1.04.2010

04/01/2010

మళ్ళీ రొటీన్ ఆఫీసు, పిల్లల స్కూల్ హడావిడి. పొద్దున్నే టిఫిన్ చేస్తే పాప "ఈ టిఫిన్ మటుకు చెయకమ్మా ఇంక" అంటుంది. "ఏరా ఎందుకు " అంటే "అమ్మమ్మకి అసలు ఇష్టం ఉండదు, నేనున్నానుకుందా లేదా మీ అమ్మ! అని అడుగుతోంది వద్దంటే మానేయొచ్చు కదా.." అని, "ఎందుకు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఏమి పర్వాలేదు చెయ్యి " మావారి హుకుం..

ఇంతకీ టిఫినేమి చేశానో చెప్పలేదు కదా.. గారెలు,అల్లం పచ్చడి.... చేయకూడదంటారు కాని ఏమి చేస్తాము జిహ్వచాపల్యం..... చేసుకోవాలనిపిస్తుంది. :-)

ఆఫీసులో అంతా మాములే.. నా పని నేను చేసుకుని ఇంటిదారి పట్టాను. ఆఫీసు , ఇంటికి దగ్గర్లోనే అని ఈ మధ్య బస్‌ప్రయాణం మార్చి ఆటోల్లో వెళ్తున్నాను. 5 నిముషాలలో ఇంటికి వెళ్ళేట్టుగా...ఈరోజు ఇంట్లో ఏమి హడావిడి లేదు.. "మీ మరదలు లేదు నేను ఒక్కదాన్నే ఉన్నాను పిల్లలు ఇక్కడుంటారులే" అని అమ్మ అంటే .... "సరే " అని ఒప్పేసుకున్నాను. అందుకని కాస్త నింపాదిగా వెళ్ళొచ్చని బస్ ఎక్కాను. ఇహ మొదలు హైదరాబాదు సంగతి చెప్పేదేముంది? ట్రాఫిక్.. పావుగంటలో ఇంటికెళ్ళాల్సినదానిని 45 నిముషాలు పట్టింది. ఇంటికెళ్ళేసరికి శ్రీవారు కాఫీతో కుస్తీ పడ్తున్నారు... వెళ్ళగానే వేడి వేడిగా నాకూ అందిస్తూ.... చాలా రోజుల తరువాత ఇద్దరం.. కబుర్లు చెప్పుకుంటూ కలిసి వంట చేసుకున్నాము. అన్నిటికన్నా ఆనందమయిన విషయం అలా ఘంటసాలగారి పాత పాటలన్నీ వింటూ రాత్రి ఒంటిగంటదాకా తన్మయత్వం చెందడం. ఎంత చక్కటి అనుభూతి.. మా ఇద్దరి అభిరుచులు సాధారణంగా కలవవు కాని పాత పాటల విషయంలో మటుకు కలుస్తుంది. ఇద్దరం ఆ భావాల గురించి, అందులోని తీయదనం గురించి చెప్పుకుంటూ ఆ పాటల మాలికలని ఆస్వాదించాము.

ఈ పాటలన్నీ కూర్చి పేర్చి బహుమతి గా ఇచ్చిన శ్రీ నల్లమోతు శ్రీధర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. "సఖి" షూటింగ్‌లో పరిచయమయినప్పుడు.. "రేడియో ఇంటర్వ్యూలలో అన్నీ పాత పాటలే ఎంచుకుంటారు బాగుంటుందండి " అంటే "నాదగ్గిర పాతపాటల కలెక్షను ఉంది" అని అన్నారు శ్రీధర్ గారు. నాకు కాపీ చేసి ఇవ్వమని అడిగిందే తడవు వాటినన్నింటిని కూర్చి .. నిన్న ఆ పాటలు వినే అవకాశాన్ని ఇచ్చి మా ఇరువురికి ఒక మంచి అనుభూతిని మిగిల్చారు.
*****

జీవితమంటే గొప్ప త్యాగాలు,బాధ్యతలూ కాదు.చిన్న చిన్న ఆనందాలూ,కాస్త దయా,నిరంతర చిరునవ్వూ - అదీ జీవితం.......నిజమే కదా!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

Loading...