4.29.2011

అందం చూడవయా... ఆనందించవయా..

నిన్నటి పోస్ట్లో అందం గురించి మాట్లాడాను కదా ఆ నేపధ్యం ఈ అందానికి సంబందించి నాలుగు మాటలు:

అందం.. చిన్నప్పటినుండి వింటున్నమాట.. ఒక్కోసారి అందం అన్న పదం అంటేనే కోపం వచ్చేస్తుంది. ఒక్కోసారి ఆస్వాదించగలిగినప్పుడు ఇష్టంగా ఉంటుంది. నా దృష్టిలో అందం  అంటే మనం ఆస్వాదించగలగాలి, ఆనందించగలగాలి. పోల్చుకోడం వచ్చిందంటే కృంగిపోవడం ఖాయం.. మా అమ్మ నలుగురు అక్కచెల్లెళ్ళ అందం అయితే ఏంటి, మాట తీరు అయితే ఏంటి ఎవరికి వారే సాటి. నలుగురూ బాగుంటారు పాత సినిమా హీరోయిన్లలాగా నిండుగా.. ఇలా.
 ఒక్క మా మూడో పిన్నికి తప్ప మిగతా ముగ్గురికి చిన్నప్పుడే అంటే బాల్య వివాహాలే. ఈ ముగ్గురక్కచెల్లెళ్ళ పిల్లలకి ఒకటి లేద రెండు సంవత్సరాల  తేడా ఉంటుంది. ఈ అక్కచెల్లెళ్ళ మధ్య ఎవరు ఎవరికన్నా అందంగా ఉంటారు అనే ప్రశ్న తలెత్తిందో లేదో కాని మా రెండో పిన్ని కూతురునుండి మేము ఎదుర్కున్నాము .. మా అమ్మే అందరికన్నా "అందంగా" ఉంటుంది అంటూ.. ఎమో అప్పుడెలా స్పందిచానో గుర్తులేదు.. వాదించానేమో కూడా నలుగురూ నలుగురే అని..

ఈ అమ్మాయి తరువాత మా అన్నయ్య నుండి ఎదుర్కున్నామీ సమస్య  వాడు తిన్నగా ఉండక "మా అమ్మే బాగుంటుంది " అని చెప్పిన పిన్ని కూతురినే మా మిస్ కుటుంబం గా చేసేసాడు.. అప్పటినుండి అది ప్రపంచంలోనే తనంత అందం ఎవరికీ లేదనే తరహాలో ఉండేది. మా ఇద్దరి మధ్య కేవలం 6 నెలలే తేడా ఉండడంతోనూ.. అలా డిక్లేర్ చేసింది స్వయానా మా అన్నయ్య అవడంతోను నాకు సహజంగా ఉండే అసూయ మరిన్ని పాళ్ళు హెచ్చి,  అసలు ఈ "అందం" అనే పదం కనిపెట్టినవాళ్ళని కాల్చేయాలి అన్నంత కసి కలిగేది అప్పట్లో. 

అక్కడితో ముగిసిపోకుండా ఈ అందచందాల పోటీలు మా అక్క చెల్లెళ్ళ మధ్య జరిగేది.. ప్రత్యక్షంగా తక్కువే చెప్పాలంటే.. కాని పరోక్షంగా నీకన్నా మీ అక్కే బాగుంటుంది, లేదా మీ ఇద్దరిలోను మీ అక్క బాగుంటుంది .. ఈ తరహా మెచ్చుకోళ్ళూ.. అయితే మా అక్క చెల్లెళ్ళ పోల్చుకోడాలు వచ్చేసరికి నాలో కాస్త జ్ఞానం వచ్చింది అని చెప్పొచ్చు అందం అంటే కేవలం మన బాహ్య సౌందర్యం మాత్రమే కాదు అన్న చిన్న ఊహ.. కాబట్టి పెద్దగా ఆలోచించేదాన్ని కాదు కాని,  ఒక్కోసారి మటుకు (చాలా సార్లు) అయినవాళ్ళే అంటే అక్క తరపు  వాళ్ళు అంటున్నప్పుడు కొంచం చివుక్కుమనేది.. ఇదో తరహా ఆనందం అంతే అనుకునేదాన్ని..  "బాలేదు"  అని చెప్పినంత మాత్రానా నేనేమి చేయగలను అని ప్రశ్నించుకునే దానిని చాలా సార్లు...అలా అన్న సంధర్భాలు కూడా ఉన్నాయి. దేవుడిచ్చిన రూపం కదా ఇది ఇంకేమి చేయలేను అని.  
******

మొన్నామధ్య ఎదో ఎవరు పొడుగు?  ఎవరు పొట్టి?  అనే విషయంలో చిన్న చర్చ జరిగినప్పుడు.. అమ్మ వాళ్ళ తరంలో ఆడవాళ్ళల్లో మా మొదటి పిన్ని, ఆతరువాత తరం అంటే మా తరంలో ఆడవాళ్ళల్లో నేను, ఇదిగో ఇప్పుడు అక్క పిల్లలు మా పిల్లలు.. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అక్క వాళ్ళ బాబు "నువ్వెన్నన్నా చెప్పు పిన్ని నీకన్నా అమ్మే బాగుంటుంది.. అన్నాడు." (పొడుగు విషయంలో నేను నాకన్నా మా/వాళ్ళ పిల్లలు పొడుగు అనే విషయాన్ని అంగీకరించను అనే ఒక వివాదం ఉంది మా మధ్య...  నిజమే మా తరంలో లేడీస్ లో నేను పొడుగు ... ఇప్పుడు వాళ్ళు పొడుగే కాదన్నదెవరు అన్నది నా వాదన) అందుకని అలా అనడం.. మా అమ్మే అని.. కరక్టే  అక్క బాగుంటుంది అలా అని ఇప్పుడు నా మొహం చెక్కేసుకోలేను కదా అని అంటే సమాధానం చెప్తే నేను సీరియస్ గా తీసుకున్నానంటారు..ఈ మధ్య బ్లాగులో కూడా ఈ తరహా పోస్ట్ ఒకటి చదివాను.. బ్లాగర్ని ఎవర్నో మీరేమంత అందంగా ఉండరు మిమ్మల్ని మీ వాళ్ళు భరించడం కష్టం అని..  కేవలం అందం లేకపోతేనే భరించడం, భరించలేకపోవడం లాంటివి వచ్చేస్తాయా? అలా ఎలా రాస్తారు అనిపించింది అప్పుడు.... మనసుతో పోల్చగలిగితే పోల్చాలి లేకపోతే వదిలేయాలి అన్నది నా ఆలోచన.  నిజానికి కళ్ళు చెదిరేంత అందం ఎదురుగా ఉన్నప్పుడు  అసూయని దరి చేరనివ్వకుండా ముందుగా ఇంకెవ్వరితోనో  పోల్చకుండా ఆనందించి ఆస్వాదించగలగాలి..
*****
ఈ అంతరాలు ఎప్పటికి సమసిపోతాయో అనిపిస్తుంది ఒక్కోసారి.. కొన్నాళ్ళు ఎవరి వత్తిడులలో, ఎవరి పనులలో వాళ్ళు ఉండి కలుసుకోలేని పరిస్థితులలో  ఉన్నప్పుడు బంధువులు మన గురించి ఏర్పర్చుకునే అభిప్రాయాలు ఒక్కోసారి మనసుని కలచివేస్తాయి..  దీని గురించి తరువాత పోస్ట్లో .. 
*****

5 comments:

 1. నమస్కారమండీ !
  టపా కి సందర్భం లేని వ్యాఖ్య వ్రాస్తున్నందుకు మన్నించాలి
  తెలుగు బ్లాగులన్నిటినీ ఒక చూపించే ప్రయత్నం లో " సంకలిని " అనే తెలుగు బ్లాగుల అగ్రిగేటర్ ని తయారు చేసాను
  ఇప్పుడున్న ఏ తెలుగు బ్లాగుల సంకలినికి లేనటువంటి వేగం సంకలిని సొంతం
  ముందుమాట
  అనే పేజి లో సంకలిని యొక్క ప్రత్యేకతలు వివరించబడ్డాయి
  మీ వీలుని బట్టి ఒకసారి సంకలిని చూసి మీ యొక్క అమూల్యమైన సూచనలు సలహాలు చేయమని ఈ కామెంట్ ద్వారా మనవి చేసుకుంటున్నాను
  -మీ బ్లాగ్ మిత్రుడు అప్పారావు శాస్త్రి

  ReplyDelete
 2. ఫోటోలో ఒకరు చాలా బావున్నారు. ఇద్దరు బావున్నారు. ఒకరు బాగోలేరు.

  ReplyDelete
 3. బహుశా మీ అమ్మగారు కుడి నుండి రెండవ వారు అయ్యుంటారు :)

  ReplyDelete
 4. శరత్ గారు: ఇప్పుడు చూడండి.. ఫొటో వరసక్రమంలో మొదట మా అమ్మ మిగతా ముగ్గురు ఆవిడ చెల్లెళ్ళు.

  :) ఎవరు బాగున్నా ఎవరు బాగోపోయినా నలుగురూ పిల్లల పెళ్ళిళ్ళు చేసి, హ్యాపీగా ఏ కూతురు అత్తారింట్లో కష్టపడుతోందో, ఏ కోడలు వాళ్ళు చెప్పిన మాట వినట్లేదో, మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందేమో అన్నంతగా హైరానా పడుతూ చర్చించుకుంటారు.. మేమేదన్నా అడ్డేస్తే "మీకేమి తెలీదు మీరూరుకొండే.. ఇంకా చిన్న పిల్లలు" అంటూ.. మా పిల్లలు మమ్మల్ని వింతగా చూసేలా :-).. కాని నలుగురూ కలిస్తే మటుకు సందడే.

  ReplyDelete
 5. $రమణి గారు
  బాగున్నాయి అందం ముచ్చట్లు. నాకైతే నలుగురిలో మీ అమ్మగారే బాగున్నారు. చక్కటి రూపం. చివరి ఆమె కూడా :)

  పన్లోపనిగా మీ అక్కచెల్లెళ్ళ చిత్రం కూడా పెట్టాల్సింది, అది మరో టపా అంటారా? :)

  ReplyDelete

Loading...