1.03.2010

03/01/2010

ఆదివారం హాయిగా పెసరట్టుప్మా చేసి పిల్లలతో పాటు తింటూ ఉంటే ఎవరో పెద్దాయన వచ్చారు ఇంటిముందుకి "జాతకం చెప్తాను" అని ... జరగాల్సింది ఎలాగు జరుగుతుంది, తెలుసుకోడంవల్ల ఉపయోగం లేదని నా అభిప్రాయం. అందుకే వద్దని చెప్పాను. ఆ వచ్చినతను తనలో తను ఏదో గొణుక్కుని వెళ్ళాడు వద్దన్నానని అసహనమేమో అనుకున్నాను కాని, మళ్ళీ ఎందుకో నన్ను చూడగానే అతనికేమన్నా అనిపించిందా , భవిష్యత్తులో జరగబోయేది ఏదన్నా ముఖ్యమైన విషయం చెప్పేవాడా ఒకవేళ నేను ఒప్పుకుని ఉంటే, అంటే అసలీ జాతకాలు నిజమేనా.. ఇలా ఆలోచించుకుంటూ ఉంటే నాకు గుర్తొచ్చింది ఒక ఆరేడు సంవత్సారాలముందు పరిచయమయిన వ్యక్తి.. మనిషి తెల్లగా , ఉంగరాల జుత్తు, నుదిటినిండా వీభూతి రేఖలు, తెల తెల వారుతుండగా పెద్ద పెద్ద అంగలతో గుడికి వెళ్ళిరావడం, అన్నిటికన్నా ముందు ఎదురుగుండా తెలిసినవాళ్ళు వెళ్తున్నా కనీసం పలకరింపు లేకుండా అలా తలవంచేసుకుని వెళ్ళడం.. అప్పట్లో ఈనాడులో అనుకుంట ఉద్యోగం... ఇప్పుడెక్కడున్నారో ఎలా ఉన్నారో.. భలే విచిత్రమైన వ్యక్తి ....

మా ఇంటి పక్కనే అద్దెకుండేవారు. వాళ్ళు ఆయన పేరేదో ఉంది వెంకటేశ్వర రావ్ అనుకుంట.. ఆడవాళ్ళంటే ఆమడదూరముంటారు ... మాకేమో తప్పదు ఇరుగు పొరుగు చూసుకుంటాము కారణం లేకపోలేదు. ఇద్దరం ఉద్యోగాలు కాబట్టి ఇంటి తాళాలు, మంచినీళ్ళు, గ్యాస్ సిలెండర్ ఇలాంటి అవసరాలకి వచ్చినవాళ్ళకి మా ఇంటి తాళం వెక్కిరిస్తూ ఉంటుంది కాబట్టి , పక్కింటి ఆసరా అత్యవసరం మాకు.(ఇప్పటికీ :-) ) అందుకే వాళ్ళు పలకరించకపోయినా పనిగట్టుకుని పలకరిస్తాను. ("వంటయిందా వదినా" అని కాదు :-) ) ఏదో విధంగా పలకరించాల్సిన అవసరం వస్తూ ఉంటుంది కాబట్టి .. మొదట నా పరిచయం చేసుకుని వారిని కుశల ప్రశ్నలు అడిగే మనస్తత్వం నాది. అలాంటి క్రమంలోనే నా పరిచయం చేసుకుంటేనే.... తనకి పట్టనట్లు తనని కాదన్నట్లు లోపలికి వెళ్ళిపోయాడీ పెద్ద మనిషి. ఇలా కాదని మళ్ళీ తలుపు తట్టి, "సారీ అండీ మేడం లేరా? ఆఫీసుకి వెళ్తున్నాను.. మా పిల్లలు 3 గంటలకు వస్తారు కొంచం తాళాలు .. అని అంటుంటే "ఆవిడ ఆఫీసుకి వెళ్ళారండీ " అని మొహం మీదే తలుపు భడాల్న వేసేసారు... నాకొచ్చింది చూడండి కోపం మరీ మంచీ.. మర్యాద లేదా మొహం మీదే అంత విస్సాటమా అని కూడా అనుకున్నాను. తరువాత తెలిసింది.. ఆయన అక్కడ ఈనాడులోనే చేస్తూ... ఇంటిదగ్గర జాతకాలు చెప్తూ ఉంటారని.. సదా ధ్యానంలో ఉంటారని, ధ్యానంలో ఉన్నప్పుడు నాలా ఎవరన్నా పలకరిస్తే ఆయనకి కోపం అని, అది అణుచుకోలేక అలా తలుపు వేసేయడంలోనూ.. తలొంచుకు చూడకుండా వెళ్ళిపోడం ద్వారాను కోపాన్ని ప్రదర్శిస్తారని.. నవ్వొచ్చింది అవి వింటుంటే.. ఎంత జాతకాలు చెప్పినా ఎంత దైవ భక్తి ఉన్నా మరీ సాటి మనుషులంటే పడకపోడం.. అప్పుడప్పుడు ఇలాంటి విచిత్ర వ్యక్తులు కూడా తారసపడ్తూ ఉంటారు అని అనిపించింది. ఆ తరువాత నాకు జాతకం చెప్తాను అని కొన్నాళ్ళు మా ఇంటికి తరచూ వచ్చేవారు కాని, జాతకాలంటే నాకు పెద్దగా ఆసక్తి లేకపోడంవల్ల వద్దని తప్పించుకునేదానిని. మరి అందుకే మా ఇంటికి రావడం కూడా తగ్గించారు..ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఎవరో జాతకం అనేసరికి అలా స్మృతి పదంలోకి ఆ జాతకాల వ్యక్తి మెదిలారు. ...
*****

" పుస్తకం మంచి స్నేహితుడు లాంటిది.అది చెప్పేది వినగలిగితే అంతకన్నా మంచి స్నేహితుడు తెలివైన వారు ఇంకొకరు ఉండరు. "


****

No comments:

Post a Comment

Loading...