ్చేసరికి నాలో కాస్త జ్ఞానం వచ్చింది అని చెప్పొచ్చు అందం అంటే కేవలం మన బాహ్య సౌందర్యం మాత్రమే కాదు అన్న చిన్న ఊహ.. కాబట్టి పెద్దగా ఆలోచించేదాన్ని కాదు కాని,  ఒక్కోసారి మటుకు (చాలా సార్లు) అయినవాళ్ళే అంటే అక్క తరపు  వాళ్ళు అంటున్నప్పుడు కొంచం చివుక్కుమనేది.. ఇదో తరహా ఆనందం అంతే అనుకునేదాన్ని..  "బాలేదు"  అని చెప్పినంత మాత్రానా నేనేమి చేయగలను అని ప్రశ్నించుకునే దానిని చాలా సార్లు...అలా అన్న సంధర్భాలు కూడా ఉన్నాయి. దేవుడిచ్చిన రూపం కదా ఇది ఇంకేమి చేయలేను అని.  
******

మొన్నామధ్య ఎదో ఎవరు పొడుగు?  ఎవరు పొట్టి?  అనే విషయంలో చిన్న చర్చ జరిగినప్పుడు.. అమ్మ వాళ్ళ తరంలో ఆడవాళ్ళల్లో మా మొదటి పిన్ని, ఆతరువాత తరం అంటే మా తరంలో ఆడవాళ్ళల్లో నేను, ఇదిగో ఇప్పుడు అక్క పిల్లలు మా పిల్లలు.. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అక్క వాళ్ళ బాబు "నువ్వెన్నన్నా చెప్పు పిన్ని నీకన్నా అమ్మే బాగుంటుంది.. అన్నాడు." (పొడుగు విషయంలో నేను నాకన్నా మా/వాళ్ళ పిల్లలు పొడుగు అనే విషయాన్ని అంగీకరించను అనే ఒక వివాదం ఉంది మా మధ్య...  నిజమే మా తరంలో లేడీస్ లో నేను పొడుగు ... ఇప్పుడు వాళ్ళు పొడుగే కాదన్నదెవరు అన్నది నా వాదన) అందుకని అలా అనడం.. మా అమ్మే అని.. కరక్టే  అక్క బాగుంటుంది అలా అని ఇప్పుడు నా మొహం చెక్కేసుకోలేను కదా అని అంటే సమాధానం చెప్తే నేను సీరియస్ గా తీసుకున్నానంటారు..ఈ మధ్య బ్లాగులో కూడా ఈ తరహా పోస్ట్ ఒకటి చదివాను.. బ్లాగర్ని ఎవర్నో మీరేమంత అందంగా ఉండరు మిమ్మల్ని మీ వాళ్ళు భరించడం కష్టం అని..  కేవలం అందం లేకపోతేనే భరించడం, భరించలేకపోవడం లాంటివి వచ్చేస్తాయా? అలా ఎలా రాస్తారు అనిపించింది అప్పుడు.... మనసుతో పోల్చగలిగితే పోల్చాలి లేకపోతే వదిలేయాలి అన్నది నా ఆలోచన.  నిజానికి కళ్ళు చెదిరేంత అందం ఎదురుగా ఉన్నప్పుడు  అసూయని దరి చేరనివ్వకుండా ముందుగా ఇంకెవ్వరితోనో  పోల్చకుండా ఆనందించి ఆస్వాదించగలగాలి..
*****
ఈ అంతరాలు ఎప్పటికి సమసిపోతాయో అనిపిస్తుంది ఒక్కోసారి.. కొన్నాళ్ళు ఎవరి వత్తిడులలో, ఎవరి పనులలో వాళ్ళు ఉండి కలుసుకోలేని పరిస్థితులలో  ఉన్నప్పుడు బంధువులు మన గురించి ఏర్పర్చుకునే అభిప్రాయాలు ఒక్కోసారి మనసుని కలచివేస్తాయి..  దీని గురించి తరువాత పోస్ట్లో .. 
*****

4.28.2011

డైరీలో ఈరోజు 28/04/2011.. ఎవరు అయితే ఏంటటా? .. (పెళ్ళి అయిన తరువాత)

పిల్లలిద్దరికి సెలవలేమో సరదాగా నలుగురం కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాము. మాటల మధ్యలో మా పాపకి మా ( అక్క, తమ్ముడు, అన్నయ్య ల)  పెళ్ళిళ్ళు ఎలా జరిగాయి అన్న అంశం తీసుకొచ్చింది. అన్ని చెప్తూ ఉన్నా.. పెద్దమ్మ ఇలా, పెద్దమావయ్య అలా అని.. ఇహ మా విషయం వచ్చేసరికి అక్కడ నేనొక్కదాన్నే అయితే మా పరిచయం ఇలా జరిగింది.. పెళ్ళి ఇలా అయింది అని చెప్పేసేదాన్ని కాని, మా శ్రీవారు కూడా ఉండడంతో తన త్యాగ గాధ కూడా పిల్లలికి చెప్పుకోవాలనిపించిందో ఏంటో మరి... నాకయితె విని విని విసుగొచ్చింది కొన్ని సంధర్భాల్లో  చిఱ్ఱెత్తుకొచ్చి ఇప్పుడెందుకు ఆ గొడవ మనకి పెళ్ళి అయింది అని కూడా కసురుకున్న  సందర్భాలు ఉన్నాయి,  అహ.. వినరు కదా ... మళ్ళీ  మొదటికి ... ఈసారి పిల్లలు బలి.. :-) బలి అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే..... వినబోతు/చదవబోతు సందేహమెందుకు. చదవండి మీరే.

ఈ విషయంలో మా శ్రీవారనే కాదు ఇలా చాలామందిని చూశాను.. ఎంతమంది నన్ను చేసుకుంటామని వచ్చారో కాని ఏమి చేస్తాము మీ అమ్మకి మాటిచ్చేశాను అని అదేదో ఘోరమైన తప్పిదం చేసినట్లుగా వాపోతూ ఉంటారు.. అదిగో అలాగే మా నవమన్మదుడు  కూడా మా పిల్లలికి తన వెనకో ముందో ఎంతమంది క్యూ కట్టి ఉన్నారో చెప్పుకొస్తున్నారు. 

"మీ తాతయ్య వాళ్ళ స్నేహితుడికి మాటిచ్చరమ్మా.. వాళ్ళ అమ్మాయిని కోడలిగా చేసుకుంటానని..వాళ్ళు ఎన్నో వేలో లక్షలో ఇస్తామన్నారు అంటూ ... (ఎదో సినిమా కథ గుర్తు రావడంలేదు మీకు.. నాకయితే మావారు చెప్పేది ప్రతీది ఒక సినిమా కథే.. వాళ్ళ పిల్లలు అమాయకులు అనుకుంటారో, బార్య అమాయకురాలనుకుంటారో కథలు వినిపించేస్తూ ఉంటారు :-) ) ఇలాంటివి వింటుంటే నాకయితే ఒళ్ళు మండిపోతుంది "పోని ఇప్పుడుమటుకు మించిపోయిందేముంది.. హ్యాపీగా చేసేసుకు రండి కాస్త నాకు పని భారం తగ్గుతుంది అని అంటూ ఉంటాను" మొన్నెప్పుడో ఆ అమ్మాయికి ఇంకా పెళ్ళి కాలేదు అని వాపోతుంటే.. మా మన్మధుడులాంటి భర్త దొరకలేదుట మరి..

ఆ పెళ్ళి కాలేదని చెప్పిన ఆవిడని నేను చూడలేదు కాని, ఇంతకు ముందు అంటే మా పెళ్ళయిన కొత్తలో.. ఒకటి రెండు సార్లు బయటకి వెళ్ళినప్పుడు.. ఎదురయి  నవ్వో, పలకరించో వెళ్ళే ఇద్దరు ముగ్గురు అమ్మాయిల్ని, చూపించి నా పతిదేవుడు.. "నీకు తెలుసా ఇప్పుడు నవ్వింది చూడూ ఆ  అమ్మాయిని నాకిచ్చి చేద్దామనుకున్నారు".. "ఇదిగో ఇప్పుడు మాట్లాడింది చూడు ఆ  అమ్మాయి నాకు లైన్ వేశేది..కాని ఏమి చేయను అప్పటికే మీ పెద్దవాళ్ళకి మాటిచ్చేశాను"  అంటూ ఉండేవారు..

రోడ్ మీద కాబట్టి నిభాయించుకుని మౌనంగా ఉండేదాన్ని.. ఎందుకంటే ఆ చూపించే అమ్మాయిల్ని ముందు అర్జంట్గా నాతో పోల్చేసేవారు.. అక్కడ మండేది. నేనెలా ఉంటానో నాకు బాగా తెలుసు.. మరి వెనక్కి తిరిగి చూడాలి అనేలా కాకపొయినా హోమిలీ గా ఉంటానని తెలుసు.. మా వారు చూపించేవాళ్ళు నాకన్నా  వయసులో పెద్దవళ్ళో, మరి ఏమో మరీ ముదురు ముఖాలతో.. వంటి మీద కండ లేనట్లుగా సన్నగా పీలగా.. అసలే జన్మలోను వీళ్ళు తినలేదేమో అన్నట్లుగా.. ఉండేవారు.. (వాళ్ళను కించపరచడం నా ఉద్దేశ్యం కాదని గమనించగలరు.. అందం ఆకారం దేవుడు ఇచ్చినవే వాటిని మనము మార్చుకోలేము..)  మనం ఎంచుకునే అందమో మనసో ఆకారమో మన హుందాతనాన్ని ప్రస్ఫుటింపజేయాలి కాని.. వాళ్ళవరినో నాతో పోల్చేసి .. "చూడు నీకు మాటిచ్చాను కాబట్టి లేకపోతే వాళ్ళనే చేసుకునేవాడిని " అనే లెవెల్ లో మాట్లాడుతుంటే మండిపోతుంది.

ఇలా ఎవరినో చూడలేని వాళ్ళని చూపించి, జీవితంలో ఎదో పోగొట్టుకున్నవాళ్ళల్లా   మాట్లాడుతుంటే అనిపిస్తుంది.. నాదే రాంగ్ ఛాయిసా? లేక తన ఆలోచనలా అని.. పెళ్ళి అయిన తరువాత ప్రతి మగవాడికి పక్కింటి వాళ్ళే అందంగా కనపడతారు  రంభలాంటి తన బార్య కన్నా , పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లు మావారి విషయంలో మటుకు ఈ నానుడి నిజమే.. ప్చ్.. వీళ్ళని ఎలా మార్చాలి ఎన్నిసార్లు చెప్పినా వినరు అనిపిస్తుంది.. :(
 ******

నోట్: ఫోటోలన్నీ  మావారిమీద... అలా మాట్లాడేవాళ్ళమీద కోపంగా, కసి గా పెట్టినవే.. మా మన్మధుడు చేసుకోబోయి మిస్ అయిన మిస్సులు మటుకు అచ్చు ఇలాను ఉండరు... ఇంతకన్నా అందంగా కూడా ఉండరు ... 

క్రికెట్ .. బార్య - ఏది ముఖ్యం?





ఈరోజు నాకొచ్చిన ఈ మెయిల్ ఇది.. 

THE LOVING HUSBAND


A man had two of the best tickets
for the Cricket World  Cup Final. As he sits down, another man comes along and asks if anyone is sitting in the seat next to him..

"No", he says, "the seat is empty."

"This is incredible!" said the man, "who in their right mind
would have a seat like this for the Cricket Cup Final, the biggest sporting event of the 
whole world and not use it?"


He says, "Well, actually, the seat belongs to me. My wife was supposed to
come with me, but she passed away. This is the first Cup Final we haven't been to together since we got married."


"Oh... I'm sorry to hear that. That's terrible. I guess you couldn't find
someone else, a friend or relative or even a neighbour to take the seat?"
 The man shakes his head...


......"No. They're all at the funeral."

 *****

ఎంత ప్రపంచ కప్పు అయినా ప్రపంచమంతా చేసుకునే గొప్ప సంబరమయినా...  తోడు నీడగా మనకోసమంటూ జీవించే బార్యకన్నా ఎక్కువా?  "THE LOVING HUSBAND " అనే టైటిల్ అంగీకరించలేకపోతున్నాను. :( 

డైరీలో ఈరోజు 27/04/2011

 ఈరోజు ప్రసాదం గారి బ్లాగు పోస్ట్  "సినిమా థియేటర్‌లో    జాతీయ గీతం " ద్వారా శంకర్ గారి బ్లాగుకి వెళ్ళి ఈ జాతీయగీతం విన్నాను/చూశాను   చాలా బాగుంది.. హృదయం చెమ్మగిలింది..

శంకర్ గారి బ్లాగు ద్వారా నేను మళ్ళీ బుడుగు చూసే/చదివే అవకాశం కలిగింది. పి.డి.ఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నా థాంక్స్ శంకర్ గారు.
*********

శరత్ గారు రాసిన పోస్ట్ కి వచ్చిన కామెంట్‌కి సంబంధించి నేనో కామెంట్ రాయడం జరిగింది. దానికి శరత్ గారి రిప్లై కూడా నాకు చాలా నచ్చింది. అందుకే ఆ విషయంపై జరిగిన చిన్న చర్చ ఇక్కడ నా బ్లాగులో.... మా పిల్లలు చదవడానికి అనుకూలంగా ఉంటుందని నేను రాసిన నాకు నచ్చిన సంధర్భానుసార  కామెంట్స్ ఇలా.. తరువాత ఎప్పుడో ఫలనా చోట రాసాను చదవండమ్మా అంటే కష్టం కదా అందుకని.. వాళ్ళ సౌకర్యార్థం.

బ్లాగర్ రమణి అన్నారు...
"మా అన్నయ్యకి నాకులాగానే కులం వుండేది కాదు. పెళ్ళయ్యాక మా వదిన గారి ప్రభావం ఎక్కువై మీలాగే సమర్ధించుకొని కులం పేరు చెప్పుకోవడం మొదలెట్టారు."

శరత్ గారు మీరు అక్కడెక్కడో ఉన్నారు కాబట్టి మీరు కులం లేదు అన్న ఒక్క మాటపై నిలబడగలిగారు. కాని అదే ఇక్కడ ఉంటే కష్టమే... హెచ్చు తగ్గుల గోల.. లేకపొతే పిల్లల చదువులకోసం, ఎదో ఒక కారణానికంటూ మన కులం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నాకులం చెప్పను అని మడి కట్టుకుని కూర్చుంటే కుదిరేది కాదు.. పోని నాకంటూ ఈ విషయంలో కొన్ని నిర్ధిష్ట అభిప్రాయాలు ఉన్నాయి అని గిరి గీసుకుని ఉన్నామనుకొండి మన ఇగో ని ప్రశ్నించేదాకా వెళ్తారు, అవహేళనతోటో... అతితెలివితోటో.. నిన్న మొన్నటిదాకా ఇవన్ని అనుభవించినదానినే నేను. అందుకే అవతలి వాళ్ళు అంత కుల వివక్షతో మాట్లాడుతున్నప్పుడు.. మనకంటూ ఒక కులాన్ని ఇచ్చిన మన పెద్దవాళ్ళ పెద్దరికాన్నో లేదా ఆ కులాన్నో నిలబెట్టడానికి తప్పదనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనిషిని కులాన్ని బట్టే అంచనా వేస్తారు లెండి.. రాతలో చదువులో పనికిరావు.. :-)
27 ఏప్రిల్ 2011 10:58 ఉ

బ్లాగర్ శరత్ 'కాలమ్' అన్నారు...
@ రమణి

మీ బ్రాహ్మిణ్ టపా చదివాను :)

మీరు ఒక్క కులం చెప్పుకోనందుకే అన్ని కష్టాలు వచ్చిపడుతున్నయ్యంటే నా 'స్వ' కులం చెప్పుకుంటూ నేను ఎన్ని కష్టాలు పడవచ్చో ఊహించగలరా?! అవేవీ నేను ఇబ్బందులు అనుకోను. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడల్లా నా నిబద్దత, ఆత్మ విశ్వాసం పెరుగుతుందే కానీ నేను పలాయనం చిత్తగించను. కొన్ని సిద్ధాంతాలకు, భావాలకు కట్టుబడి వుండాలనుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురువుతాయి. వాటిని చిరునవ్వుతో ఎదుర్కోవాలి. అప్పుడే మనం మిగతావారికీ, మనకీ తేడా చూపించగలిగేది. నేనయితే పనికిమాలిన విమర్శలు, ఇబ్బందులు పట్టించుకోనే పట్టించుకోను. వాటికి విలువ ఇస్తూ పోతే అవి మనల్ని మార్చేస్తూ పోతాయి. మనం మరో రకంగా సమర్ధించుకుంటూ మన ఉన్నత ఉద్దేశ్యాలని చులకన చేసుకుంటున్నామూ అనుకుంటే మనలో ఆత్మ విశ్వాసం తగ్గుతున్నట్టే అర్ధం. మన జీవితం ఇతరుల కోసమా లేక మన కోసమా అన్నది చూసుకోవాలి. నలుగురితో కలిసి నారాయణా అనడానికీ, పది మందితో కలిసి గోవిందా అనడానికీ మనలో పెద్ద పెద్ద వ్యక్తిత్వాలు అవసరం లేదు. సగటు మనస్థత్వాలు చాలు.

నేను ఇండియాలో ముప్పయి మూడేళ్ళకు పైగానే వున్నాను. తరచుగా భారత్ వస్తుంటాను. నాకెప్పుడూ కులం విషయమై ఇబ్బందులు ఎదురుకాలేదు. నా పిల్లలకూ కాలేదు. బహుశా నేనూ సమర్ధించుకోవడం మొదలుపెడితే అప్పుడు ఇబ్బందులు ఎదురయ్యేవేమో. బహుశా నాకో కులం వుండేదని నేను మరచిపోయినందువల్ల కావచ్చు - ఆ కోణాలు నేను పట్టించుకోలేదనుకుంటా. రాజీపడటం మొదలెడితే ప్రతి విషయంలో రాజీ పడుతూ ఎంచక్కా సగటు మనుషులం అయిపోవచ్చు. అందులో సందేహం లేదు. అప్పుడు మనకంటూ స్వంత వ్యక్తిత్వం అవసరంలేదు.

ఎప్పుడన్నా సరదాగా, లైటర్ వెయినులో నా మాజీ కులం కులం గురించి చెప్పివుండవచ్చు, ఇతర కులాల గురించి వ్రాసివుండవచ్చు కానీ సీరియస్సుగా నాకెప్పుడూ అది ఒక సమస్య కాలేదు. ఈ విషయంలో నేను మీతో ఏకీభవించలేను. ఎవరి అభిప్రాయాలు వారికి వుంటాయి కాబట్టి మీ అభిప్రాయన్నీ గౌరవిస్తున్నాను.
27 ఏప్రిల్ 2011 11:45 ఉ

బ్లాగర్ రమణి అన్నారు...
:-) శరత్ గారు : నేను రాసిన టపాలోనే చూడండి నేను వెళ్ళినచోట్ల చాలా మందికి అసలు నేనెవరో కూడా తెలీదు.. "మీరు మనవాళ్ళా?" అని అడిగారని.. :-) నేను పుట్టినప్పటినుండి ఉన్నది ఇక్కడే.. ఈ ఊర్లోనే.. బాల్యం, చదువు, పెళ్ళి అన్ని ఇక్కడే.. అలాంటిది నాతోపాటు ముఖపరిచయమయినా సరే.. ఇన్నేళ్ళు ఉన్నవాళ్ళు ఇలా అడిగారంటేనే అర్థం చేసుకొండి నెనెంత కఛ్చితంగా ఉండేదాన్నో.. ఇప్పటికి నా తోటివారికి చాలామందికి తెలీదు నేను ఫలనా అని.. (ఇప్పుడు లోకమంతటికి తెలిసింది లెండి నా బ్లాగు ద్వారా)

సమర్థించుకోడం కాదండి.. పరిస్థితులు మన వ్యక్తిత్వానికి కులం అడ్డుగోడలా కట్టేస్తున్నప్పుడు తప్పని పరిస్థితుల్లో కులం ఉనికిని చాటడం.. మీరు ఇండియాలో 33 యేళ్ళు ఉన్నా మీకా పరిస్థితి రాలేదు అంటున్నారు.. నాణేనికి ఇంకోవైపునుండి రండి.. బహుశా మీ శ్రీమతిగారి ద్వారా తెలుసుకుని మీ దగ్గర మౌనంగా ఉండొచ్చు కదా మీ అభిప్రాయాలకి కట్టుబడి.. (ఇది నా ఊహ మాత్రమే).. నలుగుర్లో నారయణ పదిమందిలో గోవిందా.. :-) సర్దుకుపోవాల్సి వచ్చినప్పుడు సగటు మనిషి మసస్థత్వం అలవర్చుకోడం తప్పదు శరత్గారు. ఎప్పుడో ఒకసారి సర్దుకుపోడానికో , రాజి పడడానికో స్వంత వ్యక్తివాలు కుదవ పెట్టాల్సిన అవరం లేదు లెండి.. నేను సర్దుకుపోతున్నాను అన్న విషయం ఎవరివల్ల జరిగిందో వాళ్ళు అర్థం చేసుకుంటే నా వ్యక్తిత్వం ఇంకొంచం పరిపక్వత చెందుతుంది కాదంటారా?

నాతో ఏకీభవించకపోయినా.. నా అభిప్రాయాన్ని గౌరవిస్తున్నందుకు థాంక్స్.. నా ఈ అభిప్రాయం ఎవరిని ఇబ్బంది పెట్టనంతవరకే .. ఈ కులం ఉనికి అనేది ఇబ్బంది పెడ్తుంది అంటే మారిపోతుంది కూడా.. సప్తపది సినిమాకి సంబంధించి నేను రాసిన పోస్ట్ చదివారా? అది కులానికి సంబంధించే.. మార్పు అనేది కూకటి వేళ్ళనుండి రావాలి కాని కొమ్మలనుండో, ఆకులనుండో వస్తే వేర్లనుండి మళ్ళీ మళ్ళీ వచ్చేవే ఈ కులాలు, అచారాలు.. :-)

http://sumamala.blogspot.com/2008/07/blog-post_21.html

ప్రేమ వివాహం, కులం విషయంలో నా అభిప్రాయాలు ఇందులో కొంతవరకే చెప్పాను.
27 ఏప్రిల్ 2011 12:17 సా
*****
తొలగించు

4.27.2011

డైరీలో ఈరోజు 26/04/2011- నాకు నచ్చిన కమెంట్..



 

 (సత్య సాయి బాబా గారి విష్యంలో  నాకు నచ్చిన కామెంట్ ఇది. )  లాహిరి గారి బ్లాగులో

మీ రాసే విధానం బాగానే ఉంది. ఆలోచనలలో స్పష్టత ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే...రాయడానికి సరిపడా సరుకుంది మీ దగ్గర. కాకుంటే ఒక అంశాన్ని లేదా విషయాన్ని చెప్పదలుచుకున్నప్పుడు దాని గురించి పరిపూర్ణమయిన సమాచారం ఉన్నప్పుడే చెబితేనో..రాస్తేనో అందంగా ఉంటుందని నా అభిప్రాయం. విమర్శలు చేసే ముందర స్థాయీ బేధాలు చూడటం కనీస ధర్మం కదా..మీకు తెలియని విషయమేమీ కాదనుకోండి. కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు ఏమి రాసినా ఆది సబబుగా ఉండదు. మన ఆలోచన మరో పదిమందిని ఆలోచింపచేసే విధంగా ఉండాలి కానీ...బాధించే విధంగా ఉండకూడదు అన్నది నా అభిప్రాయం. మండలం గడిచాక నడిచొస్తాను...పదేళ్ళు ఇంకా ఉంటాను అనడం ఇంకోటి...మరోటి....అవి ఎప్పుడు...ఎలాంటి సందర్భాల్లో చెప్పిన విషయాలో...దాని వెనుక ఉన్న అసలు అర్ధం ఏమిటో...అసలు ఆ సందర్భంలో ఎవరిని ఉద్దేశించి అలా ఆయన అన్నారో...తదితర విషాయల మీద మీకు స్పష్టమయిన సమాచారం..కనీస అవగాహన ఉంటే నిరభ్యంతరంగా రాయొచ్చు. పోనీ...లేదు అనుకుంటే...కనీసం తెలుసుకునే ప్రయత్నమయినా చేసి పటిష్టమయిన సమాచారం ఉంది అనుకున్నప్పుడయినా రాయాలి కదా.. ఒకరు రామా అని పిలిస్తే...అది పదో మనిషి చెవిలో పడేటప్పటికి "రామా" కాస్తా, "రమా" అయిపోవడం సహజం. ఇలాంటి చిన్న విషయాలపై కూడా తమరు దృష్టిపెట్టి ,నాణేనికి ఒకేవైపు కాకుండా మరో వైపు కూడా ఉంటుందని గ్రహించి సమాంతరంగా ఆలోచించి రాస్తే బాగుంటుందని నా మనవి. ఆ మాటకొస్తే షిరిడీ సాయి బాబా గురించి కూడా అందరం చరిత్రలో చదువుకోవడమే కానీ....నిజంగా కళ్ళతో చూసినది అయితే కాదు కదా. మరి ఇంతమంది కళ్ళకి ఇన్ని ఋజువులు చూపిన మనిషిని పట్టుకుని అలా నిష్టూరాలాడటం ఎంత వరకు న్యాయమో ఆలోచించండి. ఎవరయినా ఒక్క ఒక్కరినీ...లేదా పది మందిని...లేదా వందమందిని...మేరీయీ చేతనయితే వెయ్యిమందిని మోసం చేయొచ్చు.. ఇలా లక్షల మంది...ఆ మాటకొస్తే కోట్ల మంది ఇలా ఆయన పాదాక్రాంతం అవుతూంటే..మోసం...మాయ అని కాకుండా...మరో కోణం ఏదయినా ఉంది ఉండొచ్చు అని నిష్కాల్మశంగా ఒక్కసారి ఆలోచించొచ్చు కదా అని నా సలహా. ఇన్ని చెప్పాను కదా అని నేను భక్తుడినేమో...కాబట్టే ఇలా రాసుంటాడు అని ఆలోచించకండి. నేను మానవతావాదిని.."

ఎవరో కూడా తెలీదు కాని చక్కగా తమ అభిప్రాయాన్ని చెప్పారు కుడోస్- రమణి
--

డైరీలో ఈరోజు 23/04/2011...బ్రాహ్మల వేట :-)

Brahmin chief justices between 1950 to 2000: 47%
ఏంటి ఈ వేట అని కోపం వస్తున్నట్లుంది చాలా మంది పెద్దలకి.. నిజమేనండి ఈరోజు మే(నేను)ము బ్రాహ్మల వేటకే వెళ్ళాము. ఆదివారం అంటే రేపు పొద్దున్నేమో సత్యనారయణ వ్రతమని బంధువులు పిలిచారు.. పొద్దున్నంతా ఆ హడావిడి రేపు వ్రతానికి వెళ్ళాలి అని , సాయంత్రం 5 అవుతుండగా స్నేహితురాలి ఫోన్.. "రాగలరా కొంచం నాలుగు సందులూ తిరిగి వెతికి పట్టుకుందాము"  అని.. అదేమంత పెద్ద పనా కాస్త నాకు వాకింగ్ చేసినట్లుంటుందని సరే అనేశా.. అనుకున్నట్లుగానే సాయంత్రం 6.30  కల్లా స్నేహితురాలు వచ్చింది. రాత్రి 9 దాకా ఈ చివరనుండి ఆ చివరదాకా జల్లెడ పట్టి వెతికితే ఒక 30 కుటుబాలు కనపడ్డాయి.. మా స్నేహితురాలి అత్తగారు నందికేశ్వర స్వామి నోము నోచుకుంటున్నారుట ఆ నోముకి సంబంధించిన కార్యక్రమానికి ఈ పిలుపుల వేట. మొత్తానికి తెలిసిన తెలియని 30 బ్రాహ్మణ కుటుంబాలని పిలిచాము. వేట ముగిసాకా ఈ బ్రాహ్మలకి సంబంధించి  తర తరాల ప్రశ్నలు మదిలో కదలాడాయి. అవే ఇవి.

ఇక్కడో ముఖ్య గమనిక: బళ్ళో చదువుకునే రోజుల్లో అయితే వరమణి టీచర్  మాటల ప్రభావం వల్ల అసలు మీ కులం ఏదంటే... ఛ!  కులం అలా బహిరంగంగా అడగకూడదు/చెప్పకూడదు  అన్న ఒక నియమావళి పాటించేదాన్ని. కాబట్టి అప్పుడు కుల పట్టింపు లేదు.

స్కూల్ చదువుకునే రోజుల్లో :

మేరి టీచర్ : ఏంటి నువ్వు గుడ్డు తినవా?
నేను : లేదు టీచర్ నేను పప్పు మాత్రమే తింటాను..
మేరి టీచర్ : అందుకే అలా రివటలా ఉన్నావు. ఇంతకీ మీరు కోమట్లా బాపనోళ్ళా?
నేను : ఎమో టీచర్ వరమణి టీచర్ చెప్పొద్దన్నారు.. (సదరు వరమణి టీచర్ మా చేత క్రమం తప్పకుండా ఏసు క్రీస్తు పాటలు పాడించేవారు మా అందరి దైవం అని... ఎందుకలా అన్నది కాస్త జ్ఞానం వచ్చాక తెలిసింది :-) )
*****

కాలేజ్ రోజుల్లో :

రావోయ్  కాంటిన్లో టిఫిన్ చేద్దాము స్నేహితురాలు పద్మ  పిలుపు
నేను : బయట ఎక్కువగా తినొద్దని అమ్మ చెప్పింది.. వద్దు పద్మా! ప్లీజ్...
పద్మ : మన బ్రాహ్మిన్స్ అంతా ఇంతే అన్నిటికి హద్దులు పెట్టేస్తారు.. మాలో ఇంత లేదు.. అవును ఇంతకీ మీరు వైదీకులా? నియోగులా? ద్రావిళ్ళా?
నేను: బ్రాహ్మిన్స్ లో ఇన్ని రకాలు ఉంటాయా? ఇంటికెళ్ళిన తరువాత అమ్మని అడగడం.. అమ్మ ఏ బ్రాహ్మిన్స్మి?
అమ్మ: అవి శాఖలమ్మా...

సో బ్రాహ్మిన్స్లో మళ్ళీ ఇంకొటేదో...
*********
ఉద్యోగ పర్వంలో: కాస్త లోకజ్ఞానం అలవడి.. కొన్ని సినిమాల ప్రభావంతో,  బంధువుల  కుటుంబంలో జరిగిన ప్రేమ వివాహలా అవగహనతో వాళ్ళేవరో నాకు ముక్కు మొహం తెలియనివారు కుల వివక్షతో మాట్లాడుతున్నప్పుడు.. కించిత్  బాధ.. సినిమాల్లో ప్రత్యేకంగా చులకన చేయబడ్డ కులంగా మరింత మనసు చివుక్కుమనిపించే రోజులవి.
సహొద్యోగి: భలె ఉన్నారు మీరు కమ్మాసా?  కమ్మాస్ ఇంత height  ఉంటారు..
నేను : లేదండి మేము శాకాహారులం (అప్పటికి కొంచం ఫీలింగ్ ప్చ్ !  ఏంటి ఇదో పెద్ద క్వాలిఫికేషన్ లా చెప్పడం అని)
సహొద్యోగి: ఓహ్ మీరు బాపనోళ్ళా (అదే చులకన) అయితే మాతో ఎక్కువ మాట్లడరేమో.. అవును తమిళ్ బ్రాహ్మిన్సా , కన్నడ బ్రాహ్మిన్సా? తెలుగు......
నేను : తెలుగు...
ఇలా బ్రాహ్మిన్స్, మళ్ళీ అందులో శాఖలు, అదికాస్త మళ్ళీ ప్రాంతీయాలు..భాషలు  :-)
*****

ఇవన్నీ చాలవన్నట్లు ఇహ ఇప్పుడు ఈరోజు జరిగిన మా వేటలో ప్రతి ఒక్కరూ అడిగిన ప్రశ్న..
మీరా!!  చిన్నప్పటినుండి చూస్తున్నాను మనవాళ్ళేనా ముఖపరిచయం అంతే.. మిమ్మల్ని చూసి మనవాళ్ళనుకోలేదు.. అవునింతకి మీరు ఆంధ్రా బ్రాహ్మిన్సా.. తెలంగాణ  బ్రాహ్మిన్సా? 

హైదరబాదులో ఉన్నందుకు కొత్తగా ఇంకో ప్రశ్న ఆంధ్రానా? తెలంగాణనా అని?
సమాధానం ఏమి చెప్తాములెండి.. చిన్నగా నవ్వేసి "ఏముందండి నాలో ఆర్భాటం కనిపిస్తే ఆంధ్ర, లేకపోతే తెలంగాణ అనేసుకొండి.. ఏదయినా పర్వాలేదు అని.."  ఇలా వెళ్ళినప్పుడు నా పేరు, నా ఉనికి మర్చిపోవాలేమో.. ప్చ్.. !
********

4.23.2011

డైరీలో ఈరోజు 22/04/2011-2nd part


...... పాప ఉంది కదా.. ఆ అమ్మాయి మొన్న అగస్ట్ రక్షాబంధన్ రోజు ఒక అబ్బాయికి రాఖీ కట్టి, "నేను నీకు రాఖీ కట్టినంత  మాత్రాన నువ్వు నాకు సోదరుడివి కాదు ఫ్రండ్‌వి అని అందిట.. " నా జోక్యం ఉండకూడదు అని అనుకున్నా..  అయినా కాని ఒక relation కి నువ్వు వాల్యూ ఇవ్వడం లేదు అని చెప్పా" నేను చాలా సెన్సిటివ్ నువ్వలా మాట్లాడకు అని రిప్లై వచ్చిందిట.. మా పాప తనకి సంబంధించిన విషయం కాదని కాం అయింది. ఇది పరీక్షల మునుపు జరిగింది.

పరీక్షలు అయ్యాక,...  వీళ్ళ షెటిల్ విషయంలో పొద్దున్నే పాప లేచి వెళ్ళేసరికి ఆ పాప పైన ఉన్న అంకుల్‌తో ఆడుతోందిట. అందుకని "ఒకటి రెండు సార్లు నేను వచ్చినా,  నువ్వు ఆ అంకుల్తోనే ఆడుతున్నావు కదా.. ఇక నన్ను పిలవకు.. అని ముందురోజు అందిట. " ఆ అమ్మాయి ఈ మాత్రానికే నన్ను అంత మాట అంటావా? మా పేరెంట్‌స్ వింటే ఎంత బాధపడ్తారు, నేను చాలా సెన్సిటివ్.. ఎప్పుడు అంకుల్‌తో ఆడతాను అని అంటావా?" (ఎదిగి ఎదగని వయసు , ఆ వయసు చూపే ప్రభావం, తెలిసితెలియని తనం, సినిమాల ప్రభావం.. ఆ పాప చేత మాట్లాడించిన లేత మాటలివి) అని అందిట.. పోని  ఆడుతున్న  ఆ ఇంటి మీద పెంకుల్ అయినా పోనిలే   చిన్నపిల్లలు అని సరదాగా తీసుకున్నాడా అంటే.. హక్కుల గురించి ప్రస్తావించాడుట.. "నీకసలు మేమిద్దరం ఆడుతున్నామనే హక్కే లేదు" (ప్చ్! అర్థం ఉందా అసలు ఈ మాటకి) అని అప్రస్థుత మాటలు.. "నేను మాట్లాడినది నువ్వు క్యాచ్ చేయడంలో ఉంటుంది మీనింగ్.. నీవన్నీ  తప్పుడు ఆలోచనలయితే అలాగే ఇది కూడా తప్పు అవుతుంది.. నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తే కరెక్ట్ అవుతుంది.. మనకొక కోచ్ ఉన్నారనుకో అతను అంకులే కదా అలాగే ఆలోచిస్తావా.. అతను మనకి  నేర్పే గురువులా తీసుకోవాలి కాని"  అని చెప్పేసి వచ్చేసిందిట.

అదండి సంగతి.. నాకు పూర్తిగా చెప్పినతరువాత తెలిసితెలియని వీళ్ళ మాటలకి నాకు బాగా నవ్వు వచ్చింది.. నవ్వితే చిన్నబుచ్చుకుంటుందని నవ్వలేదు కాని, చివరిలో చెప్పిన ముక్తాయింపు భలే నచ్చేసింది నాకు..

"అసలిదంతా కాదమ్మా నేను బురదలో డాన్స్ చేస్తాను కాని నాకు అస్సలు బురద అంటకూడదు అని అనేవాళ్ళకి మనమేమి చెప్తామమ్మా?   "

బాగుంది కదా ఇలా చెప్పడం..
****

4.22.2011

డైరీలో ఈరోజు 22/04/2011-1st part

ఈరోజు పాపకి ఫలితాలు .. "బయాలజీ బాగా రాయలేదమ్మా భయమేస్తోంది.." అని దాదాపుగా రోజు చెప్తోంది. పాపని మరీ బాధపెట్టకూడదని నేనే రోజు "పర్లేదమ్మా! కంగారు పడకు అంతగా అయితే బెటర్మెంట్ రాసుకోవచ్చు." అని ఎప్పటికప్పుడు ధైర్యం చెప్తున్నా. ఫ్రండ్స్ హేళన చేస్తారు అన్న భావం .. మొత్తానికి రిజల్ట్స్ వచ్చాయి మార్క్స్ కూడా బాగానే స్కోర్ చేసింది. అనుకున్నంత తక్కువ రాలేదని తృప్తి పడింది.

******


సరే.. ఈ రిజల్ట్స్ కి పరీక్షలకి మధ్యలో పాపకి నాకు మధ్య జరిగిన ఒక చిన్న సంభాషణ మా పాప ఆలోచించగలుగుతోంది అని తెలిసింది. అదే ఇక్కడ.. ముఖ్యంగా మా పాప వయసు వాళ్ళకి ఉపయోగం.

పరీక్షలు అయిపోయాయని రోజు పొద్దున్నే ఇక్కడ మా పాప పక్కవాళ్ళ పాప కలిసి షెటిల్ ఆడుతూ ఉండేవారు. గత రెండు మూడు రోజులనుండి మా పాప వెళ్ళడంలేదు అని గమనించాను. సర్లే నిన్నటిదాక పరీక్షల హడావిడి ఆ బడలిక నుండి ఉపశమనానికి నిద్రపోతోందిలే అని నేను లేపేదాన్ని కాదు.

కాని ఈరోజు పొద్దున్న పక్కవాళ్ళ పాప తాలుకూ ఇంకో పాప వచ్చి, "ఆంటీ మౌని ని లేపండి షెటిల్ ఆడాలి" అని చెప్పింది. నేను యధాలాపంగా లేపుదామని వెళ్ళెంతలో పాపే లేచి "నాకు హేల్త్ బాలేదు రాలేను అని చెప్పేయ్" అని చెప్పేసి డోర్ వేశేసింది. ఆ చెప్పడం మాములుగా చెప్పి ఉంటే నిజంగా ఆరోగ్యం బాలేదేమో అని "ఎమయింది" అని అడిగేదాన్ని కాని సీరియస్‌గా అంటే ఇంక మీరు నన్ను అడగకపోతే మంచిది అనేంతగా చెప్పింది. సర్లే పొద్దున్నే దాన్నేమి అడుగుతామని.. నేను సైలెంట్గా నా పని చేసుకున్నా..

టిఫిన్ చేసేప్పుడు నెమ్మదిగా కదిపాను పాపని, ఏమయింది అంత సీరియస్? వాళ్ళతో మాట్లాడడం లేదా అని.. అబ్బా వదిలేయ్ అమ్మా.. ఎవరి జీవిత శైలి (life style) వాళ్ళది. నేను వాళ్ళలా ఆలోచించలేను వాళ్ళు నాలా ఆలోచించరు.. " నేను మంచే చెప్పాను కాని అది వాళ్ళు వేరేలా అర్థం చేసుకున్నారు...  నా తప్పు కానప్పుడు నేనెందుకు డవున్ అవ్వాలి.. హాయిగా నా మానాన నేను ఉండొచ్చు కదా!" అని అంది.

ఎదో కొంచం ఆలోచింపజేసే  విషయమే అందుకనే మరికొంత ఆసక్తిగా "ఏమి జరిగింది" అని అడిగాను..

అదే అసలు మన పక్కింటమ్మాయి ఉంది కదా.. కొంచం దగ్గరగా రా .. నేను నెమ్మదిగా చెప్తాను అంటూ..

సశేషం ....(రేపు రాస్తాను నిద్ర వస్తోంది) :-)

******

4.21.2011

డైరీలో ఈరోజు... 21/04/2011

పిల్లలికి పరీక్షలు అయ్యాయి.. కాస్త ఇప్పటికి నేను తెరిపిన పడ్డాను. మార్చ్ 7 నుండి ఈ పరీక్షల సందడే.. పాపకి అయ్యాయి..  హమ్మయ్య అనుకోగానే బాబుకి, నేను వాళ్ళకి దగ్గర ఉండి చెప్పేదంటూ ఉండదు వాళ్ళంత వాళ్ళే చదువుకుంటారు. కాని, పక్కన నేను ఉండాలి. :-)


వాళ్ళు అలా పరీక్షలకి వెళ్ళగానే అప్పుడప్పుడొక బ్లాగు అలా చూస్తూ ఉంటాను. ఈమధ్య చాలా కొత్త బ్లాగులు వచ్చాయి.. కొన్ని కొన్ని చదువుతుంటే కూడా ఎంతో ఆహ్లాదంగా అనిపించాయి.. అలాంటి బ్లాగులు చదువుతున్నప్పుడు.. అనిపిస్తుంది , బ్లాగుల వారధికి నేనేమాత్రం ఉడత సహాయమన్నా చేయలేను అని.   అలా అనుకునేంత బాగుంటున్నాయి పదాల పొందికయినా వాక్య నిర్మాణమయినా దేనికదే సాటి. 

లిప్తపాటు న్యూనతా భావం కూడా కలుగుతుంది.. మనం రాయలేము కదా అంత బాగా అని. అయినా సరే రాయాలి అనే తపన చాలు , అక్షరాలు , పదాలు వాక్యాలు వాటంతట అవే వస్తాయి అన్న నమ్మకంతో ఇదిగో మళ్ళీ ఈరోజు నుండి రాద్దామని.. 

భావాలన్ని పొదిగి సుమమాలలో పొందు పరచాలని మళ్ళీ మొదలు పెడ్తున్నా.. :-) 




*****

4.14.2011

శైలిని బట్టి ఫొటో ఉంటుందా? ఫోటోని బట్టి శైలి ఉంటుందా??

ఒక్కోసారి చికాకుగా ఉంటుంది. బోర్ కొడుతుంది.. ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాము. ఏమి తోచదు, ఎవరు ఉండరు ఇంట్లో.. ఉంటేమటుకు ప్రశాంతంగా ఉంటామేంటి ఇలా చికాకు తలకెక్కినప్పుడు.. అక్కడికి ఎందుకలా చికాకు పడ్తావు.. కయ్.. కయ్ అని అరుస్తావు పిల్లలు, శ్రీవారు కూడా అంటునే ఉన్నారు.. ఏమిటో పొద్దుటునుండి ఇలాగే ఉంది.. ఎక్కడికన్నా వెళ్దామా అంటే ఈ ఎండల్లో ఏమి వెళ్తాము వద్దనేశారు.. ఎప్పుడో అడక్క అడక్క అడుగుతాము.. వద్దంటే మండిపోతుంది. అదే జరుగుతోంది నాకు,

ఇలా కాదని ఇదిగో ఇక్కడ ఒకసారి అలా బ్లాగులవైపు తొంగి చూశానా.. ఆన్లైన్ స్నేహితురాలొకరు.. "చూశార అక్కడ మీ ఫేస్ బుక్ లింకెవరో ఇచ్చారు " అంటూ మెసేజ్, ఎక్కడబ్బా.. నా ఫేస్ బుక్ ఏమి అన్యాయం చేసింది?  వ్యవహారం లింక్  పెట్టేదాకా వెళ్ళింది అని చూస్తే.... ప్చ్..


ఆ పోస్ట్‌కి, నా శైలికి లింకేంటో.. ఉందిపో.. నా శైలికి, నా ఫేస్ బుక్ ఫొటోకి సంబంధమేమిటో.. శైలిని బట్టి ఫొటో ఉంటుందా? ఫోటోని బట్టి   శైలి ఉంటుందా??  ఇలాంటి ప్రశ్నలు మదిలో ఉదయించి చికాకుని మరికాస్త పెంచేస్తున్నాయి.







దేవుడా!!  నాకాస్త ఇలాంటివి కొంచం అర్థం చేసుకునే బుద్ధిని ప్రసాదించు అని దేవుడిని దండం పెట్టుకోడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి నాది. :(

(అవునూ ..మనలో మన మాట నా ఫేస్ బుక్ లో ఫొటో అందరికీ కనిపిస్తోందా? నా లెక్క ప్రకారం కనపడకూడదు మరి.. తెలిసినవారేవరయినా కొంచం తెలియజేస్తారా ...కనిపిస్తుందా లేదా అన్నది)

Loading...