1.13.2010

13/01/2010

చిన్నప్పుడు అంటే మా తమ్ముడు 9వ తరగతి చదువుతున్నాడనుకుంట, అప్పటికి వాడిపై స్నేహితుల ప్రభావం ఎక్కువుందని చెప్పొచ్చు. అన్నయ్యేమో ఢిల్లీలో చదుకోడానికని వెళ్ళాడు. తమ్ముడికి స్నేహితుల ప్రభావం వల్ల , అమ్మ కుట్టించే బట్టలు ఇష్టం ఉండవు అలాగే ఏమి కొన్నా అడ్డుపెట్టేవాడు, నాకొద్దు నాకు నచ్చలేదు అని.. అలా ఓసారి ఏదో పండగకి వాడు కొత్త బూట్లు కొనుక్కొచ్చుకున్నాడు, అమ్మ కొనిచ్చినవేవో నచ్చలేదని, అప్పట్లో వాటి ఖరీదు 900 పై మాటే. 900 అంటే 1980 లో మామూలు మాటలు కాదు మా బడ్జెట్ ప్రకారం. అమ్మకి 300 .. 400 ఫింఛను వచ్చేది. అక్క సెలవలని ఏదో టీచర్ ఉద్యోగం, నేను స్కూల్.. ఇలాంటి పరిస్థితుల్లో వాడు అంత ఖరీదు పెట్టి ఆ బూట్లు కొనుక్కోడం ఇద్దరికి (అక్కకీ, నాకు) కోపం వచ్చేసింది. మర్నాడు తమ్ముడు ఇంట్లో లేని టైం చూసి, ఆ బూట్లు బాలేదనో మరి సరిపోలేదనో ఆ షాప్ వాడికి ఇచ్చేసి డబ్బులు తెచ్చేశాము (అంతకు ముందే మాములుగా అడుగుతున్నట్లు ఎక్కడకొన్నాడో తెలుసుకున్నాము కాబట్టి... తెలిసిన షాప్ అతనే అవడం కాస్త సులవయ్యింది) వాడు ఇంటికి వచ్చాక , మా ఇద్దరిమీద విరుచుకు పడ్డాడు, ఏడ్చేశాడు, అయినా కరగలేదు డబ్బులు ఇవ్వలేదు. ఇప్పటికి తమ్ముడా విషయం గుర్తుపెట్టుకుంటాడు, మా బాబు తో కూడా "మీ అమ్మావాళ్ళు ఇలా చేశార్రా.. మీరు మటుకు నాలా ఊరుకోవద్దు అని ఉపదేశాలు కూడా చేస్తూ ఉంటాడు :-) " . ఇప్పటికి వాడే బూట్లు కొనుక్కున్నా "ఎలా ఉన్నాయక్కా " అని అడుగుతాడు కాని అవి ఎంతో చెప్పడు, భయం అని కాదు (ఇప్పుడు చెప్పినా మేమేమి చెయ్యలేము కూడా వాడి సంపాదన :-) ) కాని ఎందుకు అనవసరంగా అని ఒకసారి ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళొచ్చేస్తాడు "అప్పుడు..అలా .. మీరు.... అంటూ" సరదాగా నవ్వేసుకుంటాము. ఇదంతా ఈరోజు ఎందుకు గుర్తొచ్చిందంటే.. అక్క , అక్క బాబు వచ్చారు ఈరోజు అరిసెల ప్రహసనం చెప్పానుగా. "బూట్లు ఇంట్లో వదులుతా పిన్నీ.. బయట వద్దు వర్షం వస్తోంది పాడయిపోతాయి " అని "సరే" అని సాధారణంగా అన్నాను కాని, "జాగ్రత్తే బాబు అవి ఇంతా ఖరీదువి" అని అక్క అనేసరికి నిజం చెప్పొద్దు నా గుండె ఆగినంత పనయింది .. అక్కా నేను ఒకేసారి తమ్ముడు బూట్లు ఇచ్చేయడం గుర్తు చేసుకున్నాము. "అప్పుడంటే అలా తిరిగి తీసుకున్నారు కాని ఇప్పుడు తీసుకోరే బాబు.. వీడేమో కొనేశాడు " అని అక్క. మా ఒక నెల ఇంటి అద్దె.. ఎందుకో అనిపించింది ఎంత ఖరీదయినా వాటిని కాలి కిందే తప్పితే మంచం మీద పెట్టలేము కదా... మా తమ్ముడు అంతకన్నా ఎక్కువే పెడ్తాడు, ఇక రేపు మా బాబు కూడా, అంత ఖర్చు చెప్పులకి అంటే నా పాతకాలపు ఛాదస్తపు మనసు ఉస్సూరుమంటోంది. (బంగారమయితే అలా పడి ఉంటుంది) ఒక 6 నెలల తరువాతో, ఇంకో సంవత్సరం తరువాతో మార్చేసే వీటికి ఇంత ఖరీదాఆఆఅ ఎమో... జిహ్వకో రుచి, పుఱ్ఱె కో బుద్ది.

భోగి పిండివంటలతో ఈరోజంతా గడిచిపోయింది. అరిసెలు, బొబ్బట్లు , కొంచం జంతికలు మా పిండివంటలు ఈసారి.
అందరికీ భోగి శుభాకాంక్షలతో..
*****

జీవితంలో పోలిక తెలియనంత వరకూ పర్వాలేదు.ఒకసారి పోలిక తెల్సిన తర్వాత లభ్యమయిన దానికన్నా అలభ్యమయినదే బాగుంటుంది. అందీ అందకపోడంలో ఉన్న అందమే ఆకర్షణై బలమయిన తపనగా మారుతుంది. కదా...
1 comment:

  1. చిన్నతనం లో తెలిసీ తెలియని పనులవి. పెద్దయ్యాకా అందరూ బాధ్యతగానే ఉంటారుగా. ఇల్లాంటి సంఘటనలే జీవితం విలువలు తెలియ జేస్తూ ఉంటాయ్. నిజమే బూట్ల కోసం అంత ఖర్చంటే బాధగానే అనిపిస్తుంది. పరిస్తితుల ప్రభావం ఎలా ఉంటుందో బాగా చెప్పారు.

    ReplyDelete

Loading...